– కాశీంశెట్టి సత్యనారాయణ
తెలంగాణ విముక్తి పోరులో నిరంకుశ నిజాం పాలకుల గర్వాన్ని అణచివేసే ప్రయత్నంలో గడ్డిపోచ కూడా కత్తిలా మారి యుద్ధ పటిమను చూపించిందనే చెప్పాలి. హైదరాబాద్‌లో అరాచక నిజాం పాలన కుప్పకూలడంలో ప్రజా ఉద్యమం కీలకంగా నిలిచింది. సుమారు రెండున్నర శతాబ్దాల పాటు పాలించిన అసఫ్‌జాహి రాచరిక పాలనకు వ్యతిరేకంగా సామాన్య ప్రజలతో పాటు, విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు, మరెందరో అజ్ఞాతవీరులు కృషి చేశారు. ఈ అందరి పోరాట ఫలితమే హైదరాబాద్ విమోచన.
చదువులు పూర్తి చేసి ప్రబుద్ధులు కావలసిన విద్యార్థులు.. దురహంకార పొగలు కప్పుకొని, సెగలు కక్కుతున్న నిజాం నేలలో తెలుగు లేని చదువులేమిటి? చదివి సాధించేదేమిటి? అని ఆవేశంతో ఈ రాజ్యం దాస్యశృంఖలాల నుండి విముక్తి చెందిన తర్వాతే.. ‘తల్లీ నిన్ను దలంచి పుస్తకంబు చేతన్ బూనుతామ’ని చదువుల తల్లికి దండం పెట్టి పాఠశాలలనూ, కళాశాలలనూ వదిలి స్వాతంత్య్ర సమర రంగంలోకి దూకిన బస్వా మానయ్య కూడా ఒకరు.
తెలంగాణ విముక్తి ఉద్యమంలో హిందూ సమాజంలో జాగృతిని కలిగించి, ఐక్యతను నిర్మించి, సమరోన్ముఖులుగా తీర్చిదిద్దింది ఆర్యసమాజ్ అనే చెప్పాలి. ఆర్యసమాజ్ స్ఫూర్తితో నాడు ఎందరో నిజాంపై ఉద్యమించారు. రాజ్యకాంక్షతో మూసుకు పోయిన నిజాం కళ్లు తెరిపించడానికి ఆర్యసమాజ్ 1938, డిసెంబర్ 25 నుండి 29 వరకు అఖిల భారత ఆర్యమహా సమ్మేళనాన్ని మాధవరావు అషె అధ్యక్షతన షోలాపూర్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో దీర్ఘకాలిక ఉద్యమానికి రూపకల్పన చేశారు. నిశ్శస్త్ర ప్రతీకార మండల్ పేరుతో హిందూ మహాసభ, ఆర్యసమాజ్ సంయుక్తంగా సత్యాగ్రహాలు ప్రారంభించాయి. ఈ ఉద్యమానికి సర్వాధికారిగా మహాత్మా నారాయణస్వామిని నియమించారు. ఈ ఉద్యమ ప్రభావం తెలంగాణలోని సుమారుగా అన్ని గ్రామాలకూ పాకింది. ఆ గ్రామాల్లో బస్వా మానయ్య స్వగ్రామం జోగిపేట (గతంలో దీనిపేరు ఆందోళ్- జోగిపేట) కూడా ఒకటి.
బస్వా మానయ్య 1923లో జోగిపేట (ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో ఉంది)లో ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించారు. ఏడవ తరగతి చదువుతున్న సమయంలోనే స్వాతంత్రోద్యమం వైపు దృష్టి సారించారు. ఆర్యసమాజ్‌కి చెందిన పండిట్ నరేంద్రజీ, రామచంద్ర దేహల్వి ఉపన్యాసాలన్నా, ఆర్యసమాజ్ సిద్ధాంతాలన్నా బాగా ఇష్టపడే వాడు. స్థానికంగా మెట్రిక్యులేషన్ పూర్తి చేసి హైదరాబాద్‌లో న్యాయశాస్త్రం చదివారు. ఆర్యసమాజ్‌లో చేరి నిజాం పాలకుల ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నిజాంకి బాసటగా నిలిచిన రజాకార్ల ఆగడాలను అడ్డుకోవడానికి గ్రామాల్లో తిరిగి ప్రజల్లో చైతన్యం నింపారు. అనేకమంది ఆర్యవీరులకు స్వయంగా వ్యాయామ శిక్షణనిచ్చారు. అందోళ్, అలాదుర్గం, సదాశివపేట, సంగారెడ్డి ప్రాంతాలలో ఆర్యసమాజ్ శాఖలను ప్రారంభించి ప్రజల్లో స్వాతంత్య్ర జ్వాలను రగిలించారు. ఆయన చివరి వరకు ఆర్యసమాజ్ సిద్ధాంతాలే ఊపిరిగా బతికారు. లాల్‌బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, నెహ్రూలతో స్వయంగా మాట్లాడగలిగే పరిచయాలు మానయ్యకు ఉండేవి.
మానయ్య నిజాంకు వ్యతిరేకంగా జోగిపేటలో ప్రజల్ని సంఘటిత పరుస్తున్నారనే విషయం రజాకార్లకు తెలిసింది. ఓ రోజు రాత్రి మానయ్య ఇంటిపై రజాకార్లు మారణాయుధాలతో దాడిచేశారు. ఈ దాడిలో అతని భార్య లక్ష్మీనరసమ్మ, అతని పెద్ద కుమారుడు, అతని అన్న మరణించారు. మానయ్యను అరెస్టు చేసి రెండు సంవత్సరాలు గుల్బర్గా జైల్లో నిర్భందించారు. ఆర్యసమాజ్ నాయకుల ఆచూకీ చెప్పమని బాగా కొట్టేవారు. ఆ దెబ్బలకు పక్కటెముకలు విరిగాయి. అయినా ఆచూకీ చెప్పలేదు. ఈ దెబ్బలు చూసి జైలులో పనిచేసే ఒక వార్డర్ జైలు గేటు తాళాలు ఇస్తాను, పారిపొమ్మ న్నాడు. ‘అలా చేస్తే నీ ఉద్యోగం పోతుంది. నిన్ను చిత్రహింసలు పెడతారు.’ అని వద్దని చెప్పారు. ‘మీ లాంటి వ్యక్తి బయటకు వెళితే వెయ్యి మంది వీరులను తయారు చేస్తారు. నిజాం ఆటకట్టిస్తారు. నా ఉద్యోగం పోయినా పరవాలేదు’ అని మానయ్యను అతను వదిలిపెట్టాడు. జైలు నుండి తప్పించుకున్న మానయ్య జైలు దుస్తులు మార్చి గోచీ పెట్టుకుని కాలి నడకన వికారాబాద్ చేరుకుని తన మిత్రుడు ‘మద్ద మల్లప్ప’ను కలుసుకున్నారు. మల్లప్ప అతనికి కొత్త బట్టలు, 13 రూపాయలు ఇచ్చాడు. తర్వాత కొన్నాళ్లు అనంతగిరి అడవుల్లో దాక్కున్నారు. ఓసారి నిజాం పోలీసులు తారసపడగా పొలాల్లో ఉన్న రైతులు మానయ్యను తప్పించారు.
ఈ ప్రాంతంలో రాయకోడ్ అనే గ్రామం ఉండేది. చుట్టుపక్కల అదే పెద్ద వ్యాపార కేంద్రం. ఒకసారి రజాకార్లు ఆ గ్రామాన్ని దోచుకుని తగులబెట్టారు. విషయం తెలుసుకున్న మానయ్య కొందరు రైతులతో కలిసి మంటలు ఆర్పేందుకు వెళ్లారు. అంతేకాదు, రాయకోడ్ చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో చైతన్యం నింపి విముక్తి ఉద్యమంలో వారిని కూడా భాగస్వాముల్ని చేశారు. రాయకోడ్‌లో మానయ్య తీసుకువచ్చిన చైతన్యానికి అక్కడి ప్రజలు ఆయన మీద పాటలు గట్టి…
‘బుడ గుడ్డ పంచాలు భుజాన వేసుకుని
సభ చెప్ప బయలెల్లినాడే మానయ్య
పట్టపగలే పట్నమంతా కాలిపోయే
రాయకోడ్ రక్షింప వచ్చాడయ్యా మానయ్య
మమ్ము రక్షింప వచ్చాడయ్యా మానయ్యా’ అంటూ పాడుకునేవారట.
‘ఏ దేశమువారైనా / ఏ కులము వారైనా
నిత్య నూతన వికాసంతో కళకళలాడేదెపుడు
చివరి నిరంకుశాధికారిని / ఉరితీసినప్పుడు
ఆనందమయ జీవితానికి నాంది-ప్రస్థావన’
– వెల్దుర్తి మాణిక్యరావు
హైదరాబాద్ రాష్ట్రమే ఒక జైలుగా మారిన 1940-1948 ప్రాంతం నాటి విశేషాలను ప్రత్యక్షంగా చూసి గ్రంథీకరించినవారు వెల్దుర్తి మాణిక్యరావు. ఇంటిల్లిపాది చెమటోడ్చి పండించిన పంటను రజాకార్లు కత్తులు ఝళిపిస్తూ ఎత్తుకు పోతుంటే ఇన్నాళ్లు చేసిన కష్టం ఏటి పాలైందని విలవిల ఏడ్చిన కర్షకుల ఆర్తనాదాలను స్వయంగా చూశారాయన. మాణిక్యాలరావు.. బస్వా మానయ్యతో కలిసి విముక్తి ఉద్యమంలో పనిచేసినట్లు తన పుస్తకంలో రాసుకున్నారు.
రజాకార్ల ఆగడాలు పెచ్చు పెరిగిపోయాయి. ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఇక తప్పదు. పోలీస్ యాక్షన్ తీసుకోవాల్సిందేనని సర్దార్ వల్లభాయి పటేల్‌తో మాట్లాడి, ఒప్పించి తిరిగి వస్తుండగా మానయ్యను రజాకార్లు మళ్లీ బంధించారు. ఈసారి చంచల్‌గూడ, గుల్బర్గా, సంగారెడ్డి, ఔరంగాబాద్ జైళ్లలో నిర్భంధించారు. పోలీస్ చర్య (1948) తరువాత విడుదలై కాంగ్రెస్, నెహ్రూ విధానాలను వ్యతిరేకించారు. సుమారు 8 ఏళ్లు జోగిపేట సర్పంచ్‌గా, అనేక సంత్సరాలు మున్సిపల్ ఛైర్మన్‌గా సేవలందించారు. 1957 అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోళ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి రుక్నుద్దీన్‌పై బస్వా మానయ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి, ఘనవిజయం సాధించారు. స్వయంగా నెహ్రూ రుక్నుద్దీన్ తరుఫున ప్రచారానికి వచ్చి ‘మానయ్యకి ఓటు వేస్తే ఆందోళ్ నియోజకవర్గం ఓ పిచ్చి ఆసుపత్రిగా మారిపోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటువేయాల’ని అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయింది. అంతటి ప్రజాదరణ కలిగిన వ్యక్తి బస్వా మానయ్య. తరువాత ఆయన నెహ్రూను సవాలు చేస్తూ తన నియోజకవర్గంలో పిచ్చి ఆసుపత్రి ఎప్పుడు కడతారని చమత్కరించారు. బస్వా మానయ్య అసెంబ్లీలో తన ప్రసంగాలతో పాలక పక్షంపై నిప్పులు కురిపించేవారు. ఆయన ఉపన్యాసాలపై ఒక సందర్భంలో ఆంధ్రభూమి పత్రికలో బుర్రా శాస్త్రి సంపాదకీయం కూడా రాశారు. మానయ్య ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి అరెస్ట్ కూడా అయ్యారు. ఒకసారి స్థానిక స్వాతంత్య్ర ఉద్యమ కారులకు మెజిస్ట్రేట్ సంతకం అవసరమైంది. ఆ మెజిస్ట్రేట్ నూరు రూపాయలు ఇస్తేనే సంతకం చేస్తానని చెప్పారు. అప్పుడు మానయ్య.. ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రితో మాట్లాడి సదరు మెజిస్ట్రేట్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై జోగిపేటలో ధర్ణా కూడా నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. అంతేకాదు, స్థానిక పార్కులో గాంధీ విగ్రహం ఏర్పాటుచేయాలని ఉద్యమించి సఫలీకృతు డయ్యారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లోని రవీంధ్ర భారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మానయ్యను తామ్రపత్ర పురస్కారంతో సత్కరించారు. జనవరి 8, 1977న మానయ్య స్వర్గస్తులయ్యారు. ఆయన పోరాటం నేటితరం యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకం.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్