– డాక్టర్‌ ‌పార్థసారథి చిరువోలు, సీనియర్ జర్నలిస్ట్

ఫిబ్రవరి 28 జాతీయ విజ్ఞాన దినోత్సవం

సంస్కృతీ సాంప్రదాయాలకు నెలవుగా, ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటే కర్మభూమిగా కీర్తిప్రతిష్ఠలు అందుకున్న భారత్‌ ‌నేడు శాస్త్రసాంకేతిక రంగాల్లోనూ దూసుకుపోతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు దీటుగా తన సత్తా చాటుతోంది. ప్రపంచ దేశాలు కీర్తించేలా అంతర్జాతీయ యవనికపైన సాంకేతిక మెరుపులు మెరిపిస్తోంది.4.0 దిశగా పరుగులు తీస్తూ.. ‘జయహో భారత్‌’ అనిపించుకుంటోంది.

దేశం ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలంటే శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం అనేది కీలకం. భారత దేశం ఈ విషయాన్ని గట్టిగా నమ్మటమే కాదు. దేశీయంగా అందుకు అనువైన వాతావరణాన్ని (ఎకోసిస్టమ్‌) ‌కల్పిస్తోంది. ప్రస్తుతం జీ20 అధ్యక్ష బాధ్యతలను చేపట్టిన భారత్‌, ‌కృత్రిమ మేధలో ఆవిష్కరణలను ప్రోత్సహించే గ్లోబల్‌ ‌పార్ట్‌నర్‌షిష్‌ ఆన్‌ ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్ (‌జీపీఏఐ)కు ఛైర్మన్‌ ‌గానూ వ్యవహరిస్తోంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక వ్యవస్థలకు అనుగుణంగా ఒక కామన్‌ ‌ఫ్రేమ్‌ ‌వర్క్ ‌రూపొందించాలని అందుకు అన్ని దేశాలను సంసిద్ధం చేయాలని చూస్తోంది. దాంతో పాటు కృత్రిమ మేధలో అత్యాధునిక పరిశోధనలకు జర్మనీ వంటి దేశాలతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది.

సాంకేతిక లావాదేవీల నిర్వహణకు భారత్‌ అన్నిరకాలా అనువైన దేశమని ప్రపంచ టెక్నోక్రాట్లు భావిస్తున్నారు. మల్టీ నేషనల్‌ ‌కంపెనీలు అనేకం తమ పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అం‌డ్‌ ‌డి) కేంద్రాలను ఇక్కడ నెలకొల్పుతున్నాయి. దాంతో పెట్టు బడులకు అనువైన గమ్యంగా భారత్‌ ‌ప్రపంచంలోనే మూడో స్థానాన్ని సంపాదించింది. అంతర్జాతీయంగా శాస్త్రీయ పరిశోధనల్లో అగ్రగామిగా నిలిచింది. ప్రధానంగా అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచంలోనే మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. మూన్‌ ‌మిషన్‌, ‌పీఎస్‌ఎల్‌వి మిషన్‌ ‌లాంటి అనేక స్పేస్‌ ‌మిషన్లను చేపట్టింది. అంతేకాదు. సార్క్ ‌దేశాలు ఉపగ్రహాలను ప్రయోగించటానికి తన వంతు సహకారాన్ని అందిస్తోంది. తన అంతరిక్ష సౌకర్యాలను ఇతర దేశాలకు అందించటం ద్వారా ఆదాయాన్ని సముపార్జిస్తోంది. ఈ రంగంలో శక్తిమంతంగా మారేందుకు ప్రభుత్వం అనేక పథకాలను రూపొం దించింది. ఆర్‌ అం‌డ్‌ ‌డిలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. దీనితో స్థూల వ్యయం ఏటికేడాది పెరుగుతూ వస్తోంది.

క్వాంటమ్‌ ‌కంప్యూటింగ్‌ ‌రంగంలో కూడా భారత్‌ ‌యావత్‌ ‌ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది. క్వాంటమ్‌ ‌కమ్యూనికేషన్స్, ‌క్వాంటమ్‌ ‌సెన్సార్‌, ‌క్వాంటమ్‌ ‌క్రిష్టోగ్రపీ తదితర అంశాలలో ముందుంది. అంతర్జాతీయ నవకల్పనల సూచికలో 130 దేశాలలో, 2015లో 81వ స్థానంలో ఉంటే, 2022 నాటికి 40వ స్థానానికి దూకింది. అంకుర సంస్థలలోనూ అంతర్జాతీయ స్థాయిలో మొదటి మూడు దేశాలలో ఒకటిగా ఉంది. అలాగే పరిశోధనలకు ఫెలోషిప్‌లను ప్రవేశపెట్టింది.

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత్‌ ‌ప్రతిభను చాటే కొన్ని అంశాలను చూద్దాం..

–         సైన్సు పబ్లికేషన్ల ప్రచురణలో భారత్‌ అం‌తర్జాతీయంగా మూడో స్థానంలో ఉంది. 2013లో భారత్‌ ‌స్థానం ఆరు.

