– డా।। కాశింశెట్టి సత్యనారాయణ

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామాన్ని అణచి వేయడంలో సాయపడినందుకుగానూ నిజాం రాజ్యానికి ఆంగ్లేయుల బెడద వదిలింది. హైదరాబాద్‌ ‌ర్యాం స్వతంత్రం అయింది. నామమాత్రపు ఆంగ్లేయుల పెత్తనం తప్ప నిజాం రాజు స్వతంత్రుడు. అతని రాజ్య విస్తీర్ణం 82,698 మైళ్లు. ఇది ఇంగ్లండ్‌, ‌స్కాట్‌లాండ్‌ల కంటే పెద్దది. హైదరాబాద్‌ ‌రాజ్యానికి సొంత కరెన్సీ ఉండేది. దీన్ని హోలీసిక్కా (ఏడు హోలీ రూపాయలకు ఆరు బ్రిటిష్‌ ‌రూపాయలు) అనేవారు. రాజ్యానికి సొంత పోస్టల్‌ ‌సర్వీస్‌. ‌సొంత కస్టమ్స్ ఉం‌డేవి.

అఫ్జలుద్దౌల తర్వాత నిజాం మహబూబ్‌ ఆలీ ఖాన్‌ ‌గద్దెనెక్కాడు. అప్పుడు అతని వయస్సు 3 సంవత్సరాలు. అయితే సమర్థుడైన ప్రధాని సాలార్‌ ‌జంగ్‌ ‌నేతృత్వంలో ఎటువంటి ఒడుదొడుకులు లేకుండా రాజ్యపాలన సాగింది. ఆర్థిక అనిశ్చితి దూరమైంది. వ్యాపారాభివృద్ధి కోసం రైలు వచ్చింది. విద్యుత్‌ ‌వచ్చింది. టెలిఫోన్‌, ‌టెలిగ్రాఫ్‌ ‌వచ్చింది. కొన్ని ఉర్దూ పాఠశాలలు వెలిశాయి. ఉర్దూ పత్రికల కోసం గ్రంథాలయాలు తెరిచారు. అనేకమంది విద్వాంసులను, ప్రతిభావంతులను, హైదరాబాద్‌కు చేర్చారు. వారిలో అఘోరనాథ్‌ ‌చటోపాధ్యాయ ఒకరు. ఈయన సరోజినీ నాయుడు తండ్రి.

అఘోరనాథ్‌ ‌చటోపాధ్యాయను సాలార్‌జంగ్‌  ‌హైదరాబాద్‌ ‌కాలేజీ (నిజాం కాలేజీ) ప్రిన్సిపాల్‌గా నియమించాడు. చటోపాధ్యాయ బాల్యవివాహాలను వ్యతిరేకించేవారు. వింతంతు వివాహాలను ప్రోత్స హించేవారు. సమాజంలో నెలకొన్న వివిధ సాంఘిక సమస్యల పరిష్కారం కోసం ఆయన వద్దకు ప్రజలు వచ్చేవారు. ఆయన ఎప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించ లేదు. కాని సంస్కరణలకు సంబంధించిన మాటలు కూడా సహించలేని కరడుగట్టిన ఫ్యూడల్‌ ‌ప్రభుత్వం అది. దీంతో ప్రభుత్వం అఘోరనాథ్‌ను అసహనంగా చూసింది. విప్లవకారుడని శంకించింది. అయినా ఆయన కాలేజీ ప్రిన్సిపాల్‌ ‌కాబట్టి సమయం కోసం వేచి చూసింది.

1887లో బ్రిటిష్‌ ‌వారు అప్ఘన్‌ ‌యుద్ధాలలో మునిగిపోయారు. 60 లక్షల రూపాయల నగదు, పెద్దసంఖ్యలో సైన్యం పంపి నిజాం బ్రిటిష్‌ ‌వారిని ఆదుకున్నాడు. 1902లో వైస్రాయ్‌ ‌లార్డ్ ‌కర్జన్‌ ‌హైదరాబాద్‌ ‌పర్యటనకు వచ్చినప్పుడు బీరారును తమకు శాశ్వతంగా ఇచ్చివేస్తున్నట్లు నిజాంతో సనద్‌ ‌రాయించుకున్నాడు.

