– కాశీవరపు వెంకటసుబ్బయ్య

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


గండికోట రాజ్యాన్ని పెమ్మసాని చిన్న తిమ్మనాయుడు పరిపాలిస్తున్న కాలమది. ప్రభువులవారు వసంతోత్సవాలు జరుపుతున్న తరుణం.

గండికోటకు వెలుపల దేశదిమ్మరులైన దొమ్మరులు తమ సంచార జీవితంలో భాగంగా గుడిసెలు నిర్మించుకున్నారు. సామాన్లు మోసేందుకు గాడిదలు, మనుషులు ప్రయాణించే•ందుకు గుర్రాలు, వేటాడేందుకు వేటకుక్కలు, జీవనానికి పందులు గుడిసెల చుట్టూ గూటాలకు కట్టి ఉన్నాయి. దొమ్మర్లు సమూహం పెద్దల మాటలను అనుసరించి జీవనం సాగిస్తారు.

సూర్యోదయానికి ముందే లేచి స్థావరానికి పక్కన వున్న పెన్నేటి ఇసుకలో రకరకాల వ్యాయామాలు చేస్తున్నారు దొమ్మర యువకులు. ఇరవై ఐదు ఏండ్ల వయస్సుగల వస్తాదు లాంటి యోధుడు సాంభుడు కర్రను రకరకాల విన్యాసాలలో వేగంగా తిప్పు తున్నాడు. ఒకడు పరిటీలు కొడుతున్నాడు. ఇంకొకడు దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక గుర్తు నుంచి ఒక గుర్తుకు ఎగురుతున్నాడు. మరొకడు గుట్టపై నుంచి గిరికీలు కొడుతూ ఏట్లోకి దుముకు తున్నాడు. కొందరు కర్రసాము చేస్తున్నారు. కొంతసేపు అయ్యాక ఏటి నీటిలో స్నానం చేసి తమతమ పనుల్లోకి పోయారు.

పందుల్ని కొందరు, గాడిదల్ని కొందరు, గుర్రా లను కొందరు మేతకు తోలుకు పోయారు. కొందరు చెక్క దువ్వెన్లు, ఈరబాన్లు తయారీలో ఉన్నారు. కొందరు తయారైన దువ్వెన్లను సమీప గ్రామాల్లో అమ్మడానికి పోయారు. కొందరు చెక్క దువ్వేన్లు తయారీకి ఉపయోగించే మొద్దులు తెచ్చేందుకు దగ్గరలోని అడవికి పోయారు. కొందరు వేటకుక్కలను తీసుకుని వేటాడేందుకు అడవికి పోయారు. సాంభుడు తన జతకత్తే రంగితో కలసి మాంచి యవ్వనంలో వున్న గుర్రాలనెక్కి అందరినీ పర్యవేక్షిస్తు న్నారు. మెరుపుతీగలా అందంగా వుండే రంగి అంటే మహా యిష్టం. కండలు తిరిగి ఆరడుగులు ఎత్తున్న చందమామ లాగుండే సాంభుడంటే రంగికి ప్రాణం. వారి జతంటే సమూహంలో అందరికీ ముద్దు మురిపెమే.

అందరూ మళ్లీ ప్రొద్దు క్రుంకే సమయానికి స్థావరం చేరుకున్నారు. అప్పుడు మొదలైంది సందడిగా వేడుక. చిన్నాపెద్దా తేడా లేకుండా వలయాకారంగా కూర్చున్నారు. మధ్యలో మంటల్లో చర్మం తీసిన కణితి, కొండగొర్రెల కళేబరాలు కాలుతున్నాయి. కాల్చిన దుప్పి, కుందేళ్లు, కొండకోళ్ళ మాంసపు ముక్కలు పెద్దపల్లెరంలో కుప్పపోసి వున్నాయి. అందరి చేతుల్లో ఈత కల్లు ముంతలు, విప్పసారా లోటాలు వున్నాయి. కొంచెం కొంచెం తాగుతూ మాంసం ముక్కలు నంజుకుంటూ మత్తుగా వూగు తున్నారు. సాంభుడు పాటందు కున్ళాడు. అందుకు అనుగుణంగా డోలు రకరకాల వాయిద్యాలు మంద్ర స్థాయిలో మోగుతున్నాయి. రంగి లయ బద్ధంగా అడుగులు వేస్తూ దేశదిమ్మర నృత్యం చేస్తుంటే ఆమెతో జతకలిపి సాంభుడు అడుగులు వేస్తున్నాడు. వారితో మరిన్ని జంటలు జతకలిశాయి. వాయిద్యాల హోరులో నాట్యం వేగం పుంజుకుంది. నడిరాత్రి వరకు మధువు సేవిస్తూ, కాల్చిన మాంసముక్కలు రుచిచూస్తూ సామూహిక నృత్యం చేస్తూ గడిపారు.

*****

కోట సమావేశపు భవనంలో సభ తీర్చి సింహా సనంపై ఆసీనుడై వున్నాడు చిన్న తిమ్మనాయడు. రాజ్యంలోని విశేషాలు, పొరుగు రాజులతో రాజ కీయాలు, రెండు రోజుల్లో జరగబోయే వసంతో త్సవాల గురించి చర్చలు ముగిశాక ఒక భటుడు సభలోకి ప్రవేశించి ‘‘ప్రభూ! దొమ్మర దొరలు తమరి దర్శనం కోసం వచ్చి బయట వేచి వున్నారు!’’ అని విన్నవించాడు. ‘‘ప్రవేశపెట్టుము!’’ రాజు సమ్మతి తెలిపాడు. ఓ యిద్దరు దొమ్మర తెగ పెద్దలు సభలో ప్రవేశించి వినయంగా నిలబడి ‘‘ప్రభూ!తమరి అనుమతైతే జరగబోయే వసంతోత్సవాలలో మా దొమ్మరాటను ప్రదర్శించి తమరిని సంతోష పెట్ట గలము ప్రభూ!’’ విధేయంగా చెప్పుకున్నారు.

 ‘‘సరే! మీరు మీ ఆటను వసంతోత్సవాల చివరి రోజైన ముగింపు ఉత్సవాలలో భాగంగా ప్రదర్శించండి. అంత వరకు అతివైభవంగా జరగనున్న వసంతోత్సవాలను తిలకించి ఆనందించండి’’ అని గంభీరంగా సెలవిచ్చారు ప్రభువు చిన్న తిమ్మ నాయడు. ‘‘చిత్తం ప్రభూ!’’ అంటూ భటుడు చూపించిన ఆసనంపై ఆసీనులైయ్యారు.

గండికోట రాజ్య ప్రధాన మంత్రి తన ఆసనంపై నుంచి లేచి ‘‘సభాసదులారా! మహాశయులారా! వారం రోజుల పాటు జరిగే వసంతోత్సవాలలో  సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శించేందుకు దేశదేశాల నుండి ప్రఖ్యాత కళాకారులు విచ్చేయు చున్నారు. మండలాధీశులు, పాలెగార్లు మిత్రరాజ్యాల రాజులు వేంచేస్తున్నారు. కోటను శోభాయమానంగా అలంకరించి స్వాగత తోరణాలు ఏర్పాటు చేయండి. అతిథులకు ఏ అసౌకర్యం కలగకుండా విడిది ఏర్పాటు చేయండి. ఇకపోతే ఉత్సవాలలో ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలలో నృత్య ప్రదర్శనలు, గాన కచేరీలు, ఇంద్రజాల, నాటక ప్రదర్శనలు, మల్ల యుద్ధ, ధనుర్విద్య, కర్రసాము, కత్తిసాము, గుర్రపు స్వారీలు, ఏనుగు సవారీలు, రథచోదన ఎడ్ల బండ లాగుడు, పెన్నానదిలో పడవ పోటీలు జరుగుతాయి. ఈ ఉత్సవాలు దొమ్మరాటతో ముగుస్తాయి’’ అని కార్యక్రమాల వివరాలు ప్రకటించారు. సభాసదుల కరతాళ ధ్వనులతో సభ ముగిసింది.

*****

గండికోట వీధులన్నీ మనోహరంగా తీర్చిదిద్దారు. రాజబాటలన్నీ విజయ తోరణాలతో స్వాగతతోర ణాలతో అద్భుతంగా అలంకరించారు. కోటంతా వింత కాంతులతో ప్రకాశిస్తూ వుంది. వసంతోత్స వాల ప్రారంభ సూచికగా నగారాలు విజయ దుందు భులు మ్రోగాయి.

రాజు చిన్న తిమ్మనాయడు తన దేవేరులతో కలసి వినాయక పూజ చేసి రంగనాథస్వామిని అర్చించి వసంతోత్సవాలను ఆరంభించారు.

లలితకళాక్షేత్రంలో నృత్యాలు, గానకచేరీలు, నాటకాలు, ఇంద్రజాల ప్రదర్శలు జరుగుతాయి. మల్లయుద్దం, కర్రసాము, కత్తిసాము, ధనుర్విద్య. దొమ్మరాట మొదలైనవి క్రీడామైదానంలో నిర్వ హిస్తారు. గుర్రపుస్వారీ, ఏనుగు సవారీ, రథచోదన, పడవ పందాలు, ఎడ్లబండలాగుడు పోటీలు కోట వెలుపల సాగుతాయి.

*****

అపూర్వ శోభతో అలంకరింపబడిన కోటలోని రాజబాట వీధుల అందాలను తిలకిస్తూ, సాంభుడు రంగీ ఆనందంతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అంగళ్ల వీధుల్లోకి పోయి మనసుకు నచ్చిన వస్తువు లను కొన్నారు. పోటీలు జరుగుతున్న కళాక్షేత్రంలో కొంతసేపు, క్రీడామైదానంలో కొంతసేపు ఉండి కోట పశ్చిమ భాగాన వున్న సోపానాలు గుండా దిగిపోయి పెన్నానది ఒడ్డును చేరుకొని ఒకరినొకరు ఆనుకుని కూర్చుని పారుతున్న నీటిని చూస్తున్నారు. నీటిపై నుంచి వీచే చిరుగాలులు మేనుకు గిలిగింతలు పెడుతున్నాయి. నది ఒడ్డున పెరిగిన రెల్లుగడ్డి గాలికి సుతారంగా ఊగుతున్నది. రంగి మనసులో బావ ఊసులు కవ్విస్తున్నవి. రంగి బావ భుజానికి తాలా నించి ‘‘బావా! నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?’’ ప్రేమగా లాలనగా అడిగింది. ‘‘రంగీ! రాజావారి ముందు ఆటను ప్రదర్శించి ఆయన ప్రశంసలు పొంది ఆయన ఆశీస్సులతో నిన్ను పెళ్లి చేసు కుంటాను రంగీ!’’ అని బుజ్జగింపుగా చెప్పాడు సాంభుడు. ‘‘సరేగాని రేపు నువ్వు ఏఏ పోటీలలో పాల్గొంటున్నావు?’’ రంగి అడిగింది ఆసక్తిగా. ‘‘రేపు నేను మల్ల యుద్ధంలోనే గుర్రపు స్వారీలోను పాల్గొం టున్నాను. మరి నువ్వు?’’ అడిగాడు సాంభుడు.

 ‘‘నేను జానపద న•ృత్య విభాగంలో గిరిజన నృత్యం చేస్తాను ’’ చెప్పుకుంటూ గూడేనికి బయలు దేరి పోయారు బావామరదళ్లు.

ఉత్సవాలలో మూడవ రోజు గిరిజన న•ృత్యం అద్భుతంగా ప్రదర్శించి రంగి, అమోఘమైన మెల కువలు ప్రయోగించగా, మల్లయుద్ధం, గుర్రపు స్వారీలోను సాంభుడు గెలిచి రాజు నుంచి యిద్దరూ సన్మానాలు, సత్కారాలు కానుకలు అందుకున్నారు. గూడెం ప్రజలు అమితంగా సంతోషపడి భారీ విందు చేసుకుని ఆనందించారు

వసంతోత్సవాల చివరిరోజు. క్రీడామైదానంలో దొమ్మరాటకు సర్వం సిద్ధమైంది. అందరిలో ఉత్కంఠ, ఉత్సుకత నెలకొన్నాయి. రాజావారు ఆయన పరివారం ఉన్నత ఆసనాలపై ఆశీనులైనారు. క్రీడా మైదానం చుట్టూ పురప్రజలు కేరింతలు కొడుతూ అత్యుత్సాహంతో చూస్తూ కుర్చున్నారు.

మైదానం మధ్యలో వందడుగులు ఎత్తుండే గడ, పదడుగుల దూరంలో పదడుగులు ఎత్తుండే రెండు కొయ్యలను, కొయ్యల మధ్య దూరం వందడగులు ఉండేలా పాతారు. రెండు కొయ్యలను కలుపుతూ తాడుతో బిర్రుగా బిగించి కట్టారు.

ఆట ప్రారంభ సూచికగా డోలు మోగింది. గుంపు పెద్దయిన రంగడు బపనం (హాస్యవ్యాఖ్యానం) చెబుతున్నాడు. సుంకడు మంకడు బల కొడుతు న్నారు. ‘‘ప్రభువులవారికి దండాలు, ప్రజలందరికీ వందనాలు. ఆట అద్భుతంగా అమోఘంగా సాగు తోంది. ఒళ్లు గగుర్పాటు కలిగించే విన్యాసాలతో, వెంట్రుకలు నిక్కబొరుచుకునే సాహసాలతో నడు స్తుంది ఆట చూసి ఆనందించ•ండి.’’ అని ప్రకటిం చాడు రంగడు.

గంగిడోలు వాయిద్యానికి అనుగుణంగా సంచారజాతి నృత్యం ఆరంభించింది. మంగి వందడుగుల ఎత్తున్న గడెక్కింది. అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. గడ చివర చేరుకున్న మంగి దాని పైభాగాన ఒంటి కాలుపై నిలబడింది. తరువాత బొడ్డును గడ మొనకు ఆనించి బోర్లా పడుకుని చేతులు పైకెత్తింది. గడమొనపై తలాంచి తల క్రిందులుగా శీర్షాసనం వేసింది. ఆ త•రువాత మంగి గడకొస పట్టుకుని గిరగిరా తిరిగింది. ప్రజల ఆశ్చర్యానికి అంతులేదు. విరామం లేకుండా చప్పట్లు కొట్టారు.

రంగి త్రాడుపైకి ఎక్కి ఇటు వైపునుంచి అటు వైపునకు వయ్యారంగా నడిచింది. అటు వైపునుంచి ఇటు వైపుకు తాటిపై పరిగెత్తింది. మళ్లీ ఇటు వైపు నుంచి అటు నాట్యం చేస్తూ పోయింది. అటువైపు నుంచి ఇటు వైపునకు చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ వచ్చింది. రాజావారు, వారి పరివారంతో పాటు ప్రేక్షకులు మంత్రముగ్ధులై• పెద్ద పెట్టున చప్పట్లు చరిచారు.

భీముడు రెండడుగులు మందమున్న పది పెద్ద పెద్ద బండరాళ్లను వరుసగా పేర్చి ఒంటి చేత్తో ముక్కలుముక్కలుగా పగలగొట్టి జనానందానికి అవధులు లేకుండా చేశాడు. రాముడు మనిషెత్తు కర్రలను తన పాదాలకు కట్టుకుని మైదానమంతా తిరిగి ప్రజా సంతోషానికి చెలియలికట్ట త్రెంచాడు.