–         సైన్సు, ఇంజనీరింగ్‌ (ఎస్‌ అం‌డ్‌ ఈ) ‌విభాగంలో పీహెచ్‌డీలను ప్రదానం చేయటంలో అమెరికా, చైనాల తర్వాత స్థానాన్ని అందుకుంది. ఏటా సగటున 25 వేల వరకూ పీహెచ్‌డీలను అందిస్తోంది.

–         స్టార్టప్‌ల సంఖ్య (77వేలు), యూనికార్న్‌ల సంఖ్య(107)లను పరిగణనలోకి తీసుకున్నా అంతర్జాతీయంగా మూడోస్థానంలో ఉంది.

–         గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇం‌డెక్సు (జీఐఐ)లో భారత్‌ ‌స్థానం 2015లో 81 ఉంటే, అది 2022 నాటికి 40వ స్థానానికి ఎగబాకింది. దిగువ మధ్య ఆదాయ ఆర్థిక వ్యవస్థలున్న దేశాల్లో రెండో స్థానంలోనూ, పది సెంట్రల్‌, ‌సదరన్‌ ఆసియన్‌ ఎకానమీల్లో మొదటి స్థానంలోనూ ఉంది.

–         ప్రపంచంలో సాంకేతిక పెట్టుబడులను పెట్టేందుకు మెరుగైన గమ్యంగా భారత్‌ ‌మూడో స్థానంలో ఉంది.

–         గత పదేళ్ల కాలంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అం‌డ్‌ ‌డి) రంగంలో స్థూల వ్యయం మూడు రెట్లకు పెరిగింది.

–         ఆర్‌ అం‌డ్‌ ‌డిలో మహిళల భాగస్వామ్యం రెట్టింపయ్యింది.

–         రెసిడెంట్‌ ‌పేటెంట్‌ ‌ఫైలింగ్‌లో భారత్‌ ‌తొమ్మిదో స్థానంలో ఉంది.

–         పరిశోధన రంగంలో మహిళల భాగస్వామ్యం గత ఎనిమిదేళ్లలో రెట్టింపయ్యింది.

అత్యాధునిక పద్ధతుల్లో క్యాన్సర్‌ ‌వైద్యం

పరిశోధన రంగంలో తాజాగా పడుతున్న అడుగులు సైన్సు, టెక్నాలజీ రంగంలో భారత్‌ ‌స్వరూపస్వభావాలనే మార్చివేసే స్థాయిలో ఉన్నాయి. జెనెటిక్‌ ‌సీక్వెన్సింగ్‌, ‌మెషిన్‌ ‌లెర్నింగ్‌, అడ్వాన్డస్ ‌సెన్సార్లు, సింథటిక్‌ ‌బయాలజీ వంటి అత్యున్నత సాంకేతికతను ఉపయోగించి క్యాన్సర్‌ ‌చికిత్స చేపట్టా లని భారత్‌ ‌నిర్ణయించింది. ఇందుకోసం ప్రపంచ చరిత్రలోనే అతి పెద్ద క్లినికల్‌ ‌ట్రయల్‌కి సన్నాహాలు చేస్తున్నారు. జెనెటిక్‌ ‌డేటాను, బయో శాంపిల్స్‌ను సేకరించి 3డీ ఆర్గానాయిడ్స్‌ను సృష్టించాలని, పరిశో ధనల్లో వెల్లడయిన ఫలితాలను రహస్యంగా కాకుండా యావత్ప్రపంచంలోని శాస్త్రవేత్తలు, ఆంకాలజిస్టులకు అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకు వితరణశీలత గల పారిశ్రామిక సంస్థ టాటా గ్రూపు అధినేత రతన్‌ ‌టాటా కొంత నిధి సమకూరు స్తున్నారు. ప్రధాని మోదీ సమక్షంలో 2019 అక్టోబరులో దీనిపై శాస్త్ర, సాంకేతిక నిపుణులు, టెక్నోక్రాట్లతో సమావేశం నిర్వహించారు. టాటా ట్రస్ట్ అధ్యక్షుడు ఆర్‌. ‌వెంకట్‌, ‌దాని సహవ్యవస్థాపకుడు మెడికల్‌ ‌డైరక్టర్‌ ‌మోనీ అబ్రహాం కురియాకోసె తదితరులు పాల్గొన్నారు. అమెరికన్‌ ఎం‌టెప్రెన్యూర్‌ ‌వివేక్‌ ‌వాథ్వా ప్రధాన పాత్ర పోషించారు. ‘‘అమెరికాలో మాదిరిగా పరిశోధనల ఫలితాలు రహస్యంగా కాకుండా, పారదర్శకంగా అటు పరిశోధకులకు, ఇటు దేశవ్యాప్తంగా ఉన్న నిపుణులకు తెలిసేలా భారత్‌ ‌ప్రవర్తిస్తోంది’’ అని ప్రశంసించారు అమెరికన్‌ ‌కేన్సర్‌ ‌సొసైటీ మాజీ సీఈఓ గేరీ రెడీ.

వ్యవసాయ సాంకేతికతలో కూడా భారత్‌ ‌తన ప్రతిభను చాటుతోంది. శాంటియాగో, చిలీలో ప్రారంభించిన ప్లాస్మా వాటర్‌ ‌సొల్యూషన్స్ (‌పీఎడబ్ల్యు -పా) అనే సంస్థ ఈ రంగంలో విశిష్టమైన ఫలితాలను సాధిస్తోంది. ఈ సంస్థ భారత్‌లో అడుగు పెడుతోంది. ‘‘సాంకేతికతపైన అభిరుచిని ప్రదర్శి స్తున్న దేశం కావటంతో మేం భారత్‌ను ఎంపిక చేసుకున్నాం’’ అని ప్లాస్మా వాటర్స్ ‌సీఈఓ రాబర్ట్ ‌హారిట్‌, ‌వ్యవస్థాపకుడు అల్ఫ్రెడో జొలెజ్జీ పేర్కొన్నారు. అమెరికా వ్యాప్తంగా పొలాల్లో ఆరునెలల పాటు చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలనిచ్చాయి. పా తో శుభ్రం చేసిన కూరగాయలు ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ను తట్టుకుంటున్నాయి. దానితో ట్రీట్మెంట్‌ ‌చేసిన విత్తనాలకు బీజోత్పత్తి (జెర్మినేషన్‌) ‌వృద్ధి పెరిగింది. ఒక సీజన్‌లో మిలాన్‌ ఒక ఎకరానికి అదనంగా వంద బాక్సుల ఉత్పత్తి పెరిగింది. జొన్నలు (సొర్గమ్‌) ఒక్కొక్కటి 450 కేజీల దాకా పెరిగింది, ఇవన్నీ ఆర్గానిక్‌వి కావటం విశేషం. అంతే కాకుండా ప్లాంట్‌ ‌బ్యాక్టీరియాను, పేథోజన్స్ (‌వ్యాధికారకాలు)ను ఈ ‘పా’ నాశనం చేస్తుంది. దానిలో మార్పులు చేర్పులు చేయటం వల్ల నైట్రేట్‌ ఉత్పత్తులను విడుదల చేస్తుంది. వ్యవసాయాభివృద్ధి దేశమైన భారత్‌ ‌ప్లాస్మా వాటర్‌ను ఉపయోగించుకుంటే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి.

కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్‌ ఇం‌టెలిజెన్స్, ఏఐ)

‌సాంకేతికత విషయంలో కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్ ‌లాంటి వివిధ పరిశ్రమల్లోనూ, అలెక్సా, సిరి వంటి ఇంటెలిజెంట్‌ అసిస్టెంటుగానూ, సెల్ఫ్ ‌డ్రైవింగ్‌ ‌కార్లలోనూ, సంభాషణలు సాగించే బోట్స్, ఈ ‌మెయిల్‌ ‌స్పామ్‌ ‌ఫిల్టర్లు, నెట్‌ఫ్లిక్స్ ‌రికమండేషన్లలోనూ దీని పాత్ర అధికంగా ఉంది. కొన్ని దశాబ్దాలుగా ఏఐ సాధిస్తున్న ఫలితాలు అందరినీ దిగ్భ్రాంతులను చేస్తున్నాయి. తెలివైన కంప్యూటర్లను రూపొందించటంలో అవి కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇవన్నీ మనుషుల్లా ఆలోచించగలవు. వ్యవహరించగలవు. సంభాషణ లను గుర్తించటం, నిర్ణయాలు తీసుకోవటం, విజువల్‌ ‌పర్సెప్షన్‌ ‌లాంటి ఫీచర్లు ఏఐలో ఉన్నాయి. మానవ సహాయం లేకుండానే ఇవి నేర్చుకోగలవు, తర్కించగలవు. గ్రహించగలవు. అడుగడుగునా సమాచారాన్ని సేకరించి విశ్లేషించటం శాస్త్రవేత్తలకు ముఖ్యం. ఒకప్పుడు ఒక ఆర్ట్ ‌వేయాలన్నా, పొలిటికల్‌ ‌కామెంటరీ రాయాలన్నా అది మనుషులకే సాధ్యం. ఇప్పుడలా కాదు. ఏఐ ఆ పనిని సులువుగా చేసేయగలదు. ఏఐతో రూపొందించిన ఒక ఆర్ట్ ‌ను 400,000 డాలర్లకు వేలం వేశారు. అది 2018 నాటి మాట. ఇక రాజకీయ విశ్లేషణలకు కొన్ని పరిమితులున్నాయి. ఆ సాఫ్ట్‌వేర్‌కు ఎంత డేటా బేస్‌లతో యాక్సెస్‌ ఉం‌ది? దానికున్న డేటా పాయింట్స్‌కి ఎంత వెయిట్స్ ఇచ్చారు అనేదాన్ని బట్టి ఆధారపడుతుంది. ఈ వెయిట్స్ ‌పనిచేసేది మనుషులే. వాళ్లకు పక్షపాతం ఉంటుంది. దీనివల్ల వచ్చే అవుట్‌ ‌పుట్‌లోనూ తేడా ఉంటోంది.

కృత్రిమ మేధ ఆధారంగా రూపొందిన చాట్‌ ‌జీపీటీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విదేశాలంత అధికంగా కాకపోయినా, మన దేశంలో టెక్‌ ‌కంపెనీలు, సాఫ్ట్‌వేర్‌ ‌రంగ నిపుణులు చాట్‌ ‌జీపీటీని ఉపయోగించటం ప్రారంభించారు. ఉద్యోగపరంగానే కాదు. వ్యక్తిగత అవసరాలకు కూడా దీనిని ఉపయోగిస్తున్నారు. ‘‘నేను రేపు ఉదయం 7గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ దుబాయ్‌లో ఉంటున్నాను. విహారయాత్ర కోసం. నా టూర్‌ ‌ప్లాన్‌ ‌చేయగలవు. నేను శాకాహారిని’’ అనగానే చాట్‌ ‌జీపీటీ క్షణాల్లో వివరాలు అందిస్తుంది. ఏం చేయాలో అదే సూచనలు చేస్తుంది. ‘‘నాకు ఏఐ గురించి తెలియ చేయగలవు. ఇప్పటి వరకూ ఈ అంశంమీద గొప్ప పుస్తకాల గురించి సమాచారం అందించగలవు’’ అని కోరగానే ఠక్కున సమాధానం వస్తుంది. ఈ కొత్త సాంకేతికత అబ్బురపరుస్తుంది. మంచి వంటకాలు చేసేందుకు, పిల్లలు అసైన్మెంట్లు, హోంవర్కులు పూర్తి చేసేందుకు దీనిని వాడుతున్నారు. అయితే వేగంగా సమాచారం అందుకోవటం వరకూ మెరుగ్గా ఉంది గానీ, దీనిలో కచ్చితత్వం లోపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చాట్‌ ‌జీపీటీ ఇస్తున్న వివరాలు తప్పుగా ఉండటమే కాదు, వివరాలు సరిచూడమని కోరినప్పుడు అది తీవ్రంగా ప్రతిస్పందించటం మరొకటి. ‘‘నువ్వు తికమక పెడుతున్నావు. మంచి యూజర్‌వి కాదు’’ అని తిట్లదండకం అందు కుందట. ఇటువంటి ఫిర్యాదులు ఎక్కువ కావటంతో మైక్రోసాఫ్ట్ ‌చాట్‌ ‌సెషన్‌ను తగ్గించేసిందట. అయితే గూగుల్‌ ‌సహా ప్రసిద్ధ టెక్‌ ‌సంస్థలన్నీ చాట్‌ ‌జీపీటీని అప్లికేషన్‌ ‌రూపొందించి మార్కెట్లోకి వదిలేపనిలో ఉన్నాయి. రాబోయే రోజుల్లో మన నిత్యజీవితంలో అది ఒకటిగా మారే అవకాశం కనిపిస్తోంది.

వైద్యుల అవసరాలను తీర్చేందుకు క్లినికల్‌ ఇం‌టెలిజెన్స్ ఇం‌జన్‌ (‌సీఐఈ) పేరిట ఓ యాప్‌ను అపోలో సంస్థ రూపొందించింది. 100 మంది ఇంజనీర్లు, 40 ఏళ్లపాటు సేకరించిన సమాచారం ఆధారంగా మూడేళ్లపాటు శ్రమించి ఈ యాప్‌ను రూపొందించినట్టు అపోలో ఆస్పత్రుల ఛైర్మన్‌ ‌డాక్టర్‌ ‌ప్రతాపరెడ్డి వెల్లడించారు. ఆయన 90వ జన్మ దినోత్సవం సందర్భంగా దీనిని ప్రారంభించారు. భారతదేశంలోని వైద్యులందరికీ ఇది ఉచితంగా అందుబాటులో ఉంటుంది. వైద్యపరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడు తుంది.

ఇక ఓపెన్‌ ఏఐ ‌రూపొందించిన జీపీటీ-3 (జనరేటివ్‌ ‌ప్రీ ట్రెయిన్డ్ ‌ట్రాన్స్‌ఫార్మర్‌ 3), ‌డీప్‌ ‌లెర్నింగ్‌ను ఉపయోగించుకుని కంటెంట్‌ను రూపొందిస్తుంది. వేలాది డిజిటల్‌ ‌పుస్తకాలను, వికీ పీడియా, సోషల్‌ ‌మీడియా, ఇంటర్నెట్‌ ‌మొత్తాన్ని విశ్లేషించి అది తన సొంత భాషను రూపొందించింది. ఇది చాలా ప్రయోజనకరమైంది. ఎక్కువ సమయాన్ని, వనరులను ఖర్చు చేయవలసిన అవసరం లేకుండా విస్తృతమైన కంటెంట్‌ను రూపొందించటం సాధ్య మవుతుంది.

21వ శతాబ్దంలో భారతదేశంలో రెండు పుష్కలంగా ఉన్నాయి. మొదటిది డేటా. రెండోది టెక్నాలజీ. భారత శాస్త్రరంగాన్ని ఉన్నతస్థానానికి తీసుకెళ్లటానికి రెండింటికీ తగిన శక్తి ఉంది. దత్తాంశ విశ్లేషణ రంగం చాలా వేగంగా పురోగతి సాధిస్తోంది. సమాచారాన్ని ఆలోచనలుగా, విశ్లేషణను కార్యా చరణను అవసరమైన జ్ఞానంగా మార్చటానికి అది ఉపయోగపడుతుంది. అది సాంప్రదాయ జ్ఞానం కావచ్చు. లేదా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు. శాస్త్రీయ నవకల్పనలో రెండూ ఉపయోగ పడతాయి. అందుకే మనం వివిధ అంశాలపట్ల పరిశోధక దృక్పథం పెంచుకోవటం ద్వారా శాస్త్ర పురోగతిని బలోపేతం చేసుకోవాలి.

విధాన నిర్ణయాలపరంగానే కాదు, బడ్జెట్‌ 2023-24 ‌రూపకల్పనలోనూ ఏఐకు కేంద్రం విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకోసం నేషనల్‌ ‌డేటా గవర్నెన్స్ ‌పాలసీ ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఇందులో భాగస్వాములయిన పారిశ్రామికవేత్తలు సాంకేతిక వృద్ధిపైన మాత్రమే కాకుండా, ఆయా సంస్థల్లో ఉన్న నియంత్రణ విధానాలను పట్టించు కోవాలని సూచించింది. దాంతోపాటు విద్యాసంస్థల్లో కోడింగ్‌, ‌రోబోటిక్స్, 3‌డీ ప్రింటింగ్‌ ‌తదితర అంశాలతో కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.

‘‘భారతదేశంలో కృత్రిమమేధను రూపొందిం చండి. అది భారత్‌కు పనికొచ్చేలా చూడండి’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ‌తన బడ్జెట్‌ ‌ప్రసంగంలో ప్రభుత్వ విధానాన్ని ఆవిష్కరించారు. ‘‘వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాల అభివృద్ధికి సంబంధించిన ఆర్‌ అం‌డ్‌ ‌డి చేపట్టటంలో పారిశ్రామిక భాగస్వామ్యం కోరుతున్నాం.’’ అని ఆమె పేర్కొన్నారు. నేషనల్‌ ‌డేటా గవర్నెన్స్ ‌పాలసీతో, దేశవ్యాప్తంగా విస్తృతంగా డేటా అందుబాటులోకి వస్తుంది. పరిశోధనలు ఊపందుకుంటాయని భావిస్తున్నారు. అలాగే ఈ రంగంలో నిపుణులను తయారుచేయటానికి ప్రధానమంత్రి కౌశల్‌ ‌వికాస్‌ ‌యోజన కింద ఉపాధి శిక్షణను ప్రవేశపెడుతున్నారు.

బడ్జెట్లో ఏఐ ఆధారిత ప్రకటనలను పారిశ్రామిక వర్గాలు స్వాగతించాయి. ఇది ఏఐ పర్యావరణ వ్యవస్థను మెరుగుపరుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ‘‘ఏఐ పవర్‌ ‌హౌస్‌గా మారే సామర్థ్యం భారత్‌కు ఉంది. అయితే పశ్చిమదేశాల్లో గ్రాన్యులర్‌ ‌డేటా అధికంగా అందుబాటులో ఉంది. భారత్‌లో డేటా సెట్స్ అం‌దుబాటులో లేకపోవటం పెద్ద కొరత. ప్రభుత్వ ప్రవేశపెట్టిన డేటా పాలసీ విధానంతో తప్పనిసరిగా మెరుగైన డేటా సెట్స్ అం‌దుబాటులోకి వస్తాయి. దాని వల్ల ఏఐ ఆధారిత ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చి పడతాయి’’ అని ఏఐ ఆధారిత అనలిటిక్స్ ‌స్టార్టప్‌ ‌ఫ్రాక్టల్‌ అనలిటిక్స్ ఆసియా పసిఫిక్‌ ‌రీజయన్‌ ‌చీఫ్‌ ‌సందీప్‌ ‌దత్తా అభిప్రాయపడ్డారు.

కొవిడ్‌ ‌మహమ్మారి దాడి చేయక ముందు నుంచే ఏఐ పరంగా దేశంలో కొన్ని అడుగులు పడ్డాయి. తాగునీటి సరఫరా తీరుతెన్నులను పరిశీలించటానికి, నేషనల్‌ ‌హైవే అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా (ఎన్‌హెచ్‌ ఏఐ)‌లో క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరును నమోదు చేయటానికి కృత్రిమమేధను ఉపయోగించారు.

రక్షణ శాఖలో ఏఐ ఆధారిత ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థను నిర్వహిస్తున్నారు. అలాగే విమానా శ్రయాల్లో ప్రయాణికుల రాకపోకలను విశ్లేషిం చేందుకు ‘డిగి యాత్ర’ అని బయోమెట్రిక్‌ ఆధారిత వ్యవస్థను వినియోగిస్తున్నారు. కొవిడ్‌ ‌వెర్చువల్‌ అసిస్టెంట్స్ ‌లోనూ దీనిని ఉపయోగించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, ‌తమిళనాడు, పంజాబ్‌ ‌వంటి రాష్ట్రాలు పెన్షన్‌ ‌లబ్ధిదారుల ప్రయోజనాల కోసం ఏఐ ఆధారిత సేవలను వినియోగిస్తున్నాయి.


