‘ఎ హిస్టరీ ఆఫ్‌ ‌హిందూ కెమిస్ట్రీ ఫ్రం ది ఎర్లీయస్ట్ ‌టైమ్స్ ‌టు ది మిడిల్‌ ఆఫ్‌ ‌ది సిక్స్‌టీన్త్ ‌సెంచరీ’-ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, జాతీయవాది ఆచార్య ప్రఫుల్ల చంద్ర రే రాసిన గ్రంథమిది. శాస్త్ర సాంకేతిక రంగాలకు పురాతన భారతదేశం అందించిన సేవ ఏమిటో దీని ద్వారా ఆధునిక ప్రపంచానికి తెలిసింది. నిస్సందేహంగా అదొక సంచలనం.

ప్రఫుల్ల చంద్ర రే (ఆగస్ట్ 2,1861-‌జూన్‌ 16, 1944) ‌రాసిన ఈ ప్రతిష్టాత్మక గ్రంథం రెండు భాగాలుగా వెలువడింది. మొదటి  భాగం 1902లో, 1908లో మలి భాగం అచ్చయినాయి. ఇంతటి చిరస్మరణీయ గ్రంథ రచనకు ఆచార్య పీసీ రేను ప్రోత్సహించినవారు ఆచార్య మార్సెలిన్‌ ‌పీరె యూజిన్‌ ‌బెర్తోల్‌ (1827-1907). ‌తొలి విడత ప్రచురణకు రాసిన ముందుమాటలో పీసీ రే ఈ విషయం ప్రస్తావించారు. ఎం బెర్తోల్‌తో పరిచయం, ఆ సందర్భమే రసాయన శాస్త్ర విద్యార్థిగా తన జీవితాన్ని మలుపు తిప్పిందని రాశారు. ఆ ఫ్రెంచ్‌ ‌శాస్త్రవేత్తకు రసాయన శాస్త్ర ప్రపంచానికి ఆద్యుడన్న ఖ్యాతి ఉంది. పురాతన భారతీయులు రసాయన శాస్త్రానికి చేసిన సేవలను తెలుసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఆయన కోరిక మేరకు పీసీ రే 1898లో ఈ పుస్తకం రాసి ఆయనకు సమర్పించారు. ఆల్కెమి లేదా రసాయన శాస్త్రం మీద అదొక చిన్న పుస్తకం. తరువాత ఇంకొన్ని అంశాలను కూడా రే చేర్చి సమగ్రతను తెచ్చారు. ఈ రచన విశ్వ విజ్ఞానశాస్త్రానికి ఎంతో మేలు చేసిందన్న గుర్తింపు తెచ్చుకుంది. ఎం బెర్తోల్‌ ‌కూడా ‘జర్నల్‌ ‌డెస్‌ ‌సావంట్‌’ ‌మ్యాగజీన్‌లో 15 పేజీల సమీక్ష రాశారు. ప్రపంచంలోనే ఎంతో ఘనత ఉన్న ‘నేచర్‌ అం‌డ్‌ ‌నాలెడ్జ్’ ‌కూడా సమున్నత పరిచయం అందించింది. 1912లో జరిగిన దుర్హమ్‌ ‌విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో వైస్‌ ‌చాన్సలర్‌ ఈ ‌పుస్తకం గురించి చెప్పిన మాటలు చిరస్మరణీయమైనవి. ఈ పుస్తకంలో విజ్ఞానశాస్త్రం ఎంత లోతైనదో, భాష కూడా అంత లోతైనదని, రే కీర్తి దీనితో ఇనుమడిస్తుందని వ్యాఖ్యానించారు. ఇంతటి సమగ్ర కృషి కారణంగానే పీసీ రే అంటే ఆధునిక భారత రసాయన శాస్త్ర పితామహునిగా స్థానం దక్కించుకున్నారు. బెంగాల్‌ ‌కెమికల్‌ అం‌డ్‌ ‌ఫార్మాస్యూటికల్స్ ‌పేరుతో దేశంలోనే తొలి ఫార్మాస్యూటికల్‌ ‌సంస్థను స్థాపించిన వారు కూడా ఆయనే.

