– మిత్ర
అస్సాంలో ఏం జరుగుతోంది? పెద్దసంఖ్యలో అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి? బాల్య వివాహాల కారణంతో అరెస్టులు చేస్తారా? ఇదంతా ఒక మతం వారినే లక్ష్యంగా చేసుకుని చేస్తున్నారా? ఇటీవల దేశమంతా జరుగుతోన్న చర్చ ఇది. ఇది తమ ‘పర్సనల్ లా’కు వ్యతిరేకం అని కొందరు వాదిస్తున్నా.. బాలికల భవిష్యత్తును కాపాడే దిశగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ అభినందించా ల్సిందే. బాల్య వివాహాలను అరికట్టేందుకు తీవ్ర చర్యలు తీసుకోవాలని అస్సాం రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించిన నేపథ్యంలో ఈ సాంఘిక దురాచారానికి వ్యతిరేకంగా వెంటనే కార్యాచరణ మొదలైంది. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు.. 10 రోజుల్లో 3,015 మంది అరెస్టు చేశారు. 4,074 కేసులు నమోదయ్యాయి. ఇంకా అరెస్టు చేయాల్సిన వారు 8000 మందికి పైగా ఉన్నారు.
అస్సాం ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు కలకలం సృష్టించాయి. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రభుత్వం కొత్తగా ఎలాంటి చట్టాలను తీసుకురాలేదు. ఇప్పటికే అమలులో ఉన్న చట్టాల ప్రకారం చర్యలను వేగవంతం చేసింది. రాష్ట్రంలో మాతా, శిశు మరణాలను తగ్గించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది కూడా. 14 నుంచి 18 ఏళ్ల లోపు బాలికలను వివాహం చేసుకున్న వారిని బాల్యవివాహాల నిరోధక చట్టం కింద; 14 ఏళ్ల లోపు వారిని పెళ్లి చేసుకుంటే పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలను అరికట్టేందుకు పంచాయతీలో బాల్య వివాహాల నిరోధక అధికారిని కూడా నియమించింది. రాష్ట్రంలో దాదాపు 31 శాతం వివాహాలు తక్కువ వయసులోనే జరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. వీటిని అరికట్టకపోతే పరిస్థితులు దారుణంగా మారే అవకాశం ఉంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్)పై రాష్ట్ర మంత్రివర్గం సవివరంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
బాల్యవివాహం చేసుకున్నవారితో పాటు వివాహం చేపిన పురోహితులు, ఖాజీలను వివాహాన్ని ప్రోత్సహించిన వారిని కూడా అరెస్టు చేస్తున్నారు. బాలికల తల్లిదండ్రులకు మాత్రం నోటీసులు జారీచేస్తామని పోలీసులు వెల్లడించారు. గత కొంతకాలంగా అస్సాంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. రానున్న రెండు మూడేళ్లలో రాష్ట్రంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని డీజీపీ జీపీ సింగ్ తెలిపారు. బాల్య వివాహాలకు పాల్పడినందుకు అరెస్టయిన విదేశీయుల కోసం అస్సాం ప్రభుత్వం రెండు డిటెన్షన్ కేంద్రాలను తాత్కాలిక జైళ్లుగా మార్చినట్లు అధికారులు తెలిపారు. గోల్‌పరా జిల్లాలోని మాటియా ట్రాన్సిట్ క్యాంప్, కాచర్ జిల్లాలోని నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్, ఆర్ అండ్ డి ఇన్‌ఫాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ప్రాంగణం ఇందుకోసం ఉపయోగిస్తున్నారు.
చట్టం ఏం చెబుతోంది?
