న్యాయవ్యవస్థ ‘వలస’ వాసనలు వీడాలి- 1
– జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి
అఖిల భారతీయ న్యాయవాద పరిషత్- 16వ జాతీయ సమితి సదస్సు (డిసెంబర్ 26 2021, హైదరాబాద్)లో సుప్రీం కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ కీలకోపన్యాసం.
I. సాధారణ పరిశీలనలో తెలిసే అంశాలు
1.అఖిల భారతీయ న్యాయవాద పరిషత్ 16వ జాతీయ సమితి సమావేశాలకు నన్ను ఆహ్వా నించడం సంతోషదాయకం. ఇలాంటి సందర్భాలలో ప్రసంగించేందుకు ఆహ్వానం అందుకోవడం, దీనితో న్యాయవాదులతో సంభాషించే అవకాశం దక్కడం నాకు మరింత ఆనందం కలిగిస్తాయి.
- మూడు దశాబ్దాలుగా, దేశవ్యాప్తంగా న్యాయవాదుల పరిజ్ఞానాన్ని పెంచే విద్యను అందించే కార్యకలాపాలను నిర్వహిస్తున్న అఖిల భారతీయ న్యాయవాదుల పరిషత్తును అభినందించటం నా పప్రథమ కర్తవ్యం. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి న్యాయవ్యవస్థ గురించిన అవగాహనను అందించే పక్రియను కొనసాగించటం వారు వృత్తిలో రాణించడానికి ఎంతగానో దోహదపడుతుంది. సదస్సులు, కార్యశాలలు నిర్వహించటం న్యాయ సలహా సహాయ కేంద్రాలను నెలకొల్పటం ఒక త్రైమాసిక పత్రికను క్రమంతప్పకుండా నిర్వహించటం-ఈ మూడు పనులు నాకెంతో ఆనందం కలిగిస్తున్నాయి. న్యాయవ్యవస్థలోని వారి అవగాహన పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలలో ఈ జాతీయ సమితి సమావేశం ఒక భాగం.
- ఈ సంవత్సరం నిర్వహిస్తున్న ఈ జాతీయ సమితి సమావేశాలకు ‘భారతీయ న్యాయ వ్యవస్థ నుండి వలస పాలన నాటి వాసన వదిలించటం’ అనేది ప్రధానాంశంగా స్వీకరించడం సంతోషించ తగ్గది. ఇది చరిత్రకు సంబంధించిన విషయంగా ఆరంభంలో అనిపించినా, వాస్తవానికి ఇప్పటి మన అవసరాలతో ముడిపడి ఉన్నదే. గత కొద్ది నెలలలోనే నా సోదర న్యాయమూర్తులేగాక, అత్యున్నత న్యాయస్థానపు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ విషయంలో వారు ఆందోళనలో ఉన్నట్లు ప్రకటించటం మీకు తెలిసినదే. శతాబ్దాల అనుభవా లలో నుండి, వంద కోట్లకుపైబడిన భారత ప్రజానీకం ఆకాంక్షలను ప్రతిబింబించేదిగాను, దేశంలో ఇప్పటి వాస్తవ పరిస్థితులకు అనుగుణ మైనదిగా ఇది రూపుదిద్దుకొన్నది. సుసంపన్నమైన బహువిధమైన వారసత్వ సంపదగా ఇది మనకు లభించింది. ఈ విషయంలో మీ మధ్య లోతైన చర్చ జరగడానికి ప్రోద్భలమిచ్చేవిధంగా-ఈ అంశంలో నా ఆలోచన లను మీ ముందుంచాలని అనుకుంటున్నాను.
II. ప్రాచీన భారతీయ న్యాయ విధానాలు
- భారతీయ న్యాయసంహిత ఏదో ఒకచోట నుండో, ఒక గ్రంథం నుండో కాక, అనేకచోట్ల తీసుకొన్న వివిధాంశములతో కూడుకొన్నది. వేదాల నుండి, ఆనాడు అంటే కొన్నివేల సంవత్సరాల క్రితం సమాజంలో వాడుకలో ఉన్న ఆచారాల నుండి మన వ్యవస్థ తొలుత ఒక రూపును సంతరించుకున్నది. కాలక్రమేణ అనేక అంశాలు ఇందులో ప్రవేశిం చాయి. అలా జోడించిన వాటిలో మన దేశంలో రూపుదిద్దుకొన్నవీ, విదేశాల నుండి దిగుమతి అయినవీ- రెండు రకాలవీ ఉన్నాయి. కొన్ని పాత అంశాలను తొలగించి, వాటి స్థానాన్ని పొందినవి. 8వ శతాబ్దంలో అరబ్బుల దండయాత్ర అనంతరం దేశంలో కొన్నిచోట్ల ఇస్లామిక్ న్యాయవ్యవస్థ వాడుకలోకి వచ్చింది. అదేవిధంగా బ్రిటిష్‌వారు పెత్తనం చేసిన రోజులలో-బొంబాయి, కొల్‌కత్తా, మద్రాసు (చెన్నై)లలో నెలకొల్పిన హైకోర్టులలో – ఎవరికి ఏ వ్యక్తిగత న్యాయచట్టం వర్తింపచేయాలో స్పష్టతలేని సందర్భాలలో ఉపయోగించదగిన చట్టంగా ఆంగ్లేయుల సాధారణ న్యాయ చట్టం ఉపయోగించడం మొదలైంది. పోర్చుగీసులు, పరాసులు కూడా తమ వలసపాలనలో ఉన్న ప్రాంతాలలో తమ తమ న్యాయచట్టాలను ఉపయోగించారు.
- హిందూదేశంపై దండెత్తి వచ్చి వలసలు స్థాపించినవారు, ఇక్కడి స్థితిగతుల్ని పైపైన మాత్రమే చూసి ఇక్కడ చట్టాన్ని అంటిపెట్టుకొని నడిచే పాలన (Rule of Law), న్యాయసూత్రాలను పాటించటం లేవంటూ తెలిసీ తెలియని వ్యాఖ్యలు చేశారు. తమ విదేశీ భావాలనూ, వ్యవస్థలనూ హిందూదేశంపై రుద్దడానికే వారు ఆ కుంటిసాకులు చెప్పారు. మనను దారి తప్పించే ఈ వ్యాఖ్యలు, తప్పుడు అభిప్రాయాలు ప్రాచీన భారత న్యాయవ్యవస్థను, న్యాయ విధానాలను వాస్తవికంగా ప్రతిబింబించినవి కావు. వారు ఆ తప్పుడు ప్రకటనలు చేయటం వెనుక అజ్ఞానం, లేదా సామ్రాజ్యవాదులకు సహజంగా ఉండే స్వలాభాపేక్ష, హిందూ సంస్కృతీ, నాగరికతల పట్ల వారికి ఉండిన ఏహ్యభావన-ఇవేవైనా కారణాలు కావచ్చు. కాగా దాని ఫలితంగా మన దేశంలోను, విదేశాలలో కూడా హిందూ న్యాయవ్యవస్థ గురించి తప్పుడు అభిప్రాయం నిర్మాణమై, పాతుకుపోయింది.
- ప్రాచీన హిందూదేశంలో ఎటువంటి న్యాయ వ్యవస్థ ఉండేదో తెలుసుకోవాలంటే, మన గతంలోకి ప్రయాణించి ప్రాచీన శాస్త్రాలనూ, ఇతర ధార్మిక గ్రంథాలనూ పరిశీలించాలి. అలా పరిశీలించి నపుడు చట్టబద్ధమైన పాలన మీద ఆధారపడిన ప్రాచీన న్యాయవ్యవస్థ ఇక్కడ పరిఢవిల్లటమేగాక, ఆ కాలానికి అవి ఎంతో ప్రగతి శీలమైనవనీ, విప్లవాత్మక దృక్కోణం కలిగినవీ అని మనకు తెలుస్తుంది. వాటిలో కొన్ని:
అ) రాజు కూడా చట్టానికి లోబడి వ్యవహరించ వలసినవాడే. అతడు తన కర్తవ్యపాలనలో విఫలుడైతే, రాజ్యాధికారాన్ని వదులుకోవలసి ఉంటుంది.
ఆ) న్యాయమూర్తులు న్యాయశాస్త్రానికి విధేయులై స్వతంత్ర నిర్ణయాలు చేయగలవారుగా ఉండేవారు. వారు సమర్థతలో, తమ శాస్త్ర పరిజ్ఞానంలో, నీతి నిజాయితీలలో, నిష్పాక్షికంగా వ్యవహరించటంలో, న్యాయవ్యవస్థ స్వతంత్రతను నిలబెట్టటంలో ఆనాటి ఏ దేశం వారితో పోల్చిచూసినా అత్యున్నత ప్రమాణాలు గలవారుగా ఉండేవారు.
ఇ) అనేక స్థాయులలో విచారణ జరుపుతూ అవసరాన్నిబట్టి అత్యున్నత స్థానం వరకు నివేదించే విధానం ఉండేది. అత్యున్నత స్థానంలోని న్యాయ మూర్తిని ప్రాడ్వివాకుడని వ్యవహరించేవారు. దిగువ న్యాయస్థానాల నిర్ణయాలను సమీక్షించే అధికారం పై న్యాయస్థానాలకు ఉండేది.
ఈ) ఈనాటి సమాజంలో ఎటువంటి న్యాయ విధానాలను ఆధారం చేసుకొని సహజ న్యాయ సూత్రాలను గౌరవిస్తూ వివాదాలను పరిష్కరిస్తు న్నామో, అటువంటి విధానమే ఆనాడు ఉండేది.
ఉ) న్యాయస్థానంలో అనుసరించే విధానాలు, సాక్ష్యాన్ని నమోదు చేసే విధానాలు ఇప్పటి మాదిరిగానే పరిణతి గలిగినవిగా ఉండేవి.
ఊ) నేర సంబంధ వ్యవహారాలలో చట్టపరంగా నేరం రుజువైతే తప్ప, నిందితుడికి (ముద్దాయి) శిక్ష అమలయ్యేది కాదు. ఆస్తుల సంబంధమైన (సివిల్) వ్యవహారాలలో ఇప్పటిమాదిరిగా నాలుగు దశలు – ఫిర్యాదు చేయడం, దానికి జవాబు దాఖలు చేయడం, విచారించడం, ఆదేశం ఇవ్వడం-అనే దశలు ఉన్న విచారణ క్రమం ఉండేది.
ఋ) ఒకసారి పూర్తిస్థాయిలో నిర్ణయించిన విషయాలను తిరగతోడక పోవడం (ప్రాఙ్ నిర్ణయ- Res Judicata) అనే విధానం అనుసరించేవారు.
ౠ) ఒకే వ్యక్తి న్యాయపీఠం అధివసించి, నిర్ణయించడం కాకుండా – ఒకరి కంటే ఎక్కువ మందితో కూడిన ధర్మాసనాలు ఉండేవి. వారు వ్యాజ్యాన్ని సాకల్యంగా విని న్యాయ నిర్ణయం చేసేవారు.
ఎ) రాజు స్వయంగా చేసిన నిర్ణయం (తుది నిర్ణయం) గాక, మిగిలిన అన్ని స్థాయుల నిర్ణయాలను – సమీక్షించవలెనని కోరే అవకాశం ఇస్తూ ఉండేవారు.
ఏ) ఏ విధమైన అనుకూల దృష్టిగాని భయంతో కూడిన దృష్టితోగాని కాకుండా న్యాయం చేయటమే తమ మౌలిక కర్తవ్యంగా న్యాయస్థానాలు నడిచేవి.
క) ధర్మశాస్త్ర విహిత పాలన (Res Judicata)
మన దేశంలోని ‘ధర్మరాజ్యం’ అనే భావనయే పాశ్చాత్యులలో ఈ రూపం పొందినదని దీనదయాళ్ ఉపాధ్యాయ అభిప్రాయపడ్డారు.
- నేను ఇప్పటికే వివరించిన సాధారణాంశా లతోపాటు ప్రాచీన న్యాయవ్యవస్థలోని మరికొన్ని క్లిష్టమైన కీలక లక్షణాలను మరింత లోతుగా పరిశీలించటం ఫలప్రదాయకమవుతుంది. అలా పరిశీలించినపుడే అవి ఎంత న్యాయమైనవో, గహన మైనవో, ఎంత సముచితమైనవో మనం గ్రహించ గల్గుతాం. ఈ లక్షణాలలో అత్యంత మౌలికమైనది- Res Judicata అని నేడు పిలుస్తున్న ‘ధర్మశాస్త్ర విహితపాలన’.
- ఇటువంటి అధ్యయనానికి పూనుకొన్నప్పుడు, తొలుదొల్తగా తలెత్తే ప్రశ్న – ప్రాచీన హిందూదేశంలో ‘రూల్ ఆఫ్ లా’ అమలులో ఉండేదా? ఇందుకు ‘అవును’ అని చెప్పడానికి అనేక నిదర్శనాలు శాస్త్ర గ్రంథాలలో, పురాణేతిహాసాలలో కనిపిస్తాయి. మహాభారతం ఇలా చెప్పింది : ‘‘తన ప్రజలను కాచి రక్షిస్తూ ఉంటానని ప్రమాణం చేసి, ఆ విధిలో విఫలమైనట్లయితే, ఒక పిచ్చికుక్కను శిక్షించినట్లుగా – ఆ రాజును శిక్షించాలి.’’ ‘‘ప్రజలను సంరక్షించ డానికి బదులుగా వారి ఆస్తిపాస్తులను కాజేయటానికి పూనుకొనే రాజును, ఎవరి నుండీ మంచి సలహాలను తీసికోకుండా, వారి మంచి మాటలను పెడచెవిన పెట్టే రాజు – అతడు రాజు కానే కాడు, ప్రజల నావరించిన ఒక దౌర్భాగ్యం – కాబట్టి అతడిని ప్రజలు అంతమొందించాలి.’’ ఈ పదాలు కటువుగా ఉండటం, ఇప్పటి ఆలోచనలను ప్రతిబింబించేవిగా ఉండటం గమనార్హం. కానీ సందేశం సుస్పష్టం- ‘‘రాజు చట్టానికి అతీతుడు కాదు.’’
9) దీనిలో అంతర్భాగంగా ఉన్న అంశాలు చెప్పేదేమంటే – రాజ్యానికి ఉన్న సర్వసత్తాక ప్రతిపత్తి ఆ సమాజ సమష్టి ఆకాంక్షలకు ప్రతిబింబించేది మాత్రమే. సంప్రదాయకంగా వస్తున్న ఆ ఆకాంక్షల పుంజాన్ని ధిక్కరించినట్లయితే, రాజు తన అధికారాన్ని త్యజించక / కోల్పోక తప్పదు. చారిత్రక యుగంలో – మౌర్యుల పాలనా కాలంలోకి చూసి నట్లయితే, అర్థశాస్త్రంలో రాజు విధులను కౌటిల్యుడు ఇలా వివరించాడు.
ప్రజాసుఖే సుఖం రాజ్ఞః ప్రజానాంచ హితే హితమ్।
నాత్మప్రియం హితం రాజ్ఞః ప్రజానాంతు ప్రియం హితమ్।।
తన ప్రజల సుఖంలోనే రాజు సుఖం ఇమిడి ఉంటుంది. ప్రజల హితంలోనే రాజు మేలు కూడా నిహితమై ఉంటుంది. తనకు నచ్చినదానిని మంచిదిగా భావించటం కాక, ప్రజలకు మేలొన రించేది, ప్రజల మెప్పు పొందిన దానినే రాజు తనకు మేలైనదిగా, ఇష్టమైనదిగా స్వీకరించాలి-అని దీని భావం. ప్రాచీన కాలం నాటి మరికొందరు విజ్ఞుల పలుకులను కూడా నేను ఉదాహరిస్తాను. వాటిని బట్టి మన దేశంలో ప్రాచీన కాలంలో న్యాయ వ్యవస్థలు ఎలా ఉండేవో గ్రహించవచ్చు.
- కౌటిల్యుని విషయమే తీసుకుంటే, రామాయణ కాలం నుండి అమలులో ఉన్న విషయాలనే ఆయన తన గ్రంథంలో పొందు పరిచాడు. అయోధ్యకు రాజైన శ్రీరాముడు తాను ఎంతగానో ప్రేమించిన తన భార్యను- ఆమె గురించి తనకు ఏ మాత్రం సందేహం లేకపోయినా – తన ప్రజలు సందేహాస్పద దృక్కులతో చూస్తున్నారు కాబట్టి-త్యజించవలసి వచ్చింది. అపహరించుకొని పోయినవాని అదుపులో ఏడాదికిపైబడి ఉన్నందున ప్రజలలో మొలకెత్తిన సందేహానికి తల ఒగ్గుతూ – అది తనకు హృదయాఘాతమే అయినా- రాముడు నెరవేర్చాడు.
- ఒక సాధారణ మత్స్యకారుడు హస్తినాపురం రాజుకు ఒక షరతు విధించిన ఘట్టం మనకు మహాభారతంలో కనబడుతుంది. ఆ మత్స్యకారుని కుమార్తెను తనకిచ్చి వివాహం చేయవలసిందని రాజు అడిగినప్పుడు, ఇప్పుడు యువరాజుగా ఉన్న కుమారునిగాక, తన కుమార్తెకు పుట్టే కుమారునికి రాజ్యం అప్పగిస్తానని మాట ఇస్తేనే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని అతడు చెబుతాడు. తాను సింహాసనాన్ని అధిష్ఠించబోనని ప్రకటించటమేగాక, మునుముందు తన సంతానం ఆ సింహాసనానికై పోటీపడే సందర్భమే రాకుండా తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని యువరాజు దేవవ్రతుడు భీష్మ ప్రతిజ్ఞ చేయటం ఆ గ్రంథంలో ఒళ్లు పులకరింపచేసే ఘట్టాలలో ఒకటి. న్యాయం అందించే వారు ఇక్కడ గ్రహించవలసిన విషయం, ఒకసారి మాట ఇస్తే- అతడు మహారాజే అయినప్ప టికీ-వచనబద్ధుడై ఉండక తప్పదు. చట్టాన్ని ఉల్లంఘించే వెసులుబాటు అతనికి లేదు. అంతేకాదు మహారాజుగా తాను ఎంత శక్తిమంతుడైనప్పటికీ – తన కుమార్తెను తెచ్చి వివాహం చేయాలని తన రాజ్యంలోని అతి సామాన్యుడినైనా బలవంతపెట్టే అధికారం మహారాజుకు లేదు. ఆ అతి సామాన్య వ్యక్తి విధించే నిబంధనలకు లోబడితేనే వ్యవహారం ముందుకు నడుస్తుంది. ప్రాచీనకాలంలో రాజులు నిరంకుశులనీ, నియంతలనీ – వారి మాట లేదా ఆదేశం నిరభ్యంతరంగా అమలయ్యేదని, ప్రజల హక్కులకు హామీ లేదని అనుకోకూడదని ఈ ఉదంతం స్పష్టపరుస్తుంది.
గ) ప్రాచీన హిందూ దేశంలో న్యాయవ్యవస్థ.
- కౌటిల్యుని అర్థశాస్త్రం (క్రీ.పూ.322-292 మధ్య మగధ రాజ్యాన్ని పాలించిన మౌర్య చంద్ర గుప్తుని ప్రధానమంత్రిగా కౌటిల్యుడిని గుర్తిస్తారు) ప్రకారం ఆనాటి రాజ్యం స్థానీయ, ద్రోణముఖ, ఖర్వాటిక, సంగ్రహణ అనే నాలుగు రకాల పాలనా విభాగాలుగా (నేటి జిల్లాలు, తాలుకాలు, ఫిర్కాలు వంటివి అనుకోవచ్చు) ఉండేది. స్థానీయ అనేది 800 గ్రామాలకు మధ్య నిర్మించిన ఒక దుర్గం కలిగి ఉండేది. ద్రోణముఖ అనేది 400 గ్రామాల మధ్యన, ఖర్వాటిక అనేది 200 గ్రామాల మధ్యన దుర్గం కలిగి ఉండగా, సంగ్రహణ అనేది 10 గ్రామాలకు కేంద్రంగా ఉండేది. ప్రతి సంగ్రహణలో న్యాయ స్థానాలూ ఉండేవి. రెండు జిల్లాలు కలిసే చోట్ల కూడా (జనపద సంధిషు) న్యాయస్థానాలు ఉండేవి. ఆ న్యాయ స్థానాలలో ముగ్గురు న్యాయమూర్తులు, ముగ్గురు అమాత్యులూ ఉండేవారు.
- ఆనాటి ప్రముఖ న్యాయవేత్తలలో మనువు, యాజ్ఞవల్క్య, కాత్యాయనుడు, బృహస్పతి తదితరులే గాక వాచస్పతిమిశ్రునివంటి వ్యాఖ్యాతలు కూడా ప్రసిద్ధులు. వారు తమ రచనలలో అతి ప్రాచీన కాలం నుండి తమ కాలంవరకు హిందూ దేశంలో పరిఢవిల్లిన న్యాయ వ్యవస్థలను గురించి విపులంగా పేర్కొన్నారు.
- బృహస్పతి తెలియజేస్తున్న దానిననుసరించి – కుటుంబ న్యాయస్థానంతో ఆరంభించి, రాజు వరకు పైకి పోగల వివిధ స్థాయిల న్యాయస్థానా లుండేవి. దిగువ స్థాయిలో కుటుంబ తగాదాలను తీర్చే మధ్యవర్తి, తీర్పరి ఉండేవాడు. ఆపై న్యాయస్థా నాలలో న్యాయమూర్తులు ఉండేవారు. ముఖ్య న్యాయాధీశుల స్థాయి దాటిన తర్వాత ప్రాడ్వివాకుడు లేదా అధ్యక్షుడు ఉన్న న్యాయస్థానం, ఆపైన రాజు స్వయంగా తీర్పు ప్రకటించే న్యాయస్థానం ఉండేవి.
- వివాదాల ప్రాధాన్యాన్ని బట్టి న్యాయస్థానాల అధికారపరిధి ఉండేది. చిన్న చిన్న వివాదాలను దిగువ న్యాయస్థానాలలో పరిష్కరించేవారు. అత్యధిక ప్రాధాన్యంగల వివాదాలను రాజు విచారించేవాడు. పై న్యాయస్థానం చెప్పిన తీర్పు దిగువ న్యాయస్థానం చెప్పిన తీర్పును రద్దు చేసేదిగా ఉండేది. వాచస్పతి మిశ్రుడు ఇలా అన్నాడు: క్రమంగా పైకి వచ్చే వివాదాలలో తీసుకొన్న నిర్ణయాలు-ఉన్నత స్థాయిలో అవగాహనతో కూడుకొన్నవై ఉన్నందున- అందరినీ బద్ధులను చేసేవిగా ఉండేవి.
- ఈనాడు కూడా ఇదేవిధమైన వివిధ స్థాయుల న్యాయాలయాలు (గ్రామ న్యాయస్థానం, మున్సిఫ్, సివిల్ జడ్జి, జిల్లా జడ్జి, ఉన్నత న్యాయ స్థానం, అంతిమంగా అత్యున్నత న్యాయస్థానం) పనిచేస్తున్నాయి. తెలిసో, తెలియకో మనం ప్రాచీన పరంపరనే అనుసరిస్తున్నాం. రాజు తీర్పునిచ్చే న్యాయస్థానానికి బదులుగా అత్యున్నత న్యాయస్థానం తుది తీర్పు వెలువరిస్తున్నది. తేడా ఇంత మాత్రమే.
- దేశ సర్వసత్తాక సార్వభౌమాధికారం వివిధ స్థాయిల న్యాయస్థానములన్నింటికీ మూలబలం సమకూరుస్తున్నది. హిందూ దేశంలోని న్యాయ వితరణ విధానంతో దోషులను శిక్షించి (దండించి) నిర్దోషులకు, బాధితులకు న్యాయం చేయడమనేది సర్వసత్తాక సార్వభౌమాధికార నిర్వహణలో ఒక భాగమే.
- ప్రారంభంలో రాజునే ధర్మానికి మూల స్రోతస్సుగా భావించేవారు. స్వయంగా రాజే తీర్పు చెప్పి న్యాయం నిలబెట్టాలని ప్రజలంతా ఆకాంక్షించే వారు. అప్పుడు న్యాయశాస్త్ర కోవిదుల సహాయంతో ధర్మసూత్రాలకు అనుగుణంగానే రాజు తీర్పు ఉండేది. న్యాయస్థానం బహిరంగంగా (సభలో) విచారణ జరిపి తీర్పునివ్వాలి. ఈ విచారణ నిర్వహించే సమయంలో నివేదించడానికి, సాక్ష్యాలివ్వ డానికి వచ్చేవారని బెదరగొట్టే విధంగా తన వేషభాషలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి రాగద్వేషాలకూ లోనుకాకుండా నిర్ణయిస్తానని తన నిష్పాక్షిక వైఖరిని ప్రకటిస్తూ ప్రమాణం చేయాలి. కాత్యాయనుడు ఇలా రాశాడు: ‘‘నిరాడంబరమైన దుస్తులు ధరించి రాజు కొలువు కూటంలోకి రావాలి. తూర్పుదిశగా ముఖంపెట్టి ఆసీనుడు కావాలి. బాధితులూ, సాక్షులూ చెప్పే మాటలను శ్రద్ద్ధగా వినాలి. ప్రాడ్వివాకుడు (ప్రధాన న్యాయమూర్తి) ఇతర న్యాయమూర్తుల, మంత్రుల సహాయంతో బ్రాహ్మణ సలహాదారుల సహకారంతో రాజు తన విధిని నిర్వహించాలి. ఈ విధంగా ధర్మబద్ధంగా కర్తవ్య నిర్వహణ చేసే రాజు స్వర్గంలో స్థానమేర్పరుచుకోగలడు.’’
- పైన చెప్పిన మాటలన్నీ ఎంతో ప్రాముఖ్యం ఉన్నవి. రాజు ‘వినీతేషుడు’ (నిరాడంబరమైన వస్త్రాలు ధరించినవాడు) కావాలి. నివేదించడానికి వచ్చినవారు రాజు వేషాన్నో, ఔద్ధత్యాన్నో చూసి భయపడే స్థితి ఉండరాదు. అతడు రాగద్వేషాలకు లొంగేవానిగా కాక న్యాయసూత్రాలననుసరించి వ్యవహరిస్తాడనే నమ్మకం అందరిలో ఉండాలి. ధర్మశాస్త్రానుగుణంగా రాజు వ్యవహారాలను చక్కదిద్దుతూ ఉన్నట్లయితే, స్వయం నియంత్రణ పాటిస్తున్నట్లయితే, అగ్ని వలె ఏడురంగుల ప్రభలతో అతడు వెలుగొందుతూ ఉంటాడని నారదుడు చెప్పాడు.
ధర్మాసనం మీద ఆసీనుడైన రాజు వివస్వంతుని వలె నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. వివస్వంతుడు ధర్మమూర్తియైన యమధర్మరాజు కుమారుడు, అతని పేరున ప్రమాణం చేయటం నిష్పక్షపాతబుద్ధికి నిదర్శనం (నారదుడు).
(ఇంకా ఉంది)
అను: డా।। వడ్డి విజయసారథి