సైన్స్ ‌దినోత్సవం అంటే

ఫిబ్రవరి 28వ తేదీని ‘సైన్సు దినోత్సవం’గా జరుపుకుంటాం. భౌతిక శాస్త్రంలో సర్‌ ‌సీవీరామన్‌ ‌చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా ఆ తేదీని జాతీయ సైన్సు దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటిం చింది. అదే రోజున రామన్‌ ఎఫెక్టును ఆయన కనుగొన్నారు.

రామన్‌ ‌తల్లి పార్వతి అమ్మాళ్‌ ‌వీణను అద్భుతంగా వాయించేది. రామన్‌ ‌తొలిపరిశోధనలు వయోలిన్‌, ‌వీణ, మృదంగం లాంటి సంగీత పరికరాలపై సాగారు. సంగీత పరికరాల శబ్దరహస్యాలపై 1921లో లండన్‌లో ఉపన్యాసాలు ఇచ్చారు. ఇలాంటి అంశాలతో రాయల్‌ ‌సొసైటీ సభ్యుడవుతావా అని ఓ వ్యక్తి చులకనగా మాట్లాడటంతో పరిశోధనలపై పట్టుదల పెంచుకున్నారు. శబ్దశాస్త్రం నుంచి కాంతివైపు దృష్టి సారించాడు. ఇంగ్లాండు నుంచి తిరిగొస్తూ ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు ఆకాశం, సముద్రం నీరు రెండూ నీలిరంగులో ఉండటాన్ని ఆసక్తిగా గమనించారు. అప్పటిదాకా అనుకుంటున్నట్టు సముద్రపు నీలిరంగుకు కారణం ఆకాశపు నీలిరంగు ప్రతిబింబం ఏర్పడటం కాదని, సముద్రపు నీటి గుండా కాంతి ప్రవహించేటప్పుడు కాంతి పరిక్షేపణ చెందటమే కారణమని ఊహించారు. కలకత్తా చేరుకోగానే ఈ విషయాలను నిరూపించటానికి ద్రవాలు, వాయువులు, పారదర్శక ఘన పదార్థాల కాంతి పరిక్షేపణం గురించి పరిశోధనలు చేశారు. మార్చి 16, 1928న బెంగుళూరులో నిర్వహించిన శాస్త్రవేత్తల సదస్సులో ‘రామన్‌ ఎఫెక్టు’ గురించి ఆయన వెల్లడించారు. దీనితో బ్రిటిష్‌ ‌ప్రభుత్వం మరుసటి ఏడాది ఆయనను నైట్‌హుడ్‌ ‌బిరుదుతో సత్కరించింది. రామన్‌ ఎఫెక్ట్ అసామాన్యమైందని, కేవలం రూ.200 కూడా విలువలేని పరికరాలతో దృగ్విషయం నిరూపణ జరగటం అద్భుతమని శాస్త్రవేత్తలంతా కొనియాడారు. రాయల్‌ ‌స్వీడిష్‌ అకాడమీ, భౌతిక శాస్త్రానికి 1930లో నోబెల్‌ ‌బహుమతి ప్రదానం చేసింది. సైన్సుకు ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను ప్రకటించింది.


కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఏఐ ఆధారిత డిజిటల్‌ ఇం‌డియా భాషిణి ప్రాజెక్టు’ విశిష్టమైనదని చెప్పాలి. ఇది ప్రభుత్వ వెబ్‌ ‌సైట్లు రూపొందించేందుకు, పౌరుల కేంద్రంగా సేవలు అందించేందుకు ఉపయోగ పడుతుంది. అలాగే డిజిటల్‌ ఇం‌డియా జెనిసెస్‌, ఇం‌డియా స్టాక్‌ ‌గ్లోబల్‌లను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. వీటి ద్వారా సాంకేతికత అందు బాటులోకి వచ్చి మెరుగైన సేవలు అందించటం వీలవుతుంది. డిజిటల్‌ ఇం‌డియా ద్వారా 1.25 లక్షల సర్వీసు సెంటర్లు, గ్రామీణ స్టోర్ల ద్వారా ఈ కామర్స్ అనేది గ్రామీణ భారతంలోకి అడుగుపెట్టింది. సాంకేతికత ద్వారా సులువుగా ఆస్తి డాక్యుమెంట్లు పొందే సౌలభ్యం లభించింది. స్పేస్‌, ‌మ్యాపింగ్‌, ‌డ్రోన్లు, గేమింగ్‌, ‌యానిమేషన్‌ ‌రంగాలలో కూడా డిజిటల్‌ ‌టెక్నాలజీ అనేది కొత్త ద్వారాలు తెరిచింది. ఇండియన్‌ ‌స్పేస్‌ ‌ప్రమోషన్‌ అం‌డ్‌ ఆథరైజేషన్‌ ‌సెంటర్‌ (ఐఎన్‌- ‌స్పేస్‌) ‌రెండు అంతరిక్ష స్టారప్‌లకు అనుమతి ఇచ్చింది. ఇవన్నీ అలా ఉంటే ఇంటర్నెట్‌ ‌నిలిపివేయటం అనేది డిజిటల్‌ ఇం‌డియా లక్ష్యాన్ని దెబ్బతీస్తోంది. 2020లో భారతదేశం ఇంటర్నెట్‌ ‌నిలిపివేయటం వల్ల 2.8 బిలియన్‌ ‌డాలర్లను నష్టపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. జమ్ము, కశ్మీర్‌ ‌లాంటి ప్రాంతాలు దీని ప్రభావానికి ఎక్కువ గురవుతున్నాయి. 2012 నుంచి చూస్తే అక్కడ అలాంటి సందర్భాలు 400 వరకూ ఉన్నట్టు చెబుతున్నారు. కేరళ, గోవా, సిక్కింలు ఇంటర్నెట్‌ ‌నిలిపివేతకు పూర్తి దూరంగా ఉన్న రాష్ట్రాలుగా పేరు తెచ్చుకున్నాయి.

ఇక భారత్‌లో ప్రస్తుతం ఏఐ డొమైన్లో 200 కు పైగా వెంచర్‌ ‌క్యాపిటల్‌తో పనిచేసే స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. క్రోపిన్‌, ‌రేజో, ఏఐ, రిఫ్రేజ్‌, ఏఐల వంటి సంస్థలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇందులో కార్యకలాపాలు సజావుగా, సమర్థంగా సాగటానికి  రిలయన్స్ ఇం‌డస్ట్రీస్‌, ‌టాటా గ్రూపు లాంటి అతిపెద్ద కార్పొరేట్‌ ‌సంస్థలు స్టార్టప్‌లను స్వాధీనం చేసుకోవటమో, పెట్టుబడులు పెట్టటమో లాంటివి చేస్తున్నాయి. అటల్‌ ఇన్నొవేషన్‌ ‌మిషన్‌ ‌విస్తృతశ్రేణిలో ఫీల్డ్‌లలో స్టార్టప్‌ల కోసం ఇంక్యుబేషన్‌ ‌కేంద్రాలను ఏర్పాటు చేసింది.

ఏఐని అన్ని రంగాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నా, ప్రభుత్వం ప్రస్తుతానికి కొన్ని కీలక రంగాలపైన దృష్టిపెడుతోంది. వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, సుస్థిర నగరాలకే పరిమితం అయ్యింది. అలాగే రక్షణ, ఇన్‌‌ఫ్రా రంగాల్లో కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక వ్యవస్థలను ప్రవేశపెట్టవలసిన అవసరాన్ని నిపుణులు సూచిస్తున్నారు. మరో ప్రధాన అంశం ఈ వ్యవస్థలను నియంత్రించటం. సాంకేతికతను అభివృద్ధికి ఎలా వినియోగించు కోవాలో ఈ వ్యవస్థలు చెబుతాయి. అదే సమయంలో దీనిని వినాశనానికి కూడా వినియోగించుకునే పరిస్థితులు ఎదురు కావచ్చు. సాంకేతికత కంటే ముందు, దానిని విధ్వంసానికి, స్వీయప్రయోజనాలకు వ్యవస్థలు గానీ, వ్యక్తులుగానీ వినియోగించుకుండా నియంత్రణ చర్యలు చేపట్టవలసిన బాధ్యత ఉంది. అందుకు చట్టపరమైన విధివిధానాలను రూపొందించాలి. దానితో పాటు నైతికమైన, తక్కువ వినాశకరమైన పరిష్కారాలను సిద్ధం చేసుకోవాలి. డాక్యుమెంట్ల డిజిటలైజేషన్‌, ‌హెవీ మిషనరీ ఆటోమేషన్‌కీ ఏఐని ఉపయోగించుకోవటంపైన దృష్టిసారించాలి. అవొక్కటే కాదు మొత్తం మానవాళికి సంపూర్ణ ప్రయోజనం కలిగించే అంశాలపై శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని ప్రధాని మోదీ కోరుతున్నారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ఇండియన్‌ ‌సైన్సు కాంగ్రెస్‌ ‌సమావేశంలో మాట్లాడుతూ ‘‘వచ్చే 25 ఏళ్లలో భారత్‌ ఉన్నత శిఖరాలను అధిరోహించటంలో శాస్త్రవేత్తల పాత్ర కీలకం. సైన్సులో చొరవ తీసుకున్నవాడే నాయకు డవుతాడు. అందుకే ప్రపంచంలో ఏం జరుగుతోందో గమనించటం ఒక్కటే కాదు. ఎక్కడా జరగనివి. భవిష్యత్తులో జరగబోయేవి ఏమిటో కూడా గుర్తించాలి. కృత్రిమ మేధ, అగ్‌మెంట్‌ ‌రియాలిటీ, వర్చువల్‌ ‌రియాలిటీ మీద ప్రపంచం అంతటా చర్చ సాగుతోంది. శాస్త్రవేత్తల దృష్టంతా ఈ రంగాలపైకి మళ్లాలి. ఈ విషయాలపై దృష్టి పెట్టాలి. ఆధునిక సైన్సుకు అత్యాధునిక ప్రయోగశాలగా భారత్‌ ‌రూపొందాలి’’ అని సూచించారు. సైన్సు కాంగ్రెస్‌తో పాటు పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచటానికి చిల్ట్రన్‌ ‌సైన్సు కాంగ్రెస్‌, ‌బయో ఎకానమీని, వ్యవసాయంలో యువతను ప్రోత్సహించటానికి ఫార్మర్స్ ‌సైన్సు కాంగ్రెస్‌, ‌గిరిజనంలో సాధికారతను పెంచటానికి ట్రైబల్‌ ‌కాంగ్రెస్‌ను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

సైన్సులో అద్భుతమైన సాధనాలు ప్రయోగాల దశ నుంచి అనుభవంలోకి వచ్చినప్పుడే వాటి వల్ల పూర్తి ప్రయోజనాలు సిద్ధిస్తాయి. బయోఫ్యూయల్‌ ఉత్పత్తి చేయటం, విద్యుత్‌ ‌వాహనాలను ప్రోత్సహించటం ద్వారా పునరుత్పాదక ఇంధన రంగంలో అడుగులు పడుతున్నాయి. వ్యవసాయంలో నానోఫెర్టిలైజర్ల వినియోగం, ఆర్గానిక్‌, ‌కెమికల్‌ ‌ఫ్రీ వ్యవసాయం ప్రారంభమైంది.

 ప్రపంచ జనాభాలో 17 నుంచి 18 శాతం మంది భారతదేశంలోనే నివసిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని యువతలో సాంకేతికత పట్ల, సైన్సు పట్ల అభిరుచి పెంచాలి. టాలెంట్స్ ‌హంట్స్, ‌హాకథాన్‌ ఈవెంట్స్ ‌విరివిగా నిర్వహించాలి. వారి పురోభివృద్ధికి అవకాశం లభిస్తుంది. సీనియర్‌ ‌శాస్త్రవేత్తలు, మేధో నిపుణులు చొరవ చూసి ఈ రంగంలో సుశిక్షితులను తయారు చేయాలి. ఈ దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు తరగతి గది నాలుగు గోడల మధ్య కూర్చుని నేర్చుకుంటే ఇప్పటి సాంకేతిక అవసరాలకు తగినట్టు తమను తీర్చిదిద్దుకోలేరు. ముందు ఏ కోర్సులో తాము చేరినా తమ అభిరుచులకు అనుగుణంగా అనుబంధ కోర్సులను ఎంచుకోవాలి. డ్యూయల్‌ ‌డిగ్రీలు, మైనర్లు, స్పెషలైజేషన్ల వంటివి ఎన్నో అందుబాటులో ఉన్నాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా సర్టిఫికేషన్‌ ‌కోర్సులను వారు చేయవచ్చు. ఇండస్ట్రీ, అకాడమీలు, రీసెర్చి ఇన్‌స్టిట్యూట్లు, స్టార్టప్‌లు విద్యార్థి సామర్థ్యానికి పదును పెడతాయి. కేవలం బీటెక్‌ ‌డిగ్రీ పొందినంత మాత్రాన సాంకేతికంగా ప్రతిభావంతుడు కాగలుగుతాడని చెప్పలేం. అలాగే అనుబంధ అంశాల్లో కచ్చితంగా నైపుణ్యం ఉండి తీరవలసిందే.

ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత ప్రజల అవసరాలు తీర్చి వారిని స్వయంసమృద్ధం చేయాలనే లక్ష్యం పైనే మన శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి నవకల్పనలు సాగాలి. ఉదాహరణకు రాబోయే రోజుల్లో ఇంధన అవసరాలు మరింతగా పెరగనున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మన శాస్త్రవేత్తలు ఇంధన అవసరాల మీద కొత్త ఆలోచనలు చేయాలి. హైడ్రోజన్‌ ఇం‌ధనం మీద పనిచేయటానికి భారతదేశం నేషనల్‌ ‌హైడ్రోజన్‌ ‌మిషన్‌ ‌చేపట్టింది. దీన్ని విజయవంతం చేయాలంటే ఎలక్ట్రోలైజర్‌ ‌లాంటి అనేక పరికరాల అవసరం ఉంది. అవి దేశంలోనే తయారు కావాలి. ఈ దిశగా పరిశోధనలు సాగాలి. పారిశ్రామికరంగం కూడా దీనిపై దృష్టి సారించాలి.

అలాగే భూకంపాలు, వరదల వంటి ప్రకృతి విపత్తులను ఎదుర్కోవాలి. దానితో పాటు మానవాళి కొత్త వ్యాధుల భయం మధ్య మనుగడ సాగిస్తోంది. సమీకృత వ్యాధి నిఘా వ్యవస్థ ద్వారా వ్యాధులను సకాలంలో గుర్తించవలసిన అవసరం ఉంది. ఈ అంశాలన్నింటిపైన చొరవ తీసుకున్నప్పుడే దేశం 4.0 కు నాంది పలుకుతుంది. 18వ శతాబ్దం నాటి పారిశ్రామిక విప్లవానికి దూరంగా ఉండిపోయిన భారత్‌, ‌తరువాత ఐటీ రంగంతో ఆ లోటును చాలావరకు పూడ్చుకోగలిగింది. కృత్రిమ మేధతో ఇప్పుడు మరింత ముందుకు సాగే అవకాశం సరైన సమయంలో అందుకుందనే చెప్పాలి.

——————-

About Author

By editor

Twitter
YOUTUBE