షణ్ముఖ

అమెరికా దళాలు 2021 ఆగస్టులో అఫ్ఘానిస్తాన్‌ ‌నుంచి వైదొలిగాక తాలిబన్‌ ‌నాయకత్వంలో కాబుల్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అప్పట్లో తాలిబన్‌ ‌సర్కారును గుర్తించడానికి దాదాపుగా యావత్‌ అం‌తర్జాతీయ సమాజం నిరాకరించింది. తాలిబన్‌కు పొరుగునున్న పాకిస్తాన్‌, ‌రష్యా, చైనా, ఇరాన్‌ ‌మాత్రమే మద్దతుగా నిలిచాయి. మున్ముందు తాలిబన్‌కు అన్నివిధాలా అండగా నిలుస్తామని అవి భరోసానిచ్చాయి. పాకిస్తాన్‌ అయితే మరో అడుగు ముందుకేసి ఈ విషయాన్ని ఆర్భాటంగా ప్రకటించింది. సమీప పొరుగు దేశమైన భారత్‌ ‌తటస్థంగా వ్యవహరించింది. ఒక ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ ‌కాబుల్‌లోని కొత్త ప్రభుత్వాన్ని సమర్థించలేదు. అలాగని వ్యతిరేకించలేదు. కానీ ఇంతకుముందు మాదిరిగానే అఫ్ఘన్‌ ‌ప్రజలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని ప్రకటించింది. పాలకులతో తమకు సంబంధం లేదని అఫ్ఘన్‌, ‌ప్రజలే తమకు ముఖ్యమని విస్పష్టంగా వ్యాఖ్యానించింది. తాలిబన్‌ ‌పాలకులు కూడా భారత్‌ ‌పట్ల సానుకూలతగానీ, వ్యతిరేకతను గానీ వ్యక్తం చేయలేదు. ఈ పరిణామాలు ఇస్లామాబాద్‌కు అమితానందాన్ని మిగిల్చాయి. కాబుల్‌ ఇక నుంచి తమ గుప్పెట్లో ఉంటుందని భావించింది. దీనిని అవకాశంగా తీసుకుని కశ్మీర్‌ ‌సమస్య పేరుతో అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను మరింత ఇరుకున పెట్టవచ్చని ఆశించింది. చివరకు అనుకున్నదొకటి జరిగింది మరొకటి కావడంతో పాకిస్తాన్‌ ‌గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.


ఏడాదిన్నర తిరిగేసరికి పరిస్థితి ఒక్కసారిగా పూర్తిగా మారింది. కాబుల్‌, ఇస్లామాబాద్‌ ‌మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. బీజింగ్‌-‌కాబుల్‌ ‌మధ్య ఇంత తీవ్రంగా లేకపోయినా వెనకటి మాదిరిగా సత్సంబంధాలు మాత్రం లేవు. అదే సమయంలో అనూహ్యంగా న్యూఢిల్లీకి క్రమంగా కాబుల్‌ ‌చేరువవుతోంది. ఇందుకు దారితీసిన పరిస్థితులు విశ్లేషిస్తే ఒకింత ఆశ్చర్యం కలిగిస్తాయి. అదే సమయంలో నిజమైన మిత్రులెవరో, అవసరార్థ స్నేహితులెవరో, నిజమైన శత్రువులెవరో నిలకడగా కాబుల్‌కు తెలిసివచ్చింది. తాజాగా పాకిస్తాన్‌- అఫ్ఘానిస్తాన్‌ ‌మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో నెలకొన్న ఈ పరిస్థితుల కారణంగా ఉభయ దేశాల సంబంధాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇది ఇప్పటికిప్పుడు ఏర్పడిన ఉద్రిక్తత కాదు. దీనికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. ఏడు దశాబ్దాల చరిత్రలో ఇరుదేశాల మధ్య సరిహద్దు గొడవలు అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయి. తాత్కాలిక చర్యలతో అప్పటికప్పుడు అవి సద్దు మణుగుతున్నాయి. కానీ తాజా పరిస్థితి మాత్రం ఉభయ దేశాల మధ్య యుద్ధం అనివార్యమన్న భావనను దౌత్యనిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇరుదేశాల పాలకులు కూడా కయ్యానికి కాలు దువ్వేలా మాట్లాడుతున్నారు.

పాకిస్తాన్‌-అఫ్ఘానిస్తాన్‌లను డ్యూరండ్‌ ‌రేఖ విభజి స్తోంది. బ్రిటిష్‌ ‌హయాంలో ఈ విభజన జరిగింది. సుమారు 2,670 కిలోమీటర్ల ఈ సరిహద్దుపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం కొరవడింది. పాకిస్తాన్‌ ‌లోని ఖైబర్‌ ‌ఫక్తూన్‌ ‌క్వా ప్రావిన్స్ ‌తమదేనని అఫ్ఘన్‌ ఎప్పటినుంచో వాదిస్తోంది. పాక్‌లోని బలూచిస్తాన్‌ ‌ప్రావిన్స్ ‌కూడా తమదేనంటోంది. అయితే ఖైబర్‌ ‌ఫక్తూన్‌ ‌క్వా విషయంలో వాదించినంత గట్టిగా బలూచిస్తాన్‌ ‌గురించి మాట్లాడటం లేదు. ఇదొక్కటే తేడా. అఫ్ఘన్‌లోని కాందహార్‌ ‌పాక్‌ ‌సరిహద్దులో ఉంది. పాక్‌కు చెందిన ఖైబర్‌ ‌ఫక్తూన్‌ ‌క్వా రాజధాని పెషావర్‌ ‌నగరం కూడా అఫ్ఘన్‌ ‌సరిహద్దుల్లో విస్తరించి ఉంది. అఫ్ఘన్‌ ‌నగరాలు హెల్మండ్‌, ‌నిర్ముజ్‌ ‌పాక్‌ ‌సరిహద్దులో విస్తరించి ఉన్నాయి. రెండు దేశాల మధ్య ఆరు సరిహద్దు క్రాసింగులున్నాయి. ఈ ప్రాంతంలో రెండు దేశాల బలగాలు నిరంతరం పహారా కాస్తుంటాయి. ఈ నెలలో ఉభయ దేశాల సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. ముఖ్యంగా చమన్‌ ‌సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో అఫ్ఘన్‌ ‌దళాల చేతుల్లో పాక్‌కు చెందిన ఆరుగురు మరణించారు. ఈ ఘటన రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలను రాజేసింది. దీనిపై ఇస్లామాబాద్‌లోని పాక్‌ ‌విదేశాంగ కార్యాలయం అఫ్ఘన్‌ ‌రాయబారిని పిలిచి తన నిరసనను వ్యక్తం చేసింది. ఇదే నెలలో ఇలాంటి గొడవలు మరికొన్ని చోటుచేసుకున్నాయి. ఇరుదేశాల సైనికాధికారులు, దౌత్యవర్గాల చర్చల వల్ల తాత్కాలికంగా పరిస్థితి కొంతవరకు ఉపశమించింది. అయితే ఉద్రిక్తత్తలు మాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడైనా యుద్ధం అనివార్య మన్న భావనను దౌత్య నిపుణులు వ్యక్తంచేస్తున్నారు. అప్ఘనీలు ద్రోహులని పాక్‌ ‌నిందిస్తోంది. దీనికితోడు 2022 సెప్టెంబరులో ఉభయ దేశాల మధ్య జరిగిన క్రికెట్‌ ‌టోర్నీ ఉద్రిక్తతలను మరింత రాజేసింది. నాటి మ్యాచ్‌లో అఫ్ఘన్‌ ఓటమి పాలైంది. దీంతో ఆ దేశ అభిమానులు కుర్చీలు విసిరిన ఘటన పరిస్థితిని తీవ్రం చేసింది. ఇమ్రాన్‌ ‌సర్కారు పతనం తర్వాత కొలువుదీరిన షెహబాజ్‌ ‌షరీఫ్‌ ‌మంత్రివర్గంలో బిలావల్‌ ‌భుట్టో విదేశాంగా మంత్రిగా చేరారు. సింధ్‌ ‌ప్రావిన్స్‌కు చెందిన బిలావల్‌ ‌దివంగత ప్రధాని బెనజీర్‌ ‌భుట్టో కుమారుడు. జుల్ఫికర్‌ ఆలీ భుట్టో మనవడు. కశ్మీర్‌ ‌కోసం భారత్‌పై వెయ్యేళ్లయినా యుద్ధం చేస్తామని బీరాలు పలికిన చరిత్ర జుల్ఫికర్‌ ఆలీ భుట్టోది. విదేశాంగ మంత్రిగా అనేక దేశాల్లో పర్యటించిన బిలావల్‌ ఇం‌తవరకు పొరుగు దేశమైన అఫ్ఘన్‌లో అడుగిడలేదు. తన డిప్యూటీ అయిన హీనా రబ్బానీ ఖర్‌ను కాబుల్‌కు పంపారు. తాలిబన్‌ ‌రక్షణ మంత్రి ఆమెను కలవడానికి నిరాకరించారు. అయితే తాలిబన్‌ను నియంత్రించాలని బిలావల్‌ ‌కాబుల్‌ ‌సర్కారును కోరుతున్నారు. ఈ ఘటనలు ఉభయ దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలకు అద్దం పడుతున్నాయి.

