– జమలాపురపు విఠల్‌రావు

డిసెంబర్‌ 9‌న చైనా సైనికులు తవాంగ్‌ ‌సెక్టార్‌లోని యాంగ్‌ట్సీ వద్ద వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చేందుకు యత్నించడం మారని ఆ దేశ వైఖరికి విస్పష్ట నిదర్శనం. నిజానికి అన్ని రకాల సంసిద్ధతతో ఈ అకృత్యానికి పాల్పడటం కోసం భారత భూభాగంలోకి దాదాపు 300 మంది చైనా సైనికులు వచ్చారు. అయితే, మన సైన్యం కూడా పూర్తి సన్నద్ధతతో ఉన్నదన్న సంగతిని ఊహించి ఉండరు. ఫలితంగానే చావుదెబ్బతిని పారిపోవాల్సి వచ్చింది.

భారత్‌-‌చైనాల మధ్య వివాదాస్పద ప్రదేశాలుగా గుర్తించిన 23 కేంద్రాల్లో యాంగ్‌ట్సీ ఒకటి. ఇది తవాంగ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2020లో గల్వాన్‌ ‌సంఘటన తర్వాత రెండు దేశాల సైన్యాల మధ్య జరిగిన రెండో అతిపెద్ద సంఘర్షణ ఇది. డిసెంబర్‌ 9‌న ఏం జరిగిందనే దానిపై సండే గార్డియన్‌ ‌పత్రిక తాజా కథనం వెల్లడించింది. దీని ప్రకారం జీ-20 సదస్సు సందర్భంగా నవంబర్‌ 15‌న నరేంద్రమోదీ, జిన్‌పింగ్‌ల భేటీ జరిగిన తర్వాత, అదే నెల చివరివారంలో సరిహద్దు వద్ద చోటుచేసుకుంటున్న కొన్ని ‘అసహజ’ పరిణామాలనూ భారత సైన్యం పసిగట్టింది. ‘సరిహద్దు ప్రదేశాల్లో పీఎల్‌ఏ (‌పీపుల్స్ ‌లిబరేషన్‌ ఆర్మీ) పెట్రోలింగ్‌ ‌సైనికుల కదిలికలు పెరగడాన్ని గమనించిన భారత సైనికాధికారులు.. క్షేత్రస్థాయిలో పీఎల్‌ఏ ‌సైనికులు ప్రవేశించే అవకాశమున్న ప్రాంతాల్లో సైనికుల సంఖ్యను పెంచారు. కాగా డిసెంబర్‌ 8-9 ‌మధ్య రాత్రి సమయంలో ‘థర్మల్‌ ఇమేజర్స్’‌ను చేతిలో పట్టుకున్న పీఎల్‌ఏ ‌సైనికులు ఇండియన్‌ ‌పోస్ట్‌ల సమీపంలో గుమికూడటం మొదలైంది. ఉదయం 6 గంటల సమయంలో క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు అందుతున్న సమాచారం మేరకు ‘క్విక్‌ ‌రియాక్షన్‌ ‌టీమ్‌’ (‌క్యూఆర్‌టీ)లను భారత సైన్యం సిద్ధంచేసింది. సరిహద్దు వద్ద 50 మంది సైనికులు మాత్రమే ఉంటారనుకొని పీఎల్‌ఏ 300 ‌మంది సైనికులను రంగంలోకి దించింది. అయితే పీఎల్‌ఏ ‌వ్యూహకర్తలు క్విక్‌ ‌రియాక్షన్‌ ‌టీమ్‌లు వెనుకభాగంలో ఉన్నాయన్న సంగతిని అంచనా వేయలేదు. పీఎల్‌ఏ ‌సైనికులు మన భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సరిహద్దు దాటి అక్కడే ఉన్న 50 మంది మన జవాన్లతో ఘర్షణకు దిగారు. వెంటనే చుట్టుపక్కల ఉన్న క్విక్‌ ‌రియాక్షన్‌ ‌టీమ్‌ ‌సభ్యులు ‘ఎలక్ట్రిక్‌ ‌టాసర్‌ ‌స్టిక్స్’, ‘‌శీలలతో కూడిన బ్యాట్లు’ ధరించి ఘర్షణ ప్రదేశానికి తక్షణమే చేరుకున్నారు. క్యూఆర్‌టీ సభ్యులు చిన్న గుంపులుగా పీఎల్‌ఏ ‌సైన్యాన్ని చుట్టుముట్టడంతో చైనా సైనికులు పరిస్థితి గమనించి తక్షణమే పలాయనం చిత్తగించారు. పారిపోతున్న వారిని భారతసైన్యం వెంటాడి మరీ చితక బాదింది. ఈ సందర్భంగా కనీసం 10 మంది (15 వరకు ఉండవచ్చునంటున్నారు) పీఎల్‌ఏ ‌సైనికుల తలలపై తీవ్రగాయాలయ్యాయి. చివరకు పీఎల్‌ఏ ‌కమాండర్లు తమ వారిని కాపాడుకోవడానికి గాలిలో కాల్పులు జరిపేవరకు క్యూఆర్‌టీ టీమ్‌ ‌వారిని వెంటాడి చితకబాదారు’ అని సండే గార్డియన్‌ ‌పత్రిక రాసింది.

విచిత్రమేమంటే పీఎల్‌ఏ ‌సైనికులతో పాటు కొన్ని డ్రోన్‌లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. పీఎల్‌ఏ ‌సైనికులు భారత సైనికులపై దాడి చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించడం వీరి ఉద్దేశం. భారత సైనికులు తమ ధాటికి వెనుదిరిగితే దాన్ని చైనాలో మరింత ప్రచారాస్త్రంగా వాడుకొని దేశంలో నెలకొన్న ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడవచ్చునని జిన్‌పింగ్‌ ఆశించి ఉండవచ్చు! కానీ భారత సైన్యం తిరగబడటం, వీరి ధాటికి పీఎల్‌ఏ ‌సైనికులే బతుకుజీవుడా అని పారిపోవడం మొత్తం చైనా వ్యూహాన్ని తల్లక్రిందులు చేసింది. ఒకవేళ చైనా అనుకున్నట్టు జరిగినట్లయితే గ్లోబల్‌ ‌టైమ్స్‌లో తమ సైనికుల వీరోచిత పోరాటంపై ఊపిరి సలపని రీతిలో కథనాలు వెలువడి ఉండేవి. కానీ ఒకటి, రెండు కథనాలు, అవి కూడా తమ పెట్రోలింగ్‌ ‌సైనికులపై భారత సైన్యమే దాడిచేసిందన్న ఆరోపణలతో కూడినవి మాత్రమే కనిపించడం విశేషం. అదీ కాకుండా చైనా సైనికులను, భారత దళాలు చితకబాదుతున్న వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌ ‌కావడంతో పరువుపోయి కక్కలేక మింగలేక అన్న రీతిలో ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో చైనా మీడియా కూడా ఈ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటించింది. అయితే భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ‌పార్లమెంట్‌ ఉభయ సభల్లో ఈ సంఘటనపై ప్రకటన చేయడంతో చైనాకు స్పందించక తప్పలేదు. మన రక్షణ మంత్రి ప్రకటన చేసి ఉండకపోతే, బహుశా చైనా ఈ సంఘటనను ఎక్కడా ప్రస్తావించి ఉండేది కాదు. విచిత్రమేమంటే భారత సైనికులు, చైనా దళాలను చితకబాదుతున్న వీడియో చూసిన తైవాన్‌ ‌ప్రజలు పెద్దఎత్తున ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యంగా యూరప్‌, అమెరికా దేశాల్లో ఈ వీడియో సంచలనం సృష్టించడమే కాదు చైనాను సమర్థవంతంగా భారత్‌ ‌నిలువరించగలదన్న సత్యం మరోసారి ప్రపంచానికి వెల్లడైంది.

ముందస్తు వ్యూహంతోనే

తవాంగ్‌ ‌సంఘటన అప్పటికప్పుడు జరిగింది కాదని, చైనా ఉన్నతస్థాయి నాయకత్వం భవిష్యత్తులో పీఎల్‌ఏకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించిందనడానికి ఇది నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. అంటే వచ్చే నాలుగైదేళ్ల కాలంలో ఎంతవరకు వీలైతే అంతవరకు క్రమంగా ఆక్రమించు కుంటూ వెళ్లాలన్నది కూడా ఒక లక్ష్యంగా (సలామీ స్లైస్‌) ‌కనిపిస్తోంది. ముఖ్యంగా చైనా సైనికులు గతంలో తాము పెట్రోలింగ్‌ ‌జరపని ప్రాంతాల్లోకి రావడం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. 17 వేల అడుగుల ఎత్తున ఉండి ప్రస్తుతం భారత సైన్యం అధీనంలో ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించు కోవడానికి రావడం, ఇదే సమయంలో భారత్‌ ‌రక్షణ దళాల సన్నద్ధత, సామర్థ్యాన్ని అంచనా వేయడం ఈ ఎత్తుగడలో భాగమేనని భావించాలి. ఇందులో విజయవంతమైతే తర్వాతి కాలంలో తాను చొరబాట్లకు అనుసరించాల్సిన వ్యూహరచన చేసుకోవచ్చు.

భారత్‌పై ఒత్తిడి

ప్రస్తుతం చైనా దూర పసిఫిక్‌, ‌పశ్చిమాసియా ప్రాంతా దేశాలతో అమెరికాకు వ్యతిరేకంగా అలయన్స్ ‌కోసం తీవ్రంగా కృషి చేస్తున్నది. ఈ నేపథ్యంలో యూఎస్‌తో, క్వాడ్‌తో సంబంధాల విషయంలో భారత్‌ను పునరాలోచించుకునే విధంగా ఒత్తిడి తీసుకొని రావడం సరిహద్దు సమస్యలు సృష్టించడం వెనుక దాగి ఉన్న అసలు కారణం. అంతేకాదు సరిహద్దు దేశాలతో తప్ప అంతర్జాతీయ వ్యవహారాల్లో కలుగజేసుకోవద్దని నరేంద్రమోదీ ప్రభుత్వానికి చేసిన హెచ్చరిక ఇందులో దాగి ఉంది. వచ్చే దశాబ్దంలో అమెరికాను వెనక్కి నెట్టి తానే సూపర్‌ ‌పవర్‌గా ఎదిగే లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు తూర్పు, పశ్చిమ రంగాల్లో తన సైనిక లక్ష్యాలు నెరవేర్చుకోవాలన్న లక్ష్యం కూడా ఇందులో ఇమిడి ఉంది.

చైనా దుగ్ధకు కారణాలేమిటి?

అంతర్జాతీయంగా భారత్‌ ‌ప్రతిష్ట పెరుగు తుండటం సూపర్‌ ‌పవర్‌గా ఎదగాలని తహతహ లాడుతున్న చైనా సహించలేకపోతున్నది. పాకిస్తాన్‌ను ఎగదోయడం ద్వారా భారత్‌ను ప్రాంతీయ స్థాయికే పరిమితం చేయాలన్న తన లక్ష్యానికి భిన్నంగా భారత్‌ ‌మరింత పటిష్టంగా, ఆర్థిక, సైనికశక్తిగా వేగంగా దూసుకుపోవడం చైనాకు ఎంతమాత్రం అంగీకార యోగ్యం కాదు. ముఖ్యంగా భారత్‌ ‌జీ-20 అధ్యక్ష స్థానాన్ని స్వీకరించడం, 2024లో క్వాడ్‌ ‌సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో మన దేశాన్ని ఇబ్బంది పెట్టడానికే చైనా తవాంగ్‌లో తాజా చొరబాటుకు ఒక కారణంగా చెబుతున్నారు. అన్నింటికీ మించి ఇటీవల భారత్‌-అమెరికాలు ఉత్తరాఖండ్‌లోని ఔలీ వద్ద యుద్ధ అభ్యాస్‌ ‌పేరుతో సైనిక విన్యాసాలు నిర్వహించడం చైనా ఆగ్రహానికి మరో ప్రధాన కారణం. ఔలీ చైనా సరిహద్దుకు కేవలం వంద కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దీనిపై నవంబర్‌ 30‌న ఒక ప్రకటన చేస్తూ 1993-96 సరిహద్దు ఒప్పందాలకు భారత్‌ ‌కట్టుబడి ఉండాలని కోరడమే ఇందుకు నిదర్శనం. నిజానికి 2020 జూన్‌లో గల్వాన్‌ (‌పెట్రోలింగ్‌ ‌పాయింట్‌ 14), ‌కుగ్రాంగ్‌ ‌నుల్హా (పెట్రోలింగ్‌ ‌పాయింట్‌ 15), ‌పాంగాంగ్‌ ‌లోయలో ఉల్లంఘనలకు పాల్పడటం ద్వారా చైనా తానే ముందు ఈ ఒప్పందాలను తుంగలో తొక్కింది. ఇదిలా ఉండగా ఔలీ సైనిక విన్యాసాల తర్వాత రెండు దేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగిన వారం తర్వాత తవాంగ్‌ ‌సంఘటన జరగడం గమనార్హం. అమెరికాతో ద్వైపాక్షికంగా భారత్‌ ‌సన్నిహితం కావడం చైనాకు ఇష్టం లేదనేది ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. తనకు వ్యతిరేకంగా ఏర్పాటైన క్వాడ్‌లో భాగస్వామి అయిన నేపథ్యంలో మన దేశానికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశం, దేశీయంగా ప్రజల్లో వ్యక్తమవు తున్న అసంతృప్తి నుంచి దృష్టి మరలించాలన్న మరో కోణం కూడా ఇందులో దాగి ఉన్నాయి.

అసలు ఉద్దేశం అబ్జర్వేషన్‌ ‌పోస్ట్ ఏర్పాటు

ఇప్పటికే తవాంగ్‌ ‌ప్రాంతంలో విపరీతమైన చలి వ్యాపించింది. రాబోయే రోజుల్లో వాస్తవాధీన రేఖ వెంట కొన్ని అడుగుల మేర మంచు పేరుకుపోతుంది. ఇందుకు తగిన విధంగా భారత దళాలు అన్ని ఏర్పాట్లు చేసుకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన సైనిక దళాలు శీతాకాలానికి ఏ విధంగా సంసిద్ధ మవుతున్నాయనేది తెలుసుకోవాలన్న ఉద్దేశంతో పీఎల్‌ఏ ‌వాస్తవాధీన రేఖ వెంట ఒక అబ్జర్వేషన్‌ ‌పోస్టును ఏర్పాటు చేయాలని చూస్తోందన్న వార్తలు వచ్చాయి. ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు వాస్తవాధీన రేఖపై అటువంటి చర్యలు చేపట్టకూడదు. ఇదిలా ఉండగా రెండు దేశాల మధ్య 3,488 కిలో మీటర్ల సరిహద్దు వెంట పశ్చిమ (లద్ధాఖ్‌), ‌మధ్య (ఉత్తరాఖండ్‌), ‌తూర్పు (సిక్కిం, అరుణాచల్‌ ‌ప్రదేశ్‌) ‌ప్రాంతాల్లో పరిస్థితులను భారత్‌ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ముఖ్యంగా తూర్పు లద్ధాఖ్‌ ‌ప్రాంతంలో రెండు దేశాలు పరస్పరం 50 వేల సైనికులను మోహరించి ఉంచాయి. వాస్తవాధీన రేఖ వెంట వివాదాస్పద 23 ప్రాంతాలపై భారత్‌ ‌ప్రత్యేక దృష్టిని పెట్టింది. ఈ ప్రదేశాలు తూర్పు లద్ధాఖ్‌లోని డెమ్‌చోక్‌, ‌చుమార్‌ ‌నుంచి అరుణాచల్‌ ‌ప్రదేశ్‌లోని యంగ్‌సీ ఫిష్‌టైల్‌-1, 2 ‌వరకు విస్తరించి ఉన్నాయి. 2020లో తూర్పు లద్ధాఖ్‌లో మరిన్ని చొరబాట్లకు పాల్పడిన చైనా ఇప్పుడు తూర్పువైపున 1346 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంపై దృష్టి పెట్టినట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి తవాంగ్‌ ‌వద్ద అధిక సంఖ్యలో భారత సైనిక దళాలు అనుక్షణం అప్రమత్తంగా ఉంటాయి. ఈ ప్రాంతం భూటన్‌కు తూర్పు వైపు రక్షణ కల్పిస్తుంది కూడా.

2020 తర్వాత పెరిగిన ఘర్షణలు

1962 యుద్ధం తర్వాత, 1967లో నాథూలా, ఛోలా వద్ద, 1987లో సముడొరాంగ్‌ ‌ఛు వద్ద, 2017లో డోక్లాం వద్ద ప్రతిష్టంభన చోటుచేసు కుంది. 2020 నుంచి సరిహద్దు ప్రాంతాల్లో ఇరు దేశాల సైనికుల మధ్య సంఘర్షణల సంఖ్య బాగా పెరిగింది. అదే ఏడాది జూన్‌ 20‌న గల్వాన్‌ ‌ఘర్షణలో 20 మంది భారత సైనికులు, 42 మంది చైనా సైనికులు మరణించారు. లద్ధాఖ్‌లో గత 20 నెలలుగా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. భారత్‌, ‌చైనాలు ఇప్పటి వరకు ‘మధ్య సెక్టార్‌’‌కు సంబంధించిన మ్యాప్‌లను పరస్పరం పంచుకోగా, తూర్పు (అరుణాచల్‌ ‌ప్రదేశ్‌), ‌పశ్చిమ (ద్ధాఖ్‌) ‌ప్రాంతంలో ఇంకా ఎటూ తేలలేదు. చైనా ఇప్పటికీ 1959 నాటి తాను సూచించిన మ్యాప్‌ ‌ప్రకారమే సరిహద్దుగా పేర్కొంటున్నది. తూర్పు లద్ధాఖ్‌లోని 1597 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ ప్రాంతాలు అంటే అరుణాచల్‌ ‌ప్రదేశ్‌తో సహా తన భూభాగాలుగా పేర్కొంటున్నది. అదేవిధంగా తూర్పున 1126 కిలోమీటర్ల వాస్తవాధీన రేఖ కూడా తమదేనని వాదిస్తోంది. ఈ ప్రతిపాదనను భారత్‌ అం‌గీక రించడం లేదు. అదేవిధంగా ఇండియా-చైనా- భూటన్‌ ‌సరిహద్దు ప్రాంతంలో కూడా ఒత్తిడి పెంచుతూ భూటన్‌ను లొంగదీసుకోవాలని చూస్తున్నది. 2017 డోక్లాం సంఘర్షణకు ప్రధాన కారణం ఇదే. ప్రస్తుతం తాను ఆక్రమించిన ఆక్సాయ్‌చిన్‌ ‌ప్రాంతం, కారకోరం రహదారి, తష్కుర్‌గాన్‌ ‌ప్రాంతంలో చైనా పెద్దఎత్తున పీఎల్‌ఏ ‌బలగాలను మోహరించినట్టు వస్తున్న వార్తలు చైనా శాంతిని కోరుకోవడం లేదనడానికి నిదర్శనం.

సముడొరాంగ్‌ ‌ఘర్షణ

1986-87లో తవాంగ్‌ ‌జిల్లాకు సరిహద్దులోని సముడొరాంగ్‌ ‌ఛు లోయ వద్ద భారత్‌-‌చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దక్షిణ సముడొరాంగ్‌ ‌లోయ ప్రాంతంలోని వాంగ్‌డంగ్‌ ‌పచ్చిక మైదానం లోకి అప్పట్లో చైనా సైనికులు ప్రవేశించారు. అయితే ఈ ప్రాంతాన్ని భారత్‌ ‌తనదిగా పేర్కొంటున్నది. ఈ నేపథ్యంలో అక్కడికి భారత దళాలు కూడా చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నాటి మన విదేశాంగ మంత్రి ఎన్డీ తివారి బీజింగ్‌లో పర్యటించడంతో సమస్య అప్పటికి సర్దుమణిగి నప్పటికీ సముడొరాంగ్‌ ‌ఛు ప్రతిష్టంభన సమయంలో భారత సైన్యం యాంగ్‌ట్సీ పీఠభూమిని ఆక్రమించడం పీఎల్‌ఏకు ఎంతమాత్రం కొరుకుడు పడటం లేదు. ఇక్కడి పర్వత శిఖరాలపై ఉన్న మన సైన్యానికి వ్యూహా త్మకంగా ఇదెంతో సానుకూలతను కలిగిస్తుంది. ఇక్కడి నుంచి చైనా భూభాగంలో ఆదేశ సైనిక దళాల కదలికలను మన సైన్యం ఎప్పటికప్పుడు పసికట్ట గలదు. ఈ సానుకూలత కారణంగానే డిసెంబర్‌ 9‌న మన యాంగ్‌ట్సీ ప్రాంతంలోకి ప్రవేశించిన 300 మంది చైనా సైనికులను మన దళాలు సమర్థ వంతంగా తరిమివేయగలిగాయి.

————————————————————————

తవాంగ్‌ ‌నేపథ్యం

అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌రాష్ట్రంలో, తవాంగ్‌ ‌పట్టణం ఆ జిల్లా కేంద్రం. ఒకప్పుడు ఇది తవాంగ్‌ ‌ట్రాక్ట్‌కు రాజధానిగా ఉండేది. అయితే దీన్ని తవాంగ్‌, ‌పశ్చిమ కామెంగ్‌ (‌కామెంగ్‌ ‌నది, బ్రహ్మపుత్రకు ఉపనది. దీని పేరు మీదనే ఈ జిల్లా ఏర్పాటైంది) జిల్లాలుగా విడగొట్టారు. అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌రాజధాని ఇటానగర్‌కు 447 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3048 మీటర్లు (సుమారు 10వేల అడుగులు) ఎత్తున తవాంగ్‌ ‌ఛు లోయకు ఉత్తరదిశలో ఉంటుంది. భారత్‌, ‌చైనాల మధ్య వాస్తవాధీన రేఖకు దక్షిణంగా 10 మైళ్ల దూరంలో ఈ పట్టణం ఉంది. తవాంగ్‌ ‌జిల్లా జనాభా 49,977. గెలుప్పా బౌద్ధారామం (తవాంగ్‌ ‌బౌద్ధారామం) ఇక్కడ అత్యంత ప్రసిద్ధమైంది. తవాంగ్‌లో మోంపా తెగ ప్రజలే అధికం. ఐదవ దలైలామా నగవాంగ్‌ ‌లోబ్సాంగ్‌ ‌గ్యాట్సో ఆకాంక్ష మేరకు తవాంగ్‌ ‌బౌద్ధారామాన్ని మెరక్‌ ‌లామా లోడర్‌ ‌గ్యాట్సో 1681లో నిర్మించారు. తవాంగ్‌కు ఆ పేరు రావడానికి ఒక కథనం ప్రచారంలో ఉంది. మెరక్‌ ‌లామా లోడర్‌ ‌గ్యాట్సోకు చెందిన గుర్రం ఎంపిక చేసినందువల్ల ఈ ప్రదేశానికి తవాంగ్‌ అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇక్కడ ‘త’ అంటే గుర్రం అని, ‘వాంగ్‌’ అం‌టే ఎంపిక చేసిన ప్రదేశం అని అర్థం. ఆరో దలైలామా సాంగ్యాంగ్‌ ‌గ్యాట్సో జన్మ స్థలం తవాంగ్‌. ‌తవాంగ్‌ ఆరామాన్ని టిబెట్‌ ‌బౌద్ధులు ‘గాడెమ్‌ ‌నంగ్యెల్‌ ‌లాట్సే’ (సంపూర్ణ విజయంతో కూడిన దివ్య స్వర్గం అని అర్థం) అని పిలుస్తారు. వజ్రాయన బౌద్ధంలోని గెలుగ్‌ ‌శాఖకు (టిబెట్‌లో బహుళ ప్రాచుర్యంలో ఉన్న నాలుగు ప్రధాన బౌద్ధ శాఖల్లో ఇది కూడా ఒకటి) చెందినది.

1941లో జపాన్‌-‌చైనాల మధ్య యుద్ధం మొదలై నప్పుడు అప్పటి అస్సాం ప్రభుత్వం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ‘నార్త్ ఈస్ట్ ‌ఫ్రాంటియర్‌ ఏజెన్సీ’ (ఎన్‌ఈ ఎఫ్‌ఏ)‌పై మరింత పట్టుబిగించింది. ఈ ప్రాంతమే తర్వాతి కాలంలో అరుణాచల్‌ ‌ప్రదేశ్‌గా మారింది. 1944లో సీలాపాస్‌కు (తవాంగ్‌-‌పశ్చిమ కామెంగ్‌ ‌జిల్లాల సరిహద్దు) దక్షిణ ప్రాంతంపై నాటి బ్రిటిష్‌ ఇం‌డియా ప్రభుత్వం పాలనా పరమైన నియంత్రణను విస్తరించింది. అప్పుడే డిరాంగ్‌ ‌జోంగ్‌ ‌వద్ద బ్రిటిష్‌ ‌జనరల్‌ ‌జేపీ మిల్స్ అస్సాం రైఫిల్స్ ‌పోస్ట్‌ను ఏర్పాటు చేయడంతో అక్కడ టిబెట్‌ ‌ప్రభుత్వ నియంత్రణ తొలగిపోయింది. అయితే సీలాపాస్‌కు ఉత్తర భాగాన్ని బ్రిటిష్‌ ‌ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ ప్రాంతంలోనే తవాంగ్‌ ‌పట్టణం ఉంది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగింది. 1950లో చైనా ఆక్రమణలోకి వెళ్లిన టిబెట్‌ ‌తన స్వాతంత్య్రాన్ని కోల్పోయిన నేపథ్యంలో 1951లో మనదేశం ఒక అధికారిని తవాంగ్‌కు పంపింది. ఈ అధికారికి సహాయంగా కొన్ని వందల మంది పోర్టర్లు తరలి వెళ్లారు. అప్పటికే ఫ్యూడల్‌ ‌పాలనలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు భారత్‌కు స్వాగతం పలికారు. ఆ విధంగా అక్కడ టిబెట్‌ ‌పాలన తొలగిపోయింది. 1962 యుద్ధంలో ఈ తవాంగ్‌ ‌ప్రాంతాన్ని చైనా ఆక్రమించినప్పటికీ, కొద్దికాలం తర్వాత తిరిగి దీన్ని భారత్‌కు అప్పగించింది. అయితే తవాంగ్‌ ‌సహా అరుణాచల్‌ ‌ప్రదేశ్‌ ‌తన భూభాగమేనన్న వాదనను మాత్రం చైనా వదులుకోలేదు. తర్వాతి కాలంలో పాక్‌-‌చైనాల మధ్య వ్యూహాత్మక ద్వైపాక్షిక సంబం ధాలు, ఈశాన్య భారత్‌లో వేర్పాటువాదులకు చైనా ఆర్థిక వనరులు సమకూర్చడం భారత్‌కు ఇబ్బంది కరంగా మారగా, వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో భారత్‌ ‌సైనిక, ఆర్థిక కార్యకలాపాలను నిర్వహిస్తోందని, టిబెట్‌ అజ్ఞాత ప్రభుత్వానికి మద్దతు నిస్తోందంటూ చైనా ఆరోపిస్తోంది. ఏది ఏమైనా వాస్తవాధీన రేఖ వెంట సైనిక కార్యకలాపాలను పెంచడం, తవాంగ్‌ ‌సంఘర్షణలు వంటి ప్రస్తుత పరిణామాలను గమనిస్తే జిన్‌పింగ్‌ ‌ప్రభుత్వం భారత్‌తో సత్సంబంధాలను పెంచుకోవాలన్న ఉద్దేశంతో లేదని స్పష్టం చేస్తున్నాయి.

About Author

By editor

Twitter
YOUTUBE