– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్
చదువు వినయాన్ని ఇస్తుంది. అది విజయాన్ని కలిగిస్తుంది. దానితో ఇంటా బయటా విలువ పెరుగుతుంది. దానిద్వారా మొత్తం జీవితమే సంతోషాన్ని మిగుల్చుతుంది. ఆ ఆనందం ఆయుష్షును పెంపొందించి వ్యక్తిగతంగా, సమాజ పరంగా సంక్షేమం, అభివృద్ధిని సులభసాధ్యం చేస్తుంది. అందునా స్త్రీ చదువుకుంటే కుటుంబమంతా సుఖసంతోషాలతో విలసిల్లుతుంది. పుట్టినింటా, మెట్టినింటా, ఊరూవాడా కూడా ఆరోగ్యకర వాతావరణం వర్ధిల్లుతుంది.అయితే వీటిల్లో ఏ ఒక్కటీ తాలిబన్ తీవ్రవాదులకు ఇష్టంలేదు. వాళ్ల దృష్టిలో అక్కడి స్త్రీ పుస్తకం పట్టుకోకూడదు. చదువు నేర్చుకోకూడదు. అసలు ఇల్లు వదిలి కాలు బయట పెట్టరాదు. ముఖమే కనిపించకూడదన్నది అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం నెలకొన్న వాతావరణం! తాలిబన్ పేరుకీ, ఆ తీరుకీ సంబంధం లేకుండా తీవ్రవాదులు వ్యవహరిస్తున్నారు. విద్యార్థి అని ఆ పేరుకి అర్థ్ధం. అటువంటి వ్యక్తులే ‘సాటి విద్యార్థినులు’ అనే ఇంగితమైనా కనబరచడం లేదు. ఆ వ్యక్తులు తరగతి గదుల్లో వీరంగం సృష్టిస్తున్నారు. ఒక్క మహిళ అయినా లోనికి రాకుండా పశుబలంతో అడ్డుకుంటున్నారు. ఇప్పుడైతే విశ్వవిద్యాలయాల్లో వనితలు చదవకుండా ‘నిషేధం విధించారు’. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వర్సిటీలకీ తాఖీదులు జారీ చేశారు తాలిబన్ తీవ్రవాద పాలకులు! అడ్డుగోడలు కట్టడమే తప్ప మరేదీ తెలియని, తెలుసుకోని పరమ మొండి, బండ వైఖరి వాళ్లది. ఇప్పటికే మాధ్యమిక పాఠశాలల్లో ఆడపిల్లలు చేరకుండా అటకాయింపు. తాజాగా ఏకంగా యూనివర్సిటీలపైనే చెడు చూపులు. ఇంకెక్కడి స్త్రీ విద్య?
ఏ మతమైనా హితాన్నే ప్రబోధిస్తుంది. పాలకులకు కర్తవ్య నిర్దేశం చేస్తుంది. కానీ పాకిస్తాన్•, అఫ్గనిస్తాన్ దేశాల్లో కొంతమంది ఆ మతాన్నే అడ్డుపెట్టుకొని, చేయకూడనివన్నీ చేస్తున్నారు. పాక్ పాలకుల మాయాజాలం అందరికీ తెలిసిందే. రాజ కీయ స్వార్థ ప్రయోజనాల కోసమే తాలిబన్ వ్యవస్థను స్పష్టించారు. అఫ్గాన్‌లో పట్టు సంపాదించేందుకు తీవ్రవాద పోకడలను పనిగట్టుకొని దువ్వారు. అశ్వకన్, అస్సాకన్ – ఈ రెండు పేర్ల కలగలుపే అఫ్గానిస్తాన్. అశ్వాలపై సంచరించేవారు అధికంగా నివసించే ప్రాంతం. భౌగోళిక, వాతావరణ, పర్యావరణ స్థితిగతుల కారణంగా గుర్రాలమీద రాకపోకలు అక్కడ సహజం. అశ్వవేగం కావాల్సిందే కానీ, అది దుందుడుకుతనాన్ని ప్రదర్శించకూడదు మరి! పోరాటం, సంఘర్షణ, అనిశ్చితత్వం ఆఫ్గన్‌లో మామూలే. వారిలో వారికి పోరు, విదేశీ జోక్యంతో మారిన రీతి అనూహ్య పరిణామాలకు దారితీస్తూ వచ్చాయి. కొనసాగిన ఆ ఆరాట పోరాటాలతో రూపొందిన గత ప్రభుత్వం మొదట కొంత మెరుగ్గానే ఉండేది. ఎప్పటికప్పుడు తనను తాను సరిదిద్దుకునే చర్యలనూ చేపట్టింది. ఒక రాజ్యాంగం, ప్రజాస్వామ్య చట్టం అంటూ కొనసాగింది. అటు తర్వాత 1996 ప్రాంతంలో ఆశలన్నీ తలకిందులయ్యేలా తాలిబన్ తీవ్రవాదం పడగెత్తింది. ఘర్షణ మార్గంలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఐదేళ్ల వ్యవధిలో అంతర్జాతీయ పరిణామాలు పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రెండు దశాబ్దాల దరిమిలా, మళ్లీ తాలిబన్ వాదమే వికృతంగా నర్తించింది. కాలం గడిచేకొద్దీ, పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయా రైంది. ప్రజలు చదివితే ప్రశ్నించే లక్షణం అలవడు తుంది. వనితలు చైతన్యవంతులైతే ఆ కుటుంబాలతో పాటు అంతటా వికాసం విస్తరిస్తుంది. అది జరగరాదనే తీవ్రవాద పాలకగ•ణం రెచ్చిపోతోంది. శాంతి పరిరక్షణకు చర్యల పేరిట ఎంత విధ్వంసం చేయకూడదో అంతా చేస్తోంది. పాలనపగ్గాలు పట్టుకున్నవాళ్లు తెంపరితనంతో తమవైన సొంత సిద్ధాంతాల్ని ప్రజలపై రుద్దుతున్నారు. ఒక్క ఆడపిల్లా గడప దాటి రావడానికి వీలులేదంటున్నారు. ఎవరైనా వస్తే దారుణ శిక్షల పేరుతో మొత్తం అందరినీ భయభ్రాంతులను చేస్తున్నారు. ఆంక్షలూ శిక్షలే తప్ప, వేరే పనే లేదన్నట్లు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. అరాచకమే రాజ్యమేలుతోందని తమ చేష్టలతో నిరూపిస్తున్నారు.
ప్రతిస్పందనల తీవ్రత
వనితా వికాసాన్ని అరికట్టాలన్నదే తాలిబన్ల ‘పద్ధతి’. అందుకే గత మే నెలలోనే మహిళల వాహన డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేశారు. ‘కదిలితే ఊరుకోం’ అన్నట్లు నిర్బంధ కాండను అమలు చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితులలో చదువులు, ఉద్యోగాలు, పర్యటనలు ఎలా సాధ్యపడతాయి? ఉన్నత విద్యా భ్యాసం అందరి హక్కు. దాన్ని ఎలా నిరోధిస్తారు?’ అనే ప్రశ్నలకు తాలిబన్లు బదులివ్వరు. పైగా కక్ష సాధింపులకు దిగుతున్నారు. ఏదో పెను ప్రమాదమో ముంచుకొచ్చినట్లు, వర్సిటీల ప్రాంగణాల్లో సాయుధ సైనికులను మోహరిస్తున్నారు. ‘ఆమెను చదువు కోనివ్వండి’ అని ఎవరైనా అంటే, విద్రోహిలా చూస్తున్నారు. ఇన్ని వేధింపులు, సాధింపులతో ముష్కర పాలకులు ఏం సాధించాలనుకుంటున్నారు? అతివలు నాలుగు గోడలకే పరిమితం కావాలని, పిల్లల్ని కనే యంత్రాలుగా మిగిలిపోవాలని శాసించి ఏం బాపుకుందామనుకుంటున్నారు? ఇప్పటికే కాస్తో కూస్తో ఉపాధి పొందుతున్న ఉద్యోగినులను పనులు నుంచి తొలగించేశారు తాలిబన్లు. విద్య నుంచీ వారిని దూరం చేయాలని లిఖితపూర్వక ఆదేశా లిచ్చిన ఆఫ్గన్ ‘ఉన్నత’ విద్యాశాఖ మంత్రి ‘ఎందుకు’ అనే ప్రశ్నను భరించలేక పోతున్నారు. కక్షలు, కార్పణ్యాలు రాజ్యమేలుతున్న వేళ, సహజంగానే ప్రతిఘటనలూ తలెత్తుతుంటాయి. దేశమంతటా కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో స్త్రీ విద్యను నిషేధించినందుకు అధ్యాపకులనేకులు తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నారు. పదుల సంఖ్యలో ప్రొఫెసర్లు రాజీనామాలు సమర్పించారు. మరొక పురుష ప్రొఫెసర్ తన విద్యార్హతల ధ్రువపత్రాలను కెమెరాల సాక్షిగా చించి అవతల పడేశారు. కాబూల్ వర్సిటీలో పనిచేస్తున్న ఆయనను ‘ఎందుకిలా చేశారు?’ అని అడిగితే ‘మా ఇంట్లో నాకు చదువుంది. అమ్మకి, సోదరికి చదువు అవసరం లేదా? నా ఒక్కడికీ విద్య ఉంటే సరిపోతుందా… ఇంట్లో వారికీ ఉండాలి కదా! ఇన్ని రకాల నిర్భంధాలను అసలే భరించలేను. నాకు ఈ సర్టిఫికేట్లు వద్దు’ అంటూ వాటిని పరపరా చించేయడం ప్రజాగ్రహానికి అద్దం పట్టింది.
తాలిబన్ పాలకులు మొదట చెప్పిందేమిటి? ఆ తర్వాత చేసిందేమిటి? అల్ప సంఖ్యాక వర్గాల వారితో పాటు వనితల హక్కులకు భంగం కలగ కుండా చూస్తామన్నారు. చెప్పిందేదీ చేయనే లేదు. అదీ చాలదన్నట్లు పాలనా నిబంధనలంటూ రోజుకో రకం ఆంక్షలు తెస్తున్నారు. కొన్నిచోట్ల తరగతి గదుల్లో విద్యార్థులు, విద్యార్థినుల నడుమ నిలువెత్తు పరదాలు కనిపించడాన్ని ఒక్క అఫ్గన్‌లోనే చూస్తున్నాం. ఆ దేశంలో ఎప్పుడూ యుద్ధవాతావరణమే. ఆక్రమణ లతో సదా భయపూరిత స్థితిగతులే. ఇంతటి అనిశ్చి తికి అద్దంపట్టేలా ఉంటున్నాయి ఆ తరగతులు! ఆ దేశ మహిళలను మనుషులుగా చూడటం లేదు. ఆ కారణంగానే అక్కడి పార్లమెంటు మాజీ సభ్యురాలు షికాయ్ కలోఖైల తీవ్ర స్వరం వినిపించారు. భారతీయ మహిళా ప్రెస్ కార్పొరేషన్ మునుపు నిర్వహించిన దిల్లీ సదస్సులో మాట్లాడారు. ఆమె మాటల్లో చెప్పాలంటే….
‘ఆఫ్గన్ పరిస్థితి పరమ భయంకరంగా ఉంది. అనేకమంది వనితా కార్యకర్తలు, రాజకీయ నేతలు దిక్కుతోచక అలమటిస్తున్నారు. ఇక లాభం లేదని తాలిబన్ తీవ్రవాదంపైన దేశ విదేశాల్లో పోరు సాగిస్తున్నారు. తాలిబన్ల అకృత్యాలు ఇన్నీ అన్నీ కావు. అమ్మాయిలు చదవడం వాళ్లకు ఇష్టం ఉండదు, ఉద్యోగాలు చేస్తామంటే అసలే నచ్చదు. అదేమంటే, ఇళ్లకు వెళ్లి మరీ భయపెడుతున్నారు. వారి వాహ నాలను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు. ఎవరినీ గొంతెత్తకుండా చేస్తున్నారు. నినాదాలిస్తే గొంతుపైన ఆయుధం మోపుతున్నారు. ఎందుకింత కక్ష? ఏమిటీ పగ? నిజానికి ఇది ఇప్పటి దుర్గతి కాదు. మొదటి నుంచీ ఇంతే. నిస్సహాయ వనితలలపై అత్యాచారాలు, హత్యలకు దాడులకు తెగబడటం పాలక తీవ్రవాదులకు పరిపాటి. వీటన్నింటికీ కారణం ఒక్కటే. స్త్రీని ఆట వస్తువుగా చూసే ఆటవిక రీతి’ అంటూ ఆ మాజీ ఎంపీ వాస్తవాలను వెల్ల డించారు. అదే సమావేశంలో ప్రసంగించిన పరిశోధ కురాలు హుమెరా రివజయ్ ఒక దశలో కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఏమిటా అకృత్య పరంపర? ఎంత కాలం భరించాలి? సహించాలి? అరాచకా లను అడ్డుకునే వారెవరూ కనిపించడం లేదు. పాలక దురాగతాలను నిలదీసే గళం వినిపించడం లేదు. అక్కడి చీకటి కోణాలన్నింటినీ ఇక్కడ (దిల్లీ) వెలుగు లోకి తెస్తున్నాను. ఇతర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అతివల ప్రగతికి శ్రమించే సంఘాలు ఇకనైనా స్పందించాలి. ఆఫ్గన్ నియంతల పని పట్టేలా జనగళమంతటినీ సమైక్యం చేయాలి’ అని సభా ముఖంగా పిలుపునిచ్చారామె.
తిప్పికొట్టక తప్పదంతే!
పాకిస్తాన్ మాత్రం గుట్టును తానే బయటపెట్టు కుంటోంది. ‘మాకు తాలిబన్లతో మంచి సంబంధాలు న్నాయి’ అని సాక్షాత్తు ఆ దేశ ప్రధానే ఏడాది కిందట సెలవిచ్చారు! అంతటితో ఆగలేదు సరికదా! అంతర్జాతీయ సమాజం కూడా సత్ససంబంధాలు నెలకొల్పుకోవాలని తన మార్కు సందేశాన్ని అందిం చారు- ఇమ్రాన్‌ఖాన్. ఆఫ్గన్ పాలకులకు తగినన్ని ఆర్థిక ప్రోత్సాహకాలూ అందించాలన్నది ఆయన ఉచిత సలహా! ఇంకా విశేషం ఏమిటంటే, ఆఫ్గాని స్తాన్ మహిళల హక్కులను పరిరక్షించేలా అందరూ చూడాలనడం. పరిరక్షణ బాధ్యత ఎవరిదన్నదే అసలు ప్రశ్న. ఏది ఎలా ఉన్నా, ఆఫా ఆఫ్గన్‌లో ఉన్న నిరసనకారులు ఎంతకీ వెనక్కి తగ్గడంలేదు. తాలిబన్ల నిర్వాకాలను నిగ్గదీసి ప్రశ్నిస్తూ పలు విధాల ఉద్యమ మార్గాల్లో ముందుకు సాగుతున్నారు. ఆ మధ్య కొంతమంది ఉద్యమకారిణులు కాబూల్ నడివీధిలో నినాదాలతో హోరెత్తించారు. ‘ఇంతకాలం మేం సాధించినవి వృథా కారాదు. దక్కించుకున్న కనీస హక్కులు మా చేయిదాటి బయటికి పోకూడదు’ అంటూ అట్టల మీద రాతలను ప్రదర్శించారు. విశ్వ విద్యాలయ ఆవరణల్లో వనితలు అడుగుపెట్టరాదన్న కుత్సిత ఆంక్షలను తిప్పికొట్టేందుకు, ఆ దేశంలోని సంస్థలు కొన్ని ఏకమవుతున్నాయి. ఏకీకృతమయ్యే ఆ పోరాట బావుటా ధాటి తాలిబన్ల పని పడుతుందని ఆశించాలి మనమందరం.