ఇక సాంభుడు క్రీడా మైదానంలోకి ప్రవేశించి ఉత్తర దిక్కు నుంచి పరిగెత్తుకొచ్చి మిద్దె ఎత్తు ఎగిరి పరిటీలు కొట్టాడు. జనం కేకలతో హోరెత్తి పోయారు. దక్షిణ దిశ నుంచి ఆకాశంలోకి ఎగిరి అంతర్లంతర్లు ఐదు నిమిషాలు పైననే పరిటీలు గొట్టి క్రిందికి దూకాడు. ప్రజల ఈలలు కేకలు అరుపులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోయింది. అంతఃపురం ముందు భాగాన పాతిన రెండు కర్రలకు కట్టిన దారానికి మధ్యలో ఒక ఉంగరం ముడివేశారు. జనం ఆశ్చర్యంగా చూస్తూండగా అంతఃపురం పైభాగానికి ఎక్కి అక్కడి నుంచి క్రిందికి దూకి అంతర్లంతర్లు పరిటీలు కొట్టుకుంటూ వచ్చి రెండు చేతులతో ఉంగరాన్ని అందుకుని భూమి మీద రెండు కాళ్లపై కుర్చున్నాడు సాంభుడు. రాజావారు, పరివారం సంభ్రమాశ్చర్యాలతో ఆసనాలపై నుంచి లేచి ‘‘శభాష్‌…‌శభాష్‌…’’ అం‌టూ కరతాళ ధ్వనులు చేశారు. ప్రజలు కేకలు ఈలలు అరుపులు చప్పట్లు కొడుతూ ఎగిరి గంతులు వేశారు. సాంభుడి సాహ సాన్ని రాజావారు బహుదా ప్రశంసించారు. ఆట గాళ్లందరినీ ఘనంగా సత్కరించి భారీగా కానుకలిచ్చి గౌరవించాడు. ఈ సందర్భంగా రాజావారు ప్రసం గిస్తూ ‘‘ఆట అద్భుతంగా ప్రదర్శించారు. అందరి మనసులు గెలుచుకున్నారు. ప్రజాభిమానాన్ని కూడ చూరగొన్నారు. మా వసంతోత్సవాలకే తలమానికం మీ దొమ్మరాట. కానీ ఎప్పుడూ ప్రదర్శించే విన్యా సాలనే ప్రదర్శిస్తున్నారు. ఈసారి అంతఃపురం నుంచి దూకి ఉంగరం అందుకోవడం క్రొత్తగా చేర్చిన విన్యాసం. కానీ ఇది కూడ పరిటీలు కొట్టడంలో భాగమే కదా! అని మేము అనుకుంటు న్నాము. కాబట్టి వచ్చే వసంతోత్సవాలలో మమ్ములను మెప్పించే క్రొత్త విన్యాసంతో ఆట ప్రదర్శించండి. సాంభుడు ఈ విషయంలో కృతకృత్యుడవుతాడని భావిస్తూ ఈయేటి వసంతోత్సవాలను విజయవంతం చేసినందుకు కారకులైన వారందరినీ అభినందిస్తూ ముగిస్తున్నాము.’’ అని ఉపన్యాసం ముగించారు.

*****

పెన్నానదీ తీరాన ఎత్తైన ఇసుక దిన్నెపై కుర్చోని సేద తీరుతున్నారు సాంభుడు రంగి. గాలికి నీటి తుంపర్లు ఎగిరొచ్చి చల్లగా తగిలి ఒళ్లు పులకరింప చేస్తున్నాయి. వాతావరణం ఉల్లాసభరితంగా వుంది. పెన్నాలోయ అందాలు కనువిందు చేస్తున్నాయి. రంగి బావ ఎదపై తలపెట్టి ‘‘బావా! ఆట బాగా ఆడావు. రాజావారు గొప్పగా మెచ్చుకున్ళారు. ఇక నన్ను పెళ్లాడుతావా బావా?’’ ఆశగా ఆరాధనగా అడిగింది రంగి. ‘‘లేదు రంగీ! రాజావారు తృప్తి పడలేదు. నువ్వు వినలేదా? వచ్చే వసంతోత్సవాల నాటికి ఒక క్రొత్త విన్యాసాన్ని ప్రదర్శించి మాకు ఆనందం కలగించండి అన్నారు. కాబట్టి రాబోవు వసంతోత్స వాలలో నూతన విన్యాసాన్ని ప్రదర్శించి ప్రభువుల వారి మెప్పుపొంది ఆయన ఆశీస్సులతో ఆయన సమక్షంలోనే నిన్ను పెళ్లాడతాను. అంతవరకు ఓపికపట్టు రంగీ!’’ బతిమాలుతున్నట్లు రంగి గడ్డం పట్టుకుని చెప్పాడు సాంభుడు. రంగి కోపంగా లేచి మూతి ముడుచుకుని గూడెం వైపు రుసరుసలాడుతూ విసవిసా నడిచింది. సాంభుడు అనునయిస్తూ రంగి వెంట నడిచాడు.

మరుసటి రోజు స్థావరం వదిలి దొమ్మర సమూహం దేశదేశాలు తిరుగుతూ పాలెగార్ల వద్ద, మండలాధీశుల దగ్గర, సామంతుల సంస్థానాలలో, మహరాజుల క్రీడామైదానాలలో ఆటను ప్రదర్శిస్తూ దేశ సంచారానికి బయలుదేరారు. సాంభుడు దేశాటన చేస్త్తున్నాడే గాని మనసు మనసులో లేదు. రాజావారిని ఎలా మెప్పించాలి? అన్న ధ్యాసలోనే ఉన్నాడు. అతని ఆలోచనలలో స్థిరత్వం, దృఢత్వం గోచరిస్తోంది. రోజువారీ ఆడే ఆటలలో పాల్గొనలేక పోతున్నాడు. ఏమి చేస్తే, ఎలా చేస్తే బాగుంటుంది. అన్న ఆలోచనలోనే నిమగ్నమై ఉన్నాడు సాంభుడు. రంగి సాంభుడి విచారం పోగొట్టి ఉత్సాహ పరచాలని సరసాలు పడుతుంది. చతురోక్తులు విసురుతుంది. అయినా సాంభుడి విచారం పోలేదు. ‘‘బావా! అంత విచారం, అంత ఆలోచన అవసరం లేదు. రాజావారి మెప్పు పొందకపోతే నష్టం ఏమిలేదు. నువ్వు ఎప్పటి లాగ హుషారుగా ఉత్సాహంగా వుండు బావా!’’ బతిమాలి భంగపోయింది రంగి. చూస్తుండగానే ఆరు నెలలు గడచిపోయాయి.

ఒకనాటి రాత్రి నిద్రలో చక్కటి యోచన కలిగింది సాంభుడికి. ఉదయం చీకట్లోనే అడవికి బయలు దేరిపోయి పదిరోజులకు జింకచర్మం పెద్దపెద్ద నెమలీకలతో వచ్చాడు. అన్ని రోజులు కనిపించక పోయేసరికి కలవరపడినవారు సాంభుడిని చూడ డంతో శాంతపడినారు.

జింక చర్మాన్ని రెండుభాగాలు చేసి బాగా ఎండ బెట్టి బారెడు పొడవునా రెక్కల మాదిరి కత్తరించాడు. వాటికి పొడవైన నెమలీకలను కుట్టాడు. చేతికి తొడగడానికి వీలుగా రెక్కల క్రిందిభాగాన చర్మం తొడుగులు కుట్టాడు. తుమ్మబంకతో అద్ది గట్టి పరచాడు. రెండు రెక్కలను రెండు చేతులకు తొడుగు కుని వాటి చర్మపు కొసలతో వీపు భాగం నుంచి ఎద భాగం వరకు బిగించి కట్టాడు. అతనిలో అకుం ఠిత దీక్ష సాధించి తీరాలి అన్న పట్టుదల ద్యోతక మైంది. ఒక గుట్టపైకెక్కి చేతికి కట్టుకున్న రెక్కలను గట్టిగా ఊపుతూ క్రిందికి దూకాడు. క్రింది నుంచి గాలి ఒత్తిడికి సాంభుడు వేగంగా క్రింద పడకుండా నిదానంగా దిగాడు. ఇప్పుడు దానికన్నా పెద్దదైన కొండనెక్కి వేగంగా రెక్కలాడిస్తూ దూకాడు. ఈసారి కూడా ఇంకా నిదానంగా కొండ క్రిందికి చేరు కున్నాడు. రెక్కలను వేగంగా అల్లాడించేకొద్ది క్రింద పడిపోమని అర్థం చేసుకున్నాడు సాంభుడు. ఇంకి ప్పుడు పర్వతం పైకెక్కి అతివేగంగా రెక్కలు అల్లాడిస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. రెక్కల వేగం పెరిగేకొద్దీ సాంభుడు ఎటు కదిలితే అటు పోతున్నాడు. ఆయాసం వస్తే నేలపైకి నిదానంగా దిగుతున్నాడు. అలా సాంభుడు సాధన చేస్తూ ఆత్మస్థైర్యం పెంచు కున్నాడు. కాలం గడిచేకొలది ఆకాశంలోనే గిరికీలు కొడుతూ అలసిపోగానే భూమిమీద వాలుతున్నాడు. సాంభుడికి ఇదే దినచర్య అయింది. అనన్య సామాన్యంగా అసాధారణంగా సాంభుడి సాధన సాగుతోంది. పుష్టికరమైన ఆహారం తింటూ చేతల్లో, భుజాల్లో శక్తిని పెంచుకున్నాడు.

‘‘బావా! నీ సాధన ప్రమాదకరంగా వుంది. నాకు భయం కలిగిస్తున్నది. భద్రం బావా!’’ బావను హెచ్చ రించింది రంగి. అయితే సమయం గడిచే కొలది బావ ప్రయత్నంపై నమ్మకం విశ్వాసం కుదిరి మురిసి పోయింది. సాంభుడిని చుంబనాలతో ముంచి సంబరం చేసుకుంది.

సంవత్సర దినాలు గడిచిపోయాయి. గండి కోటలో వసంతోత్సవాలు ప్రారంభమవడానికి సమయం ఆసన్నమైంది. దొమ్మర్లంతా గండికోట వెలుపల యథాస్థానంలో స్థావరం ఏర్పరుచుకొని గుడిసెలు వేసుకున్నారు.

వసంతోత్సవాలు ఆరంభం అవుతున్నట్లు

నగారా మ్రోగింది. కోటను సర్వాంగసుందరంగా అలంకరించారు. అనేక కళాత్మక వస్తువులు అమ్మ కానికి అంగళ్ల వీధులు ఏర్పడినాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీ ప్రదర్శనలు అత్యంత ఆసక్తి కరంగా జరిగాయి. చిట్టచివరి ప్రదర్శనగా దొమ్మ రాట క్రీడామైదానంలో ఉత్కంఠత ఉద్వేగాల మధ్య ప్రారంభమైంది. జనం కోలాహలంగా, ఉత్సాహంగా చూస్తున్నారు. ప్రభువు, వారి పరివారం ఉన్నతాసనా లపై ఆశీనులై అత్యంత ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఆటలోని విన్యాసాలన్నీ ఒక్కొక్కటి ప్రదర్శిస్తున్నారు. చివరగా సాంభుడి వంతు వచ్చింది. అతడు రెక్కలతో అంతఃపురం పైభాగానికి చేరుకున్నాడు. రెక్కలను చేతులకు భుజాలకు వీపునకు ఎదకు బిగించి కట్టాడు. రాజుగారివైపు, ప్రజలవైపు తిరిగి చేతులు గాలిలోకి ఊపాడు. రాజావారు తీక్షణంగా చూస్తున్నారు. జనం హోరుమంటూ అరిచారు. సాంభుడు ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరాడు. రెక్కలను అత్యంత వేగంగా అల్లాడిస్తూ ఆకాశంలో గిరికీలు కొడుతున్నాడు. ప్రజలు అమితాశ్చర్యంతో చూస్తు న్నారు. రాజావారు విభ్రాంతులై సాంభుడిపైనే చూపు నిలిపారు. సాంభుడు కోటచుట్టూ రెండుమూడు సార్లు ఆకాశం లోనే తిరిగాక తూర్పుకు తిరిగి కోటను దాటాడు. రాజుగారు సాంభుడి సాహసానికి అంతులేని అబ్బురంతో గుర్రమెక్కి ఆకాశంలో సాంభుడు ఎటుపోతే నేలమీద రాజావారు అటుపోతున్నారు. సాంభుడు ఆకాశంలో ఎగురుతూ పెన్నానది లోయను దాటాడు. పల్లెలు గ్రామాలు దాటిపోతున్నాడు. సాంభుడు ఆకాశంలో వందడుగుల ఎత్తులోనూ, రాజావారు నేలపై గుర్రం మీదనూ వేగంగా పోతు న్నారు. సాంభుడు మైలవరం వేపరాల గ్రామాలు దాటాడు. రాజావారు సాంభుడిని అనుసరించి పోతున్నారు. సాంభుడికి ఆకాశంలో ఎగిరే శక్తి నశించింది. ఆయాసం తన్నుకొస్తోంది. విపరీతంగా రొప్పుతున్నాడు. చేతుల్లో రెక్కలు అల్లార్చే బలం తరిగిపోయింది. సాంభుడు భూమీద దిగడానికి చోటు వెదికాడు. సరైన చోటు కనిపించలేదు. ముళ్లకంప చెట్లు, మొనదేలిన బండరాళ్లు ఉన్నాయి. మరికొంత దూరం పోవడానికి ప్రయత్నించాడు. శక్తి చాలలేదు. బలం సన్నగిల్లింది. రాజు సాంభుడికి చేరువగా వచ్చారు. అంతలోనే సాంభుడు శక్తి కోల్పోయి తలకిందులుగా తిరుగుతూ నంద్యాల గ్రామ సమీ పాన దబ్బున పెద్ద బండపైపడి నెత్తురు కక్కుకున్నాడు. సాంభుడి తల బండకు తగిలి రక్తం ధారగట్టింది. రాజావారు సాంభుడు పడిన చోటికొచ్చి చూసి నిర్ఘాంతపోయాడు. ‘‘విశేష ప్రజ్ఞాపాటవాలు చూపి ప్రశంసలు అందుకోవాలని అనుకున్నాడు సాంభుడు. పాపం ఆ ప్రయత్నంలో ప్రాణాపాయ స్థితి తెచ్చు కున్నాడు.’’ అని అలవిగాని మనస్తాపం చెందాడు రాజావారు. రంగి పరుగునవచ్చి సాంభుడి పైబడి భోరుభోరున విలపిస్తున్నది. నంద్యాల ప్రజలంతా సాంభుడి చుట్టూ మూగి దిగ్భ్రాంతికి గురై సానుభూతి ప్రకటిస్తున్నారు. సాంభుడు రాజువైపు, ప్రజలవైపు చూసి చేతులెత్తి నమస్కరించాడు. రంగిని జాలిగా చూస్తూ చివరి శ్వాస వదిలాడు. రాజు ప్రజలు విపరీతంగా బాధపడ్డారు. సాంభుడి బంధు వర్గం అంతులేని దుఃఖములో మునిగిపోయింది.

ప్రభువు ప్రజలను ఉద్దేశించి ‘‘ఈరోజు నుంచి ఈ నంద్యాల గ్రామం ‘దొమ్మర నంద్యాల’గా వ్యవ హారంలోకి వస్తుంది. ఇప్పుటి నుంచి ఈ గ్రామాన్ని దొమ్మర్లకు మాన్యంగా ఇస్తున్నాము. ఈ గ్రామప్రజలు నేటి నుంచి పన్నులు దొమ్మర పెద్దలకే చెల్లించాలి.’’ అని ప్రకటించి సాంభుడి సమాధిపై శిలాశాసనం చెక్కించారు ప్రభువులవారు

నాటి నుంచి సాంభుడి సాహసం వీరగాధై ప్రజల్లోకి పోయి స్థిరపడింది. జిల్లా స్థానిక చరిత్రలో లిఖితమై, స్థిరకీర్తి పొందింది.

About Author

By editor

Twitter
YOUTUBE