‘ది హిస్టరీ ఆఫ్‌ ‌హిందూ కెమిస్ట్రీ’ అని కూడా పిలిచే పీసీ పుస్తకం 20వ శతాబ్దంలో వెలువడిన అత్యంత శ్రేష్టమైన రచనలలో ఒకటిగా పేర్గాంచింది. రసశాస్త్రం పేరుతో మన పూర్వికులు వృద్ధి చేసిన ఈ అంశంలోని సిద్ధాంతాలు, ప్రయోగాలు విశ్వవ్యాప్తంగా చర్చకు దారి తీయడానికి, అనుసరించడానికి ఈ గ్రంథం దోహదం చేసింది. ఆ కాలంలో వచ్చిన ప్రతి అంశాన్ని మాత్రమే కాదు, ఆధునిక ప్రపంచంలో భారతీయులు ఆ శాస్త్రానికి చేసిన సేవల గురించి కూడా పీసీ రే నమోదు చేశారు. లండన్‌కు చెందిన విలియమ్స్ అం‌డ్‌ ‌నోర్గేట్‌ ‌ప్రచురణ సంస్థ దీనిని ముద్రించింది. మన పురాతన రసాయన శాస్త్రానికి మూలాలైన ‘సంస్కృత గ్రంథాలు, ఆ గ్రంథాలలో కనిపించే వైరుధ్యాలు, అనువాదాలు’ అన్న ఉప శీర్షిక కూడా ఉంచారు. అంటే ఇదొక పరిపూర్ణ శాస్త్ర గ్రంథం. మొదటి భాగానికి 79 పేజీల పీఠిక రాశారు. ఆరు ఆధ్యాయాలలో విషయ వివరణ ఉంది. రసవాదంగా ఆనాడు పిలిచిన రసాయన శాస్త్రం గురించి వేదకాలంలో, ఆయుర్వేదంలో ఎలాంటి ప్రస్తావనలు ఉన్నాయో చెప్పడమే కాదు, అరబ్బుల ఈ అంశం మీద చేసిన కృషి, ఐయట్రో కెమికల్‌ ‌కాలం మీద పరిశోధనాత్మక వివరణ ఉంది. రెండో భాగం కూడా ఇవే అంశాలను ఇంకాస్త లోతుగా పరిశీలిస్తుంది.

ఆ గ్రంథంలో ఎలాంటి అంశాలను పొందు పరిచారో విషయ సూచికను బట్టి తెలుసుకుందాం. మొదటి భాగంలో ఆరు ఆధ్యాయాలు కూడా భారతీయ రసాయన శాస్త్రం గురించి పరిచయం చేసేవే. అవి- వేదాలలో రసాయన శాస్త్ర ఆలోచనలు, ఆయుర్వేదం కాలంలో రసాయన శాస్త్రం, పరిణామ దశ, తాంత్రిక కాలపు దశ, ఐయాట్రో కెమికల్‌ (ఔషధాలకు సంబంధించినది) యుగం, భారతీయులకు అరబ్బుల రుణం. తరువాతి భాగంలో ఆయుర్వేద కాలంలో రసాయనిక శాస్త్రం గురించి వెల్లడిస్తుంది. బౌద్ధయుగం నుంచి క్రీస్తుశకం 800 వరకు ఈ గ్రంథం చర్చించింది. పదార్థ ఆవిర్భావం, అణు సిద్ధాంతం, చరకుడు, సుశ్రుతుల రచనలలో రసాయనశాస్త్రం, వాగ్భటుడి రచనలలో రసాయన శాస్త్రం వంటి అధ్యాయాలు ఉన్నాయి. క్రీస్తుశకం 800 నుంచి క్రీస్తుశకం 1100 వరకు సాగిన రసవాద ప్రస్థానం గురించి పరిణామ దశ లేదా సంధియుగం అనే విభాగంలో చర్చించారు. అందు లోని అధ్యాయాలు ఇవి: బృంద లేదా సిద్ధయోగలో రసాయన శాస్త్రం (క్రీస్తుశకం 900), చక్రపాణి రచనలలో రసాయన శాస్త్రం (క్రీస్తుశకం 1060). తరువాతి విభాగం తాంత్రిక యుగపు రసాయన శాస్త్రం (క్రీస్తుశకం 1100 నుంచి క్రీస్తుశకం 1300). రసరత్న సముచ్ఛయంలో రసాయన శాస్త్రం మరొక అంశం. నోట్స్ అన్న శీర్షిక కింద, అపెండైసిస్‌ ‌శీర్షిక కింద వందలాది అంశాలను పరిచయం చేశారు. ముఖ్యంగా లోహాల గురించి విస్తృత పరిచయం ఉంది.

