జనవరి 30 గాంధీ వర్ధంతి / అమరవీరుల సంస్మరణ దినం

వీర సావార్కర్‌ ‌చెప్పినట్టు వారంతా ‘దేశం కోసం త్యాగం చేయడం జీవితాన్ని వ్యర్థం చేయడం కాద’నుకున్నారు. ఆధునిక స్వాతంత్య్ర సమరాగ్నిలో ఎందరు సమిధలయ్యారో స్పష్టంగా తెలుసుకోవ డానికి ఇప్పటికీ సరైన ప్రయత్నమైతే జరగలేదు. సాధ్యమైనంత మేరకే అయినా ఆ ప్రయత్నం జరగాలి. ఒక ప్రత్యేక సాంస్కృతిక, రాజకీయ నేపథ్యం కలిగిన నరేంద్ర మోదీ ప్రధాని పదవిని చేపట్టారు కాబట్టి ఆజాదీ కా అమృతోత్సవ్‌ ‌పిలుపు వెలువడింది. చరిత్రపుటలలో చోటు దక్కని ఎందరో త్యాగధనులను కనీసం తలచుకునే అవకాశం జాతికి వచ్చింది.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో మరణిం చిన వారు, అనుశీలన్‌ ‌సమితి వంటి సంస్థలలో పనిచేస్తూ ప్రాణాలు ఇచ్చినవారు, అండమాన్‌ ‌జైలులో అనామకంగా కన్నుమూసిన స్వాతంత్య్ర సమరయోధులు, గదర్‌ ‌వీరులు, మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో భారత్‌లోని శ్వేతజాతి ప్రభుత్వం మీద తిరుగుబాటు లేవదీయడానికి విదేశాల నుంచి మాతృదేశానికి వస్తూ ఓడలలోనే గుఢచారులకు దొరికిపోయి ఆచూకీ లేకుండా పోయినవారు, గదర్‌ ‌వీరులు ప్రధానంగా ఉన్న హిందూ-జర్మన్‌ ‌పథకాన్ని అమలు చేసే పనిలో ప్రాణాలు వదిలినవారు, ఉరికంబాలను ఎక్కినవారు, హిందుస్తాన్‌ ‌రిపబ్లికన్‌ ఆర్మీ, ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌ ‌వీరులు, ఇక కొండకోనలలో బ్రిటిష్‌ ‌దుర్నీతి ఫలితంగా ఎన్ని ఊపిరులు ఆగిపోయాయో లెక్క తెలియదు. ఈ అమరులను తలుచుకోవడానికీ, రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళి ఘటించడానికీ గాంధీజీ వర్ధంతి (జనవరి 30) జాతికి అవకాశం కల్పిస్తున్నది. మన తరం కూడా బానిస సంకెళ్ల శబ్దాలు వింటూనే పుట్టకుండా, వాటిని తెంపిన ఈ మహనీయులందరికీ ఆచంద్ర తారార్కం రుణపడి ఉండాలి. సరే, అంటే భారతజాతి ఈ మహోన్నత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన వారిని విస్మరించిందా? కాదు, విస్మరించేటట్టు చేస్తున్నారు. భారత స్వాతంత్య్రోద్యమ వాస్తవ స్ఫూర్తి నుంచి ఈ తరాలని దూరం చేసే కుట్ర ఒక వాస్తవం… ఈనాటికీ.

స్వాతంత్య్రోద్యమంలో నేతాజీ పాత్రను తగ్గించి చూపేందుకు ప్రయత్నాలు జరిగాయి’ అని 126వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. కానీ ఇవాళ ఆసేతుశీతాచల పర్యంతం బోస్‌ను ఆరాధి స్తున్నారు. ఆయన పేరుతో బీజేపీ పరాక్రమదివస్‌ (‌జనవరి 23)ను తీసుకువచ్చింది. ఈ సందర్భంగా మోదీ అండమాన్‌ ‌దీవులకు మన అమరజవాన్ల పేరు పెట్టారు. అంటే దేశం కోసం స్వరాజ్య సమరంలో అమరులైన వారి వారసులుగా అమర జవాన్లను గుర్తిస్తున్నట్టు చెప్పకనే చెప్పారు. ఇదొక అద్భుత నిర్ణయం. కానీ ఇలాంటి ఆలోచన ఒక దేశ రాజకీయ, సామాజిక శిబిరాలలో ఒక వర్గానికే పరిమితమవుతున్నదా? ఇప్పటికీ ఈ ప్రశ్న వేసుకోవలసి వస్తున్నది.

మార్గాలు వేరు కావచ్చు, కానీ నేతాజీ, ఆర్‌ ఎస్‌ఎస్‌ ‌లక్ష్యం (సమున్నత భారత్‌) ఒక్కటే అని బోస్‌ 126‌వ జయంతి సందర్భంగానే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌భగవత్‌ ‌కోల్‌కతా  సభలో నివాళి ఘటించారు. కాగా జనవరి 21 ప్రాంతంలో ఆ కోల్‌కతాలోనే బోస్‌ ‌కుమార్తె అనితా బోస్‌ ‌చెప్పిన మాటలు కొంచెం ఆశ్చర్యం కలిగిం చాయి. ఆ మాటలు ఆమెవేనా? అన్న అనుమానం కలిగించేటట్టు ఉన్నాయి. ‘ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావజాలం గురించి నేను విన్నదాని ప్రకారం వారిది బహుశా నేతాజీ వారసత్వాన్ని సొంతం చేసుకోవాలన్న ప్రయత్నం అయి ఉండవచ్చు. కానీ నేతాజీ హిందువే అయినా అన్ని మతాలనూ గౌరవించారు. భిన్న మతాలను పాటించేవారు సామరస్యంగా జీవించాలని కోరుకున్నారు. ఈ ధోరణి బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లో కనిపించదు. సులభంగా చెప్పాలంటే వాళ్లు రైటిస్టులైతే, నేతాజీ లెఫ్టిస్ట్. ‌భావజాల పరంగా నేతాజీకీ కాంగ్రెస్‌కూ మధ్య చాలా సారూప్యత ఉంటుంది’ అన్నారామె. సెప్టెంబర్‌, 2022‌లో ఢిల్లీలో నేతాజీ బోస్‌ ‌విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించినప్పుడు ఆమె కృతజ్ఞత తెలియచేస్తూ పలికిన పలుకులలో లేని ధోరణి ఇంతలోనే ఎందుకు వచ్చిందో అర్ధం చేసుకోవడం కష్టంకాదు. స్వతంత్ర భారత్‌ ‌కల తప్ప మరొకటేదీ తన తండ్రి మదిలో లేదనీ, ఆయన చితాభస్మాన్ని భారత్‌కు తీసుకురావడంలో అన్ని రాజకీయ పార్టీలు చేయూతనివ్వాలని కోరారు. ఈ సమన్వయం ఇప్పుడు కనిపించక పోవడం దురదృష్టకరం. కాంగ్రెస్‌తో ఆయన విభేదాలు, గాంధీజీతో ఆయన వైరుధ్యాలు అర్ధం చేసుకో దగినవి. కానీ ‘నేతాజీది లెఫ్ట్ ‌ధోరణి’ అని తీర్పు ఇవ్వడం చారిత్రక దృక్పథం అనిపించుకోదు.

ఇక్కడ లెఫ్ట్ అం‌టే వామపక్షమని అర్థం కాదు. నిజమే. అంతర్జాతీయవాదం, స్వేచ్ఛ, సమత్వం, సౌభాత్రం, పురోగామి దృక్పథం వంటి భావాలను స్థూలంగా లెఫ్ట్ అని పిలుస్తారు. ఇవి ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీలో లేవని ఆమె తేల్చడం, నిజంగా బోస్‌ను ఆదినుంచి గౌరవిస్తున్న ఏకైక రాజకీయ దృక్పథాన్ని కించపరచడమే. త్రిపురి (మధ్యప్రదేశ్‌) ‌జాతీయ కాంగ్రెస్‌ ఎన్నికల తరువాత ఆ సంస్థ నేతాజీని వెంటాడిన మాట వాస్తవం. బ్రిటిష్‌ ‌జాతిని నిలువెల్లా ద్వేషించిన బోస్‌, ‌రెండో ప్రపంచ యుద్ధ సమీకరణలను బట్టి జపాన్‌, ‌జర్మనీల సాయం కోరారు. స్వదేశ స్వేచ్ఛ కోసం బ్రిటన్‌ ‌వ్యతిరేక కూటమికి దగ్గర కావడాన్ని, సోవియెట్‌ ‌రష్యా వ్యతిరేకతగా చిత్రించిన కమ్యూనిస్టులు బోస్‌ను ఎంత నీచంగా చిత్రించారో తలుచుకుంటే మనసు మళ్లీ మళ్లీ గాయపడుతూనే ఉంటుంది. కానీ ఆది నుంచి ఆర్‌ఎస్‌ఎస్‌, ‌జనసంఘ్‌, ‌తరువాత బీజేపీ మాత్రమే బోస్‌ను మనస్ఫూర్తిగా ఆరాధిస్తున్నాయి.

విభేదాలను బట్టి కాదు. అనుసరించిన సిద్ధాంతాన్ని బట్టి కూడా కాదు. దేశం పట్ల ఒక నేతకు ఉన్న నిబద్ధత, దేశాన్ని కలిపి ఉంచే జాతీయ భావాలను నిలబెట్టడానికి, నిలపడానికి చూపిన మార్గం, చరిత్రలో వాటి జాడ, వాటిలోని, విచక్షణ,  నిజాయతీ- ఇవే ఒక స్వాతంత్య్ర సమరయోధుడిని, ఒక అమరవీరుడిని ఆరాధించడానికి గమనంలోకి తీసుకోవలసిన గీటురాళ్లు. సావార్కర్‌కూ, ఆర్‌ఎస్‌ఎస్‌కూ కొన్ని అంశాలలో పొరపొచ్చాలు ఉన్నాయి. గాంధీజీ హత్య తరువాత అందరితో పాటు సర్దార్‌ ‌పటేల్‌ ‌కూడా ఆర్‌ఎస్‌ఎస్‌ ‌మీద ఆగ్రహిం చారు. అయినా వారిని జాతి ఎప్పటికీ మహనీయులు గానే గుర్తించాలి. స్వరాజ్య సమరయోధునిగా, హిందూత్వవాదిగా, జాతీయవాదిగా, సంస్కర్తగా, రచయితగా, చరిత్రకారునిగా, అతి జాతీయవాద పంథాకు ఆద్యునిగా సావార్కర్‌ ‌స్థానం అజరామర మైనది. ఆయన ఆంగ్లేయులను క్షమాభిక్ష వేడారు కాబట్టి చరిత్రహీనుడనే నీచులు తయారయ్యారు. అసలు యాభయ్‌ఏళ్ల జైలు శిక్ష ఏమిటి? ఒక వలస ప్రభుత్వం వేసిన ఈ అమానవీయ శిక్ష నుంచి తప్పించుకోవడానికి సావార్కర్‌ ‌చేసిన ప్రయత్నాన్ని వలసవాద దృష్టితో చూస్తున్న ఫలితమిది. జైలు నుంచి వచ్చిన తరువాత సావార్కర్‌ ‌చేసిన సంఘసేవ, అంటరానితనం నిర్మూలన కృషి గమనించకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం అజ్ఞానం. నెహ్రూ అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా సంస్థానాలను ఏకం చేసి, స్వరాజ్య సమరం దేనికోసం పోరాడిందో దానిని నిజంగా సాధించినవారు పటేల్‌. ‌విభజిత భారత్‌లో 46 శాతం ఉన్న సంస్థానాలను విలీనం చేయకుంటే భారత్‌ ‌నేడు ఇలా ఉండేది కాదు. ఇది చారిత్రక సత్యం. అయినా వారిని ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ ఎంత గౌరవిస్తున్నాయో అందరికీ తెలుసు. భగత్‌సింగ్‌ ‌మార్క్సిజం చదివారు కాబట్టి ఆయనను స్మరించే హక్కు సంఘ పరివార్‌కు లేనేలేదని వాదించే పిడివాద నాటు కమ్యూనిస్టులు ఎప్పుడూ ఉన్నారు. భగత్‌సింగ్‌ ‌దేశభక్తికి తిరుగులేని చిరునామా. దేశద్రోహ చింతనకి ఆలవాలం భారతీయ కమ్యూనిస్టు దృష్టి. ఎంతో సేవ చేసినప్పటికీ,  సమకాలీన సమాజాన్ని మౌఢ్యం నుంచి తప్పించ డానికి శ్రమించినప్పటికీ వారు జంధ్యాలు ధరించారనే కారణాన్ని చూపించి పలువురు సంఘ సంస్కర్తలనీ, స్వాతంత్య్ర సమరయోధులనీ కూడా చరిత్ర నుంచి వెలివేయాలన్న పరమ సంకుచితులైన ఆధునిక ఛాందసవాదులూ ఇవాళ్టి స్వయం ప్రకటిత మేధావులలో కోకొల్లలు.

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచాయి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలని ఇప్పటికీ సమ్యక్‌దృష్టితో అంచనా వేసే సంస్కారం చాలా మందిలో లోపిస్తున్నదని చెప్పడానికి అనేక రుజువులు ఉన్నాయి. ఇలాంటివారు కాలమాన పరిస్థితులను బట్టి కాకుండా, వర్తమాన రాజకీయ పైత్యాలతో, కళ్లద్దాలతో ఆ మహనీయులను చూస్తున్నారు. అది సరికాదు. ఇకనైనా వారి త్యాగాన్ని సరైన దృక్పథంతో అంచనా వేయాలి. వారి జాతీయ భావాల విలువను, అందులోని శాశ్వతతత్త్వాన్ని గుర్తించాలి. గతానికీ వర్తమానానికీ మధ్య అనుబంధం కొనసాగిస్తూనే, స్వేచ్ఛాస్వాతంత్య్రాలతో, సమానత్వంతో వర్తమాన భారతం పరిఢవిల్లాలన్న వారి ఆశయాన్ని శిరోధార్యం చేసుకుందాం. అదే వారికి భారతజాతి ఇచ్చే నిజమైన నివాళి.

– కల్హణ

About Author

By editor

Twitter
YOUTUBE