శాలివాహన 1944 శ్రీ శుభకృత్ వైశాఖ అమావాస్య – 20 ఫిబ్రవరి 2023, సోమవారం
అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ – బృహదారణ్యకోపనిషత్
———————————————————————-
తెలుగు నేలకు గెరిల్లా పోరాటాన్ని పరిచయం చేసిన అల్లూరి సీతారామరాజు గాథ, బ్రిటిష్ జాతిని సాగనంపాలన్న ఆశయంతోనే ఒడిశా గడ్డ మీద ఉద్యమించిన బక్షి జగబంధు బిద్యాధర మహాపాత్రా వంటి వారి చరిత్ర భారతదేశం మొత్తానికి తెలియవలసి ఉన్నదా? లేదా? కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫిబ్రవరి 13న లోక్‌సభలో సంధించిన ప్రశ్న ఇది. ఇంతవరకు అలాంటి మహనీయుల చరిత్రలను దేశం మొత్తానికి అందించే ప్రయత్నం జరగలేదన్నది నిజమే. కొందరినే, కొన్ని కుటుంబాలనే దేశభక్తి అనే పల్లకీలో మోస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడిచిపోయిన తరువాత చరిత్ర రచనకు సంబంధించి ఇలాంటి అవాంఛనీయ ముగింపునకు రావడం విషాదకరమే. కానీ తమ ప్రభుత్వం ‘చరిత్ర రచనలో కనిపిస్తున్న ఇలాంటి శూన్యభాగాలను పూరించే పని’ స్వీకరించిందని మంత్రి సభ్యులకు తెలియచేశారు. శుభం.
ఇది చరిత్రాత్మక ప్రకటన. దేశం మొత్తం తెలుసుకోవలసిన వార్త (ఫిబ్రవరి 14, ది హిందు) కూడా. మంత్రి జవాబు చాలామందికి సంతోషం కలిగించేదే. చరిత్ర రచన అన్న అంశం పార్లమెంట్ వరకు వెళ్లడం కీలక పరిణామమే. భారతీయులకు చరిత్ర పట్ల శ్రద్ధ, స్పృహ స్వల్పమేనన్న చేదునిజాన్ని ఇప్పటికైనా గుర్తించడం మొదలయిందని ఈ పరిణామంతో అనుకోవచ్చు. అసలు ప్రశ్న-కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో పనిచేసే భారత చరిత్ర పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్) చరిత్రను తిరగరాస్తుందా? అందుకు మంత్రి ఆచితూచి సమాధానం ఇచ్చారు. అయినా ఆ జవాబు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆశయానికి అద్దం పట్టేదే. కేంద్రం ఆశయం చరిత్రను విస్తరించడమేనని మంత్రి వివరించారు. ఎందుకు విస్తరించవలసి వచ్చిందో చక్కగా విశ్లేషించారు. ఆ సందర్భంలో తెచ్చినదే అల్లూరి, బక్షిల ప్రస్తావన. చరిత్ర విస్తరణ అంటే-చరిత్ర పుటలకు చేరకుండా మరుగునపడిన వ్యక్తులకూ, ఘట్టాలకూ చోటు కల్పించడమే. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వచ్చిన ఒక అంశం గురించి కూడా మంత్రి సభ్యులకు తెలియచేశారు. అది కూడా మరుగున పడిన మహోన్నత ఘట్టమే. ఈ మధ్య మోదీ మాన్‌గఢ్ ధామ్ దగ్గర పర్యటించారు. గోవింద్ గురు అనే గిరిజన నేత నాయకత్వంలో బ్రిటిష్ ప్రభుత్వం మీద పోరాడిన నేల అది. 1913లో జరిగిన ఆ పోరాటంలో 1500 మంది గిరిజనులను బ్రిటిష్ అధికారులు చంపారు. స్వామి శ్రద్ధానంద వంటివారి లెక్కల ప్రకారం జలియన్‌వాలా బాగ్ దురంతంలో మృతులు దాదాపు 1100. బాగ్ రక్తపాతం కదిలించిన తీరులో మాన్‌గఢ్ ధామ్ ఊచకోత స్వతంత్ర భారత చరిత్రకారులనో, ప్రభుత్వ పెద్దలనో ఎందుకు కదిలించలేదు? ఇది త్యాగం పట్ల చూపించిన వివక్ష అని ఎవరైనా అంటే వారికి ఉలుకెందుకు? బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుకోమంటున్నది ఇలాంటి లోటుపాట్లనే.
