– రాజనాల బాలకృష్ణ

అదానీ వ్యవహారంలో పార్లమెంట్‌ ‌లోపల, బయట ప్రతిపక్షాలు సాగిస్తున్న ‘బట్ట కాల్చి ముఖానవేసే’ తంతు.. రఫేల్‌ ‌యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో నాడు కాంగ్రెస్‌ ‌సారథ్యంలో ప్రతిపక్షాలు సాగించిన అరాచక పోకడలు, వినాశకర, విద్రోహ ధోరణులను గుర్తుకుతెస్తున్నాయి. అవును, తలా తోకా లేని ఆరోపణలతో పార్లమెంట్‌ను అప్పుడు ఎలా స్తంభింపచేశాయో ఇప్పుడూ అలాగే చేస్తున్నాయి. అప్పుడు కూడా సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ కోరాయి. సుప్రీంకోర్టు వరకు వెళ్లాయి. చివరకు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే.

కాంగ్రెస్‌ అధ్యక్షుడు (అప్పటి) రాహుల్‌ ‌గాంధీ అయితే పార్లమెంట్‌ ‌వేదికగా అసత్య ఆరోపణలతో చెలరేగిపోయారు. అక్కడా ఇక్కడా పోగేసిన సత్యదూరమైన సమాచారంతో ఎన్నో ఆరోపణలు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రధాన మంత్రి కార్యాలయం నేరుగా ఫ్రెంచ్‌ ‌ప్రభుత్వంతో బేరసారాలు సాగించిందని ఆరోపిం చారు. ఫ్రెంచ్‌ ‌ప్రభుత్వమే రాహుల్‌ ఆరోపణలను ఖండించినా ఆయన వెనక్కి తగ్గలేదు సరి కదా ‘ప్రధాని మోదీ ఈ ఒప్పందం ద్వారా పారిశ్రామికవేత్త అనిల్‌ అం‌బానీకి రూ.30 వేల కోట్లు ప్రయోజనం చేకూర్చార’ని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన చేసిన ఆరోపణలు, అసత్య ప్రచారం ఏవీ ప్రజాకోర్టులో నిలవలేదు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ వరసగా రెండవసారి చేదు అనుభవం చవిచూసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు వేసిన ‘పెద్దమనుషుల’కు సర్వోన్నత న్యాయస్థానం మొట్టికాయలు కూడా వేసింది.

ఫ్రాన్స్‌కు చెందిన దసోల్ట్ ‌కంపెనీ నుంచి 36 యుద్ధ విమానాల కొనుగోలుకు భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, ఆ ఒప్పందంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ప్రశాంత్‌భూషణ్‌ ‌సహా మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలుచేశారు. అనిల్‌ అం‌బానీకి చెందిన రిలయన్స్ ‌సంస్థకు మేలు చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ ఒప్పందం చేసుకుందని, దీనికి సంబంధించి నిజానిజాలు వెల్లడించాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలంటూ ప్రశాంత్‌ ‌భూషణ్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేశారు. అయితే, సర్వోన్నత న్యాయస్థానం ఈ పిటిషన్లను కొట్టివేసింది. వీటిపై విచారణ జరిపిన అప్పటి ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్‌ ‌రంజన్‌ ‌గొగోయ్‌, ‌న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.‌కె. కౌల్‌, ‌జస్టిస్‌ ‌కె.ఎం. జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం రఫేల్‌ ఒప్పందంలో అనుమా నించాల్సిందేమీ లేదని స్పష్టంచేసింది. అయినా రాహుల్‌ ‌గాంధీ అసత్య ప్రచారాన్ని ఆపలేదు. సుప్రీంకోర్టు అనని మాటల్ని అన్నట్లుగా పేర్కొంటూ ప్రధాని నరేంద్ర మోదీ ‘క్లీన్‌ ఇమేజ్‌’‌ని దెబ్బ తీసేందుకు ‘చౌకీదార్‌ ‌చోర్‌’ ‌నినాదంతో దేశం మీద పడ్డారు. కాంగ్రెస్‌ అధ్యక్షుని హోదాలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆ అంశాన్నే ప్రధాన నినాదం చేసుకున్నారు. అయినా ఓటమి తప్పలేదు. వీటన్నింటినీ మించి సుప్రీంకోర్టు చేయని వ్యాఖ్యలను చేసినట్లు పేర్కొంటూ, ప్రధాని గౌరవాన్ని దెబ్బతీసే విధంగా చేసిన ‘చౌకీదార్‌’ ఆరోపణకు సుప్రీంకోర్టుకు రాహుల్‌ ‌గాంధీ క్షమాపణలు చెప్పారు. అది కూడా ఒకసారి కాదు. రెండుసార్లు లిఖిత పూర్వక ఆఫిడవిట్‌ ‌రూపంలో క్షమాపణలు చెప్పారు. లెంపలేసుకున్నారు.

ఇంత జరిగినా కాంగ్రెస్‌ ఇం‌కా కళ్లు తెరవలేదు. ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీలు మరోమారు దాని వెంటే అడుగులేస్తున్నాయి. ఇందుకు అదానీ గ్రూప్‌ ‌వ్యవహారంలో పార్లమెంట్‌ ‌లోపల, వెలుపల కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్షాలు సాగిస్తున్న అరాచక రాజకీయమే నిదర్శనం. అసలు.. అదానీ గ్రూప్‌ ‌వ్యవహారంలో ఏం జరిగింది? ఏం జరుగుతోంది? అనేది కొంత ఆందోళన కలిగించే విషయమే. కానీ ప్రతిపక్షాలు ఏదో జరగరానిది జరిగిందని గగ్గోలు పెట్టడం ఆ పార్టీల అనైతిక, అరాచక రాజకీయాలనే కాదు, హిడెన్‌ ఎజెండానూ బయట పెడుతోంది. అదానీ గ్రూప్‌ ‌షేర్లలో అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పాక్షిక విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ ‌డిమాండ్‌ ‌చేసింది. అదానీ వ్యవహారం వల్ల ఎల్‌ఐసీ, ప్రభుత్వరంగ బ్యాంకులు పెట్టిన పెట్టుబడులు ఒడిదొడుకులకు లోనయ్యాయని కాంగ్రెస్‌తో పాటు శివసేన, వామపక్షాలు, ఆప్‌, ‌బీఆర్‌ఎస్‌ ‌తదితర పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలు, ఆందోళనలకు ఆధారం ఏమిటి? ఊరూ పేరూ లేని ఓ అనామక సంస్థ ‘హిండెన్‌బర్గ్ ‌రిసెర్చ్’ ‌వండి వార్చిన నివేదిక. ఆ నివేదిక భారతీయ షేర్‌ ‌మార్కెట్‌పై ముఖ్యంగా అదానీ గ్రూప్‌ ‌షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది. కానీ, ఆ నివేదికలోని నిజానిజాలను నిర్ధారించ వలసినది ఎవరు? పోనీ ఇంతలా రాద్ధాంతం చేస్తున్న ప్రతిపక్షాల వద్ద, ముఖ్యంగా అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రధాని మోదీ ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ, ఇతర సంస్థలపై ఒత్తిడి తెచ్చారని తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే వద్ద, లేదా మరే ఇతర పార్టీ నాయకుల వద్ద ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉన్నాయా? లేవు. అందుకే బట్టకాల్చి ముఖనా వేసే పాట.. పాత వ్యూహాన్నే మళ్లీ పాటిస్తున్నాయి. కాబట్టి అంతిమ ఫలితాలు కూడా (2019) అలాగే ఉంటాయి. అది వేరే విషయం.

రాజకీయాలు, ఎన్నికలు, వాటి ఫలితాల విషయాన్ని పక్కన పెడితే.. అసలు పట్టుమని పది మంది ఉద్యోగులు కూడా లేని ఈ ‘హిండెన్‌బర్గ్ ‌రిసెర్చ్’ ‌సంస్థ నిజంగా రిసెర్చ్ ‌సంస్థేనా? అంటే కాదు. షార్ట్ ‌సెల్లింగ్‌ ‌బిజినెస్‌ ‌చేస్తున్న స్టాక్‌ ‌బ్రోకరింగ్‌ ‌సంస్థ. ఇది ఎవరో, ఎప్పుడో చెప్పిన విషయం కాదు. ఆ సంస్థ యజమాని నాథన్‌ అం‌డర్సన్‌ ‌స్వయంగా చెప్పిన సత్యం. మరి అలాంటప్పుడు ‘షార్ట్ ‌సెల్లింగ్‌ ‌బిజినెస్‌’ అం‌టే ఏమిటో తెలిసిన ప్రతిపక్షాలు ఆ నివేదిక ఎంతవరకు నిజమనే విషయంలో ఎలాంటి అనుమానం లేకుండా దూకుడును ఎలా  ప్రదర్శిస్తున్నాయి! హిడెన్‌ (‌రహస్య) ఎజెండా ఏమిటి? అనే కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు. ఎందుకంటే, ఆ రహస్య ఎజెండాలో మన విపక్షాలు కూడా భాగస్వాములు కాబట్టి ఇలా వీరంగం వేస్తున్నాయని అనుకోవచ్చు.

