సూర్యభగవానుడు కర్మసాక్షి. సకల లోకాలకు ఆత్మస్వరూపుడు. ‘సర్వం సూర్యమయం జగత్’ అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది. సమస్త ప్రాణకోటి ఆయనపైనే ఆధారపడి ఉంది. సకల చరాచరసృష్టికి, జీవరాశి మనుగడకు సూర్యశక్తి అనివార్యం. ఆయన కాలస్వరూపుడు. సూర్యగమనాన్ని అనుసరించే సంవత్సర కాలాన్ని ఉత్తర దక్షిణాయనాలుగా విభజించారని తెలిసిందే. సమస్త జీవరాశికి ఆధారభూతుడు కనుకనే వేదాలు ఆయనను త్రిమూర్తి స్వరూపుడిగా, సర్వదేవతా సమాహారమని అభివర్ణించాయి.
సూర్యనాయణమూర్తి త్రిమూర్తి స్వరూపుడు. ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం మహేశ్వరుడు, సాయంత్రం విష్ణు స్వరూపుడిగా అర్చిస్తారు. సూర్యకాంతిలో కనిపించే సవ్తవర్ణాలను సప్తాశ్వాలుగా మహర్షులు కీర్తించినట్లు తెలుస్తోంది. ద్వాదశ ఆదిత్యులు (పన్నెండుగురు) అని మన ఆధ్యాత్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి. తీక్షణతను బట్టి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క సూర్యుడు సారథ్యం వహిస్తాడు. ఆ ప్రకారం, ఆయన జన్మతిథి (రథసప్తమి) వచ్చే మాఘ మాసంలోని ఆదిత్యుడిని ‘పూషుడు’అనే పేరుతో వ్యవహరి స్తాడు. భాస్కరుడు నిత్యానుసంధాననీయుడు. మరీ ముఖ్యంగా మాఘమాసంలోని ఆదివారాలలో ఆయన అర్చనను మరింత ప్రత్యేకతగా చెబుతారు. ఆదివారాలలో సూర్య నమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ‘నమస్కార ప్రియోభానుః’ అని ఆర్యోక్తి. కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు దివాకరుడు. ఉదయాస్తమయ వేళల్లోని సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. సూర్య నమస్కారాల వల్ల జ్ఞానం, సద్గుణం, వర్చస్సు, బలం, ధనం, సంతానం, పాపనాశనం, సకల రోగ నివారణ, ఆయుర్వుద్ధి కలుగుతాయని రుగ్వేద వచనం. అందుకే ఆయన పుట్టినతిథి ‘రథ సప్తమి’ని ‘ఆరోగ్య సప్తమి’ అనీ అంటారు.
రథసప్తమి విశిష్టత
అదితి కశ్యపులకు మాఘ శుద్ధ సప్తమినాడు సూర్యభగ వానుడు జన్మించాడు. ఈ పర్వదినాన్ని సూర్యజయంతి అని వ్యవహరిస్తారు. ఈ తిథి నాడే రథాన్ని అధిరోహించడం వల్ల ‘రథసప్తమి’ అని పేరు వచ్చిందని మత్స్యపురాణం పేర్కొంటోంది. దీనినే మహాసప్తమి, భానుసప్తమి, అచలా సప్తమి అనీ వ్యవహరిస్తారు. ఆయన ఉత్తర దిశ ప్రయాణం ఈ రోజునే మొదలవుతుంది.
రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందు నక్షత్ర సమాహారం రథాకారంలో ఉంటుందంటారు. ఏకచక్ర రథాన్ని సప్త అనే అశ్వం లాగుతుంది. సూర్యరశ్ములే (కిరణాలే) అశ్వ రూపాలు. ఆదిత్యుడి నుంచి వెలువడే కిరణాలలో ఏడవది ‘సప్త’ పేరుతో లోకాన్ని ఉద్దీపింప చేస్తోందని, మిగిలిన ఆరు కిరణాలు ఆరు రుతువులుగా కాలచక్రాన్ని నడుపుతున్నాయని వేదవాక్కు.
‘సప్తలోక ప్రకాశాయ సప్తసప్త రథాయచ
సప్త ద్వీప ప్రకాశయ భాస్కరాయ నయోనమ:’
స్నానం, దీపం, అర్ఘ్యం, అర్చనం, తర్పణం రథసప్తమి నాటి ప్రత్యేక ధర్మాలు. ముందురోజు (షష్ఠి) నిరాహారంగా ఉండి మరునాడు శాస్త్రోక్తంగా రథ సప్తమి వ్రతం ఆచరించడం వల్ల ఆరోగ్యం సిద్ధించ డంతో పాటు ఏడేడు జన్మల పాపాలు నశిస్తాయని ‘ధర్మసింధువు’ పేర్కొంటోంది.
రథసప్తమి నాటి స్నానపక్రియ, ప్రత్యేకత గురించి ‘వ్రత చూడామణి’ పేర్కొంది. దాని ప్రకారం, ఆరోజు సూర్యోదయానికి ముందే నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి నదీతీరంలో కాని, చెరువులో కానీ వదిలి, జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తలమీద ఉంచుకుని స్నానం చేయాలి. దీనివల్ల ఆరోగ్య ఐశ్వర్యాలు, తేజస్సు పెంపుతో పాటు చర్మ రోగాలు నశిస్తాయని, జన్మాంతర సప్తవిధ పాపాలు (ప్రస్తుత,గత జన్మల పాపాలు, మాట, మనసు, శరీరంతో చేసిన పాపాలు,తెలిసీ తెలియక చేసినవి) నశిస్తాయని, రథసప్తమి నాడు సూర్యోదయ సమయ స్నానంతో సూర్యగ్రహణం నాటి స్నానమంత ఫలితం లభిస్తుందని విశ్వాసం.
సూర్యారాధన అనాదిగా వస్తున్నదే. దేవతలు, మానవులే కాదు.. శ్రీరామ, శ్రీకృష్ణుడు లాంటి అవ తారపురుషులు ఆయనను అర్చించారని ఐతిహ్యం. శ్రీరామచంద్రుడు ఆగస్త్య మహర్షి అనుగ్రహంతో పొందిన ఆదిత్య హృదయస్తోత్ర పఠనంతోనే లంకే శ్వరుడిపై విజయం సాధించాడని, నవమ బ్రహ్మగా వినుతికెక్కిన హనుమ సూర్యోపాసన ద్వారానే సర్వ విద్యలు అభ్యసించినట్లు పురాణ కథనం. శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు సూర్యారాధనతో కుష్ఠువ్యాధి బాధ నుంచి విముక్తుడయ్యాడట. ధర్మరాజు వనవాస కాలంలో సూర్యారాధనతోనే ‘అక్షయపాత్ర’ను పొంది ఆకలిదప్పులను జయించగలిగాడు.
తిరుమలలో
తిరుమలలో ఇతర పండుగల మాదిరిగానే రథ సప్తమికి ప్రత్యేకత ఉంది. ఏడాదిలో ఎన్నడూ లేని విధంగా ఆ ఒక్కరోజే శ్రీవారు ఏడు రథాలపై వివిధ అలంకారాలలో ఊరేగి కనువిందు చేస్తారు. సూర్యప్రభ వాహనంతో తిరువీధి ఉత్సవం మొదలై చిన్నశేష, గరుడ, హనుమంత, కల్పవృక్ష, సర్వ భూపాల, చందప్రభ వాహనాలతో ముగుస్తుంది. దీనిని అర్థ బ్రహ్మోత్సవం అంటారు.
– డా।। ఆరవల్లి జగన్నాథస్వామి, సీనియర్ జర్నలిస్ట్