తొలుత ఇస్లామాబాద్‌తో సఖ్యతగా ఉన్న అఫ్ఘన్‌ ‌తాలిబన్‌ ఇప్పుడు పాక్‌పై కత్తులు నూరుతున్నారు. అంతర్యుద్ధంలో శక్తిమంతమైన అమెరికాను ఓడించిన తమకు పాక్‌ను ఓడించడం పెద్ద కష్టం కాదన్న వాదనను తాలిబన్‌ ‌వినిపిస్తున్నారు. అయితే తమది అణుదేశమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పాక్‌ ‌హెచ్చరిస్తోంది. గత ఏడాది తాలిబన్‌ అధికారం చేపట్టాక వారి ప్రభుత్వాన్ని గుర్తించిన చైనా ఇప్పుడు క్రమంగా దూరమవుతోంది. కాబుల్‌-‌బీజింగ్‌ ‌సంబంధాల్లో గత కొంతకాలంగా స్తబ్దత ఏర్పడింది. డిసెంబర్‌ 12, 2022‌న కాబుల్‌లోని ఓ హోటల్‌పై జరిగిన దాడిలో అయిదుగురు చైనీయులను నిర్బంధించారు. ఇందుకు తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్‌ (ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అం‌డ్‌ ‌సిరియా) ఖొరసాన్‌ ‌వర్గం ప్రకటించింది. ఈ ఘటన రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచింది. ఈ విషయాలను కాసేపు పక్కనపెడితే అఫ్ఘన్‌ ‌తాలిబన్‌ ‌మరికొంచెం ముందుకెళ్లి ఆలోచిస్తున్నారు. సరిహద్దుల్లోని ఇరాన్‌ ‌తదితర దేశాలతో అఫ్ఘన్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవు. పాక్‌తోనే దానికి ప్రధానంగా పేచీ ఉంది. దశాబ్దాలుగా ఈ వివాదం పరిష్కారం కావడం లేదు. అందువల్ల సరిహద్దు సమస్యపై ఏదో ఒకరోజున యుద్ధం అనివార్యమని భావిస్తోంది. అప్పుడు చైనా కచ్చితంగా ఇస్లామాబాద్‌నే సమర్థిస్తుందని తాలిబన్‌ అం‌చనా వేస్తున్నారు. అందువల్ల ఏ రకంగా చూసినా బీజింగ్‌ ‌నమ్మదగ్గ నేస్తం కాదన్న అభిప్రాయంతో ఉన్నారు. అదే సమయంలో పాక్‌తో యుద్ధం అనివార్యమైనప్పుడు భారత్‌ ‌తమను కచ్చితంగా సమర్థిస్తుందన్న భావనతో ఉన్నారు. 70ల నాటి బంగ్లాదేశ్‌ ‌విముక్తి పోరాటాన్ని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో కాబుల్‌ ‌క్రమంగా న్యూఢిల్లీకి చేరువవుతోంది. ఆసియాలో అత్యంత విశ్వసనీయమైన దేశం భారత్‌ అని బలంగా భావిస్తోంది. ఇందుకు కొన్ని కారణాలను చూపెడు తోంది. సహజసిద్ధంగా ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ‌నిరంకుశత్వానికి వ్యతిరేకం. అందుకే తాలిబన్‌ ‌గతఏడాది అధికారం చేపట్టినప్పుడు భారత్‌ ‌హర్షించలేదు. అంతేకాదు, ఈ ఏడాదిన్నర కాలంలో అఫ్ఘన్‌ ‌ప్రజలను అన్నిరకాలుగా ఆదుకుంది. ఔషధాలను సరఫరా చేసి అక్కడి ప్రజల ప్రాణాలను కాపాడుతోంది. గోధుమలను పెద్దయెత్తున సరఫరా చేయడం ద్వారా ప్రజల ఆకలిని తీర్చుతోంది. ఇతరత్రా కూడా అనేక విధాలుగా సాయ మందిస్తోంది. దీంతో భారత్‌ ‌పట్ల తాలిబన్‌ ‌వైఖరిలో మార్పు వచ్చింది. ఇరుగు పొరుగైన ఇస్లామాబాద్‌, ఇరాన్‌ ‌కన్నా భారతే తమకు విశ్వసనీయమైన దేశమన్న అంచనాకు వచ్చింది. అంతేకాక తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని కోరుతోంది.

వాస్తవానికి భారత్‌-అఫ్ఘన్‌ ‌మధ్య బలమైన బంధం ఉంది. ఇది ఈనాటిది కాదు. దీనికి దశాబ్దాల చరిత్ర ఉంది. సరిహద్దు గాంధీ ఖాన్‌ అబ్దుల్‌ ‌గఫార్‌ ‌ఖాన్‌, అఫ్ఘన్‌ ‌రాజు జహీర్‌ ‌షా హయాం నుంచి రెండు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. మాజీ పాలకులు హమీద్‌ ‌కర్జాయ్‌, అ‌ష్రఫ్‌ ‌ఘనీ హయాంలోనూ సత్సంబంధాలు కొనసాగాయి. అఫ్ఘన్‌లో మౌలిక వసతులకు భారత్‌ ఎం‌తగానో పాటుపడింది. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు నిర్మించింది. ఏకంగా కొత్తగా పార్లమెంటు భవనాన్ని నిర్మించింది. అఫ్ఘన్‌ ‌శరణార్థులకు ఆశ్రయమిచ్చి భారత్‌ ‌తన పెద్ద మనసు చాటుకుంది. అంతర్యు ద్ధంతో దెబ్బతిన్న అప్ఘన్‌కు మరింత చేయూత ఇచ్చేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉంది. దీనికితోడు ఆ దేశ ప్రజలకు సహజసిద్ధంగానే భారత్‌ అం‌టే అమిత ఇష్టం. పాకిస్తానీయులను అంతగా ఇష్ట పడరు. అదే సమయంలో తమ అంతర్గత వ్యవహారా లల్లో న్యూఢిల్లీ జోక్యం చేసుకోకపోవడం కాబుల్‌ ‌పాలకులను భారత్‌ ‌వైపు మొగ్గుచూపేలా చేసింది. ఆసియాలో, ముఖ్యంగా దక్షిణాసియాలో భారత్‌ ‌పెద్ద దేశం. అయినప్పటికీ ఇరుగు పొరుగునున్న చిన్న దేశాలపై పెత్తనం చేయాలని, వాటిని తన గుప్పెట్లో పెట్టుకోవాలని భారత్‌ ఏనాడూ తలపోయలేదు. అంతేకాక చిన్న దేశాల సమగ్రతను, సార్వ భౌమత్వాన్ని సదా గౌరవిస్తోంది. ఈ నేపథ్యంలో అఫ్ఘన్‌ ‌ప్రజల శ్రేయస్సే తమకు ముఖ్యమని, అంతేతప్ప అక్కడి రాజకీయాలు, పాలకులతో తమకు సంబంధం లేదన్న భారత్‌ ‌విధానం ప్రజల ప్రశంసలు అందుకుంది. ఈ పరిస్థితుల్లో భారత్‌, ‌పాకిస్తాన్‌, ‌చైనాల్లో ఎవరు నిజమైన మిత్రులో అనుభవ పూర్వకంగా అఫ్ఘానిస్తాన్‌కు చాలా స్పష్టంగా అర్థమైంది. ఒక పొరుగు దేశంగా అఫ్ఘన్‌-‌పాక్‌ ‌మధ్య సరిహద్దు సమస్య చర్చలతో, శాంతియుతంగా పరిష్కారం కావాలనే భారత్‌ ‌కోరుకుంటోంది. అంతేతప్ప ఇదే అదనుగా ఇరుదేశాల మధ్య వివాదాన్ని మరింతగా రాజేసి ఆ మంటల మధ్య చలి కాచుకోవాలని, తద్వారా లబ్ధి పొందాలని భారత్‌ ‌పొరపాటున కూడా భావించడం లేదు. ఈ విషయం అంతర్జాతీయ సమాజానికి తెలియనిది కాదు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE