– అరుణ
2023 సంక్రాంతికి రెండు అనువాద చిత్రాలతో పాటు మూడు స్ట్రయిట్ సినిమాలు జనం ముందుకు వచ్చాయి. జనవరి 11న మొదలైన సినిమాల విడుదల జాతర నాలుగు రోజుల పాటు సాగింది. చిత్రం ఏమంటే.. ఈ ఐదింటిలో వీసమెత్తు కొత్తదనం కూడా కానరాలేదు. అయితే ఈ సినిమాలన్నీ ఆయా హీరోల అభిమానులను అలరించేలా దర్శకులు రూపొందించారు. దానికి తోడు పండగ సీజన్ కలిసి రావడంతో ఇవన్నీ కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. ఆ రకంగా ఈ యేడాది సంక్రాంతి ఇటు తెలుగు, అటు తమిళనాట చిత్రసీమకు శుభారంభాన్ని అందించిందనే చెప్పుకోవాలి.
సంక్రాంతి కానుకగా విడుదలైన ‘వీరసింహా రెడ్డి’లో నందమూరి బాలకృష్ణ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రి వీరసింహారెడ్డి రాయలసీమలో కొన్ని వర్గాలకు దేవుడైతే, మరికొంద రికి శత్రువు. అతనికే తెలియని కొడుకు జై సింహా ఇస్తాంబుల్‌లో తల్లితో పాటు ఉంటాడు. కొడుకు పెళ్లి సంబంధం కారణంగా అతనికి తండ్రి గురించి, తాను ఆయన్ని ఎందుకు వదిలేసి విదేశాలకు రావాల్సి వచ్చిందన్న విషయాన్ని తల్లి తెలియచేస్తుంది. భార్య, కొడుకు కోసం టర్కీ వచ్చిన వీరసింహారెడ్డిని అతని సవతి చెల్లి అతి దారుణంగా భర్తతో కలిసి హత్య చేస్తుంది. దానికి కారణం ఏమిటీ? తన తండ్రిని హత్య చేసిన వారిపై జై సింహా ఎలా కక్ష తీర్చుకున్నాడన్నది మిగతా కథ. సిస్టర్ సెంటి మెంట్ ప్రధానంగా సాగిన ఈ సినిమాలో ప్రారంభం నుండి ముగింపు వరకూ ఒక్క కొత్త సన్నివేశం లేదు సరికదా, అంతా నరుక్కోవ డమే! కొన్ని పోరాట సన్ని వేశాలు… అందులో పారించిన రక్తం… ఎగిరిపడే తలకాయలు చూస్తే ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారా? అనే సందేహం కలుగుతుంది. వీరసింహారెడ్డి భార్యగా నటించిన హనీరోజ్ నటన కొంతలో కొంత హుందాగా ఉంది. శ్రుతీహాసన్ పాత్ర మరీ దారుణం. వరలక్ష్మీ శరత్ కుమార్ నటన ఆకట్టు కున్నా, ఆమె వాచకం తేలిపోయింది. కన్నడ నటుడు దునియా విజయ్ ప్రతి నాయకుడి పాత్రలో మెప్పించాడు. తండ్రీ కొడుకులుగా బాలకృష్ణ ద్విపాత్రా భినయం చేసినా… అన్నదమ్ములు మాదిరిగానే తెర మీద కనిపించారు. వయసు ప్రభావం స్పష్టంగా కనిపి స్తోంది. అయితే యాక్షన్ సన్నివేశాలలో మాత్రం ఫుల్ ఎనర్జీని ప్రదర్శించి, అభిమానులను ఆకట్టుకున్నారు బాలకృష్ణ. దాంతో ఆయన ఫాన్స్‌కు ఈ సినిమా ఓ విజువల్ ఫీస్ట్‌గా మారిపోయింది.
‘వాల్తేరు వీరయ్య’ విషయానికి వస్తే… ఇందులో వింటేజ్ చిరంజీవిని చూపించడానికి దర్శకుడు బాబీ తెగ తాపత్రయ పడ్డాడు. అందులో కొంతవరకూ సఫలీకృతుడయ్యాడు. ‘వీరసింహారెడ్డి’లో సవతి చెల్లి సెంటిమెంట్‌ను చూపిస్తే, ఇందులో సవతి తమ్ముడి సెంటిమెంట్‌ను చూపించారు. తమ్ముడిగా రవితే ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ అంతా చిరంజీవి తనదైన శైలిలో కామెడీతో మెప్పిస్తే, ద్వితీయార్థంలో రవితే ఎంట్రీతో యాక్షన్ అండ్ సెంటిమెంట్ మోడ్‌లోకి మూవీని తీసుకెళ్లారు. ఈ రెండు సినిమాల్లోనూ ఐటమ్ సాంగ్స్ పెట్టారు. తలలు లేపడం బాలకృష్ణే కాదు… చిరంజీవీ చేయగల డంటూ క్లయిమాక్స్‌లో చూపించారు. కానీ దానికి కారణమైన సన్నివేశాలను బలంగా చూపించలేక పోయారు. ఇదిలా ఉంటే… చిరంజీవిని కొన్ని సన్నివేశాలలో రవితే పక్కన తక్కువ చేసి చూపించా రంటూ మెగాభిమానులు కొందరు కినుక వహిస్తు న్నారు. అయితే సగటు ప్రేక్షకుడు చిరంజీవి నుండి కోరుకునే వినోదం ఇందులో లభిస్తుంది. ‘వీరసింహా రెడ్డి’లో సంభాషణలు రాజకీయ నేపథ్యంలో సాగితే, ‘వాల్తేరు వీరయ్య’లో డైలాగ్స్ సోషల్ మీడియాలోని అంశాలతో సరదాగా సాగాయి. ఈ రెండు చిత్రాల లోనూ నాయికగా నటించిన శ్రుతీహాసన్‌కు చిరంజీవి సినిమాలోని పాత్రే కాస్తంత గుర్తింపును, గౌరవాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంది. ‘ధమాకా’తో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితే ‘వాల్తేరు వీరయ్య’ విజయానికి తన వంతుగా భుజం కాశాడు.
ఈ రెండు తెలుగు సినిమాలతో పాటు వచ్చిన సంతోష్ శోభన్ ‘కల్యాణం కమనీయం’ మూవీలో అందరినీ అలరించే సన్నివేశాలు ఉన్నాయి. కానీ కథలో హీరో, హీరోయిన్ల మధ్య కాన్‌ఫ్లిక్ట్‌కు బలమైన కారణాలు చూపని కారణంగా తేలిపోయింది. ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ప్రియ భవానీ శంకర్‌కు మంచి భవిష్యత్తే ఉంది. ఇక తమిళ అనువాద చిత్రాలు అజిత్ ‘తెగింపు’ బ్యాంకింగ్ వ్యవస్థలోని లూప్‌హోల్స్ నేపథ్యంలో తెరకెక్కింది. దాంతో కేవలం అజిత్ అభిమానులను, ఆ తరహా యాక్షన్ మూవీస్‌ను ఇష్టపడే వారికి మాత్రమే నచ్చే చిత్రంగా మారిపోయింది. దీనితో పోల్చితే విజయ్ ‘వారిసు’ (తెలుగులో ‘వారసుడు’) కొంతలో కొంత బెటర్ మూవీ. ఇది ఫ్యామిలీ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసి తీసిన సినిమా. మూవీని ‘దిల్’ రాజు భారీగా తీసినా, దర్శకుడు వంశీ పైడిపల్లి కష్టపడి తెరకెక్కిం చినా, కొత్తదనం లేని సీన్ ఒక్కటీ లేకపోవడంతో తెలుగు ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. అయితే తమిళనాట ఈ రెండు సినిమాలకు భారీ ఓపెనింగ్సే వచ్చాయి. ఇక్కడ కూడా ‘వీరసింహారెడ్డి’ మొదటి రోజు కలెక్షన్స్ ‘వాల్తేరు వీరయ్య’ను మించగా, వీకెండ్‌లో మాత్రం చిరంజీవి సినిమాదే పైచేయిగా ఉంది. మొత్తం మీద పండగ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలకు ప్రేక్షకులు ఘన విజయాన్ని కట్టబెట్టకపోయినా.. పాస్ చేసి పంపారు.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్