డిసెంబర్ 24 జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
అవును! గడప దాటి అడుగు బయట పెట్టింది మొదలు, మనం మోస పోతూనే ఉంటాం. అడుగడుగునా మోసాలు ఎదురవుతూనే ఉంటాయి. ఉప్పు, పప్పు మొదలు ప్రతి కొనుగోలులో మోసం ఎదురవుతుంది. ధర విషయంలోనో, నాణ్యత పరంగానో, తూకం కొలతల విషయంలోనో, కల్తీల విషయంలోనో మరో విధంగానో మోసపోతూనే ఉంటాం… మోస పోతూనే ఉన్నాం.
ఒక్క వస్తువుల కొనుగోలు విషయంలోనే కాదు, వైద్యం, బీమా సేవలు మొదలు ప్రభుత్వసేవల వరకు అనేక విధాల మోసపోతున్నాం. మార్కెట్ మోసాల కారణంగా వినియోగదారులు కేవలం ఆర్థికంగానే కాదు, ఆరోగ్యపరంగానూ నష్టపోతున్నారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలే కోల్పోతున్నారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కల్తీ మందులు, ఆహార పదార్థాలు, పానీయాలు ప్రాణాలు తీసిన సంఘ టనలు అనేకం చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఇక మద్యం కల్తీ గురించి చెప్పనే అక్కరలేదు. కల్తీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల బ్లాక్ మార్కెట్ రైతుల ఆత్మహత్యలకు కారణం అవుతు న్నాయి. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ మోసాలు మహమ్మారిని మించిన విషాదాలను సృష్టించాయి… సృష్టిస్తున్నాయి.
ఈ మోసాలను కట్టడి చేసేందుకు, వినియోగ దారుల హక్కులను రక్షించేందుకు, జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఉద్యమాలు నడిచాయి. విని యోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల హక్కుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ అంతర్జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం మార్చి 15వ తేదీన అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినం, జాతీయ స్థాయిలో డిసెంబర్ 24 జాతీయ వినియోగ దారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం.
ఎందుకంటే…
వినియోగదారులకు హక్కులున్నాయి. వాటిని పరిరక్షించే చట్టాలున్నాయి. నిజానికి, వినియోగ దారుల హక్కుల పరిరక్షణకు జాతీయ వినియోగ దారుల హక్కుల పరిరక్షణ కమిషన్ వంటి వ్యవస్థలు న్నాయి. మోసాలకు పాల్పడిన వ్యాపార, వాణిజ్య, ఉత్పాదక సంస్థలపై చర్యలు తీసుకుంటున్నాయి. అన్ని సందర్భాలలో కాకున్నా కొన్ని సందర్భాల్లో అయినా కఠినంగా శిక్షిస్తున్నాయి. అయినా, మార్కెట్ శక్తుల మోసాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకు, ఇంకా ఇతర కారణాలున్నా, వినియోగదారులకు తమకున్న హక్కులు, చట్టాల గురించి అవగాహన లేకపోవడం ఒక ప్రధాన కారణం. అందుకే, విని యోగదారులకు తమ హక్కులు, బాధ్యతల గురించి అవగాహన కల్పించేందుకే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వినియోగదారుల హక్కుల దినోత్సవాలను జరుపుకుంటున్నారు.
అందుకే.. ఆ రోజు
మన దేశంలో డిసెంబర్ 24, 1986న వినియోగదారుల హక్కుల చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించింది. పార్లమెంట్ ఆమోదించిన చట్టానికి, రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఆరోజు నుంచి ప్రతి సంవత్సరం అదే రోజున దేశ వ్యాప్తంగా జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక అంశాన్ని ఇతివృత్తంగా (థీమ్) తీసుకుని డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నాయి. అవినీతి, అక్రమ వ్యాపారాలను అరికట్టేందుకు, ప్రభుత్వం తెచ్చిన, తెస్తున్న సంస్కరణలు, దేశంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది ‘ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్’ అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా (థీమ్)గా తీసుకుని జాతీయ వినియోగదారుల దినోత్సవం పాటిస్తున్నాం.
డిజిటల్ యుగంలో..
సుస్థిర స్వచ్ఛ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణల కారణంగా, ఆర్థికవ్యవస్థలో, వ్యాపార కార్యకలాపాలలో, వ్యాపార సేవా కార్య కలాపాల స్వరూప, స్వభావాలలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొవిడ్ మహమ్మారి కారణంగానూ ‘ఆన్‌లైన్’ లావాదేవీలకు ప్రాధాన్యం పెరిగింది. అదే సమయంలో ‘ఆన్‌లైన్•’ మోసాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 1986 నుంచి అమలులో ఉన్న నియోగదారుల హక్కుల రక్షణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం డిజిటల్ యుగానికి తగిన విధంగా సవరించింది. 1991,1993లోనూ చట్ట సవరణలు జరిగినా జూలై 20, 2020 నుంచి అమలులోకి వచ్చిన 2019 వినియోగదారుల చట్టం, వినియోగదారుల హక్కుల పరిధిని విస్తృతపరిచింది. ఒక విధంగా నూతన చట్టం… పాత మోసాలకు పగ్గాలు బిగిస్తూనే, డిజిటల్ మోసాలకు కళ్లెం వేసేందుకు ఉద్దేశించిన చట్టంగా పేర్కొనవచ్చు.
అందుకే, 2019 వినియోగదారుల హక్కుల చట్టాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, ‘ఫెయిర్ డిజిటల్ ఫైనాన్స్’ అంశాన్ని ఇతివృత్తంగా ఎంచుకున్నారు. నిజానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం ‘కొవిడ్’ కాలంలోనూ ఈ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తూనే వుంది. అందులో భాగంగానే గత సంవత్సరం (2021లో) వర్చువల్‌గా నిర్వహించిన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం, ‘వినియోగదారుడా! తెలుసుకో నీ హక్కులు’ అనే అంశంపై ప్రచారం కల్పించింది.
ఇవీ మార్పులు
కొత్తగా 1986 హక్కుల చట్టానికి తెచ్చిన సవరణలలో ‘సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ఏర్పాటు ప్రధానమైనది. అలాగే, కాంట్రాక్టుల్లో అక్రమాలను అరికట్టేందుకు పొందుపరిచిన నిబంధన అసంబద్ధ నిబంధనలకు అడ్డుకట్ట వేస్తుంది. కొత్త చట్టంలో వినియోగదారుల ఫోరంను ‘వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్’గా మార్చారు. అలాగే, ఇంతకుముందు చట్టం పరిధిలో లేని, ఆన్‌లైన్ ప్రకటనల మోసాలను చట్టం పరిధిలోకి తీసుకు వచ్చారు. వినియోగదారులను పక్కదారి పట్టించే అలాంటి ప్రకటనలపైన 2019 చట్టం కొరడా ఝుళి పించింది. అంతేకాదు, పక్కదారి పట్టించే వాణిజ్య ప్రకటనలకు సవరణ చట్టం చక్కని నిర్వచనం కూడా ఇచ్చింది. వస్తుసేవల తప్పుడు వర్ణన, ఒక ఉత్పత్తి లేదా సేవలకు సంబంధించి తప్పుడు హామీ, తప్పుడు గ్యారెంటీ ఇవ్వడం, వస్తుసేవల మౌలిక సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడం… వాటిని శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తారు. వాణిజ్య ప్రకటనల మోసాలపై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) చర్యలు తీసుకుంటుంది. ఎలక్ట్రానిక్, టెలీషాపింగ్, ప్రత్యక్ష అమ్మకం, బహుళస్థాయి మార్కెటింగ్ వివాదాలు సీసీపీఏ పరిధిలోకి వస్తాయి. వాణిజ్య ప్రకటనల ద్వారా తప్పుదోవ పట్టిస్తే రూ.10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు, రెండోసారి నేరం రుజువైతే రూ.50 లక్షల జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అధికారం సీసీపీఏకు ఉంటుంది.
అవగాహన లేకనే…
గతంలో గానీ, వర్తమానంలో గానీ వినియోగ దారుల హక్కుల రక్షణకు చట్టాలు లేకపోవడం కంటే, ఉన్న చట్టాల గురించి వినియోగదారులకు సరైన అవగాహన లేకపోవడం వల్లనే మరింతగా దోపిడీకి గురవుతున్నారు. ముఖ్యంగా చట్టాలు కల్పిస్తున్న హక్కులు, బాధ్యతలు గురించి తెలియక పోవడం, తెలిసినా చిన్నమొత్తాల కోసం, సమయం ‘వృథా’ చేసుకోవడం ఎందుకని ఎవరికి వారు చట్టం తలుపులు తట్టకపోవడం వలన, మార్కెట్‌శక్తులు వినియోగదారులను తేలిగ్గా మోసం చేస్తున్నాయని, వినియోగదారుల హక్కుల ఉద్యమ కార్యకర్తలు చెపుతున్నారు.
ఉదాహరణకు, ‘డి మార్ట్’ క్యారీ బ్యాగుల కేసునే తీసుకుంటే, ఆ సంస్థ ముద్రిత లోగో ఉన్నా లేకున్నా వినియోగదారులకు ఉచితంగానే చేతి సంచులు (క్యారీ బ్యాగ్స్) ఇవ్వాలంటూ హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్పు వెలువరించింది.
వినియోగదారుల వద్ద చేతి సంచి కోసం వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతో పాటు, పరిహారంగా రూ.1,000, న్యాయ సేవా కేంద్రానికి రూ.1,000 చెల్లించాలని హైదర్‌నగర్ డీమార్ట్ శాఖను ఆదేశించింది. అయితే, ఒక్క డిమార్ట్ అనే కాదు… ప్రతి షాపింగ్ మాల్ ‘క్యారీ బ్యాగ్’కు ఛార్జి చేస్తూనే ఉన్నాయి. ఎవరికివారు ‘మూడు రూపాయలే కదా’ అని ఉపేక్షించడం వల్లనే, షాపింగ్‌మాల్స్ కోట్లలో దోపిడీకి పాల్పడు తున్నాయని వినియోగదారుల ఉద్యమ కార్యకర్తలు చెపుతున్నారు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణలో మొదటి అడుగు, వినియోగదారులదే కావాలని, వినియోగ దారులు కళ్లు తెరిస్తేనే హక్కుల రక్షణ సాధ్యమవు తుందని అంటున్నారు. ముఖ్యంగా, 2019 చట్టం ద్వారా సీసీపీఏ ఏర్పాటు వలన ఫిర్యాదులు చేయడం మరింత సులభం అయిందని, దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ పల్లెపాడు దామోదర్ వంటి సూచిస్తున్నారు. అయితే, సీసీపీఏ పరిధి మరింత పెరిగి, అందరికీ అందు బాటులో ఉండవలసిన అవసరం ఉందని అంటు న్నారు. షాపింగ్‌మాల్స్ సముదాయం ఉన్నచోట వినియోగదారుల ఫిర్యాదులు స్వీకరణకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేయాలని అంటున్నారు.
అందుకే, కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల హక్కులకు సంబంధించి సమాచారం అందించేం దుకు, 180042500333తో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ఒక వస్తువును ఏ ప్రదేశంలో కొనుగోలు చేసినా, తాము నివాసముంటున్న ప్రాంత న్యాయస్థానంలో ఫిర్యాదు చేసుకునే వెసులుబాటును నూతన చట్టం కల్పించింది. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వినియోగదారుల కమిషన్ తోడుగా కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ చట్టంలో ఉన్న ముఖ్యమైన భాగం ఆన్‌లైన్, ఇ-మొయిల్ ద్వారా నేరుగా సంస్థలో ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
జిల్లా, రాష్ట్ర, జాతీయ కమిషన్లతో సంబంధం లేకుండా సంస్థలో ఫిర్యాదుకు ఏర్పాట్లు చేశారు. 18004252233, 7330774444 టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటుచేసింది. అయితే, వినియోగదారుల హక్కుల పరిరక్షణలో అన్నిటికన్నా ముఖ్యం, వినియోగదారుల జాగృతి. అందుకే, ‘వినియోగ దారుల హక్కుల దినోత్సవం’ అంటున్నారు.
- రాజనాల బాలకృష్ణ,, సీనియర్ జర్నలిస్ట్