– డాక్టర్ పార్థసారథి చిరువోలు
కరోనా కోరల్లో చిక్కుకుని చైనా విలవిల్లాడుతోంది. ఒమిక్రాన్ బీఏ-5 ఉత్పరివర్తనం బీఎఫ్ 7 ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మొదట నుంచి కొవిడ్ నియంత్రణలో చైనా అనుసరిస్తున్న తీరు ప్రజలకు శాపంగా మారింది. తాజాగా అక్కడ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. బాధితులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయి. వైద్యసేవలపై ఒత్తిడి పెరుగుతోంది. చాలా ప్రాంతాల్లో మృత్యుఘోష వినబడుతోంది. శ్మశాన వాటికల్లో రద్దీ పెరిగి పోయింది. నేషనల్ హెల్త్ కమిషన్ అనధికార అంచనా ప్రకారం గడచిన డిసెంబర్‌లో మొదటి 20 రోజుల్లోనే దేశంలోని దాదాపు 250 మిలియన్ల మంది బీఎఫ్-7 బారిన పడ్డారు. అంటే ఆ దేశ జనాభాలో అది 18 శాతం. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. కేసుల విషయంలోగానీ, మరణాల విషయంలో గానీ బాహ్య ప్రపంచానికి వాస్తవాలు తెలియకుండా చైనా మసిపూసి మారేడుకాయ చేస్తోంది. దాని పీక మీద ప్రపంచ దేశాల ఆంక్షల కత్తి వేలాడుతోంది.
ఈ శీతాకాలంలో చైనా మూడు ‘వేవ్’ల బారిన పడనుందన్న ఆరోగ్య, వైద్యరంగ నిపుణుల హెచ్చరికలు కలవరపరుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న వేవ్ ఈ నెల మధ్యవరకూ కొనసాగుతుందని, జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి మధ్య వరకూ రెండో వేవ్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. జనవరి 21న లూనార్ న్యూ ఇయర్ హాలిడే. ఈ సందర్భంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా స్వగ్రామాలకు వచ్చి కుటుంబా లను కలుసుకోవటం ఆనవాయితీ. ‘లార్జెస్ట్ యాన్యువల్ మైగ్రేషన్’గా దీనిని చెబుతారు. బస్సులు, రైళ్లు, విమానాలు ప్రయాణికులతో కిటకిటలాడు తుంటాయి. గత మూడేళ్లుగా చైనా ప్రభుత్వం దీనిని నిర్వహించలేదు. ఇప్పుడు దేశీయ రాకపోకలపైన ఆంక్షలు ఎత్తివేయటంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. స్వగ్రామాలకు వెళ్లిన వాళ్లు తిరిగి పనిలోకి రావటం వల్ల మూడో వేవ్.. ఫిబ్రవరి నెలా ఖరు నుంచి మార్చి మధ్య వరకూ సంభవిస్తుందని అంటున్నారు.
జీరో కొవిడ్ పాలసీ పేరుతో గత మూడేళ్లుగా చైనా ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేస్తోంది. లాక్‌డౌన్ విధించటంతో పాటు కేంద్రీకృత క్వారంటైన్ విధానం, పెద్దఎత్తున టెస్టింగ్, కాంట్రాక్టు, ట్రేసింగు విధానాలను అమలు చేస్తూ వస్తోంది. నిత్య జీవితంలో కార్యకలాపాలతో పాటు వ్యాపార, వాణిజ్య వ్యవహారాలు స్తంభించిపోయాయి. దీంతో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. ప్రభుత్వం గత డిసెంబరు మొదటి వారం నుంచి నిబంధనలను సడలించింది. అయితే, హఠాత్తుగా ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవటానికి అవసరమైన వాతా వరణం దేశంలో లేదని నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయటం, ఆసుపత్రుల్లో ఐసీయూ సేవలను మెరుగు పరచటం, యాంటీవైరల్ మందులను పెద్దఎత్తున నిల్వ చేయటం వంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావు. కానీ ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా కొవిడ్ ఆంక్షలను ఎత్తి వేయటం వల్ల మరణాల ముప్పు అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక మిలియన్ జనాభాకు 684 మంది మరణించే ప్రమాదం ఉందని యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్‌కు చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు తమ అధ్యయనంలో వెల్లడించారు. చైనా జనాభా 1.4 బిలియన్లు. దాని ప్రకారం లెక్క వేసుకుంటే 964,400 మరణాలు సంభవించే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ పరిస్థితి ఆరోగ్య సేవలపైన ఒత్తిడి పెంచుతుందని మరో అధ్యయనం పేర్కొంది. చైనా గనక బూస్టర్ డోసులను వేగవంతం చేసి, యాంటీ వైరల్ డ్రగ్‌లతో సిద్ధమయితే మరణాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని హాంకాంగ్ ప్రభుత్వం ఆధ్వర్యంలోని చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) పేర్కొంది. నాలుగో దఫా వ్యాక్సినేషన్‌ను 60 శాతం పూర్తి చేస్తే మరణాల ముప్పును 26 నుంచి 35 శాతం తగ్గించవచ్చని సీడీసీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భారత్ విషయానికొస్తే..
గడచిన ఏడాది భారత్‌లో కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇతర దేశాలలో కేసులు ఎక్కువ కావటంతో, ఏడాది చివరి కొచ్చేసరికి ప్రభుత్వం కొవిడ్‌పై నిఘాను మళ్లీ తీవ్రతరం చేసింది. అంతర్జాతీయ ప్రయాణికులను విమానాశ్రయాల్లో ప్రవేశ ద్వారం వద్ద పరీక్షించాలని నిర్ణయించింది. దాంతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్, హాంకాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా పీసీఆర్ టెస్టు నివేదికను అందించాలనే నిబంధన విధించింది.
ఇకపోతే, 220 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను వినియోగించటం భారత్ గడచిన ఏడాది సాధించిన ఆరోగ్య రంగ ఘనతగా చెప్పుకోవాలి. వయోజన జనాభాలో 97 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు. 90 శాతం మంది పూర్తిగా వ్యాక్సినేషన్ చేయించుకున్నారు. 60 ఏళ్ల పైబడిన వారందరికీ ‘బూస్టర్ డోస్’ వేయాలని, 12 ఏళ్లు పైబడిన వారికి ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సినేషన్ చేయాలన్న ప్రభుత్వం సత్ సంకల్పం చేసింది. అయితే ముందు జాగ్రత్త చర్యగా వేసే డోసు విషయంలో అర్హులయిన వారిలో కేవలం 27 శాతం మందే స్పందించటం పట్ల కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం అయ్యింది. భారత్ బయోటెక్ రూపొందించిన నాసికా వ్యాక్సిన్ (ఇంట్రానాసల్)ను 18 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోసుగా అందించటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇది ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తిని దేశదేశాల్లో చాటే ఘనమైన అంశం.
తాజా గణాంకాల ప్రకారం జనవరి 2 నాటికి భారత్‌లో నమోదయిన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4.46 కోట్లు, మరణాలు 5.3 లక్షలు. వైద్యఆరోగ్య శాఖ వెబ్‌సైట్ ప్రకారం, మొత్తం కేసుల్లో క్రియాశీలమైనవి 0.01శాతం. జాతీయ రికవరీ రేటు 98.8శాతానికి పెరిగింది. గుజరాత్‌లో మొట్టమొదటిసారిగా ఒమిక్రాన్ ఎక్స్ బి బి. 1.5 వేరియంట్ కేసు బయటపడింది. దీంతో గుజరాత్ పక్కనున్న మహారాష్ట్ర కూడా అప్రమత్తమైంది. ‘గత ఏడాదిగా ఒమిక్రాన్‌కు సంబంధించిన ఎన్నో వేరియంట్లు వచ్చాయి. 90 శాతం మంది వయోజనులు రెండు దశల టీకాలు వేసుకోవటం, దాదాపు 30 శాతం బూస్టర్ డోసు వేసుకోవటంతో మనం ఎక్కువ ఆందోళన చెందనవసరం లేదు’ అని మన వైరాలజిస్టులు చెబుతున్నారు. అలాగని అలసత్వం పనికిరాదు. ముందు జాగ్రత్తలతో మెలిగితేనే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు!
వ్యాక్సిన్లు, మందుల కొరత
ఫిజర్ సంస్థ కొవిడ్-19 పాక్స్‌క్లోవాయిడ్ డ్రగ్‌ను దేశవ్యాప్తంగా అందించేందుకు చైనా రెగ్యులేటర్లు ఆమోదించారు. బీజింగ్ ప్రభుత్వం ఆమోదించిన విదేశీ డ్రగ్ ఇదొక్కటే కావటం గమనార్హం. అయితే దీనిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఎప్పటిలోగా పంపుతారనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. గత నెలలో చైనా రూపొందించిన యాంటీ వైరల్ డ్రగ్ గంటల్లో అమ్ముడుపోయింది. దాంతోపాటు ‘చైనా జెన్యూన్ బయోటెక్’ వారు రూపొందించిన ‘అజ్వుడీన్’ కూడా ఆమోదం పొందింది.
కరోనా ఆంక్షలను సడలించగానే ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. జ్వరం, జలుబు మందుల కొనుగోలుకు ఎగబడ్డారు. ఫార్మసీలు, ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారాలు తీవ్ర మందుల కొరతను ఎదుర్కొంటున్నాయి. రాజధాని నగరం బీజింగ్‌లోనే కాదు, ప్రధాన నగరాల్లో ఫీవర్ క్లినిక్‌లు, ఆస్పత్రి వార్డులకు పేషెంట్లు పోటెత్తారు. ఎటుచూసినా పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి. దీంతో డాక్టర్లపై పని ఒత్తిడి తీవ్రమైంది. బీజింగ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాది మంది ఆరోగ్య నిపుణులు ఇక్కడకు తరలివచ్చి సేవలందిస్తున్నారు. ఆంక్షలను ఎత్తివేసిన ప్రభావం బీజింగ్‌పై తీవ్రంగా కనిపించింది. మూడేళ్ల పాటు అనుసరించిన ఆంక్షలను ఎత్తివేయటంతో కేసుల సంఖ్య పెరిగింది. వాణిజ్య కార్యకలాపాలు బాగా తగ్గుముఖం పట్టాయి. చైనాలో కొనుగోలు శక్తి మందగించింది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ అంచనాల మేరకు పర్చేజింగ్ మ్యానేజింగ్ ఇండెక్సు (పీఎంఐ) 47 నుంచి 48కి పడిపోయింది. తయారీ రంగం దెబ్బతింది. మూడేళ్లతో పోలిస్తే, గత మూడు నెలలుగా వరుసగా కుదేలవుతూ వస్తోంది. అంతర్జాతీయంగా ఆంక్షలు మొదలయ్యాయి.
చైనా ప్రభుత్వం అనుసరించిన జీరో కొవిడ్ పాలసీ వల్ల 2022లో ప్రజలు ఎన్ని అవస్థల పాలయ్యారో నిజజీవిత సంఘటనలను ఆధారంగా ‘నీటీజ్ న్యూస్’ సంచలనాత్మక వీడియోను రూపొం దించి ప్రజల ముందుంచింది. దీనిని అప్పట్లో 4 లక్షల మంది చూశారు. ట్విటర్ తరహా సామాజిక మాధ్యమం ‘వైబో’లో దీనిపైన విమర్శల జడివాన కురిసింది. ‘మీకు నకిలీల పొగడ్తలు కావాలి గానీ, వాస్తవాలను అంగీకరించరా?’ అని ప్రభుత్వాన్ని విమర్శించారు. సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయిన ఈ వీడియోను తొలగించారు. వీడియో మాయం కావటం చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ‘సెన్సార్షిప్’లో భాగమే. కరోనాను ఎదుర్కో వటం చైనా రాజకీయంగా సున్నితమైన అంశంగా భావిస్తూ వాస్తవాలను దాచి పెడుతోందన్న అభిప్రా యాలకు ఈ ఘటన మరింత బలం చేకూర్చింది. దేశంలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో సంయుక్త కార్యాచరణ, ఐకమత్యం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేర్కొన్నారు. మూడు వారాల తర్వాత మొదటిసారి ఆయన ఇటీవల మాట్లాడారు. వ్యవస్థీకృత ఆరోగ్య ప్రణాళికలు అవసరమని చెప్పారు.
వాస్తవాలకు ముసుగు
కొవిడ్-19 సంబంధిత నిజాలను చైనా ప్రకటించడం లేదు. యూకే ఆధారిత ఆరోగ్య సంస్థ ఎయిర్ ఫినిటీ అంచనాల మేరకు గడచిన డిసెంబరు నాటికి మొత్తం (క్యుమిలేటివ్) 18.6 మిలియన్ల మంది వైరస్ బారిన పడ్డారని అంచనా. కానీ అది అంతకంటే ఎక్కువే ఉండొచ్చని స్టేట్ మీడియా అంచనా వేస్తోంది. 84 మిలియన్ల జనాభా ఉన్న ఒక్క సిచుయాన్ ప్రావిన్స్‌లో 64 శాతం మంది కంటే ఎక్కువ మందికి వైరస్ వచ్చిందని ‘హెల్త్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. చైనా నుంచి కొత్తది, మరింత తీవ్రమైన ప్రమాదకర వైరస్ ఉత్పన్నం కావచ్చన్న అనుమానాలు దేశంలో విపరీతంగా ప్రబలు తున్నాయి. దాంతో ఆ దేశం నుంచి వచ్చే యాత్రికుల విషయంలో అనేక విదేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. భారత్‌తో పాటు, అమెరికా, ఆస్ట్రేలియా, కెనాడా, జపాన్, దక్షిణ కొరియా, యూకే, అనేక యూరోపి యన్ దేశాలు ఇందులో ఉన్నాయి. బ్రిటన్, ఫ్రాన్స్ కొత్తగా జత కలిశాయి. కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే ప్రయాణానికి అనుమతిస్తామని చెబుతు న్నాయి.
ఈ నేపథ్యంలో కొవిడ్-19కి సంబంధించిన ‘రియల్ టైం’ సమాచారాన్ని అందించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోమారు చైనాకు విజ్ఞప్తి పంపింది. జెనెటిక్ సీక్వెన్సింగ్ డేటాను, ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలకు సంబంధించిన సమాచారాన్ని పంచు కోవలసిందిగా కోరింది. మరణాల లెక్కింపులో చైనా అనుసరిస్తున్న అపసవ్య విధానాల వల్ల ప్రజలు తమను తాము రక్షించుకోవటం కష్టమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొవిడ్ సోకిన అనంతరం న్యూమోనియో, శ్వాస సంబంధ సమస్య తలెత్తి ఊపిరి నిలిచిపోతేనే అది కరోనా వల్ల సంభవించినట్టు లెక్క అని ఇటీవల చైనా వైద్య నిపుణుడు ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ అదే విధానాన్ని అనుసరిస్తున్నారు. తాజా వివాదాల నేపథ్యంలో చైనా ఆరోగ్య అధికారులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులను కలిసి పరిస్థితిని నివేదించా