భారత్‌ ‌ప్రజాస్వామ్య దేశం, లౌకిక రాజ్యం. అన్ని మతాలను, వర్గాలను, కులాలను సమానంగా చూసే, గౌరవించే సంస్కృతి మనది. పర మత సంప్రదాయాలు, పద్ధతులకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అది నేరమే. కానీ ఇటీవల కాలంలో కొందరు పనిగట్టుకొని హిందూ ధర్మం పట్ల, సంప్రదాయాల పట్ల చులకనగా మాట్లాడటం, విమర్శించడం హెచ్చు మీరుతోంది. హిందువులు ఆరాధించే దేవుళ్ల గురించీ అనుచితంగా మాట్లాడటం, మత విద్వేషాలు రగిల్చేలా వ్యాఖ్యలు చేయడం తరచూ కనిపిస్తోంది. దీనికి కొనసాగింపుగా రాష్ట్రంలో జరిగిన మరో వివాదం కలకలం సృష్టిస్తోంది.

మనదేశంలో మెజార్టీ ప్రజలు హిందువులు. కానీ, హిందువులే లక్ష్యంగా కొన్ని శక్తులు సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నట్లు తరచూ జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఒక్కొక్కరు ఒక్కో వైపు నుంచి, ఒక్కో రకంగా హిందువుల నమ్మకాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్న ఆందోళన కలవరపరుస్తోంది. అయితే ఇవన్నీ కేవలం హిందూ ధర్మమే లక్ష్యంగా, హిందువుల్లో కల్లోలాలు సృష్టించడమే పనిగా కొన్ని వర్గాలు కావాలనే జరుపుతున్న కుట్రలో భాగమని హిందూసంఘాలు వాదిస్తున్నాయి. అందుకే ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వచ్చినా, హిందు వులే బాధితులవుతున్నారని గుర్తు చేస్తున్నాయి. ఇలాంటి వాటిని సమూలంగా ఎదుర్కోవాలని, హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని సమర్థ వంతంగా తిప్పి కొట్టాలని పిలుపునిస్తున్నాయి.

నాస్తికులు అంటే.. హిందూ దేవుళ్లను కించ పరచడం, ఎదుటివాళ్లను బలవంతంగా నాస్తికులుగా మార్చడం వాళ్ల పని కాదు. దేవుడు లేడు, మతాలు లేవు, తాము ఎవరినీ ఆరాధించం, వేటినీ నమ్మం.. అనే తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకోవడం వరకే రాజ్యాంగం స్వేచ్ఛను కల్పించింది. కానీ, కొందరు ఆ పరిధులు దాటుతున్నారు. వ్యక్తిగత దూషణలకు తెగబడుతున్నారు. అంతేకాదు, సాధారణంగా ఎదుటి వ్యక్తులపై కూడా ప్రయోగించని భాషను, అభిప్రాయాలను ఏకంగా దేవుళ్లపైనే ప్రయోగిస్తున్నారు. మతాలకతీతంగా ఇలాంటి వాటిని ఖండించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉన్నాయంటున్నారు మానవతా వాదులు. ఇవాళ ఓ మతాన్ని కించపరిచిన వాళ్లు.. రేపు మరో మతాన్నీ కించపరచవచ్చు! కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు అందరూ సమష్టిగా ఉద్యమించాలన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మొన్నటికి మొన్న భారత నాస్తిక సమాజం అధ్యక్షుడినని చెప్పుకునే భైరి నరేష్‌ అనే వ్యక్తి.. ఉచ్ఛనీచాలు మరిచాడు. హిందువులు పరమ పవిత్రంగా భావించే దేవుడిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. విద్వేషపూరితం అనే కంటే అత్యంత నీచమైన మాటలు మాట్లాడాడు. ఏకంగా దేవుడి పుట్టుక గురించే అసభ్యంగా మాట్లాడాడు. అసలు ఆ సభలో ఈ ప్రస్తావనే అనవసరం. కానీ, పనిగట్టుకొని హిందూ దేవుడిని వివాదం లోకి లాగాడు. అవసరం లేకున్నా.. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశాడు. హిందూ సమాజంలో ఒక్కసారిగా కలకలం రేపాడు. హిందువు లందరూ.. ముఖ్యంగా అయ్యప్పస్వామి మాల ధారణలో ఉన్న భక్తులు భగ్గుమనేలా చేశాడు.

గడచిన డిసెంబర్‌ 19‌న వికారాబాద్‌ ‌జిల్లా రావులపల్లిలో జరిగిన సభలో అయ్యప్ప స్వామిపై భైరి నరేష్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంబేడ్కర్‌ ‌విగ్రహావిష్కరణ సందర్భంలో ప్రసంగించిన ఆయన.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేడ్కర్‌ను ప్రస్తావిస్తూ ఆ మహోన్నతుడి ఆలోచనలను కూడా వక్రీకరించే ప్రయత్నం చేశాడు. అతడి వ్యాఖ్యల వీడియో సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేసింది. అయ్యప్పస్వామి భక్తులు, హిందూ సంఘాల నేతలు నరేశ్‌పై మండిపడ్డారు. అతన్ని అరెస్ట్ ‌చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అయ్యప్పస్వాములు పెద్దఎత్తున ఆందోళ నలు చేపట్టారు. స్వామీజీలు, మఠాధిపతులు కూడా మీడియా ముందుకు వచ్చారు. విశ్వహిందూ పరిషత్‌, ‌భజరంగ్‌దళ్‌ ‌కార్యకర్తలు ఎక్కడికక్కడ నిరసనలకు దిగారు. రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. నరేష్‌పై పీడీ యాక్ట్ ‌కింద కేసులు పెట్టాలని, అతని యూట్యూబ్‌ ‌ఛానెల్‌ను నిలిపి వేయాలని డిమాండ్లు సర్వత్రా వినిపించాయి. దీంతో బైరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అంతేకాదు, భైరి నరేష్‌ ‌వ్యాఖ్యలతో భగ్గుమన్న హిందుత్వవాదులు ఎక్కడికక్కడ పోలీస్‌ ‌స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. రాష్ట్రమంతటా దాదాపు 250 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ఉమాపతిగౌడ్‌ అనే అయ్యప్ప భక్తుడి ఫిర్యాదు మేరకు కొడంగల్‌ ‌పోలీస్‌స్టేషన్‌లో నరేష్‌పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, కేసులు నమోదయిన తర్వాత బైరి నరేష్‌ ‌కనిపించకుండా పోయాడు. మూడు రోజుల పాటు పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు నిజామా బాద్‌, ‌సిద్దిపేట, కరీంనగర్‌, ‌హైదరాబాద్‌లో గాలింపు చర్యలు చేపట్టారు. హన్మకొండ జిల్లా కమలాపూర్‌ ‌మండలం కన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని రాములపల్లి బైరి నరేష్‌ ‌స్వగ్రామం. ఆ గ్రామంతో పాటు, అతను తరచూ వెళ్లే అన్ని ప్రాంతాల్లో పోలీసులు వెతికారు.

ఓవైపు బైరి నరేష్‌పై కేసులు పెడుతూనే.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాల కార్యకర్తలు. హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ఆఫీస్‌తో పాటు.. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్ల ముందు కూడా ఆందోళనలు చేపట్టారు. జిల్లాల వారీగా నిరసనలు చేపట్టారు. రోడ్ల మీద బైఠాయించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే హిందూ సమాజం ఏకం కావాలన్నారు. దేవుళ్ల గురించి తప్పుగా మాట్లాడిన వాళ్లకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు.

మరోవైపు.. కొడంగల్‌లో జరిగిన అయ్యప్ప స్వాముల నిరసన దీక్షలో బైరి నరేష్‌ అనుచరు డొకడు వీడియో తీస్తూ.. స్వాముల్ని ప్రశ్నించే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని హిందూ సంఘాల కార్య కర్తలు, భజరంగ్‌దళ్‌, ‌వీహెచ్‌పీ కార్యకర్తలు, అయ్యప్ప స్వాములు ఉరికించి కొట్టారు. పోలీసులు వారిని నిలువరించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడే బైరి నరేష్‌ అనే ప్రచారం సోషల్‌ ‌మీడియాలో వైరలైంది. అంతేకాదు.. అతన్ని ఉరి కించి కొట్టిన వీడియోలు కూడా వైరల్‌ అయ్యాయి.

పరారీలో ఉండి కూడా నరేష్‌.. ‌మరికొన్ని వీడి యోలు తన యూట్యూబ్‌ ‌ఛానెల్‌లో పోస్టు చేశాడు. దీంతో, సోషల్‌ ‌మీడియా ద్వారా అతన్ని ట్రేస్‌ ‌చేసిన పోలీసులు.. ఖమ్మం నుంచి వరంగల్‌ ‌వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ ‌చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్‌ ‌విధించింది. పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో నరేష్‌ ‌నేరం ఒప్పుకున్నాడు. తాను ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు అంగీకరించాడు. ఈ మేరకు రిమాండ్‌ ‌రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. అలాగే.. నరేష్‌ను తాను ఉద్దేశపూర్వకంగానే ఆ కార్యక్రమానికి పిలిచినట్లు మరో నిందితుడు, సభను నిర్వహించిన హనుమంతు పోలీసుల ఎదుట వాఙ్మూలం ఇచ్చాడు.

బైరి నరేష్‌ ‌రిమాండ్‌ ‌రిపోర్ట్‌ను పరిశీలిస్తే.. అతనిపై గతంలోనూ పలు కేసులు నమోదు అయ్యాయని కొడంగల్‌ ‌పోలీసులు కోర్టుకు వెల్ల డించారు. మత విద్వేషాలు రగిల్చేందుకే అతను అలాంటి వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. హనుమ కొండలో రెండు, నవాబ్‌పేట పోలీస్‌ ‌స్టేషన్‌లోనూ భైరి నరేష్‌పై కేసులు ఉన్నట్లు కొడంగల్‌ ‌స్థానిక న్యాయస్థానానికి పోలీసులు తెలిపారు.

కోర్టు ఆదేశాలతో భైరి నరేష్‌ను వికారాబాద్‌ ‌జిల్లా పరిగి సబ్‌ ‌జైలుకు తరలించారు. అయితే, ఆ సమయంలో కూడా ఉద్రిక్తత నెలకొంది. పరిగి సబ్‌ ‌జైలు వద్దకి నరేశ్‌ను తీసుకొస్తున్న విషయం ముందే తెలుసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. నరేశ్‌ను లోపలికి తీసుకెళ్ల కుండా ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్ప డింది. వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. పెద్దఎత్తున అక్కడికి వచ్చిన అయ్యప్ప స్వాముల ఉగ్రరూపాన్ని చూసిన నరేశ్‌ ‌బిత్తరపోయాడు. భయంతో జైలు లోపలికి పరుగు తీశాడు. జైలు గేటు తోసుకుని అయ్యప్ప భక్తులు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అతి కష్టం మీద అడ్డుకున్నారు.

– సుజాత గోపగోని, 6302164068, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE