వి. రాజారామ మోహనరావు

వాకాటి పాండురంగరావు స్మారక దీపావళి కథల పోటీలో విశిష్ట బహుమతి పొందినది

‘తనింటి ముందు కారు ఆగిందేమిటి?’ అనుకున్నారు సూర్యనారాయణ గారు. ‘ఎవరి కోసమో అయుంటుందిలే’ అనీ అనుకున్నారు. కానీ కారు దిగిన ఇద్దరూ తన వైపే రావటం చూసి కూచున్న కుర్చీలో కొద్దిగా జరిగి, సద్దుకు కూచున్నారు. ఈయన కూచునున్న వసారా మెట్లెక్కుతూ ఆ ఇద్దరూ దణ్ణం పెట్టారు. అందులో ఒకతను.. ‘సూర్యనారాయణ భాగవతారు గారు….’ అన్నాడు.  ‘‘నేనే… రండి… కూర్చోండి’’ అన్నారు తనెదురుగా ఉన్న కుర్చీలు చూపిస్తూ. ‘‘మేం భీమవరం నుంచి వస్తున్నాం. నా పేరు దాట్ల వెంకట్రాజు. తను సాగి సత్యన్నారాయణరాజు. మేము ఒక సాంస్కృతిక సంస్థ నిర్వహిస్తున్నాం. దానికి నేను సెక్రటరీ. తను ప్రెసిడెంట్‌’’ అన్నాడు వెంకట్రాజు.


సూర్యనారాయణ గారు లోపల్నించి మంచినీళ్లు తెప్పించి ఇచ్చారు. వాళ్లు మంచినీళ్లు తాగి, స్థిమితపడి తమ సంస్థ వివరాలు చెప్పి, ఎందుకొచ్చారో చెప్పారు. దాని సారాంశం వాళ్లు శ్రీరామనవమికి మూడురోజులు హరికథా ఉత్సవాలు చేస్తున్నారు. ఆ ఉత్సవాల ప్రారంభం ఈయన చేతుల మీదుగా జరగాలన్నారు.

‘‘నేనిప్పుడు అనామకుణ్ణి. నేనెవరో ఎవరికి తెలుసు. ఎవరైనా ప్రముఖ వ్యక్తితో చేయిస్తే బావుంటుంది’’ అన్నారాయన నెమ్మదిగా.

‘‘మీరు కాదనటానికి వీలు లేదు. హరికథ అనగానే, ఇప్పుడున్న వారిలో మీరే ప్రముఖులు. ఈ రంగంలో పితామహులు. మీ చేతి మీదుగానే జరగాలి’’ అన్నాడు వెంకట్రాజు.

‘‘అంతేకాదు మీ కథాగానం కూడా పెట్టుకుంటున్నాం. దానికీ మీరు ఒప్పుకోవాలి’’ అన్నారు సత్యన్నారాయణరాజు.

చాలా, చాలా ఏళ్ల తర్వాత హరికథా, పోగ్రాం.. అన్న మాట వినటం. సూర్యనారాయణ గారికి చిన్నపాటి గగుర్పాటు కలిగింది. వెంటనే, ఈ రోజుల్లో హరికథంటే జనం వస్తారా? అన్న సందేహమూ కలిగింది. అదే వాళ్లతో అన్నారు.

‘‘ఆ సందేహం మాకూ వచ్చింది. ఇప్పుడు హరికథలేమిటి? అని మా కమిటీ మెంబర్లే వెనక్కి లాగారు. కానీ మేం తగ్గదలుచుకోలేదండి. ఈ సంస్థ మా తాతగారి జ్ఞాపకార్థం పెట్టాం. ఆయనకి హరికథలంటే ప్రాణం. ఆయన ఉన్నంతకాలం హరిదాసుల్ని ఎందర్నో ఆదుకున్నారు. మా నాన్న గారిక్కూడా హరికథలంటే ఎంతో ఇష్టం. పాండురంగదాసు, కోట సచ్చిదానంద శాస్త్రి…. అని అప్పటి హరిదాసుల పేర్లు ఇప్పటికీ చెబుతుంటారు. మా తాతగారంత కాకపోయినా, మాకూ ఈ సేవ చెయ్యాలని ఉంది. ఎటొచ్చీ కావాల్సింది మీలాంటి పెద్దల ఆశీర్వాదం, సహకారం’’ అన్నాడు వెంకట్రాజు.

‘‘ఈ ఏడాదే కాదండీ, ప్రతి సంవత్సరం నవమికి ఇలాగే హరికథ ఉత్సవాలు చేస్తామండి… జనం

ఈ ఏడాది ఒకవేళ పల్చగా ఉన్నా, రానురాను పెరుగుతారని నమ్మకం. మా కోసం కాకపోయినా, హరికథ తిరిగి పదిమందికి తెలియటానికైనా మీరు ఒప్పుకోవాలి’’ అన్నారు సత్యన్నారాయణరాజు.

సూర్యనారాయణ గారికి వాళ్ల మాటలు తబ్బిబ్బు కలిగించాయి. తిరిగి హరిదాసులు, హరికథ ప్రజలకి చేరువ అవటం అనుకుంటుంటే పులకింతగా ఉంది. వాళ్లు చెప్పిన హరిదాసుల పేర్లు అప్పటి రోజుల్ని గుర్తుచేశాయి. ఆయన ఓ ఉద్వేగంలోకి వెళ్లిపోయారు.

‘‘మీ మాట కాదనను. అంతేకాదు నేను ఈ మంచి ప్రయత్నానికి చెయ్యగలిగిందంతా చేస్తాను. అప్పటి మహానుభావుల కాలాన్ని తిరిగి తీసుకు రాలేకపోయినా, అప్పటి జ్ఞాపకాల్ని ఇప్పటి వారికి చెబుతాను. ఎందరు మహానుభావులు, ఎటువంటి గొప్ప భాగవతారులు. మీరు ఇందాక చెప్పిన పాండురంగదాసు గారి కథంటే జనం పిచ్చిగా వచ్చేవారు. ఆ కథ ఎంత జనరంజకంగా ఉండేదో! ముదపాక మల్లేశ్వరరావు భాగవతారే, సంగీతంలో నిధి. ఎవరు ఏ రాగం అడిగితే ఆ రాగం పాడేవారు. ఈ ఊరి వాడే బళ్ల బసవలింగం భాగవతార్‌. ఆయన ఇల్లే ఓ గురుకులం. ఇంక కోట సచ్చిదానంద శాస్త్రి గారంటే జనప్రియుడు. సంగీత కచేరీకి మంగళంపల్లి బాల మురళీకృష్ణ లాగ….’’ అంటూ సూర్యనారాయణ గారు ఎన్నెన్నో విషయాలు ఓ ప్రవాహంలా చెప్పుకొచ్చారు. వచ్చిన వాళ్లిద్దరికీ ఎంతో ఆనందమైంది.

* * * * * *

శ్రీరామనవమి నాడు సూర్యనారాయణ భాగవతార్‌ ‌గారి చేతుల మీదగా, మూడు రోజుల హరికథ ఉత్సవాలు ఆరంభమయ్యాయి. అంతగా కాకపోయినా జనం బాగానే వచ్చారు. సూర్యనారాయణ గారు మంచి భాగవతారే కాక ఎంతో చక్కటి వక్త. మంచి మాటలు, చక్కటి గానం కలగలిపి జనం ముగ్ధులు అయ్యేలా ఉపన్యసించారు.

ఆనాటి కాలాన్ని, హరికథా వైభవాన్ని తిరిగి కళ్ల ముందు నిలిపారు. పాత కళారూపంలోని జవం, జీవం, ప్రశాంతత ఎలాంటివో చెప్పారు. రోజు రోజుకి జనం పెరుగుతూ వచ్చారు. మూడో నాడు అంటే, చివరిరోజు సూర్యనారాయణ గారి కథా గానం… ‘పార్వతీ కల్యాణం’ హాలంతా నిండింది.

ఎన్నో ఏళ్ల స్టేజి అనుభవం ఉన్నా, అన్నేళ్ల తర్వాత కథ చెప్పటానికి గొంతు సవరించుకుంటుంటే, అంతటి ఆయనకి ఒళ్లు ఓ క్షణం ఒణికింది. చాలా ఏళ్ల తర్వాత తిరిగి కథ చెప్పటమే కాదు. అదో సంబరం… అదో ఉత్సవం… ఇంచుమించు మోడైపోయిన హరికథ తిరిగి చిగురులు వేస్తోందన్న ఉత్సాహం. ఆయన గొంతు ఓ ప్రవాహమే అయింది. కథ ఉద్వేగంతో ఉరకలు వేసింది.

డెబ్భై ఏళ్ల వయసు దాటిన ఆయన ఒంట్లో తిరిగి అంత శక్తి ఎలా వచ్చిందో… యువ కిశోరంలా కథ చెప్పాడాయన. కళోత్సాహ మహిమ అదేనేమో!

కథ పూర్తయింది. హాలంతా ఆనందం. వాళ్లందరి ఆనందం ఆయనకి చేరింది. ‘హరికథా కళ అంతరించలేదు.

ఇంకా ఆదరణ ఉంది చాలు. ఈ జన్మకిది చాలు… తన కర్తవ్యం తను నిర్వర్తించగలిగినట్టే అనుకున్నారు.

కొత్తజీవం తలెత్తింది. పాత కళల పునరుజ్జీవనం ఈనాటి సమాజానికి ఎంతో మేలు.

About Author

By editor

Twitter
YOUTUBE