మంత్రి లోక్‌సభ సాక్షిగా చెప్పిన మరికొన్ని అంశాలను కూడా దేశం గుర్తించాలి. ఈ ప్రభుత్వం చరిత్ర మొత్తాన్ని ఒకే నేలకు సంబంధించిన గతంగా, బాధగా, పోరాటంగా నమోదు చేసుకోవడమనే విశ్వసిస్తున్నది. అంతేతప్ప ఉత్తర భారత ప్రాంత అణచివేత, వారి బాధ; దక్షిణ దేశ విషాదం, వారి దుఃఖం అంటూ వేర్వేరుగా చూడడం లేదని అన్నారాయన. ఈ చరిత్ర అంతా ఒకే నేల మీద నివసించిన, ఒకే ప్రాంత ప్రజల గతంగానే చరిత్రపుటలలో కనిపించాలన్నది ప్రభుత్వ భావన. చరిత్ర అంటే దేశం మొత్తానిది అన్న భావనను ఛిద్రం చేస్తున్నవే చరిత్ర రచనలో వచ్చిన శూన్యాలు. కాబట్టి వాటిని పూరించడం అనివార్యం. అప్పుడే ఒక సమగ్ర చరిత్రనూ, అన్ని వర్గాల త్యాగాలకు అద్దం పట్టే చరిత్రనూ, అన్ని ప్రాంతాల ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించే చరిత్రనూ రచించుకోవలసిందే.
సంస్కృతి, భాష కూడా చరిత్రను నిర్దేశిస్తాయి. ఈ దేశంలో అత్యంత పురాతన భాష తమిళమేనని ప్రభుత్వం నమ్ముతున్నదని మంత్రి వెల్లడించారు. ఉత్తర భారతంలోని పురాతన పుణ్యక్షేత్రం కాశీలో తమిళ సంగమం ఏర్పాటు చేయడం ఉద్దేశం కూడా ఇదేనని అన్నారు. అన్ని సంస్కృతులను మా ప్రభుత్వం సమంగా గౌరవిస్తుంది. అన్ని భాషలను ఒకే విధంగా సమ్మానిస్తుందని కూడా ఆయన ప్రకటించారు. ఇక దీని మీద చర్చ ఎందుకు అని మంత్రి ప్రశ్నించడం సరైనదే.
ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు దేశం గతం మీద సమగ్ర దృక్పథాన్ని కలిగించడానికి దోహదం చేస్తున్నాయి. సమగ్ర చరిత్ర అనగానే కాషాయీకరణకు కుట్ర అంటూ, సంస్కృతి రక్షణ అంటే హిందూత్వ అంటూ బుసలు కొట్టేవారికి మంత్రి ఇచ్చిన జవాబు కనువిప్పు కలిగించే విధంగానే ఉంది. వారి దృష్టిలో ఏది చరిత్ర? హిందూ దేవాలయాల శిథిలాలలో, మతం మారినా మారని భారతీయుల ఇంటి పేర్లలలో కనిపించే ఒక కాలపు మతోన్మాదాన్నీ, దాని రక్తదాహాన్ని మరుగుపరచడమే. పైగా అలా మరుగు పరిచిన చరిత్రతో దేశంలో సుహృద్భావం వెల్లువెత్తుతుందని చెప్పడం మరొక దగా. భారతదేశ గతమంతా ఢిల్లీ కేంద్రంగానే తిరిగిందనుకోవడం అసమగ్రదృష్టి. ఈ వాదం చరిత్ర రచనలో దక్షిణ భారత ప్రాంతానికి అన్యాయం జరిగిందనే అభిప్రాయానికి కూడా తావిచ్చింది. ఉత్తరాదిన, దక్షిణాదిన కూడా యావద్భారతావనిని ఏలిన వంశాలు వెలిశాయి. కానీ ఈ వాస్తవం విస్మృతికి గురౌతున్నది. మనం గతం, మన పూర్వికులు భారతదేశాన్ని ఏ కోణం నుంచి కూడా ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం అంటూ వేర్వేరు ముక్కలుగా చూడలేదన్న దృష్టి మాత్రమే, మనం వేర్వేరు కాదు అన్న భావన నేటితరంలోను అంకురింప చేస్తుంది. కల్హణుని సాక్షిగా అలాంటి శూన్యాల పూరించే పనితోనైనా భారతచరిత్ర సమగ్రమవుతుందని ఆశిద్దాం.