– తురగా నాగభూషణం, సీనియర్ జర్నలిస్ట్
ఆంధప్రదేశ్‌లో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం కొనసాగుతోందని రాజకీయ పార్టీలు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వైసీపీ పాలనలో తీవ్ర వైఫల్యం చెందింది. ధరల పెరుగుదల, అవినీతి, బంధుప్రీతి, అరాచకం, రౌడీయిజం, వనరుల దోపిడి, ప్రశ్నించిన వారిపై దాడులు, పోలీసు కేసులతో వేధించడంతో రాజ్యహింస జరుగుతోంది. విపక్ష నాయకులను, కార్యకర్తను భయకంపితులను చేయడానికి వారిపై దాడులు, ఆస్తుల ధ్వంసం, అక్రమ కేసులు పెట్టి వేధించడం వంటివి నిత్యకృత్యమైపోయాయి.
ఈ మూడున్నరేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకడంతో ఎన్నికల్లో ఓడిపోతామనే అభిప్రాయం అధికార పార్టీకి కలుగుతోంంది. ప్రభుత్వం నిర్వహిస్తోన్న గడప గడపకు కార్యక్రమంలో తమ సమస్యలను పరిష్కరించాలంటూ ప్రజలు ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. 32 మంది ఎమ్మెల్యేలు ప్రజల ఇళ్లకు వెళ్లడం లేదని, రాబోయే మూడు నెలల్లో పనితీరు మార్చుకోకుంటే వారికి టిక్కెట్ ఇవ్వనని ఇటీవల జరిగిన గడప గడపకు సమీక్షలో ముఖ్యమంత్రి హెచ్చరించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ 32 మంది ఎమ్మెల్యేలు వారి ఇళ్లకు వెళ్లని విషయం ముఖ్యమంత్రి గుర్తించ లేకపోతున్నారు. తప్పంతా ఎమ్మెల్యేలపై నెట్టేస్తున్నారు. పాలనా వైఫల్యాలు, అవినీతిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు తట్టుకోలేక వారిపై ఎదురుదాడులకు దిగుతున్నారు. ఆస్తుల ధ్వంసం, దహనం చేయడం, మారణాయు ధాలతో దాడులు చేయడం కొనసాగుతోంది. దీనిని ఆపాల్సిన పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి దాసోహం కావడంతో పరిస్థితి ఎక్కడికి దారితీస్తోందని ప్రజలు తీవ్ర ఆందోళన చెందు తున్నారు. మాచర్లలో జరిగిన హింసాకాండ ఇంతటి బీభత్సానికి ఒక ఉదాహరణ.
అధిపత్య ధోరణులతో సమస్య
అధికారం లభిస్తే రాష్ట్రం మొత్తం తమదే అన్న భావన ప్రాంతీయ పార్టీల్లో కనిపిస్తోంది. భూకబ్జాలు, వనరుల దోపిడీకి లైసెన్సు ఇచ్చినట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రాంతీయ పార్టీల పాలన సాగుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగింది. ఇసుక, మద్యం, ల్యాండ్ మాఫియాలు చెలరేగిపోయాయి. ఈ నేపథ్యంలో అధిపత్యం కోసం వైసీపీ, టీడీపీ అల్లర్లు, అరాచకాలను ప్రోత్సహించడం పరిపాటిగా మారింది. గత మూడేళ్లుగా ఈ పరిస్థితి కొనసాగుతూ ఉండటంతో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. రెండు పార్టీల మధ్య జరుగుతున్న అధిపత్య పోరులో ప్రజలు నలిగిపోతున్నారు. పల్నాడు అధిపత్య రాజకీయాలకు నెలవు. ఇందులో మాచర్ల ఒకటి. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా పల్నాడులో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగాయి. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ విపక్షాల మధ్య ఘర్షణలు కొనసాగాయి. కాని ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఘర్షణలు జరగడం, ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వచ్చేసింది. మాచర్లలో టీడీపీ•, వైసీపీ వర్గాల మధ్య చోటు చేసుకుంటున్న ఘర్షణలలో పోలీసుల పాత్ర తరచూ వివాదస్పదం అవుతోంది. అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న విమర్శలు ఉన్నా కొంత మంది అధికారులు మరో అడుగు ముందుకు వేసి తమను పూర్తి స్థాయిలో కట్టడికి ప్రయత్నిస్తు న్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రతిఘటన తీవ్రంగా ఉన్నపుడు హింస చెలరేగి శాంతిభద్రతల సమస్యలు ఎదురవుతున్నాయి. మాచర్లలో జరిగిన సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మాచర్లలో కవ్వింపు ధోరణిలో అధికార పార్టీకి చెందిన నాయకులు ముందుగా విపక్ష నాయకులు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని నిరోధించాలని చూడటం, ఇదే సమయంలో ఆ పార్టీ వారు ప్రతిఘటించడంతో, పరస్పర దాడులు జరిగాయి. తరువాత అధికార పార్టీ వారు మరింత రెచ్చిపోయి విధ్వంసానికి పాల్పడటం కొద్ది గంటల్లో జరిగిపోయింది. విపక్ష కార్యాలయం, వాహనాల దగ్ధం, కార్యకర్తలను చితక్కొట్టేలా దాడులు చేయడం మీడియాలో కనిపిస్తోన్న దారుణాలు. మాచర్లలో టీడీపీ నాయకుడు బ్రహ్మారెడ్డి చాలా కాలం తరువాత క్రియాశీలక రాజకీయాల్లోకి తిరిగి వచ్చి నియోజక వర్గంపై పట్టుకు ప్రయత్నించడంతో రానున్న ఎన్నికల్లో వైసీపీకి తీవ్ర పోటీ తప్పదని తెలిసి రాజకీయ వివాదాలు పెరిగి ఘర్షణలు ఏర్పడుతున్నాయి.
లక్ష్యం ఇదే…
అధికార పార్టీ ఎన్నికలకు ముందు నుంచే ఒక పథకం ప్రకారం తమపై దాడులు, విధ్వంసాలకు పాల్పడుతోందని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. అధికారపక్షంపై వచ్చిన వ్యతిరేకతతో పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఓటమి గురించి చర్చించుకుంటున్నారు. ప్రజలైతే అధికార పార్టీ వైఫల్యం, వేధింపులు, ఆర్ధిక భారాలు, నిరుద్యోగం తదితర అంశాలపై బాహాటంగానే మాట్లాడు కుంటున్నారు. అధికార పార్టీ అభిమానులు, గత ఎన్నికల్లో ఓటేసిన వారు కూడా పాలన పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఎన్నికల్లో గెలస్తామనే సంకేతాన్ని తమ కార్యకర్తలకు ఇచ్చేలా అధికార పార్టీ రాజ్యహింసకు పాల్పడుతోందని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, మేధావులు ఆరోపిస్తున్నారు. విపక్షాలపై దాడులు చేయడం, విధ్వంసం సృష్టించడం ద్వారా వారిలో ధైర్యం సన్నగిల్లేలా, ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా చేయడం, ప్రతిపక్షాలను, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం అధికార పార్టీ లక్ష్యంగా ఉన్నట్లు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చర్చించుకుంటున్నారు.
పోలీసుల పాత్రపై చర్చ
అధికార-విపక్ష పార్టీల వ్యవహారంలో పోలీసుల పాత్రపై ఇదివరకెన్నడూ లేని విధంగా చర్చ జరుగుతోంది. అధికార, విపక్షాల మధ్య జరిగే ఘర్షణల్లో నిందితులను వదిలేసి బాధితులనే లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉండటం ఎప్పటినుంచో చూస్తున్న విషయమే అయినా కార్యకర్తల్లా పనిచేయడం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం. స్ధానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థులు పోటీ చేయకుండా అధికార పక్షం నాయకులు, కార్యకర్తలు అడ్డుకుంటుంటే పోలీసుల వైపు నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదు సరికదా బాధితులపైనే కేసులు పెట్టిన పరిస్థితిని ప్రజలు చూశారు. రాబడి గల పోస్టులు పొందడం కోసం అధికార పక్షానికి ఊడిగం చేసే కొంతమంది పోలీసు అధికారుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని వ్యాఖ్యలు ఉన్నాయి. రేపు మరోపార్టీ అధికారంలోకి వచ్చి ఇదే ధోరణి కొనసాగిస్తే మరింత అరాచకం చోటుచేసుకోవచ్చు. ఇలాంటివి ప్రోత్సహిస్తే, సామాన్యులకు న్యాయం జరగదు. పోలీసు వ్యవస్థ లక్ష్యం దారితప్పుతోందని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు.
ఫాక్ష్యన్ గొడవగా ప్రకటన
మాచర్లలో జరిగిన విధ్వంసకాండను పోలీసులు ఫాక్షన్ గొడవగా ప్రకటించారు. ఫాక్షన్, పాతకక్షల వల్లే గొడవలు జరిగితే రాజకీయ పార్టీలు ఇందులో ఎందుకు పాల్గొన్నాయో అనే విషయాన్ని పోలీసులు వాస్తవాలు వెలికి తీయాలి. పక్షపాతం లేకుండా విచారించి సంఘటనకు కారకులు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కేసులు నమోదు చేయాలి. అధికార పక్షం చేస్తున్న దాడులతో ప్రజలు భీతావహులు అయిపోతున్నారు. ఇలాంటి పార్టీనా అధికారంలోకి తెచ్చిందని బాధపడుతున్నారు. హింసను ప్రేరేపించే పార్టీని ఓడించాలని నిర్ణయించుకున్నారు. హింసాత్మక ఘటనల మధ్య నలిగిపోతున్న ప్రజల గురించి ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచించి ఇకముందు ఇలాంటివి జరగకుండా చూడాలి.