సంపాదకీయం

శాలివాహన 1944 శ్రీ శుభకృత్‌  ‌పుష్య బహుళ నవమి – 16 జనవరి 2023, సోమవారం – అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


నిజమే, అది అసాధారణ పరిణామమే. ముఖ్యమంత్రి మాట్లాడు తుండగా సభ నుంచి గవర్నర్‌ ‌వాకౌట్‌ ‌చేయడం ఏనాడూ లేదనో, లేదా అత్యంత అరుదైనదనో నిస్పందేహంగా చెప్పవచ్చు. తమిళనాడు శాసనసభలో ఈ నెల 9న ఆ పరిణామం చోటు చేసుకుంది. శీతాకాల సమావేశాల తొలిరోజున ప్రభుత్వం రాసిచ్చిన ఉపన్యాసం చదవకుండా, గవర్నర్‌ ‌తన ‘సొంత ప్రసంగం’ చదివారు. సొంతమంటే సర్కారు రాసినదానిలోనే కొన్ని పదాలు వదిలేశారు. కానీ ప్రభుత్వం రాసిచ్చిన ఉపన్యాసమే రికార్డులలోకి చేరాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ‌తీర్మానం ప్రవేశపెడుతున్న సమయంలో గవర్నర్‌ ఆర్‌ఎన్‌ ‌రవి వాకౌట్‌ ‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాసిన ఉపన్యాసం చదవకుండా గవర్నర్‌ ‌సంప్రదాయాన్ని ఉల్లంఘించారనీ, జాతీయ గీతాలాపన జరగకుండా నిష్క్రమించి జాతీయగీతాన్ని అవమానించారనీ అధికార డీఎంకే ఆరోపణ. నిజానికి రాజ్యాంగ సంప్రదాయాలు, వాటి గౌరవం, జాతీయగీతానికి అవమానం వంటి మాటలు డీఎంకే మాట్లాడితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఈ మాటలు ఆ పార్టీ గతాన్ని కానీ, వర్తమానాన్ని కానీ కొంచెం కూడా ప్రతిబింబించేవే కావు.

తమిళనాడు గవర్నర్‌, ‌రాష్ట్ర ప్రభుత్వాల వైరం కొత్తదేమీ కాదు. కరోనా, వ్యాక్సినేషన్‌, ‌విద్యావిధానం, వైస్‌ ‌చాన్సలర్‌ ‌వివాదం, నీట్‌… ‌లెక్కలేనన్ని అంశాల మీద వివాదాలు సర్వసాధారణమైనాయి. మంచీచెడులతో సంబంధం లేకుండా గవర్నర్‌తో విభేదించడమే పనిగా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయా అని ప్రశ్నిస్తే ఔననే సమాధానం. కానీ తమిళనాడు తక•రారు రూపం వేరు. మిగిలిన విభేదాలతో పాటు హిందూ ద్వేషం, హిందీ వ్యతిరేకత ఆ రగడను శాసిస్తూ ఉంటాయి. హిందూత్వ ఈ దేశం ఆత్మ అంటే, మమ్మల్ని అందులో కలిపితే సహించబోమంటారు. హిందీ ఈ దేశంలో అధిక సంఖ్యాకులు మాట్లాడే భాష అని ఎవరు అన్నా, అందులో ఎలాంటి దురుద్దేశాలు లేకున్నా ఇది మా మీద రుద్దే కుట్ర అని ఎగిరిపడతారు. తాజా రగడ ఇందుకు కొనసాగింపే.

‘నాడు’ అన్న పదం తాజా వివాదానికి మూలం. ఆ పదం తమిళనాడులో సానుకూలమైన, సమైక్యతను ప్రతిబింబించే అర్థాన్ని వ్యక్తీకరించడం లేదని గవర్నర్‌ ‌చెప్పారు. తమిళనాడు కంటే, తమిళగం అన్న పేరు సముచితమని అన్నారు. ఈ మాట చెప్పడానికి గవర్నర్‌ ఎం‌చుకున్న వేదిక అధికార డీఎంకేకు నచ్చేది కాదు. కాశీ తమిళ సంగమం పేరుతో నెలరోజుల కార్యక్రమాన్ని నిర్వహించిన వారిని జనవరి 4న రాజ్‌భవన్‌లో సత్కరిస్తూ రవి ఈ వ్యాఖ్య చేశారు. ‘మనం ద్రవిడులమంటూ దురదృష్టవశాత్తు తమిళనాడులో తిరోగమన రాజకీయాలు నడుస్తున్నాయి. గడచిన యాభయ్‌ ఏళ్లుగా నిలబెడుతున్న ఆ భావన తాము ఈ దేశంలో భాగం కాదు అన్న ఆలోచనను నిర్మించింది. మనం ఏదైనా చెబితే అది దేశం పరిధిలో ఉండాలి. తమిళనాడు అన్న పదం చెప్పనిది అదే’ అన్నారాయన. ద్రవిడ పార్టీల సిద్ధాంతాన్ని బట్టి గవర్నర్‌ ‌మాటలు నిషిద్ధాక్షరాలే. అందుకే కాబోలు గవర్నర్‌ ‌ప్రసంగించడానికి లేవగానే డీఎంకే సభ్యులు ‘తమిళనాడు వర్ధిల్లాలి… తమిళనాడు ఎప్పటికీ తమిళనాడే’ అంటూ నినాదాలు అందుకున్నారు. గవర్నర్‌ ‌కూడా ద్రవిడ విధానం, పెరియార్‌ ‌రామస్వామి, అన్నాదురై వంటి కొన్ని మాటలను చదవలేదు.

గవర్నర్‌ ‌వెల్లడించిన అభిప్రాయం డీఎంకే మూలాలకి అద్దం పట్టేదేనన్నది నిజం. ద్రవిడ ఉద్యమ నిర్మాత ఈవీ రామస్వామి నాయకర్‌ ‌ద్రవిడస్తాన్‌ ‌కావాలని కోరాడు. అది కూడా పాకిస్తాన్‌ను కోరిన జిన్నా బాటలోనే. అదే ద్రవిడనాడు. కాబట్టి ‘నాడు’ ద్రవిడ రాజకీయాలకు సంబంధించి వేరే దేశం అన్న అర్ధమే ఇస్తుంది. ఆ ‘నాడు’లో ఈవీఆర్‌ ఉం‌డాలని కోరుకున్నవి తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ ప్రాంతాలు. ఇంత హాస్యాస్పదమైన సంగతి చరిత్రలో ఉందా? 1939 నుంచి ఇదే పంథాలో ద్రవిడ ఉద్యమం, తరువాత ఆ సిద్ధాంతం ఆధారంగా ద్రవిడ రాజకీయాలు జరిగాయి. అవే కొనసాగుతున్నాయి. తిరోగమన రాజకీయాలు నడుస్తున్నాయన్న గవర్నర్‌ ఆరోపణలోని పరమార్ధం ఇదే కావచ్చు.

గవర్నర్లంతా పులుకడిగిన ముత్యాలేననీ, మచ్చ లేనివారేననీ అనలేం. అలా అని గవర్నర్లంతా ఇంతేనని నిర్ధారించడం తొందరపాటు. రాజ్యాంగ సంప్రదాయాన్ని ఉల్లంఘించే హక్కు గవర్నర్‌కు ఎక్కడిది, అది మా సొంతం అన్నట్టు కొన్ని ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. రాజ్యాంగ సంప్రదాయాల గురించీ, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించీ కేరళ, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రులు మాట్లాడడం ముమ్మాటికీ దెయ్యాలు వేదాలు వల్లించినట్టే. గవర్నర్‌ ‌సభలో ఉండగానే ఆయనకు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టడం ఏమిటని అన్నా డీఎంకే సరిగానే ప్రశ్నించింది. అలాంటి సన్నివేశంలోను గవర్నర్‌ ‌సభలో ఉండాలని విమర్శకుల అభిప్రాయం కాబోలు. దేశ విచ్ఛిత్తికి తెగించే సంస్థలను ఉపేక్షించవద్దని చెప్పినా, బుజ్జగింపు రాజకీయాల కోసం గవర్నర్లను తప్పు పడుతున్న ముఖ్యమంత్రులు ఉంటే గవర్నర్‌లు మౌనం ద్చాడం ఎంతవరకు సబబు? సొంత పార్టీ నేతల కుటుంబ సభ్యులను వీసీలుగా, సలహాదారులుగా నియమించినా గవర్నర్‌ ‌మారుమాట్లాడకుండా సంతకం చేయాలని ముఖ్యమంత్రుల కోరికలా కనిపిస్తుంది. ప్రజలకు ప్రాతినిథ్యం వహించే రాష్ట్రాల హక్కుల రక్షణ, ఫెడరల్‌ ‌వ్యవస్థకు ప్రతినిధి గవర్నర్‌ ‌బాధ్యత రెండూ రెండు కళ్ల మాదిరిగా భావించే రోజు రావాలి. ఇంతకీ రాష్ట్రం పేరు మార్చమని చెప్పినా ప్రజలు సాధారణ పరిస్థితికి భిన్నంగా బలవన్మరణాలకు పాల్పడకపోవడం వాస్తవాలు గ్రహిస్తున్నందునే అనుకోవచ్చునేమో!

About Author

By editor

Twitter
YOUTUBE