డిసెంబర్‌ 30 ‌రమణ మహర్షి జయంతి

ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచరించడం, అక్కడ ఏవేవో అనుభవాలక• లోనవ్వడం ఒక స్థితికి సంబంధించినవి. వాటికి అక్షరరూపం ఇవ్వడం అలాంటి ఒక ప్రత్యేక స్థితికి సంబంధించి నదే అనిపిస్తుంది. ఒకింత మార్మికతను కలబోసుకుని ఉండే ఆ అనుభవాలలో అసాధారణాలు అనిపించేవీ విశేషంగానే ఉంటాయి. వింతగా, విస్మయం గొలుపుతూ ఉంటాయి. సంభ్రమంగానూ ఉంటాయి కూడా. ‘అరుణాచల రమణుని సన్నిధిలో శ్రీమతి మా ఫిరోజా తల్యార్ఖాన్‌’ అలాంటి మాటలకందని అనుభవాలను అక్షరబద్ధం చేసిన పుస్తకం. ఇది తల్యార్ఖాన్‌ ‌రాసిన ‘సేజెస్‌, ‌సెయింట్స్ అం‌డ్‌ అరుణాచల రమణ’ అన్న పుస్తకానికి స్వేచ్ఛానువాదమనిపిస్తుంది. అనువాదం తూమాటి వీరనారాయణరెడ్డి. ఇవన్నీ చర్మచక్షువులకు కనిపించని దైవం కేంద్రంగా అల్లుకున్న అనుభూతులు కావు. తాము దైవాన్ని చూసుకున్న మనీషి, ఆయన అనుగ్రహం, వారితో ఉన్న ఆధ్యాత్మిక దివ్యానుబంధం కేంద్రంగా లభించిన అనుభవాలు.

భగవాన్‌ ‌రమణులకు దేశవిదేశాలలోను భక్తులు ఉన్నారు. తల్యార్ఖాన్‌ అలాంటివారిలో ఒకరు. ఆమె కోట్లకు పడగలెత్తిన బొంబాయి పార్శీ కుటుంబంలో పుట్టారు. చిన్నతనం నుంచి ఆమెకే ప్రత్యేకమైన ఒక ఆధ్యాత్మిక ప్రపంచం ఆమెతో పాటే ఎదుగుతూ వచ్చిందనిపిస్తుంది. అందులో సాధుసంతులు, బాబాలు, పకీర్లు, క్రైస్తవ గురువులు, సన్యాసినులు, బౌద్ధ, జైన వేదాంతులు కూడా కనిపిస్తారు. చిన్నతనంలో తనను పెంచుకోదలచిన కుటుంబంతో కలసి కరాచీలో ఉన్నప్పుడు ఈమెను దత్తత తీసుకుంటానని లాలా లజపతిరాయ్‌ ‌కోరడం ఆమెకో గొప్ప జ్ఞాపకం. జిడ్డు కృష్ణమూర్తి, గాంధీజీ, వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌ ‌వంటి చరిత్ర పురుషులందరితోను ఆమె స్నేహం నెరపారు. నీ జీవితం ఆధ్యాత్మిక పథంలోకి వెళ్లడానికి సమాయత్తమవుతున్నదని తల్యార్ఖాన్‌కు మొదట చెప్పినవారు మెహెర్‌బాబాను అనుగ్రహించిన యోగిని హజరత్‌ ‌బాబాజన్‌. ‌హిమాలయాలలో తపస్సు చేసే యోగ్యత కలిగిన వ్యక్తి ఈ బాలిక అని ఒక సాధువు తల్యార్ఖాన్‌ ‌గురించి పలికాడు. కానీ ఆమె అంతిమంగా కోట్ల ధనాన్నీ, కొడుకునీ, భర్తనీ కూడా వదలి అరుణాచలం వచ్చి రమణుని సన్నిధిలో గడిపారు. తనకు ఏ మూలనో గర్వం ఉందని ఆమెకు ఓ క్షణంలో అర్ధమైంది. రమణుల మాటలలో అలాంటి స్థితి నుంచి బయటపడే మార్గం బిచ్చ మెత్తడం. అదే ఆమె అనుసరించారు.

అసలు తల్యార్ఖాన్‌ను రమణుల సన్నిధికి నడిపించిన సందర్భమే ప్రత్యేకంగా అనిపిస్తుంది. బొంబాయిలో యోగాభ్యాస సంస్థను నిర్వహిస్తున్న స్వామి యోగీంద్రతో పరిచయం అందుకు బీజం వేసింది. ఒక సందర్భంలో ఆయన దయనీయ స్థితిలో ఉన్న మహిళలకు ఆశ్రయం కల్పించే పని చేయమని సూచించారు. దానితో హోమ్‌ ఆఫ్‌ ‌డివోషన్‌ ‌పేరుతో అలాంటి సేవకు ఉపక్రమించాలని తల్యార్ఖాన్‌ ‌తలపెట్టారు. ఈ సంగతి విన్న యోగదా సత్సంగ్‌కు చెందిన స్వామీ సత్యానంద ఒక సలహా ఇచ్చారు. ఆ హోమ్‌ ‌ప్రారంభానికి ముందు రమణుల ఆశీస్సులు తీసుకోమన్నారు. అలా ఆమె పాదాలు అరుణాచలం వైపు పడ్డాయి. 1937లో రమణుల దర్శనం కలిగింది. తరువాత ఆమె భర్త, కుమారుడు అనే బంధాల నుంచి కూడా విముక్తమయ్యేందుకు సిద్ధమయ్యారు. ‘నిజమైన జీవితమంటే మనలను నడిపించే హృదయాంతర్వర్తి అయిన ఈశ్వరుడిలో మమేకం కావడమే అనే భావనలో స్థిరపడ్డారు.’

ఇంత భక్తిభావనలోకి ఆమె వెళ్లగలిగినా ప్రాపంచిక చింతన నుంచి ఆమె పూర్తిగా నిష్క్రమించ లేదు. ఇదొక వైరుధ్యమే. దేశదేశాలు తిరిగారు. రకరకాల కార్యక్రమాల కోసం భారతదేశంలోనూ పర్యటించారు. దేవాలయాల జీర్ణోద్ధరణ పని చేపట్టారు. సామాజిక సేవలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆమె చేసిన చిరస్మరణీయమైన పని రమణులు పుట్టి పెరిగిన ఇంటిని (తిరుచ్చుళి) కొనుగోలు చేసి, మహర్షి తండ్రి సుందర అయ్యర్‌ ‌స్మారక చిహ్నంగా అభివృద్ధి చేయడం. అలాగే మధురైలో రమణులు విద్యార్థిగా ఉన్నప్పుడు నివసించిన ఇంటిని కూడా కొనుగోలు చేసి, రమణుల స్మారక మందిరంగా మలిచారు. వనపర్తి రాజా రామచంద్రారెడ్డి ఇందుకు ఆర్థిక సాయం చేయడం మరొక విశేషం.

తల్యార్ఖాన్‌ ‌తన జ్ఞాపకాలలో భారతదేశం అనుభవిస్తున్న ఒక సంక్షుభిత యుగాన్ని దర్శింప చేశారు. అసలు ఇలాంటి సంక్షుభిత సమయంలో మనిషికి సాంత్వన కలిగించడానికి రమణులు వంటి మహా పురుషుడు అవతరించారని ఆమె నమ్మకం కూడా. నిజంగానే తమదైన తాత్త్విక చింతన, ఆధ్యాత్మిక పథం, జీవన విధానం, వీటి అడుగుజాడల లోనే సాగిన కళ విస్మృతికి గురైన కాలమది. ధార్మిక జీవనంలో ప్రవేశించి ఆడంబరాన్ని నివారించి స్వచ్ఛమైన భగవదారాధనను ప్రతిపాదించిన రమణులు అందుకే ఆ కాలానికి అవసరమయ్యారని మనసావాచా భావించే భక్తకోటిలో తల్యార్ఖాన్‌ ఒకరనిపిస్తుంది. తన కాలపు చరిత్ర పురుషులందరి గురించీ, మహిళామణులందరి గురించి ఆమె ప్రస్తావించారు. అందులో తమిళనాడులో ద్రవిడ ఉద్యమానికి ఆద్యుడు ఈవీ రామస్వామి నాయకర్‌ ‌కూడా ఉన్నారు. ఆయన పరమ నాస్తికుడు. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక చింతన మీద ఆయనది ఒక గుడ్డి వ్యతిరేకత. భగవంతుడిని నమ్మడం అనేది ఆధ్యాత్మిక కోణం నుంచి కొందరికి సాంత్వన అనీ, సామాజికంగా చూస్తే అదొక హక్కు కూడాననీ గుర్తించడానికి నిరాకరించిన నాస్తికోద్యమ నియంత. ఇక పరమ ఆస్తికురాలైన తల్యార్ఖాన్‌ ఇతడి ప్రస్తావన తీసుకు రావడానికి బలమైన కారణమే ఉంది. ఆమె తిరువణ్ణామలైలో పాతాళలింగ దేవస్థానం జీర్ణోద్ధరణ కార్యక్రమానికి రాజాజీని ఆహ్వానించారు. ఇందుకు నిరసనగానే నాయకర్‌ ‌నల్లజెండాల ప్రదర్శనకు సిద్ధమయ్యారు. కానీ తల్యార్ఖాన్‌ ‌వెళ్లి నచ్చచెప్పడంతో నాయకర్‌ ‌తన ప్రయత్నం విరమించారు.

 భోపాల్‌ ‌మహారాణి సుల్తానా కైకుస్రౌ జహాన్‌ ‌బేగం జీవితంలో జరిగిన ఒక ఘట్టం వాటిలో మరపురానిదే. ఒకసారి చైనా ఉన్నతవర్గీయుల బృందం ఒకటి భోపాల్‌ ‌వచ్చింది. రాజభవనంలో వారందరికి పెద్ద విందే ఇచ్చారు రాణి. ఆ బృందం తిరిగి స్వదేశం వెళ్లిన తరువాత రెండు పార్సిళ్లు వచ్చాయి. అవి జాడీలు. తెరిచి చూస్తే వాటిలో బొద్దింకలు, బల్లులతో పెట్టిన ఊరగాయలు ఉన్నాయట. వాటిని ఊరవతల పారబోయించారట. ఈ జ్ఞాపకాలలో కేవలం ఆధ్యాత్మికవేత్తలు, వారి జీవితాలు, అనుభవాలే కాదు, ఒక సంక్షుభిత యుగం, అస్వతంత్ర భారత విషాదచిత్రం కూడా కనిపిస్తాయి. ఎమ్మెస్‌ ‌సుబ్బులక్ష్మి, చలం, సౌరిస్‌, ‌పొణకా కనకమ్మ, నాయన, పుట్టపర్తి సాయిబాబా వంటి వారందరి గురించి కూడా ఆమె రాశారు.

 అయితే వీటన్నిటిని మించినది రమణుల తుదిఘడియలను చిత్రించిన తీరు. అది చదవడం మంచి అనుభవం. ఆ క్షణంలో ఒక నక్షత్రం మెరిసి అరుణాచలేశ్వ ఆలయం మీదుగా వెళ్లి ఈశాన్య భాగంలో అదృశ్యమైందంటారు తల్యార్ఖాన్‌. ‌బహుశా ఆ క్షణంలో ఆమెకు కలిగిన అనుభవమే కావచ్చు, దానిని ఇలా ఆవిష్కరించారు. ‘ఎప్పుడైతే ప్రపంచం అంధకారబంధురమై గందరగోళ పరిస్థితులలోనికి వెళుతుందో, అదే సమయంలో తన పునర్‌ ‌వైభవం కోసం చేసే పోరాటంలో వెలుగు కోసం అన్వేషణ చేస్తుంది. అటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఇప్పటి మానవజాతి ఉన్నదని గురువులందరి ఏకాభిప్రాయం.

మానవజాతి ప్రగాఢ ఆకాంక్ష మేరకు విశ్వాంత రాళంలో నుంచి దివ్య చైతన్య ఆధ్యాత్మిక జ్ఞాన కిరణాలు జీవాత్మలకు అవసరమైన జ్ఞానాన్ని అనుగ్రహించడానికి అప్పుడడప్పుడు వ్యక్తమవు తుంటాయి. అరుణాచలం నుంచి శ్రీ రమణమహర్షి పేరున వ్యక్తమైన దివ్య చైతన్యజ్యోతి జ్ఞానకిరణాలు ఇక్కడి నుంచి సుదూర ప్రాంతమంతా ప్రసరిం చాయి.’ అంటూ ఆ ఘట్టాన్ని ముగించారామె.

రమణ మహర్షితో ఉన్న ఆధ్యాత్మికబంధం, భారతీయ సామాజిక, సాంస్కృతిక, వైవిధ్య భరిత జీవనం మీద బలమైన దృక్పథం ఉన్నాయని నమ్మారు కాబట్టే ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ స్వీయానుభవా లకు, జ్ఞాపకాలకు అక్షరరూపం ఇవ్వవలసిందిగా తల్యార్ఖాన్‌కు సూచించారు. ఆయన సూచనే శిరోధార్యంగా అవి అక్షరరూపం దాల్చాయి. అంతేకాదు, రాధాకృష్ణ పండితుడంతటి వారు ఆశించిన మేరకు అవి ఉన్నాయనిపిస్తుంది కూడా. అందుకే అనువాదంతో కాస్త ఇబ్బంది ఉన్నా వదలకుండా చదివిస్తాయి. నిజానికి రమణుల దివ్య సన్నిధిలో ఆమె గడిపిన మూడు దశాబ్దాల కాలపు జ్ఞాపకాలలో ఇవి కొన్ని మాత్రమే.

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
YOUTUBE