– రాంమాధవ్‌, అఖిల భారత కార్యకారిణి సదస్యులు, ఆర్‌ఎస్‌ఎస్‌

ఇదేమీ కొత్త విషయం కాదు, పాత కథే. లద్ధాఖ్‌ ‌నుంచి అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌వరకు భారత సరిహద్దుల్లో చిచ్చుపెట్టేందుకు చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే ఇటీవల యాంగ్‌ట్సీ వద్ద జరిగిన సంఘటనలో ఒక కొత్తదనం ఉంది. ఇంతకు ముందుకు భిన్నంగా భారత బలగాలు సంసిద్ధతతో చైనా సైనికుల దురాక్రమణ ప్రయత్నాలు తిప్పికొట్టాయి. అదే ఈ పాత కథలో కొత్త మలుపు.

గతేడాది డిసెంబర్‌ 9‌న అరుణాచల్‌‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ ‌సమీపంలోని యాంగ్‌ట్సీ వద్ద జరిగిన ఘర్షణను వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)వద్ద చైనాతో వ్యవహరించడంలో భారతదేశానికి ‘ఇటీవలి సంప్రదాయం’ అని చాలా మంది పేర్కొన్నారు. అయితే ఇది నిజంగా, ఇటీవలి సంప్రదాయమా? అంటే కాదు. ఎల్‌ఏసీ పొడుగునా, పశ్చిమ, మధ్య, తూర్పు మూడు సెక్టార్లలో చైనా ఎప్పటికప్పుడు విషం చిమ్ముతూనే ఉంది. కవ్వింపు చర్యలు, కుయుక్తులకు పాల్పడుతూనే ఉంది. ఈ కుట్రలు, కుయుక్తులు, కవ్వింపు చర్యలకు చుక్క పెట్టేందుకు, ‘సరిహద్దు యాజమాన్య బృందం’ (బోర్డర్‌ ‌మేనేజిమెంట్‌ ‌గ్రూప్‌) ఒకటి రెండు కాదు, ఏకంగా 25 మార్లు చర్చలు జరిపింది. అయినా, కుక్కతోక వంకర అన్నట్లు ఫలితం శూన్యం. నిజానికి, చైనీస్‌ ‌పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) 2015‌లో 400 సార్లకు పైగా సరిహద్దు ఉల్లంఘనలకు పాల్పడితే, 2019 నాటికి ఆ సంఖ్య 600 దాటిందని భారత ప్రభుత్వం పార్లమెంటుకు తెలిపింది. అంటే, చైనా గుణం మారలేదని స్పష్టమవుతోంది.

చైనా వైఖరిని గమనిస్తే… దాని తీరు ఎప్పటికీ మారదు కూడా నేమో..! 2013-2014లో పశ్చిమ సెక్టార్‌లో చైనా తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడింది. వారాల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. 2014లో చైనా భారీ ఉల్లంఘనకు, ఆ దేశ అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ ‌భారతదేశ పర్యటన సమయాన్ని ముహూర్తంగా ఎంచుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ విషయాన్ని నేరుగా చైనా అధ్యక్షుని దృష్టికి తీసుకెళ్లవలసివచ్చింది. మూడు సంవత్సరాల తరువాత, అదే దృశ్యం మధ్య సెక్టార్‌లోని డోక్లామ్‌ ‌ట్రై-జంక్షన్‌కు చేరింది. భారత్‌ ‌చైనాల మధ్య 73 రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. ఆ తర్వాత ఏప్రిల్‌ 2020‌లో లద్ధాఖ్‌లోని వెస్ట్రన్‌ ‌సెక్టార్‌లో వరసగా అనేక అత్యంత ఘోరమైన ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి. గల్వాన్‌లో మరణాలు సంభవించాయి.

కాబట్టి, ఉల్లంఘనలకు సంబంధించినంత వరకు యాంగ్‌ట్సీ భారతదేశానికి ‘కొత్త సాధారణం’ కాదు. నిజానికి, 1987లో అరుణాచల్‌‌ప్రదేశ్‌లోని సుమ్‌డోరాంగ్‌ ‌చు లోయలో పీ•ఎల్‌ఏ ‌చొరబాట్ల తరువాత, భారత సైన్యం యాంగ్‌ట్సీ శిఖరంపై స్థావరాలు ఏర్పాటు చేసుకునే క్రమంలో, యాంగ్‌ట్సీ కూడా ఎన్నో ఉల్లంఘన ప్రయత్నాలను చూసింది. సుమ్‌డోరోంగ్‌ ‌చు సరిహద్దు ఉల్లంఘనల ఫలితంగా రెండు సైన్యాల మధ్య ప్రతిష్టంభన ఏకంగా ఆరు సంవత్సరాల పాటు కొనసాగింది. చివరకు 1993లో నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు బీజింగ్‌ ‌పర్యటన తర్వాతనే సుదీర్ఘ ప్రతిష్టంభనకు తెర పడింది.

అది అలాఉంటే, భారత్‌-‌చైనాల మధ్య వివాదానికి ఎల్‌ఏసీ మూల కారణంగా కనిపిస్తుంది. కానీ సాంకేతికంగా చూస్తే, టిబెట్‌తో అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌సరిహద్దు విభజన ఎల్‌ఏసీ ద్వారా కాకుండా మెక్‌మహన్‌ ‌రేఖ ద్వారా జరిగింది. చైనా-మయన్మార్ల మధ్య కూడా మెక్‌మాన్‌ ‌రేఖ సరిహద్దు రేఖగా ఉంది. అయినా, అక్కడ ఎలాంటి వివాదం లేదు. ఇదే రేఖ మయన్మార్‌ ‌ద్వారా భార•త్‌-‌టిబెట్‌-‌భూటాన్‌ ‌కూడలి వరకు విస్తరించింది. వాస్తవానికి, చైనా సైన్యం 1962 యుద్ధం ముగింపులో అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌సెక్టార్‌లో ఆ రేఖ ఆవలి నుంచి తమ సేనలను ఉపసంహరించుకుంది. అయితే అది లద్ధాఖ్‌లో అక్సాయ్‌ ‌చిన్‌ ‌ప్రాంతంలోని ఆక్రమిత భూభాగాలను మాత్రం అంటి పెట్టుకుని ఉంది. నిజానికి, 1962 యుద్ధ పరాజయం, యుద్ధ సమయంలో నెహ్రూ పిరికి ప్రతిస్పందనల పర్యవసానంగానే చైనా, ఎన్‌ఈఎఫ్‌ఏ ‌ఫ్రంట్‌లోని ఈశాన్య భారత సరిహద్దుల వెంబడి దూకుడు పెంచింది.

1964 తర్వాత చైనా ప్రధాని చౌ ఎన్‌ ‌లై, మెక్‌మహన్‌ ‌రేఖ అనేది వలస రాజ్యాధినేతలు బలవంతంగా రుద్దిన రేఖగా పేర్కొన్నారు. అది చైనాకు అమోదయోగ్యం కాదని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. అలాగే, 1975లో హిమాలయ రాజ్యం సిక్కిం భారతదేశంలో విలీనం అయిన తర్వాత అరుణాచల్‌ ‌ప్రదేశ్‌’‌కు ‘సౌత్‌ ‌టిబెట్‌’ (‌దక్షిణ టిబెట్‌) అనే కొత్త పదబంధాన్ని చేర్చారు.

ఆ విధంగా, ఎల్‌ఏసీ, మెక్‌మహన్‌ ‌రేఖ సహా లద్ధాఖ్‌ ‌నుంచి అరుణాచల్‌‌ప్రదేశ్‌ ‌వరకు గల దాదాపు 3,500 కి.మీ సరిహద్దును చైనా తెలివిగా వివాదంగా మార్చింది. మరోవంక భారతదేశం, చైనా ‘తెలివి’కి తలొగ్గింది. చైనా వాదనకు తలూపి అంగీకరించింది. ఇక అక్కడి నుంచి నుంచి భారత భూభాగంలో చిచ్చు పెట్టడం చైనాకు ‘సాధారణ’ క్రతువుగా మారింది. అప్పటి నుంచి చైనా సరిహద్దు వివాదాలకు కాలు దువ్వుతూనే ఉంది. ఆ విధంగా సరిహద్దు ఉల్లంఘనలు ‘సాధారణం’ గా మారిపోయింది.

ఇక్కడ ఒక ఆసక్తికరమైన పూర్వ వృత్తాంతాన్ని గుర్తు చేసుకుందాం. 1962 ఆగస్టులో, భారతదేశంపై యుద్ధానికి సిద్ధం కావాలని మావో నుండి సెంట్రల్‌ ‌మిలిటరీ కమిషన్‌కు ఆదేశాలు అందాయి. చైనా సైన్యం ప్రణాళికబద్ద దురాక్రమణకు వారం రోజుల ముందు, అక్టోబర్‌ 3‌న ఆ దేశ ప్రధాని చౌ ఎన్‌ ‌లై భారతదేశానికి వచ్చారు. యుద్ధం ఉండదని నెహ్రూకు భరోసా ఇచ్చారు. బీజింగ్‌కు తిరిగి వచ్చిన తర్వాత, చౌ మావోకు సమావేశం గురించి, పంచశీల పట్ల నెహ్రూ విశ్వాసం, శాంతియుత సహజీవనంపై ఆయనకున్న విశ్వాసం గురించి వివరించారు. అందుకు మావో నవ్వుతూ, ఉభయ దేశాల మధ్య ‘శాంతియుత సహజీవనం’ సాధ్యం కాదని, ‘సాయుధ సహజీవనం’ అంటే యుద్ధానికి సిద్ధం కావాలని నెహ్రూకి తెలియజేయాలని చౌను కోరారు.

వాస్తవానికి చైనా తన నైజాన్ని, దురాక్రమణ ఆకాంక్షలను అంతగా దాచుకోలేదు. అయితే, భారతదేశ ఏలికలు, చైనా ఇచ్చిన స్పష్టమైన సంకేతాలను సరైన రీతిలో అందుకోలేదు, అర్థం చేసుకోలేదు. ఒక విధంగా పిరికితనాన్ని ప్రదర్శించారు. ఎల్‌ఏసీకి సంబంధించినంత వరకు, భారతదేశం, ‘ప్రమాద విముఖత’ లేదా ‘శాంతి వ్యామోహం’ అనే మానసిక బంధనాల్లో బందీగా ఉండిపోయింది. 1987 ప్రారంభంలో సుమ్‌డోరోంగ్‌ ‌చు వ్యాలీలో చైనా సేనల చొరబాట్ల గురించి భారత సైన్యానికి సమాచారం అందిన వెంటనే, అప్పటి ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌సుందర్‌జీ, రాజకీయ అనుమతి కోసం ఎదురు చూడకుండా ఆ ప్రాంతానికి బెటాలియన్‌లను ఎయిర్‌ ‌లిఫ్ట్ ‌చేయాలని నిర్ణయించారు. అయితే, సుందర్‌జీ చర్యతో నాటి ప్రధాని రాజీవ్‌గాంధీ, ఆయన అధికారులు కలత చెందారు. ఇరువురి మధ్య వేడివేడి వాదనలు జరిగాయి. ఒకానొక దశలో, సుందర్‌జీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అవసరం అనుకుంటే వేరొకరి సలహాలు తీసుకోవాలని సూచించారు. 1962లో మితిమీరిన పౌరాధికారుల ప్రమేయం వలన జరిగిన నష్టం ఏమిటో సుందర్‌జీకి తెలుసు. అందుకే ఆయన మరోమారు అలాంటి పొరపాటుకు అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో కొంత కఠినంగా స్పందించారు. ఆశ్చర్యకరంగా, 1962 యుద్ధం తర్వాత, 1988లో బీజింగ్‌లో పర్యటించిన తొలి భారత ప్రధాని రాజీవ్‌గాంధీ, చిత్రంగా సరిహద్దు ఉల్లంఘన సమస్యను ఆ దేశంతో జరిపిన అధికారిక చర్చల్లో ఎక్కడా ప్రస్తావించ లేదు. అసలు అలాంటి ఆలోచనే చేయలేదు. రాజీవ్‌గాంధీ, సరిహద్దు సమస్యను ప్రస్తావించక పోవడం చైనాకు చక్కగా కలిసొచ్చింది. సరిహద్దు వివాదం విషయంలో రాజీవ్‌ ‌గాంధీ మౌనం వహించడంతో చైనా ఒక విధంగా రెట్టించిన ఉత్సాహంతో దురాక్రమణలు కొనసాగించింది.

1993లో ప్రధాన మంత్రి నరసింహారావు బీజింగ్‌ను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా మొట్టమొదటి ‘శాంతి ఒప్పందం’ పేరున సరిహద్దు ఒప్పందంపై ఉభయదేశాలు సంతకాలు చేశాయి. ఆ తర్వాత మరో మూడు (1995, 2005, 2012) సరిహద్దు ఒప్పందాలు కుదిరాయి. అయితే, ఈ మూడు ఒప్పందాలలో ఎల్‌ఏసీ వెంట శాంతిస్థాపన కొనసాగింపు గురించి గొప్పగా మాట్లాడినా, అసలు విషయాన్ని మాత్రం వదిలేశారు. మూడు ఒప్పందాలలో ఎక్కడా, ఎల్‌ఏసీ• అంటే ఏంటి? దాని నిర్వచనం ఏమిటి? అనే వివరణ ఇవ్వలేదు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఎల్‌ఏసీ నిర్వచనానికి సంబంధించి ఒక పదబంధాన్ని చేర్చే ప్రయత్నం చేశారు. అయితే అందుకు చైనా అంగీకరించలేదు. ఆ విషయం అక్కడితో తెరమరుగై పోయింది.

ఇక ఆ తర్వాత నుంచి ఎల్‌ఏసీ ఉల్లంఘనలు చైనాకు సాధారణం అయ్యాయి. భారతదేశం, ‘ఘర్షణ వద్దు’ అనే విధానాన్ని అనుసరించింది. అయితే ప్రధాని మోదీ ఆ విధానంలో మార్పు తీసుకొచ్చారు. 2017లో డోక్లామ్‌’‌తో మొదలుపెట్టి, మావో కోరుకున్న ‘సాయుధ సహజీవనం’ (కన్నుకు కన్ను పన్నుకు పన్ను) పంథాను భారతదేశం స్వీకరించింది. చైనా సాయుధ కుట్రలకు అదే పంథాలో సమాధానం ఇచ్చేందుకు మోదీ ప్రభుత్వం సైన్యాన్ని సన్నద్ధం చేసింది. ఓ వంక దౌత్యపరమైన చర్చలు, ప్రయత్నాలు కొనసాగిస్తూనే, మరోవంక, సైనికశక్తిని ప్రదర్శిస్తూ, ద్విముఖ వ్యూహంతో ముందుకు పోతోంది.

లద్ధాఖ్‌ ‌సెక్టార్‌లోలా కాకుండా, తూర్పు సెక్టార్‌లో భారత సైన్యం చాలా బలమైన శక్తిగా నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు మౌలిక సదుపాయాలు కూడా గణనీయంగా మెరుగుపడ్డాయి. వృత్తిపరంగా సమర్థత, సైనికపరంగా సర్వ సన్నద్ధమైన భారత బలగాలు తూర్పు సెక్టార్‌లో అవతలి వైపు నుండి ఎలాంటి దుస్సాహస యత్నం జరిగినా పూర్తి శక్తితో తిప్పి కొట్టేందుకు సన్నద్ధంగా ఎదురుచూస్తున్నాయి.

యాంగ్‌ట్సీ వద్ద ఇటీవల జరిగిన ఘర్షణలోనూ అదే జరిగింది. లద్దఖ్‌ ‌ప్రాంతంలో రెండు సంవత్సరాల తర్వాత కూడా ప్రతిష్టంభన కొనసాగు తుండగా, యాంగ్‌ట్సీ వద్ద జరిగిన ఉల్లంఘన యత్నం కేవలం రెండు గంటల్లోనే ముగిసి పోయింది. భారత సేనల అనూహ్య మెరుపు దాడితో, చైనా సైనికులు పలాయనం చిత్తగించారు. పీ•ఎల్‌ఏ ‌కూడా, తమ సేనల పలాయనాన్ని అంగీకరించింది. తమ గస్తీని ‘భారత సైన్యం నిరోధించింది’ అని అంగీకరించింది.

ఇప్పుడు.. ఇదీ.. చైనాకు.. పీఎల్‌ఏకు ‘ఇటీవలి సంప్రదాయమే’.

‘ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ‌నుంచి

అను: రాజనాల బాలకృష్ణ

About Author

By editor

Twitter
YOUTUBE