రెండో భాగంలో ఆచార్య నాగార్జున, బౌద్ధ యుగాల నాటి రసాయనశాస్త్రం, దేశీయ రసాయన శాస్త్ర మౌలిక చరిత్ర, కొందరు రసవాదుల గురించి ప్రస్తావించారు పీసీ రే. నవరత్నాలు, స్వర్ణ సింధూర లేదా మకర ధ్వజ, రసహృదయ గ్రంథకర్త భిక్షు గోవిందు కాలం నాటి రసాయన శాస్త్రం గురించి చర్చ ఉంది. ఇంకా సాంఖ్య పతంజలి సిద్ధాంతం, పురాతన భారతదేశ వైద్య విద్యాలయాలలో రసాయన శాస్త్ర పరిచయం, తూనికలు-కొలతలు, బౌద్ధుల, జైనుల కాలం నాటి అణు సిద్ధాంతం, న్యాయ వైశేషికంలోని రసాయన సిద్ధాంతం, ఇంకా రసరత్న సముచ్ఛయ రచనాకాలం వంటివన్నీ కూడా ఉన్నాయి. ఆధునిక రసాయన శాస్త్రం యావత్తు పాశ్చాత్య శాస్త్రవేత్తల ఆవిష్కరణల ఫలితమేనన్న అతి పెద్ద భ్రమను పటాపంచలు చేసిన గ్రంథంగా కూడా దీనికి పేరు ఉంది. ఈ శాస్త్రాన్ని అరబ్బుల నుంచి తాము నేర్చుకున్నామని కొందరు పాశ్చాత్య శాస్త్రవేత్తలు చెప్పడం ఎంత అసందర్భమో కూడా ఆయన వివరించారు. అరబ్బుల రసాయన శాస్త్రానికి మూలం భారతదేశమేనని రూఢిగా చెప్పారు.

లోహాల మీద పురాతన భారతదేశానికి ఉన్న పరిచయం కూడా ఈ పుస్తకంలో ఉంది. ఉక్కును కరిగించడం, కావలసిన విధంగా మలుచుకోవడం అనే కళ భారతదేశంలోనే మొదలయింది. డెమాస్కస్‌ ‌బ్లేడ్స్ ‌పేరుతో ఉన్న కత్తులు ఇక్కడ తయారైనవే. రసార్ణవంలో ఇచ్చిన కొన్ని విశ్లేషణలను కూడా రే తన పుస్తకంలో పొందుపరిచారు. ఏ లోహాన్ని మంటలో ఉంచితే ఏ రంగు మంట వస్తుందో ఆనాటి భారతీయులు నమోదు చేశారు. రాగి కాలిస్తే నీలిరంగ మంట వస్తుంది. ఇది దాని నాణ్యతను తెలియచేస్తుంది. ఇలాంటి పరిశోధనాత్మక దృష్టి ఇప్పుడు లేదని తేల్చారాయన. పూర్వికులకు పొటాషియం కార్బొనేట్‌కీ, సోడియం కార్బొనేట్‌కి తేడా తెలియదని అన్నారు, సర్‌ ‌హంప్రి డేవి అనే శాస్త్రవేత్త. కానీ సుశ్రుతుని గ్రంథం సుశ్రుత సంహితలో కనిపించే యావక క్షార పొటాషియం కార్బొనేట్‌ అని, సర్జికక్షార అంటే సోడియం కార్బొనేట్‌ అని నిరూపించారు పీసీ రే. ఇదే కాకుండా మృదు క్షార అనే మరొక కార్బనేట్‌ ‌పేరు కూడా ఆయన ప్రస్తావించారు. కానీ వీటి మధ్య తేడాల గురించి సుశ్రుతుడు పేర్కొనలేదు. సుశ్రుతుడు, చరకుడు రాసిన గ్రంథాలు, అందులో ఆయుర్వేదం ప్రకారం సూచించిన ఔషధాల గురించి పీసీ రే పరిశోధించడం మొదలు పెట్టి, దేశదేశాల వైద్య విధానాలు, ఔషధాల సేవనం గురించి విస్తృతంగా అధ్యయనం చేశారు. అలా ఆయన రసాయన శాస్త్రంలో తలమున్కలయ్యారు.

భారతీయ పురాతన శాస్త్రాలను అర్ధం చేసుకోవడానికి, వాటిని విశ్లేషించడానికి కావలసినది సంస్కృతంతో పరిచయం. పీసీ రే తన పుస్తకం కోసం 14 సంస్కృత గ్రంథాల నుంచి ఆధారాలు సేకరించారు. అవి- రసరత్నాకరం, రసహృదయం, కాకచండీశ్వరి తంత్రం, రసేంద్ర చూడామణి, రసకల్ప, రసరాజలక్ష్మి, రసప్రకాశం, రస నక్షత్ర మాలిక, రసరత్నాకర సుధాకర, నిత్యనాథుడి రసరత్నాకరం, ధాతురత్నమాట, రసప్రదీప, ధాతుక్రియ, స్వర్ణతంత్ర.

నిజానికి ఇది ఆంగ్లంలో రాసిన పుస్తకం. కవితాత్మకంగా, బలమైన ఆంగ్ల భాషా వ్యక్తీకరణలతో ఇది సాగుతుంది. అందుకే సాధారణ విద్యార్థికి దీనిని అర్ధం చేసుకోవడం కొంచెం కష్టమనే వాదన ఉంది. రసాయన శాస్త్రంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన శాస్త్రవేత్తలు బెర్తోల్‌, ‌బ్లూమ్‌ఫీల్డ్, ‌కోల్‌‌బ్రూక్‌, ‌గోబ్లెట్‌, ‌వంటి వారి పరిశోధనా వ్యాసాల నుంచి, గ్రంథాల నుంచి పీసీ రే తన గ్రంథంలో ఉల్లేఖించారు. గొప్ప జాతీయవాది కాబట్టి బ్రిటిష్‌ ‌యుగంలో భారతీయ శాస్త్ర గ్రంథాల పట్ల చూపిన వివక్ష గురించి పీసీ రే చర్చించారు. నిజానికి భారతదేశం క్రమంగా తనదైన పురాతన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానానికి ఎందుకు దూరమైందో, అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటో కూడా రే ఈ గ్రంథంలో చర్చించారు. తనదైన మార్గంలో ఆయన స్వాతంత్య్రం కోసం తపించారు కూడా. విజ్ఞానశాస్త్ర అధ్యయనాన్ని వాయిదా వేయవచ్చు, కానీ స్వాతంత్య్రాన్ని కాదు అన్నారాయన. దేశీయులు కావచ్చు, విదేశీయులు కావచ్చు, తెలిసీ తెలియని సంస్కృతంతో చేసిన అనువాదాలలో ఎంత ఘోరమైన తప్పిదాలు దొర్లాయో కూడా పీసీ రే వివరించారు.

పీసీ రే జీవితమంతా ప్రయోగశాలలలోనే గడిచింది. కానీ ఆయన చింతన మాత్రం వాటికే పరిమితమైనది కాదు. ఆయన ఆలోచలన్నీ చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు మధ్య వాస్తవికంగా నడక సాగించాయి. తన జీవిత చరిత్ర ‘లైఫ్‌ అం‌డ్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌ ఆఫ్‌ ఎ ‌బెంగాలీ కెమిస్ట్’‌లో ‘యూరప్‌, అమెరికా దేశాలు పారిశ్రామికరంగంలో సాధించిన శిఖరాయమానమైన వృద్ధి ప్రయోగశాలలో జరిగిన పరిశోధనలు, వాటిలో పొందిన ఘన విజయాల వల్లనే సాధ్యమైంద’ని అన్నారు.

ఫ్రెంచ్‌ ఆచార్యుడు, శాస్త్రవేత్త బెర్తోల్‌ ‌కోరిన మీదట ఒక చిరు గ్రంథం రాసి ఇచ్చినప్పటికి తరువాత దాని మీద విస్తృత పరిశోధన చేశారు రే. ఆ పుస్తకం ప్రధానంగా రసేంద్ర సంగ్రహం అనే పురాతన గ్రంథం ఆధారంగా రాశారాయన. తరువాత ఈ పరిశోధనను మరింత ఉధృతం చేశారు. పండిట్‌ ‌నవకాంత్‌ ‌కవిభూషణ్‌ ఆయనకు సహకరించారు. కానీ ఆ కాలంలో సక్రమ నిర్వహణకు నోచుకున్న గ్రంథాలయాలు కూడా తక్కువే. మద్రాస్‌, ‌తంజావూరు, ఉల్వార్‌, ‌కశ్మీర్‌, ‌బెనారస్‌, ‌కట్మాండు, టిబెట్‌ ‌వంటి చోట ఉన్న గ్రంథాలలో ఉన్న లిఖిత ప్రతులు చిమ్మెటలు కొట్టేసి ఉండేవి. ఈ వాతావరణంలోనే ఆయన ఐదేళ్లు శ్రమించి మొదటి భాగం తీసుకువచ్చారు. అయితే ఆ సమయంలో మళ్లీ రసాయన శాస్త్రంలో తన బోధన, పరిశోధన (ప్రెసిడెన్సీ కాలేజీ) ఆపలేదు. లండన్‌ ‌నుంచి వెలువడే జర్నల్‌ ఆఫ్‌ ‌ది కెమికల్‌ ‌రిసెర్చ్‌లో 12 పరిశోధక పత్రాలను కూడా ప్రచురించారు. గ్రంథయానికీ, ప్రయోగ శాలకీ మధ్య సమతౌల్యం పాటిస్తూ ఈ అసాధరణ రచన చేశారాయన. అయినా దీని ప్రభావం కొంత కనిపించింది. రసాయన శాస్త్రంలో వచ్చిన ఆధునిక ఆవిష్కరణలకు ఆయన కొంచెం దూరమయ్యారు. అలాగే అధ్యయనంలో కూడా కొంత వెనుక బడ్డారు. దీనితో కొంత కాలం మళ్లీ రసాయన శాస్త్ర అధ్యయనం కోసం పాటుపడ్డారు. అందుకే రెండు భాగాల మధ్య అంత దూరం కనిపిస్తుంది.

ఈ పుస్తక రచనతోనే తన కృషిని ఆపేయకుండా ఆచార్య రే పురాతన రసాయన శాస్త్రం గురించి ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు. భారతీయ రసాయన శాస్త్రంలో పురాతనత్వం, పురాతన భారతదేశంలో రసాయన శాస్త్రం వంటి పేర్లతో ఆ ఉపన్యాసాలు ఇచ్చారు.

మన చరిత్ర రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక అంశాలకే పరిమితం చేయలేం. శాస్త్ర సాంకేతికాంశాలలో కూడా భారతీయులకు ఎంతో చరిత్ర ఉంది. దానిని కూడా అధ్యయనం చేయవలసి ఉంటుంది. చరిత్రను ఏ కోణం నుంచి అధ్యయనం చేసినా గర్వపడడంతో సరిపెట్టలేం. దాని నుంచి నేర్చుకోవాలి. దాని ద్వారా భవిష్యత్తును నిర్దేశించుకోవాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి శాస్త్ర సాంకేతిక చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం. అవన్నీ ఇప్పటి ప్రపంచానికి ఉపయోగపడతాయో లేదో పరిశీలించవలసి ఉంది. అలాంటి ప్రయత్నం జరుగుతున్నది. మన పురాతన శాస్త్రవేత్తలు చేసిన చాలా ప్రతిపాదనలు వాస్తవమేనని తేలింది కూడా. కాబట్టి అన్ని రకాల చరిత్రతో పాటు శాస్త్ర సాంకేతికాంశాల చరిత్రను కూడా అధ్యయనం చేయాలి.

About Author

By editor

Twitter
YOUTUBE