మరోవైపు హైదరాబాద్‌ ‌స్టేట్‌లో గల సంస్కృత పండితుడు శ్రీపాద దామోదర్‌ ‌సాత్వాలేకర్‌.. ఆర్య సమాజ నాయకుడు కేశవరావ్‌తో కలిసి స్వదేశీ ఉద్యమం లేవదీశారు. అఘోర్‌నాద్‌ ‌చటోపాధ్యాయ, దత్తు, అప్పాజీ తుల్జాపూర్‌కర్‌, ‌వామనరావులు వీరితో చేతులు కలిపారు. నిజాం రాష్ట్రం మీద స్వదేశీ ఉద్యమ ప్రభావం కూడా పడింది. దీనికి కారకుడు అఘోర్‌నాథ్‌ ‌చటోపాధ్యాయేనని బ్రిటిష్‌ ‌రెసిడెంట్‌ ‌భావించాడు. అంతేకాదు. 1907 నిజాం తన దూతను సాత్వాలేకర్‌ ‌దగ్గరకు పంపాడు. ‘లెక్చర్లివ్వడం మానుకో. పాట కచేరీలు జరుపు. చిత్ర లేఖనంతో డబ్బు సంపాదించుకో’ అని తాఖీదు విడుదల చేశాడు. అందుకు ఆయన సమ్మతించలేదు. దీంతో ఆయనకు రాజ్య బహిష్కరణ శిక్ష వేశారు.

సాలార్‌జంగ్‌ ‌ప్రారంభించిన రైల్వే లైను విషయంలో వివాదం ఏర్పడింది. రైల్వే లైన్‌ ‌బ్రిటిష్‌ ‌వారి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిందని, దాని కోసం రాజ్యంలో ఒక భాగం తాకట్టు పెట్టాల్సి వస్తుందని వదంతి వచ్చింది. ఈ విషయంలో ప్రభుత్వం కొన్ని యదార్థాలను దాస్తుందని, వాటిని బయట పెట్టాలని కొందరు నగర పెద్దలు కోరారు. చటోపాధ్యాయ దానికి నాయకత్వం వహించారు. ఆయన ప్రభుత్వాన్నే సవాలు చేస్తున్నారని, రాజ్య ద్రోహానికి పాల్పడుతున్నారని పాలకులు భావించారు. ఆయనను హైదరాబాద్‌ ‌నుండి బహిష్కరిస్తూ శిక్ష విధించారు.

పోలీసు నాజమ్‌ ఒకరోజు సాయంత్రం చటోపాధ్యాయ ఇంటికి పోలీసులను తీసుకుని వచ్చి ఓ కాగితం చూపించి రైల్వేస్టేషన్‌కు నడవమన్నాడు. చటోపాధ్యాయకు కనీసం తలపాగా తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా బయటకు నడిపిం చాడు. అప్పటికి ఆయన కూతురు సరోజినీదేవి వయస్సు నాలుగు సంవత్సరాలు. తండ్రిని తీసుకు వెళుతుంటే దిగాలుగా చూసింది. రైల్వే స్టేషన్‌లో అఘోరనాథ్‌ ‌చటోపాధ్యాయను గంటల తరబడి ఉంచారు. ఇతరులను అతని దరికి చేరనీయలేదు. ఇంతలో ఒక రైలు వచ్చింది. ఓ 12 మంది పోలీసులు అతనికి కాపలాగా ఉండి రెండవ తరగతి పెట్టెలో ఎక్కించారు. కాజీపేట తీసుకువచ్చారు. అక్కడ మరో రైలులోకి మార్చి హైదరాబాద్‌ ‌రాజ్యం దాటించారు. కొన్నాళ్లు ఆయన అక్కడే ఉన్నారు. తర్వాత ఆయన వైస్రాయికి అప్పీలు చేసుకోగా వైస్రాయ్‌ ‌కలగజేసుకుని రెసిడెంటును బయటకు పంపించి వేసి అఘోరనాథ్‌ను తిరిగి ప్రిన్సిపాల్‌గా నియమించారు. ఈవిధంగా అఘోరనాథ్‌ ‌హైదరా బాద్‌ ‌స్వాతంత్రోద్యమానికి తొలి కేక వేశారు.

About Author

By editor

Twitter
YOUTUBE