భారతదేశాన్ని ఆర్థికంగానే కాదు, అన్ని విధాలా అస్థిరపరచేందుకు అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు జరుగుతున్నాయి. ఇదేమీ రహస్యం కాదు. ప్రస్తుత అదానీ వ్యవహారమే తీసుకుంటే ‘హిండెన్‌బర్గ్ ‌రిసెర్చ్’ ‌నివేదిక తమ వ్యాపార సామ్రాజ్యంపై చేసిన దాడిని దేశంపై చేసిన దాడిగా అదానీ పేర్కొనడాన్ని జాతీయవాద ముసుగులో ఉన్న కొందరు తప్పుపడితే పట్టవచ్చు గానీ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అందులో నిజం లేకపోలేదనిపిస్తుంది. నిజానికి, భారతదేశ ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అందులో భాగంగా అదానీ గ్రూప్‌ ‌చాలా కాలంగా అనేక రకాల దాడులను ఎదుర్కొంటోంది. ఆస్ట్రేలియాకు చెందిన బాబ్‌‌బ్రౌన్‌ ‌ఫౌండేషన్‌ ‌సంస్థ నడుపుతున్న వెబ్‌సైట్‌.. ఇం‌చుమించుగా ఆరేడు సంవత్సరాలకు ముందు నుంచే పర్యావరణ పరిరక్షణ ముసుగులో అదానీపై వ్యతిరేక కథనాలను ప్రచురిస్తోంది. ఆస్ట్రేలియాలో అదానీ బొగ్గుగనులపై వ్యతిరేకంగా కథలు, కథనాలు ప్రచురించేందుకే ఈ వెబ్‌సైట్‌ ‌ప్రారంభమైంది. అప్పటి నుంచి అదానీ బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బతీసేందుకు ఇది అహరహం శ్రమిస్తోంది. అదానీ ప్రతి అడుగును అనుమానిస్తూ, ఆటంక పరుస్తూ కథనాలు ప్రచురిస్తోంది. ఈ కథనాలకు దేశ వ్యతిరేక భారతీయ ‘మేధావులు’ కూడా వంత పాడుతున్నారు. అలాగే ఇప్పుడు స్టాక్‌ ‌మార్కెట్‌ను చెదర కొట్టి, సొమ్ము చేసుకునే షార్ట్ ‌సెల్లర్‌ ‌హిండెన్‌బర్గ్ ‌రిసెర్చ్ అనే ముసుగు సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రతిపక్షాలు పార్లమెంట్‌ ‌లోపల అరాచక రాజకీయం చేస్తుంటే, జాతీయవాద వ్యతిరేక వామపక్ష, ఉగ్రవాద భావజాల మేధావులు పార్లమెంట్‌ ‌వెలుపల మీడియాలో, వెబ్‌సైట్‌లలో విషప్రచారం సాగిస్తున్నారు. ఇది పేరుకు అదానీ మీద జరుగుతున్న దాడే అయినా, భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీసే కుట్రలో ఇది భాగం. ఇందులో ఎటువంటి సందేహం లేదు.

అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణలో ఏ లోపం లేదా? అంతా బాగుందా అంటే.. లేకపోవచ్చు! అయితే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నట్లుగా అలాంటి అవకతవకలు జరిగి ఉంటే ఆ విషయాన్ని మనదేశ స్వతంత్ర ఆర్థికరంగ నియంత్రణ సంస్థలు పరిశీలిస్తాయి, విచారిస్తాయి. ‘అదానీ గ్రూప్‌ ‌వ్యవహారం వల్ల మనదేశ స్థూల ఆర్థిక వ్యవస్థ మౌలికాంశాలు కానీ, మన ఆర్థిక వ్యవస్థ భావచిత్రం కానీ ఏ విధంగానూ ప్రభావితం కాలేదు’ అని కూడా నిర్మలా సీతారామన్‌ అన్నారు. ప్రతి మార్కెట్లోనూ హెచ్చుతగ్గులు, ఒడుదొడుకులు ఉంటాయి. అంత మాత్రాన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి పోయినట్లు కాదని ఆమె పేర్కొన్నారు. మార్కెట్లు స్థిరంగా ఉండేలా చూడగలిగే అధికారం, వనరులు సెక్యూరిటీస్‌ అం‌డ్‌ ఎక్స్ఛేంజ్‌ ‌బోర్డ్ ఆఫ్‌ ఇం‌డియాకి ఉంటాయి. ప్రైమ్‌ ‌కండిషన్‌లో మార్కెట్లను నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యలు అవి తీసుకుంటాయని ఆర్థికమంత్రి చెప్పారు. అదానీ గ్రూప్‌ ఎదుర్కొంటున్న ఒడుదొడుకుల గురించి భారతీయ రిజర్వు బ్యాంకు ఇప్పటికే స్పందించింది.

అదానీ గ్రూప్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావం ఆ సంస్థలో పెట్టిన పెట్టు బడులపై ఉందని బ్యాంకులు, ఎల్‌ఐసీ అధికారికంగా ప్రకటించాయి. అయినా, తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లు ప్రతిపక్షాలు ‘హిండెన్‌బర్గ్ ‌రిసెర్చ్’ ‌బోర్డు తగిలించుకున్న అనామక సంస్థ నివేదికే సత్యం అనుకుంటే, అందుకు తగ్గట్టుగా రాజకీయ అరాచకం సృష్టిస్తే.. ఏం జరుగుతుందో 2019లో ఒకసారి చూశాం. 2024లో మరోమారు చూస్తాం. అంతే.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE