‘మొదట తీసుకున్న నిర్ణయం మేరకే జనవరి 14, 2024న అయోధ్యలో కొత్తగా నిర్మిస్తున్న రామమందిరం, గర్భగుడిలో రామ్‌లాలా (బాల రాముడు) విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది!’ శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ చెప్పిన మాట ఇది. ఇది భారతీయులకీ, మొత్తం ప్రపంచంలోని హిందువులకీ శుభవార్త. అంతేకాదు, భారతదేశ చరిత్ర పుటలలో చేరబోతున్న మరొక ముఖ్య ఘట్టం. భారతీయ ఆధ్యాత్మిక జీవనంలో ఒక మలుపు. 2024 జనవరి 1 నాటికి ఆలయ నిర్మాణం పూర్తి కాగలదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించిన రెండు మూడు రోజులలోనే చంపత్‌రాయ్ ఈ ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం జనవరి 14 నాటికి విగ్రహ ప్రతిష్ట అంటే, ఈ సంవత్సరం డిసెంబర్ మాసానికల్లా గర్భాలయ నిర్మాణం కూడా పూర్తయి పోతుంది. తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఈ సంవత్సరాంతానికే ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2024 నుంచి భక్తులకు రామ్‌లాలా దర్శనమివ్వబోతున్నాడు. అయితే ఆ శుభముహూర్తం ఎప్పుడో చంపత్‌రాయ్ కచ్చితంగా చెప్పకపోయినా, 2023 సంవత్సరం ఆఖరి నుంచే అయోధ్యలో భారీ ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అవే మకర సంక్రాంతి వరకు జరుగుతాయి.
రామాలయానికి ప్రధాని మోదీ ఆగస్ట్ 5, 2020న భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే కదా! గడచిన అక్టోబర్ 23న మోదీ అయోధ్య వచ్చినప్పుడు నిర్మాణం పనుల గురించి పూర్తిగా అడిగి తెలుసుకున్నారు. గర్భాలయం కోసం రాజస్థాన్‌లోని మక్రానా కొండల నుంచి తీసుకువచ్చిన పాలరాయితో పనులు కూడా వేగంగా జరుగు తున్నాయి. గర్భాలయానికి 2022 జూన్ మాసంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన చేశారు.
కొత్త రామాలయంలో ప్రతిష్ట రాముడి ప్రతిమ తొమ్మిది అడుగులు ఎత్తు ఉంటుందని తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడొకరు చెప్పారు. ఈ విగ్రహం గురించి ఇంకా సాధుసంతులతో చర్చలు జరుగుతున్నాయి. దీని కోసం కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలో దొరికే రాళ్లను పరిశీలిస్తున్నారు కూడా. ఏ దిశగా ప్రతిష్టిస్తే సూర్యోదయం సమయంలో కిరణాలు స్వామి పాదాలకు తగిలేటట్టుగా చేయవచ్చునో కూడా నిపుణులతో చర్చిస్తున్నారు. ఆలయం పనులతో పాటే హనుమాన్ గడి మందిర్‌కు వెళ్లే దారిని విస్తరించే పనులు కూడా జరుగు తున్నాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాతే కాదు, అంతకు ముందు నుంచే అయోధ్య కోసం హిందువులు న్యాయ పోరాటం చేశారు. ఆ పోరాటానికి బీజేపీ, ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కె అద్వాణి నిర్వహించిన రథయాత్ర తోడైంది. అయోధ్యలో రామాలయ నిర్మాణం హిందువుల ఆత్మగౌరవ ప్రకటనగా మార్చింది అద్వాణి నిర్వహించిన రథయాత్రే. ఆ క్రమంలోనే డిసెంబర్ 6, 1992న జరిగిన కరసేవలో బాబ్రీ మసీదు పేరుతో పిలిచే వివాదాస్పద కట్టడం కూల్చివేశారు. ఆ తరువాత కూడా జరిగిన న్యాయపోరాటంలో చివరికి హిందువులే విజయం సాధించారు. నవంబర్ 9, 2019న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆలయ నిర్మాణానికి మార్గం ఏర్పడింది.
జనవరి ఆరో తేదీన త్రిపురలోని సబ్రూమ్ జరిగిన పార్టీ కార్యక్రమంలో అమిత్‌షా వచ్చే సంవ త్సరం జనవరి 1వ తేదీకి ఆలయం సిద్ధమవుతుందని ప్రకటించారు. ‘రాహుల్ బాబా! సబ్రూమ్ నుంచి నేను అంటున్న మాట ఆలకించు! వచ్చే ఏడు జనవరి 1 నాటికి అయోధ్యలో ఆకాశ హర్మ్యం వంటి రామాలయ నిర్మాణం పూర్తవుతుంది’ అని అమిత్ షా ప్రకటించారు.
అమిత్ షా ఇలా ప్రత్యేకంగా ఒక వ్యక్తిని ఉద్దేశించి ఆ ప్రకటన చేయడం వెనుక లోతైన నేపథ్యం ఉంది. బాబర్ సేనాని మీర్ బాంకే రామాల యాన్ని కూల్చి అక్కడ మసీదు కట్టాడు. మొగలుల పాలనలో హిందువులు ఏమీ చేయలేకపోయారు. బ్రిటిష్ యుగంలో కోర్టులను ఆశ్రయించారు. స్వతంత్ర భారతదేశంలో కుహనా సెక్యులరిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ఉదారవాదులు, ముస్లిం మతోన్మా దులు ఆలయ నిర్మాణానికి అడ్డంకిగా మారారు. రామాలయం కడతామని అంటారేగాని, ఆ తేదీ ఎప్పుడో బీజేపీ ఎప్పుడూ చెప్పదని రాహుల్ అంటూ ఉండేవారు. దీనికే అమిత్ షా సమాధానం ఇచ్చారని అనిపిస్తుంది.
రామమందిరాన్ని ధ్వంసం చేసిన మొగలుల కాలంలోనే ఇప్పటికీ ముస్లిం మతోన్మాదశక్తులు కలల విహారం చేయడం ప్రపంచాన్ని విస్తుగొలుపుతోంది. అల్ కాయిదా పత్రిక ‘ఘజ్వా ఎ హింద్’ పత్రిక డిసెంబర్, 2022 సంచిక చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అక్కడ రామాలయాన్ని మళ్లీ ఏదో ఒక రోజున పేల్చివేసి, మసీదును పునర్ నిర్మాణం చేస్తామని అందులో రాసుకున్నారు. ఈ మాట చెప్పడానికి నిర్వాహకులు సంపాదకీయాన్ని ఎంచు కున్నారు. బాబ్రీ దగ్గరి ఆలయాన్ని ధ్వంసం చేస్తాం. బ్రహ్మాండమైన మసీదు నిర్మించుకుంటాం. కానీ ఇందుకు త్యాగాలు చేయాలి అని అందులో వ్యాఖ్యానించారు.
ఈ దేశంలో సెక్యులరిస్టులమంటూ విర్ర వీగుతున్న నేతలను కూడా ఈ పత్రిక జైశ్రీరాం నినాదం నీడలో పాలించేవారేనని ముద్ర వేసింది. ఢిల్లీ నుంచి కలకత్తా వరకు చూస్తే అంతా ఈ బాపతేనని జమకట్టింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ ఇస్లాం, షరియా కీలకంగా ఉన్నట్టు, వాటిని పాలకులు అణచివేస్తున్నట్టు ఇందులో వర్ణించడం విశేషం. తమ మత ప్రార్థనలు చేయకుండా దేశమంతా భజనలు చేస్తున్నారని అంటున్నది ఈ పత్రిక. ఇక గతంలో మాదిరిగానే నరేంద్ర మోదీ భారత ప్రభుత్వం మీద, యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మీద యథాప్రకారం విషం కుమ్మరించింది. భారత్‌లోని ముస్లింలంతా ఆ దేశాన్ని వదిలిపెట్టేసి వచ్చి జిహాద్‌లో చేరాలని కూడా పిలుపునిచ్చింది. ఈ పత్రిక పూర్తిగా ముస్లిం మతోన్మాద శక్తులకు వత్తాసు పలుకుతుంది. అందుకే పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రభుత్వాలను మత రక్షణ కోసం హెచ్చరించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న తెహ్రీక్ ఎ తాలిబన్ సంస్థ మీద ప్రశంసల వర్షం కురిపించింది. ఢాకాను పతనం చేయమని ఆదే శించింది. కతార్‌లో ఫిఫా వరల్డ్ కప్‌ను నిర్వహించ డాన్ని విమర్శించింది. అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వ పాలన అమోఘమని శ్లాఘించింది.
ఈ పత్రిక అనే ఏమిటి? భారతదేశంలో కొందరు సెక్యులరిస్టు నేతలు కూడా భాష తేడాతో ఇలాంటి అభిప్రాయాలనే కలిగి ఉన్నారు. అయోధ్యలో దేవాలయం నిర్మాణం గురించి, ఆ పనులు పూర్తి కావడం గురించి అమిత్‌షా ప్రకటనలు చేయడం ఏమిటి? అది ఆయన పని కాదు. అంత ఆసక్తి ఉంటే అక్కడే పూజారిగా బాధ్యతలు తీసుకుంటే సరిపోతుంది కదా అన్నారు ఎన్‌సీపీ నేత శరద్ పవార్. అసలు రామాలయం నిర్మిస్తున్నదే విద్వేషాల భూమి (నఫ్రత్ కి జమీన్) మీద అన్నాడు ఆర్‌జేడీ నాయకుడు జగన్నాథ్ సింగ్. పెద్ద ఆలయం కట్టేసి అందులో రాముడిని బందీ చేయలేరని కూడా ఆయన తనదైన వినూత్న భక్తిని ప్రదర్శించాడు. అంతేనా! తాము హేరామ్‌ను నమ్ముతాం కానీ, జైశ్రీరాంను కాదని కూడా తేల్చాడు. అసలు నిజం వీళ్లంతా నమ్మేది ఓటు బ్యాంకుని. ఇదే కాదు, రాహుల్ గాంధీ మళ్లీ బీజేపీ పూజల పార్టీ అంటూ కొత్త బిరుదు ఇచ్చారు. మా మసీదు నిర్మాణం ఈ డిసెంబర్‌కే పూర్తయిపోతుందని ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ కార్యదర్శి అతార్ హుసేన్ ప్రకటించారు.
ఆలయ నిర్మాణం గురించి, విగ్రహ ప్రతిష్ట గురించి అమిత్‌షా, చంపత్‌రాయ్ చేసిన ప్రకటనలు ఒక సవాలుకు సమాధానంగా చూడకతప్పదు. మేం ఆలయాన్ని పేల్చేస్తామని చెబితే హిందూ సమాజం నుంచి ఇంత వేగంగాను ప్రతిస్పందన వస్తుంది. రావాలి. ఈ కార్యక్రమం హిందూ ఆత్మాభిమాన ప్రకటనలో రెండో ఉదంతం. మొదటిది సోమనాథ్ ఆలయ ప్రతిష్ట. అందుకే స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఇదొక పెద్ద మలుపు. ఇంతకీ, ప్రతి హిందువు ఇంట్లో ఆయుధాలకు పదును పెట్టుకుని సిద్ధంగా ఉండాలని సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ప్రకటన ఇస్తే ‘నూర్గురు’ సివిల్ సర్వెంట్లు ఆమె మీద చర్య తీసుకోవాలని లేఖ సంధించారు. మరి కట్టిన రామాలయాన్ని పేలుస్తామని తాలిబన్ బహిరంగ హెచ్చరిక చేసినప్పుడు ఆ ‘నూర్గురు’ సివిల్ సర్వెంట్ల నోళ్లు ఎందుకు పెగలడం లేదు?
– జాగృతి డెస్క్