– పాలంకి సత్య
ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
ఆనాటి రాత్రి శయన మందిరంలోనికి అడుగుపెట్టిన భర్తను సాదరంగా లోనికి తీసుకొని వచ్చి శయ్యపై కూర్చుండపెట్టింది నూతన వధువు. తాను నేలపై కూర్చుండి అతని పాదాల మీద పారిజాత, అశోకపుష్పాలు ఉంచింది.
‘‘ఇదేమి పని? నీవు కూర్చుండవలసినది నేలపై కాదు, నా హృదయసీమలో’’ అని విక్రమాదిత్యుడు ఆమెను లేవతీసి, తన ప్రక్కన కూర్చుండ పెట్టుకున్నాడు.
‘‘పూజ చేసినది నాలో స్త్రీత్వాన్ని మేలుకొలిపిన నా నాథుడికి. ఆనాడు యోగ మాయాదేవి మంది రంలో మిమ్ము చూసిన క్షణమే నా హృదయంలో నిలుపుకున్నాను. మీరెవరో నాకు తెలియదు. కుమారులు లేని కారణంగా కాబోలు నా తండ్రి నాకు వీరవిద్యలను నేర్పించారు. నేను మగువనన్న ఊహ నాలో ఏనాడూ లేదు. ఆనాడు మీ గానం నాలో నిద్రాణమైన స్త్రీత్వాన్ని మేలుకొలిపింది. నా మనసులో మీ రూపం ముద్రితమైపోయింది.’’
విక్రమాదిత్యుడు మాటలాడేలోగానే ‘‘మీ వివరాలు తెలిసికోవాలని ఎంతగానో అనుకున్నాను. ఇందప్రస్థాన్ని ముట్టడించినప్పుడు అంతఃపుర వాసులను కట్టడి చేసి లోపలనే ఉంచి వేసినారు. మాతామహులు నన్ను రణరంగంలో యుద్ధం చేసేందుకు అనుమతించలేదు’’ అని లక్ష్మీదేవి అన్నది.
‘‘స్త్రీ రక్షణ ప్రభువుల బాధ్యత’’
‘‘అజయమేరు నగరానికి తిరిగివచ్చిన తర్వాత మా జనకులు నా వివాహ ప్రసక్తి తెచ్చినారు. నేను నిత్య కన్యకగానో, బౌద్ధ సన్యాసినిగానో ఉండి పోగలనని చెప్పాను. నా మనసులో మీకు తప్ప మరి ఎవరికి స్థానం లేదు. కానీ తండ్రి గారితో ఆ విషయమేమని చెప్పగలను? మీ గురించి తెలియదు. మీ మనసు తెలియదు.’’
విక్రమాదిత్యుడు ఆమె చుట్టూ చేయి వేసి ‘‘నా మనసును నీవు ఆనాడే గెల్చుకున్నావు. పురుష రూపంలో ఉన్నప్పటికీ, ‘నేను పురుషుడనే’ అని నీవు ఉద్ఘాటించినప్పటికీ నేను నమ్మలేకపోయాను. నీవు భువనైక సుందరివని ఆనాడే గ్రహించాను. కానీ రాజధర్మం ముందు నీ ప్రేమ తరంగిణి ఆగిపోయింది. పరమేశ్వర కటాక్షంతో ప్రేమధర్మాలు ఒక చోటనే సిద్ధించినాయి’’ అన్నాడు.
‘‘మా తండ్రిగారు అనేక రాజ్యాల నుండి చిత్రపటాలు తెప్పించినారు. నాకు నచ్చినవారినే వరించవచ్చునని అన్నారు. చిత్రపటాలను చూసి, అందరినీ తిరస్కరించి, భగవత్సన్నిధి లోనే ఉండి పోవాలనుకున్నాను. కానీ నా పూర్వజన్మ సుకృతం కొద్దీ మీ పటం కన్పించింది. నా వలపు పంట పండింది.’’
‘‘నీది మాత్రమే కాదు. మన ఇద్దరి వలపు పంట పండింది. భగవంతుని కరుణ’’.
మీకొక రహస్యం చెప్పనా? ఆనాడు నా పేరు వీరసేన అని మీకు తెలియచేశాను. అందులో అసత్యమేమీ లేదు. నాకు వీరలక్ష్మీదేవి అని పేరు పెట్టారు. ఆంతరంగికులకే ఆ విషయం తెలుసు. వీరా అనీ, వీరసేనా అనీ తండ్రిగారు పిలుస్తూ ఉంటారు’’.
‘‘వీరా!’’ అని విక్రమాదిత్యుడు పిలిచాడు.
‘‘మహావీరా!’’ అని నూతన వధువు చిరునవ్వుతో భర్త ఎదపై తలపెట్టుకున్నది.
****
మరునాడు మిహిరుడు విక్రముని దగ్గరకు వెళ్లి, ‘‘మిత్రమా! సెలవు!’’ అన్నాడు.
‘‘అదేమి? ఉజ్జయినికి అందరము కలిసియే పోవచ్చును.’’
‘‘వైద్యశాస్త్రంలోని ప్రాథమిక సూత్రాలను అభ్యసించేందుకు తక్షశికు పయనమవుతున్నాను. ఆపైన పారసీకం వెళ్లి యవన జ్యోతిషం నేర్చుకో వాలని ఉన్నది. అలెగ్జండరు దండయాత్ర అనంతరం పారసీకం గ్రీకుల వశమైన సంగతి నీకు తెలియనిది కాదు. అతని సేనాధిపతి సెల్యూకసు వారసులే కొంతకాలమక్కడ రాజ్యం చేశారు. ఆ సమయంలో గ్రీసు నుండి అనేక మంది పండితులు వచ్చి, అక్కడ నివాసమేర్పరుచుకున్నారు. నేడు పారసీకంలో గ్రీకుల అధికారం లేనప్పటికీ, యవన పండితులు వెనుకకు పోలేదు’’.
‘‘మాతృ సమానురాలు, గురుపత్ని నీ విదేశయానాన్ని అంగీకరించినారా?
‘‘పితృదేవులే ఆమెను ఒప్పించినారు. శీఘ్రంగా తిరిగి రావలెనని జననీ జనకుల ఆదేశం’’.
‘‘నా కోరిక కూడా అదే. శాస్త్ర విజ్ఞానం సంపాదించి త్వరలోనే వచ్చెదవు గాక’’.
‘‘నీ కోరిక కనుక తప్పక తీరగలదు. నీవు కోరిన కన్యయే నీకు గృహిణిగా లభించినది కదా!’’
‘‘నీకెట్లు తెలిసినది?’’
మిహిరుడు విక్రముని కౌగిలించుకుని, ‘‘స్నేహితుని అంతరంగాన్ని గ్రహించలేనా? వివాహ వేదిక మీద నీ ముఖ కవళికలే చెప్పాయి’’ అన్నాడు.
‘‘మనసులోని ఊహలు ముఖం మీద కన్పించాక నాకు మహారాజు పదవికి అర్హత ఉన్నదా?’’ విక్రమాదిత్యుడన్నాడు.
‘‘అదేమిమాట? నాకు తప్ప ఎవరికీ నీ మనోభావాలు తెలియవు. ఇక సెలవు!’’.
****
వివాహం జరిగిన వారానికి అజయరాజు విక్రమాదిత్యునితో ‘‘ఇదివరలోనే విన్నవించు కున్నాను. నాకు పుత్ర సంతానం లేదు. తామే ఈ రాజ్యలక్ష్మిని కూడా స్వీకరించవలసినది. నా కుమార్తెకు వీరోచిత విద్యలను నేర్పించినాను. రాజనీతి కూడా నేర్చుకున్నది. అయినప్పటికీ సనాతన సంప్రదాయాలననుసరించి స్త్రీకి సింహాసనార్హత లేదు. అజయమేరు రాజ్యం దాయాదుల పాలు కావడం భావ్యం కాదు. నా కోరిక మన్నించవలసినది’’ అన్నాడు.
విక్రమాదిత్యుడు మంత్రులతో సంప్రదించి, అంగీకారం తెలిపాడు. శుభ ముహూర్తాన విక్రమాదిత్యుని పట్టాభిషిక్తుని చేసిన అనంతరం అజయరాజు కోరికపై పురోహితులు ‘‘విక్రమా దిత్యుడు త్వరలో చక్రవర్తి కాగలడు’’ అని ఆశీర్వదించారు.
****
ఉజ్జయినీ నగరానికి తిరిగివచ్చిన వెంటనే విక్రమాదిత్యుడు భార్యా సమేతుడై ఆశ్రమానికి వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించాడు.
‘‘అగ్నివంశ సంజాత అజయరాజు పుత్రిక, విక్రమాదిత్యుల భార్య వీరలక్ష్మి నమస్కరిస్తున్నది. ఆశీర్వదించ ప్రార్ధన’’.
‘‘అమ్మా! వీర, పుత్ర పౌత్రాభివృద్ధిగా, దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లు!’’
‘‘ధన్యురాలను!’’
‘‘నీవు విశేష వీర విద్యలను అభ్యసించినావని తెలిసి ఆనందించాం. అవంతీ రాజ్య సంరక్షణలో నీ విద్య ఉపయుక్తమగును గాక’’.
‘‘తమ ఆశీర్వాదమే నాకు శ్రీరామరక్ష’’
‘‘కుమారా! రేపు ఉదయమే ఇరువురూ పరమేశ్వరాలయానికి వెళ్లి, స్వామిని అర్చించుట శ్రేయస్కరం.’’
‘‘జనకుల ఆజ్ఞ.’’
నూతన వధూవరులు మరొకసారి నమస్కరించి, రాజధానికి మరలారు.
****
రాజ దంపతులు కార్తిక మాసంలో సోమవారం ఉదయమే శివాలయానికి వెళ్లి, పరమేశ్వర దర్శనం చేసికొన్నారు.
పూజానంతరం విక్రముడు ‘‘ద్వాదశ జ్యోతిర్లింగా లలో ఈ లింగమొకటి. మహాకాళునిగా ఇక్కడ స్వామి ప్రసిద్ధుడు’’ అని తెలియజేసినాడు.
‘‘లింగం దక్షిణముఖంగా ఉన్నదేల?’’ అని వీరలక్ష్మి ప్రశ్నించింది.
‘‘ఇక్కడ స్వామి మహాకాళునిగా అర్చనలు అందుకుంటున్నాడు. కాలు లేదా యమధర్మరాజు మహాకాళుని ఆజ్ఞ లేనిదే ఎవరి ప్రాణమునూ హరించ లేడు. స్వామికి విన్నవించిన అనంతరమే ఏ జీవి ప్రాణాన్నయినా తనతో తీసుకొని వెళ్లాలి. యమధర్మ రాజు దక్షిణ దిక్కులో నివాసముంటాడు కాబట్టి మహాకాళుడు దక్షిణ ముఖంగా ఇక్కడ కొలువై నిలిచినాడు’’ అని వివరించాడు.
‘‘ప్రతి దేవాలయంలోనూ శివలింగాన్ని ఏ విధంగా ప్రతిష్టించినా, ఆలయంలో దక్షిణామూర్తి విగ్రహం ఉండడం నీవు చూసియే ఉందువు’’ అని విక్రమాదిత్యుడు అన్నాడు.
ఇరువురూ మహాకాళి నామంతో వెలసిన అమ్మవారి దర్శనం చేసికొన్న తర్వాత విక్రముడు ‘‘ద్వాదశ లింగాలలో ఒకటి, అమ్మవారి అష్టాదశ పీఠాలలో ఒకటి ఉజ్జయినిలో నెలకొని ఉండుట ఈ నగర ప్రజల పురాకృత పుణ్యఫలం. శ్రీశైలం, వారణాసిలో సైతం జగన్మాతా పితరులు ఈ విధంగా కొలువైనారు’’ అని చెప్పినాడు.
‘‘అమ్మ ఎంతటి అదృష్టానికి నోచుకున్నదో, పతిలో సగభాగమైనది’’ అని వీరలక్ష్మి భర్త చేతిని తన చేతిలోనికి తీసికొన్నది.
‘‘వీరయేనా ఈ మాటలంటున్నది?’’ విక్రముడు చిరునవ్వుతో ప్రశ్నించినాడు.
‘‘జగదంబను మించిన వీరవనిత ఎవరు? మహిషాసుర సంహార సమయంలో పురుషులైనా ఆమెను మించగలరా? రాక్షస సంహారంలో ఆమె వజ్రం కన్నా కఠినమైన శరీరం కలది. భర్త సన్నిధిలో శిరీష కుసుమము కన్నా సుకుమారి’’.
‘‘నీ వలెనా?’’
‘‘జగన్మాత పాదరేణువుగా ఉండేందుకైనా అర్హత లేని దానను. నాకూ, ఆమెకూ పోలిక ఒక్క విషయములోనే. పతి ఎడబాటును నేను కొంచెమైనా సహించలేను. ఆమె వలె సగభాగమైన ఎంత బాగుండునో?’’
‘‘దేవాలయంలో ప్రేమ విషయాలు మాట్లాడ తగునా?’’
‘‘నన్ను మీరు హాస్యములాడుట న్యాయమా?’’
ఇరువురూ సన్నగా నవ్వుకొన్నారు. ఆపైన దేవాలయ శిఖరానికి నమస్కరించి, రథమునెక్కి, ప్రాసాదమును చేరుకొన్నారు.
****
మిహిరుడు వాయవ్యదిశగా పయనించి, పాంచాల రాజ్యాన్ని దాటి తక్షశి చేరుకున్నాడు. శ్రీరామచంద్రుడు భరతుని కుమారులిద్దరకూ రాజ్యాలిచ్చిన సమయంలో భరతపుత్రుడు తక్షునకై నిర్మింపచేసిన నగరమే కాలక్రమేణ తక్షశిలగా పేర్గాంచింది. తక్షశిలలోని విద్యాలయం జగత్ప్రసిద్ధం. మిహిరుడు విద్యాలయ కులపతులను దర్శించి తన కుల గోత్రాలనూ, నివాసాన్నీ విన్నవించి, నమస్క రించాడు.
కులపతి సాదరంగా ‘‘ఆదిత్యదాసుల గురుకులం మాకు తెలిసినదే. విద్యార్థులనేకులు విశేష విద్యార్జనకై మా వద్దకు వస్తూంటారు’’ అన్నాడు.
వైద్యశాస్త్రంలోని ప్రాథమికాంశాలు నేర్చుకోవా లని ఉన్నది. ఖగోళ శాస్త్రానికి అనుబంధమైన వైద్య విద్యా విషయాలను తెలుసుకోవాలని నా కోరిక’’.
‘‘అటులనే’’ అని చెప్పి కులపతులు మిహిరుని వైద్యాచార్యుల వద్దకు పంపించినాడు. మిహిరుడు యవన జ్యోతిషం అభ్యసించవలెనన్న కోరిక ఉందని తెలిసిన తర్వాత ఆయన ‘‘నీవు గ్రీకు, పారసీక భాషలు నేర్చుకోవడం మంచిది. పారసీక రాజ్యాన్ని కొంత కాలం గ్రీకులు పాలించడం చేత అక్కడ పారసీక, గ్రీకు భాషలు రెండూ వ్యవహారంలో ఉన్నాయి. గ్రీకు నేర్వడం సులభం. సంస్కృతం వలె ఉంటుంది. మన విద్యాలయంలోనే నీవు రెండు భాషలనూ అభ్యసించ వచ్చును’’ అని అన్నాడు.
వైద్యశాస్త్రాంశాలనూ, గ్రీకు, పారసీక భాషలనూ ఒక సంవత్సరంలో నేర్చుకున్న మిహిరుడు జననీ, జనకులకు లేఖ రాశాడు. తాను పారసీక రాజ్యానికి పయనమవుతున్నాననీ, యవన ఖగోళ శాస్త్ర మభ్యసించి, తిరిగి రాగలననీ తెలియజేశాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదబలమూ, భగవదనుగ్రహమూ తాను త్వరలో తిరిగి వచ్చేలా చేయగలవని అన్నాడు.
****
మిహిరుడు పారసీక రాజధానిని చేరుకునేసరికి సాయంకాలమైంది. భరత భూమిలో జరిగినంత సులభంగా పారసీక రాజ్యంలో ప్రయాణం సాగలేదు. భరతఖండంలో రాజులూ, సంపన్నలూ వితరణ శీలులై మార్గమంతటా వసతి సౌకర్యం, అన్నదానం ఏర్పాటు చేసినారు. గ్రీకుల పాలనలో కొంతకాలం ఉండడమేమో, కారణమేమో తెలియదు కానీ పారసీక రాజ్యంలో బాటసారులకు ఎటువంటి సదుపాయాలు లేవు. వృక్ష ఛాయలో విశ్రాంతి. ఫలాలే ఆహారం.
నగర ప్రవేశం తరువాత మిహిరునికి రాత్రి ఎక్కడ ఉండాలన్న ప్రశ్న ఉదయించింది. కొంతసేపు ఆలోచించి, ధైర్యం చేసి ఎదురుగా ఉన్న ఇంటి తలుపు తట్టాడు. తలుపు తీసిన వ్యక్తి స్త్రీ. అన్య కాంతలను చూడరాదన్న నియమాన్ని అనుసరించి, కనులు దించుకుని, ‘‘నా నామధేయం మిహిరుడు. భరతభూమిలోని ఉజ్జయినీ నగరవాసిని. కార్యార్ధినై…’’ అని చెప్పే లోగానే ఆమె ‘‘నా పేరు ఖనా. నేను ఈ దేశ వాసిని’’ అని అన్నది.
మిహిరుడు ఈమె తన వివరాలు ఎందుకు చెబుతున్నదోనని ఆశ్చర్యపడి, ‘‘నాకు ఈ రాత్రి మీ గృహ ప్రాంగణంలో నిద్రించేందుకు అనుమతినీయ ప్రార్ధన’’ అన్నాడు.
ఖనా సమాధానమిచ్చే లోగానే ఇంటిలో నుంచి వచ్చిన పురుషుడు విషయం తెలిసికొని ‘‘ప్రాంగణంలో ఎందుకు? లోపలే శయనించ వచ్చును. రండి’’ అని మిహిరుని లోపలకు తీసుకొని వెళ్లి, ఒక గదిని చూపించాడు. అలసి ఉన్న మిహిరుడు శయ్యపై పడుకున్న మరుక్షణమే నిద్రించాడు.
మరునాడు ఉదయమే మేల్కొన్న మిహిరుడు గృహ యజమానికి కృతజ్ఞతను తెలియజేసి, సెలవిప్పించమని అడిగాడు. ఆయన ‘‘ఇక్కడనే కాలకృత్యాలు తీర్చుకుని వెళ్లవచ్చును’’ అన్నాడు. మిహిరుడు స్నాన జప, సంధ్యావందనాదికాలు పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత గృహ యజమాని మిహిరుని రాకకు కారణమడిగాడు.
తాను ఖగోళశాస్త్ర విద్యార్థిననీ, యవన జ్యోతిషం నేర్చుకొనేందుకు వచ్చాననీ మిహిరుడు చెప్పినాడు.
‘‘యవనులుండు ప్రదేశం మీకు అనుకూలంగా ఉండదు. విద్యార్జనకై గ్రీకు గురువుల వద్దకు పోవచ్చును కానీ అక్కడ ఉండడం భరతభూమి వాసులకు కష్టం. మీరు మా ఇంటినే ఉండవచ్చును. మేము అగ్ని ఆరాధకులం. ఆచార వ్యవహారంలో భరత ఖండ ప్రజలకూ, మాకూ సామీప్యమున్నది.’’
‘‘మీకు ఇబ్బంది కల్గించుట…’’
‘‘ఇబ్బంది ఏమున్నది? ఇంట ఉన్నది ఇద్దరమే. నేనూ, నా పుత్రిక ఖనా, దాస దాసీ జనమున్నది.’’
‘‘కృతజ్ఞుడను… స్వయంపాక నియమమున్నది. నేనే నా భోజనమునకు ఏర్పాటు చేసికొనగలను.’’
‘‘సరే’’
****
మిహిరుడు వీధిలోనికి వెళ్లి, దారి తెలిసికొని బియ్యం, పప్పు, పెరుగు, కుండలు కొని తెచ్చు కున్నాడు. తక్షశిల విద్యాలయ కులపతులు పారసీక భాష ఎందుకు నేర్చుకొనమన్నారో అతనికి బోధపడింది.
ఇప్పుడు వంట చేయవలెను. ఎట్లు? ఇంటిలో ఉన్నప్పుడు హోమం కోసం అగ్ని వ్రేల్చటం అలవాటయిన కార్యమే. ఇక కష్టమేమున్నది? ముందుగా రెండు కర్రలతో అగ్నిని రగిల్చి, మరికొన్ని కర్రలను చేర్చి, కుండలో నీరు, బియ్యం పోసి పెట్టినాడు. గడియకు అన్నం పొంగినది. ఉడికినది కాబోలునని పక్కన పెట్టి, వేరొక కుండలో పప్పు, నీరు పోసి పెట్టినాడు. పొంగిన వెంటనే దింపినాడు.
‘‘ఇదేమి అన్నమిట్లున్నది? ఒక ప్రక్కన మెత్తగా పిండి వలెనున్నది. మరొయొక ప్రక్కన బియ్యమే. పప్పు ఉడుకనే లేదు. ఖగోళశాస్త్రం కంటే పాకశాస్త్రమే కష్టతరమా?’’
అతని కనుల ముందు మాతృదేవత ఛాయాదేవి కదలాడింది. ఆమెకు నమస్కరించి, మధ్యాహ్న సంధ్యావందనం నిర్వర్తించి, భోజనం ముగించినాడు.