– తురగా నాగభూషణం, సీనియర్‌ ‌జర్నలిస్ట్

అధికార వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఈ నెల  ఏడున విజయవాడలో నిర్వహించిన జయహో బీసీ సభ ఆద్యంతం పరనింద, శోత్కర్షలతో సాగింది. బీసీ మంత్రులైతే ఈ సభను వేదికగా ఎంచుకుని అధిష్ఠానం మెప్పుకోసం కళాకారులను మించి భజన చేసి తమ కృతజ్ఞత చాటుకున్నారు. నవరత్నాల లబ్ధిదారుల్లో బీసీల సంఖ్యను లెక్కించి కోట్ల మందికి మేలు చేకూర్చినట్లు ప్రభుత్వం సభలో పేర్కొంది. తమ హయాంలో బీసీలంతా కోటీశ్వరు లైనట్లు ప్రభుత్వం డాబుసరి కబుర్లు చెప్పింది. ఏ ఒక్క బీసీ మంత్రీ తమ వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించలేదు.

వెనుకబడిన తరగతులకు ఒక్క కొత్త పథకం గానీ, అదనంగా నిధులు గాని ప్రకటించకపోవడం ఆ తరగతులను తీవ్ర నిరాశకు గురిచేసింది. కొత్త పథకాల సంగతి అటుంచితే గతంలో ఉన్న వాటికీ ఈ కాలంలో నిధులు కత్తిరించారు. 139 బీసీ కులాలుంటే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కాని వాటికి నిధులు కేటాయించక పోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయాయి. వివిధ వృత్తుల వారికి నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన పథకాలకూ వివిధ కారణాలతో (వయస్సు, లింగం, ఆర్థిక హోదా మొద లగునవి) సుమారు సగం మంది, ఇంకొన్నింటిలో మూడింట రెండొంతుల మంది దూరంగా మిగిలి పోయారు. వీటిని అన్‌లైన్‌లో సరిదిద్దేందుకు తగిన యంత్రాంగం లేదు. ఇక బీసీల స్వయం ఉపాధిని ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. డిగ్రీలు చదివి ఖాళీగా కళ్ల ముందు తిరుగుతున్న యువత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశాలేం సభలో చర్చకు రాలేదు.

స్ధానిక సంస్థల్లో రిజర్వేషన్లు తగ్గింపు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఉండాల్సిన 34 శాతం రిజర్వేషన్లను వైకాపా ప్రభుత్వం 24 శాతానికి పరిమితం చేయడంతో 16,800 మందికి పదవులు లభించక రాజకీయంగా ఎదగలేక పోయారు. రిజర్వేషన్లు లభించి ఉంటే బీసీ ఆశావహులకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం, పదవులు లభించేవి. తమ ప్రాంతాలను స్వయంగా అభివృద్ధి చేసుకునేవారు. ఇప్పుడు ఇతరులపై ఆధారపడాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే పంచాయ తీలకు ఇవ్వాల్సిన నిధులు మళ్లించి బీసీ సర్పంచులను రాజ్యాధికారానికి దూరం చేశారు. బీసీలంటే ఎంతో ప్రేమ కనబరచే వైకాపా ప్రభుత్వం స్ధానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎందుకు తగ్గించిందో చెప్పాలని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

వారికి అధికారం ఉందా?

వైకాపా ప్రభుత్వం బీసీ వర్గానికి పది మంత్రి పదవులిచ్చి మొత్తం బీసీ లందరినీ ఉద్ధరించినట్లు ప్రచారం చేసుకొంటోంది. ఆ మంత్రుల• కూడా స్వేచ్ఛగా, సొంతంగా నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి లేదు. అది అధిష్టానం చెప్పిన పని చేయడమే వీరి పనిగా మారినట్లు ప్రజలే ఆరోపిస్తున్నారు. పదవి ఇచ్చినందుకు అసెంబ్లీలోనూ, బయటా అధిష్ఠానానికి భజన చేయడం, విపక్షాలను తిట్టడం తప్ప, తమ వర్గాలను ఎలా ఆదుకోవాలి? ఎలా అభివృద్ధి చేయాలి అనేది ఆలోచించడం లేదు. ఇక బడుగు బలహీనవర్గాలపై ఉన్నత వర్గాలు దాడులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.

స్వయం ఉపాధి పథకాల అమలు ఏది?

రాష్ట్రంలో పేదరికంలో ఉన్న బీసీలు, చదువుకున్న నిరుద్యోగులు స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పొందేందుకు పలు పథకాలను ప్రభుత్వం అమలు చేసేది. ఈ పథకాలను వెనుకబడిన కులాల ఆర్థిక సహకార సంస్థలు అందించేవి. దీనికి అదనంగా వెనుకబడిన కులాల జాతీయ ఆర్థిక సహకార సంస్థ కూడా ఉంది. కొన్ని కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో అమలు చేయాలి. లబ్ధిదారులకు అందచేసే మొత్తంలో పది శాతం తన వాటాగా పెట్టుబడి పెట్టాలి. ఈ మొత్తం పెట్టుబడిలో సగం నగదును సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వం భరించేది. తన వాటా పది శాతం పోను 40 శాతమే లబ్ధి దారులు తిరిగి బ్యాంకుకు చెల్లించేవారు. ఈ మొత్తాన్ని పెట్టుబడులుగా పెట్టుకుని చిన్న తరహా వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందేవారు. వైకాపా అధికారం చేపట్టిన మూడున్నరేళ్ల నుంచి ఈ పథకాలను అమలుచేయడం లేదు.

లక్ష్యం లేని కార్పొరేషన్లు

రాష్ట్రంలో ఏర్పాటైన బీసీ వెల్ఫేర్‌ ‌కార్పొరేషన్లు లక్ష్యం లేనివిగా మారాయి. రాష్ట్రంలోని 139 బీసీ కులాలుండగా వారిలో 56 కులాలకే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్పొరేషన్ల ద్వారా ఏ బీసీకైనా లబ్ధి కలిగిందా అంటే…లేదనే చెప్పాలి. జీవనోపాధి, స్వయం ఉపాధి, ఉన్నతవిద్యకు సంబంధించిన ఆర్థిరక సహాయం అందించడమే ఈ కార్పొరేషన్ల లక్ష్యం. కాగా వైకాపా ప్రభుత్వం మాత్రం ఈ లక్ష్యాన్ని నెరవేర్చలేదు. అసలు ఈ కార్పొరేషన్లకు ఇంతవరకు నిధులు కేటాయించలేదు. తమ నవరత్నాల పథకంలో లబ్ధ్దిదారులుగా ఉన్న బీసీలనే ఈ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిపొందినట్లు ప్రభుత్వం చెప్పడం వితండవాదంగా బీసీలు పరిగణిస్తున్నారు. వైకాపాలో పనిచేసిన వారికి కార్పొరేషన్‌ ‌ఛైర్మన్‌ ‌పదవులు కట్టబెట్టారు. వీరికి జీతభత్యాలు, వాహనం, సిబ్బంది, కార్యాలయం మాత్రం కేటాయించారు. అంతకు మించి నిధులు ఇవ్వడం లేదు. లక్ష్యం లేకుండా ఏర్పాటై, ఖర్చులకే పరిమితమైన ఈ కార్పొరేషన్లను కొనసాగించడం ఎందుకో ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయా వర్గాల ప్రజలు డిమాండ్‌ ‌చేస్తున్నారు.

ఆదరణ కరవు

గతంలో కులవృత్తులతో జీవించే వర్గాల వారికి అవసరమైన సాధారణ, యాంత్రిక పనిముట్లను రాష్టప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో అందించేది. రజకులకు వాషింగ్‌ ‌మెషీన్లు, పదిమంది కలిసి నిర్మించుకుంటే 10 లక్షల వ్యయంతో బట్టలు ఉతికే యాంత్రిక పనిముట్లు, నాయీ బ్రాహ్మణులకు పనిముట్లు, ఆధునిక కుర్చీలు, బ్యాండుమేళం, బ్యూటీపార్లర్‌లకు పనిముట్లు ఇచ్చేవారు. చేనేత కార్మికులకు కూడా పనిముట్లు అందేవి. నూలు వడికే వారు, రాట్నం తిప్పేవారు, రంగులద్దే వారందరూ లబ్ధిపొందేవారు. సొంత మగ్గం ఏర్పాటు చేసు కునేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభించేది. దర్జీ పనిచేసుకునేవారికి మెకనైజ్డ్ ‌మిషన్‌ ఇచ్చేవారు. కమ్మరులు, కుమ్మరులు, వడ్రంగులు, తాపీపనివారు, ఎలక్ట్రీషియన్లు, ఫ్లంబర్లు ఇలా… ఏ వర్గానికి ఆ వర్గానికి పనిముట్లు ఇచ్చేవారు. ఇలా బీసీలందరూ లబ్ధిపొందేవారు. కాని ఈ పథకాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కులాలకు చెందిన వారికి, యాదవులు, కురుబలకు స్వయం ఉపాధి ద్వారా గొర్రెల కొనుగోలుకు సబ్సిడీతో కూడిన ఆర్థిక సహాయం లభించేది. ఇప్పుడు మాత్రం ఆర్ధిక సహాయం లభించడం లేదు.

నిర్మాణరంగంలో ఆకలి కేకలు

నిర్మాణరంగ కార్మికుల్లో 90 శాతం మంది బీసీలే. ఇసుక కృత్రిమ కొరత వల్ల నిర్మాణాలు జరగక ఈ రంగంపై ఆధారపడిన 30 లక్షల మంది బీసీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. పనులు లేక అప్పులు దొరక్క పస్తులున్నారు. కొందరు ఆకలితో మరణించారు. బీసీ కూలీల ఆకలి కేకలు, ఆర్తనాదాలు ప్రభుత్వం చెవిన పడడంలేదు. ఇదిలా ఉంటే మద్యం ధరలు రెండింతలు పెంచేసి కూలీల జేబులు చిల్లులు పట్టేశారు. మద్య నిషేధం అమలు హామీని బుట్టదాఖలు చేశారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీసీ కార్మికులు, కూలీలకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుంది. ఆటో డ్రైవర్లలో కూడా 70 శాతం మంది బీసీలే ఉన్నారు. అయితే ఆటో యజమానులకు తప్ప అద్దెకు తీసుకుని నడిపేవారికి రూ.10 వేలు ఇవ్వడం లేదు. అలాగే చేనేత మగ్గం యజమానులకే సాయం అందించడంతో సొంత మగ్గం ఏర్పాటు చేసుకోవా లనుకున్న ఈ వర్గం వారికి అన్యాయం జరుగు తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 2.50 లక్షల మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించే జీవో ఇంకా వారి మెడపై కత్తిలా వేలాడుతోంది. ఇందులో సగానికి పైగా బీసీలే ఉన్నారు.

అధికార దుర్వినియోగం

వైకాపా నిర్వహించిన సభ కోసం అధికార దుర్వినియోగం జరిగిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. సభకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను తరలించారు. దీంతో ప్రజారవాణాకు భారీ ఆటంకం కలిగింది. అధికార యంత్రాంగం, పోలీసులు అన్ని పార్టీలూ, సంఘాల పట్ల సమదృష్టితో చట్టనిబంధనల ప్రకారం వ్యవహరించాలి. దానికి భిన్నంగా అధికార పార్టీకి విచ్చలవిడిగా వెసులుబాటు కల్పించడం అప్రజాస్వామికం. ఇకముందైనా అధికార, పోలీసు యంత్రాంగాలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.

బీజేపీ ప్రభుత్వం బీసీల పక్షపాతి

బీజేపీ అంటేనే బీసీల ప్రభుత్వం. కేందప్రభుత్వం విద్య, ఉద్యోగాలకు సంబంధించిన 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను తీసుకొచ్చింది. దేశంలో రిజర్వేషన్‌ ‌ఫలాలు అన్ని కులాలకు సమానంగా అందేలా వర్గీకరి స్తున్నది. జనాభాలో పది శాతంగా ఉన్న ‘జాతీయ సంచార జాతుల సంక్షేమ అభివృద్ధి’ బోర్డును ఏర్పాటు చేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో, నవోదయ విద్యాలయాల్లో, సైనిక్‌ ‌స్కూల్స్‌లో 27 శాతం ఓబీసీలకు రిజర్వేషన్‌ ‌కల్పించడంవలన కొన్ని వేల మంది బీసీ విద్యార్థులకు సీట్లు వస్తున్నాయి. మత్స్య కారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. బీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదే.

About Author

By editor

Twitter
YOUTUBE