– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్
భారతీయ జనతా పార్టీ ఆంధప్రదేశ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, కార్మిక నాయకులు పీవీ చలపతిరావు విశాఖలోని తమ నివాస గృహంలో జనవరి ఒకటిన 87 ఏళ్ల వయస్సులో మరణించారు. పార్టీ కోసం జీవితాంతం కృషి చేసిన ధన్యజీవి చలపతిరావు. ఆయన చేసిన సేవలను బీజేపీ అగ్రనాయకత్వం గుర్తించింది. అందుకే విశాఖపట్నం వచ్చినప్పుడల్లా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చలపతిరావు గారూ బాగున్నారా? ఆరోగ్యం ఎలా ఉందని ఆప్యాయంగా సంబోధించడాన్ని అందరం ఎరుగున్నాం. పీవి చలపతిరావు అజాతశత్రువు. పదవుల కంటే విలువలకే ప్రాణమిచ్చి సైద్ధాంతిక నిబద్ధతతో ప్రజాజీవితాన్ని గడిపిన మహర్షి.
ఆశయ సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఉపాధి కోసం ఎంచుకొన్న న్యాయవాద వృత్తిని తృణప్రాయంగా వదిలేసి వేల మంది జీవితాల్లో వెలుగులు నింపిన కార్మిక నేత, ప్రజాసేవకుడు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆయన పేరు ఎరుగని వారుండరంటే అతిశయోక్తి కాదు. అగ్రనాయకులు వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, ప్రధాని మోదీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులతో కలసి పనిచేశారు. ఆయన తనయుడు పీవీఎన్ మాధవ్ కూడా ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం ఎమ్మెల్సీగా, బీజేపీ నాయకుడిగా కొనసాగుతున్నారు.
బాల్యం నుంచే జాతీయ భావాలు
పీవీ చలపతిరావు విశాఖ వన్‌టౌన్‌లో 1935లో జన్మించారు. పదేళ్ల వయసు అంటే 1945లో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. దాంతో ఆయనకు బాల్యం నుంచే జాతీయ భావాలు అలవడ్డాయి. ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాల్లో పాల్గొని దేశభక్తి అణువణువునా పెంచుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన ఏడాదిలోపే ఆర్‌ఎస్‌ఎస్‌పై నిషేధం విధించినప్పుడు ఆయన సంఘ కార్యకర్తల మధ్య కమ్యూనికేషన్ ఛానెల్‌గా వ్యవహరించే వారు. ఈ దశలో అంచెలంచెలుగా ఎదిగారు. వివిధ ఉద్యమాలు, ఆందోళనలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, వివాదరహితుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1951లో రాయలసీమ కరవు సమయంలో అక్కడి వారి కోసం స్వయంసేవకులతో కలిసి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో నగదు, సహాయ సామగ్రి వంటివి సేకరించి పేదలకు అందచేశారు.
ఉద్యమకారుడిగా
1950-54 మధ్య విశాఖ పరిసరాల్లోని కాలేజీలు, యూనివర్సిటీల్లో ఏబీవీపీ శాఖల ఏర్పాటు, భారతీయ జనసంఘ్ కార్యకలాపాల నిర్వహణ, గోవా విముక్తి ఉద్య మంలో పాల్గొనడం వంటివి ఆయన నాయకత్వ పటిమను చాటాయి. రాజకీయాల్లో చేరడం కోసం తన పారిశ్రామిక విస్తరణ అధికారి ఉద్యోగాన్ని విడిచి పెట్టారు. బీఎస్సీ, బీఏ, బీఎల్ పట్టాలు పొంది పీవీ బార్ కౌన్సిల్‌లో సామాజిక న్యాయం కోసం పనిచేశారు. న్యాయవాద వృత్తిని వదులుకుని జనసంఘ్‌కు పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు. ఉత్తర సర్కార్ జిల్లా గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి 1974లో ఒకసారి, 1980లో రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
బీజేపీ అధ్యక్షునిగా
దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రోత్సాహంతో జనసంఘ్‌లో చేరిన ఆయన 1977లో జనతా పార్టీ తరఫున అనకాపల్లి నుంచి లోక్‌సభకు పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. 1980 నుంచి 1986 వరకు ఉమ్మడి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి తదితర నేతలతో కలసి పార్టీని పటిష్టపరిచి విశాఖపట్నం కార్పొరేషన్ తొలి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేలా కృషిచేశారు. పార్టీని బలపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జాతీయ భావాలు కలిగిన ఎందరో మేధావులను, యువతను ఆకర్షించి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన సహచర్యంలో, మార్గదర్శకత్వంలో పార్టీలోకి వచ్చిన ఎందరో నేడు పెద్ద నాయకులుగా కొనసాగు తున్నారు. సీనియర్ నేత కావడంతో బీజేపీ శ్రేణులు పలువురు చలపతిరావును ‘గురువు గారు’ అని సంబోధిస్తారు. ఆ పార్టీ ముఖ్య నేతలు విశాఖ వస్తే ఆయనను కలిసి, యోగక్షేమాలు తెలుసుకుని వెళ్తుంటారు. వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో కొన్నేళ్లుగా పీవీ ఇంటికే పరిమితమయ్యారు.
కార్మిక నాయకుడిగా
ఉత్తరాంధ్రలో జరిగిన అనేక పోరాటాల్లో పాల్గొని ఎదిగిన చలపతిరావు తొలుత ఉక్కుకర్మాగార సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. 1967-68లో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం, గోదావరిపై పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉద్యమాలు చేశారు. 1972-73 మధ్య జైఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించి, పలుమార్లు అరెస్టు అయ్యారు. విశాఖలో బస్సుల జాతీయీకరణ ఉద్యమాలు చేపట్టారు. కార్మిక నాయకుడిగా పోరాటం చేసి 1500 మంది కార్మికుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయించారు. జింక్, హెచ్పీసీఎల్, డాక్ యార్డ్, ఎన్‌ఎస్‌ఓఎల్, నెల్లిమర్ల జ్యూట్ మిల్, గరివిడి ఫేకర్లకు చెందిన వేలాది మంది కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాడి విజయం సాధించారు. 1978లో బీహెచ్‌పీవీ తాత్కాలిక ఉద్యోగుల కోసం 14 రోజులు నిరాహారదీక్ష చేసి 450 మంది సర్వీసులను క్రమబద్ధీకరించడంలో కీలకంగా వ్యవహరించారు. కార్మిక నాయకుడుగా ఉన్న చలపతిరావుకు 1983లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ‘శ్రమశక్తి’ అవార్డును, ఆ తరువాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనకాపల్లి వచ్చినప్పుడు జీవనసా ఫల్య పురస్కారం ప్రదానం చేశారు.
మారువేషాలతో అజ్ఞాత జీవితం
పోరాటాల ఫలితంగా పీవీ చలపతిరావు ఎక్కువ రోజులు అజ్ఞాతంలో ఉండేవారు. 1975-77 ఎమర్జెన్సీలో లోక్ సంఘర్షణ సమితి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు 19 నెలలు అజ్ఞాతంలో గడిపారు. మారువేషంతో ముఖ్యమంత్రికే మస్కా కొట్టారంటే ఆయన ఎంత దిట్టో అర్థం చేసుకోవచ్చు. ఎమర్జెన్సీ సమయంలో చలపతి రావు శాసనమండలి సభ్యుడు. పోలీసులు అరెస్ట్ చేస్తారని అజ్ఞాతంలోకి వెళ్లారు. శాసనమండలి సమావేశాలకు మూడు దఫాలు హాజరు కాకపోతే సభ్యత్వం రద్దవుతుందని మారువేషంలో సభకు హాజరై రిజిష్టర్లో సంతకం చేశారు. అది తెలిసిన అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు పోలీసులపై మండిపడ్డారు. తన కోసం గాలించే సీఐడీ, పోలీసుల నుంచి తప్పించు కోవడానికి చలపతిరావు మారువేషాలతో తిరిగేవారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో సామర్లకోట దాటుతుండగా రైలులో ఉన్న పీవీని పోలీసులు గుర్తు పట్టడంతో రైలు లోంచి దూకి పరారయ్యారు. 1977 ఫిబ్రవరి 2న బహిరంగ సభలో ప్రభుత్వానికి స్వచ్ఛందంగా లొంగిపోయారు.
సంతాపం
‘పీవీ చలపతిరావు దేశభక్తితో నిరంతరం విశిష్టసేవలు అందించి, చిరస్మరణీయులయ్యారు. బీజేపీ కార్యకర్తలకు ఆయన స్ఫూర్తిగా నిలుస్తారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి’ అని ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. ‘యావత్ జీవితం ప్రజా సంక్షేమానికి కట్టుబడిన చలపతిరావు జీవితం భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకం’ అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నివాళి ఘటించారు. హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మిజోరం గవర్నర్ హరిబాబు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు, బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ సంతాపం తెలిపారు. చలపతిరావు భౌతిక కాయానికి ఆంధప్రదేశ్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.