– వెంపటి హేమ
వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది
మామూలు వేళకే నిద్రలేచిన శివాని మంచం పైన భర్త లేకపోడం చూసి ఆశ్చర్యపోయింది. ఏ రోజునా తను లేచిన గంటకి గాని నిద్ర లేవని ఆయన, ఈవేళ ఇంత తొందరగా లేవడానికి కారణం ఏమయి ఉంటుంది – అనుకుంది..
హాల్లోకి వచ్చిన శివాని, సోఫా మీద కూర్చుని రెండు మోచేతులు మోకాళ్లపై ఆనించి, అరచేతులతో తల పట్టుకుని కళ్లు మూసుకుని ఉన్న రాజశేఖరాన్ని చూసి కంగారు పడింది.
‘‘రాజా! ఏమయ్యింది నీకు’’ అని అడుగుతూ దగ్గరగా వెళ్లి అతని భుజంపై చెయ్యి వేసింది. పరాకుగా ఉన్న అతను ఉలిక్కిపడ్డాడు. భార్యవైపు వెర్రిగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.
‘‘ఏమయ్యింది’’ రెట్టించింది శివాని.
‘‘మా అమ్మ ఏడుస్తున్నట్టు కల వచ్చింది’’ అన్నాడు రాజశేఖరం గద్గద స్వరంతో. .
‘‘కలే కదా!’’ కల అంటే కల్ల! ఇన్నేళ్లొచ్చి చిన్నపిల్లాడిలా కలకు భయపడుతున్నావా’’ అని హేళనగా నవ్వింది శివాని.
‘‘తెల్లవారు ఝామున వచ్చిన కలలు నిజమవుతాయనేది మా అమ్మ. నే నొకసారి ఇండియా వెడతాను. నా మనసు బాగా లేదు’’ అన్నాడు రాజశేఖరం గద్గద స్వరంతో.
‘‘ఏమిటది, బొత్తిగా చంటి పిల్లాడిలా అమ్మ అమ్మ అంటూ కలవరిస్తావేమిటి’’ అంది
అంతలో దగ్గరలో ఉన్న టీపాయ్ మీది ఫోన్ మోగింది. దాన్ని అందుకున్నాడు రాజశేఖరం. వెంటనే స్పీకర్ బటన్ నొక్కింది శివాని.
‘‘పెద్దనాన్నా’’ అంటూ బావురుమంది అవతలి వ్యక్తి.
కంఠం గుర్తు తెలిసింది రాజశేఖరంకి. తన తమ్ముడి కూతురు శైలజ కంఠమది.
‘‘ఏమిటమ్మా శైలూ! ఏమయ్యింది? ఎందుకు ఏడుస్తున్నావు’’ అని ఆత్రంగా అడిగాడు రాజశేఖరం.
‘‘అకస్మాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చి నాన్న చనిపోయారు పెద్దనాన్నా!’’ ఏడుస్తూనే ఆ దుర్వార్తను తెలియజేసింది శైలజ. మ్రాన్పడి పోయాడు రాజశేఖరం. కొంతసేపు ఎవరూ మాట్లాడ లేదు. స్పీకర్లో శైలజ ఏడుపు మాత్రమే లీలగా వినిపిస్తోంది.
కొద్ధిసేపలా గడిచాక రాజశేఖరం కోలుకున్నాడు. ‘‘శైలూ! అన్నయ్యకు ఫోన్ చేశావా? నేనూ వస్తున్నానమ్మా. వాడు వచ్చాక కదా కర్మ మొదలుపెట్టాల్సి ఉంటుంది. అంతవరకు నాన్నని ఐస్ బాక్సులో గాని, మార్చురీలో గాని ఉంచండి’’ అన్నాడు రాజశేఖరం. ఆపై, ‘‘బామ్మ ఏం చేస్తోంది’’ అని అడగబోయి మానేశాడు. అది తనకు తెలియకపోతే కదా! ఏం చేస్తుందిట పాపం, ఏడవడం తప్ప – అనుకున్నాడు దుఃఖంతో.
శివానీకి ఏమి మాట్లాడాలో తోచలేదు. కల నిజమయ్యింది. గొప్ప ‘‘కో ఇన్సిడెన్స్!’’ ‘‘సారీ! ఐ యాం వెరీ వెరీ సారీ’’ అని చెప్పి, ఇక అక్కడ ఉండలేక పెద్ద పని ఏదో ఉన్నట్లుగా అక్కడ నుండి వెళ్ళిపోయింది.
ఆరోజే రాజశేఖరం అర్జంటు వీసా కోసం వెళ్లాడు. ఆఫీసుకి ఒక నెల సెలవు పెట్టాడు. ఆపై ఎమర్జన్సీ కోటాలో టిక్కెట్ బుక్ చేసి సామాను సద్దడం మొదలుపెట్టాడు. తనకు సాయం చేస్తున్న శివానీతో, ‘‘ఇంత పెద్ద ఇంట్లో ఒక్కదానవు. జాగ్రత్తగా ఉండు. నేను తిరిగి వచ్చేటప్పుడు అమ్మను తీసుకు వస్తాను. తమ్ముడు లేనప్పుడు మనం ఇంకా ఆమెను వాళ్ల దగ్గరే ఉంచడం బాగుండదు’’ అన్నాడు.
‘‘వద్దు. సొంత ఇల్లు ఉంది కదా! ఆమె అక్కడ ఉండడమే బాగుంటుంది’’ అంది శివాని.
‘‘ఆమె నీ సొంత మేనత్త కదా! ఆమె మీద నీ కెందుకంత విరోధం? ఎప్పుడు ఆమెను తీసుకు వస్తానన్నా వద్దంటావు?’’
‘‘ఆమె మీద నాకు విరోధమేమిటి! నాకు ఇష్టముండదు- అంతే! మీ ఫ్రెండ్సుని చూడండి, నా ఫ్రెండ్సుని చూడండి – ఎవరి ఇంట్లోనైనా ముసలాళ్లు ఉన్నారా?’’
‘‘వాళ్లకి ఆ అవసరం రాలేదు కాబోలు! మనకు అవసరం వచ్చింది. తేడా లేదా?’’
‘‘ఏమో… అదంతా నాకు తెలియదు, నా ప్రయివసీకి ఎవరైనా అడ్డు ఉండడం నాకు నచ్చదు. కాదూ కూడదు అన్నా కూడా నువ్వు తీసుకువస్తే, నేనేం చేస్తానో నాకే తెలియదు. ఆ జిడ్డు నేను భరించలేను’’ అని అక్కడి నుండి వెళ్లిపోయింది శివాని. హతాశుడయ్యాడు రాజశేఖరం. నూరు సార్లేకాదు, నూటొక్కటోసారి కూడా రాజశేఖరం ప్రపోజల్‌ని వీటో చేసేసింది శివానీ!
******
ఇండియాలో ఎం.బి.బి.ఎస్. చదివిన రాజశేఖరం అమెరికాలో ఎం.ఎస్. చేశాడు. ఆ తరవాత అక్కడే మంచి హాస్పిటల్లో ఉద్యోగం రావడంతో వచ్చింది. అమెరికా రాకముందే మేనమామ కూతురు శివానీతో పెళ్లి జరిగింది. రాజు ఉద్యోగంలో చేరాక కాపురానికి అమెరికా వచ్చింది శివాని. ఈలోగా ఆమె ఇండియాలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తరవాత కూడా ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ అమెరికాలో ఎం.ఎస్. కూడా చేసి ఉద్యోగంలో చేరింది. కొన్నాళ్లు గడిచాక ఇద్దరు కొడుకులు పుట్టారు. కాలక్రమంలో రాజశేఖరం దంపతులకు అమెరికన్ సిటిజన్‌షిప్ కూడా వచ్చింది.
రాజశేఖరం తండ్రి పోయేసరికి, రాజశేఖరం తమ్ముడు రఘుపతికి చదువు పూర్తవ్వలేదు. ఆ కారణంగా తల్లి కాంతమ్మ చిన్న కొడుకు దగ్గరే ఉండిపోవలసి వచ్చింది. చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాక పెళ్లి అయింది రఘుపతికి. తరువాత కూడా పెద్దకొడుకు పిలవకపోవడంతో ఆమె చిన్నకొడుకు దగ్గరే ఉండి పోయింది. ఏ రక్తసంబంధమూ లేకపోయినా చిన్నకోడలు అత్తగారిని బాగా చూసుకుంటోంది. కాలం సుఖంగా గడిచిపోయింది ఇప్పటి దాకా. చిన్నకొడుకు అకాల మరణంతో ఆ తల్లి బతుకు అస్తవ్యస్తమయ్యింది.
ఇన్నాళ్లూ రాజశేఖరం దంపతులు ఆమెను అమెరికాకు రమ్మనమని అననూ లేదు, వెళ్లాలని ఆమె ఉబలాటం చూపించనూ లేదు.
రాజశేఖరం అమెరికాలోనే ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అక్కడి సంప్రదాయం ప్రకారం ఎవరి దారినవాళ్లు ఉంటున్నారు. డాక్టర్ రాజశేఖరం కట్టుకున్న విల్లాలో నడివయస్కులైన తమ దంపతులే లింగులిటుకు మంటూ ఉంటున్నారు.
రఘుపతికి కొడుకు, ఒక కూతురు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. కూతురు ఢిల్లీలో ఉంటోంది. కొడుకుకి ఆస్ట్రేలియాలో ఉద్యోగం. తండ్రి మరణవార్త విని ఇండియా వచ్చిన కొడుకు గిరిధర్, తండ్రి కర్మకాండలన్నీ ముగించి, తల్లిని తనతో తీసుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. .
గిరిధర్ ప్లాన్ గురించి వినగానే ఉలిక్కిపడ్డాడు రాజశేఖరం. ఇన్నాళ్లూ తమ తల్లి తమ్ముడి దగ్గర ఉంది. ఇకనైనా తల్లిని తనవెంట తీసుకు వెళ్లడం తన బాధ్యత. కానీ శివానీ సహకరించదు. ఏ అఘాయిత్యానికి తలపడినా ఆశ్చర్యం లేదు. ఉగ్ర స్వభావి! దీనికి పరిష్కారం ఏమిటో తల్లినే అడగాలి.. మరో దారి లేదు- అనుకున్నాడు రాజశేఖరం.
సెలవు లేదంటూ గిరి, పదిహేను రోజులు ఉండి, తల్లిని తీసుకుని ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అతని చె•ల్లెలు శైలజ కూడా అత్తవారింటికి వెళ్లిపోయింది. ఇంకొక వారం పది రోజుల్లో రాజశేఖరానికి కూడా శలవు ఐపోతుంది. ఈ లోగానే సమస్య పరిష్కారమవ్వాలి. తల్లితండ్రులు బిడ్డలకి సమస్యగా మారడం ఈ రోజుల్లో సర్వ సాధారణ మైపోయింది.
******
ఇల్లంతా బావురుమంటోంది. ఆ ఇంట్లో తల్లీ, తనూ – ఇద్దరే ఉన్నారు. ‘ఈ రోజుల్లో వృద్ధులైన తల్లితండ్రులు సంతానానికి పెద్ద సమస్య ఔతున్నారు కదా!’- అని బాధపడ్డాడు రాజశేఖరం. ఏమైతే అది ఔతుంది, తల్లిని అమెరికా తీసుకుపోదాం- అనుకున్నాడు.
అంతా తెలిసి ఉన్న తల్లి అతన్ని వారించింది. ‘శివానీది చిన్నప్పటి నుండి దుడుకు స్వభావమే. తీరైన ఆలోచన రాదు దానికి. చిన్నప్పుడు కోపమొస్తే కత్తి తీసుకుని చెయ్యి కోసుకునేది, లేదా నిప్పులమీద చేతిని ఉంచి కాల్చుకునేది. నీకూ తెలుసు కదా! దాని ఒప్పుదల లేకుండా నువ్వు నన్ను తీసుకు వెడితే అది ఏ అఘాయిత్యానికైనా తలపడవచ్చు. నిన్నది బాగా చూసుకుంటే చాలు నాకు. దాని గుణగణాలు తెలిసి కూడా…. నా తమ్ముడు ఇబ్బందుల్లో ఉన్నాడు, కట్నకానుకలిచ్చి కూతురు పెళ్లి చేయ లేడని జాలిపడి, కట్నకానుకలే కాదు, ఏ ముద్దూ, ముచ్చటా కూడా లేకపోయినా సరే ఫరవాలేదని, మీ నాన్నను ఒప్పించి, మంచంపట్టిన మీ తాతయ్య పెళ్లి చూడాలని ఉభయ ఖర్చులూ భరించి మనింట్లోనే నీ పెళ్లి జరిపించాను. అలా నీకు సమస్యలు తెచ్చిపెట్టినది నేనే కదా! తప్పు నాదే! శిక్షా నాకే పడడం న్యాయం. నేను నీతో రాను. ఒంటరినైనా ఇక్కడే ఉంటాను. ‘నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది’ అంటారు. ఇరుగు పొరుగుల సహకారంతో బతుకు వెళ్లమారుస్తాను. ఫరవాలేదు. నువ్వు సుఖంగా ఉంటే చాలు నాకు. అప్పుడప్పుడు నువ్వు వచ్చి, చూసి పోతూ ఉండు’’ అంటూ కొడుకును ఓదార్చింది ఆ తల్లి.
‘‘అమ్మా! ఇది చెప్పు, సొంత మేనత్తవు కదా! అసలు నీమీద శివానీకి అంత కోపం ఎందుకుట!’’
‘‘ఏమి చెప్పమంటావు! నేను అక్కడకు వెళ్లినప్పుడు దాని తిక్క చూసి, భరించలేక – అలా ఉండడం మంచి పద్ధతికాదని నచ్చజెప్పాలని ప్రయతించేదాన్ని. బహూశా అహంభావియైన దానికి అది కోపం తెప్పించి ఉండవచ్చు. అంతకన్నా మరేదీ లేదు దానికీ నాకూ మధ్య.’’
తల్లికి కావలసినవి అన్నీ అమరి ఉన్నాయో లేవో చూసి, ఇరవై నాలుగు గంటలూ దగ్గర ఉంటూ, తల్లికి సేవలు చెయ్యడానికి ఒక మనిషిని జీతానికి పెట్టి, ఆమెను అప్పుడప్పుడూ పలకరిస్తూ ఉండమని దగ్గరలో ఉన్న బంధువులను కోరి, దిగులు నిండిన మనసుతో తప్పనిసరి పరిస్థితిలో వెళ్లలేక వెళ్లలేక వెళ్ళాడు రాజశేఖరం.
కొన్నేళ్లు అలా గడిచిపోయాయి. ఏడాదికి ఒకసారి తప్పకుండా తల్లిని చూడడానికి వచ్చి వెడుతున్నాడు రాజశేఖరం. కాలక్రమంలో వృద్ధాప్యంతో తల్లి ఎక్కువగా మంచం దిగి మసల లేకపోతోంది. సరిగా అదే సమయంలో పాత నర్సు కూతురు ఇంటికి పురుడు పోయడానికి వెళ్లిపోయింది. కొత్త నర్సు వచ్చింది. రోజులు భారంగా గడుస్తున్నాయి.
ఎప్పటిలాగే తల్లిని చూడడానికి వచ్చాడు రాజశేఖరం. అతనికి తల్లి మునుపటిలా కనిపించలేదు. ఏదో మార్పు ఉందనిపించింది.
‘‘ఎలా ఉన్నావమ్మా’’ అని అడిగిన కొడుక్కి, ‘‘బాగున్నాను నాన్నా’’ అని జవాబు చెప్పింది ఆ తల్లి. కానీ ఆమె బిత్తరి చూపులతో గుమ్మం వైపు చూసి, ఏదో చెప్పబోయి మానేసింది.
‘‘ఏమిటమ్మా అది?’’ అడిగాడు రాజశేఖరం.
‘‘అదే నాన్నా, నాకు ఏ లోటూ లేదు. అన్నీ చక్కగా వేళకు అమరుతున్నాయి. ఆరోగ్యం కూడా బాగుంది. కరుణమ్మ నన్ను బాగా చూసుకుంటోంది, నాకు ఏ లోటూ లేదు’’ అంది ఆ తల్లి గుమ్మంవైపు భయం భయంగా చూస్తూ.
తల్లి చూసిన వైపు తిరిగి చూశాడు రాజశేఖరం. అక్కడ కరుణమ్మ తచ్చాడుతూ కనిపించింది.
రాజశేఖరం తనవైపు చూడగానే, ‘‘ఈ రోజు వంట ఏమి చెయ్యాలని అడగడానికి వచ్చాను. ఏమి చెయ్యమంటారో చెప్పండమ్మా’’ అంది సౌమ్యంగా పెద్దామెనుద్దేశించి.
రాజశేఖరం సెన్సిటివ్ బ్రెయిన్ వేగంగా పనిచేసింది, వాళ్లిద్దరి మధ్యన ఏదో విపరీతం ఉందనిపించింది అతనికి. వెంటనే స్పందించాడు రాజశేఖరం.
******
తల్లితో చెప్పి, సెలవు తీసుకుని క్షేత్ర దర్శనానికని వెళ్లిన రాజశేఖరం మరునాడే తిరిగి వచ్చాడు. రాగానే ఒకసారి తల్లిని పలుకరించి, తన గది తాళం తీసి లోపలకు వెళ్లి తలుపు గడియ వేసుకున్నాడు. బట్టలైనా మార్చుకోకుండా కంప్యూటర్ తెరిచాడు. దానిలో కనిపించిన దృశ్యాలను గమనించి మ్రాన్పడిపోయాడు.
కరుణమ్మ ప్రవర్తన మీద అనుమానం రాగానే, తల్లి గదిలో ‘‘ఎలక్ట్రానిక్ బగ్స్’’ కొనితెచ్చి, ఇంట్లో కొన్ని చోట్ల రహస్యంగా అమర్చి వాటిని తన కంప్యూటర్ తో అనుసంధానంచేశాడు. ఆ బగ్స్ తీసిన వీడియోలు అతనికి రక్తం గడ్డకట్టించేవిగా ఉన్నాయి. కరుణమ్మ క్రూరత్వాన్ని, స్వార్ధబుద్ధిని అవి చక్కగా వీడియోలుగా తీసి గుట్టును రట్టు చేశాయి.
నిన్నటి రోజు తీసిన వీడియోలలో ఒకదానిలో కరుణమ్మ పెద్దావిడను బెదిరించడం చూశాడు రాజశేఖరం, ‘‘ఇదిగో పెద్దమ్మా! నువ్వు నీ కొడుకుతో నామీద పితూరీలు చెప్పకపోవడంతో బతికిపోయావు. చెప్పివుంటే పచ్చడి బండతో నీ బుర్ర పగలేసి ఉండేదాన్ని’’ అంటోంది.
మరో వీడియోలో పెద్దావిడ నడవలేక నడవలేక నడుచుకుంటూ వెళ్లి తన భోజనం తానే పెట్టుకుని, తిని కంచం తోముకోవడం, కరుణమ్మ టీవీలో వస్తున్న పోగ్రామ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ సోఫాలో కూర్చుని ఉండడం కనిపించింది.
మూడవ దానిలో రికార్డు ఐనది కూడా చూశాక ఇన్నాళ్లూ నేతి బీరకాయలాంటి కరుణమ్మ చేతిలో తన కన్నతల్లి అనుభవించిన నరకం అర్థమయ్యింది రాజశేఖరానికి. సరైన తిండి కూడా లేకపోవడం వల్ల తల్లి అంతలా చిక్కిపోయి ఉందని అతనికి అర్థ్ధమయ్యింది. తాను యాత్రకు వెడుతూ ఇంటి ఖర్చులకని ఇచ్చిన డబ్భును కొంత భాగం వేరు చేసి ఒక డబ్బాలో ఉంచి, కరుణమ్మ మిగిలిన కొంచెం మాత్రమే పర్సులో పెట్టుకున్నది రికార్డు అయ్యింది అందులో. అంటే – తన తల్లికి పుష్టికరమైన ఆహారం కూడా అందడం లేదన్నది అర్థమై వెంటనే పోలీసు స్టేషన్‌కి ఫోనుచేశాడు.
కొద్దీ సేపట్లో పోలీసులు వచ్చి కరుణమ్మని అరెస్టు చేసి తీసుకెళ్లిపోయారు. ఆమె శిక్షార్హురాలని వీడియోలు సాక్ష్యం చెప్పాయి.
మళ్ళీ తల్లిని ఎలా కాపాడాలన్నది నూరు వరహాల ప్రశ్న అయ్యింది రాజశేఖరానికి. బంధువు సహకరించాడు అతనికి…
‘‘ఇదిగో బావా! కారణాలు వేరైనా సమస్య ఒకటే, వృద్ధాప్యంలో కనిపెట్టి చూసేవాళ్ళు లేకపోవడం – అన్నది. మేము, భార్యాభర్తలు ఇద్దరం ఉద్యోగస్థులం కావడం, పిల్లలు బడులకు వెళ్లడంతో అమ్మ ఒంటరిదయ్యేది. ఒకవేళ ఖర్మం చాలక పడిపోయినా, ఏదైనా రాకూడని అవసరం వచ్చినా చూసుకునే వారు ఎవరు? బాగా ఆలోచించి, మా అమ్మను, ‘వానప్రస్థం’ అనే ఓల్డేజ్ హోంలో ఉంచాము. అక్కడ వేళకు కావలసిన వన్నీ అందుబాటులో ఉంటాయి. ఎవరో ఒకరు తరచూ వచ్చి, చూసి పోతూ ఉంటారు. వాళ్ల యోగ క్షేమాలను మేనేజిమెంట్ బాధ్యతగా చూసుకుంటుంది. అవసరం ఉంటే మనకు ఫోన్ చేస్తారు. ‘‘ఇంటికన్నా గుడి పదిలం’’ అంటారే, అలాగన్నమాట! మన వాళ్లు అక్కడై•తేనే తమ తోటి వాళ్ల మధ్య సుఖసంతోషాలతో ఉంటారనిపిస్తుంది . అందుకే నేను మా అమ్మను ఒక వనంలో కట్టిన ‘వానప్రస్థ’ ఆశ్రమంలో చేరిపించాను.’’ వివరించాడు ఆ బంధువు.
అతడు చెప్పినది రాజశేఖరం తల్లికి చెప్పాడు. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. ‘‘రాజూ, నన్నుకూడా అక్కడ చేర్పించరా. వాడి తల్లిలాగే నేనూ అక్కడ సుఖంగా ఉంటాను’’ అంటూ తన సమ్మతిని తెలియజేసింది.
తల్లిని ఆశ్రమంలో చేర్పించి, తను ఒకవారం అక్కడే ఉండి, తల్లి అక్కడ స్థిరపడడం చూశాక అమెరికా వెళ్లిపోయాడు రాజశేఖరం. వెడుతూ వెడుతూ తల్లికి స్మార్టు ఫోన్ కొని ఇచ్చి, దానిని ఎలా వాడుకోవాలో ఆమెకు నేర్పాడు.
******
కొన్నాళ్లు గడిచేసరికి, 2020 వ సంవత్సరం వచ్చింది. దాని వెంట చైనాలో పుట్టిన కోవిడ్-19 అనే కరోనా వైరస్ అతి వేగంగా ప్రపంచమంతా వ్యాపించి అనతి కాలంలోనే ‘‘పెండమిక్’’గా మారిపోయింది. కోట్లాది జనం కోవిడ్ వైరస్ బారిన పడుతున్నారు. మాస్కులు ధరించాలి,
శుభ్రత పాటించాలి, మనిషికి మనిషి దూరంగా మసలాలి అంటూ ఏవేవో నిబంధనలు అమలులోకి వచ్చాయి. ఆఫీసులు మూసెయ్యడంతో ఉద్యోగులు ఇంటినుండి కంప్యూటర్లద్వారా పని చేస్తున్నారు. స్కూళ్లూ మూసేశారు. జనజీవనం స్తంభించిపోయింది. ఒక్క డాక్టర్లు, నర్సులు, పారిశుధ్య కార్మికులు మాత్రం ఎడతెరిపి లేకుండా, ప్రాణాలకు తెగించి పని చెయ్యవలసి వస్తోంది. అయినా జననష్టం జరుగుతూనే ఉంది. దానికని ఇంకా మందేమీ కనిపెట్టకపోడంతో, మందులు ఏమి వాడాలో తోచక డాక్టర్లు సతమతమవుతూ, లక్షణాలను బట్టి, తోచిన మందులు ఇస్తూ రోగుల్ని కాపాడడం కోసం అహరహం తాపత్రయపడుతున్నారు.
తల్లినుండి వచ్చిన మెసేజ్ చూసి తల్లడిల్లి పోయాడు రాజశేఖరం. ఇండియాలో చాలా వృద్ధాశ్రమాలు మూసివేస్తున్నారు. తల్లి ఉంటున్న వృద్ధాశ్రమం కూడా త్వరలో మూసెయ్య బోతున్నారు. అక్కడ ఉండే వాళ్లకు రెండు వారాలు మాత్రమే వ్యవధి ఇచ్చారు ఖాళీ చేయడానికి.
ఆలోచించగా ఆలోచించగా అతనికి ఒక పరిష్కారం తోచింది. వెంటనే కొడుకుల్ని రమ్మని మెసేజీలు పెట్టేశాడు. ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. ఇక ఆలస్యం చేస్తే కష్టమనుకున్నాడు. వెంటనే చెయ్యవలసిన పనులన్నీ వేగంగా చక్కబెట్టేసుకున్నాడు.
తండ్రి, ‘‘అర్జంటు’’ అనడంతో కొడుకులు వెంటనే వచ్చేశారు. అందరూ మధ్యాహ్నం భోజనాలు చేసి స్థిమితపడ్డాక, తన ఆస్తి – పాస్తుల తాలూకు కాగితాలు తెచ్చి శివానీ చేతిలో ఉంచాడు రాజశేఖరం. ‘‘ఇదిగో, ఇవన్నీ నీవే, వీలునామా నీ పేరునే ఉంది. నువ్వే నీ కొడుకులకు ఏమిచ్చుకుంటావో ఇచ్చుకో’’ అన్నాడు.
తెల్లబోయారు కొడుకులు. ‘‘ఉన్నప•ళంగా ఈ ఉప్పలాయమ్ ఏమిటి!’’ ఆశ్చర్య పోయింది శివాని.
కొడుకులవైపు తిరిగి చెప్పాడు రాజశేఖరం, ‘‘ఇద్దరు కొడుకుల్ని కన్న నా తల్లి అనాథ• ఎలాగౌతుంది? నా తమ్ముడు చనిపోయినా ఇంకా నేనున్నాను. నేనుండగా మా అమ్మ అనాథ కావడం నాకు ఇష్టం లేదు. నేను మా అమ్మకు దక్షతగా ఇండియాకి వెళుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో తిరిగి రాగలనో, రాలేనో నాకు తెలియదు. మీ అమ్మకు మీరు దక్షత ఔతారా లేదా అన్నది మీరూ మీరూ నిర్ణయించుకోవలసి ఉంది. అది మీ ఇష్టం. ఈ సాయంకాలం ఫ్లయిటుకే నా ప్రయాణం’’ అని ఖరాఖండీగా చెప్పేసి, సామాను సద్దుకునే పనిలో నిమగ్నమయ్యాడు రాజశేఖరం.
శాన్ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో రాజశేఖరం ఎక్కిన విమానం టేకాఫ్ చేసింది. అదే ఆఖరి ఫ్లయిట్. కరోనా పాండమిక్ మూలంగా మరునాడు నుండి విమానాలు కూడా నడవడం మానేశాయి.