– డాక్టర్‌ ‌కనుపూరు శ్రీనివాసులు రెడ్డి

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‘‘నేరుగా హైదరాబాద్‌ ‌వెళదాం.’’

‘‘మీ ఇష్టం’’ అన్నదానికి బహుమానం బుగ్గ గిల్లుడు పైగా ‘‘నువ్వు నా చక్కెర బిళ్ల అనే తీపి మిఠాయి, నువ్వు నా ప్రాణం’’ అనే బ్రహ్మాస్త్రం కూడా! ‘‘ఎలా పెట్టింది మీ అమ్మ అంత కరెక్టుగా నీకు పేరు’’ అనే పొగడ్త కర్పూర దీపారాధన!! ఎక్కువగా ఎండు మిరపకాయలు దిష్టి నిప్పుల్లో వెయ్యడం కూడా ఉంటుంది. ఇంతగా అర్థ్ధం చేసుకుని, అనుకూలంగా, తెలివిగా సమయస్ఫూర్తిగా సర్దుకుపోయే గొప్ప… చివరిలో జాణ అనే ఎగతాళి కుళ్లు చూపించేవాడు. జగమొండి అనే వజ్ర కిరీటం కూడా అప్పుడప్పుడు తగిలించే వాడు. అయినా ఎలాంటి భర్తనయినా సహనంతో అవలీలగా గెలవొచ్చు కానీ ఇతన్ని మాత్రం కాదు అనుకోగానే అసంతృప్తి మేఘం అలా కమ్మి వెళ్లి పోయింది.

కోవిడ్‌ ‌వలన మూడు సంవత్సరాలు వెళ్లలేక ఒంటరిగా భారత్‌లో ఉన్న తల్లిని చూడలేక తపించి పోయింది ధార్మిక. ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని తహతహ లాడిపోతోంది. తల్లి కౌగిలిలోని ఆప్యాయత అనురాగాల వాత్సల్య స్వర్గసీమలో విహరించాలని మనసు ఉరకలు వేస్తోంది. వెళదామంటే కాదు కూడదు అనే మనిషి ఉన్నట్టుండి వొప్పుకున్నాడు భర్త శ్రీనాధ్‌.

అది తన కోసం కాదు..వాళ్ల నాన్న గారికి కాలులో చీల గుచ్చుకుందని, పదుల సంవత్సరాల నుంచి వున్న తల్లి కాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయని పరుగులు పెట్టిస్తున్నాడు.

మా అమ్మకు ఈ మధ్య గుండెల్లో నొప్పి వస్తుంది అంటే..,‘‘అదేమి ఉండదు. చిన్నపాప పుట్టినప్పుడు వచ్చింది కదా! ఫిట్టుగా సన్నజాజి మొక్కలా ఉంది మీ అమ్మ’’ అత్తగారు సన్నగా చలాకీగా ఉంటారని చతురోక్తి విసరడం అలవాటు అల్లుడు శ్రీనాధ్‌కు. తోబుట్టువులు ఎవ్వరూ లేక జీవితమే కూతురు మనమరాళ్లు అని నమ్మి చివరి రోజులు గడుపుతున్న తల్లిని తలుచుకోగానే గుండె పిండినట్లయ్యి కళ్లల్లో నీళ్లు చటుక్కున పొంగి పొరిలాయి.

తన దగ్గరే ఉంచుకోవాలని ఎన్నో రకాలుగా శ్రీనాధ్‌కు చెప్పి చూసింది. వాదించింది, కోప్పడింది, అలిగింది. లాభం లేకుండా పోయింది. ఎంత దూరమైనా వెళ్లేటట్లుందని తనే మానేసింది. అర్థం చేసుకోకపోయినా సర్దుకు పోవడం మనస్ఫూర్తిగా మరిచిపోవడం బంధం నిలవాలంటే అవసరం, లేకుంటే ప్రతి పెండ్లి పెటాకులే. వెండి తెరలో చూడని ఊహించని పోరాటాలు మారణ హోమాలు. దేశమంతా ఒంటరి తల్లులు, అనాథ పిల్లల నిలయం అవుతుంది. మరి ఆత్మగౌరవం ఆత్మాభిమానం మాట ఏమిటి? ప్రేమ, బంధం ఉంటే ఇష్టాఇష్టాలు మార్చుకోగలవి, సంస్కారంతో మరిచిపోగలవి. ప్రతి మాటను చేతను వ్యక్తిత్వానికి ఆపాదించి జీవితాన్ని పూడ్చలేని అగడ్తలమయం చేసుకోకూడదు.ఛీ.. ఏవిటిది? ఇప్పుడెందుకు ఇవన్నీ ఆలోచిస్తున్నాను అనుకొని తల విదిలించుకుంది ధార్మిక.

కోవిడ్‌ ‌సమయంలో తల్లి గురించి ఎంత భయపడిపోయిందో! రోజూ ఫోను చేసేది. పిల్లలతో మాట్లాడించేది, వీడియో కాల్లో చూపించేది. దగ్గు జలుబు, జ్వరం ఉంటే అశ్రద్ధ చెయ్యొద్దని చెప్పేది. తల్లి తనను గురించి పిల్లలను గురించి ‘జాగర్త జాగర్త అని పదే పదే చెప్పేది. తనకు ఎంత బాగాలేక పోయినా చెప్పేది కాదు. ‘‘ఎట్లా ఉంది మీ అమ్మ’’ అని ఒక్క మాట పొరపాటున కూడా అడగడు. అదొక తత్వం అని తను మరోలా ఆలోచించేది కాదు. ఈసారి ఎక్కువ రోజులు… జరగదు… కనీసం నాలుగు రోజులయినా ఖచ్చితంగా ఉండాలి.

చిన్నపాప, పెద్దపాప పుట్టినప్పుడు తన తల్లే వచ్చి ఎంతో సహాయంగా ఉంది. ఆమె చేసే వంటలు తిని మెచ్చుకుని, అది చెయ్యండి, ఇది ఇలా చేస్తే అని ఆర్డర్లు పాస్‌ ‌చేసి మరీ చేయించుకుని తిని అమృతహస్తం అని పొగడి పారేసేవాడు. వాళ్ల అమ్మానాన్నలు పెద్ద పాప పుట్టినప్పుడు వస్తే ఆర్డర్లు వేస్తున్నా నవ్వుకుంటూ బండ చాకిరీ చేసి, బిడ్డకోసం రాత్రంతా మేలుకుని, తనను చూసుకుంటూ ఎలాంటి పరిస్థితుల్లోను విసుగు కనిపించనిచ్చేదికాదు. పద్ధతి శుభ్రత ప్రాణం తల్లికి. అవే తెలియవని ఎదురుగానే ఎగతాళిగా మాట్లాడే వాడు భర్త. తను బాధ పడు తుంటే వోదార్చేది. అంత పక్షపాతంగా, భర్త ఉన్నాడే అని బాధవేసినా సర్దుకు పోయేది. కానీ ఇప్పుడు కాదంటే మాత్రం…?

భర్త ఎప్పుడూ తన ఇంటి వాళ్ల మాటలే. ‘‘వాళ్లకేమండి, మీ అక్కలు, అన్నలు అక్కడే ఉన్నారు. అందులోనూ సిటీలో ఉన్నారు. ఆరోగ్యం బాగా లేక వస్తే మంచి సదుపాయాలు ఉన్నాయి. అమ్మకే ఏం లేవు. మనం తప్ప.’’ అని ఎప్పుడైనా అంటే ,‘‘మీ అమ్మను ఉన్నది అమ్మేసి పిల్లల మీద వేసి సిటీకి వచ్చి ఉండకూడదా? ఏదైనా జరిగితే ఎవరినైనా నర్సునో, కేర్‌ ‌టేకర్నో పెట్టిద్దాం’’ అనే వక్రపు సలహాలిచ్చి దిక్కులేని దాన్ని చేసే వాడు. ‘‘మనం ఉన్నాం’’ అనే మాట వచ్చేది కాదు.

‘‘ఇంకా కాలేదా? చేస్తూనే ఉంటావు రోజులు తరబడి’’ అంటూ సూటు కేసులన్నీ జిప్పులు వేసి అలిసి పోయి నట్లు చూసాడు.

‘‘ఏవండి! అమ్మకు కాల్షియం, విటమిన్స్, ‌డైఫ్రూట్స్ ‌తీసుకెళ్లాలండీ•. కాస్కోకు వెళదాం.’’

‘‘మొన్ననే వెళ్లొచ్చాం కదా! మీ అత్త మామలకు, అన్నా ఆడ బిడ్డలకు, అన్నీ కొన్నాము కదా! బోలెడు పని ఉంది. ఇప్పుడు కాదు.’’

అందులో మా అమ్మను చేర్చలేదండి అనబోయి, ‘‘అవన్నీ హైదరాబాద్‌లో దొరకవని మీరు కొన్నవండి. అడిగితే, దీనికే బోలెడు అయిపోయింది. మళ్లీ వస్తామురా! లేటు అయిపోయింది’ అని తొందర చేసి తీసుకొచ్చేసారు’’ తనకు తెలుసు ఇప్పుడు హైదరాబాద్‌లో విదేశాలలో దొరకేవీ అన్నీ దొరుకుతాయి. బస్తాలకు కొన్నాడు చెత్తా చెదారం. నోరు మెదప లేదు ధార్మిక.

అతను గిల్లిన బుగ్గ ఇప్పుడు మంట అనిపిం చింది. నొప్పికూడా ఉంది. అద్దం దగ్గరకు వెళ్లి చూసుకుంది. ఎర్రగా కమిలి గాటు పడి ఉంది. అబ్బ ఇంత గట్టిగా గిల్లాడా? కసితో చేసినట్లుంది ప్రేమతోకాదు అని నిర్ణయానికి వచ్చింది. ఊ.. మచ్చ మాసిపోతుంది నొప్పి తగ్గి పోతుంది. మనసుకు కష్టం, ఇష్టం కలిగినప్పుడు దాచుకోనున్న హృదయం, జ్ఞాపకం చేసి ప్రతీకారం తీసుకోవడానికి ప్రయత్ని స్తుంది. కానీ మన అనుకునే మన్నింపు, పోనీలేస్తూ అనే క్షమాగుణం, చిటికెడు ఓర్పు చాలు నూరేళ్ల సుఖసంతోషాల అన్యోన్య దాంపత్యానికి! ఇది సత్యం, తన నమ్మకం అనుకున్నది ధార్మిక.

‘‘రెండు రోజులు తరువాత వస్తాం అని చెప్పనా? ఇప్పటికి పదిసార్లు అడిగింది అల్లుడుగారు ఎలాగున్నారు? సరిగ్గా భోజనం అది చేస్తున్నారా. నువ్వు సరిగ్గా చూసుకుంటున్నావా అని ’’

‘‘చూద్దాం. అక్కడకు వెళ్ళిన తరువాత ఆలోచి స్తాము. కోవిడ్‌ ఇం‌కా ఆ ప్రాంతంలో ఉందో లేదో తెలుసుకోవాలికదా! అందునా పిల్లలు..?’’

ధార్మిక ముఖంలో కలిగిన మార్పును చూసి,’’ పోనీ నువ్వొక్కదానివే వెళ్లిరా’’ అన్నాడు.

‘‘రమ్మన్నదే మిమ్మల్ని, మనమరాళ్లను చూడ డానికి. నా కోసం కాదు.’ అసంతృప్తిని చూపించింది.

‘‘ఆహ! నువ్వు తపిస్తున్నావుకదా!’’

వచ్చిన కోపాన్ని అణచుకుంటూ ,’’ తల్లి అండీ. తన పెగుతెంపి నాకు ప్రాణం పోసింది ’’అంది ధార్మిక.

‘‘నిర్వాణం చెందడానికి దర్శించుకుంటు న్నావా?’’ అని ఎగతాళిగా అన్నాడు.

అర్థ్ధం కూడా తెలియదు ఇతనికి అనుకుంటూ,’’ అవును!! నిర్వాణం కాదు తల్లి ఒడిలో నిర్యాణం   చెందడానికి మిమ్మల్ని తీసుకు వెళుతున్నాను. అలా గయినా మీకు అహంకారం నశించి మోక్షప్రాప్తి కలిగిం చాలని.’’ అంది.

‘‘అంత దుర్మార్గుడ్నా నేను. నిర్యాణంకి నిర్వాణానికి అర్థం ఏవిటో ?’’ అని కోపం తెచ్చుకున్నాడు తన తెలివి తక్కువతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి.

‘‘మీకు బోధ చెయ్యలేను. బుద్ధిజం తీసుకోండి తెలుస్తుంది. నిర్యాణం అంటే నేను మీకు భార్యనైనాను కదా అదీ… రాత.. విధి!!’’ చావు అనలేక పోయింది. ‘‘నిర్వాణం అంటే రాగ, ద్వేష మోహాలు అధిగమించి పరమపథం చేరేది, పరిపూర్ణ ఆనంద స్థితి. అదే మోక్షం, అదే అంతిమ సంస్కారం మానవులకు. తల్లిని చూడాలంటే ఇన్ని అడ్డ ప్రశ్నలు వేస్తున్న మీకు దక్కనివి.’’

‘‘అంటే నన్ను చంపి మోక్షప్రాప్తి కలిగిస్తావా?’’

‘‘మా ఇంటిలో అడుగు పెడితే ఇప్పుడు మీకున్న ‘నా ‘ అనే అహంకారం , పక్షపాతం అనే అజ్ఞానం నశించి ‘మనం’ అనే జ్ఞానోదయం కలిగి మోక్షాన్ని మీకు కలగ చెయ్యాలని, నేను తరించాలని.’’

‘‘ఏం మాట్లాడుతున్నావు నువ్వు. నేను ఆమె కాళ్లకు నమస్కారం చెయ్యాలా ? ఎవరనుకున్నావు నన్ను? మా వంశం ఎలాంటిదనుకున్నావు.’’

‘‘అందుకే కదా తెలియక నన్ను ఇచ్చింది.’’

కోపంతో ఉడికి పోయాడు శ్రీనాథ్‌. ‘‘ఏం ‌మరీ తెగించేసావు. వదిలేస్తావా?’’

‘‘తల్లిని తండ్రిని చూడాలంటే ఆంక్షలు పెట్టిన అర్ధనారీశ్వరుని దగ్గర జగన్మాత కూడా ఉండ లేదు.’’

‘‘అందుకే కదా తగలబడి బూడిదయ్యింది.’’

‘‘బూడిదయ్యి విశ్వమాతగా వెలిసింది. శివుని అధినాయక అయ్యింది.’’ నిర్మొహమాటంగా అంది.

ఏం మాట్లాడాలో తెలియక కోపంతో ,’’ చాల్లే ! నేర్చావు. మనం వెళ్లేది నాలుగు రోజులు మన వాళ్లతో గడిపి రావడానికి. దేశమంతా తిరిగి రావడానికి కాదు.’’

‘‘అందులో మా అమ్మ లేదా?’’

‘‘ఎదిరించకు.అమ్మ శిక్షణ!! నేను ఆలోచించి ఉన్నాను. నువ్వు అడ్డు ప్రశ్నలు వెయ్యకు. ఆ పల్లెలకి పిల్లలు వద్దు. వీలుంటే ఆమెను ఇక్కడికే తీసుకురా! మొండి అవతారాలు ఎత్తకు’’ చాలా చిరాగ్గా అన్నాడు.

‘‘ఎందుకు? మీరు అంటరాని దానిగా పెట్ట డానికా? ఇలాగయితే నేను ఇండియాకే రాను. వెళ్లి మీ స్నేహితులతో, మీ కొంపలోని బడుద్దాయిల గుంపుతో తాగి తందనాలాడండి’’ అని వస్తున్న కోపాన్ని, బాధను అణుచుకోలేక సర్దుతున్న సూటుకేసులు అక్కడ వదిలేసి లోపలి వెళ్లిపోయింది ధార్మిక.

‘‘పిల్లల్ని వదిలేసి రెండు రోజులు పొమ్మన్నాను కదా! వాళ్లకేం తోస్తుంది’’ వాళ్లను చూపించాలని, అంతులేని ఆత్మవిశ్వాసం, ప్రశాంతత దొరికే అమ్మ ఒడిలో తను వొదిగి పోవాలని వెళుతుంది. తోచక పోవడం ఏవిటి? ఒప్పలేని తనం, మొగుడు అనే దర్పం గాకపోతే! ఇంటి చుట్టూ సాయంత్రం, ఉదయం పక్షులు వినిపించే మధుర సంగీతం చాలు వాళ్లను వాళ్లు మరిచి పోవడానికి. గింజలేస్తే పరుగెత్తుకు వచ్చే కోళ్లు, పావురాళ్లు చాలు పది కాలాలు మదిలో మధుర తలపులు నిలపడానికి. ఉదయం కాబోతుంది అని తట్టి లేపే కోడికూత చాలు మనసు మురిసి పోవడానికి. ఆవుపాలు పితుకుతూ ఉంటే మైమరచి చూస్తూ ‘‘ఎలావస్తా యమ్మా అన్నీ మన తీసుకుంటే పాపం తన బిడ్డకో’’ అని అడిగే అమాయక ప్రశ్నలు చాలు కోటిజన్మలు గుర్తుంచు కోవడానికి. పాలు తాగి గంతులు వేస్తూ పరుగులు తీసే బుజ్జాయిలను పట్టుకోవడానికి వెంటపడే చిలిపి పంతాలు చాలు పదిల పరచడానికి మధురస్మృతుల నిఘంటువుగా!

రణగొణ ధ్వనులతో బయలుదేరినా ఇద్దరూ సర్దుకున్నారు. వారం రోజులు వాళ్లు వీళ్లు రావడం, తను తెచ్చినవి ఇవ్వడం. ‘‘ఓస్‌ ఇవా! మావాడు నాలుగు సంవత్సరాల క్రితమే ఇక్కడే కొన్నాడు’’ అని ముఖ మీద అనడం, ముడుచుకు పోవడం గమని స్తూనే ఉంది ధార్మిక.

రెండు వారాలకనే వచ్చారు. వారం అయిపోయి రెండో వారం గడిచి పోతోంది. రెండు మూడుసార్లు జ్ఞాపకం చేసింది. పోదాం పోదాం.. వాళ్లు వస్తానన్నారు.. వీళ్లు రావాలి అనే జవాబుకు కోపం ఆత్రుత ఎక్కువ అయిపోతున్నా ‘‘తీసుకొని వెళతాడులే’’ అనే ఆశతో అణుచుకొని ఉండింది. పిల్లలు మరీ అడగటం మొదలు పెట్టారు. ఇక లాభం లేదని తెగించింది. ఇప్పుడు అసలు జవాబే లేదు. ఒక్క చూపు చూసి వదిలేస్తున్నాడు.

‘‘మీరు వచ్చినా రాకపోయినా మేము వెళుతున్నాం.’ అని బట్టలు సర్ది తయారయింది. గుర్రుగా చూస్తున్న భర్తను పట్టించుకోలేదు ధార్మిక.

‘‘చెప్పేది ఎందుకు అర్థం చేసుకోవు? అక్కడంతా కోవిడ్‌ ఇం‌కా ఉందంట. అందులోనూ విషజ్వరాలు ఎక్కువగా ఉన్నాయంట. రెండు రోజుల్లో బయలు దేరబోతూ కొని తెచ్చుకోవడం అవసరమా? నీకేమ యినా వస్తే తట్టుకోలేవు. పోగానే పని…?’’ వద్దని చెప్పక ఇదొక వక్రపు ప్రేమ. ఇంత అక్కర ఎప్పుడూ చూపించలేదు.

‘‘లేదు. నేను కనుక్కున్నాను. అక్కడ అలాంటివి ఏం లేవంట. ఇక్కడే ఇంటి చుట్టూ?’’

‘‘అంటే నేను అబద్దం చెపుతున్నానా? నా బిడ్డల ప్రాణాలకు పరీక్ష పెట్టలేను.’’

‘‘కన్నదాన్ని నేను! ప్రశ్నపత్రం నేనే రాస్తానులే!’’

‘‘మాటకు మాట చెపుతావా? వెళ్లడానికి లేదు.’ అంటూ ప్యాక్‌ ‌చేసిన వస్తువులన్నీ లోపలికి విసిరేసాడు.

కోపం, బాధ ఒక్కసారిగా పెల్లుబికాయి. తట్టు కోలేని అసంతృప్తితో కన్నీళ్లు పొంగుకొచ్చాయి. అప్పటికీ అదుపు చేసుకుంటూ, ‘‘తల్లి అండి! ఎదురు చూస్తూ ఉంది. ఇంత దూరం వచ్చి…? బాధపెడితే పుట్టగతులుండవు. ఎంత సంతోష పడుతుందో ! పిల్లల కోరిక తీరినట్లు ఉంటుంది.’’

‘‘ఏం శపిస్తుందా?’’

‘‘మరీ తెగించినట్లు మాట్లాడుతున్నారండి. దయ చేసి మీరూ రండి. రెండు రోజులుండి వచ్చేస్తాము.’’

‘‘ఇంత దూరం వచ్చిన తరువాత నన్ను కాదని వెళ్లావంటే తిరిగి రానవసరం లేదు.’’

మాట్లాడలేక అతని మూర్ఖత్వానికి ఆసహ్యించు కుంటూ, తన అశక్తతకు కుమిలి పోతూ చాలా సేపు ఆలోచిస్తూ తనను తాను అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండిపోయింది. మళ్లీ ఇక్కడకు రాలేము, ఇంత కర్కోటకంగా తల్లిని చూడకూడదు అనే దుర్మార్గపు మనస్తత్వమేమిటి? ఇంత ఆదర్శవ ంతుడి కోసం నా తల్లి మనసు, పిల్లల తీపి జ్ఞాపకాలు, నా తల్లి ఒడిలోని స్వర్గాన్ని, జన్మకు విముక్తిని, వదులు కోవాలా? తన నిర్యాణం-విధి రాసిపెట్టింది అదే అయితే నా జన్మకు నిర్వాణం – చావుకు పుట్టుకకు సార్థ్ధకత మోక్షం అదే!! అమ్మ ఒడికంటే మిన్న ఏముంది? అల్లకల్లోలంగా కదిలిపోతున్న మనసును, స్థిమిత పరుచుకుని గట్టి నిర్ణయానికి వచ్చింది.

‘‘బిడ్డల్ని తీసుకుని నేను వెళుతున్నాను.’’ విసు రుగా ఒక చూపు చూసి బిడ్డల చేతుల్ని పట్టుకుంది.

అడ్డువచ్చే, దెబ్బతిన్న అహంభావాన్ని తృప్తి పరచలేక, రగిలి పోతూ,’’ నా బిడ్డల్ని తీసుకు పోవ డానికి వీల్లేదు.’’ అన్నాడు కసిగా అసహ్యంగా చూస్తూ.

‘‘నువ్వు మోసావా- కన్నావా- పెంచావా?’’ అదుపు చేసుకోలేక అరిచేసింది ధార్మిక.

‘‘తిరిగి రాలేవు.’’

‘‘ఆ మాట నేను అనలేదే! మిమ్మల్నీ రమ్మం టున్నాను.’’

సమాధానం తెలియక, ‘‘ఎంత పొగరు’ అంటూ చేయి పైకెత్తాడు.

‘‘మర్యాదగా ఉండదు.’’ అని ఒక్క చూపు చూసి నిమిషం కూడా నిలవక కారెక్కింది ధార్మిక.

ఆ చూపులోని తీక్షణతకు, దృఢ నిశ్చయానికి భయపడిపోయి నిలిచిపోయాడు శ్రీనాధ్‌. ‌భర్తను బాధపెట్టానే అని మనసు విలవిలలాడింది. కానీ తల్లిని సంతోష పెట్టకపోతే తన జన్మకు అర్థం లేదు.

‘‘నాస్తి మాతృ సమా ఛాయా; నాస్తి మాతృ సమాగతిః; నాస్తి మాతృ సమం త్రాణం నాస్తి మాతృ సమప్రియా!!’’

 ‘‘జీవితాన్ని ప్రసాదించిన తల్లిని మించిన దైవం లేదు. కష్టాలలో తల్లిని మించిన నీడ లేదు. తల్లిని మించిన గురువు లేడు. తల్లిని మించిన క్షమా హృదయం లేధు’’ అనే స్కంద పురాణంలోని శ్లోకం ముందు నిలిచి, మనసును స్థిమిత పరుచుకుని పిల్లల్ని ఒడిలో దాచుకుంది.

About Author

By editor

Twitter
YOUTUBE