– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్
ఎక్కడ ఏ విజయమైనా, ఎంతటి వెలుగైనా ధీరహృదయులకే సొంతం. వెలుగు పంట అనేది ఎప్పుడైనా సరే, కటిక చీకటి పాలిట పెనుమంట. ఆ ప్రకాశం, వికాసం సదా దీపకాంతులు, సర్వదా ధైర్యజ్యోతులే అవుతాయి. సూర్యుడు పగటి దీపమైతే, చంద్రుడు రాత్రి దివ్వె. ఈ సృష్టిలో పురుషులూ మహిళలూ అంతే. ధైర్యసాహస ప్రదర్శనల్లో ఇద్దరూ సమానులే. నిజానికి ప్రకృతే మానవాళికి విలక్షణ బహూకృతి. అందులో భాగమైన ఆ ఉభయులూ ఒకరు సూర్యక్రాంతి అయితే, మరొకరు చంద్రకాంతి. నరనారీ సమానత సూచికగానే భారత ప్రభుత్వం తాజాగా చక్కని చరిత్ర సృష్టించింది. త్రివిధ దళాలైన పదాతి, వైమానిక, నావిక విభాగాల్లో సమధిక స్థాయిలో వనితల నియామకాలను చేపడుతోంది. అగ్నివీర్ పథకం అందరికీ తెలిసిందే. తొలిసారిగా పడుతులను నౌకారంగంలోకి తీసుకున్నామని నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ చేసిన ప్రకటన దేశమంతటా సరికొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. మొట్టమొదటగా అతివలను నావికులుగా ప్రవేశపెడుతున్నామనడం నారీభేరిని ప్రతిధ్వనింపచేస్తోంది. నిస్సందేహంగా ఇదొక పతాక స్ఫూర్తి.
మన సాయుధ దళాలు తిరుగులేనివి. పటిమలో సాటిలేనంత మేటివి. అన్నీ రక్షణ మంత్రిత్వశాఖ నిర్వహణలో ఉంటాయి. మొత్తం ప్రపంచంలోని పేరొందిన సైనిక బృందం మనకుంది. ఇది అత్యంత శక్తిమంతం. త్రివిధ ప్రధాన దళాలకూ అధిపతులున్నారు. సమన్వయ బాధ్యతలను సంయుక్త ప్రధాన సైన్యాధికారి వహిస్తున్నారు. వీరధీర సైనికులను సత్కరించుకునే కార్యక్రమమూ వార్షికంగా డిసెంబరులోనే. ముచ్చటైన మూడు విభాగాలూ దేశ సరిహద్దులను పరిరక్షిస్తూ వస్తున్నాయి. దేశం లోపల ఎక్కడ ఏ విపత్కరస్థితి తలెత్తినా, రంగంలోకి దిగి రక్షణ విధులు నిర్వర్తిస్తున్నాయి. ప్రత్యేకించి సాయుధదళాల పతాక దినోత్సవం ఎనలేని ప్రాధాన్యం సంతరించుకుంది. మనందరి భద్రతకు పరిపూర్ణ భరోసానిచ్చే సిబ్బంది సంక్షేమం ఒక్క ప్రభుత్వ కర్తవ్యం మాత్రమే కాదు, పౌరుల ఉమ్మడి విధి కూడా. రక్షణ వ్యవస్థలో కీలకమైన నావికాదళం వేలాది సిబ్బందితో నిండి ఉంది. యుద్ధ సమయాలతోపాటు ప్రకృతి వైపరీత్యాల వేళల్లోనూ రంగ ప్రవేశం చేసి తన సత్తా చాటుకుంటుంది. ఒకసారి ఆరు దశాబ్దాల వెనక్కి వెళ్దాం. అప్పట్లో ‘ఆపరేషన్ విజయ్’ చరిత్రాత్మకం. భారత వాణిజ్య నౌకలమీద విదేశీ సైన్యం దాడులకు దిగిన సందర్భమది. ఆ వెంటనే నావికాదళం బరిలోకి దూకింది. శత్రుసేనల్ని తిప్పి కొట్టి తానేమిటో నిరూపించుకుంది.అటు తర్వాత పాకిస్థాన్‌తో పోరులోనూ, మన తీరప్రాంతాల పరిరక్షణ నేవీ చేతుల్లోనే! అలాగే కొన్నేళ్ల కిందట దక్షిణాదిన సునామీ సంభవించినప్పుడు, రక్షణచర్యలు చేపట్టిందీ నావికా విభాగమే. గంటల వ్యవధిలోనే అనేకానేక నౌకలు, యుద్ధ విమాన సంబంధమైనవి, హెలికాప్టర్లు సైతం తరలివచ్చి సహాయ కార్యక్రమాలు సాగించాయి. ఇదంతా నేవీ ఘనతర చరిత్ర.
చైతన్య దీపిక
ఇటీవలి కాలంలో నేవీ నూతన పతాకను స్వీకరించింది. ఇందులో విలక్షణత ఛత్రపతి శివాజీ రాజముద్ర! పతాకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు. దానిలో ఒకవైపు జాతీయ పతాకం. ఆ పక్కనే అష్టభుజాకారం. అవి నీలం, బంగారు వర్ణాలు. చిహ్నంలో ‘సత్యమేవ జయతే’ ఉంటుంది. అక్షరాల దిగువనే నౌకాదళ నినాదం. దానికి అర్థం ‘వరుణుడా! అంతా శుభం కలగాలి’ అని. ఎనిమిది భుజాల ఆకారం దళానికి సంబంధించిన కార్యాచరణ సామర్థ్యానికి సంకేతం. అవన్నీ దిశల పరిధిని సూచిస్తుంటాయి. నీలం అనేది సముద్ర సూచకం. వేరొకటి స్థిరత్వానికి ప్రతిబింబం. తెలుపు వర్ణం శక్తియుక్తుల సమాహారం. శివాజీ పాలనలో నౌకాదళం దృఢంగా ఉండేది. దేశీయంగా నిర్మాణమైన ఇండియన్ నేవీషిప్ (ఐఎన్‌ఎస్) విక్రాంత్‌ను కూడా అదే ఆవిష్కరణోత్సవంలో జలప్రవేశం చేయించారు. ఇది పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న విమాన వాహకనౌక అని ప్రధాని అభివర్ణించారు. రక్షణ రంగంలో స్వావలంబనకు ఇది ప్రత్యక్ష నిదర్శనమనీ విశదీకరించారు. దళంలో పురుషులతోపాటు వనితలకీ సమాన ప్రాధాన్యం కలిగించాలన్నది అన్ని విధాలా హర్షణీయం. నూతనంగా కొన్ని వేలమందిని నియమించుకుంటే, వారిలో అనేకులు స్త్రీలు కావడం అగ్నివీర్ ప్రశస్తిని చాటి చెప్తోంది. ఆత్మనిర్భర భాత్ అంటే ఇది కాక మరేమిటి? విక్రాంత్ ఆరంభం ఓ మైలురాయి. అదే కోవలో మహిళా ప్రాతినిధ్యం ఆ కీర్తి కిరీటంలో కలిగితురాయి.
తీరును చాటే పేర్లు
భారత నౌకాదళం కార్యాచరణ దృఢత్వాన్ని ఏనాడో సాధించింది. తొలి నుంచీ సముద్రం భద్రతకే ప్రాధాన్యమిస్తూ వస్తోంది. ఇతర దేశాల సైనిక, పరిశోధక నౌకల రాకపోకల మీద విస్తృత నిఘా ఉంచుతోంది. ప్రత్యేకించి మనదైన వాణిజ్య వ్యవహారం, ఇంధన అవసరం మహాసముద్రాల ద్వారా తీరుతోంది. ఆ కారణంగానే సముద్ర జలాల భద్రతకు ప్రత్యేక ప్రాముఖ్యమిస్తోంది ప్రభుత్వం.
ఇదే సందర్భంలో తెలుగునాట విశాఖ వేదికగా ఏర్పాటైన నావికా దినోత్సవాల నిర్వహణనూ ప్రస్తావించి తీరాలి మరి. తూర్పు నౌకాదళం ఆధ్వర్యాన ఈ మధ్యనే పలు విన్యాసాలను నిర్వహించారు. సమర సమయంలో ఏ విధంగా స్పందిస్తామో, ఏ రీతిన బరిలోకి దిగుతామో, ఎటువంటి స్థాయిలో ఎదురు దాడులు సాగిస్తామో ప్రదర్శించి చూపారు. దేశంలోని మరో మూడు ‘కమాండ్’ల కేంద్రాలు ముంబయి, కోచి, పోర్ట్‌బ్లెయి. విక్రాంత్‌తో పాటే విరాట్, విక్రమాదిత్య, ప్రహార్, తరంగిణి, అశ్విని అనేవీ విశిష్టంగా రూపొందినవే. తరంగిణి అనేది నావికాదళంలో కొత్తగా చేరినవారికి శిక్షణనిచ్చేది. నౌకలో ఉంటుందీ కార్యక్రమం. నావికులకు వైద్యసేవ, సహాయం అందించేది అశ్విని. భారతీయ నౌకాదళానికి సొంత రేవుగా ప్రసిద్ధి చెందింది ‘కదంబ’. ఇదైతే ఆసియా ఖండంలోనే అత్యాధునిక స్థావరం. కర్ణాటకలో సహజసిద్ధంగా నెలకొన్న కార్వార్ ఓడరేవు దగ్గర దీన్ని అభివృద్ధి చేశారు. ఇక శిఖ్రా అనేది మొట్టమొదటి నౌకాదళ హెలికాప్టర్ స్థావరం. దీన్ని ప్రారంభించింది ముంబయిలో. తీర ప్రాంతం నుంచి దాడి నిర్వహణకు అనువుగా రూపుదిద్దిన నౌక ‘జలాశ్వ’. వందలాది సాయుధ దళాలు, హెలికాప్టర్లు, ఎయిర్‌క్రాఫ్టులను తరలించే సామర్థ్యం దీనికి పుష్కలం. ఈ పేర్లన్నీ స్వభావ సిద్ధంగానే శక్తిసంపన్నతను ప్రతిఫలిస్తున్నాయి.
విశిష్టతకు నిదర్శనాలు ఇవీ
మరిక తొలి గూఢచార యుద్ధనౌక గురించి తెలుసుకోవాలని ఉందా? దాని పేరు శివాలిక్. విభూతి పేరుతో ప్రఖ్యాతి చెందింది. సంపూర్ణ దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన క్షిపణి నౌక. తొట్టతొలి యుద్ధ నౌక ‘సావిత్రి’ మరెంతో విశిష్టతను ప్రస్ఫుటీకరిస్తోంది. జాతీయ ప్రయోజనాలే పరమ లక్ష్యమని ప్రకటించిన హరికుమార్…. ‘వివిధ సవాళ్ళను ఎదుర్కోవడం పైనే దృష్టి సమస్తం కేంద్రీకరించాం’ అని అన్నారు. నిషాంక్, కోరా, రణవీర్ వంటి యుద్ధనౌకలను ‘కమాండ్’ చేసిన ప్రత్యేక ఘనత ఆయనిది. పరమ విశిష్ట, అత్యంత సేవా విశిష్ట పతకాలు సంపాదించిన పోరాట యోధుడు. నేవిగేషన్, డైరెక్షన్ బాధ్యతల నిర్వహణలో ప్రవీణుడు. స్వరాష్ట్రం కేరళ. తిరువనంతపురంలో విద్యాభ్యాసం. దళంలో మహిళల ప్రాముఖ్యం పెరగాల్సిన అవసరాన్ని గుర్తించి, అందుకు అనుగుణమైన జాగ్రత్తలు తీసుకున్నారు. పర్యవసానంగానే అగ్నివీర్‌లో నియామకాల పరంపర. భారత నావికాదళం నానాటికీ బలోపేతమవుతోందని తెలుగునాట పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశంసించడం అభినందనీయం. ఎప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధమని ప్రకటించారు. వీటన్నింటి నేపథ్యంలో, దళంలో అతివల చేరిక ఎంతైనా శ్లాఘనీయం. ఆశించి, అది సాధించేందుకు తపించి, పోటీపడి కృషి సాగించి, విజయాన్ని అందుకోవడమే జీవితం. పట్టుదలతో వ్యవహరిస్తే, కాలమే ఉత్తమ ఫలితాలనిస్తుంది. పరిశీలన, అనుశీలన జత కూడితే వ్యూహరచన. అందులోనూ, కార్యాచరణ పరంగానూ అగ్రభాగాన నిలిచిన ముదితలు తామేమిటో లోకానికి చాటారు. ప్రత్యేకమైన అభిరుచి, అవిశ్రాంత సేవ ఉంటే తప్ప సాయుధ దళాలలోకి ప్రవేశించలేరెవరూ. అంతటినీ సుసాధ్యం చేసిన మహిళా విజేతలను హృదయపూర్వకంగా అభినందించాల్సి ఉంది. సాహసమే పథమైనప్పుడు, గట్టిపట్టు ప్రధానమైనప్పుడు, ఆశయమే సాధనంగా మారుతుంది. తెలివి, శ్రమ తోడైనప్పుడే అతివల ప్రవేశం నూతన ఆశా జ్యోతులను వెలిగిస్తోంది. నారీలోకమణులంటే అక్షరాలా వారే!
ఆ ధీరశక్తి ఇతరులందరికీ స్ఫూర్తి ప్రదాయకం. భారతీయతా దీప్తిమంతానికి ప్రత్యక్ష సాక్ష్యం. అవును కదూ!