– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్‌ ‌జర్నలిస్ట్

‌భారత ఒలింపిక్‌ ‌సంఘం (ఐఓఏ)అందరికీ చిరపరిచితం. దేశ రాజధాని నగరం ఢిల్లీలో కొలువుతీరిన ఒలింపిక్‌ ‌భవన్‌కి మకుటాయమానం. అథ్లెటిక్స్ ‌సహా ప్రధానంగా 32 క్రీడాంశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మహాసంస్థ. ఇంకా మరెన్నో విభిన్న అంశాలకు ఉత్సాహప్రోత్సాహాలనందిస్తున్న అతి పెద్ద వ్యవస్థ. దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా వివిధ విభాగాలను కూడగట్టుకుని తనవంతు కర్తవ్యాలను నెరవేరుస్తోంది. దీనికి 32 మంది ప్రతినిధులతో కూడిన కార్యనిర్వాహకమండలి ఉంది. నాలుగేళ్లకు ఒకసారి దీనికి ఎన్నిక జరుగుతుంటుంది. మరో అయిదేళ్లలో శతవసంతోత్సవం (1927లో స్థాపితం) చేసుకోబోతోంది. ఒలింపిక్‌, ఏషియన్‌ ‌క్రీడలు; ఇతర అంతర్జాతీయ అథ్లెటిక్‌ ‌మీట్‌లకు క్రీడాకారులను పంపించడమే ముఖ్య బాధ్యత.

ఇంతటి చరిత్రాత్మక రీతి నిండిన సంఘానికి అధ్యక్షులు పీటీ ఉష. మనందరికీ ఎంతగానో తెలిసిన, రికార్డుల పరంపర సృష్టించిన పరుగుల రాణి! అప్పుడెప్పుడో దరిదాపు నాలుగున్నర దశాబ్దాల క్రితమే మన దేశం తరఫున అథ్లెటిక్స్ ఆడి వినువీధిన కీర్తిపతాకను ఎగరేసిన మహిళా యోధ. ఆ సూపర్‌ ఎక్స్‌ప్రెస్‌… ‌సంఘ చరిత్రలోనే సరికొత్త శకానికి తాజాగా నాంది పలికారు. ఐఓఏకు మొట్టమొదటి వనితా నేతగా ఏకగ్రీవంగా ఎన్నికై ‘అహో’ అని పించారు. చెక్కుచెదరని ఘనతకు తానే ఒక పర్యాయ పదంగా మారి ప్రతి ఒక్కరికీ రోల్‌మోడల్‌గా నిలుస్తున్నారు. ఇదే ప్రస్థానం క్రీడాకారులతో పాటు సగటు పౌరులందరికీ ఎటువంటి సందేశం అందిస్తోంది? ఏం చెప్తోంది… ఏ విధమైన అనంతర ఫలితాలను ఆశిస్తోంది? ప్రస్తుతం 58వ పడిలో ఉన్న ఆమె చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు దేశ ప్రతిష్ఠను ఇంకెంతగా ఇనుమడింపచేస్తాయి? ఇవన్నీ ఇప్పుడు మరెన్నెన్నో ఆశా జ్యోతులను వెలిగిస్తున్నాయి.

‘పయోలీ’ పేరు విన్నారు కదూ! అది కేరళలోని మలబార్‌ ‌ప్రాంతంలోని పట్టణం. కోజికోడ్‌ ‌జిల్లాలోని చిన్నపాటి ఊరు. అదే ఉష స్వస్థలం. అక్కడే బడి చదువు. మొదటి నుంచీ ఆటలంటే ప్రాణం. అందుకే తన జిల్లా తరఫున ఆడి, పన్నెండ్లేకే క్రీడా పాఠశాలలో చేరింది. మరో మూడేళ్ల లోపునే జాతీయ స్థాయి స్కూల్‌ ‌గేమ్స్‌లో పాల్గొంది. ట్రాక్‌పైన పరుగులు చేస్తుంటే…ఆ వేగం ఒడుపూ చూసి సహ క్రీడాకారులంతా ఎంతో ముచ్చటపడేవారు. మాస్కో ఒలింపిక్స్ (1980)‌లో ఆడినప్పుడు ఆమె వయస్సు కేవలం పదహారు! ఒక అంతర్జాతీయ మీట్‌లో సాధించిందేమిటో ఊహించగలరా? ఒకటో రెండూ మూడో కాదు. ఏకంగా నాలుగు బంగారు పతకాలు! అంతటితో ఆగి ఉంటే తాను ఉష ఎందుకవుతుందీ? ఆ మరుసటి ఏడాదే మరో మూడు ప్రపంచ స్థాయి క్రీడోత్సవాల్లో ఇంకో ఐదు స్వర్ణాలను సొంతం చేసేసుకుంది. తదుపరి వత్సరంలోనే వరల్డ్ ‌జూనియర్‌ ‌మీట్‌లో, ఢిల్లీ ఏషియన్‌ ‌క్రీడల్లో ఇంకా కొన్ని పతకాలు అందుకున్నారు. కువైట్‌ ‌వేదికగా ఏర్పాటైన ట్రాక్‌ అం‌డ్‌ ‌ఫీల్డ్‌లో, మన దేశ రాజధానిలో జరిగిన పోటీల్లో విజృంభించింది. ఈసారి అమెరికా పయనం. సింగపూర్‌లోను వరస సువర్ణాల స్వీకరణం. చెక్‌ ‌రిపబ్లిక్‌కీ వెళ్లి వచ్చింది. అదైతే రైల్వే క్రీడల మహోత్సవం. అందులో ఉత్తమ అథ్లెట్‌ ‌తానే! స్వర్ణాలు, రజతాలు సమంగా సాధించి ప్రత్యేకత సంతరించుకున్న తొలి రైల్వే క్రీడాకారిణి. సియోల్‌లో కూడా వరసబెట్టి నాలుగు బంగార పతకాల, బీజింగ్‌, ‌హిరోషిమా, ఖాట్మాండు, ఇంకెన్నెన్నో చోట్ల లెక్కకు పతకాల అందుకున్నారు. తన ఇరవై ఏళ్ల వయసు లోనే అర్జున అవార్డు విజేత అయ్యారు. భారత ప్రభుత్వ సమున్నత పౌరపురస్కారాన్ని స్వీకరించారు. అంతెందుకు – ఒలింపిక్‌ అథ్లెటిక్స్‌లో తుదిపోటీకి చేరిన మొట్టమొదటి వనితాజ్యోతి. ఇక పదో ఆసియా క్రీడల్లో నైతే నాలుగు స్వర్ణాలు, అన్నింటా ఆసియా రికార్డులూ ఉషవే! జకార్తాలో అధిక సంఖ్యలో పతకాలు కైవసం చేసుకుంది. ఇలా శతాధిక స్వర్ణ పతకాలు సముపార్జించిన క్రీడాకిరణం – మహోత్తమ తేజం ఆమె. పాతికేళ్ల ప్రాయంలో నే అపూర్వ అపురూప బహూకృతులతో ‘ఆసాంతం బంగారం’గా జన నీరాజనాలు అందుకున్న ది గ్రేటర్‌ ‌గ్రేటెస్ట్ ఉష!

పొంగక, కుంగక…

అథ్లెట్‌గా అత్యుత్తమ శక్తి సామర్థ్యాలు చాటిన ఉషకు పలు పదుల సంఖ్యలో పురస్కారాలు లభిం చాయి. అన్నీ ఘన విజయాలేనే అనుకుంటే, క్షణాల తేడాలో పతకాలు కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. తొలిదశలో రష్యాలోని పోటీల్లో తన కంటూ కలిసి వచ్చిందేమీ లేదు. అమెరికాలో జరిగిన నాటి క్రీడల్లోనూ సెమీస్‌లో అగ్రస్థానం పొందినా, తుదిపోటీల్లో మెడల్‌ ‌చేజారింది. ఒలింపిక్స్‌కి సంబంధించి, మన దేశం 120 ఏళ్లనాటే తొలిగా పాల్గొంది. శతాబ్దాల క్రితమే మొట్టమొదటిసారిగా భారత బృందం వెళ్లి, అప్పటి నుంచీ ప్రతిసారి ప్రతినిధిగా వ్యవహరిస్తోంది. వేసవి, శీతాకాలంలో సైతం ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. అనేక సందర్భాల్లో ఉష తానేమిటో నిరూపించుకుంది. దశాబ్దాల తరబడి రన్నింగ్‌ ‌ట్రాక్‌ను శాసిస్తూనే వచ్చింది. పేద కుటుంబంలో పుట్టిన తాను అప్పట్లో అనారోగ్య బాధలనూ ఎదుర్కొంది. ఎన్ని సమస్యలు చుట్టు ముట్టినా ఎదిరించి నిలిచింది. ఆసక్తి, ఆ శక్తి ఆమె జీవితానికి బంగారుబాటలు వేశాయి. చిన్నప్పుడు, ప్రభుత్వం అందించిన కొద్దిపాటి ఉపకారవేతనమే ఆధారం. కన్నూర్‌లోని స్పోర్టస్ ‌స్కూల్‌కి వెళ్లిన తర్వాతే, స్థితిగతుల్లో కొన్ని మార్పు చేర్పులు సంభవించాయి. అలనాడు ప్రథమంగా రష్యాకు వెళ్లిన భారతీయ క్రీడాకారిణి తాను. సియోల్‌ ‌క్రీడోత్సవాల్లో ఏషియన్‌ ‌స్ప్రింట్‌ ‌క్వీన్‌గా నిలిచింది. అనంతర కాలంలో బృందం తరఫున రిలేలో జాతీయ రికార్డులనూ నెలకొల్పింది. బాలికలకు తగినంత శిక్షణ ఇవ్వడానికి అథ్లెటిక్‌ ‌క్రీడాలయాన్ని ప్రారంభించడమే ఉష జీవితంలోని అత్యంత ముఖ్యాంశం. ఆసియా ఖండంలోనే తిరుగులేని అథ్లెట్‌గా అవతరించి, ఇతరులందరికీ ఆదర్శప్రాయ అయిందామె. సహజ సిద్ధ నైపుణ్యానికి పదునుపెట్టి, అతివల లోకానికి స్ఫూర్తిదాయనిగా ప్రభవించింది. ప్రధానంగా 1984 నుంచీ ఏటేటా పురస్మృతులు వరిస్తూ వచ్చాయి. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి, పార్లమెంటు సభ్యురాలిగా ఎదిగింది. దేశానికి తాను అందించిన సేవ అమూల్యమని సాక్షాత్తు ప్రధాని నరేంద్రమోదీ నుంచే ప్రశంస పొందింది. ఆమె ప్రత్యేకతలు రెండు. ఒకటి – విజయాలకు పొంగకపోవడం, రెండు – అప జయాలకు కుంగకపోవడం. క్రీడారంగం అన్నాక, బరిలోకి దిగాక అన్నీ ఒత్తిళ్లే ఉంటాయి. విజేతలకు సత్కారాలు, పరాజితులకు తిరస్మృతులూ ఎదురవుతూనే ఉంటుంటాయి. ఏవి ఎలా ఉన్నా, అన్నింటినీ సరిసమానంగా స్వీకరించడమే ఆ రాణి విశిష్టత. ఒలింపిక్స్‌లో పాల్గొంటానని ఊహించని ఆమె ఆ సంఘానికి అధ్యక్షురాలు కావడం విశేషం.

అనుభవాలే ఉపాధ్యాయులు

ఒలింపిక్‌ ‌సంఘ అగ్రనేతగా ఉష సాధిం చాల్సినవి ఎన్నెన్నో. ఎంపీగా ఉంటుండగానే పలు క్రీడాంశాలపై దృష్టి కేంద్రీకరించి ఆమె, ప్రత్యేకంగా అథ్లెటిక్స్‌లో సాధించిన, సాధించాల్సిన వాటిపైన ఆలోచనలను,ఆచరణలను సమీకరించారు.

 పారిస్‌ ‌వేదికగా తదుపరి (2024) ఒలింపిక్స్ ‌జరుగుతాయి. అటు తర్వాత వేదికలు లాస్‌ ఏం‌జెల్స్, ‌బ్రిస్బేన్‌. అనంతరమూ, ఆతిథ్య మిచ్చేందుకు ఇంకా పలు దేశాలు పోటీపడు తున్నాయి. పతకాన్ని సాధించాలనేదే క్రీడాకారులందరి ఏకైక కోరిక. తన దేశాన్ని పతకాల జాబితాలో చూసుకోవాలన్నదే ఆశ, ఆశయం. విశ్వక్రీడల నిర్వహణ దేశంగా వెలుగులీనాలని మన భారత దేశమూ ఉవ్విళ్లూరుతోంది. ఇదే అంశాన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్ ‌సమాఖ్య ఇదివరకే స్పష్టం చేసింది. ఒలింపిక్‌ ‌నిర్వహణ భారీ వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. అదే సమయంలో కీర్తి పతాకాన్ని సగర్వంగా ప్రపంచమంతటా ఆవిష్కరించేది ఆతిథ్య దేశమే. భారత్‌ ‌సైతం అదే అభిలషిస్తోంది. వీటన్నింటినీ గమనంలోకి తీసుకున్నప్పుడు, భారత ఒలింపిక్‌ ‌సంఘం అధినేత్రిగా ఉష తీసుకునే నిర్ణయాల మీద భవిష్యత్‌ ‌క్రీడా భారతం ఆధారపడి ఉంటుంది. ఆర్థిక, పాలన, నిర్వహణ, పర్యవేక్షణ, సమన్వయ విభాగాలను దృఢతరం చేయగలిగితేనే భారత్‌ అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతుంది. ప్రతిసారి ఒలింపిక్‌ ‌క్రీడాత్సోవాల తరుణాన, మనదేశం తరఫున ఆడటానికి వెళ్లే వారి సంఖ్యను తగినంత పరిమితం చేయాల్సిన అవసరమైతే ఉంది. విధి విధానాలను తు.చ. తప్పక అనుసరించేలా చేయగలిగితేనే మనకు క్రీడారంగంలో సమున్నత భవిష్యత్తు. వీటిన్నింటి నేపథ్యంలో ఉషకు ఇప్పటికీ ఒక క్రియాత్మక ఆలోచన విధానం ఉందనాలి. అందుకు కారణం ఆమె ఇంత కాలంగా పొందిన క్రీడానుభవాలే తన హయాంలో అద్భుత ఫలితాలనే మనమంతా మనసారా ఆశించవచ్చు.

ఆమె విజయ వర్తమానానికి భావికీ అన్వ యించవచ్చు. ఈ రీత్యా చూసినప్పుడు, అధ్యక్షు రాలిగా ఆమె ఎన్నిక నిస్సందేహంగా ఆశాజనకమే. వేచి చూద్దాం… ఎటువంటి సానుకుల ఫలితాలు భారత్‌ ‌ఖాతాలో చేరి సువార్ణక్షరాలుగా ధగధగలాడతాయో!

About Author

By editor

Twitter
YOUTUBE