జాతీయ రహదార్లు దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా వివిధ మార్కెట్లకు సరకుల రవాణా మరింత సులభతరం కావడమే కాకుండా, ప్రజలు కూడా వేర్వేరు ప్రాంతాలకు తేలిగ్గా ప్రయాణించ గలుగుతారు. రోడ్డు రవాణా వల్ల దేశంలోని అన్ని ప్రాంతాల్లో సామాజిక-ఆర్థికాభివృద్ధి సమానంగా జరుగుతుంది. అంతేకాదు దేశం మొత్తం సామాజిక-ఆర్థిక ఏకీకరణకు కూడా దోహదం చేస్తుంది. తేలిగ్గా అందుబాటులో వుండటం, సులువుగా కార్యకలాపాల నిర్వహణ, డోర్-టు-డోర్ సేవలు, విశ్వస నీయత కారణంగా రోడ్డు రవాణా ఇటు సరుకురవాణా, అటు ప్రయాణీకుల చేరవేతలో అత్యంత కీలకపాత్ర పోషిస్తోంది. దేశంలో మొత్తం రోడ్ల నెట్‌వర్క్ 63.73 లక్షల కిలోమీటర్లు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నెట్‌వర్క్. 2022 నవంబర్ 30 నాటికి దేశంలోని మొత్తం జాతీయ రహదారుల పొడవు 1,44,634 కిలోమీటర్లు కాగా రాష్ట్ర రహదార్లు 1,86,908 కిలోమీటర్లు, ఇతర రోడ్లు 59,02,539 కిలోమీటర్లు. దేశంలో మొత్తం 599 జాతీయ రహదారులున్నాయి.
దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణలో భాగంగా జాతీయ రహదారుల నిర్మాణానికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.73 వేల కోట్లు కేటాయించింది. గతంతో పోలిస్తే ఇది 50% అధికం. దీన్నిబట్టి లక్ష్య సాధనపై ప్రభుత్వం ఎంతటి కృతనిశ్చయంతో ఉన్నదీ తెలుస్తోంది. ఇక జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) విషయానికి వస్తే, రోడ్ల నిర్మాణానికి వెచ్చించే నిధులు 15% పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరుకున్నాయి. వార్షిక రహదారుల నిర్మాణంలో 60% రోడ్ల నిర్మాణమే ఆక్రమిస్తోంది. ఆయా రాష్ట్రాల ప్రజాపనుల శాఖల ద్వారా ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారుల విస్తరణతో పాటు వాటిని మరింత బలోపేతం చేస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ ప్రధానంగా విశాలమైన రోడ్లు, ఎక్స్‌ప్రెస్ హైవేలు, ఆర్థిక నడవాల నిర్మాణాలను చేపడుతుంది. 2022లో మొత్తం రూ. 2.8 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభ మయ్యాయి. అంతేకాదు దేశ చరిత్రలో మొట్టమొదటి సారి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వం ‘ష్యూరిటీ బాండ్’లను విడుదల చేసింది. నేషనల్ హైవే ఇన్‌ఫ్రా ట్రస్ట్ బాండ్లను, బొంబాయి స్టాక్ ఎక్చేంజ్‌లో, నేషనల్ స్టాక్ ఎక్చేంజ్‌లో లిస్టింగ్ చేయడం ద్వారా రూ.1500 కోట్లను కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ బాండ్ల రూపంలో సమీకరించింది. అంతేకాదు జాతీయ రహదారుల అభివృద్ధికి సంబంధించి 2022లో ప్రధాని నరేంద్రమోదీ మొత్తం రూ.57,020 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడమో లేక శంకుస్థాపన చేయడమో జరిగింది. అదేవిధంగా కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రూ.2,30,802 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.
