– షణ్ముఖ
ఈ ఏడాది జరగనున్న 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు భారతీయ జనతా పార్టీ సమాయత్తమవుతోంది. ఇటీవల ఢిల్లీలో రెండు రోజుల పాటు నిర్వహించిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఇందుకు వేదికైంది. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలను ఫిబ్రవరి, మార్చిలో నిర్వహించేందుకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కర్ణాటక, ఈ ఏడాది ఆఖర్లో మిజోరం, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ అసెంబ్లీలకు; వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ అన్ని ఎన్నికల్లోనూ కాషాయ జెండా రెపరెపలాడాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పార్టీ గట్టి సంకల్పం తీసుకుంది. గుజరాత్ మాదిరిగా ఘన విజయం సాధించాలని పార్టీ శ్రేణులకు ఉద్బోధ చేసింది. అదే సమయంలో అతి ధీమాకు పోయి వ్యవహరించ వద్దని హెచ్చరించింది. హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల్లో వైఫల్యం నేపథ్యంలో ఈ మేరకు అప్రమత్తం చేసింది.
పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీ కాలాన్ని 2024 జూన్ వరకు పొడిగిస్తూ జాతీయ కార్యవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. నడ్డా నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని తీర్మానించింది. ఆయన పనితీరు, చిత్తశుద్ధిపై పార్టీకి గల విశ్వాసానికి ఈ నిర్ణయం తిరుగులేని నిదర్శనం. నడ్డా పదవీ కాలం పొడిగింపును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా ప్రతిపాదించగా జాతీయ కార్యవర్గ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. నడ్డా నేతృత్వంలో చాలా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. మొత్తం 120 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే 73 చోట్ల పార్టీ నెగ్గింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అప్పటి అధ్యక్షుడు అమిత్ షా పదవీ కాలాన్ని పొడిగించిన విషయం గమనార్హం.
ఇక్కడ నడ్డా గురించి నాలుగు మాటలు చెప్పుకో వాల్సిన అవసరం ఉంది. 62 సంవత్సరాల జగత్ ప్రకాశ్ నడ్డా హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన వారు. ఆయన తండ్రి పట్నా వర్సిటీలో ప్రొఫెసర్ కావడంతో నడ్డా పుట్టింది, పెరిగింది బిహార్ లోనేనని చెప్పవచ్చు. మితభాషి, మృదుభాషి అయిన నడ్డా ప్రచారానికి, ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. నిరంతరం పని చేయడానికే ప్రాధాన్యమిస్తారు. క్షేత్రస్థాయి పర్యట నలను ఇష్టపడతారు. ఆయన రాజకీయ ప్రస్థానం ఏబీవీపీ ద్వారా ప్రారంభమైంది. 1991లో బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా, 1993లో హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో విపక్షనేతగా పనిచేశారు. 1998లో రాష్ట్ర మంత్రి అయ్యారు. 2010లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహ రించారు. 2020 జనవరిలో పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. నాటి నుంచి పార్టీ పురోగతికి క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. తన పనితీరుతో ప్రధాని మోదీ మెప్పు పొందారు.
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే… త్రిపురలో పార్టీ అధి కారంలో ఉంది. రేపటి ఎన్నికల్లో అగర్తలలో అధికార పీఠాన్ని కాపాడుకోవడం పార్టీ ముందున్న ప్రధాన సవాల్. ఇది ఒకప్పుడు సీపీఎంకు కంచుకోట. ఈసారి సీపీఎం సైతం సర్వశక్తులూ ఒడ్డుతోంది. మేఘాలయలో సంగ్మా నాయకత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉంది. నాగాలాండ్‌లో సంకీర్ణ సర్కారు నడుస్తోంది. ఈ రెండు చోట్ల అధికారంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. త్రిపురలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, నాగాలాండ్, మేఘాలయలో అధికారాన్ని కైవసం చేసుకోవడం పార్టీ లక్ష్యం. ఇప్పటికే ఈ మూడు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా పర్యటించి వేల కోట్ల రూపాయల విలువైన పనులకు శంకుస్థాపనలు చేసి, అనేక పథకాలను ప్రారంభించడం ద్వారా పరోక్షంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. త్వరలో ఈ మూడు రాష్ట్రాలను పార్టీ అగ్రనేతలు సందర్శించి ప్రచారాన్ని తీవ్రతరం చేయనున్నారు. వీటి తర్వాత మరో ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో, కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో పార్టీ అధికారంలోఉంది. దక్షిణాదిన పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం ఇదే. లింగాయత్ నాయకుడు బసవరాజ్ బొమ్మై సీఎంగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే పార్టీ ఎన్నికలను ఎదుర్కో నుంది. ప్రధాని మోదీ ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని చుట్టి వచ్చారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, సభల ద్వారా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది చివర్లో పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లో ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలోని పార్టీ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఒకింత ఎక్కువ సీట్లు వచ్చాయి. తర్వాత రోజుల్లో ఏర్పడిన రాజకీయ పరిణామాల్లో భాగంగా కమల్ నాథ్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కుప్ప కూలగా, బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ చౌహాన్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలా? లేదా? అనే అంశంపై పార్టీ తర్జనభర్జన పడుతోంది. 200 స్థానాలు గల రాజస్తాన్ అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించి సర్కారును ఏర్పాటు చేయగా, బీజేపీ గణనీయమైన సీట్లే గెలుచుకుంది. అయిదేళ్లకోసారి అధికార పార్టీని ఓడించి, ప్రతి పక్షానికి అధికార పగ్గాలు అందించే సంప్రదాయం ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ గెలుపుపై పార్టీ ఆశాభావంతో ఉంది. 2017కు ముందు వరుసగా 15 ఏళ్లపాటు రమణ్ సింగ్ నాయకత్వంలో చత్తీస్‌గఢ్‌లో అధికారంలో కొనసాగిన పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయింది. మళ్లీ అధికారాన్ని సాధించే దిశగా పావులు కదుపుతోంది.
దక్షిణాదిన ఎన్నికలు జరగనున్న మరో కీలక రాష్ట్రం తెలంగాణ. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (భారాస…పూర్వపు ‘తెలంగాణ రాష్ట్ర సమితి’-తెరాస)ని ఓడించి అధికారాన్ని అందుకునేందుకు పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్రల ద్వారా క్షేత్ర స్థాయిలో ప్రజల వద్దకు వెళుతున్నారు. భారాస ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో ఆయన విజయం సాధించారు. ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాల్లో బండి సంజయ్ పనితీరుపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. అంతకుముందు వివిధ సందర్భాల్లోనూ సంజయ్ పనితీరును ఆయన మెచ్చుకున్నారు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపురావు, కె.లక్ష్మణ్ తదితరులు దూకుడుగా ప్రజల్లోకి వెళుతున్నారు. భారాస సిట్టింగ్ స్థానాలైన దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించడం బీజేపీకి మంచి ఊపు తెచ్చింది. హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో పార్టీ గణనీయంగా డివిజన్లు గెలుచుకోవడం, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయానికి చేరువగా రావడం పార్టీ శ్రేణుల్లో జోష్‌ను నింపింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు పార్టీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకు అనుగుణంగా కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో తరచూ పర్యటనలు జరుపుతోంది.
తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు కమలనాథులు గట్టి కసరత్తే చేస్తు న్నారు. అన్నివర్గాల ప్రజలకు చేరువవడం ద్వారా పార్టీకి విజయం సాధించి పెట్టాలని ప్రధాని మోదీ నాయకులకు పిలుపునిచ్చారు. బోహ్రాలు, పాస్మండాలు, సిక్కులు, ఇతర అనేక వర్గాల ప్రజలకు చేరువకావాలన్నారు. పాస్మాండాలు ముస్లింలలో వెనుకబడిన వర్గం. ఇప్పటివరకు రిజర్వేషన్లు, ప్రభుత్వ పథకాల వల్ల వీరికి లబ్ధి చేకూరలేదు. వీరికి చేరువ కావడం ద్వారా ఓటు బ్యాంకును విస్తరించు కోవడం పార్టీ వ్యూహంగా ఉంది. ‘ఎన్నికల కోసం కాకుండా పేదల సంక్షేమానికి పాటు పడండి. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లండి. ముఖ్యంగా యువతకు చేరువకండి’ అని ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. అదే సమయంలో అతివిశ్వాసానికి పోవద్దని, దానివల్ల నష్టపోయే ప్రమాదం ఉందంటూ 1998నాటి మధ్యప్రదేశ్ అనుభవాన్ని గుర్తు చేశారు. అప్పుడక్కడ దిగ్విజయ్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ విషయాన్ని గుర్తించకుండా పార్టీ అతి విశ్వాసంతో ముందుకు సాగింది. ఫలితంగా హస్తం పార్టీ అక్కడ అతి స్వల్ప ఆధిక్యంతో అధికారం అందుకుంది. మళ్లీ అటువంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులను మోదీ హెచ్చరించారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ తేడాతో పార్టీ అధికారానికి దూరంగా ఉండిపోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో అనవసర వ్యాఖ్యలకు, వివాదాస్పద ప్రకటనలకు దూరంగా ఉండాలని మోదీ పిలుపునిచ్చారు. వీటివల్ల పార్టీ పలుచనయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. సినిమాలు వంటి సున్నితమైన అంశాలపై వ్యాఖ్యలకు దూరంగా ఉండాలన్నారు. వీటివల్ల అభివృద్ధి, సంక్షేమం వంటి అంశాలు పక్కకు పోతాయన్నారు. షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాలో కాషాయాన్ని కించపరిచారంటూ, ఆ సినిమాను బహిష్కరించాలంటూ కొందరు పార్టీ నాయకులు పిలుపునిచ్చిన నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. విపక్షాలు, ఇతర వర్గాలు రెచ్చగొట్టినా సంయమనం పాటించాలని, ప్రభుత్వ కార్యక్రమాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం పైనే పూర్తిగా దృష్టి పెట్టాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సాగిన జాతీయ కార్యవర్గ సమావే శాల్లో మోదీ ఆచితూచి మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు కూడా సంయమనం పాటించాలని ప్రజల విశ్వాసం చూరగొనడంపైనే పూర్తిగా సమయం వెచ్చించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ, పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం, అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం, 370 అధికరణ రద్దు ద్వారా కశ్మీరుకు స్వేచ్ఛ కల్పించడం, కరోనా మహమ్మారిని ఎదుర్కొన్న తీరు, జీ-20 సదస్సుకు అధ్యక్షత వహించే అవకాశం మన దేశానికి లభించడం, ఈబీసీ రిజర్వేషన్లు వంటి అంశాలపై ప్రచారం చేయడం, కలసికట్టుగా పనిచేయడం ద్వారా పార్టీని విజయతీరాలకు చేర్చాలని సూచించి సరైన దిశానిర్దేశం చేశారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమైంది.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్