ఫిబ్రవరి 1 భీష్మ ఏకాదశి

డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి

కృష్ణార్జునులు నరనారాయణులు కాగా భీష్మాచార్యుడు శిఖరాయమానుడు. జగద్గురువు శ్రీకృష్ణుడు, మహర్షి వేదవ్యాసుడితో సరితూగే వ్యక్తిత్వం ఆయనది. మహాభారతానికి కేంద్ర బిందువు. తాను పెంచి పోషించిన వంశం ఒడుదొడుకులను ఎదుర్కొంటూ, దుష్టచతుష్టయం చేష్టలతో నిర్వీర్యం అవుతుండగా సమస్త పరిణామాలను నిశ్చలచిత్తంతో గమనిస్తూ పరిస్థితులను అధిగమించిన స్థితప్రజ్ఞుడు. జీవితాంతం అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నా ఓటమిని ఎరుగుని ధీరుడు, మహావీరుడు. కనుకనే అనంతరం కాలంలో ‘భీష్మాచార్యుడు లాంటి వారు’ అనే ఉపమానంగా స్థిరపడిపోయాడు.

భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. భీషణమైన ప్రతిజ్ఞ వల్ల భీష్ముడయ్యాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిలా, ద్వాపరంలో ఆయన పితృవాక్య పాలకుడిగా నిత్యస్మరణీయుడు. తండ్రిమాటపై రఘురాముడు వనవాసానికి వెళితే, తండ్రికిగల మరో వివాహ అభిలాషను నెరవేర్చేందుకు ఈయన ఆజన్మ బ్రహ్మచర్యం స్వీకరించాడు. ‘ప్రహ్లాద నారద పరాశర పుండరీక/వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్బ్యాన్‌’ అని పేర్కొన్నట్లు ఆయన పరమ భాగవతోత్తముడు, నిత్యస్తవనీయుడు. చక్రవర్తి కావడానికి అవకాశం ఉండీ, ప్రలోభాలకు అతీతంగా రాజ్యాన్ని నడిపాడు. రాజ్యసంరక్షణకు కంకణబద్ధుడై రాజప్రతినిధిగానే ఉన్నాడు. పాండవుల పట్ల అనుచితంగా వ్యవరిస్తున్న ధార్తరాష్ట్రుల పక్షాన ఉన్నా న్యాయపక్షపాతి. పాండవుల పక్షాన న్యాయం ఉందని తెలిసీ కర్తవ్య నిష్ఠతో దుర్యోధనుడి పక్షాన నిలిచి పోరాడాడు. దుర్యోధనాదులకు హితవు చెప్ప ప్రయత్నించాడు. ధర్మపక్షపాతి వాసుదేవుడు అండ ఉండగా పాండవు లకు పరాజయం ఉండదని ఆయనకు తెలుసు.

భీష్ముడు మహావీరుడే కాదు. ధర్మకోవిదుడు. ‘భీష్ముడి లాంటి వ్యక్తి ముల్లోకాల్లోనూ లేడు. నీతి నియమాలు, సత్యం, వేదవిద్యలు, దానం, యజ్ఞాధి కరణం.. వంటివి ఆచరించాడు, పోషించాడు. ధార్మికజీవితం, బ్రహ్మచర్య దీక్షతో ఆజన్మాంతం అగ్నిహోత్రంలా మనుగడ సాగించాడు’ అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే ప్రకటించడం ఆయన ఉన్నత వ్యక్తిత్వానికి ప్రబల నిదర్శనం. తాను ఏయే అంశాలలో విశిష్టుడో చెప్పుకున్న శ్రీకృష్ణుడు ‘ఆయుధాలు ధరించిన వారిలో భీష్ముడిని (భీష్మ శ్శస్త్రభృతా మహమ్‌)’ అన్నాడు. యుద్ధంలో భీష్ముడి విజృంభణ, రౌద్రాకారం వాసుదేవుడినే కల్లోలపరిచాయి. కనుకను కురుక్షేత్రం సంగ్రామంలో ‘ఆయుధం పట్టను’ అని అర్జునుడికి ఇచ్చిన మాటను పక్కనపెట్టి సుదర్శనం చేపట్టి భీష్ముడిపై లంఘించ బోయాడు. కురుకుల పితా మహుడికీ కావలసింది అదే. ‘దేవాదిదేవా నీ చేతులలో మరణించడం కంటే అదృష్టం మరేముంది’ అని ముకుళిత హస్తాలతో సాగిలపడ్డాడు.

‘అయినవారందరిని సంహరించి నేను సాధించేది ఏముంది?’ అని కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు నీరసపడగా, యుద్ధానంతరం జ్ఞాతులను కోల్పోయి దుఃఖంతో కుమిలిపోతున్నాడు ధర్మరాజు. అప్పుడు అర్జునుడికి కర్తవ్యబోధ చేసిన భగవానుడు, ఇప్పుడు ధర్మరాజుకు సాంత్వన కలిగించవలసి వచ్చింది. అందుకు భీష్ముడే సమర్థుడని, ఆయనకు తెలియని విషయాలు, విశేషాలు లేవని, భావి తరాలకు ఆయన నోట కర్తవ్యబోధ జరగాలని భావించాడు. ధర్మజుడిని అంపశయ్యపై ఉన్న ఆయన వద్దకు తీసుకు వెళ్లాడు. ‘ధర్మశాస్త్రాన్ని ఆపోశన పట్టిన మీరు ధర్మజునికి శాంతిమార్గం ఉపదేశించండి’ అని కోరాడు. ‘జగద్గురువు సమక్షంలో నా బోధనలా? నేను ధర్మకోవిదుడనని, ధర్మమూర్తినని మన్ననలు అందుకుంటున్నప్పటికీ కొన్ని సందర్భాలలో అధర్మాన్ని నిలదీయలేని, అన్యాయాలపై స్పందించ లేని నాకు ధర్మపన్నాలు వల్లించే అర్హత ఉందా?’అనే సంశయంతో ఆత్మపరిశీలన చేసుకున్నాడు కురుకుల పితామహుడు. ‘నాడు దుర్యోధనుడి దుస్సాం గత్యంలో ఉన్నాను కనుక ధర్మం ప్రకాశించ లేదు. అప్పుడు కలుషితమైన రక్తాన్ని దేవదేవుడి సారథ్యం లోని అర్జునుడు తన శరాలతో తీసివేసినందున ఇప్పుడు నిర్మల మనస్కుడను’ అని సమాధాన పరచుకుని శ్రీకృష్ణాదేశ అమలుకు ఉఫక్రమించాడు.

‘సుఖదుఃఖాలను సమంగా భావిస్తూ ఇంద్రియ నిగ్రహం కలిగి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే వారు శిష్టులు. సత్యవాదమే మహాయజ్ఞం. సత్యాన్ని ధర్మం కాపాడుతుంది కనుక మనిషి సత్యతత్పరుడు కావాలి. ఆహార నియమయే తపస్సు. అదే మహాధర్మం. నియమబద్ధమైన నడవడితో కష్టాలను అధిగమించ•గలుగుతారు. లోభం వల్ల అధర్మం, దుఃఖం కలుగుతాయి. కోపం, కపటం, మోసాలకు కారణమైన లోభాన్ని వదలాలి. ధైర్యం లోపిస్తే అరిషడ్వర్గాలు తోడేళ్లలా కలబడతాయి. సంతృప్తితో తృష్ణను జయించవచ్చు. భయాన్ని విడిచిపెట్టాలి. దయాగుణం జాగృతమైతే అసూయ తొలగిపోతుంది. తల్లిదండ్రులు, గురువు వేదత్రయం, త్రిమూర్తుల వంటివారు. కన్నవారి పట్ల ప్రేమానురాగాభి మానాలు కలవారు ఇహపరాలలో గౌరవం పొందుతారు. గురువును సేవించేవారు అవ్యయా నందం పొందుతారు. సాధనతో సోమరితనాన్ని, శౌర్యంతో భయాన్ని వీడాలి’ అని అనేకకానేక ధర్మ సూత్రాలు వివరించారు. వీటిని సకల మానవాళికి దివ్యోపదేశంగా చెబుతారు. ‘భీష్మగీత’ సార్వ కాలీనం. ముఖ్యంగా వర్తమానకాలంలో వ్యక్త్తిత్వ వికాసం, ప్రతి ఒక్కరికి కర్తవ్య బోధగా పెద్దలు చెబుతారు.

ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అలాంటి దానికి ఒక వ్యక్తి పేరు నిర్ణయం కావడానికి ఆయన వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా ఉండాలి! ఆ విశిష్టత దక్కిన మహనీయుడు భీష్ముడు. అంపశయ్యపై యాభయ్‌ ఆరు రోజులు ఉన్న తర్వాత ఇచ్ఛా మరణం వరంతో మాఘ శుద్ధ అష్టమి నాడు దేహత్యాగం చేశాడు. పంచప్రాణాలను సప్తమి నుంచి ఏకాదశి వరకు వరుసగా అయిదు రోజులలో ఒక్కొక్కటి విడిచి పెట్టాడని పండితులు చెబుతారు. ఆయనకు ముక్తి ప్రసాదించిన భగవానుడు, తరువాత వచ్చిన ఏకాదశిని ‘భీష్మ ఏకాదశి’గా ప్రకటించాడు. దానినే ‘జయ ఏకాదశి’ అనీ వ్యవహరిస్తారు. ఆ రోజున ఉపవాసం ఉండి, విష్ణు సహస్ర నామపారాయణంతో ఆయనను అర్చిస్తారు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE