బడ్జెట్‌ 2023 ‌ప్రత్యేకం

లంకా దినకర్‌, B.com.,F.CA.

ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రతి బడ్జెట్‌ ‌ప్రతి సందర్భంలోను ప్రత్యేకమైనదే. ఇది దేశ ఆర్థిక విధానానికి సంబంధించి గతం నుండి భవిష్యత్తుకు బాటలు వేసే వర్తమాన వసూళ్లు, చెల్లింపుల అంచనాల చిట్టా. గత వాస్తవాల పరిగణనతో భవిష్యత్తును అంచనా వేయడం శాశ్వతంగా కొనసాగే పక్రియ.  రాబోయే బడ్జెట్‌ 2023-24 ‌పైన కూడా గత 8 సంవత్సరాల నరేంద్ర మోదీ పరిపాలన ప్రభావం స్పష్టంగా ఉంటుంది. అందువల్ల, బడ్జెట్‌ 2023-24‌కు  సంబంధించి మూడు భాగాలుగా చూస్తూ, అన్ని ముఖ్య అంశాలను విశ్లేషించుకోవాలి. రాబోయే కేంద్ర బడ్జెట్‌ ‌కాల పరిమితి పూర్తయ్యే నాటికి దేశం 2024 సాధారణ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉంటుంది. ఈ వాస్తవంతో పాటు, కరోనా ప్రభావం, ప్రపంచ ఆర్థిక మందగమనం, ఉక్రెయిన్‌-‌రష్యా యుద్ధం, వస్తు,సేవల సరఫరా గొలుసుకు అంతరాయం కలుగుతున్న ప్రస్తుత పరిస్థితులు కూడా పరిగణనలోనికి వస్తాయి. వీటన్నిటి కారణంగా జాతీయ అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషకుల మదింపుతో పాటు, అధికార విపక్షాలకు కూడా రాబోయే బడ్జెట్‌ ‌పైన ప్రత్యేక దృష్టి ఉంది.

 ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మొదటి దఫా (2014-2019)లో పాలనకు సంబంధించి ముఖ్య నిర్ణయాలను ప్రణాళికా బద్ధంగా అమలు చేసింది. నమో 2.0లో ప్రవేశపెట్టిన కొత్త పథకాలు, ప్రాజెక్టులతో పాటు 1.0లో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు కూడా కొనసాగుతాయి. నమో 2.0లో పేదలకు అవసర మైన ప్రాథమిక సౌకర్యాల కోసం అన్ని రకాల అవస్థాపన సదుపాయాలు సృష్టించేందుకు శ్రద్ధ చూపుతున్నది. మరోవంక దేశ ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నది. మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ముందు 2011-12 ధరల ఆధారంగా 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాలకు వృద్ధి రేటు 5.1%, 6.9%గా ఉంది.

నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి  చేపట్టిన కార్యక్రమాల క్రమాన్ని ఒకసారి గమనిం చాలి. మొదటగా గ్రామీణ భారత దేశంలో 100% బహిరంగ మూత్ర, మల విసర్జన నిర్మూలన కోసం (ODF) చేపట్టిన చర్యలు. ఇవి అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం పారిశుధ్యం కోసం ప్రతి గృహానికి మరుగు దొడ్లు ఏర్పాటు చేయడానికి స్వచ్ఛ భారత్‌ ‌మిషన్‌ (‌గ్రామీణ్‌) ‌కింద ఈ పథకం అమలు చేశారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్‌ 2, 2014‌న మోదీ ప్రారంభించారు. డిసెంబర్‌ 2, 2022 ‌నాటికి 100% బహిరంగా మూత్ర, మల విసర్జన నిర్మూ లించుకున్నవి (ODF)గా దేశంలోని 1,34,396 గ్రామాలను ప్రకటించారు. ఆ వెంటనే, ప్రధానమంత్రి ఆవాస్‌ ‌యోజన (PMAY) అర్బన్‌ ‌కింద పేదలకు గృహనిర్మాణాన్ని ఫ్లాగ్‌షిప్‌ ‌మిషన్‌గా జూన్‌ 25, 2015‌న కేంద్రం ప్రారంభించింది. ఇందులో భాగంగా మొత్తం 8.31 లక్షల కోట్ల పెట్టుబడితో ఇప్పటి వరకు దేశంలో 1.23 కోట్ల గృహాలను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో కేంద్రం తన వాటాగా మంజూరు చేసిన నిధులు రూ.2.03 లక్షల కోట్లు. అందులో ఇప్పటివరకు రూ.1.30 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేయగా, 1.07 కోట్ల ఇళ్లు గ్రౌండింగ్‌ అయ్యాయి. దాదాపు 65.50 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అంటే 60% కంటే ఎక్కువ గ్రౌండింగ్‌ అయిన గృహాల నిర్మాణం ఇప్పటివరకు పూర్తయింది.

మరొకటి- ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై). కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 10.74 కోట్ల కుటుంబాలకు చెందిన 50కోట్ల మందికి నాణ్యమైన ఆరోగ్యసేవలను అందించే ఉద్దేశంతో సెప్టెంబర్‌ 23, 2018‌న పీఎం-జేఏవైని ప్రధాని మోదీ ప్రకటించారు. ఈ పథకం క్రింద మార్చి31, 2022 నాటికి దాదాపు 18 కోట్ల మందికి ఆయుష్మాన్‌ ‌కార్డులు అందించారు. 3.63 కోట్ల మంది ఆసుపత్రులలో వైద్యసేవలు పొందారు. వీరి కోసం నెట్వర్క్ ఆఫ్‌ ఎం‌పానెల్డ్ ‌హెల్త్‌కేర్‌ ‌ప్రొవైడర్ల నుండి రూ.40,000 కోట్ల మేరకు నిధులు విడుదలయ్యాయి. అర్హులైన పేద లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనం నేరుగా నగదు బదిలీ చేయడం కోసం జన్‌ధన్‌ ‌యోజన కార్యాచరణ చేపట్టారు. ఈ నిర్ణయంతో డిసెంబర్‌ 2, 2022 ‌వరకు 47.51 కోట్ల ఖాతాలకు నగదు బదిలీ ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరం నుండి డైరెక్ట్ ‌బెనిఫిట్‌ ‌ట్రాన్స్ఫర్‌ ‌కింద రూ.26.02 లక్షల కోట్లు లబ్ది పొందారు. ఇది కాకుండా, ఏప్రిల్‌ 8, 2015 ‌నుండి డిసెంబర్‌ 2, 2022 ‌వరకు 10 లక్షల రూపాయల వరకు కార్పొరేట్‌ ‌కాని మైక్రో ఎంటర్‌ ‌ప్రైజెస్‌ ‌కోసం ప్రధానమంత్రి ముద్ర యోజన కింద అందించిన రుణాల సంఖ్య 37.76 కోట్లు కావడం గమనార్హం.

ఇవేకాకుండా, మోదీ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు, గ్రామీణ భారత్‌ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. కేంద్ర ప్రభుత్వం 2014 నుండి 2019 వరకు గ్రామీణ అభివృద్ధి కోసం వివిధ రూపాలలో రూ. 4.50 లక్షల కోట్లకు పైగా సబ్సిడీ కింద అందించింది. అదే సమయంలో అంతర్జా తీయంగా వచ్చిన మార్పులతో ఎరువుల ధరలు అసాధారణంగా పెరగడంతో కేంద్రం ఎరువుల సబ్సిడీని అదనంగా రూ.83 వేల కోట్లకు పెంచవలసి వచ్చింది. అలాగే, వ్యవసాయోత్పత్తుల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ముఖ్యంగా వరి రైతుకు కనీస మద్దతు ధర 2022-23 సంవత్సరానికి క్వింటాల్‌కు రూ.2,040గా నిర్ణయించిన సంగతి విదితమే. ఇది 2014-15 సంవత్సరంతో పోలిస్తే 50% అధికం. మరి గోధుమ విషయానికొస్తే, 2023-24లో కనీస మద్దతు ధర రూ. 2,125గా నిర్ణయించారు. ఇది 2013-14 సంవత్సరంతో పోలిస్తే 57.4% అధికం. పొద్దు తిరుగుడు నూనె విత్తనాలకు కనీస మద్దతు ధర రూ. 6,400/- గా 2022-23 సంవత్సరానికి(71%) కేంద్రం పెంచింది. ఇంకా, ఫసల్‌ ‌బీమా యోజనలో భాగంగా 2018 నుండి డిసెంబర్‌ 2, 2022 ‌వరకు 11.42 కోట్ల మంది రైతులు పేరు నమోదు చేసుకొని 25,186 కోట్లు ప్రీమియంగా చెల్లించారు. వాస్తవానికి బీమా కంపెనీలు నుండి రైతులకు వచ్చిన క్లెయిములు రూ.1,25,662 కోట్లు. అంటే ప్రీమియం కన్నా 5 రేట్లు అధికంగా క్లెయిములు రావడం గమనార్హం. అక్టోబర్‌ 31, 2022 ‌నాటికి గత ఆరు సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకం కింద గరిష్ట ప్రీమియంను భరిస్తున్నాయి. ఇది కాకుండా ప్రధానమంత్రి కిసాన్‌ ‌సమ్మాన్‌ ‌నిధి యోజన ద్వారా ప్రతి రైతుకు సంవత్సరానికి రూ. 6,000, మొత్తం 11.37 కోట్ల మంది రైతులకు ఇప్పటి వరకు 12 విడతల్లో రూ.2.16 లక్షల కోట్ల• కేంద్రం అందించింది. గ్రామీణ అనుసంధాన మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి 2014-15 నుండి ప్రధానమంత్రి గ్రామ్‌ ‌సడక్‌ ‌యోజన కింద విరివిగా రోడ్లు మంజూరయ్యాయి. గత 8 సంవత్సరాలుగా ఇందుకు రూ.1.72 కోట్లకు పైగా ఖర్చు చేశారు.

గ్రామీణ భారత దేశంలో నివసించే ప్రజలకు కనీస ఉపాధిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 2014-2019 సంవత్సరాల మధ్య రూ.2.70 లక్షల కోట్ల•, ఆ తర్వాత వరుసగా రూ.68,266 కోట్లు, రూ. 1,11,671 కోట్లు, రూ.1,00,399 కోట్లు 2019-20, 2020-21, 2021-22 సంవత్సరాలలో ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ 2022 – 23‌లో 5.38 కోట్ల గ్రామీణ కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చడానికి 211 కోట్ల పని దినాలకు 15.49 కోట్ల ఉపాధి హామీ కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో రూ. 73,000 కోట్లు కేటాయిం చారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరాంతానికి 1 లక్ష కోట్ల రూపాయలకు పైగా వాస్తవ వ్యయాన్ని చేరుకోవచ్చని అంచనా. అత్యంత కీలకమైన జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) అమలు ఎలా ఉంది? నమో 1.0 పాలనలో మొదటి 5 సంవత్స రాలకు (2014-2019) 80 కోట్ల మంది దార్యిద్ర రేఖ దిగువున ఉన్న కుటుంబాలకు చెందిన వ్యక్తిగత లబ్ధిదారుల ప్రయోజనం కోసం రూ. 5,54,871 కోట్ల విలువైన ఆహార సబ్సిడీని కేంద్రం విడుదల చేసింది. అదే 2004-2014 మధ్య యూపీఏ పాలనలో విడుదలైనది రూ. 5,15,963 కోట్లు మాత్రమే.

ఇంకా, దార్యిద్ర రేఖ దిగువున ఉన్న కుటుంబాల లోని మహిళల సౌలభ్యం కోసం డిసెంబర్‌ 2, 2022 ‌వరకు పిఎం ఉజ్జ్వల యోజన కింద 9.57 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. గ్రామ ప్రాంత గృహాలకు 100% విద్యుద్దీకరణ లక్ష్యంతో 2.82 కోట్ల ఇళ్లకు సౌభాగ్య – ప్రధానమంత్రి సహజ్‌ ‌బిజిలీ హర్‌ ‌ఘర్‌ ‌యోజన కింద విద్యుద్దీకరించారు. అక్టోబరు, 2017 నుండి ఇప్పటి వరకు 36.87 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు ఉన్నత్‌ ‌జ్యోతి (ఉజాలా) కింద అందరికీ అందు బాటులో ఉంచారు. ఇంకా, ఆదాయపు పన్ను తగ్గింపుతో పాటు అనేక ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం అందించినందున రాబోయే తరం వ్యాపార వేత్తలను ప్రోత్సహించడంతో అంకుర పరిశ్రమల (స్టార్ట్ అప్‌ ఇం‌డియా) కార్యక్రమం విజయవంత మైంది.

నల్లధనం, నకిలీ కరెన్సీని నియంత్రించడం కోసం నోట్ల రద్దు (డీమోనిటైజేషన్‌) అనంతర ప్రభావాన్ని విశ్లేషిస్తే అనేక వాస్తవాలు బహిర్గతం అవుతాయి. ఎందుకంటే నేడు ప్రపంచంలోనే డిజిటల్‌ ‌కరెన్సీ లావాదేవీలలో భారత్‌ ‌నంబర్‌ 1 ‌స్థానంలో ఉంది. ఆదాయపు పన్ను రిటర్న్ ‌దాఖలులో గణనీయమైన వృద్ధి ఉంది. మనం గమనిస్తే, చాలా కాలంగా వేచి ఉన్న జీఎస్టీ అమలు దేశానికి రికార్డు స్థాయిలో ప్రయోజనాలు అందిస్తోంది. నెలకు దాదాపు రూ.1.45 కోట్ల జీఎస్టీ వసూళ్లు అంటే ఆషామాషీ కాదు. గత సంవత్సరంగా ప్రత్యక్ష , పరోక్ష పన్నుల వసూళ్లలో అనుకూలమైన వృద్ధిని దేశం నమోదు చేసింది. నరేంద్ర మోదీ అంచనాల ప్రకారం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల వసూళ్లు రెండూ లక్ష్యాలను అనుకూలంగా చేసుకుంటున్నాయి. పన్ను చెల్లింపుదారుల ప్రయోజనాల కోసం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకు రావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఇతర దేశాలకు భారత్‌ ‌మీద ఉన్న విశ్వాసం, అంతర్జాతీయ సోదరభావాలతో భారత్‌ ‌బ్రాండ్‌ ఇమేజ్‌ను అత్యంత సానుకూలంగా మార్చడంలో నరేంద్ర మోదీ విజయ వంతమయ్యారు. ఇతర దేశాలతో విజయవంతమైన వ్యూహాత్మక, దౌత్య విధానానికి నమో 1.0 పాలనలో అనుసరించిన తీరు దోహదపడింది. నాణ్యమైన మానవ వనరుల వృద్ధికి ప్రధాని మోదీ అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ప్రధాని ఆదేశాల మేరకు ప్రాథమిక విద్య నుండి పోస్ట్ ‌గ్రాడ్యుయేషన్‌ ‌వరకు దేశంలో కొత్త విద్యా విధానం కోసం లోతుగా అధ్యయనం జరిగింది. విద్యార్థులకు ప్రాంతీయ భాషలలో కోర్సులు అందించడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలను పెంచేందుకు నూతన విద్యావిధానంలో ప్రాధాన్యం ఇచ్చారు. విద్య ప్రమాణాలు పెంచేందుకు సమగ్ర శిక్షా అభియాన్‌, ‌యూజీసీకి నిధుల కేటాయింపు ద్వారా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు నడుం కట్టారు. ఆ విధంగా ఉత్తమ అభ్యాసాలతో సానుకూల వాతావరణాన్ని సృష్టించాలన్న ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది. స్కిల్‌ ఇం‌డియా, డిజిటల్‌ ఇం‌డియా ద్వారా ప్రధాని అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా విద్య, నైపుణ్య నాణ్యతను వృద్ధి చేయడం కోసం అడుగులు వేశారు. అలాగే ఉపాధి అవకాశాలను సృష్టించడానికి మేక్‌ ఇన్‌ ఇం‌డియాతో మన ఉత్పత్తులు, సేవలకు స్వయం సమృద్ధితో పాటు మరింత మెరుగైన అంతర్జాతీయ మార్కెట్‌ ‌సృష్టి కోసం ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ను జోడించారు.

నమో 1.0కి ముందు మన్మోహన్‌ ‌సింగ్‌ ‌నేతృత్వం లోని యూపీఏ సంకీర్ణ ప్రభుత్వంలోని మంత్రులు, ఇతర ప్రతినిధులపై భారీ అవినీతి ఆరోపణలు, రాజీపడిన సంకీర్ణ ప్రభుత్వ విధానాలతో పాటు ఆర్థికవ్యవస్థపై ప్రపంచ సవాళ్లు ప్రభావం చూపాయి. ప్రస్తుతం ఉన్న కరోనా, ఉక్రెయిన్‌-‌రష్యా యుద్ధం వంటి సవాళ్లతో పాటు, యూకే బ్రెక్సిట్‌, అమెరికా, యూరోపియన్‌ ‌దేశాల ఆర్థిక వ్యవస్థ మందగమనం మన ఆర్థిక వ్యవస్థకు అతిపెద్ద సవాళ్లుగా మారాయి. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు-పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ గురించి ప్రత్యర్థులు విమర్శలు సంధిస్తున్నప్పటికీ వాస్తవాలు వేరుగా ఉన్నాయి.

2009-10, 2013-14 మధ్య జీడీపీ సగటున 6.70%, అయితే 2014-15, 2018-19 మధ్య 7.38%గా ఉన్నమాట వాస్తవం. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ తీరుని పరిశీలించిన తర్వాత, ఈ ప్రభుత్వం అంత్యోదయ ఆధారంగా సంక్షేమ పథకాల అమలు, ఆర్థికాభివృద్ధి కోసం ప్రాజెక్టులతో సమ్మిళిత స్థిరమైన వృద్ధిని సాధించడం కోసం సంతృప్త స్థాయి చేరుకునే వరకు కొనసాగుతుంది. అందువల్లనే దేశంలో సంక్షేమ పథ కాలు, అభివృద్ధి ప్రాజెక్టు నిరంతరాయంగా కొనసాగు తున్నాయి. ఇక నమో 2.0 సమయంలో ఇప్పుడున్న పరిస్థితుల డిమాండ్లకు అనుగుణంగా అదనపు కార్యక్రమాలతో పాటు నమో 1.0 పాలన ప్రభావం 2023-24 బడ్జెట్‌ ‌మీద ఉండి తీరుతుంది.

About Author

By editor

Twitter
YOUTUBE