– వల్లూరు జయప్రకాష్ నారాయణ
జగన్ దయామయుడి అవతారం ఎత్తారు. ‘దయామయుడు… కరుణామయుడు’ ఈ పేర్లను ఎక్కువగా క్రైస్తవులే వల్లిస్తారు. ఈ అర్థ్ధం వచ్చేలా జగన్ శివరాత్రినాడు చేసిన పోస్టుతో ఆయన తనను తాను దయా మయుడిగా భావిస్తున్నట్లున్నారు. మరోమాటలో చెప్పాలంటే ఆయన ఏసుక్రీస్తు అనుకుంటున్నారా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. వాస్తవంగా ఈ రాష్ట్రంలోని కొందరు అతివాద క్రైస్తవులు జగన్‌ను ఏసుక్రీస్తుగానే భావిస్తున్నట్లు చర్చిల్లోను, బయట మాట్లాడుతున్నారు. అందుకే వైసీపీ అధికారంలోకి రాగానే ఏసుక్రీస్తు రాజ్యం వచ్చినట్లు సంబరాలు చేసుకోవడం అందరికీ గుర్తున్న విషయమే. వంది మాగధులు నాలుగేళ్లుగా చేస్తున్న భజనతో తనే మరలా తిరిగొచ్చిన ఏసుగా భావిస్తున్న ట్లున్నారు జగన్. అందుకే హిందువుల మనో భావాల్ని దెబ్బతీసేంత తీవ్రమైన చిత్రాన్ని చిత్రీకరించి పోస్టు చేశారు. ఈ పోస్టు క్రైస్తవులకు ఆనందం కలిగించవచ్చేమో గాని హిందువులకు మాత్రం తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఎందుకంటే ఈ చిత్రం హిందువులను కించపరిచేలా ఉంది. ఈ చిత్రాన్ని రెండు రకాలుగా అర్థ్ధం చేసుకోవచ్చు. శిథిలావస్థకు చేరిన దేవాలయం మెట్లు, అక్కడ నిలువు నామాలు ధరించి నేలపై వున్న ఒక ఆవు, పక్కనే నుదుటన విభూతి, చేతిలో ఢమరుకం ధరించి ఆకలితో అలమటించిపోయేలా నేలపై పడిన బాలశివుడి నోట్లో పాలుపోస్తున్న జగన్. చిత్రంలో ఉన్నది బాలశివుడా? లేక బాలహిందువా? అనేది అర్థం కావడం లేదు. ఏదైనా పాలుపోసేది మాత్రం జగనే. శివరాత్రి రోజు అందరూ శివుడిని పాలతో అభిషేకించి నేలపాలు చేస్తుంటే, తాను మాత్రం పేదపిల్లల నోట్లో పాలు పోస్తున్నట్లు జగన్ ఫోజు కొడుతున్న చిత్రం అది.
ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి తమను, తమ ధర్మాన్ని అవమానించడంలో బరితెగించారని హిందువులు ఆరోపిస్తున్నారు. హిందువులు శివుడిని లింగరూపంలో కొలుస్తారు. వారికి పరమ పవిత్ర పండుగ మహాశివరాత్రి. ఆ పర్వదినాన ఆలయాలను సందర్శించి శివలింగాలకు ఆవుపాలతో అభిషేకం చేస్తారు. కాని ముఖ్యమంత్రి జగన్ అభిషేకాన్ని అవమానించారు. హిందువులు తమ పిల్లలకు ఆహారం లేకపోయినా, పాలు మాత్రం శివలింగానికి అభిషేకం చేస్తున్నారని, తాను మాత్రం తిండిలేక అల్లాడిపోతున్న హిందూ బాలల నోట్లో పాలుపోస్లున్నట్లు ఫోజులు పెట్టేలా గ్రాఫిక్స్ చిత్రీకరించుకున్నారు. ఇందులోనూ ఒక ప్రత్యేకత ఉంది. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన తమపై వైసీపీ నాయకులు, గుండాలు తిట్టేటప్పుడు, కొట్టేటప్పుడు తాము పెడుతోన్న ఆర్తనాదాలు వింటూ, తమ వైపు క్రూరంగా చూస్తూ ఎగతాళిగా నవ్వే నవ్వు కూడా అని బాధితులు ఆరోపిస్తున్నారు. తినడానికి తిండిలేని నిరుపేదలు హిందువులుగా, తాను వారిని ఆదుకునే దేవుడుగా జగన్ తనను తాను అభివర్ణించుకున్నట్లు హిందువులు, హిందూ సంస్థలు విమర్శిస్తున్నాయి. బీజేపీ అయితే శివరాత్రి వెళ్లిన మరునాడు ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల ముందు నిరసన కార్యక్రమం చేసింది.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి డబ్బులొస్తాయని, అనారోగ్యంతో బాధపడేవారికి రోగాలు బాగవుతాయంటూ ఫాస్టర్లు ఆసుపత్రుల వద్ద చెబుతూ మతాలు మార్పిస్తారు. జగన్ కూడా తనను తాను అలాగే ఊహించుకున్నట్లున్నారు. తిండిలేక పడిపోతున్న హిందువులకు తానే ఆహారం అందిస్తున్నట్లు చిత్రీకరించుకుని ‘నేనే దేవుడ్ని’ అనుకుంటున్నారు. పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చగానే కనబడుతుందనే సామెతలా వైసీపీని, ముఖ్యమంత్రిని సమర్ధ్ధించే వారు, క్రిస్టియన్లు, ముస్లింలు అభిషేకాలను తప్పుపడుతున్నారు. అదే జగన్‌కు కావాలని, హిందూమత ఆచారాలను దెబ్బతీయడమే ఆయన లక్ష్యం అని హిందూ మత ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి.
బ్రిటిష్ పాలనను తలపిస్తూ…
వైసీపీ ప్రభుత్వ తీరు బ్రిటిష్ ప్రభుత్వాన్ని తలపిస్తోంది. వలస వ్యాపారులుగా దేశానికి వచ్చిన యూరోపియన్లు మతవ్యాప్తికి కృషిచేశారు. అందరినీ జయించి చివరికి మిగిలిన బ్రిటిషర్లు తమ అజెండాను అమలుచేశారు. వారు చేస్తున్న దోపిడీ•ని ప్రశ్నిస్తూ, తమకు స్వేచ్ఛకావాలని పోరాటం చేసిన హిందువులను బందీలు చేసి వారిని క్రూరశిక్షలకు గురిచేశారు. కొందరిని చంపివేశారు. క్రైస్తవ మతవ్యాప్తికి ఎనలేని ప్రోత్సాహం కల్పించారు. చర్చిలకు భూములు, కానుకలు ఇచ్చారు. ప్రాచీన కాలం నుంచి స్వయం పోషకంగా వున్న భారత సమాజాన్ని అణచివేయాలని, భారత్ వద్ద ఏమీ లేదని చెప్పేలా మెకాలే విద్యావ్యవస్థను అమలు చేశారు. అయినా భారత్ మాత్రం తన సంస్కృతిని వదల్లేదు. ఇప్పుడు అధికారంలో వున్న వైసీపీ కూడా బ్రిటిషర్ల విధానాలనే అమలు చేస్తోంది. మాతృభాష తెలుగును మన నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తోందని భాషా పండితులు విమర్శిస్తున్నారు. ఈ ప్రభుత్వం తెలుగు మాధ్యమాన్ని శాశ్వతంగా తొలగించే ప్రయత్నం చేసింది. ఆంగ్ల మాధ్యమంలో పాఠ్య పుస్తకాలు రూపొందించింది. ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్య అందించాలనే జాతీయ విద్యా విధానాన్ని, అటు హైకోర్టు అదేశాలను పాటించడం లేదు. తన పంతం నెగ్గించుకోవడానికి అచ్చువేసిన పుస్తకాలకు ఒక వైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిషు ముద్రించారు. మొదట అచ్చువేసిన పుస్తకాల కోసం కోట్ల కొద్దీ ధనం వృథా చేసింది.
వనరుల దోపిడీ
బ్రిటిష్ ప్రభుత్వం భారత వనరులు ఎలా దోపిడీ చేసిందో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా అలాగే వనరులు దోపిడీ చేస్తోంది. వైసీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఇసుక, కొండలు, గుట్టలు, గనులను అందిన కాడికి దోచేస్తున్నారు. ఓట్ల కొనుగోలు రాజకీయానికి తెరలేపిన ప్రభుత్వం అభివృద్ధి పనులను విస్మరించి, ‘నవరత్నాల’ పేరుతో నగదు పంపిణీ కార్యక్రమాలను మాత్రమే చేస్తోంది. పట్టాభూముల పంపిణీ పేరుతో రూపాయి విలువున్న భూమిని రెండు, మూడు రెట్ల అధిక ధరలకు కొని దానిని స్ధానిక ప్రజాప్రతినిధులు పంచేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ అవినీతిపై ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై వైసీపీ గుండాలు దాడులు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ వైసీపీ ప్రభుత్వానికి దాసోహం అయిపోయింది. ఆ పార్టీ చెప్పినట్లు ఆడుతోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోంది. స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షాలను పోటీ చేసేందుకు అడ్డుతగిలిన విధానం చూసి సమాజం విస్తుపోయింది. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టి తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ప్రతిపక్షాలు రోడ్లపై స్వేచ్ఛగా ప్రచారం చేసుకోకుండా జీవో నెంబరు 1ను తీసుకొచ్చి అడ్డుకుంటోంది. మహిళలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. సీఐడీ తన అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగపరిచింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారందరినీ తీసుకెళ్లి చితక్కొట్టి వదిలారు. ప్రశ్నించడం ఆపకుంటే తమను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సమాజంలో హింస పెరిగిపోయింది. ఈ పోలీసు వ్యవస్థ పూర్వ బ్రిటిష్ వ్యవస్థను తలపిస్తోంది.
మత వివక్ష
రాష్ట్రంలో వైసీపీ చూపిన మత వివక్ష ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదని అన్ని వర్గాలు ఆరోపిస్తున్నాయి. క్రైస్తవుల, ముస్లింల ఓటు బ్యాంకు కోసం ప్రభుత్వం అతివాద ముస్లిం, క్రైస్తవ సంస్థలు, వ్యక్తులకు మద్దతు ఇస్తూ మత వేర్పాటువాదానికి ప్రోత్సాహం ఇస్తోంది. ముల్లాలు, ఫాస్టర్లకు నెవారీ జీతాలు, చర్చిల నిర్మాణానికి నిధులిస్తోంది. అతివాద హిందువేతరులు కొందరు హిందూ దేవాలయాలపై దాడులు చేయడం, విగ్రహాలు, రధాలు ధ్వంసం చేసినా పిచ్చివాళ్లు చేసిన పనిగా చిత్రీకరించి పట్టించుకోలేదు. మతమార్పిళ్లు తీవ్రంగా జరుగుతున్నా ప్రోత్సాహం తప్ప అడ్డుకోవడం లేదు. అడ్డుకుంటున్న వారిపై కేసులు పెడుతున్నారు.
ఉదాహరణకు పెద్దారవీడులో కమ్యూనిటీ ఆసుపత్రి స్థలాన్ని కబ్జాచేసి చర్చి నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకున్న స్థానిక హిందూ చెంచులపై క్రైస్తవులుగా మారిన చెంచులు దాడిచేసి మగ, ఆడ, పిల్లలు అనే తేడా లేకుండా తలలు పగలగొడితే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అండదండలు, ఆదేశంతో హత్యాయత్నం కేసును పెట్టనీయలేదని బాధితులు వాపోయారు. అలాగే ఆత్మకూరులో మసీదు అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న బీజేపీ నంద్యాల నాయకుడు డాక్టర్ శ్రీకాంత్‌రెడ్డిని హతమార్చే కుట్ర జరిగింది. పోలీసులకు అన్ని విషయాలు తెలిసినా శ్రీశైలం, కర్నూలు, కడప ఎమ్మెల్యేల ఆదేశంతో బాధితుడైన తనపైనే పలు కేసులు పెట్టినట్లు శ్రీకాంత్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించిన ఉన్నతాధికారి పోలీసు స్టేషన్‌లో ‘హిందూ కుక్కా’ అంటూ దూషించి, కొట్టి, నీ అంతుచూస్తానని బెదిరించినట్లు ఆయన ఆరోపించారు. ఈ ప్రాంతంలో వేళ్లూనుకున్న అతివాద వేర్పాటువాద ముస్లిం సంస్థలకు చెందిన వారు శ్రీకాంత్‌రెడ్డిపై దాడులు చేసినట్లు స్వయంగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు చెప్పినా ప్రభుత్వం వినలేదు. పైగా అతనిపైనే కేసులు పెట్టి చాలా కాలం బెయిలు రాకుండా చేశారు. హిందువులను ఊచకోత కోసిన ముస్లిం రాజు టిప్పుసుల్తాన్ విగ్రహాన్ని ఎమ్మెల్యే అండదండలతో ప్రొద్దుటూరు పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రయత్నించారు. ఎమ్మిగనూరులో ఆవుల అక్రమ తరలింపును అడ్డుకున్న యువతను చావబాది వారిపై అక్రమ కేసులు పెట్టారు. నెల్లూరులో హనుమాన్ శోభాయాత్ర చేస్తున్న హిందువులపై మసీదు వద్ద వేర్పాటువాదులు రాళ్లు, బీరు సీసాలు విరిసారు. గుంటూరులో పోలీసు స్టేషన్‌పై దాడులు చేసిన నిందితులపై కేసులను తీసివేసే ప్రయత్నం చేశారు. ఇలా ఒకటేమిటి హిందువులపై జరుగుతున్న ఎన్నో దాడులను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పట్టించుకోలేదు. బ్రిటిషర్లు, ముస్లిం రాజులు చేసినట్లు మత వివక్షకు పాల్పడుతోంది. ఇక రేషన్ కార్డుల తొలగింపులో కూడా ప్రభుత్వం వివక్ష చూపిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.
వ్యాసకర్త: ఛైర్మన్,సెంట్రల్ లేబర్ వెల్ఫేర్ బోర్డు, కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ.