తన ముందు రెండు పథాలు కనిపించాయి. ఒకటి ఒకప్పుడు క్షిపణి పరిశోధకునిగా తపస్సు చేసిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రారంభించిన ఒక కార్యక్రమంలో భాగస్వామ్యం. మరొకటి యోగదా సత్సంగ ఆశ్రమ ప్రవేశం. ఆయన రెండో మార్గాన్ని ఎంచుకున్నారు. ఆయనే స్వామి స్మరణానంద గిరి. నీలోని పరమాత్మను దర్శింపచేసేది యోగా అంటారు స్వామి స్మరణానంద గిరి. క్రియాయోగంలో ఆయన నిష్ణాతులు. నీలోనే నీవు దైవాన్ని దర్శించినప్పుడు తప్పనిసరిగా ఎదుటివారిలోను దర్శించగలుగుతావు. అప్పుడు అంతా సౌభాత్రం నెలకొంటుంది. అది ప్రపంచ శాంతికి ఉపకరిస్తుందంటూ పరమ గురువులు చెప్పిన సందేశాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. కొన్నివేల ఏళ్ల నాడు మానవాళికి యోగా ఎలా ఉపయోగపడిందో, ఇవాళ కూడా అదే విధంగా లబ్ధి చేకూరుస్తున్నదని అన్నారు. ప్రస్తుతం యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటి అంశాల మీద మన అవగాహన ఎంతో పెరిగిందని కూడా చెప్పారాయన. శ్రీశ్రీ పరమహంస యోగానంద 1917లో స్థాపించిన యోగదా సత్సంగ సొసైటీలో స్మరణానంద స్వామి గిరి పరివ్రాజకులు. ప్రపంచంలో ఎందరినో కదిలించిన పుస్తకం ‘ఒక యోగి ఆత్మకథ’ (పరమహంస యోగానంద జీవితచరిత్ర) రాసినవారు ఆయనే.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్‌లో పట్టభద్రులు. తరువాత చెన్నై ఐఐటీ నుంచి కూడా ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్నారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అన్న అంశం మీద పరిశోధన చేసి ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. కొద్దికాలం హిందుస్తాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్ (హైదరాబాద్), సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ (విజయవాడ)లో పనిచేశారు. నేవిగేషనల్ ఎలక్ట్రానిక్స్ కేంద్రం (ఉస్మానియా విశ్వవిద్యాలయం)లో కూడా సేవలు అందించారు. క్రియాయోగం గురించి స్వామి స్మరణానందగిరి సందేశామృతం ‘జాగృతి’ పాఠకుల కోసం.
నమస్కారం! ప్రాణాయామం మహర్షులు మనకిచ్చిన ధ్యానపక్రియ. ఆధ్యాత్మిక చింతన పరంగా, సర్వేజనా సుఖినోభవంతు వంటి ఆలోచనను అత్యంత సులభంగా అమలులో పెట్టడానికి ఉపక రించిన పక్రియ. అందులో భాగం క్రియా యోగం. క్రియాయోగంలో ఎంతో సాధన చేసినవారు మీరు. కాబట్టి ఆ విధానం గురించి మీరే మా పాఠకులకు పరిచయం చేస్తే ఎంతో అర్ధవంతంగా ఉంటుంది. విషయంలోకి వెళ్లే ముందు అలాంటి చిన్న ఉపోద్ఘాతం…. మీ నుంచి.
క్రియాయోగమనేది చాలా ప్రాచీనమైన ప్రాణాయామం. అనాది నుంచి ఎంతోమంది యోగి పుంగవులూ, రుషిశ్రేష్టులూ యోగాభ్యాసం గురించి బోధించే క్రమంలో క్రియాయోగం గురించీ చెప్పారు. ఒక విషయమేమంటే, మనమందరం మైండ్ కంట్రోల్-అంటే ఆలోచనలను లేదా మనసును అదుపులో ఉంచుకోవాలని కోరుకుంటూ ఉంటాం కదా! మనసు మన స్వాధీనంలో ఉంటే బాగుం టుందనీ అనుకుంటాం. కానీ ఆలోచనలు అనండీ, లేదా మనసు అనండీ, ఏ వ్యక్తికీ పూర్తి అదుపులో ఉండవు. దాని ఫలితమే ఈ కంగారు, ఈ ఆత్రం, ఈ వత్తిడి. అదుపులో లేని మనసు విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉంటుంది. కానీ నిజం ఏమిటి? మైండ్ మీద కంట్రోల్ ఉంటే జీవితంపైన కూడా అదుపు వస్తుంది. చాలామంది అంటారు, ఎంత ప్రయత్నిం చినా గానీ నా మైండ్ నా స్వాధీనంలో ఉండదని. మరి పరిష్కారం! మన ప్రాచీన యోగులు- రియల్ స్ప్రిచ్యువల్ సైంటిస్టస్, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు శతాబ్దాల పాటు తపించి, శోధించి ఒక మూల సిద్ధాంతాన్ని కనుగొన్నారు. అదే- మైండ్ లేదా మనసు, శ్వాస పరస్పరం సంబంధం ఉన్నవే. మనసును నేరుగా అదుపు చేసే శక్తి లేనప్పుడు శ్వాస ద్వారా మనసు మీద అదుపు సాధించవచ్చు. దానికి కొన్ని ప్రాణాయామ పద్ధతులు ఇచ్చారు. వాటిల్లో అత్యుత్తమైన ఒక ప్రాణాయామ విదే•- క్రియాయోగం.
క్రియాయోగంలో అభ్యాసం ఎలా ఉంటుంది?
ఈ పక్రియలో మనం విశిష్టమైన శ్వాసను తీసుకుంటాం. అంటే, ఆ శ్వాస ద్వారా కొంచెం ఎక్కువ ప్రాణవాయువు (ఆక్సిజన్) తీసుకొంటాం. ఎక్కువ ప్రాణవాయువు మన శరీరంలో ఉన్న చెడు రక్తాన్ని నేరుగా శుభ్రపరుస్తుంది. మామూలుగా చెడు రక్తాన్ని శుద్ధి చేసే పని ఊపిరితిత్తులు, గుండె చేస్తాయి. ఇపుడు మనం నేరుగానే రక్తాన్ని శుభ్రం చేస్తున్నాం. కాబట్టి గుండెకూ, ఊపిరితిత్తులకూ కొంత పని వత్తిడి తగ్గుతుంది. ఎపుడైతే గుండెకు పనిభారం తగ్గిందో అపుడు రక్త ప్రసరణం కొంచెం నెమ్మదిస్తుంది. అంటే శరీరంలో జీవ పక్రియ కూడా నెమ్మదిస్తుంది, నిద్రలో ఉన్నప్పటి మాదిరిగా. దీని ఫలితం ఏమిటంటే, ఇంద్రియాలు కొంత అణకువగా వ్యవహరిస్తాయి. తద్వారా మనకు ఏకాగ్రత, అంతర్ము ఖత్వం, ప్రత్యాహారం వస్తాయి. ఎప్పుడైతే ప్రత్యాహారం మనం అనుభవిస్తామో, మన లోనికి మనం వెళతామో అక్కడ మన అసలైన, నిజమైన స్వరూపంతో సంపర్కం ఏర్పరుచుకుంటాం. అదే ఆత్మ. ధ్యానం ద్వారా ఆత్మతో పొత్తు ఏర్పడుతుంది. ఆత్మ స్వభావం ఏమిటంటే నిత్య నవీన ఆనందం. అందుకనే ధ్యానం చేసినప్పుడు ప్రశాంతత కలుగుతుంది. ధ్యానం ద్వారా మనం మనలోపలికెళతాం. ఆత్మతో సంపర్కం ఏర్పరుచుకుంటాం. తద్వారా ఆనందాన్ని పొందుతాం. ఇది క్లుప్తంగా క్రియాయోగ స్వరూపం, స్వభావం.
ధ్యానం…. క్రియాయోగం… ఈ రెండింటినీ ఎలా చూస్తాం?
ధ్యానం అంటే సాధారణ వాడుక. క్రియాయోగం అనేది ధ్యాన పక్రియ. మెడిటేషన్ టెక్‌నిక్. ఇది చేస్తే మనం ప్రశాంత స్థితికి వెళతాం. ఆ నిశ్చలత్వంలో, ప్రశాంత స్థితిలో ధ్యానం చేస్తాం. ధ్యానం ఒక వాహనం వంటిది. క్రియా యోగం, హంసయోగ పక్రియకానీ, ఓంకార పక్రియ కానీ వాహనం లాంటివి. అవి మనను ఒక స్థితికి తీసుకెళతాయి, నిశ్చలత్వానికి. నిశ్చలత్వంలో ఆ ప్రశాంతతలో అసలైన ధ్యానం చేస్తాం. మనసు భగవంతునితో అనుసంధాన మవుతుంది. మన అసలైన ఆత్మతో మనకు సంపర్కం ఏర్పడుతుంది. బయటి రణగొణధ్వనులు మనకు చేరవు. దానితో క్రియాయోగం మనల్ని ఆ స్థితికి తీసుకెళుతుంది. ఆ స్థితికి వెళ్లిన తరువాత ఆత్మతో ముడిపడి ఉండడమనేది అసలైన ధ్యానం.
ఇందులో ఆధ్యాత్మికత పాత్ర?
ఆధ్యాత్మికత పాత్ర ఉందనుకునేవారూ, అసలు ఆధ్యాత్మికతనే ప్రశ్నించేవారూ, ఆధ్యాత్మికతే లేదనుకునే వారూ ఎవరైనా సరే ధ్యానం చేయవచ్చు, పరిపూర్ణమైన ఫలితాన్ని పొందవచ్చు. ధ్యానం వల్ల వచ్చే ఫలితమేమంటే ఆనందం, ప్రేమ, జ్ఞానం, అంతర్‌దృష్టి, క్రియేటివిటి… ఇవన్ని. భగవంతుని మీద ఏ మాత్రం నమ్మకం లేదనుకుంటూ ధ్యానం చేసినా సరే మనకు ఫలితాలు వస్తాయి. కానీ అంతిమంగా జరిగేదేమిటంటే ఆ భగవంతునితోనే పొత్తు ఏర్పరుచుకుంటాం, ధ్యానం ద్వారా. అప్పుడు మనకు అర్థమౌతుంది క్రియా యోగం. పరమ పూజనీయ శివానంద గురువుగారు చెప్పారు, ‘దివ్యత్వాన్ని విశ్వసించని ఏ వ్యక్తి అయినా, ధ్యానం ద్వారా చివరికి తనకు తానే దివ్వత్వం గురించి తెలుసుకుంటాడు’ అని. అంటే మరొకరి దైవత్వాన్ని ఎప్పుడూ ఒప్పుకోని వారు కూడా క్రియా యోగం చేస్తే అంతిమంగా తనలో ఉన్న దైవత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడైతే తనలోని దైవత్వాన్ని చవిచూస్తాడో తప్పకుండా ఇతరులలోని దైవత్వాన్ని కూడా చూస్తాడు. ఇక్కడ ఆధ్యాత్మికతకు ఏ మాత్రం పాత్ర లేదు. అయినా సరే ధ్యానం చేస్తూ ఉంటే చివరికి ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుస్తుంది. నా విషయంలో జరిగిందిదే. నేను భగవంతుని కోసం ధ్యానం చేయలేదు, చివరికి భగవంతుడిని ఆరాధిస్తున్నాను.
ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినంత వరకు సాధారణ ప్రజలకు ఏకాగ్రత కుదరడానికి విగ్రహా రాధన మార్గమంటారు. మరి ఇందులో ఎలా? యోగం అంటే సాధారణంగా ఆధ్యాత్మికం, హిందుత్వం దృష్టితోనే చూస్తూ ఉంటారు.
యోగమంటే కలయిక. అంటే జీవాత్మ పరమాత్మతో కలవడం. అది చివరి స్థితి. కానీ ప్రాణాయామంలో భగవంతునితో ముడిపెట్టనవసరం లేదు. ప్రాణాయామం అంటే ప్రాణ, యమ అంటే లైఫ్‌ఫోర్స్‌ను అదుపు చేయడం. యమ అంటే కంట్రోల్, ప్రాణ అంటే లైఫ్. కంట్రోల్ ఆఫ్ లైఫ్. శరీరంలో ప్రాణశక్తి ఉంది. దాని పని అది చేస్తుంది, దాన్ని కంట్రోల్ చేస్తుంది యోగా. మామూలుగా దాని మార్గమేమిటి? వెన్నెముక ద్వారా మెడ నుండి క్రిందికి వెళుతుంది. వెన్నెముకలో చక్రాల నుండి బయటికి వెళుతుంది. అంటే డౌన్‌వార్డ్, అవుట్ వార్డ్ కిందికి వెళుతుంది. తద్వారా ఇంద్రియాలన్నింటికి ప్రాణశక్తి వస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో దేర్ ఈజ్ రివర్స్ లా ఫ్లో ఆఫ్ లైఫ్‌ఫోర్స్. వ్యతిరేక దిశలో లైఫ్‌ఫోర్స్ వెళుతుంది. అంటే కింద నుండి పైకి, మొదట బయటి నుండి లోపలికి ఇంద్రియాల నుంచి ప్రాణ శక్తికి తిరిగి చక్రాలలోకి వస్తుంది. చక్రాలలోకి వచ్చిన తరువాత వెన్నెముక నుంచి పైకి వెళుతుంది. మామూలుగా డౌన్‌వార్డ్, అవుట్ వార్డ్. ధ్యానం చేస్తే ఇన్‌వార్డ్, అప్‌వార్డ్. ఇంద్రియాల నుండి లోపలికి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే ఇన్‌వార్డ్ అప్‌వార్డ్ చేస్తామో ప్రాణశక్తి లోపలికెళుతుంది. అప్పుడు ఇంద్రియాలపై ఎక్కువగా ఆధారపడి ఉండం. జితేంద్ర, జితేంద్రియు లమవుతాం, ప్రాణాయామం ద్వారా. దీనికి భగవంతుని మీద ధ్యాన ఉండాలనే నిబంధన ఏదీ అవసరం లేదు. ఒకవేళ భగవంతుడు అనే ఆలోచన వచ్చినా అది అసహజం కాదు. అలా ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చు. ఎందుకంటే మామూలు గానే ఏ కార్యక్రమం మొదలెట్టినా భగవంతుడిని తలుచుకోవడం మన సంప్రదాయం. స్నానం చేసినా, ఏదైనా పని ఆరంభించినా, పుస్తకం తీసినా, ఆఖరికి ప్రతిపూట భోజనానికి ముందు కూడా మనం భగవంతుడిని తలుచుకుంటాం. అదే విధంగా యోగం చేసేటప్పుడు భగవంతుడిని తలుచుకుని చేస్తాం. అంతేకానీ, ప్రాణాయామానికీ, భగవంతునికీ సంబంధం లేదు.
జీవాత్మకూ, పరమాత్మకూ సయోధ్య కుదిర్చేది యోగమని అన్నారు కదా! శంకరభగవత్పాదులు చెప్పిన జీవాత్మ, పరమాత్మ తాత్త్వికతకీ, దీనికీ ఏమన్నా సంబంధం ఉన్నదా?
శంకర భగవత్పాదులు చెప్పినా, మరొకరు చెప్పినా, వారంతా యథార్థమే చెప్పారు. కానీ మూల సిద్ధాంతం ఒకటే కదా! అహం బ్రహ్మాస్మి- ఇదే ఆ మూల సిద్ధాంతం. నేను భగవంతుడిని అని. కానీ ఇది గర్వంతో చెప్పడం కాదు, ఆ భగవంతునిలో నేనూ ఒక భాగం అనుకోవడం. సర్వం భగవంతుడే. నేను దానిలో ఒక భాగం. ఇంకొకటి ఏమి చెబుతున్నది! నేను భగవంతుని కుమారుడను. భగవంతుని ప్రతిబింబం నీలో ఉంది. ఇమేజ్ ఆఫ్ గాడ్ వితిన్ యు అని మరొక శాస్త్రం చెపుతున్నది. ఏ యుగంలో అయినా, ఏ మతంలో అయినా కూడా మనిషికి, భగవంతునికి మధ్య సంబంధం కనిపిస్తుంది.
మహానుభావులు, ప్రాతఃస్మరణీయులైన యోగులూ, పతంజలి లాంటివారూ మనకు యోగసూత్రాలు ఇచ్చారు. వారికి ఆ దృష్టికోణం ఎలా వచ్చింది?
అభ్యాసం ద్వారా. పతంజలి ఒక్కరోజులో పతంజలి కాలేదు. అభ్యాసం చేయగా చేయగా అప్పటికి ఆయనకు అర్థమయింది. అసలు యోగం అంటే ఏమిటి? నేను ఎవరు అనేది తెలుసు కోవడం. హూ యామ్ ఐ! యోగా సారం పరమాత్మ, పరబ్రహ్మం. దైవత్వం స్థాయి నుంచి ఆత్మ పతనమైపోకుండా నిలబెట్టేది యోగ. పరబ్రహ్మ సృష్టికి అతీతుడు. భగవంతుడికి సృష్టి ఉండవలసిన అవసరం లేదు. అక్కడి నుండి ఈ ఆత్మ అనేది వచ్చి ఈ శరీరంలోకి ప్రవేశించిన తరువాత తన మూల బంధాన్ని మరిచిపోయి ఆత్మ కూడా, అంటే జీవాత్మ, ఈ శరీరంతో ముడిపెట్టుకొని, ఈ దేహం పోషించే పాత్రతోను భాగమై నేను ఇంతే, నేను మనిషిని, నేను ఇంజనీర్‌ను, నేను పత్రికా విలేకరిని, నేను ఇది, నా ఆస్తి అంటూ బంధం ఏర్పరుచుకుంటుంది. అంటే ఆత్మ దైవత్వం నుంచి పతనమవుతుంది. ఆత్మ తిరిగి తనదైన స్థానానికి అధిరోహించడమంటేనే దైవత్వం. అదే యోగా అంటే. యోగా విజ్ఞానశాస్త్ర పరిణామం.
కచ్చితమైన శాస్త్రం కాబట్టి అందరికీ ఫలితాలు ఒకటేననుకోవాలి.
యోగ వల్ల భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఉపయోగాలు ఉన్నాయి. అవి అందరికీ ఒకటే. దైవంతో బంధం పెట్టుకుని లేదా బంధం లేదనుకుని చేసినా ఫలితాలు ఉంటాయి. కానీ నేను ఇవన్నీ తెలియకుండానే యోగా ఆరంభించాను. సూర్యనమస్కారాలు ఉన్నాయి. ఇవన్నీ శారీరక విన్యాసాలే కదా! అవి ఎవరు చేసినా ఫలితం వచ్చి తీరుతుంది. అలాగే సూర్య నమస్కారాలు సూర్యునికి అభిముఖంగానే చేయాలని లేదు. కానీ మరింత ఏకాగ్రత కోసం సూర్యుని నమస్కరిస్తూ విన్యాసాలు చేస్తాం. ఇందువల్ల అభ్యాసం మరింత గాంభీర్యంగా సాగుతుంది.
కాలం మారింది. యోగ అనేది భారతభూమి మీద ఆవిర్భవించి వేల ఏళ్లు గడిచింది. చారిత్రక పరిస్థితులను బట్టి ఎగుడుదిగుళ్లకు గురైందేమో కూడా. ఈ పరిణామాల కారణంగా, ఈ కాలంలో దాని ఫలితాలలో మార్పులూ, హెచ్చుతగ్గులూ కనిపించినట్టు ఎవరైనా చెప్పారా?
అనాదిగా ప్రాణాయామ, దాని మూలసూత్రం మారలేదన్న వాస్తవాన్ని తప్పనిసరిగా గమనించాలి. ప్రాణాయామం ఇవాళ నా శరీరంలో ఎలా పని చేస్తుందో, మూడువేల ఏళ్ల నాటి కృష్ణభగవానుని లోనూ అలాగే పనిచేసింది. వేయి సంవత్సరాల నాడు జీవించిన శంకరభగవత్పాదుల విషయంలోను అంతే. అయితే దీని గురించి ఇంత చక్కగా ఎందుకు చర్చించుకుంటున్నాం! యోగా, ప్రాణాయామాల మీద మన అవగాహన ఎంతో మెరుగుపడింది. ప్రాణాయామం ఏమిటి? విజ్ఞానశాస్త్రం ఏమిటి అనేవి తర్కిస్తున్నాం. దీనితో తెలిసే వాస్తవం, దాని మూలసూత్రం మారలేదు. ఐదువేల ఏళ్ల నాడు పనిచేసిందంటే, ఇవాళ కూడా అది అదే తీరులో పనిచేయాలి. పని చేస్తుంది కూడా. ఎందుకు? అది శాస్త్రం. ప్రాణశక్తి అనే సూత్రం మీద నిర్మితమైనది. ప్రాణశక్తి యథాతథం కదా! కాబట్టి నా శరీరంలో ప్రాణాయామం, ధ్యానం ఎలా పనిచేస్తాయో, ఒక క్రైస్తవుడిలో, ఒక ముస్లింలోను అలాగే పనిచేస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది ప్రజలకూ ఇదే వర్తిస్తుంది. విశ్వవ్యాప్తంగా క్షలాదిగా ఉన్న పరమహంస యోగానందుల శిష్యులకు చేరినది ఈ సూత్రమే. మహాలక్ష్మి, కృష్ణతత్త్వం, లేదా శివుని తత్త్వం కాదు వారి శిష్యులను ఆకర్షించినది. యోగా, ప్రాణాయామం గురించి వారు చెప్పిన సూత్రమే. ఇంకా, ఇదంతా సర్వమత జనని పురాతన భారతం నుంచి వచ్చిందని వాళ్లకు గౌరవం. వాళ్లు ఆశించినవి ఇవే- ధ్యానం చేయడం ఎలా? ప్రాణా యామం అభ్యసించడం ఎలా? ఈ అంశంలోని విజ్ఞానశాస్త్రాన్నే వారు ప్రధానంగా స్వీకరిస్తున్నారు. భగవంతుడికి ఈ ధోరణీ నచ్చుతుంది. తన పేరు ఉచ్చరించారా లేదా అన్నది ఆయనకి పట్టదు.
క్రియాయోగం ఇతర మతాల విషయంలో ఎలా ఉంటుంది?
క్రియాయోగం వంటివి అభ్యసిస్తే ఒక హిందువు మరింత సమున్నత హిందువుగా రూపొందుతాడు. అలాగే ఒక క్రిస్టియన్, ఒక ముస్లిం కూడా. అందుకే యోగం, ప్రాణాయామం చేయాలంటే మతం మార్చుకుని చేయమని చెప్పడం లేదు. నీ మతాన్ని ఆరాధిస్తూనే యోగాభ్యాసం చేయమని చెబుతాం. అప్పుడు కూడా ఫలితాలను చూడవచ్చు.
భారతీయ జీవనానికి అనాదిగా లభించిన మహా వరప్రసాదం ఈ యోగం. ఆరోగ్య సూత్రం కూడా ఇదే. దీనికి సంబంధించి మన వేదం, ఉపనిషత్తులు, పురాణాలు ఏం చెప్పాయి? ఆర్ష వాఙ్మయంలో ఈ అంశాన్ని ఎట్టా పరిచయం చేశారు? భగవద్గీతలో దీని ప్రస్తావన ఎట్లా ఉంది?
ఉపనిషత్తులు, వేదాలు, భగవద్గీత ఇలాంటివి చాలా పవిత్రమైన గ్రంథాలు. వాటిలో ఏ చిన్న దోషాన్ని మనం పట్టలేం. అవి చెప్పినదంతా యథార్థం. కానీ వాటిని అర్థం చేసుకొనే మేధో సామర్థ్యం ఇప్పుడు మనకు లేకపోవచ్చు. అంతేగానీ వారు చెప్పిందేమి వ్యర్థం కాదు. ఒక యధార్థాన్ని అందరూ ఒకే విధంగా అర్థం చేసుకోలేరు. కాబట్టి ఆ విషయాన్ని రకరకాలుగా చెప్తుంటారు. ఏకం సత్ విప్రా బహుధా వదన్తి. ఆదిశంకరాచార్యులవారు చెపుతారు-‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం/ నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తి’. అంటే నిశ్చలత్వం లేదా స్థిమిత్వం రావాలి. ఆ నిశ్చలత్వమే జీవన్ముక్తి. బైబిల్ అదే చెపుతుంది బీ స్టిల్ అండ్ నో ఐ యామ్ గాడ్. నిశ్చలంగా ఉండు భగవంతుడిని తెలుసుకో. కానీ అత్యంత దురదృష్టకరం విషయం ఈ నిశ్చలత్వమంటే చాలామంది పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. నిశ్చలత్వం అంటే శిలావస్థ మాత్రం కాదు. మౌనం ద్వారా మనని మనం, మనలోని పరమాత్మను చూడడం.
యోగ సాధనలో తారస్థాయి స్థితి నిశ్చలత్వం గురించి వివరిస్తారా?
ఒక ఉదాహరణ ఇస్తాను. ఒక కథే అనుకోవచ్చు కూడా.
ఒక వ్యక్తి ఒక సాధువు దగ్గరకి వెళ్లాడు. ఒక ప్రశ్న వేశాడు. ‘భగవంతుడు ఎవరు? భగవంతుడంటే ఏమిటి?’ అంతలోనే, ‘నాకు జీవితంలో క్షణం తీరిక ఉండదు. మీ బోధనలు, ఉపన్యాసాలు వినే సమయం లేదు. కాబట్టి భగవంతుడంటే ఎవరు; భగవంతుడు అంటే ఏమిటి? ఒక్క వాక్యంతోనే మీరు చెప్పాలి’ అన్నాడట. చాలామంది వేసే ప్రశ్న సరిగ్గా ఇలాగే ఉంటుంది.
అందుకా సాధువు, ‘నాయనా! ఒక వాక్యం కూడా అక్కర్లేదు. ఒకే ఒక్క పదంతోనే చెబుతాను, దేవుడంటే! దేవుడంటే ‘మౌనం’ అన్నాడాయన. నిశ్శబ్దం అదే సైలెన్స్. మౌనమే దైవం. సైలెన్స్ అంటే ఏమిటి? ధ్యానమే కదా! ధ్యానం ఎలా చేస్తాం? నిశ్శబ్దంలో, మౌనంగా. నిశ్శబ్దాన్ని ఎలా తెచ్చుకోవాలంటే, ధ్యానం తోనే. ఇక్కడ వినిపించే మూడు పదాలు- మౌనం, ధ్యానం, దైవం ఒకే మహోన్నత భావాన్ని వ్యక్తీకరిస్తున్నాయని తేలుతుంది. ఆ మూడూ ఒకే అర్ధాన్ని కలిగి ఉన్నట్టే అనిపిస్తుంది. అందుకే ధ్యానం సమున్నత శాస్త్రీయ అవగాహన.
మౌనం దాల్చడం అంటే స్వరతంత్రులు (ఓకల్ కార్డస్) మూగబోవడం మాత్రమే కాదు. ఉద్విగ్నతలు మౌనం దాలుస్తాయి. ఆందోళనలు మౌనం వహిస్తాయి. కళ్లు నిశ్చలమవుతాయి. చెవులు శబ్దాలను బహిష్కరిస్తాయి. శరీరం కూడా తన స్పర్శించే లక్షణానికి విరామం ఇస్తుంది. ఈ స్థితిని ఊహించారా? నా కళ్లు.. పనిని ఆపేశాయి. దేనినీ చూడడం లేవు. చెవులూ అంతే. శీతోష్ణాలను శరీరం పట్టించుకోవడం లేదు. ఆలోచనలు ఆగిపోయాయి. ఆతృత, కంగారు సడలిపోయాయి. ఈ నిశ్శబ్దమే నిశ్చలత్వం. నిశ్చలత్వానికి నిజమైన అర్ధం అదే. అదే స్టిల్‌నెస్. ఇక్కడ ఒక సందేహం కలగవచ్చు. అది సమంజసమా? లేకపోతే, అసలు సాధ్యమా? మరి నిద్ర అనే స్థితి మాటేమిటి? ఆ స్థితిలో శబ్దాలు వినరు. ఒక్కొక్కసారి దోమ వాలినా తెలియదు. అలా అని మీరు బధిరులు కారు. మీ శరీరం మొద్దుబారలేదు. అంటే అన్నిటా మీ ప్రాణశక్తి తన కార్యకలాపాలని ఉపసంహరించుకుంది. ప్రాణశక్తి లేదా లైఫ్‌ఫోర్స్ అక్కడ పనిచేయలేదు. ఇదంతా మౌనంతో వచ్చింది. నిద్రలో మాదిరిగానే. ప్రాణశక్తి ఇంద్రియాల నుంచి వెలువడుతూ తన పని తాను చేస్తుంది. ఆ స్థితిలో మనలోకి మనం వెళితే అక్కడ దర్శనమయ్యేదే అహంబ్రహ్మాస్మి. దానితోనే మనం సంలీనమవుతాం. అదే నిత్యానందం. ఈ స్థితికీ; హిందూ, క్రిస్టియన్, ముస్లిం, అమెరికన్, భారతీయుడు, మరొకడు, స్త్రీ లేదా పురుషుడు అన్న భావనకీ ఏమిటి సంబంధం? ఆ ప్రశ్నకు తావేది? అదీ ధ్యానం! అదే ప్రాణాయామం! ఇది సశాస్త్రీయం. ప్రతి సైన్స్ ఇదే చెప్పింది. నిశ్చలత్వమే జీవన్ముక్తి.
విశ్వకవి, కవికుల గురువు రవీంద్రనాథ్ టాగూర్ కూడా సైలెన్స్ ఈజ్ ది లాంగ్వెజ్ ఆఫ్ ది గాడ్ అన్నారట కదా!
ప్రతి సద్గురువు అదే చెప్పారు. ప్రతి శాస్త్రం కూడా అదే చెప్పింది. చైనాలో ఒక నానుడి ఉంది, మొత్తం ప్రపంచం ఒకరికి సాష్టాంగపడుతుంది. ఆ ఒకరు నీలోనే ఉంటారు అని. అది ప్రాణాయామంతో సాధ్యం.
ప్రస్తుతం రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మూడవ ప్రపంచ యుద్ధం గురించి కూడా చిరకాలంగా అనుమానం, భయం ఉన్నాయి. ఇప్పటికి రాకపోవడమనేది భగవంతుని దయ. ఇలాంటి వాతావరణంలో మానవాళి యోగాకి ఇవ్వవలసి నంత ప్రాధాన్యం ఇస్తున్నదా?
ఇది ప్రజల స్పందనకు సంబంధించిన అంశం. వారి మీద ఆధారపడి ఉంది. అలాంటి దుస్థితి మరొకసారి రాకుండా, ప్రపంచం యుద్ధం చూడ కుండా చేయడానికి ఉపకరించే విధానం ఉంది. ప్రజలు దానిని అభ్యసించాలి అంతే. ప్రపంచ శాంతి కోసం పెద్దలు, సాధుసంతులు చెప్పిన పరిష్కారం గొప్పది. మొదట నీలో నీవు దైవాన్ని దర్శించు. తరువాత ఇతరులలోను దైవాన్ని దర్శించ గలుగుతావు. బాబాజీ పరమ గురువు ఏం చెప్పారు, ధ్యానం దేశాల మధ్య సమైక్యతను తేవడమనే ధ్యేయం కలిగి ఉంటుంది అని.
చివరిగా… ధ్యానం గురించి మీ సందేశం.
ధ్యానం అంటే కేవలం ఆత్మసాక్షాత్కారం, భగవదనుగ్రహానికే అనుకోవద్దు. నిత్యజీవితానికి అవసరమైన ఆనందం, ప్రేమ, జ్ఞానం, సృజనాత్మకత, అంతర్‌దృష్టికి కూడా ధ్యానం అవసరమే. భగవదనుగ్రహం అన్న భావనకు మించి నిత్య జీవితంలో ఎదుర్కొనే చాలా సమస్యలకు ధ్యానం పరిష్కారం చూపుతుంది. మనం చాలా నిర్ణయాలు తీసుకోవాలి. మొదటే ఆ నిర్ణయం ఫలితాన్ని ఊహించలేం. కానీ అంతర్‌దృష్టి ఉంటే అది కూడా సాధ్యమే. అలాగే నిత్య జీవితంలోనే అవసరమైన భద్రతా భావం, ప్రశాంతత కూడా ధ్యానంతో వస్తాయి.