ఛత్తీస్‌గఢ్‌ ‌రాష్ట్రం, నారాయణ్‌పూర్‌ ‌జిల్లా కేంద్రంలోని ఒక చర్చ్ అది. పేరు సేక్రెడ్‌ ‌హార్ట్ ‌చర్చ్. ఈ ‌సంవత్సరం జనవరి 2వ తేదీన రెండువందల మంది దాని మీద దాడి చేశారు. ఒక వ్యక్తి బలమైన కర్రతో ప్రాంగణంలోని కన్యమేరీ విగ్రహాన్ని బద్దలుకొట్టాడు. రెండేళ్లుగా బస్తర్‌ ‌డివిజన్‌లో సంప్రదాయక గిరిజనులు, క్రైస్తవంలోకి మారిన గిరిజనులు మధ్య సాగుతున్న ఘర్షణకు ఇది దాదాపు పరాకాష్ట. లేదా, ఆ అడవులలో రెండువర్గాలుగా చీలిపోయిన గిరిజనుల వైఖరిలో రాబోతున్న పెనుమార్పునకు అంకురార్పణ కూడా అనుకోవచ్చు. కారణాలు ఎన్నయినా ఉండవచ్చు. అవి ఎలాంటివయినా కావచ్చు. అటవీ ప్రాంతంలోని గిరిజనులు ఒక్కసారిగా క్రైస్తవ ప్రార్థనా మందిరం మీద కర్రలు, వెదురుబొంగులు, ఇనప కడ్డీలతో దాడికి దిగడం ముమ్మాటికి పెనుమార్పు. ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ ‌కొండలలో వినిపిస్తున్న వాదనలు ఇవే. విదేశీమతం క్రైస్తవం తీసుకున్నవాళ్లు గిరిజనులు కారు. కాబట్టి వారు అడవిని వీడి బయటకెళ్లి బతకాలి. లేదా క్రైస్తవం వదిలిపెట్టి తిరిగి అక్కడి మట్టి మీద, గాలి మీద, నీటి మీద భక్తితో, కాళీమాత సాక్షిగా సంప్రదాయక గిరిజనులుగా బతకాలి. మరొక ముఖ్య అంశం- క్రైస్తవంలోకి మారినందున రాజ్యాంగం ద్వారా దఖలు పడిన ఎస్‌టీ హోదాను అనుభవించడానికి వారికి అర్హత ఉండకూడదు.

‘క్రైస్తవమతం తీసుకుంటే వాళ్లు గ్రామాలు వదిలిపోవాలి. ఎందుకంటారా? గిరిజనుడుగా ఉండడం ఒక పరంపరకు చెందినది. ఆ పరంపరలో ఉన్నప్పుడే గిరిజనులవుతారు. గిరిజనులు కానివారు ఇక్కడ ఉండడానికి అర్హులు కారు’ అన్నారు నారాయణ్‌పూర్‌ ‌జిల్లాలోని గొర్రా గ్రామ సర్పంచ్‌ ‌సునీత్‌ ‌మాండ్వి. 2022, డిసెంబర్‌ ‌మూడోవారం నుంచి నారాయణ్‌పూర్‌ ‌ప్రాంతంలో ‘సంప్రదాయ గిరిజనులు’, ‘క్రైస్తవంలోకి మారిన గిరిజనులు’ మధ్య రగులుతున్న చిచ్చు గొర్రా గ్రామం నుంచే ఆరంభ మైంది. తాము గిరిజన సంస్కృతిలోనే ఉన్నామనీ, కానీ క్రీస్తును నమ్ముతున్నామని, తమకు అటవీ ప్రాంతంలో ఉండే హక్కు ఉందని క్రైస్తవంలోకి మారిన గిరిజనులు చెబుతున్నారు. ఈ వాదనే ఇప్పుడు అక్కడ అగ్గి రాజేస్తున్నది. గడచిన మూడు మాసాలుగా జిల్లాలోని 15 గ్రామాల నుంచి దాదాపు 400 మందిని సంప్రదాయ గిరిజనులు తరిమి వేశారు. ఈ క్రమంలోనే జనవరి 2వ తేదీన నారాయణ్‌పూర్‌లోని సేక్రెడ్‌ ‌హార్ట్ ‌చర్చ్ ‌మీద దాడి జరిగిందనిపిస్తుంది. అంతకంటే ముందు జరిగిన మతాంతరీకరణలకు నిరసన తెలియచేయడానికి గొర్రా గ్రామంలో ఒక సమావేశం జరిగింది. నిజానికి ఆ ముందురోజు, కొన్ని గంటల ముందు జరిగిన క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు కూడా స్థానికులను బాధించాయి. గొర్రాలోనే రెండు వర్గాలు ఘర్షణలకు దిగాయి. క్రైస్తవం తీసుకున్న గిరిజనులు ఊరు విడిచి వెళ్లిపోయారు. మతం తీసుకున్నారన్న ఆగ్రహంతో కొండగావ్‌, ‌నారాయణ్‌పూర్‌ ‌జిల్లాల్లో ‘రైట్‌వింగ్‌’ ‌కార్యకర్తలు కొందరిని తరిమివేశారు. క్రైస్తవాన్ని వీడి ఘర్‌వాపసీ చేయాలని వీరు చెప్పడంతోనే వారంతా ఊళ్లు విడిచివెళ్లిపోయారని వార్తలు వచ్చాయి.

అప్పటి నుంచి ఆ రెండు జిల్లాలలోని గ్రామాలలో చెదురుమదురుగా ఇందుకు సంబంధించిన దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అన్నీ బలవం తపు మత మార్పిడికి నిరసనలే. ఇలాంటి వాతావర ణాన్ని హిందూ సంఘాలకు, బీజేపీకి వ్యతిరేకంగా మలచడానికి ఎప్పుడూ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఆ రెండు జిల్లాలలోని 30 గ్రామాలలో ‘నిజ నిర్ధారణ సంఘాలు’ పర్య టించాయి. ఇర్ఫాన్‌ ఇం‌జనీర్‌, ‌నికోలస్‌ ‌బర్లా అనే నిజ నిర్ధారకులు వెంటనే తమ నివేదిక ఇచ్చేశారు. ఇక్కడ క్రైస్తవం తీసుకున్న గిరిజనులను తిరిగి హిందూత్వంలోకి మార్చడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం జరిగిందంటూ ఆ ఇద్దరు తేల్చేశారు. కానీ అసలు ఈ వివాదంలో బలవంతపు మత మార్పిడుల సమస్యే లేదని ప్రభుత్వ యంత్రాంగం చెప్పడం మరొక వింత. వీళ్ల ఉద్దేశం ఏమిటంటే, ఇది క్రైస్తవులుగా మారిన గిరిజనులకు, సంప్రదాయక గిరిజనులకు మధ్య తాజా ఘర్షణ మాత్రమే.

నిజమైన వివాదం గురించి ఒక వర్గం మీడియా అయినా నిజం చెప్పడానికి ప్రయత్నిస్తున్నది. అది- గడచిన కొంతకాలంగా మధ్య భారతంలోని గిరిజనులను క్రైస్తవంలోకి మార్చడాన్ని రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ‌వ్యతిరేకిస్తున్నది. ఈ మత మార్పిడి పక్రియ ఇప్పటిది కూడా కాదు. స్వాతంత్య్రం రావడానికి ముందు నుంచి ఇది యథేచ్ఛగా సాగిపో తోంది. తరువాత సంఘ్‌కు అనుబంధంగా వనవాసి కల్యాణ్‌ ఆ‌శ్రమం జస్పూర్‌ ‌కేంద్రంగా కార్యకలాపాలు ఆరంభించింది. 1952లో వనవాసి కల్యాణ్‌ ఆ‌శ్రమం ఆరంభించిన తరువాత అది బాగా విస్తరించిందని చెబుతారు. మతం మారిన వారిని తిరిగి హిందూత్వం లోకి తీసుకురావడం ఈ సంస్థ ఆశయం. అలాగే గిరిజనుల నిజమైన అస్తిత్వం హిందూత్వంలోనే అని ప్రచారం చేయడం. క్రైస్తవ సంస్కృతి గిరిజనులను హిందూత్వం నుంచి వేరు చేస్తున్నదని వారి ఆరోపణ. వనవాసి కల్యాణ్‌ ఆ‌శ్రమంతో పాటు తరువాత సేవాభారతి కూడా ప్రవేశించింది. క్రైస్తవ మిషనరీలు మతం మార్చడానికి వేటిని అడ్డం పెట్టు కుంటున్నారో – విద్య, వైద్యం- వాటిని సేవాభారతి అందించడం ఆరంభించింది. 1990లో ముస్లిం మతోన్మాదం కూడా విజృభించడంతో గిరిజన ప్రాంతాల మీద వీరు మరింత శ్రద్ధ పెట్టారు. క్రైస్తవం విదేశీమతం, ఆ మతం వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తుందని వారు బాహాటంగానే చెబుతారు. ఇందుకు సంబంధించి చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి కూడా. కొండా కోనలలో గిరిజన సంస్కృతి పరిరక్షణ లేదా క్రైస్తవ వ్యాప్తి నిరోధాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌తీవ్రంగా పరిగణి స్తున్నది. ఒకప్పుడు క్రైస్తవ మతాంతరీకరణలను నిరోధించడానికీ, ఘర్‌వాపసీ కార్యకలాపాలకీ పూర్తి మద్దతు ఇచ్చిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌సింగ్‌ ‌జుదేవ్‌ ‌విగ్రహావిష్కరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సరసంఘ చాలక్‌ ‌మోహన్‌జీ భాగవత్‌ ‌హాజరయ్యారంటేనే ఆ సంస్థ ఇస్తున్న ప్రాధాన్యం అర్ధమవుతుంది. ఇది 2022లోనే జరిగింది. ఆ విధంగా జుదేవ్‌ ‌వార సత్వాన్ని వర్తమాన తరానికి గుర్తు చేయాలని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌భావించింది. అందుకు క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తున్నది. నక్సల్స్ ‌కంటే మిషనరీలే మరింత ప్రమాదకారులని బీజేపీ భావిస్తోంది.

ఇలాంటి నేపథ్యంలోనే నవంబర్‌ 11, 2020‌న జార్ఖండ్‌ అసెంబ్లీ ‘సర్నా ధర్మ’ బిల్లును ఆమోదిం చింది. జార్ఖండ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌లలో ఉండే ప్రధాన తెగను ఈ పేరుతో ఏకం చేస్తున్నారు. వీరి మతం వేరు అని చెబుతూ సర్నా స్మృతిని తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోంది. అంటే ఇక్కడి గిరిజనులు హిందుత్వకు చెందరు అన్న వాదనకు రాజ్యాంగబద్ధత కల్పిస్తు న్నారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌, అనుబంధ సంస్థలు గిరిజ నులు హిందువులేనంటూ చేస్తున్న పోరాటానికి పూర్తి విరుద్ధమైనది. ఈ బిల్లు కూడా కొన్ని ఉద్రిక్తతలకు, దీర్ఘకాలిక సమస్యలకు కారణమైంది. అయితే ఈ బిల్లు ప్రస్తుతం కేంద్రం వద్ద ఎటూ తేలకుండా ఉంది. కాబట్టి, సంప్రదాయ గిరిజనులు చేస్తున్న వాదన, ఆవేశం ఈ బిల్లుతో వచ్చే ప్రమాదాన్ని గుర్తించిన తరువాతి పరిణామాలను బట్టేనని అర్ధమవుతుంది.

ఈ మొత్తం పరిణామాల గురించి, క్రైస్తవ మిష నరీల కుట్రల గురించి మీడియా పెద్దగా విశ్లేషించడం లేదు. పట్టించుకున్నవాటిలో మళ్లీ ఒక వర్గం దీనిని రెండు వర్గాల మధ్య ఘర్షణగానే వక్రీకరించింది. అలాగే సంప్రదాయక గిరిజన వర్గం ‘రైట్‌వింగ్‌’ ‌నాయకుల నాయకత్వంలో ఈ చర్యకు దిగిందని కూడా పేర్కొన్నది. నిజానికి ఇదంతా బలవంతపు మత మార్పిడులు సృష్టిస్తున్న శాంతి భద్రతల సమస్య. అస్తిత్వ సమస్య. ఆత్మగౌరవ సమస్య కూడా. మతాంతరీకరణల కారణంగా తమ జనాభా సమీకరణలలోనే ఎగుడుదిగుళ్లు సంభవిస్తాయని, అంతిమంగా ఇది గిరిజనులకు రాజ్యాంగం ఇస్తున్న మొత్తం ప్రయోజనాలకు ఎసరు పెట్టే అవకాశం ఉందని వారు వాపోతున్నారు.

జనవరి 2న గిరిజనులు దాడి చేసిన చర్చ్ ‌విశ్వ దీప్తి ఉన్నత పాఠశాల (నారాయణ్‌పూర్‌) ‌ప్రాంగణంలో ఉంది. కిటికీలు, అద్దాలు, కుర్చీలు బద్దలు కొట్టడంతో పాటు కన్యమేరీ, జీసస్‌ ‌విగ్రహాలను కూడా గిరిజనులు ధ్వంసం చేశారు. దాదాపు నలభయ్‌ ‌మంది మీద ఎఫ్‌ఐఆర్‌ ‌దాఖలు చేశారు. ఇందులో బీజేపీ నారాయణ్‌పూర్‌ ‌జిల్లా శాఖ అధ్యక్షుడు రూప్‌ ‌సాయిసాలం కూడా ఉన్నారు. ఇందులో ఆశ్చర్య పడవలసిన పనిలేదు. కానీ ఈ దాడిని ఆపడానికి వచ్చిన పోలీసుల మీద కూడా గిరిజనులు తీవ్ర స్థాయి లోనే ప్రతిదాడికి దిగారు. ఈ ప్రతిదాడిలో సాక్షాత్తు నారాయణ్‌పూర్‌ ‌పోలీస్‌ ‌సూపరింటెండెంట్‌ ‌సదా నంద్‌ ‌కుమార్‌కు తలకు గట్టి గాయమే తగిలింది.

ఈ వివాదాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లాలన్న తలంపు సంప్రదాయ గిరిజనులలో ఉందో లేదో కానీ, ఆ సమస్య దేశం దృష్టికి వెళ్లక తప్పని పరిస్థితి వచ్చింది. క్రైస్తవం తీసుకున్న గిరిజనులపై దాడికి నిరసనగా, నిజానికి చర్చ్ ‌మీద దాడికి నిరసనగా, నారాయణ్‌పూర్‌ ‌బంద్‌కు మొదట అవతలి వర్గం పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో మళ్లీ ఉద్రిక్తతలు చెలరేగాయి. అదనపు బలగాలను రప్పించడంతో నారాయణ్‌పూర్‌ ‌కంటోన్మెంట్‌ను గుర్తుకు తెచ్చింది. ఈ సందర్భంగానే బీజేపీ జిల్లా శాఖ అధ్యక్షుడు రూప్‌ ‌సాయిసాలమ్‌ను, మరొక పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ పరిణామాలకూ, గిరిజనుల మతాంతరీకరణలకూ నిరసన పేరుతో సంప్రదాయ గిరిజనులు జనవరి 5న బస్తర్‌ ‌బంద్‌కు పిలుపు నిచ్చారు. దీనికి చాంబర్‌ ఆఫ్‌ ‌కామర్స్ ‌మద్దతు పలకడంతో మంచి స్పందనే కనిపించింది కూడా. సర్వ ఆదివాసీ సమాజ్‌ ‌పేరుతో ఈ బంద్‌కు వారు పిలుపునిచ్చారు.

అస్తిత్వ పోరాటంలో ఉన్న గిరిజనుల వాదనలు, తాజా పరిణామాలు చూస్తే ఇంత పెద్ద దాడి ఒక్కరోజులో కొందరు ఆవేశపరులు చేసినది కాదని తెలుస్తుంది. 15 గ్రామాలలో సంప్రదాయ, క్రైస్తవ గిరిజనులకు నడుమ ఘర్షణలు, భౌతికదాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా బ్రిటిష్‌ ‌కాలం నుంచి జరుగుతున్న మత మార్పిడులకు కొనసాగింపే నని దేశం అర్ధం చేసుకోవాలి. ఆ క్రమంలోనే జనవరి 1వ తేదీన కూడా గొర్రా గ్రామంలో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఇది తాజా దాడి మాత్రమేనని, గడచిన సంవత్సరం నుంచి ఇలాంటి దాడులు ఇక్కడ జరుగుతున్నా చర్యలు తీసుకోవడంలో పాలనా యంత్రాంగం విఫలమైందని, తాజాగా జరిగింది కూడా అదేనని ఛత్తీస్‌గఢ్‌ ‌క్రిస్టియన్‌ ‌కమ్యూ నిటి ఫోరమ్‌ అధ్యక్షుడు అరుణ్‌ ‌పన్నాలాల్‌ ‌వ్యాఖ్యా నించాడు. ఇక్కడ పరిస్థితిని బట్టి ఇలాంటి పరిస్థితి రాక తప్పని పరిస్థితులే ఉన్నాయని అనిపిస్తుంది. ఈ ప్రాంతంలో తాము క్రైస్తవేతరులైన గిరిజనుల చేతిలో వివక్షకు గురి అవుతున్నామని క్రిస్టియన్‌ ‌సంఘాలు చాలాకాలం క్రితమే గగ్గోలు ఆరంభించాయి. జనవరి 1 నాటి గొర్రా గ్రామ ఘర్షణలు, మరునాడు జరిగిన చర్చ్ ‌మీద దాడి వెనుక మరొక కారణం కనిపిస్తున్నది. డిసెంబర్‌ 18, 2022‌న బొర్వాండ గ్రామానికి చెందిన 14 కుటుంబాలను గ్రామస్థులు వారి ఇళ్ల నుంచి తరిమేశారు. మళ్లీ గ్రామంలో అడుగు పెట్టవద్దని శాసించారు. తమను చర్చల కోసం గొర్రా గ్రామం రావలసిందని అంతా చెప్పినా, గ్రామంలోకి ప్రవేశించిన తరువాత నిరాయుధంగా ఉన్న తమ మీద సాయుధులు దాడి చేశారని క్రైస్తవం తీసుకున్న గిరిజనులు కొందరు చెప్పారు.

హిందూ సమాజంలో కొద్దికాలం నుంచి కనిపి స్తున్న చైతన్యం మరింత పదునెక్కుతున్న చిహ్నాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆంధప్రదేశ్‌లో నిర్మాణంలో ఉన్న ఒక వినాయక ఆలయాన్ని సాక్షాత్తు చర్చ్ ‌ఫాదర్‌ ‌వచ్చి కూలగొట్టే ప్రయత్నం చేయడం, అందుకు మహి ళల నుంచి ప్రతిఘటన రావడం ఇటీవలి పరిణామం. తరువాత హిందూ సంఘాల ఆందోళనతో ఆ మతో న్మాదిని అరెస్టు చేశారు. ఇస్లాం సర్‌తన్‌ ‌సె జుదా అంటుంది. క్రైస్తవం చాపకింద నీరులా దేశ సమగ్ర తకు, హిందుత్వకు చేటు చేయాలని చూస్తున్నది. ఇందుకు అనేక అడ్డదారులు ఎంచుకుంది. మిషనరీల దుండగీడుతనానికి ఇంత మద్దతు ఎక్కడ నుంచి వస్తున్నదో అందరికీ తెలుసు. కాబట్టి హిందూ సమాజం ఐక్యత తక్షణ కర్తవ్యంగా భావించాలి. కొండకోనలైనా, మైదానాలైనా ఇప్పుడు హిందుత్వం ఆపదలో ఉన్న మాట నిజం. దీనికి సరైన సమాధానం చెప్పాలి. అందుకు ఏకం కావాలి.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE