– జమలాపురపు విఠల్‌రావు

ఇతరులకు మనమేం చేస్తామో దాన్నే ప్రకృతి మనకు రెండింతలుగా అందిస్తుందన్న సత్యం ఇప్పుడు పాకిస్తాన్‌కు వర్తిస్తుంది. ముఖ్యంగా పాక్‌-ఆఫ్ఘన్‌ ‌సరిహద్దును నిర్ధారిస్తున్న ‘డ్యూరాండ్‌ ‌రేఖ’ను అంగీకరించే ప్రసక్తే లేదని తాలిబన్‌ ‌తెగేసి చెప్పడం పాక్‌-‌తాలిబన్‌ ‌మధ్య వైరం పతాక స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం. ఇటీవల పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం ఫెడరల్లీ అడ్మినిస్టర్డ్ ‌ట్రైబల్‌ ఏరియాస్‌ ఆఫ్‌ ‌పాకిస్తాన్‌ (‌ఫతా)ను ఖైబర్‌ ‌ఫక్తూన్‌క్వా (కేపీ) ప్రావిన్స్‌లో కలిపేయడం, డ్యూరాండ్‌ ‌రేఖ విషయంలో కఠిన వైఖరి అవలంబించడంతో ఆగ్రహించిన తెహ్రిక్‌-ఇ-‌తాలిబన్‌ ‌పాకిస్తాన్‌ (‌టీటీపీ) ఏకంగా పాకిస్తాన్‌లో ఉగ్రవాద దాడులతో రావణకాష్టాన్ని రగిల్చింది. గత నవంబర్‌ ‌నుంచి ఇప్పటి వరకు జరిగిన టీటీపీ దాడుల్లో 261 మంది పాక్‌ ‌భద్రతాసిబ్బంది మరణాలే పాకిస్తాన్‌-‌తాలిబన్‌ ‌హానీమూన్‌ ‌విషాదాంతానికి గుర్తు!

రెండు దశాబ్దాలపాటు అధికారానికి దూరంగా ఉన్న తాలిబన్‌ ‌తిరిగి ఆఫ్ఘన్‌ ‌పగ్గాలను చేపట్టేందుకు, ఇందుకు ప్రతిగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఆఫ్ఘన్‌ను విడిచి వెళ్లేందుకు వీలుగా యూఎస్‌-‌తాలిబన్‌ ‌మధ్య ఒక ఒప్పందం కుదరడంలో పాకిస్తాన్‌ ‌కీలక పాత్ర పోషించింది. ఈ ఒప్పందం నేపథ్యంలో యూఎస్‌ ‌నేతృత్వంలోని సంకీర్ణ సేనలు ఆఫ్ఘానిస్తాన్‌ను ఖాళీ చేసిన తర్వాత ఆగస్టు 15, 2021న అక్కడ ఏర్పాటైన తాలిబన్‌ ‌ప్రభుత్వానికి పాక్‌ అం‌డగా నిలిచినప్పటికీ, అమెరికా ఒత్తిడికి భయపడి అక్కడి ప్రభుత్వాన్ని గుర్తించ లేదు. అయితే ఆఫ్ఘానిస్తాన్‌పై వ్యూహాత్మక పట్టు సాధించేందుకు తనకు సహకరిస్తారని ఆశించిన పాకిస్తాన్‌కు తాలిబన్ల అసలు రూపం తెలుసుకోవడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఆఫ్ఘన్‌ ‌తాలిబన్‌ ‌తనకు గొప్ప ఆస్తిగా పరిగణించిన పాకిస్తాన్‌కు ఇప్పుడు వారే పక్కలో బల్లెంగా మారడం జీర్ణించుకోలేని అంశం. ‘తాలిబన్‌ అధికారంలోకి రావడం ద్వారా బానిసత్వపు సంకెళ్ల నుంచి ఆఫ్ఘన్లు బయటపడ్డార’ంటూ అప్పటి పాక్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ ‌ఖాన్‌ ‌గంభీర ప్రకటనలు గుప్పించగా ఎంతోమంది పాకిస్తానీయులు తాలిబన్‌ ‌రాకను స్వాగతించారు. అయితే, అప్పుడు పొగడ్తలతో ముంచెత్తినవారే ఇప్పుడు తలలు పట్టుకొనే పరిస్థితి!

ఇరకాటంలో చైనా

గ్వాదార్‌ ‌హక్కుల ఉద్యమ నాయకుడు మౌలానా హిదాయత్‌ ఉర్‌ ‌రెహమాన్‌.. ‌గ్వాదార్‌ ‌పోర్ట్ ‌ప్రాంతాన్ని చైనీయులు విడిచిపెట్టి వెళ్లాలని ఇటీవల హుకుం జారీ చేయడం చైనాకు ఎంతమాత్రం కొరుకుడు పడని అంశం. ఆసియన్‌ ‌లైట్‌ ఇం‌టర్నేషనల్‌ ‌ప్రకారం గ్వాదార్‌ ‌పోర్టులో పనిచేసే చైనీయుల సంఖ్య 500. బెల్ట్ అం‌డ్‌ ‌రోడ్‌ ఇనిషియేటివ్‌ (‌బీఆర్‌ఆర్‌) ‌ప్రాజెక్టులో చైనాకు గ్వాదార్‌ ‌పోర్టు విస్తరణ అత్యంత కీలకం. గ్వాదార్‌లో పెరుగుతున్న చైనా వ్యతిరేక సెంటిమెంట్‌, ‌సీపీఈసీ ప్రాజెక్టుల పురోగతిని అడ్డుకుంటోంది. ప్రస్తుతం పాకిస్తాన్‌లోని వివిధ ఉగ్రవాద గ్రూపుల నుంచి చైనీయులు బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో టీటీపీ కాల్పుల విరమణ ఒప్పందం గత నవంబర్‌లో ముగిసిన దగ్గరి నుంచి ఖైబర్‌ ‌ఫక్తూన్‌క్వా, బెలూచిస్తాన్‌లలో ఉగ్రదాడులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న ఆందోళనల వల్ల పాక్‌-‌చైనాల ఆర్థిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. నిజానికి మాలాఖండ్‌ ‌డివిజన్‌లో టీటీపీ కార్యకలాపాలు బాగా పెరిగిపోవడంతో షాంగ్లా జిల్లాకు చెందిన కొరారా ప్రాంతం, స్వాత్‌ ‌జిల్లాలోని గోర్కిన్‌ ‌మటిల్టన్‌ ‌ప్రాంతంలో చేపట్టిన రెండు జలవిద్యుత్‌ ‌కేంద్రాల నిర్మాణం గత ఏడెనిమిది నెలలుగా నిలిచిపోయింది. టీటీపీ నుంచి భద్రతా పరమైన సమస్యలు ఎదురు కావడంతో ఖైబర్‌ ‌ఫక్తూన్‌క్వాలో పనిచేస్తున్న చైనా ఇంజినీర్లను గతేడాది జులై నెలలో ఇస్లామాబాద్‌కు తరలించడంతో ప్రస్తుతం ఆయా ఇంజినీర్లు ఖాళీగా ఉండాల్సి వస్తోంది. గ్వాదార్‌ ‌ప్రజలు సీపీఈసీ ప్రాజెక్టులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చైనా ఎంతగా వీటిని తక్కువ చేసి చూపాలనుకున్నా వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చడం సాధ్యంకాదు.

డ్యూరాండ్‌ ‌రేఖ వివాదం

18వ శతాబ్దంలో దుర్రానీ రాజవంశం పతనం కావడంతో పస్తూన్‌ ‌సామ్రాజ్యం పతనమైంది. దీన్ని అదనుగా భావించిన బ్రిటిష్‌ ఈ ‌ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అయితే 1838-42, 1878-80 ఆంగ్లో-ఆఫ్ఘన్‌ ‌యుద్ధాలు బ్రిటిష్‌ ‌సామ్రాజ్య విస్తరణకు దోహదం చేయకపోవడంతో రష్యా దాడి భయంతో అప్పటి ఆఫ్ఘన్‌ ‌పాలకుడు అబ్దుల్‌ ‌రెహమాన్‌తో నవంబర్‌ 12, 1893‌న ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అప్పటి విదేశాంగశాఖ కార్యదర్శి మార్టిమర్‌ ‌డ్యూరాండ్‌ ‌ఫస్తూన్‌ ‌ప్రజలు నివసించే ఈ ప్రాంతం మధ్య గుండా నిర్ధారించిన సరిహద్దు రేఖను ఈ ఒప్పందం ఖరారు చేసింది. నిజానికి ఇది నాటి ఆఫ్ఘన్‌ ‌పాలకుడికి లేదా ఫస్తూన్‌ ‌ప్రజలకు ఎంతమాత్రం ఇష్టంలేదు. అప్పటి పరిస్థితులు ఆఫ్ఘన్‌ ‌పాలకుడిని అంగీకరించేలా చేసి ఉండవచ్చు. అయితే 1949లో ఆఫ్ఘన్‌ ‌లోయర్‌ ‌జిర్గా (గిరిజన అసెంబ్లీ) ఈ రేఖ తమకు సమ్మతం కాదని పేర్కొంటూ గతంలో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి వైదొలగింది. ఈ డ్యూరాండ్‌ ‌రేఖ నేటి పాకిస్తాన్‌లోని ఖైబర్‌ ‌ఫక్తూన్‌క్వా (వాయువ్య సరిహద్దు ప్రాంతం), బెలూచిస్తాన్‌లోని సమాఖ్య పాలన కలిగిన ప్రాంతాల (ఫతా) గుండా వెళుతోంది. ఆఫ్ఘానిస్తాన్‌లోని పది ప్రావిన్స్‌లు కూడా ఈ రేఖ లోపలికే వస్తాయి. ఈ వివాదాస్పద ఫస్తూన్‌ ‌భూభాగమే ఇప్పుడు పాక్‌-ఆఫ్ఘన్‌ల మధ్య ఘర్షణలకు కారణం. ఈ డ్యూరాండ్‌ ‌రేఖ వివాదం కారణంగా 1947 నుంచి 1978లో మహమ్మద్‌ ‌దావూద్‌ ‌ఖాన్‌ ‌ప్రభుత్వం కుప్పకూలిపోయే వరకు రెండు దేశాల మధ్య అప్రకటిత యుద్ధాలే కొనసాగాయి. 1947లో పాకిస్తాన్‌ ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పుడు, ఆ దేశానికి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఇవ్వ కూడదని ఓటు వేసిన ఒకే ఒక దేశం ఆఫ్ఘానిస్తాన్‌! 1978‌లో ఖాన్‌ ‌ప్రభుత్వం కూలిపోయి కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాల్లో పాక్‌దే పైచేయి కావడం ప్రారంభ మైంది. కమ్యూనిస్టుల పాలనలో పారిపోయిన ఆఫ్ఘన్‌లను పాకిస్తాన్‌ ‌స్వాగతించింది. అప్పట్లో పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం, ఐఎస్‌ఐ అం‌దించిన పూర్తి మద్దతుతో వీరు ‘ముజాహిద్దీన్‌లు’గా ఏర్పడి 1979-89 మధ్య కాలంలో ఆఫ్ఘన్‌లోని సోవియట్‌ ‌యూనియన్‌ ‌దళాలపై గెరిల్లా పోరాటం సలిపారు. ఆ తర్వాత ఆఫ్ఘానిస్తాన్‌లోని చాలా ప్రాంతాలను ఆక్రమించుకొని చివరికు 1996లో కాబూల్‌ను ముట్టడించగలిగారు. ఇదిలా ఉండగా ఈ డ్యూరాండ్‌ ‌రేఖను గత ప్రభుత్వాల మాదిరిగానే తాలిబన్‌ ‌కూడా అంగీకరించడం లేదు. ఇప్పుడు పాకిస్తాన్‌ ‌డ్యూరాండ్‌ ‌సరిహద్దు వెంట కంచె నిర్మాణం చేపట్టడానికి ఉపక్రమించడం, తాలిబన్‌ను ఆగ్రహానికి గురి చేసింది. గతంలో కూడా బెలూచ్‌ ‌తిరుగుబాటుదార్లకు ఆఫ్ఘానిస్తాన్‌ ‌రాజకీయంగా, ఆర్థికంగా, ఆయుధ పరంగా మద్ధతివ్వడానికి ప్రధాన కారణం డ్యూరాండ్‌రేఖ విషయంలో పాకిస్తాన్‌ను చర్చలకు దిగివచ్చేలా చేయాలన్న లక్ష్యమే. ఇప్పుడు బెలూచ్‌ ‌తిరుగుబాటుదార్లు, తాలిబన్‌ ఏకం కావడానికి ఈ నేపథ్యం కూడా ఇదేనన్నది గుర్తుం చుకోవాలి.

మారిన తాలిబన్‌ ‌వైఖరి

గతంలో ఆఫ్ఘన్‌ ‌తాలిబన్‌ను పాకిస్తాన్‌ ‌నియంత్రించగలిగిందంటే అందుకు మతపరంగా సైద్ధాంతిక సారూప్యతే ప్రధాన కారణం. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌ అధికారంలోకి రావడం, పాకిస్తాన్‌లోని షరియా సమర్థకులకు స్ఫూర్తి కలిగించినా ఇది చివరకు పాక్‌లోనే ఇస్లామిక్‌ ‌రాడికల్స్ ‌మరింత బలోపేతం కావడానికి దోహదం చేసింది. ఫలితంగా తాలిబన్లు భారత్‌ను వ్యతిరేకించే తమ సంప్రదాయ వైఖరిని పక్కనబెట్టి, దేశాన్ని మరింత ఇస్లామికీకరణ చేయాలని ఇప్పుడు ఏకంగా పాక్‌ ‌ప్రభుత్వంపైనే ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిజానికి పాక్‌ ‌ప్రభుత్వం తన భారత వ్యతిరేక విధానాలను అమలు చేయడానికి, తాలిబన్లను ఉపయోగించు కోవాలని చూసింది. కానీ ఇప్పటి తాలిబన్లు ఒకప్పటి తాలిబన్లు కాదు. ఆఫ్ఘానిస్తాన్‌లో అధికారంలో ఉన్నారు. పాక్‌ ‌చెప్పినట్టు విని భారత్‌ను పక్కన పెట్టడం వల్ల వారికి ఎంత మాత్రం ఉపయోగం లేదు. ముఖ్యంగా ఆ దేశంలో అనేక ప్రాజెక్టులకు భారత్‌ ఆర్థిక సహాయం అవసరం. ఈ నేపథ్యంలో భారత్‌తో మిత్రత్వాన్ని నెరపడం మాట అట్లా ఉంచి, శత్రుత్వ వైఖరి వహించే పరిస్థితి లేదు. ఇది పాక్‌కు తన కన్నును తన వేలితోనే పొడుచుకునే పరిస్థితిలోకి నెట్టేసింది. అంతేకాదు తాలిబన్లను చర్చలకు వచ్చేలా చేయడంలో రష్యా, చైనా, ఖతార్‌లు కీలక పాత్ర పోషించిన విషయాన్ని పాక్‌ ‌విస్మరించ జాలదు. అదీకాకుండా ఖతార్‌, ఇరాన్‌, ‌యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ‌చైనా, రష్యాలతో సంబంధాలు నెరపుతూ పాక్‌ ఆదేశాలను పాటించబోమన్న సంకేతాలను తాలిబన్లు పంపుతున్నారు. ఇదేసమయంలో ఆఫ్ఘానిస్తాన్‌ ‌ప్రజల్లో పాకిస్తాన్‌ ‌పట్ల గూడుకట్టుకున్న ఆగ్రహాన్ని తాలిబన్లు గుర్తించి జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా గడిచిన సెప్టెంబర్‌ 22‌న పాక్‌తో జరిగిన క్రికెట్‌ ‌మ్యాచ్‌లో తమ జట్టు ఓటమి పాలైనప్పుడు ఆఫ్ఘన్‌ అభిమానుల ప్రతిస్పందనే ఇందుకు ఉదాహరణ. ఈ నేపథ్యంలో పాక్‌ అభిమానులు వీరిని ‘నమక్‌ ‌హరామ్‌’‌గా పేర్కొంటే, పాక్‌ అభిమానులను ‘టెర్రరిస్టులు’ అంటూ ఆఫ్ఘన్‌ అభిమానులు సంబోధించడం గమనార్హం.

ఫస్తూన్‌ ‌జాతీయవాదం

ఆఫ్ఘానిస్తాన్‌, ‌పాకిస్తాన్‌లో కొనసాగుతున్న తాలిబన్‌ ఉద్యమం వెనుక ఫస్తూన్‌ ‌జాతీయ వాదమున్నదన్న సంగతిని ఎవ్వరూ గుర్తించడం లేదు. ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్‌ అధికారంలోకి రావడాన్ని కేవలం ఇస్లామిస్టు ఉగ్రవాద విజయంగా భావిస్తున్నారు తప్ప, ఫస్తూన్‌ ‌జాతీయవాద తీవ్రతను నిర్లక్ష్యం చేస్తున్నారు. తాలిబన్లను ‘ఇస్లామిక్‌ ‌వాదులుగా’ ప్రపంచానికి చూపడానికి పాక్‌ ‌సైన్యం యత్నించినా, అసలు కారణమైన ఫస్తూన్‌ ‌జాతీయ వాదమే తనను నిండా ముంచుతున్నదన్న సత్యాన్ని గ్రహించకపోవడం వల్ల ఇప్పుడు టీటీపీ నుంచి ప్రతక్ష్యంగా దాడులను ఎదుర్కొనాల్సి వస్తోంది. టీటీపీ దాడులు గతంలో పోలిస్తే 51శాతం పెరగడానికి ఇదే ప్రధాన కారణం. అంతేకాదు అల్‌ఖైదా, ఇస్లామిక్‌ ‌స్టేట్‌ ఇన్‌ ‌ఖొర్రాసమ్‌ ‌ప్రావెన్స్ (ఐఎస్‌కేపీ)తో కూడా టీటీపీకి మంచి సంబంధాలున్నాయి. పాక్‌ ‌సైన్యాధ్యక్షుడిగా జనరల్‌ అసీమ్‌ ‌మునీర్‌ ‌పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత, రావల్పిండిలోని సైనిక కేంద్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి ఖైబర్‌ ‌ఫక్తూన్‌క్వా, ఉత్తర బెలూచిస్తాన్‌ ‌ప్రాంతాల్లో సైనిక చర్యలు చేపట్టాలని నిర్ణయించిన తర్వాత గడచిన డిసెంబర్‌ ‌మొదటివారంలో కాబూల్‌లోని పాకిస్తాన్‌ ‌రాయబార కార్యాలయంపై బాంబుదాడి జరగడం గమనార్హం. వీటన్నింటికి కారణం ఆఫ్ఘన్‌-‌తాలిబన్‌ అన్న సత్యాన్ని పక్కన బెట్టి, పాక్‌లోని సంప్రదాయవాదులు భారత్‌పై నిందలు మోపడం మారని వారి కుత్సిత బుద్ధికి నిదర్శనం. ఇక్కడ మరో కీలక అంశం కూడా ఉంది. ఒకవేళ టీటీపీ ఉగ్రవాదులను పాక్‌ ‌సైన్యానికి లొంగి పోవాలని కోరితే, వారు ఐఎస్‌కేపీ, అల్‌ఖైదా గ్రూపులతో కలిసి తనకే ఎసరు తెస్తారన్న భయం కూడా ఆఫ్ఘన్‌- ‌తాలిబన్లకు లేకపోలేదు! బహుశా ఈ నేపథ్యమే ఆఫ్ఘన్‌ ‌తాలిబన్ల సహాయంతో టీటీపీతో ఒక శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని చేసిన పాకిస్తాన్‌ ‌యత్నం ఫలించకపోవడానికి కారణమై ఉండవచ్చు.

కొత్త తలనొప్పి

తమపై చర్యలు తీసుకుంటే, సంకీర్ణంలోని రెండు ప్రధాన పార్టీల అగ్రనాయకుల అంతు చూస్తామని జనవరి 4న హెచ్చరించడం మారిన టీటీపీ వ్యూహానికి నిదర్శనం. సంకీర్ణ ప్రభుత్వంలో పాకిస్తాన్‌ ‌ముస్లీంలీగ్‌ (‌నవాజ్‌), ‌పాకిస్తాన్‌ ‌పీపుల్స్ ‌పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. ముస్లింలీగ్‌ ‌నేత షహబాజ్‌ ‌షరీఫ్‌ ‌ప్రధానమంత్రిగా, పీపుల్స్ ‌పార్టీ నేత బిలావల్‌ ‌భుట్టో విదేశాంగ మంత్రిగా పని చేస్తున్నారు.

గత కొద్ది నెలలుగా పాక్‌ ‌సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న టీటీపీ, ఇప్పుడు రాజకీయ నాయకులపై దృష్టి పెట్టడం పాక్‌ ‌సరికొత్త సమస్యలో కూరుకు పోతున్నదనడానికి సంకేతం. ఒకవైపు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర ధరలు, తీర్చలేని రుణభారం, నానాటికీ పతనమవుతున్న కరెన్సీ విలువ, కరెంటు కోత తీవ్రం కావడం, ప్రకృతి విలయ తాండవాలు ఎటుచూసినా సమస్యలతో ఆర్థిక సంక్షోభాల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్‌కు ఈ తాజా తలనొప్పి పెను సంకటాన్ని సృష్టిస్తోంది. తాను సృష్టించిన ఉగ్రవాద భూతం తననే మింగేస్తుంటే నిస్సహాయంగా మిగిలిపోతున్నది. భారత్‌ను నానా ఇబ్బందుల పాలు చేయడానికి ఏ ఉగ్రవాదాన్ని నమ్ముకుందో అదే తీవ్రవాదం చేతిలో నలిగిపోతూ చరిత్రలో అహంకారం వీడని ఒక ‘ధూర్త దేశం’గా అపప్రథను మూట కట్టుకుంటున్నది.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE