– పీవీబీ శ్రీరామమూర్తి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది

గుడ్డివెన్నెల చవితి చంద్రుణ్ణి మింగేయబోతున్న మబ్బుముక్కలు దరిద్రుణ్ణి చుట్టు ముడుతోన్న రోగాల్లా!

రైల్వే పెంకులతో నేసిన పెద్ద ఇల్లు. ముందు పెద్ద వాకిలి. దూరంగా తొగరు చెట్టు. కుడి వైపు కరివేపాకు, మందార చెట్లు. ఇంటికెదురుగా శాఖోపశాఖలుగా విస్తరించిన వేపచెట్టు. నిజానికి వాతావరణం చల్లగా ఉండాలి. కానీ ఉక్కపోతగా ఉంది. ఇది వెంకటరత్నం ఇల్లు.

గుమ్మం ముందు వాకిట్లో పట్టె మంచం మీద తలగడ వేసుకుని దొర్లుతున్న వెంకటరత్నం కమ్మ విసనకర్రతో విసురుకుంటున్నాడు. శ్రావణ మాసం వెళ్లిపోతున్నా వర్షాలు లేవు. చెట్లు ఆకులు కదలడం లేదు. వేప ఆకులు మాత్రం రాలి పడుతున్నాయి. దూరం నుండి తొగరపూల వాసన మనసుకు మోదం చేకూరుస్తున్నది.

అప్పుడు ఒక పిల్ల తెమ్మర, అంతవరకూ తేనెటీగలు వెంట బెట్టినట్లు కలత చెందిన మనసు మకరందం గ్రోలుతున్నట్లు గిలిగింతలు పెట్టింది.

‘నర్తనశాల’లో ఘంటసాల ఆలపించిన పద్యం గుర్తొచ్చి పాడాలనిపించింది వెంకటరత్నానికి.

శ్రుతిలో పద్యం అందుకున్నాడు.

‘‘కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము

వాడూ…. అంటూ….. అయిదు శ్రుతిలో అందుకున్నాడు.

వెంకటరత్నం శ్రీకాకుళం నుండి గుంటూరు, కృష్ణా జిల్లా వరకూ తిరిగి నాటకాలేసిన రంగస్థల నటుడు. సత్యహరిశ్చంద్రలో నక్షత్రకుడు, గయో పాఖ్యానంలో గయుడు, అర్జునుడు ఉద్యోగ విజయాల్లో అర్జునుడు, రామాంజనేయ యుద్ధంలో యయాతి, ‘చింతామణి’లో బిల్వమంగళుడు పాత్రలు పోషించాడు. పెద్దపెద్ద నటుల పక్కన నటించినా, గాయకునిగా రాణించినా రావలసినంత పేరు రాలేదు. అందరి పారితోషికాలూ వేలు దాటి పోతున్నా, వెంకటరత్నం పుచ్చుకున్న అతి పెద్ద మొత్తం అయిదొందలు. వెంకటరత్నంకి వేషం ఇస్తే చాలు. హరిశ్చంద్రలో కాలకౌశికుడు, వీరబాహుడు వేషాలు కూడా వెయ్యననేవాడు కాదు. ఇంత ‘కావాలి’ అని ఎప్పుడూ డిమాండ్‌ ‌చేసేవాడు కాదు. మేకప్‌ ‌నుండి అన్నీ చూసుకొనేవాడు. ఇంట్లో నాటకాలు మానేయమన్నారు. మానేసాడు. ఇంటి వాళ్ల గోల భరించలేక కాదు! డాక్టరు హెచ్చరిక చెయ్యడం వల్ల.

ఒకసారి యయాతి వేషంలో ఎక్కువ రాగం తీయవలసి వచ్చింది. అప్పుడు హార్ట్ ‌స్ట్రోక్‌ ‌వచ్చింది. అదృష్టవశాత్తు అది రాజమండ్రి. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్తే ఐ.సి.యూ.లో రెండు రోజులు వుంచి తగ్గాక డిశ్చార్జి చేసి ‘మీరు మరి నాటకాలేస్తే మీ ప్రాణానికి ప్రమాదం’ అని వైద్యులు చెప్పడం వల్ల.

కొడుకు గ్రామీణ బ్యాంకులో ఉన్న ఊళ్లోనే ఉద్యోగం. కోడలు చదువు లేనిది. కూతురు పెళ్లి చేసేసాడు. కోడలు మంచిది కాదు…మాట విసురుతుంది.

పద్యం పూర్తి చేసే సరికి ఎదురుగా విఠలరావు మాష్టారు.

‘‘మీ రెప్పుడొచ్చారు’’

‘‘ఇప్పుడే, అలా వెళ్తూ – మధురమైన మీ గాత్రం విని వచ్చాను. చాలా బాగుంది. ఏదీ ఆ రెండోది ‘‘ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజ భూషణ రజోరాజినడగు’’ ఎత్తుకోండి!

వినేవాళ్లుంటే కళాకారులకు ఆనందం సెలయేళ్లై పారుతుంది. ‘‘రండి, కూర్చోండి’’ అని మంచం మీద జరిగాడు. అంతలో చుట్టు ప్రక్కల ఇళ్ల వాళ్లు పది మంది చేరుకున్నారు.

నర్తనశాల గొప్ప సినిమాండి, కమలాకర కామేశ్వరరావు డైరెక్షన్‌, ఒక్కొక్కళ్లు జీవించేశారు. అవి తిక్కన గారి పద్యాలు. ఘంటసాల జీవం పోసారు కానీండి’’అని విఠలరావు అనగానే గొంతు సవరించి పద్యం ఎత్తుకున్నాడు. పద్యం రెండు పాదాలు చదివాడు.

కోడలు అపరకాళికలా వచ్చింది.

‘‘ఇదిల్లా? యాత్రా ? ఏటాగోల? అవతల టి.వి.లో సీరియల్‌ ఇన్నివ్వవా

మీరేటండీ ఇదేం సంతనుకున్నారా?’’ రెచ్చి పోయింది.

‘‘ఏటీ ఏటీ రెచ్చిపోతున్నావు. సెట్టంత మగాణ్ణి పట్టుకుని నలుగురి ముందలా డేన్సు చేసేస్తున్నావు? నువ్వాడదాయివేనా? నీకు సిగ్గుందా? బరితెగించేస్తు న్నావు బజారు దాన్లాగా. మబ్బిడిచిన ఎండ, మగాడు నెక్కనేని ముండా, అచ్చోసిన ఆబోతూ ఒకటేనే’’ అని అత్త విరుచుకు పడింది. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాన్ని టి.వి.లో విననివ్వలేదనే అక్కసుతో ఉన్న అత్త కోడలిపై విరుచుకు పడింది. అంతలోనే వెంకటరత్నం కొడుకు వచ్చాడు.

‘‘ఏటర్రా, ఏటయిందీ?’’

విషయం చెప్పింది తల్లి.

‘అత్త నోరు చేసి కొట్టబోయింది’’ అన్నది కోడలు. ఎలాగైతేనేం కొడుకు అందరి మీద కేకలేసి తగువు చల్లార్చాడు.

వెంకటరత్నం వెళ్లిపోబోతున్న విఠలరావుని ‘‘ఎక్కడికి మేష్టారూ’’ అనడిగాడు. ‘‘అలా మందిరం దగ్గరకు’’

‘‘ఉండండి నేనూ వస్తాను’’ అని అతన్నను సరించాడు వెంకటరత్నం.

పల్లెటూళ్లలో సాయంకాలం అయ్యేసరికి అందరికీ ‘‘రామ మందిరం’’ వేదిక అవుతుంది. ఆ ఊర్లోనూ అంతే!

రామమందిరం గచ్చు విశాలంగా ఉంది.

వర్షం లేదు. ఎండ తీక్షణతా తగ్గలేదు. గచ్చు వేడిగా ఉంది. గచ్చు మీద అక్కడక్కడా కూర్చున్న జనం కబుర్లు చెప్పుకుంటున్నారు. మరి కొంచెం ముందుకు గుడి తలుపుల దగ్గర వెలుగులో కుర్రాళ్లు పేక ఆడుకుంటున్నారు. విఠలరావు, వెంకటరత్నం చేరారు.

మరో అయిదు నిమిషాలకు పాత ప్రెసిడెంటు సింహాద్రి వచ్చాడు. ‘‘ఎవులు మేష్టారూ! అతగా డెవరు?’’ అడిగాడు.

‘‘నేను దద్దా ! ఎంకటరత్నాన్ని ’’

‘‘నువ్వేట్రా నాయినా! సీకట్లో పోల్చలేక పోనాను.’’ అని గట్టు మీద కూచుని ‘‘అక్క డాల్లేటి సేస్తన్నారూ’’ అడిగాడు.

గుంటలు పేకాడుకుంటున్నారు’’ వెంకట రత్నం

‘ఒరే నా కొడకల్లారా ! ఇది రామ్మందిరం రా.. ఇక్కడ మీకు పేకాట? ఏదా కర్ర ఇలాగియ్యి రత్నం’’ అని కర్ర పట్టుకు లేచాడు.

సింహాద్రంటే ఆ ఊళ్లో అందరికి భయం !

కర్ర పట్టుకు లేచేసరికి గుంటలందరూ తలో పక్క పారిపోయారు.

‘‘గుంటలకి బయం బక్తుల్లేకుండా పోయాయి. ఇదేం సాని కొంపనుకుంటున్నారా? మీ నుంచే దేశం ఇలాగయింది. కార్తెలు దాటి పోతున్నా వానలు నేవు. మళ్లు ఎండిపోతున్నాయి. మిమ్మల్ని కాదురా ! మిమ్ము గన్న అయ్యల్నీ, అమ్మల్నీ అనాలి’’ అని రుసరుస లాడాడు.

కాసేపయ్యాక అయితేటి మేష్టారూ! వర్షాలు పడవేటి మరి! దీనికేటి ఉపాయం? బోరుల్లో నీళ్లు రావు, కరెంటూ లేదు. ఏటి సెయ్యాలంటావు?’’ అన్నాడు సిమ్మాద్రి.

‘‘మీరు తలచుకుంటే ఏదైనా మార్గం ఆలో చించగలరు.’’

‘‘నీనా! నేనేటి సెయ్యగలను, సిమ్మాద్రీ?’’

‘‘పూర్వం వానలు కురువకపోతే కప్పల పెళ్లిళ్లు చేసేవారు. గౌరీపూజ చేసేవారు. అమ్మోరు పండుగ, వారాలు చేసేవారు. మా ఊళ్లో వర్షాలు పడకపోతే మా పంతులు గారు ‘విరాటపర్వం’ చదివితే అది పూర్తయ్యేసరికి వానలు కురవాల అంతే…ఇప్పుడెవరు చదువుతారు?’’ అన్నాడు విఠలరావు.

‘‘ఎందుకు లేరు? మన పెద్ద పంతులు గారు సదువుతారు. ఆయన పిలిస్తే దేవుడు పలుకుతాడు. కొన్ని సంవత్సరాల క్రిందట వరకూ పురాణాలు చదివేవోరు. ఇప్పుడు జనానికివేవీ అక్కర్లేదు. అప్పుడు నాటకాలు, బుర్రకథలు, భాగోతాలు, పందిరి పాటలు, తప్పిటగుళ్లు, ఒవో, తిరునాళ్లే తిరునాళ్లు. ఇప్పుడవేవీ ? ఏదన్నా పండుక్కి పొగ్రాములెట్టిదా మంటే బ్రేక్‌ ‌డాన్సులు, డేన్స్ ‌బేబీలు, డాన్సులు, నేపోతే సిన్మాలు’’ అన్నాడు వెంకటరత్నం. వెంకట రత్నం నాటకాలేసి మంచి నాగరికునిలా మాట్లాడినా, పల్లెటూరి అలవాటుగా యాసలోనే మాట్లాడతాడు అప్పుడప్పుడు.

‘‘అదికాదురా ఆ గుంటనాకొడుకుల్తో మనకేటి పని? మనం పెద్ద పంతులోర్నడుగుదాం . ఆయన సదుమతానంతే రోజూ పెడదాం. ఏటంతావు బాబూ విటలూ,’’ అన్నాడు సింహాద్రి

‘‘నేను దేనికైనా సిద్దమే’’

‘‘అయితే రేపే ఎల్దాం’’

‘‘అలాగే’’ అనుకున్నారందరూ.

సింహాద్రి, వెంకటరత్నం, విఠలరావు, కొత్త ప్రెసిడెంటు, మరి కొంతమంది మర్నాడు పెద్ద పంతులు గారింటికి వెళ్లారు. ఆయనప్పుడే పూజ ముగించుకుని వచ్చారు.

‘‘దండాలు బాబూ!’’

‘‘దండాలు, దండాలు, ఏంటిలాగా, ఊరకరారు మహాత్ములు అన్నారు పోతన ’’ అని చాపవేసారు. అందరూ కూర్చున్నారు. మంచి నీళ్లిచ్చారు పంతులు గారి శ్రీమతి.

పిచ్చాపాటి అయిన తరువాత వానలు లేక పంటలు పాడవుతుండడం, కరువు, వలస విషయాలు చర్చించాక విషయం చెప్పారు.

‘నాకేం పరవాలేదు, కానీ జనంలో మార్పు వచ్చింది. మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? అంటారు. ఇప్పుడు వివిధ మతాలు, హేతువాదులు, జనవిజ్ఞాన వేదికలు, పురాణ పఠనానికి అంతరాయం కలిగిస్తే నా మనసు కలత చెందుతుంది. గొడవలుండకూడదు. దేనికైనా నమ్మకం ప్రధానం’’ అన్నారు.

‘‘ఆయన్నీ నా కొదిలేయండి’’

‘‘మరో విషయం. నాకు డెబ్బయి అయిదు, నేను చదివి చెప్పలేను మైకుండాలి. ఎవరైనా భారతం చదువుతుంటే నేను వివరించగలను.’’ అన్నారాయన.

‘‘మన మేష్టారు బాబున్నాడు. వెంకటరత్నం మంచి పాటగాడు. మీకెవరు కావాలంటే ఆళ్లే ఉంటారు. తోడుగా’’

‘‘మన వెంకటరత్నం గారి గొంతు పద్యం చదివే తీరు ఆమోఘం, ఆయనుంటే ఇంకొకర్ని వెతుక్కో వడం దేనికి?’’ అన్నాడు విఠలరావు.

సమావేశం ముగిసింది

తలయారిని పిలిచి దండోరా వేయించారు. ‘ రేపు రామమందిరం దగ్గరకు అందరూ రావాలని.

మర్నాడు-

ఎందుకో విషయం తెలియని ఉత్కంఠ అందరిలో

యువతా, ముసలీ, ఆడా, మగ నూరు మంది వచ్చారు.

సింహాద్రి విషయం వివరించాడు. కొత్త ప్రెసి డెంటు, మిగతా పెద్దలూ సరేనన్నారు. అంతలో ఎం.ఎస్సీ చదివి ఏదో కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న ‘జితేంద్ర’ అనే కుర్రాడు లేచి ‘నేనో అయిదు నిమిషాలు మాట్లాడతాను. అభ్యంతరమా?’’ అడిగాడు. అందరూ మాట్లాడమన్నారు.

గొంతు సవరించుకుని ‘‘అందరికీ వందనాలు.. ఇప్పుడు రోజులు మారాయి. విజ్ఞాన ప్రగతి వెల్లి విరిసింది. అడవులు నరికేసాం, చెట్లు లేవు. మేఘాల కవకాశం లేదు. కాలుష్యం పెరిగిపోయింది. కాలగతి మారింది.

మనం ఇంకా కప్పలు పెళ్లిళ్లు చేసో, అమ్మోరు పండుగలు చేసో, ఏవో పుక్కిట పురాణాలు చదివిస్తేనో మన సమస్యలు ఒడ్డెక్కిపోవు. మన రాజకీయ నాయకుల్లో అవినీతి పెరిగిపోయింది. భారతదేశంలో ఉన్నన్ని నదులు ఏ దేశంలోనూ లేవు. ఈ నదులను అనుసంధానం చేసి, ప్రాజెక్టులు కట్టి పంట పొలాలకు నీరు అందిస్తే పంటలకి లోటుండదు. దోపిడీ వుండదు. వలసలు ఉండవు. ఇవి మానేసి ‘అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిట’ అని పాత చింతకాయ పచ్చళ్లు తింటూ కూర్చుంటామని కాల యాపన చేస్తే వర్షాలు పడవు. నాకు తెలియకడుగు తాను పంతులు గారూ! వర్షాల కోసం విరాటపర్వమే ఎందుకు చదవాలి. రామాయణ, భాగవతాలెందుకు చదవ రాదూ? వీటిబదులు ‘పెదబాలశిక్ష’ చదివితే నాలుగు విషయాలు తెలుస్తాయి. అందు నుండి మీరు చదువుకుంటే నాకభ్యంతరం లేదు కానీముందు కెళ్లాల్సిన సమాజాన్ని వెనక్కి లాక్కండి. తప్పయితే మన్నించండి’’ అని విరమించాడు. యువత చప్పట్లు కొట్టారు. పెద్దాళ్లకు నోట మాట రాలేదు. ఎవరూ జవాబివ్వలేదు.

యువతలో విజయోత్సాహం!

పంతులు గారు గొంతు సవరించుకున్నారు.

‘‘నేను వయస్సులో పెద్దోణ్ణి, జ్ఞానంలో ‘జితేంద్రా’ నీ అంత పెద్దవాణ్ణి కాదు. నువ్వు చెప్పింది ఒకటి నిజం.. సమాజ పురోగమనానికి కృషి చేయాలి. తిరో గమనానికై కాదు. మన ఆలోచనలు ‘కొత్త ఒక వింత పాత ఒక రోత’ కారాదు. బంగారానికి కొత్త, పాతా తేడా ఉండదు అన్నీ మన వేదాల్లోనే ఉన్నాయిట’ అని ఎద్దేవా చేసే వాళ్లకి నా సమాధానం…వేదాలు చదవకుండా, వేద నాగరికత తెలియకుండా మన సిద్ధాంతాలు బూజు పట్టినవని అనుకోకూడదు. పృధు చక్రవర్తి పర్వతాలు, అరణ్యాలుగా ఉన్న నేలను చదును చేసి జనావాసానికి అనుగుణంగా పల్లెలు, నగరాలూ, పట్టణాలూ, నిర్మాణానికై ప్రణాళిక వేసినట్లు భాగవతంలో వ్యాస భగవానుడు చెప్పాడు. వాల్మీకి, వ్యాసులు రుషులు. వాళ్లు తపశ్శక్తి సంపన్నులు. యోగ బలం చేత ముల్లోకాలను డేగ కళ్లతో పరికించి త్రిలోకాలలో రుతువులు, ఈతి బాధలూ, వాటి నివారణోపాయాలు ముందే వివ రించారు. రామాయణంలో రాజ్య పట్టాభిషేకం స్వీకరించమన్న భరతునితో శ్రీరాముడు, రాజసూయ యాగం తరువాత యాగ విశేషాలు తెలుసుకోడాని కొచ్చిన నారదుడు ధర్మజుని అడిగిన ప్రశ్నలను మనం చదివితే ప్రజాపాలనని వాళ్లెంత నిశితంగా పరిశీలించి చెప్పారో తెలుస్తుంది.

రాజు సమర్థుడు కాకపోతే రాజ్యంలో అరాచకం పెరుగుతుంది. పేదలనాదుకోక, వాళ్లు అసహనానికి గురైతే తిరుగుబాటు చేస్తారు. ప్రజలకు రుణాలు, విత్తనాలివ్వాలి. వాళ్ల వినోదానికి పండుగలు జరిపించాలి. ఇలా ఎన్నో చెప్పాడు శ్రీనాథుడు. కాశీఖండంలో ఖగోళ, జ్యోతిష శాస్త్ర విషయాలు చెప్పాడు. తిక్కన రాజనీతిని వివరించాడు. ఈనాడు పాలకులు ఆ గ్రంథాలు చదివితే పరిపాలనంటే ఏంటో తెలుస్తుంది. శాంతిపర్వంలో చెట్లకు లతలకు స్పర్శ జ్ఞానం ఉంటుందని చెప్పాడు. లతలు చెట్టును అల్లుకుని మీదకు పాకుతాయి తప్ప కిందకి పాకవు. అదే వాటికి జ్ఞానం ఉందని చెప్పడానికి ఉదాహరణ. ఇలా చెప్పుకుంటూ పోతే మన పురాణాల్లో మానవ ప్రగతికి దోహదపడే అనేక విషయాలున్నాయి.

ఇక – ‘విరాటపర్వ’మే ఎందుకు? చదవాలో చెపుతాను. కౌరవులు, అధర్మపరులు, పాండవులు ధర్మాత్ములు. అధర్మం ధర్మం మీద దాడి చేసింది. ధర్మాన్ని ధర్మమే కాపాడాలి. మత్స్య దేశం చిన్న రాజ్యం. విరటుడు ధర్మ తత్పరుడు. గోసంరక్షణకుడు. గోవులే అతని ఆస్తి. గోవులంటే పరమ ధార్మికమైనవి. భారతం చదివితే గోవుల గొప్పతనం తెలుస్తుంది. అలాటి ధర్మరాజ్యంలో ధర్మరాజు తలదాచుకుంటాడు. ధర్మరాజంటే యమ ధర్మరాజు అంశ వల్ల పుట్టినవాడు. అతనిని కాపాడుకోవడం జాతికి అవసరం. అంటే ధర్మాన్ని నిలబెట్టుకో గలిగితేనే మనం నిలబడగలం.

అలాటి ధార్మికమైన దేశం కాబట్టే మన దేశం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకోగలిగి చెక్కు చెదరక వుంది. ఎవరికైనా, ఏ దేశంలోనైనా వర్షాలు పడక, మిడతల దండులాటి ఈతిబాధలు వచ్చినప్పుడు ధర్మాత్ములైన చరిత్ర కలిగిన ‘విరాటపర్వం’ పారాయణ చేస్తే – వానలు పడి, రైతులు పంటలు పండించి, జనం నోటికి అయిదు వేళ్లూ వెళ్లి దేశం సుభిక్షంగా ఉంటుందని మేధావులైన మన పూర్వికుల ఒక నిర్ణయం చేశారు. నమ్మకం ఉన్న వాళ్లు వినొచ్చు, పడితే వర్షాలు పడనూ వచ్చు, పడలేదనుకో ‘ఓ’ వెంట్రుకతో కొండను లాగుదాం.. కొండ కదిలితే గొప్పే. వెంట్రుక తెగిందనుకో… పోయేదేం లేదు. ఏమంటారు? పారాయణం చేద్దామా? చేసే పని ఆత్మశుద్ధితో చేస్తే మంచిది’ అని ముగించారు.

అందరూ చప్పట్లు కొట్టారు.

సరే ‘జన వాక్యంతు కర్తవ్యం’! అన్నాడు జితేంద్ర. వెంకటరత్నం శ్రావ్యమైన రాగంతో, పంతులు గారి కంచుకంఠం ఇచ్చిన వివరణతో విరాటపర్వం పారాయణం లాంఛనంగా ఆరంభమైంది.

పారాయణం ఇక మూడు రోజుల్లో ముగియనుంది. ఎండ పేట్రేగి పోతున్నది. గాలి లేదు. ఆకుల కదలిక లేదు. పశువులు దాహార్తితో అరుపులు పిల్లల గోల!

యువత వ్యంగ్యం నవ్వులు!

పంతులు గారూ, పెద్దలూ ఏమంటారా? అని..

 ఇంకా రెండు రోజులు –

వాతావరణ శాఖ హెచ్చరిక – బంగాళాఖాతంలో అల్పపీడనం! ఒరిస్సా పరదీపు రేవు మీదుగా పెనుగాలుల బీభత్సం, వర్షం కుండపోతగా కురవచ్చు… తుఫానుకు తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు. కానీ…

వాతావరణంలో మార్పు లేదు.

పెద్ద గాలికి, మేఘాలు చిట్లిపోయాయి.

మరి తుఫాను లేదు. వర్షం రాదు.

జనం పెదవి విరుపు!

యువత గంతులు, డాన్సులు, వెక్కిరింపులు!

ఒక్క రోజులో పురాణం ముగియనుంది…ముగిసింది. ఆశ్చర్యం!

సూర్య గ్రహణ పట్టినట్లు చీకట్లు, మెరుపులు, పిగుడులు, కరెంటు స్తంభాలు నేలకంటుకుపోతున్నాయి. ఇంటి పైకప్పులు ఎగిరిపోతున్నాయి. కానీ!

*****

‘ఆ.. ఇది తుఫాను ప్రభావం. అందుకే వర్షాలు కాకపోతే ఇక్కడ చదివితే పాకిస్తాన్‌, ‌బంగ్లాదేశ్లో కూడా వర్షాలా? వృద్ధుల నమ్మకాన్ని యువత కొట్టిపారేస్తూ…

పంతులు గారొక్కటే అన్నారు.

‘కాకీ వాలింది..పండూ పడింది’. పండెలాగ పడింది అన్నది ముఖ్యం కాదు. బాటసారి ఆకలి తీరడం ముఖ్యం. ‘వర్షం పడింది.. జనం కష్టాలు తీరాయి. అది ముఖ్యం’’ ఆ మాటలకు అందరూ చప్పట్లు కొట్టారు!

About Author

By editor

Twitter
YOUTUBE