కొవిడ్ 19 వైరస్ నుంచీ, ఆ మహా మహమ్మారి నుంచీ ప్రపంచం బయటపడిందనీ, మానవాళి జీవనయానం గాడిలో పడిందనీ కొంచెం నమ్మకం కుదురుతున్న వేళ మళ్లీ కరోనా కలకలం రేగింది. బీఎఫ్.7 అన్న పేరుతో వేరొక వేరియంట్ ఇప్పుడు దాదాపు 90 దేశాలలో ఉన్నప్పటికీ, భారత్ మీద దాని ప్రభావం తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కారణం- మొదటి రెండు దశలలోను తీసుకున్న కఠిన చర్యలు. అయినా ఇప్పుడు కొత్త భయాలు మన దేశీయులను చుట్టుముడుతున్నాయి. కారణం పొరుగున ఉన్న చైనా బీఎఫ్.7 రకం వైరస్‌తో చరిత్రలో కనీవినీ ఎరుగనంత ఘోర పరిస్థితిని ఎదుర్కొంటున్నది. అది జీ జిన్‌పింగ్, ఆ దేశాన్ని ఏలుతున్న కమ్యూనిస్టు పార్టీ మంకు విధానాల ఫలితమేనని అంతా భావిస్తున్నా, సాధారణ చైనీయుల మీద ప్రపంచానికి సానుభూతి ఉంది. అదే సమయంలో అక్కడ నుంచి మిగిలిన ప్రపంచ దేశాల మీద కూడా ఆ కొత్త వేరియంట్ దాడి చేయవచ్చునన్న గుబులు కూడా నేడు స్పష్టంగానే కనిపిస్తున్నది.
కరోనా గురించి ఏ దేశం భయం ఆ దేశానిది అన్న తీరులో ఉండడం లేదు. ప్రపంచ మానవాళిలో కరోనా భయం కూడా ఆ వైరస్ వలెనే వేగంగా విస్తరిస్తుంది. అందుకే చైనాలో నెలకొని ఉన్న భయానక పరిస్థితి భారత్‌ను కలవరపెడుతున్నది. రోజుకు పది లక్షల కేసులు నమోదవుతున్న దేశం మన పక్కనే ఉన్నదంటే అంతకంటే కల్లోల పరిచే అంశం మరొకటి ఏముంటుంది. ఈ దారుణ స్థితిలోను చైనా వ్యవహరిస్తున్న తీరు, ప్రదర్శిస్తున్న అహంకారం పట్ల మళ్లీ ప్రపంచం కన్నెర్ర చేస్తున్నది. ఆ దేశం పాటించే దాపరికం, కమ్యూనిస్టు వ్యవహార శైలి, సిద్ధాంతం పేరుతో రుద్దే మౌఢ్యం, నియంతృ త్వాన్ని మించిపోయి ఉండే శిలాశాసనం ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్నాయి. ఈ దౌష్ట్యమంతా మూడు సంవత్స రాలుగా దాదాపు జైలు జీవితం గడుపుతున్న సాధారణ ప్రజల మీదనేనని మరచిపోరాదు. ఎన్ని ఉన్నా బీఎఫ్.7తో భారతదేశానికి తీవ్రస్థాయి ప్రమాదం లేదని నిపుణులు చెప్పడం సగటు భారతీ యుడి అదృష్టం. చైనా ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఆ దేశ ప్రజానీకాన్ని దిక్కు తోచని స్థితికి నెట్టాయి.
కొవిడ్ 19 జాడ విశ్వ మానవాళిని పూర్తిగా విడిచిపెట్టలేదని చెప్పడానికి ఈ మధ్య కాలంలో చాలా రుజువులు కనిపించాయి. మొదటి దశలు తెచ్చిన తీవ్ర ప్రాణనష్టం, ఆర్థిక కుంగుబాటు, వ్యవస్థల పతనం ఇంకొక పదేళ్లకైనా మరపునకు రావు. అలాంటిది రెండేళ్లు గడవకుండానే ఆ పెను విషాదాన్నీ, అది మిగిల్చిన అనుభవాలను ఎలా మరచిపోగలదు ప్రపంచం? దీనిని నిర్లక్ష్యం చేసినది సిద్ధాంతాల పిడివాదులే. కొన్ని రాజకీయ క్రిములే. ఈ రకం వైరస్‌ను 2021 ఫిబ్రవరిలోనే గుర్తించారు. పైగా 90 దేశాలలో ఇది ఉందని రుజువైంది. ఈ విషయాన్ని అమెరికా కేంద్రంగా పనిచేసే పరిశోధన సంస్థ స్క్రిప్స్ వెల్లడించింది. చైనా ఉత్పాతం ఇందులో కలిపారో లేదో తెలియదు కాని, ప్రపంచంలో ఇంతవరకు చేసిన పరీక్షలలో 0.5 శాతం దీని లక్షణాలు బయటపడినాయి. ఇది ఒమిక్రాన్‌లోనే బీఏ.5 ఉప జాతికి చెందినది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి అంశాల ద్వారా కొవిడ్ 19 పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. భారత్‌కు ఆ ముప్పు నుంచి తక్కువ ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్న మాటకు మూలం ఏమిటి? అంత బలమైన చైనా ఇలాంటి దుస్థితికి ఎందుకు దిగజారిపోయింది? ప్రపంచంలో పరిస్థితి ఏమిటి? ఆరంభం నాటి భయానక అనుభవాలు మళ్లీ ఎదురవుతాయా?
భారత్‌కు ఎందుకు ముప్పు కాదు?
ఇది భారతదేశంలోను స్వల్పంగా కనిపించింది. ఈ వేరియంట్ సహా మొత్తం పది రకాలు ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నాయి. అన్నీ కూడా స్వల్ప ప్రభావాన్ని మాత్రమే చూపుతున్నాయి. అయినా భారత్‌కు ఈ దశ ప్రమాదకారి కాదని నిపుణులు ఏ కారణాలతో చెబుతున్నారు? చైనాలో రెచ్చిపోతున్న రీతిలో ఇక్కడ దానిని ఊహించనక్కరలేదని ఎందుకు భరోసా ఇస్తున్నారు? అక్కడ విజృంభణకు కారణం వృద్ధుల సంఖ్య ఎక్కువ. మరొకటి, బూస్టర్ డోస్ ఎక్కువ జనాభాకు అందలేదు. దీనితో పాటు అక్కడ జనాభా అత్యధికమే అయినా, వారికి రోగ నిరోధక శక్తి తక్కువ. సహజంగా శరీరానికి లభించే రోగ నిరోధక శక్తికి అక్కడ అవకాశం లేకపోవడమే ఇందుకు కారణం. ఒక్కమాటలో చెప్పాలంటే ఇటీవలి కొన్నేళ్లుగా ప్రపంచం అనుభవించిన వ్యథను చైనా ఒక్క వారంలోనే అనుభవించిందని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న చైనీయులలో కూడా ఒక ఉప జాతి వైరస్ అభివృద్ధి చెందుతున్నది. దానికి ఈ రెండు మూడేళ్లుగా ప్రపంచం ప్రజానీకం చూసిన వైరస్ కంటే ఎక్కువ ఇన్‌ఫెక్షన్ కలగజేసే లక్షణం ఉన్నది. గతంలోని వైరస్ వలె కాకుండా దీనికి పునరుత్పత్తి లక్షణం కూడా ఉంది. ఈ ఇన్‌ఫెక్షన్ సోకిన ఒక వ్యక్తి 10 నుంచి 18.6 శాతం మందికి అంటించ గలడు. ఇదే 2022 జనవరిలో వచ్చిన వైరస్‌కు ఉన్న పునరుత్పత్తి లక్షణం కేవలం 5.08 శాతం.
మరొక గుర్తించవలసిన అంశం భారత్ కరోనా 19 వైరస్ పరీక్షలలో పాజిటివిటీ ఉన్నవి ఒక శాతం కంటే దిగువనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ శాతం మారలేదు. కానీ పలు కారణాలతో కొన్ని రాష్ట్రాల లోని జిల్లాల పరిస్థితి ఒకింత ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో 600 వరకు జిల్లాలు ఉంటే వాటిలో ఎనిమిదింటికి మాత్రం బీఎఫ్.7 రకం వైరస్ వ్యాపించే ప్రమాదం పొంచి ఉన్నదని అనుమానాలు ఉన్నాయి. అవి- లోహిత్ (అరుణాచల్‌ప్రదేశ్), రి భోయి (మేఘాలయ), కరౌలి, గంగానగర్ (రాజస్తాన్), దిండిగల్ (తమిళనాడు), రుదప్రయాగ, నైనిటాల్ (ఉత్తరాఖండ్), కుల్లు (హిమాచల్ ప్రదేశ్).
నాలుగో దశ కొవిడ్ భయం ఆగ్రా ముంగిటకు వచ్చి నిలిచింది. ఈ నగరవాసి ఒకరికి కొవిడ్ పాజిటివ్ లక్షణాలు నిర్ధారణయ్యాయి. అదీ కాకుండా అతడు ఇటీవలనే చైనా నుంచి వచ్చాడు. దీనితో చాలా వేగంగా వ్యాపించే లక్షణం ఉన్నదిగా చెప్పే బీఎఫ్ 7 వేరియంట్ ఈ నగరంలోకి వచ్చి పడిందన్న అనుమానాలు, ఆ వెంట భయాలు ఆరంభ మయ్యాయి. అయితే ఈ లక్షణాలు కనిపించిన ఆ వ్యక్తిని అతడి స్వగృహంలోనే ఐసోలేషన్‌లో ఉంచినట్టు వైద్యశాఖ అధికారి అరుణ్ శ్రీవాస్తవ ప్రకటించారు. ఆ వ్యక్తి కుటుంబం వివరాలు తెలుసుకునేందుకు తరువాత అవసరమైన పరీక్షల కోసం ఇప్పటికే లక్నో పంపించారు. అలాగే ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకీ, ఇటీవలి కాలంలో అతడిని వచ్చిన కలసిన వారందరికీ కూడా కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇతడు డిసెంబర్ 23వ తేదీన ఢిల్లీ మీదుగా ఆగ్రా చేరుకున్నాడు. అంటే చైనాలో బీఎఫ్ 7 కల్లోలం తారస్థాయికి చేరిన తరువాతే ఇతడు వచ్చాడని అర్ధమవుతుంది. ఈ అందోళన అంతా దానితోనే. నిజానికి చైనాతో పాటు జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయ్‌లాండ్‌ల నుంచి మన దేశానికి వచ్చిన వారికి కొవిడ్ పరీక్షను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. కొవిడ్ ప్రభంజనాన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్న సంగతి ప్రజలకు తెలియచేయడానికి డిసెంబర్ 27న ప్రభుత్వం మాక్ డ్రిల్‌ను ఏర్పాటు చేసింది. ఆగ్రాకు వచ్చే సందర్శకులకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆగ్రాలో తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట, అక్బర్ సమాధి చూడడానికి ఇక్కడికి సందర్శకులు వస్తారు. విమానాలు దిగిన వారికే కాదు, రైల్వే స్టేషన్లు, బస్‌స్టేషన్‌లలో కూడా కొవిడ్ ఆరోగ్య పరీక్షలకు ఏర్పాట్లు చేశారు.
రెండోదశ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తున్న మాట నిజమే. ఆక్సిజన్, పడకలు తగినంతగా సిద్ధం చేసుకోవాలని సూచించింది. చైనాయే కాకుండా, జపాన్, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, సింగపూర్, బ్రెజిల్, అమెరికాలలో కేసులు అమాంతం పెరుగుతున్నందున భారత్ కూడా ముందస్తు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. కొత్త బెడద దృష్ట్యా ఎలాంటి పరిస్థితులనయినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని ప్రధాని ఇప్పటికే పిలుపునిచ్చారు. కర్ణాటక బీజేపీ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకు వేసి మాస్క్ ధారణను మరొకసారి తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ఆదేశాలు కొన్ని రాష్ట్రాలు ఇవ్వకున్నా ప్రజలే స్వచ్ఛంగా పాటించడం కూడా అవసరమే.
చైనాలో ఎందుకు విజృంభిస్తున్నది?
ప్రపంచాన్ని అక్షరాలా అతలాకుతలం చేసిన కొవిడ్ 19 వైరస్‌కు మూలం చైనాయేనని ఆదిలోనే అంతా భావించారు. కానీ అక్కడ నుంచి సమాచారం బయటకు రావడం కష్టం కాబట్టి చెదురు మదురు సమాచారమే ప్రపంచానికి దిక్కయింది. ప్రస్తుతం చైనా ఏడో దశ కొవిడ్‌ను ఎదుర్కొంటున్నది. ఇది ఆ దేశానికి జీవన్మరణ సమస్యలా మారిందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో చాలా దేశాలు మాస్క్‌లను కూడా వదిలిపెట్టి, కరోనా పరీక్షలకు స్వస్తి పలికి భరోసాగా సాధారణ జీవితంలోకి వచ్చినా, చైనా ప్రజలు ఆ వెసులుబాటుకు నోచుకోలేదు. మూడేళ్లుగా వారు గృహ నిర్బంధాలలోనే ఉన్నారు. నిజానికి బీఎఫ్.7 ప్రపంచానికి కొత్తదేమీ కాదు. కరోనా కేసులు కూడా చైనాకు కొత్త కాదు. సెప్టెంబర్ మాసంలోనే ఒకేరోజు 40,000 కేసులు నమోదైనట్టు వార్తలు వచ్చాయి. శాస్త్రీయంగా ఎదుర్కొనే ప్రయత్నానికి బదులు, నాటు వైద్యం తరహాలోనే ఆ మహమ్మారి పట్ల చైనా అనుసరించిన విధానం పెనుభూతమైంది. ఇప్పుడు ప్రపంచాన్ని మరిన్ని కొత్త భయాలకు చేరువగా తీసుకువెళ్లింది. భూగోళం మీద చీమ చిటుక్కుమన్నా తమకు తెలియాలని అన్నట్టు ఉండే చైనా ఒమిక్రాన్ వైరస్‌కు సొంత గడ్డ మీద మాత్రం రాచబాట వేసింది. చైనా నుంచి రహస్యంగా బయటపడిన సమాచారం ప్రకారం దాదాపు 25 కోట్ల మంది ప్రస్తుతం ఈ వైరస్ బారిన పడ్డారు. అంటే దేశ జనాభాలో 17.56 శాతం. వీరంతా 2022 డిసెంబర్ 1-20 మధ్య వైరస్ బారిన పడినవారే. 2021 నుంచి దాదాపు సంవత్సర కాలంగా ప్రపంచమంతా ఈ వైరస్ చుట్టి వచ్చినప్పటికీ చైనా పాలకులు ఏం చేస్తున్నారన్నదే ఇప్పుడు అంతా వేసుకుంటున్న ప్రశ్న.
ఎంత నమ్మించాలని చూసినా చైనాలో కేసులూ, మరణాలూ విలయ తాండవం చేస్తున్నాయని ప్రపంచం మొత్తం నమ్ముతున్నది. కానీ ఆ కేసులు, మరణాల సంఖ్యను వెల్లడించే పక్రియకు చైనా ఇప్పుడు ఆగమేఘాల మీద స్వస్తి పలికింది. తాము ఈ వివరాల వెల్లడి పక్రియకు స్వస్తి చెబుతున్నట్టు ప్రకటించింది. 2019 నుంచి తాము ఈ వివరాలు ఇస్తున్నప్పటికీ ఇక నుంచి సాధ్యం కాదని నేషనల్ హెల్త్ కమిషన్ డిసెంబర్ 24, 2022న చెప్పేసింది. అయితే సెంటర్ ఫర్ డీసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ మాత్రం పరిశోధనకు అవసరమైన సమా చారాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో గోప్యతను ఇంత దారుణంగా అమలు చేయాలన్న నిర్ణయం ఏమిటి?
జీ జిన్‌పింగ్ ప్రవేశపెట్టిన జీరో కొవిడ్ విధానం మీద విమర్శలు, ప్రజా తిరుగుబాటు, రోజుకు పది లక్షల కేసులు నమోదు కావడం, 2022, డిసెంబర్ నెల మొదటి 20 రోజులలోనే దాదాపు 25 కోట్ల మందికి వైరస్ సోకినట్టు వార్త పొక్కిన నేపథ్యంలో కొవిడ్ సమాచారం ఏదీ వెల్లడించరాదని చైనా నిర్ణయించుకున్నట్టు కనిపిస్తున్నది. కానీ అనుకో కుండా, లేదా కావాలని జీ జిన్‌పింగ్ డిసెంబర్ 26, 2022న దేశం తాజా పరిస్థితిని ఎదుర్కొంటున్న దని నర్మగర్భంగా అయినా తీవ్రత గురించి వెల్లడించారు. ప్రజల ప్రాణాలను కాపాడాలని అధికారులకు సూచించారు కూడా. నిజానికి ఇందులో చాలా సమాచారం అక్కడి అధికారుల నుంచి ఏదో ఒక సందర్భంలో వెలువడినదే. తూర్పు చైనా ప్రాంతంలో ఉన్న జేజియాంగ్ ప్రావిన్స్‌లో రోజుకు పది లక్షల కేసులు నమోదవుతున్నాయని స్థానిక అధికారులే వెల్లడించారు. ఇక డిసెంబర్ నెల తొలి 20 రోజులలో 25 కోట్ల మంది వైరస్ బారిన పడిన సంగతిని బ్లూమ్‌బెర్గ్, ఫైనాన్షియల్ టైమ్స్ నమోదు చేశాయి. ఇది అక్కడి అధికార యంత్రాంగం నుంచి చాటుగా వెలువడిన సమాచారమే. ఎయిర్‌ఫినిటీ ఇచ్చిన వివరాల ప్రకారం చైనాలో రోజుకు పది లక్షల కేసులు నమోదవుతున్నాయి, 5000 మంది చనిపోతున్నారు. ఎయిర్‌ఫినిటీ ప్రపంచ ఆరోగ్య విషయాలకు సంబంధించిన రహస్య నిఘా సంస్థ. వ్యాధి విస్తృతి ఇంత తీవ్రంగా ఉన్నప్ప టికీ కొవిడ్ పరీక్షల కేంద్రాలను మూసేశారు. ఇక చైనాలో పరిస్థితి ఇలాగే కొనసాగితే 2023లో అక్కడ పది లక్షల మంది వైరస్‌కు బలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు కూడా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తిక్క ధోరణే కారణం. ఆ దేశంలో తయారు చేసిన సినోవాక్, ఫాక్సీవాడ్ అనే వ్యాక్సిన్లు మాత్రమే ఉపయోగించాలని ఆయన ఆదేశించాడు. చావులను పట్టించుకోలేదు. వ్యాప్తినీ పట్టించుకోలేదు. ఇంతకీ ఆ రెండు వ్యాక్సిన్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత చైనా ఆమోదముద్ర వేయించుకున్నదే కానీ, అవి నాణ్యమైనవి కాదని తేలిపోయింది. ప్రాణాలు పోతున్న సిద్ధాంతాలు వల్లిస్తూ విదేశాలలో తయారైన మేలైన వ్యాక్సిన్లను మహాకుడ్యం దాటనివ్వలేదు. ఆసుపత్రులలో సాధారణ ప్రజానీకం ఎదుర్కొంటున్న ఇక్కట్లే కాదు, శ్మశాన వాటికలలో జరుగుతున్న తంతు గురించి కూడా ప్రపంచం దృష్టికి వచ్చింది. ఇవన్నీ అమెరికా వ్యాపింప చేస్తున్న వార్తలేనని, అర్థసత్యాలనీ కొందరు వ్యాఖ్యానించడం కేవలం కుసంస్కారం. మానవత పట్ల అగౌరవం.
ప్రపంచ దేశాలలో పరిస్థితి ఏమిటి?
ప్రపంచ దేశాలకు ఆలోచన లేదు కానీ, లేకపోతే తెలంగాణ వైద్యశాఖ ఉన్నతాధికారి శ్రీనివాస్‌నూ, బ్రదర్ అనిల్‌నూ తమ దేశాలు తీసుకువెళ్లేవారు. ఇందులో శ్రీనివాస్ ఏసు ప్రభువుకు సిఫారసు చేసి వైరస్ వ్యాప్తిని అరికట్టించేవారు. ఇక బ్రదర్ అనిల్ అయితే కరోనాను నేలకేసి తొక్కేసేవారు. కానీ ఈ ప్రహసనాలని క్రైస్తవ ప్రపంచమే నమ్మదు. కాబట్టి అసలు విషయంలోకి వద్దాం. మరొకసారి కొవిడ్ భూతం విజృంభిస్తూ ప్రపంచ దేశాలను భయ పెడుతున్న నేపథ్యంలో ఏయే దేశాలలో ఈ మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తున్నదో ఒక జాబితాను డిసెంబర్ 24న ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. డిసెంబర్ 18 వరకు అందిన గణాంకాల ప్రకారం వ్యాధి లక్షణాలు కనిపించిన వారి సంఖ్యలు ఇలా ఉన్నాయి. జపాన్ -1,046.650, దక్షిణ కొరియా- 459,811, అమెరికా-445,424, ఫ్రాన్స్- 341,136, బ్రెజిల్-337,810. జపాన్‌లో తాజాగా ఎనిమిదో దశ కొవిడ్ సాగుతున్నది. డిసెంబర్ 26వ తేదీ ఒక్కనాడే తమ దేశంలో 371 మంది వైరస్ కారణంగా మృతి చెందినట్టు జపాన్ వైద్యశాఖ అధికారులు చెప్పారు. ఒక్కరోజులోనే ఇంతమంది మరణించడం 2020లో మహమ్మారి విజృంభించిన తరువాత ఇదేనని కూడా వారు అంగీకరించారు. కాబట్టి జపాన్ పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది.
కాంగ్రెస్ నేతల నిర్లక్ష్య ధోరణి
కొవిడ్ నాలుగవ దశ గురించి కాంగ్రెస్ నాయకుల అసందర్భ ప్రేలాపనలు వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడా కొవిడ్ లేదు అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిసెంబర్ 24న ఢిల్లీలో ఒక ప్రకటన చేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ సాగిస్తున్న భారత్ జోడో యాత్రను ఆపు చేయడానికే బీజేపీ ప్రజానీకంలో కొవిడ్ పేరుతో భయాలను సృష్టిస్తున్నదని ఆయన తేల్చి పారేశారు. ఖర్గే ఇలా ప్రకటించడానికి రెండు రోజుల ముందు దాదాపు ఇదే అర్ధం వచ్చేలా రాహుల్ గాంధీ కూడా ఒక ప్రకటన చేశారు. మిగిలిన విపక్షాలు, కోర్టులు గతానుభవాలను నెమరు వేసుకోవడం అవసరమే. ఆక్సిజన్ కేటాయింపులో ఆప్ ప్రభుత్వం వ్యవహ రించిన తీరు, కోర్టులు కేంద్రాన్ని హెచ్చరించిన విధానం మహమ్మారితో పోరాడాతున్న వేళ వాంఛ నీయం కావు. అదే ఇప్పుడూ వర్తిస్తుంది. విపక్షాలు, అవి అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేంద్రం మీద అదే పనిగా నిందలు వేస్తూ రాజకీయ ప్రయోజనాలు చూసుకోవడం సరికాదు. అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అన్ని పండుగలు చేసుకోండి అంటూ ప్రధాని తాజా మన్‌కీ బాత్‌లో చెప్పడం స్వాగతించదగినదే. ప్రజలను ఎక్కువ కాలం ఏదో ఒక కారణంతో బంధించి ఉంచడం సరికాదు. చైనా అనుభవం ఇదే చెబుతోంది. అలాగే ఈ సంవత్సరమంతా ఉచిత రేషన్ బియ్యం అందించాలని కేంద్రం నిర్ణయించడం కూడా మంచిదే. అయితే గుమిగూడడం గురించి పునరాలోచించాలి. ఇండియన్ మెడికల్ అసోసి యేషన్ ఈ సలహా ఇస్తున్నది. బూస్టర్ డోస్ తీసుకోని వారు సాధ్యమైనంత త్వరగా తీసుకోవాలని కూడా అసోసియేషన్ చెబుతున్నది. కేంద్రం ఇస్తున్న భరోసాను బట్టి గత అనుభవాలు పునరావృతం కాకపోవచ్చు. ఇప్పుడు బీఎఫ్.7 లక్షణాలు కనిపిస్తున్న వారంతా విదేశీయులు. అయినా కేంద్రం, వైద్య నిపుణులు ఇస్తున్న సలహాలను చిత్తశుద్ధితో పాటించాలి. మళ్లీ లాక్‌డౌన్ వంటి పరిస్థితిని భారత దేశానికి రాకూడదని ఆశించాలి. ఇందుకు అప్రమత్తత అతి ముఖ్యం.
————————
జాగ్రత్తలు తప్పనిసరి
ప్రమాదం లేదని నిపుణులు చెప్పినా మన జాగ్రత్త మనకు ఉండాలి. మనకు తెలియకుండానే మనచుట్టూ ఉండే ఈ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఒక నిరంతర స్పృహతో మెలగక తప్పదు. ఇవి మరీ కొత్తవి కావు. అవేమిటి?
- చాలినంత నిద్ర: కొవిడ్ వైరస్ బారిన పడకుండా కాపాడడంలో కీలక పాత్ర మన శరీరంలోని రోగ నిరోధక శక్తిదే. అందుకు కావల సినది చాలినంత నిద్ర. విశ్రాంతి తీసుకునే సమయం లోనే మన శరీరం రోగ నిరోధక శక్తిని పెంచే కణాలను వెలువరిస్తుంది. ఇవే ఇన్‌ఫెక్షన్‌తో, అస్వస్థతతో పోరాడుతాయి. మన శరీరం ఆరోగ్య వంతంగా ఉండేందుకు రాత్రి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం.
- ఆరోగ్యదాయకమైన ఆహారం: రోగ నిరోధక శక్తి పెంపునకు అవసరమయ్యే మరొక అంశం ఆరోగ్యదాయకమైన ఆహారం. అది కూడా సమతుల ఆహారమే. పళ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు రోగ నిరోధక శక్తిని నిర్మాణం చేస్తాయి. వివిధ రంగులలో ఉండే కాయలు, పళ్లు వివిధ రకాల ప్రయోజనాలను కలిగిస్తాయి. వాటిని ఎంచుకోవాలి.
- తగినంత నీరు : శరీరానికి అవసరమైన నీరు అందించాలి. అంటే రోజుకు ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి.
- వ్యాయామం: శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడానికి వ్యాయామం అవసరం. క్రమ తప్పని వ్యాయామం రోగనిరోధక శక్తి అవసరమయ్యే కణాలను పెంచుతుంది. రోజుకు అరగంట లేదా వారానికి 150 నిమిషాల వ్యాయామం చేయాలి.
- సహజ నివారణలు: రోగాల బారిన పడకుండా మనని మనం తప్పించుకోవడానికి కొన్ని సహజ నివారణలు కూడా ఉపయోగపడతాయి. విటమిన్ సి అందుకు దోహదం చేసే వాటిలో ఒకటి. ఇది నారింజ జాతి పళ్లలో, స్ట్రాబెరీస్, కివీ పళ్లలో ఉంటుంది. వెల్లుల్లి కూడా రోగ నిరోధక శక్తి పెంపునకు సహాయ పడుతుంది. పసుపు, అల్లం మంచి మందులు.
ఇవన్నీ అవసరమే అయినా వీటిని తీసుకున్నా మని వ్యాక్సిన్ వంటి వాటిని దూరంగా పెట్టడం సరికాదు. పరిస్థితులను బట్టి వైరస్ బారిన పడితే ఇవి తీసుకుంటూనే వైద్యులను సంప్రతించాలి. అలాగే కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే మళ్లీ మాస్క్‌ను ధరించడం తప్పనిసరి చేయడం ఆహ్వానించదగి నదే. వచ్చేది ఆంగ్ల సంవత్సరాది కాబట్టి ఈ జాగ్రత్త కనీస అవసరమే. సబ్బుతో చేతులు కడగడం ఇవన్నీ మళ్లీ ప్రారంభించడం అవసరం. గత అనుభవాల నుంచి నేర్చుకోవాలి తప్ప, అందులో రాజకీయాలు, దురుద్దేశాలు చూడరాదు.
– జాగృతి డెస్క్