– కాశింశెట్టి సత్యనారాయణ, విశ్రాంత ఆచార్యుడు

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా.. భారతీయుల పోరాటాలకు సంబంధించిన యదార్థ చరిత్ర ప్రామాణికంగా అందుబాటులోకి రాలేదు. ఉద్యమంలో పాల్గొన్న కొందరు నాయకుల చరిత్రే మనకు అందుబాటులో ఉంది. బ్రిటిష్‌ ‌సామ్రాజ్యాన్ని, వారి అనుయాయులను ఎదిరించి పోరాడిన ఇంకా ఎందరో వీరుల చరిత్ర వెలుగు చూడలేదు. హైదరాబాద్‌ ‌సంస్థానాధీశుడైన నిజాం మత దురహంకారంతో, నిరంకుశత్వంతో ఎప్పటికీ రాజుగానే ఉండాలని కోరుకున్నాడు. తన రాజ్యంలో అత్యధిక సంఖ్యాకులైన హిందువులపై ఎన్నో ఆంక్షలు విధించాడు. ఈ సంస్థానంలో తెలంగాణతో పాటు మరాఠ్వాడా, మహారాష్ట్ర, బీదర్‌ (‌కర్ణాటక) ప్రాంతాలుండేవి. 16 జిల్లాలకు గాను 8 జిల్లాలు తెలంగాణ ప్రాంతానికి చెందినవి. కాగా మరాఠా, కర్ణాటకకు చెందినవి 8 జిల్లాలు.

బీదర్‌ ‌జిల్లా అవరాద్‌ ‌తాలూకాలోనిది బాలూర్‌ ‌గ్రామం. ఈ గ్రామ జనాభా 500. సికింద్రాబాద్‌-‌పర్గి రైల్వేమార్గంలో కమాల్‌నగర్‌కు మైలు దూరంలో ఇది ఉండేది. ఈ గ్రామస్తులు రజాకార్ల అకృత్యాలపై ధైర్యంగా పోరాడారు. వీరిలో గ్యానోబా, సదాశివ ఢగేలు వడిసెలతో ఫర్లాంగు దూరంలో లాఠీ పట్టుకొని నిలుచున్న రజాకార్‌ ‌చెయ్యిని గురి చూసి రాయితో కొట్టి ఆ లాఠీని పడేయడంలో నిపుణులు. ఆ గ్రామ పోలీసు పటేల్‌ ‌రాచప్పకు ఆనాటి రాజకీయాలు బాగా తెలుసు. రజాకార్ల అఘాయిత్యాల గురించి తెలిసి తన మిత్రులు, గ్రామస్తుల సహాయంతో గ్రామాన్ని రక్షించుకుందామని వడిసెలతో నిత్యం సాధన చేస్తూ, యువకులతో చేయిస్తూ ఉండేవారు.

కర్ణాటక రైతులు వర్షాకాలంలో ‘పొలి’ పండుగ జరుపుకుంటారు. ఆ రోజు పశువులను శుభ్రంగా కడిగి, అలంకరిస్తారు. వాటికి ‘గులవర్నా’ (బెల్లం నీరు) తాగించి పూజ చేస్తారు. ఆ రోజు వాటితో పని చేయించరు. ఎడ్లబళ్లలో బయల్దేరి ఆంజనేయస్వామి దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు జరిపి ఇంటికి వస్తారు. సాయంత్రం ‘కరీ’ ఉత్సవం (ప్రవేశ ద్వారానికి కట్టిన మామిడి తోరణాన్ని ఎడ్లు తోలే కర్రతో తెంపడం) నిర్వహిస్తారు.

ఆ ఏడాది పొలి పండుగ శుక్రవారం వచ్చింది. ఆ రోజు ముస్లింలు నమాజ్‌ ‌చేస్తారు. కాబట్టి కార్యాలయాలకు వారంతపు సెలవు. గురువారం రాత్రి కమాల్‌నగర్‌లో ఇత్తేహాదుల్‌ ‌ముస్లిం సంఘం బహిరంగ సభ నిర్వహించింది. రజాకార్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిజాం ప్రభుత్వ అధికారులు స్వయంగా పాల్గొన్నారు. ఆ సంఘ నాయకుల్లో ఒకరైన జాఫర్‌ఖాన్‌ ‌పఠాన్‌ ‌మాట్లాడుతూ ‘సోదరులారా! నేటి పరిస్థితుల్లో మనమంతా మేల్కొని ఉండాలి. ఆజాద్‌ ‌హైదరాబాద్‌ ‌మనుగడకు సవాలుగా కొన్ని శక్తులు పరిణమించాయి. సయ్యద్‌ ‌మియా తెలిపిన వివరాల ప్రకారం మన పొరుగునున్న బాలూరు గ్రామంలో హిందూ పోలీసు పటేల్‌ ‌రాచప్ప మనకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడు. తన మిత్రులను కూడగడుతున్నాడు. రైతు దళాలతో సంబంధాలు ఏర్పరుచుకుంటున్నాడు. మనపై తిరుగుబాటుకు ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఆ ప్రయత్నాలను మొగ్గలోనే తుంచేయకపోతే మహా ప్రమాదం ముంచుకు వస్తుంది. కాబట్టి మనం రేపు బాలూరు గ్రామంపై పోలీసు బలగంతో దాడి జరుపుదాం. రేపు హిందూ రైతులు పొలి పండుగ జరుపుకుంటారు. ఈ సందడిని ఆసరా చేసుకొని రేపే దాడి చేయడం మంచిది. రేపు సాయంత్రం విజేతలుగా తిరిగి వచ్చి అల్లాకు ఇక్కడే నమాజ్‌ ‌చేద్దాం. అల్హాహో అక్బర్‌, ‌షాహే ఉస్మాన్‌ ‌జిందాబాద్‌’ అం‌టూ ముగించాడు.

పొలి పండుగ నాడు గ్యానోబా, సదాశివ ఢగేలు పొలంలో ఉన్నారు. అకస్మాత్తుగా రజాకార్లు ఆ గ్రామంపై దాడి చేశారు. గ్యానోబా, సదాశివ ఢగేలుల చేతులు నరికేశారు. సదాశివ ఢగేలు ఆ నొప్పితోనే గ్రామంలోకి పరుగెత్తి వారిని హెచ్చరించాడు. ఈలోగా వందమంది పోలీసులు, రజాకార్లు గ్రామాన్ని చుట్టుముట్టి పశువుల కొట్టాలకు నిప్పు పెట్టారు. మండుతున్న కొట్టాలలోకి గ్యానోబాను విసిరేసి సజీవ దహనం చేశారు. వెంటనే గ్రామస్తులు తులసీరాం పటేల్‌ ‌రెండంతస్తుల భవనంపైకి ఎక్కి గురిచూసి వడిసెలతో రాళ్లు తీసుకుని రజాకార్లపై దాడి చేస్తున్నారు. రాళ్ల దెబ్బలు భరించలేక వారు వెనక్కి పరుగెత్తడం మొదలెట్టారు. అటువైపు పెద్ద సంఖ్యలో రజాకార్లు, పోలీసులు; ఇటువైపు కేవలం వడిసెలు, రాళ్లతో వారిని తిప్పికొడుతున్న బాలూరు వాసులు. రాచప్ప పటేల్‌ ‌దగ్గర ఒక భర్‌మార్‌ ‌తుపాకీ, కొన్ని నాటు బాంబులు ఉన్నాయి. మొత్తం ఓ డజను మంది మాత్రమే వడిసెలతో దాడి చేస్తున్నారు. ఈలోగా ఈ వార్త పక్క గ్రామాల్లో ఉన్న రజాకార్లకు తెలిసి వారూ వచ్చారు. కానీ వడిసె వీరుల ధాటికి గ్రామంలో అడుగు పెట్టలేకపోయారు.

సూర్యాస్తమయ సమయాన నిజాం పోలీసులు గ్రామస్తులను ‘అనవసరంగా ప్రాణాలు వదులుకో కండి. లొంగిపోండి’ అని హెచ్చరించారు. ‘మీరు రజాకార్లను వెనక్కి పంపేయండి. మీ ప్రభుత్వంతో మాకు పేచీ లేదు’ అన్నారు గ్రామస్తులు. పోలీసులు రజాకార్లను పంపేసినట్టు నటించారు. తర్వాత గ్రామస్థులు ప్రభుత్వానికి లొంగిపోయారు. రాళ్ల వర్షం ఆగిపోయింది. రాక్షసకాండ మొదలైంది. రజాకార్లు, పోలీసులు ఎదురుపడిన ప్రతీ హిందువుని బల్లాలతో పొడిచి చంపేశారు. ఇళ్లకు నిప్పు పెట్టారు. కాలిపోతున్న ఇళ్లల్లోకి కొందరిని విసిరేశారు. ఇలా సజీవ దహనమైన వారు- శంభాజీ, సంత్‌రాం, నారాయణ్‌ ‌నాగోబా, కాక్‌నోలే గుండప్పా, గుండిజీ, రాయఫల్‌, ‌శిర్‌సగే. ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న వృద్ధుడిని కూడా వారు వదల్లేదు. మంటల్లోకి విసిరేశారు. సంత్‌రాం ఇంట్లోని ఓ రెండు నెలల పసికందును కూడా మంటల్లోకి విసిరేశారు.

రాచప్ప ఇంటిపేరైన ‘కౌల్‌ఖేడే’ పేరు గల వారిని చాలా మందిని చంపేశారు. రైతు దళం నాయకుడు అప్పారావు కౌల్‌ఖేడే.. ఇతను కౌల్‌ఖేడే గ్రామస్తుడు. ఇతను రాచప్ప బంధువై ఉంటాడని అతన్నీ చంపారు. ఇక రాచప్పను అత్యంత పాశవికంగా, రాక్షసంగా చంపారు. మొదటిరోజు ఒక చేతిని నరికారు. రెండవ రోజు రెండవ చేయి, మూడో రోజు ముక్కు, చెవులు కోసి, తరువాత కళ్లు పీకేశారు. బహిరంగంగా రాచప్పను హత్య చేశారు. బాలూరు వాసులకు ఎవరు ఆశ్రయం ఇచ్చినా రాచప్పకు పట్టిన గతే పడుతుందని ప్రకటించారు. రాచప్ప అవయవాలు నరికేసిన సందర్భంలోనూ రజాకార్లను ఎదుర్కోవాలని, గ్రామాన్ని కాపాడుకోవాలని ఆయన గ్రామీణులను ప్రేరేపించడం గమనార్హం.

ఆ సమయంలో రాచప్ప పటేల్‌ ఇం‌ట్లో అనేక మంది స్త్రీలు, పిల్లలు తల దాచుకున్నారు. గ్యానోబా భార్య ప్రసవించి అనారోగ్యంతో అదే ఇంట్లో ఉంది. రాచప్ప ఇంట్లో చాలా ఆయుధాలు ఉన్నాయనే సంగతి కూడా రజాకార్లకు తెలీదు. కొంతమంది గ్రామస్తులు రాచప్ప పటేల్‌ ‌భవంతిపై నుండి వడిసెలతో రాళ్లు విసిరి రజాకార్లను వెనక్కి తరిమారు. రైతు నాయకుడిని చంపారు. కాబట్టి రైతుదళం వచ్చి దాడి చేస్తుందేమోనన్న భయంతో రజాకార్లు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాలూరును సర్వనాశనం చేసి, కమాల్‌నగర్‌లో నమాజ్‌ ‌చేస్తామన్న మాటను రజాకార్లు నిలుపుకోలేకపోయారు. రజాకార్లను ధైర్యంగా ఎదుర్కొని రాచప్ప ఇంటిని, అక్కడ తలదాచుకున్న వారిని రక్షించిన ఘనత నివృత్తిరామ్‌, శ్రీ‌పతి గణపతి ఢగేలులకు దక్కుతుంది.

బాలూరులో కాలుతున్న కొట్టాల్లో లేగదూడలు అరుస్తూ చనిపోయాయి. మిగిలిన వారు అడవుల దారి పట్టారు. యశోద అనే వృద్ధ మహిళ ప్రాణాలకు తెగించి మంటల్లోకి దూకి కొన్ని లేగదూడల్ని కాపాడింది. ఆ గ్రామవాసులు నేటికీ పొలి పండగ నాడు 1948లో జరిగిన ఆ మారణకాండను గుర్తు చేసుకుంటారు. బాలూరు గ్రామస్తుల బలిదానాన్ని, సాహసాన్ని చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు!

About Author

By editor

Twitter
YOUTUBE