స్వాతంత్య్రం రాక ముందే మన దేశంలో బాల్య వివాహాల నిరోధక చట్టం అమల్లో ఉంది. దాని ప్రకారం వివాహానికి చట్టబద్ధమైన వయస్సు అబ్బాయి లకు 18 ఏళ్లు. అమ్మాయిలకు 14 ఏళ్లు. ఈ చట్టాన్ని 1978లో సవరించారు. వివాహ వయస్సును అబ్బాయిలకు 21 సంవత్సరాలు, బాలికలకు 18 ఏళ్లకు పెంచారు. 2006లో మళ్లీ సవరణ చేసి బాల్య వివాహాన్ని నాన్ బెయిలబుల్ నేరంగా పరిగణించారు. ఈ చట్టం ప్రకారం మైనర్‌ను వివాహం చేసుకున్న వ్యక్తికి రెండేళ్ల వరకు జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించనున్నారు. అంతేకాదు, ఆ వివాహం కూడా చెల్లుబాటు కాదని కోర్టు ప్రకటిం చింది. 2012లో లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ కోసం పోక్సో చట్టం తీసుకువచ్చారు. ఇది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బా యిలు, బాలికలకు వర్తిస్తుంది. ఈ చట్టాన్ని కూడా 2019లో సవరించి, దోషులకు మరణశిక్షను కూడా జోడించారు. ఈ చట్టం ప్రకారం 7 ఏళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.
అస్సాంలోనే ఎందుకిలా?
సాధారణంగా సగటు అస్సామీ చట్టప్రకారం 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేసుకుంటారు. ఎక్కువగా 25-30 ఏళ్ల వయసులో పెళ్లిళ్లు అవుతుం టాయి. వీరు ఇద్దరు లేదా ముగ్గురిని కంటున్నారు. కానీ సరిహద్దు జిల్లాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన కుటుంబాల వారు 13-14 ఏళ్లకే వివాహాలు చేస్తున్నారు. వీరు కనీసం 5-6 మందిని కనేస్తున్నారు. ఈ ప్రభావంతో అస్సాంలో కొన్ని దశాబ్దాలుగా భౌగోళిక జనసాంద్రత పెరిగి పోతోంది. ఇప్పటికే స్థానిక అస్సామీల జనాభా కన్నా వలస వచ్చిన వారి సంతతే ఎక్కువగా ఉంది. సాంస్కృతి కంగా రాష్ట్రానికి ఇది ఆందోళన కలిగించే పరిణామం.
బాల్య వివాహాలు ఎక్కువగా ఎగువ, దిగువ-మధ్య అస్సాం జిల్లాల్లో జరుగుతున్నట్లు గుర్తించారు. ధుబ్రి, నాగావ్, మోరిగావ్, హోజాయ్, ఉదల్గురి, ధేమాజీ, మజులి, శివసాగర్ జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్ వలసదారులు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఈ ప్రాంతంలో 2,278 మంది నిందితులను అరెస్టు చేశారు. అత్యధి కంగా ధుబ్రి జిల్లాలో 374 మందిని అరెస్టు చేయగా, హోజాయ్ జిల్లాలో 255 మంది, మోరిగావ్‌లో 224 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. గౌహతి పోలీస్ కమిషన రేట్‌లో 192 కేసులు నమోదయ్యాయి. అరెస్టులు మొదలైన తరవాత దక్షిణ అస్సాంలోని బరాక్ వ్యాలీ ప్రాంతాల్లో వందకు పైగా బాల్య వివాహాలు రద్దు లేదా వాయిదా పడ్డాయి.
విమర్శలెందుకు?
అస్సాం ప్రభుత్వం చేపట్టిన చర్యలు సహజంగానే కొన్ని వర్గాల్లో ఆందోళన కలిగించాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు మొదల య్యాయి. పోలీసు స్టేషన్ల ముందు మహిళలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. తమ భర్తలను, కుమారులను అరెస్టు చేస్తే ఎలా జీవించాలని.. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని ఈ చట్టాన్ని అమలు చేస్తున్నారని అస్సాంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయుడు భూపేన్ కుమార్ బోరా, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన రిపున్ బోరా ఆరోపిం చారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. అరెస్టయిన వారిలో ఎక్కవ మంది ముస్లింలే ఉన్నారని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్, ధుబ్రి ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ ఆరోపించారు. బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన ముస్లింలకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అస్సాం ప్రభుత్వ చర్యలను తప్పుపట్టిన వారిలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. ఒవైసీ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్న హైదరాబాద్ పాతబస్తీలో బాల్య వివాహాలపై ఆయన పెద్దగా నోరు మెదపరు. ఇక్కడ ఎంతో మంది బాలికలను గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వృద్ధ షేక్‌లు నిఖా చేసుకుని తీసుకెళ్తున్నారు. అక్కడ పనిమనుషులుగా, సెక్స్ వర్కర్‌లుగా మారుస్తు న్నారు. కానీ ఇవేమీ ఒవైసీకి పట్టవు. అరెస్టయిన వారిలో 58% మంది మాత్రమే ముస్లింలు ఉన్నారని ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలను ముఖ్య మంత్రి హిమంత బిశ్వశర్మ తిప్పికొట్టారు. దీనిని రాజకీయం చేయొద్దని, కేవలం బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్న చర్యలుగా భావించాలని విపక్షాలను కోరారు.
పర్సనల్ లా చెల్లుతుందా?
అస్సాంలో బాల్యవివాహాలకు వ్యతిరేకంగా చేపట్టిన చర్యలను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ఈ సంస్థ సభ్యులు లక్నోలో అత్యవసరంగా సమావేశ మయ్యారు. ముస్లిం పర్సనల్ లా ప్రకారం బాలికల కనీస వివాహ వయస్సు 15 సంవత్సరాలని, ముస్లిం బాలిక 15 ఏళ్లు నిండిన తర్వాత తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చని వారు చెబుతున్నారు. పంజాబ్, హర్యానా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు గురించి కూడా పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ తీర్పు ప్రకారం బాల్యవివాహాలపై తాజాగా వేసే కేసులో పార్టీగా మారాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు విజ్ఞప్తి చేస్తుందని సీనియర్ న్యాయ వాది ఒకరు తెలియజేశారు. అయితే, హైకోర్టు నాటి తీర్పును జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సాధారణంగా పర్సనల్ లా, క్రిమినల్ లా మధ్య ఘర్షణ ఏర్పడి నప్పుడు క్రిమినల్ లానే చెల్లుబాటు అవుతుందని న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు.
ప్రత్యేక కమిటీ ఏర్పాటు
బాల్య వివాహ బాధితుల పునరావాసం కోసం అస్సాం ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు క్యాబినెట్ మంత్రులను ఇందుకోసం నియమించి 15 రోజుల్లో ముసాయి దాను ఖరారు చేయాలని ఆదేశించారు. బలవంతపు బాల్యవివాహాల బాధితులకు పరిహారం చెల్లించే విధానాన్ని ఖరారు చేయనున్నారు. ఇప్పటికే కేసులను అధ్యయనం చేస్తున్నామన్నారు. బలవంతంగా పెళ్లి చేసుకున్న మైనర్ బాలికలకు పునరావాసం ఎలా కల్పించాలి? అనే అంశంపైనా దృష్టి సారిస్తున్నారు.
ప్రమాదకరంగా గర్భధారణ రేటు
అస్సాం బాలికల్లో గర్భధారణ రేటు ప్రమాద కరంగా ఉంది. ఇది 2022లో 16.8% నమోదైంది. ఆ సంవత్సరం రాష్ట్రంలో 6,20,867 మంది బాలికలు గర్భం దాల్చారు. ఇందులో 1,04,264 మంది బాలికలు తల్లులయ్యారు. ఇందులో బార్పేట జిల్లా 28.7%తో అగ్రస్థానంలో ఉంది. ధుబ్రి, దక్షిణ సల్మారా 27.9%, గోల్‌పరా 24.1% తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ధుబ్రి, దక్షిణ సల్మారా జిల్లాలో 51,831 కేసులు నమోదయ్యాయి. ఇది ఒకరకంగా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. వారిలో చాలా మంది చివరి బిడ్డను కన్నప్పుడు మొదటి బిడ్డ వయస్సు తొమ్మిదేళ్లు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఊహించవచ్చు. చిన్నవయస్స లోనే బాలికలు గర్భం దాల్చితే వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. నిర్ణీత వయస్సు కంటే ముందు పిల్లలు పుట్టినా లేదా ఆలస్యంగా జన్మించినా రకరకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్ల పిల్లలు జన్యుపరమైన లోపాలతో పుడుతున్నారని రాష్ట్రం ప్రభుత్వం తెలిపింది. బాల్యవివాహాలను నిర్మూలించ డానికి రాష్ట్ర ప్రజలు సహకరించాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ కోరారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రజా రోగ్యం, సంక్షేమం కోసమేనని స్పష్టం చేశారు.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్