‌డిసెంబర్‌ 28 ‌కాంగ్రెస్‌ ‌వ్యవస్థాపక దినోత్సవం

కొన్ని శతాబ్దాల మహా మౌనం తరువాత అంకురించిన భావ చైతన్యాన్ని వ్యక్తీకరించడానికి చారిత్రక పరిస్థితులు సృష్టించి ఇచ్చిన అసమాన వేదిక భారత జాతీయ కాంగ్రెస్‌. ‌జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం అంటే చరిత్రకందని పీడన మీద వినిపిస్తున్న వందలాది పీల గళాలన్నీ ముక్తకంఠమై గర్జించడానికి జాతిలో ఆత్మశక్తిని దట్టించి, ఐక్యతను అద్దిన అద్భుతఘట్టం. స్వరాజ్య సమరంలో ఐదు దశాబ్దాలకు పైగా, స్వతంత్ర భారతంలో ఇంకో ఆరు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌ ‌నిర్వహించిన పాత్ర ఆధునిక భారత చరిత్రలో సింహభాగమే అవుతుంది. జాతి స్వాతంత్య్ర పోరాటానికీ, ఆపై దేశ నిర్మాణానికీ వందేళ్ల పాటు ముందు నిలిచిన సంస్థ జాతీయ కాంగ్రెస్‌. అం‌దుకే స్వాతంత్య్ర పోరాటంలో, స్వాతంత్య్రానంతర భారతదేశంలో కాంగ్రెస్‌ ‌ప్రస్తావన లేని ఒక్క చరిత్ర వాక్యాన్ని ఊహించడం, రాయడం సాధ్యం కాదన్నది ఎవరికి ఎన్ని విభేదాలు ఉన్నా అంగీకరించవలసిన వాస్తవం. కానీ ఆ విభేదాలు సహేతుకమైనవే కావచ్చు.

ఆవిర్భావం

జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భావం, పరిణామం పరిశీలిస్తే ‘పంచతంత్రం’లో నూకల కింద వల పన్నిన విషయం తెలియక వాలి, తరువాత కలిసికట్టుగా వలతో సహా ఆకాశంలోకి ఎగిరిపోయిన కపోతాలు గుర్తుకు వస్తాయి. పక్షిశాస్త్రజ్ఞుడు అలెన్‌ ఆక్టేవియన్‌ ‌హ్యూమ్‌ను కాంగ్రెస్‌ ‌స్థాపన పనికి ఎంచుకోవడం చూస్తే ఇదే గుర్తుకు వస్తుంది. ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్‌ ఇం‌డియా ప్రభుత్వం భారతీయులకు ఇంగ్లిష్‌ అనే గవాక్షం ద్వారా ప్రపంచాన్ని చూసే అవకాశం ఇచ్చింది. తామున్న పరిస్థితిని సమీక్షించుకునే అవకాశం కల్పించింది. ఇంగ్లిష్‌ ‌నేర్చిన తొలితరానికి మొదట్లో కొన్ని భ్రమలు ఉన్నాయి. అవి తొలిగినాక, ఇంగ్లిష్‌ ఇచ్చిన చైతన్యంతోనే బ్రిటిష్‌ ‌వారి ప్రభావం నుంచి భారతీయులు ఎగిరిపోయారు. అలాగే కాంగ్రెస్‌ ‌తొలితరం నేతలు బ్రిటిష్‌ ఇం‌డియా మీద చాలా భ్రమలు పెట్టుకున్నారు. తరువాత అవన్నీ చెదిరిపోక తప్పలేదు. అందుకే ‘అంతుచిక్కని కొన్ని పరిస్థితులలో’ భారత జాతీయ కాంగ్రెస్‌ ఆవిర్భవించిందని డాక్టర్‌ ‌భోగరాజు పట్టాభి సీతారామయ్య, ‘కాంగ్రెసు చరిత్ర’లో పేర్కొనడం సబబే అనాలి.

 బ్రిటిష్‌ ఇం‌డియా వ్యవసాయ శాఖ కార్యదర్శి పదవిని కోల్పోయిన సివిల్‌ ‌సర్వెంట్‌ ‌హ్యూమ్‌ ‌జాతీయ కాంగ్రెస్‌ ‌సంస్థకు రూపునిచ్చాడు. దాదా భాయ్‌ ‌నౌరోజీ, దిల్షా ఎదుల్జీ వాచా, ఉమేశ్చంద్ర బెనర్జీ, మన్మోహన్‌ ‌ఘోష్‌, ‌విలియం వెడర్న్‌బర్న్ ‌కూడా సంస్థ వ్యవస్థాపకులుగా వినుతికెక్కారు. కాంగ్రెస్‌ ‘అధికారిక చరిత్రకారుడు’ పట్టాభి వ్యాఖ్య నిజమే అయినట్టు శ్వేతజాతీయుడే అయినా హ్యూమ్‌ (‌స్కాట్లాండ్‌ ‌వాసి) భారతీయులంతా ఒకే త్రాటిపైకి వచ్చి పోరాడడానికి మొదటిసారి ఎందుకు రంగం సిద్ధం చేశాడు? వైస్రాయ్‌ ‌లార్డ్ ‌డఫ్రిన్‌ ఆశీస్సులతోనే ఏవో హ్యూమ్‌ ‌కాంగ్రెస్‌ను రంగం మీదకు తెచ్చాడు. ఎందుకు? 1885 నాటికి కొన్ని ప్రమాదకర సంకేతాలు, సవాళ్లు బ్రిటిష్‌ ‌ప్రభుత్వం ముందు నిలిచాయి. అందులో అంతర్గతమైనది – అప్పటి గిరిజన, రైతాంగ పోరాటాల తీవ్రత. ఈ ప్రమాదం గురించి సీఐడీ నివేదికలు భయపెట్టాయి. నిజానికి 1857-58 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం, తరువాత వాసుదేవ బల్వంత్‌ ‌ఫాడ్కే (1879) రామోషి రైతాంగ పోరాటం చదువుకున్న మధ్య తరగతిలో వస్తున్న ప్రతికూల దృక్పథానికి సంకేతంగా ఆ ప్రభుత్వం భావించింది. అఫ్ఘానిస్తాన్‌లో తల దూర్చడం వల్ల ఆగ్రహంతో ఉన్న జారిస్ట్ ‌రష్యా దాడి చేయవచ్చునన్న భయం కూడా బ్రిటిష్‌ ‌వారిని కాంగ్రెస్‌ ‌స్థాపనకు పురికొల్పిందన్న వాదన ఉంది. 1885 మార్చికి ‘రష్యా గుబులు’ తారస్థాయికి చేరింది. ఒకవేళ అది జరిగితే ప్రజలను ఏకంచేసి ఒక రక్షణ కవచంగా మలుచుకోవడానికి ఒక జాతీయ స్థాయి సంస్థ అవసరమన్న పథకం కూడా కాంగ్రెస్‌ ‌పునాదులలో ఉంది. ఇలాంటి ప్రమాదం ఒకటి పొంచి ఉందని తనకు అతీతశక్తులు చెబుతున్నాయని హ్యూమ్‌ ‌ప్రచారం చేసేవాడు. అయితే దేశంలో చెదురుమదురుగా వినిపిస్తున్న నిరసన గళాలను ఏకం చేయడానికి ఒక సంస్థను నెలకొల్పాలని దివ్యజ్ఞాన సమాజం అప్పటికే ఒక ఆలోచనలో ఉన్నట్టు, హ్యూమ్‌ ‌ద్వారా అది కార్యరూపం దాల్చినట్టు చెబుతారు. ‘‘ఇండియాలోని వైస్రాయ్‌ ఆశీర్వాదము పొందిన తరువాత హ్యూము సీమకు వెళ్లి, కాంగ్రెసు స్థాపనమును గూర్చి రిప్పను, డల్హౌసీ ప్రభువులను కూడా సంప్రతించాడని’’ పట్టాభి ఒకచోట చెబుతారు. ‘హ్యూమ్‌ ‌కాంగ్రెసుకు ఫాదర్‌. ‌డఫ్రిన్‌ ‌గాడ్‌ఫాదర్‌’ అని డబ్ల్యుసి బెనర్జీ బాహాటంగానే చెప్పారు. లాలా లజపతిరాయ్‌ ఇం‌కో అడుగు ముందుకేసి ‘కాంగ్రెస్‌ ఆం‌గ్ల సృష్టి, డఫ్రిన్‌ ‌కపోల కల్పితం’ అన్నారు. హ్యూమ్‌, ‌డఫ్రిన్ల ఉద్దేశాలు ఏమైనా ఇలాంటి ఒక సంస్థ ఏర్పాటుకు నాటి పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్‌ ‌వంటి సంస్థలు భారతీయుల చింతనలో తెచ్చిన మార్పులు ఉన్నాయి. సాంస్కృతిక పునరుజ్జీవనంతో భారతీయ పురిటినొప్పులు మొదలైనాయి. సమాజంలో రాజకీయ అవసరాలూ ఉన్నాయి.

ఏకమైన గళాలు

భారతదేశానికి ప్రాతినిధ్య ప్రభుత్వం కావాలని అప్పటికే ఇంగ్లండ్‌లోను, ఇక్కడ కలిపి పదికిపైగా సంస్థలు డిమాండ్‌ను వినిపిస్తున్నాయి. బెంగాల్‌ ‌బ్రిటిష్‌ ఇం‌డియా సొసైటీ, బ్రిటిష్‌ ఇం‌డియా సొసైటీ, బాంబే అసోసియేషన్‌, ‌లండన్‌ ఇం‌డియన్‌ ‌సొసైటీ, మద్రాస్‌ ‌నేటివ్‌ అసోసియేషన్‌, ‌పూనా సార్వజనిక సభ, మద్రాసు మహాజన సభ, ఇండియా లీగ్‌ ‌వంటివి ఇలాంటివే. జాతీయ స్థాయిలో ఒక సంస్థ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నానికి ఈ సంస్థల డిమాండ్‌ ఉపయోగపడింది. అదే సమయంలో హ్యూమ్‌ ‌కలకత్తా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ఇచ్చిన పిలుపుతో 1884లో ఇండియన్‌ ‌నేషనల్‌ ‌యూనియన్‌ ‌సంస్థ ఆవిర్భవించింది. 1885లో నౌరోజీ సూచన మేరకు అదే ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌ అని పేరు మార్చుకుంది. మొదట పూనా నగరంలో సమా వేశాలు జరపాలని అనుకున్నా హఠాత్తుగా కలరా వ్యాపించడంతో వేదిక బాంబే నగరానికి మారింది. డిసెంబర్‌ 28-31, 1885‌న డబ్ల్యుసి బెనర్జీ అధ్యక్షునిగా జాతీయ కాంగ్రెస్‌ ‌తొలి సమావేశాలు గోకుల్‌దాస్‌ ‌తేజ్‌పాల్‌ ‌సంస్కృత కళాశాలలో జరిగాయి. పూనా సార్వజనిక సభ ఈ బాధ్యతను భుజాలకెత్తుకుంది. అలా ఒక విశాల ప్రాతిపదికతో, విస్తృత చర్చ అనంతరం భారత జాతీయ కాంగ్రెస్‌ ‌రూపుదాల్చింది. తొలి మహా సభలకు హాజరైన 72 మంది ప్రతినిధులలో భారతీయ సాంఘిక జీవనంలో పలు విధాలుగా ప్రసిద్ధులే ఉన్నారు. నౌరోజీ, ఫిరోజ్‌ ‌షా మెహతా, హ్యూమ్‌, ‌జిజి అగార్కర్‌, ‌కెటి తెలాంగ్‌, ‌పి. రంగయ్యనాయుడు, ఎస్‌. ‌సుబ్రహ్మణ్య అయ్యర్‌, ‌జి. సుబ్రహ్మణ్య అయ్యర్‌, ఎం. ‌వీరరాఘవాచార్యులు వంటి నాయకులతో పాటు మహదేవ గోవింద రానడే (శాసనసభ సభ్యుడు, పూనా), కె. సుందరరామన్‌, ఆర్డీ భండార్కర్‌ (‌పండితులు), ఆర్‌. ‌రఘునాథరావు (డిప్యూటీ కలెక్టర్‌, ‌మద్రాసు) వారిలో కొందరు. ఇక్కడకు వచ్చిన ప్రతినిధిలలోను, ప్రసంగించిన ప్రతి వక్తలోను దేశం కోసం ఇప్పుడే ఒక వాస్తవికమైన కార్యక్రమం మొదలైందన్న విశ్వాసం కనిపించిందని ఈ సంఘటనను నమోదు చేసిన కలకత్తా వారపత్రిక ‘రయీస్‌ అం‌డ్‌ ‌రయ్యత్‌’ ‌వ్యాఖ్యానించడం సత్య దూరం కాదు. అయితే భారతీయ సమాజంలో పెల్లుబుకుతున్న ఆగ్రహాన్ని కూడా ‘సేఫ్టీ వాల్వు’ ద్వారా అంటే చట్టబద్ధమైన మార్గాలలో నిరసనను వ్యక్తం చేసే పక్రియ ద్వారా. తాము అనుకున్నట్టుగా మలచాలన్న శ్వేతజాతి వ్యూహం మాత్రం అద్భుతంగా అమలైంది.

తొలినాటి ఆశయాలు

‘దేశ పురోభివృద్ధికి కృషి చేసే కార్యకర్తల మధ్య స్నేహసౌహార్ద్ర భావాలను నెలకొల్పడమే’ ప్రధాన ఎజెండాగా బొంబాయి సమావేశాలు ప్రారంభ మైనాయి. కుల, మత, ప్రాంతీయ దురభిమానాలను తొలగించి జాతీయ సమైక్యతను సాధించడం, సాంఘిక సమస్యల మీద విద్యావంతులు తమ అభిప్రాయాలను వెల్లడించడం, ఈ సమస్యల పరిష్కారానికి మార్గాలు అన్వేషించడం కాంగ్రెస్‌ ‌లక్ష్యాలు. కానీ ఎంత మహా ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. రెండవ మహాసభలు (1886) కలకత్తాలో జరిగాయి. అప్పుడే ఈ సంగతి రుజువైంది. దీనికి హాజరైన 436 మంది ప్రతినిధులు స్థానిక ప్రజా సంఘాల నుంచి ఎంపికై వచ్చినవారే. కాంగ్రెస్‌ ‌దేశవ్యాప్తమైంది. రాజ్యాంగ, ఆర్థిక సంస్కరణల నుంచి, స్వరాజ్యం, సంపూర్ణ స్వరాజ్యం వరకు అంచెలంచెలుగా ఆలోచనలను విస్తరించింది. మద్రాసు, బాంబే గవర్నర్‌ ‌కౌన్సిళ్లలో భారతీయ ప్రాతినిధ్యం పెరగాలన్న డిమాండ్‌ను కలకత్తా కాంగ్రెస్‌ ‌ముందుకు తేవడమే ఇందుకు నిదర్శనం. ఇంకో విశేషం ఏమిటంటే కాంగ్రెస్‌ ఆవిర్భవించిన ఐదు సంవత్సరాలకే ఆ వేదిక నుంచి ఒక మహిళ ప్రసంగించింది. ఆమె కలకత్తా విశ్వ విద్యాలయం తొలి పట్టభద్రురాలు కాదంబినీ గంగూలి. సరోజినీదేవి, అనిబిసెంట్‌ ‌తరువాత కాలంలో సంస్థలో కీలకపాత్ర వహించారు. తొలితరం నేతలంతా బ్రిటిష్‌ ‌పాలనకు అనుకూలురే. బ్రిటిష్‌ ‌పాలనలో భారతీయ ప్రాతినిధ్యం తెచ్చు కోవడం వరకు మాత్రమే పరిమితమైనవారు. ఈ దృక్పథానికి ప్రాతినిధ్యం వహించిన మితవాదులు నాయకత్వంలోనే 1885 నుంచి 1905 వరకు కాంగ్రెస్‌ ‌నడిచింది. వీరంతా బారెట్లాలు, ప్రొఫెసర్లు, పత్రికా రచయితలు, ప్రధానోపాధ్యాయులు. ‘చదువు కున్నవారు ఇంగ్లీషు వారికి మిత్రులేగాని, శత్రువులు కారు’ అంటారు కాంగ్రెస్‌ ‌నేత ఆనంద మోహన్‌ ‌బోస్‌. అం‌దుకే భారతీయులకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలనీ, ప్రాతినిధ్య సంస్థలలో సభ్యత్వం కల్పించా లన్న డిమాండ్‌కే వీరంతా ఎక్కువగా కట్టుబడి ఉండేవారు. కానీ ఇరవై సంవత్సరాల ఉద్యమంలో వీరు పెద్దగా సాధించినదేమీ లేదన్న విమర్శ ఉంది. కానీ ఆ వైఖరి బెంగాల్‌ ‌విభజనకూ, దానితోనే అతివాదులకూ జన్మనిచ్చింది.

తొలి చీలిక

మితవాదుల, అంటే రాజ్యాంగ బద్ధంగా వినతిపత్రాలతోనే ప్రభుత్వాన్ని లొంగదీయాలనుకున్న వర్గం, ఆలోచనను పూర్తిగా వ్యతిరేకించే వర్గం ఒకటి కాంగ్రెస్‌లో తలెత్తింది. వీరే తీవ్ర జాతీయవాదులు. ఇందులో మితవాదులకు గోపాలకృష్ణ గోఖలే, తీవ్ర జాతీయవాదులు లేదా అతివాదులకు బాలగంగాధర తిలక్‌ ‌నాయకత్వం వహించేవారు. ఈ రెండు శిబిరాల మధ్య ప్రధానమైన భేదం ఉంది. అది- బ్రిటిష్‌ ‌ప్రభుత్వానికి విధేయత. మన పురోగతికి బ్రిటిష్‌ ‌పాలన అనివార్యమని మితవాద వర్గ ప్రతినిధి రాస్‌ ‌బిహారీ ఘోష్‌ అభిప్రాయం. భారతీయులకు తమను తాము పాలించుకునే సత్తా లేదని ఆయన నిశ్చితాభిప్రాయం. కానీ బ్రిటిష్‌ ‌ప్రభుత్వం మితవాదుల పట్ల మొదట స్నేహంగా ఉన్నా తదుపరి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. మితవాదం పనిచేయలేదు. అతివాదుల దృష్టి వేరు. ప్లేగు వంటి కాటకాలలో ప్రభుత్వం అమానుష వైఖరి, విదేశాలలో ఉన్న భారతీయులను హీనంగా చూడడం, ఎంత విన్న వించినా బెంగాల్‌ ‌విభజనకే ప్రభుత్వం మొగ్గు చూపడం, నిరుద్యోగం, అమానవీయ చట్టాలు వంటివి కాంగ్రెస్‌లోనే కొందరిని ప్రతికూలంగా మార్చాయి. మితవాదులకు స్వరాజ్యం అంటే బాధ్యతాయుత ప్రభుత్వం, అతివాదులకు సంపూర్ణ స్వాతంత్య్రం. ఈ నేపథ్యంలో జరిగినదే 1907 సూరత్‌ ‌కాంగ్రెస్‌. ఈ ‌సభలో అధ్యక్ష పదవికి తిలక్‌ ‌పోటీ చేయదలిచాడు. దీనిని అడ్డుకునే క్రమంలో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడినాయి. సభ రసాభాస అయింది. కాంగ్రెస్‌ ‌చీలిపోయింది. అప్పటి నుంచి 1915 వరకు స్వాతంత్య్రోద్యమ రాజకీయా లలో ఒక ‘శూన్యం’ ఏర్పడింది. దీనిని పూరించిన వాడు మహమ్మదాలీ జిన్నా. లక్నో ఒప్పందంతో ఆయన కాంగ్రెస్‌ ‌రెండు పక్షాలను కలపడంతో పాటు, ముస్లిం లీగ్‌ను కాంగ్రెస్‌కు మద్దతుగా తీసుకు రాగలిగాడు.

గాంధీయుగం

1915లో గాంధీజీ భారతదేశం వచ్చారు. 1919లో కాంగ్రెస్‌ ‌నాయకత్వం చేపట్టారు. నిజానికి ఆయన జాతీయ కాంగ్రెస్‌కు ఆధ్యాత్మిక నిర్దేశకుడు మాత్రమే. సభ్యుడు కారు. గాంధీజీ ప్రతిపాదించిన ఖిలాఫత్‌ ఉద్యమాన్ని, సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిరాకరించి జిన్నా కాంగ్రెస్‌కు దూరమైనారు. ‘రాజకీయాలంటే పెద్దమనుషుల క్రీడ’ అన్నది జిన్నా అభిమతం. 1920 నాటి నాగపూర్‌  ‌సమావేశాలలోనే  జిన్నా కాంగ్రెసు విడనాడారు. అయితే గాంధీజీ మితవాదులు మార్గాన్ని, అతివాదుల పంథాలను సంపూర్ణంగా అనుసరించకుండా ప్రజల మద్దతు కోసం కాంగ్రెస్‌కు కొత్త రూపం ఇచ్చారు. 1907, 1915, 1920 సమావేశాల తరువాత చరిత్రలో ప్రసిద్ధి గాంచిన ఘటన లాహోర్‌ ‌సమావేశాలు. జవహర్లాల్‌ ‌నెహ్రూ అధ్యక్షతన 1929లో జరిగిన ఈ సభలలో సంపూర్ణ స్వరాజ్యం నినాదం వినిపించారు. 1923 నాటి కాకినాడ సమావేశాలు కూడా ‘వందేమాతరం’ వివాదంతో చరిత్ర ప్రసిద్దమైనాయి. సైమన్‌ ‌గో బ్యాక్‌ ఉద్యమం, దండి సత్యాగ్రహం, రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశాలు, కమ్యూనల్‌ అవార్డు, క్రిప్స్ ‌రాయబారం, క్విట్‌ ఇం‌డియా ఉద్యమం వంటి ప్రధాన ఘట్టాలన్నీ గాంధీజీ సారథ్యంలోనే కాంగ్రెస్‌ ‌నిర్వహించింది. గాంధీ జీవిత చరిత్రతో పాటు, కాంగ్రెస్‌ ‌చరిత్రలోనే మరో ప్రముఖ ఘట్టం త్రిపురి (ఎంపి) కాంగ్రెస్‌ (1939) అధ్యక్ష ఎన్నిక. చౌరీచౌరా హత్యాకాండతో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపి వేయడం జాతీయ సంక్షోభం అని ప్రకటించి అప్పటి నుంచి అతివాద ముద్రతో కాంగ్రెస్‌లో కొనసాగిన సుభాష్‌ ‌బోస్‌ ఆ ‌సంవత్సరం కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆయనపై కాంగ్రెస్‌ ‌నాయకత్వం లేదా గాంధీజీ వర్గం భోగరాజు పట్టాభి సీతారామయ్యను నిలిపింది. పట్టాభి ఓడిపోయారు. ‘పట్టాభి ఓటమి నా ఓటమి’ అని ప్రకటించి గాంధీజీ తీవ్ర సంచలనం సృష్టించారు. తిలక్‌, ‌జిన్నా, శ్రీనివాస్‌ అయ్యంగార్‌ (1929‌లో హోంరూల్‌ ‌కాకుండా సంపూర్ణ స్వాతంత్య్రం కోరినందుకు కాంగ్రెస్‌ ‌బహిష్కరించింది) బాటలోనే బోస్‌ ‌కాంగ్రెస్‌ ‌నిరాదరణకు గురయ్యారు.