‘లేన్ కిలోమీటర్’ అంటే…
విదేశాల్లో రోడ్ల నిర్మాణంలో ‘‘లేన్ కిలోమీటర్’’ ప్రాతిపదికన గణిస్తే మన దేశంలో కేవలం కిలోమీటర్ల లోనే రోడ్ల నిర్మాణాన్ని లెక్కిస్తారు. అంటే మనదేశంలో 8 లేన్ల రహదారిని కిలోమీటరు మేర నిర్మించినప్పుడు దాన్ని కేవలం ఒక కిలోమీటరుగానే పరిగణిస్తారు తప్ప 8 లేన్ కిలోమీటర్‌గా లెక్కించరు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రెండు లేన్ల రహదారుల నిర్మాణం, బలోపేతం వాటా 6,893 కిలోమీటర్లు. ఇదే ఏడాది మొత్తం రహదారుల నిర్మాణం 10,237 కిలోమీటర్ల మేర జరిగింది. 2020-21లో రహదారుల నిర్మాణం శిఖర స్థాయిలో జరిగిందనే చెప్పాలి. మొత్తం 13,327 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం జరగ్గా, రెండు లేన్ల రోడ్ల నిర్మాణం, బలోపేతం చేసే వాటా 9,315 కిలోమీటర్లు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12,200 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
ఐటీఎస్‌లో మార్పులు
కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఇప్పటివరకు అమల్లో ఉన్న ‘ఇంటెలిజెన్స్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్’ (ఐటీఎస్)లో మార్పులు తీసుకొచ్చి, 2022, జూన్ 23న ఇందుకు సంబంధించిన మార్గదర్శ కాలను విడుదల చేసింది. వివిధ రాష్ట్రాల్లోని రవాణా యూనిట్లు, ఈ సరికొత్త ఐటీఎస్ సాంకేతిక పరిజ్ఞానా లను వినియోగించుకొని ప్రజలకు మరింత ఉన్నత ప్రమాణాల్లో సేవలు అందించేందుకు వీలవుతుంది. ముఖ్యంగా ఫ్లీట్ మేనేజ్‌మెంట్ వ్యవస్థకు అవసరమైన హర్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ కాంపొనెంట్లను ఇది అంద జేస్తుంది. ఎలక్ట్రానిక్ టిక్కెటింగ్ సిస్టమ్, ఫేర్ కలెక్షన్ సిస్టమ్, ప్రయాణికుల సమాచారం, ఫీడ్‌బ్యాక్ వ్యవస్థలకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇప్పటివరకు కేంద్ర మంత్రిత్వ శాఖకు వివిధ రాష్ట్రాల రవాణా యూనిట్ల నుంచి రూ.200 కోట్ల విలువైన ప్రతిపాదనలు అందాయి. టీఎస్‌ఆర్‌టీసీ, కేఎస్‌ఆర్టీసీ, జీఎస్‌ఆర్‌టీసీ, బీఈఎస్‌టీ, అహమ్మదాబాద్ జల్‌మార్గ్ లిమిటెడ్, భోపాల్ సిటీ లింక్ లిమిటెడ్, కేరళ ఎస్.ఆర్.టీ.సీ. వీటిల్లో ఉన్నాయి. ఈ ప్రతిపాదన లను ప్రస్తుతం కేంద్ర మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది.
భారత్‌మాల
దేశవ్యాప్తంగా సరుకు రవాణా, ప్రజల సంచారాన్ని మరింత సమర్థవంతం చేయడం భారత్‌మాల ప్రధాన లక్ష్యం. భారత్‌మాల పరియోజన కింద కేంద్రం అభివృద్ధి చేసే 35 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు రవాణాను సుసంఘటితం చేయడమే కాకుండా, పంపిణీ హబ్‌లుగా పని చేస్తాయి. నిజానికి 2014-15 నుంచి 2021-22 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల నిర్మాణం అత్యంత వేగంగా పురోగతి సాధించింది. 2014-15లో రోజుకు 12 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే, 2021-22 నాటికి 29 కిలోమీటర్లకు పెరగడాన్ని గమనిస్తే దేశంలో జాతీయ రహదారుల నిర్మాణవేగం ఎంతగా పుంజుకున్నదీ అర్థమవుతుంది. మొట్టమొదటిసారి 2017లో భారత్‌మాల- ఫేజ్1కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మౌలిక సదుపాయాల కల్పనలో ఉన్న అంతరాలను పూడ్చడమే లక్ష్యంగా దేశంలో 34,800 కిలోమీటర్ల హైవేల నిర్మాణానికి ఉపక్ర మించింది. ఈ పరియోజన ‘‘కారిడార్ ఆధారిత జాతీయ రహదారుల అభివృద్ధి’’కి ప్రాధాన్యత నిచ్చింది. ఈ పరియోజన కింద, ఆర్థిక నడవాల అభివృద్ధి, అంతర్ కారిడార్లు, ఫీడర్ రూట్ల అభివృద్ధి, జాతీయ కారిడార్ల సామర్థ్యం పెంపు, సరిహద్దు, అంతర్జాతీయ అనుసంధాన రహదారుల నిర్మాణం, తీర, పోర్టుల అనుసంధాన రహదార్లు, ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణాలు జరిగాయి.
గ్రీన్‌ఫీల్డ్ కారిడార్లు
భారత్‌మాల-ఫేజ్1 కింద దేశవ్యాప్తంగా 9 వేల కిలోమీటర్ల మేర 27 గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ల నిర్మాణానికి ప్రణాళికా రచన జరిగింది. అంతేకాదు, దేశంలోనే అతిపెద్ద ఢిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాన్ని భారత్‌మాల పరియోజన కింద కేంద్రం చేపట్టింది. ఇందులో ఢిల్లీ-దౌస (జైపూర్), వడోదర-అంకలేశ్వర్ సెక్షన్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ మొత్తం ఎక్స్‌ప్రెస్ హైవే పొడవు 1386 కిలోమీటర్లు. దాదాపు పూర్తయిన ఇతర కారిడార్లలో చెప్పుకోదగినవి అంబాలా- కోట్‌పుత్లి, అమృత్‌సర్-జామ్‌నగర్. భారత్‌మాల కింద చేపట్టే ప్రాజెక్టుల్లో 60% హైబ్రిడ్ యాన్యుటీ నమూనాలో (రెండు లేదా అంతకంటే ఎక్కువ యాన్యుటీల కాంబినేషన్‌లో) పదిశాతం ప్రాజెక్టులు బి.ఒ.టి. (టోల్) నమూనా కింద, మరో 30% ప్రాజెక్టులను ఇ.పి.సి. (ప్రైవేటు కాంట్రాక్ట్‌లు) కింద చేపడుతున్నారు.భారత్‌మాల-ఫేజ్1 కింద మొత్తం 24,800 కిలోమీటర్ల రహదారులకు ఆమోదం లభించగా 17,555 కిలోమీటర్ల మేర, మిగిలిన పదివేల కిలోమీటర్ల రహదారుల్లో 5,972 కిలోమీటర్ల మేర పనులు అప్పగించడం పూర్తయింది.
మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుల నిర్మాణం
భారత్‌మాల పరియోజన కింద రూ.46వేల కోట్లతో దేశంలో 35 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కుల (ఎంఎంఎల్‌పి) నిర్మాణం చేపడతారు. ఇవి పూర్తయితే 700 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను హ్యాండిల్ చేయవచ్చు. ఎంపిక చేసిన 15 ప్రదేశాల్లో ఎంఎంఎల్‌పి ప్రాజెక్టులను రూ.22వేల కోట్లతో చేపడతారు. ఇవి పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు, వినియోగదార్లకు ప్రాంతీయ సరకు సమీకరణ, పంపిణీ హబ్‌లుగా పనిచేస్తాయి. సాగర మాల పరియోజన కింద ఎంఎంల్‌పిలను ఇన్‌లాండ్ వాటర్ టెర్మినల్స్‌కు అనుసం ధానించడం వల్ల, దేశంలో కార్గో రవాణా ఖర్చు మరింత చౌకగా మారుతుంది. అస్సాంలోని జొగొగోఫాలో ఎంఎంఎల్‌పి నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. ఇది మొత్తం ఈశాన్య భారత రాష్ట్రాలతో పాటు భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ రాష్ట్రాలకు కూడా పంపిణీ కేంద్రంగా పనిచేస్తుంది. ఎంఎంఎల్‌పి చెన్నై ప్రాజెక్టును రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు కేటాయించారు.
అమృత్ సరోవర్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్, అమృత్ సరోవర్ అభియాన్ పథకాల కింద ‘అమృత్ సరోవర్’ల నిర్మాణం చేపడతారు. జాతీయ రహదారుల కోసం సమీపంలోని చెరువు నుంచి పూడిక మట్టిని తరలించడం ద్వారా వాటిని ‘అమృత్ సరోవర్’లుగా అవి పునరుద్ధరిస్తారు.
మంథన్: 2022, సెప్టెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజుల పాటు బెంగళూరులో ‘మంథన్’ పేరుతో ఒక సదస్సు జరిగింది. రోడ్లు, రవాణా, లాజిస్టిక్ సెక్టార్ ,వివిధ రాష్ట్రాలతో వ్యవహరించే విషయమై ఈ సదస్సులో కూలంకషంగా చర్చించారు. ఈ సదస్సు ఇతివృత్తం ‘ఐడియా టు యాక్షన్’. వివిధ రాష్ట్రాలకు చెందిన రవాణా శాఖ మంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ‘రోడ్డు భద్రత’కు సంబంధించి బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ నటించిన మూడు షార్ట్ ఫిల్మ్‌లఈ సందర్భంగా విడుదల చేయడం విశేషం.
పి.ఎం. గతిశక్తి: పి.ఎం. గతిశక్తి అనేది ‘‘జాతీయ స్థాయి మాస్టర్ ప్రణాళిక’’. ఈ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం దేశంలో మౌలిక సదుపాయాల కల్పనలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రూ.100 లక్షల కోట్ల వ్యయంతో ‘‘గతిశక్తి యోజన’’ను ప్రకటించారు. దేశంలో అవిభాద్య రూపంలో మౌలిక సదుపాయాల కల్పన దీని ప్రధాన లక్ష్యం.
పర్వతమాల
‘పర్వతమాల’ కార్యక్రమం కింద దేశంలో రోడ్డు రవాణాకు ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం చేపడతారు. అంటే రోడ్డు నిర్మాణం సాధ్యం కాని ప్రాంతాల్లో వీటిని నిర్మిస్తారు. ఇందుకోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా (బిజినెస్) రూల్స్-1961లో ప్రభుత్వం 2021, ఫిబ్రవరి నెలలో కొన్ని సవరణలు చేసింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ రెండు రోప్‌వే నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. వీటిలో మొదటిది, గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్ వరకు కాగా రెండవది గోవింద్‌ఘాట్ నుంచి హేమకుండ్ సాహిబ్ వరకు. ఈ రెండూ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందినవి. ఈ రోప్‌వేల నిర్మాణం వల్ల గౌరీకుండ్ నుంచి కేదార్‌నాథ్‌కు (9.7 కిలోమీటర్లు) కేవలం 30 నిమి•షాల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం 6-7 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా గోవింద్‌ఘాట్ నుంచి హేమకుండ్ సాహిబ్ వరకు 12.4 కిలోమీటర్ల దూరానికి ప్రయాణకాలం ప్రస్తుతం ఒక రోజు పడుతోంది. రోప్‌వే నిర్మాణం పూర్తయితే కేవలం 45 నిముషాల్లో ప్రయాణం పూర్తి కాగలదు. పర్వతమాల యోజన కింద హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో రోప్‌వేల నిర్మాణం చేపడతారు. మధ్యప్రదేశ్‌లో ఇందుకోసం 14 ప్రాంతాలను ఎంపిక చేశారు ఈ నిర్మాణాల కోసం కేంద్రం, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
హైవేల పక్కన సదుపాయాలు
జాతీయ రహదారుల పక్కనే అన్ని రకాల సదుపాయాలను కల్పించేందుకు మంత్రిత్వశాఖ తగిన ప్రణాళికలను రూపొందించింది. దీనికింద జాతీయ రహదారులపై ప్రతి 40కిలోమీటర్లకు, అన్ని సదుపాయా లతో ఒక్కొక్క కేంద్రాన్ని పి.పి.పి. విధానంలో నిర్మిస్తారు. వీటిల్లో పెట్రోల్ బంకులు, ఈవీ చార్జింగ్ స్టేషన్లు, ఫుడ్‌కోర్ట్, రెస్టారెంట్/దాబా, కన్వీనియంట్ స్టోర్‌లు, తాగునీరు, ప్రాథమిక వైద్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్ల సదుపాయం వంటివి అందుబాటులో ఉంటాయి. కారు, బస్సు, ట్రక్ పార్కింగ్, డ్రోన్ ల్యాండింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారు. 2024-25 నాటికి గుర్తించిన 600 ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణ యించగా, 144 సదుపాయ కేంద్రాల నిర్మాణానికి కేటాయింపులు జరిగాయి. మరో 72 బిడ్డింగ్ దశలో ఉన్నాయి. ఇక యుటిలిటీ కారిడార్‌ల కింద ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ హైవే, బెంగళూరు- హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ హైవేల్లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నిర్మాణానికి ఇప్పటికే కేంద్రం పనులు అప్పగించింది.
ఉపసంహారం
దేశంలో రవాణా సదుపాయాల వృద్ధికి మాత్రమే కాదు విదేశీ పెట్టుబ డులను ఆహ్వానించడానికి మౌలిక సదుపాయాల కల్పన అత్యంత కీలకం. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.10 ట్రిలియన్‌లను మౌలిక సదుపాయాల కోసం కేటాయించింది. సామాజిక, ఆర్థికాభివృద్ధికి, మార్కెట్ అనుసంధానతకు, సరకు, ప్రజారవాణాకు రహ దారులు దోహదం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం జనాకర్షణ కంటే, దేశాభివృద్ధికే పెద్ద పీట వేసింది. ఒక బాధ్యతాయుత ప్రభుత్వం తీసుకునే సముచిత నిర్ణయాలకు మౌలిక రంగానికి పెద్దఎత్తున కేటాయింపులు గొప్ప ఉదాహరణ.
– జమలాపురపు విఠల్‌రావు, సీనియర్ జర్నలిస్ట్