1969 చీలిక – 1977 ఓటమి

1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ నాయకత్వం కాంగ్రెస్‌ ‌చేతిలోనే ఉంది. గాంధీ, ఆయన ప్రధాన అనుచరుడు వల్లభ్‌ ‌భాయ్‌ ‌పటేల్‌ ‌కాంగ్రెస్‌ అవసరం పూర్తయిందని భావించి, రద్దు చేయడం మంచిదని అభిప్రాయపడ్డారు. అయినా స్వతంత్ర భారతదేశంలో అదే ప్రధాన రాజకీయ పక్షంగా నిలబడింది. మొదట నెహ్రూ, తరువాత లాల్‌ ‌బహదూర్‌ ‌శాస్త్రి, తరువాత ఇందిర ప్రధాను లయ్యారు. నిజానికి స్వతంత్ర భారతదేశపు విధా నాలు ఆయా సభలలో కాంగ్రెస్‌ ‌చర్చించుకుంటూనే ఉండేది. అంటరానితనం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, స్త్రీ విమోచన, విద్యారంగం, వ్యవసాయ విధానం, భాషా ప్రయుక్త రాష్ట్రాలు, విదేశాంగ విధానం ఇవన్నీ అలా ఒక రూపానికి వచ్చినవే. ప్రపంచంలో వస్తున్న మార్పులను అనుసరించి కాంగ్రెస్‌ ‌వీటికి రూపం ఇస్తూ ఉండేది. భారతదేశానికి స్వామ్యవాద వ్యవస్థ ఉండాలని 1955 నాటి ఆవడి సమావేశాలలో నిర్ణయించడం అలాంటిదే.

ఇక 1969 నాటి పార్టీ చీలికకు ఇంకో విశేషం ఉంది. జాకీర్‌ ‌హుస్సేన్‌ ‌హఠాన్మరణంతో జరిగిన రాష్ట్రపతి ఎన్నిక దగ్గర వచ్చిన వివాదమే కాంగ్రెస్‌ ‌చీలికకు కారణమైంది. కాంగ్రెస్‌ ‌పార్టీ (సిండికేట్‌) ‌నీలం సంజీవరెడ్డిని అభ్యర్థిగా నిలిపింది. అయితే ఇందిర అధిష్టానం నిర్ణయాన్ని మొదట అంగీకరించి తరువాత వీవీ గిరిని పోటీ అభ్యర్థిగా నిలపడం వివాదాస్పదమైంది. కమ్యూనిస్టుల అండతో గిరి గెలిచారు. కమ్యూనిస్టులు అండనివ్వడానికి ఇంకో విశేషమైన కారణం ఉంది. ఇందిర పద్నాలుగు జాతీయ బ్యాంకులను జాతీయం చేసి అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాజభరణాల రద్దు నిర్ణయం కూడా చరిత్రాత్మకం. గిరి నెగ్గినా సిండికేట్‌ ‌ముఖ్యులు మొరార్జీ దేశాయ్‌, ‌నిజలింగప్ప, కామరాజ్‌ ‌నాడార్‌ ‌నాయకత్వంలో కాంగ్రెస్‌ ‌విడిపోయింది. వ్యవస్థా కాంగ్రెస్‌, ఇం‌దిరా కాంగ్రెస్‌ అప్పుడే ఏర్పడినాయి. అయితే 1971 ఎన్నికలలో ‘గరీబీ హటావో’ నినాదంతో కాంగ్రెస్‌ ఎన్నికలలో ఘన విజయం సాధించింది. సిండికేట్‌ ‌చరిత్రలో భాగమై పోయింది. అయితే ఈ ఎన్నికలలోనే రాయబరేలీ నియోజక వర్గంలో కొన్ని ‘అక్రమాలకు’ పాల్పడిన ఆరోపణపై ఇందిరకు వ్యతిరేకంగా అలహాబాద్‌ ‌హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీని వెంట వచ్చిన పరిణామాలు ఇందిర చేత దేశంలో తొలిసారిగా 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించేటట్టు చేశాయి. తరువాత ఇది తప్పిదమని ఇందిర స్వయంగా అంగీకరించారు. ఇరవై ఏడు సంవత్సరాల తరువాత మొదటిసారి కాంగ్రెస్‌ అధికారం కోల్పోయింది. నిజానికి అత్యవసర పరిస్థితి బీజేపీ ఆవిర్భావానికి పరోక్షంగా బీజం వేసింది. ఆ విధంగా దేశంలో ఒక ప్రధాన ప్రతిపక్షం ఆవిర్భావానికి కాంగ్రెస్‌ ‌వీలు కల్పించింది.

21వ శతాబ్దంలోకి

నెహ్రూ పంచవర్ష ప్రణాళికలను సోవియట్‌ ‌రష్యా స్ఫూర్తితో పరిచయం చేశారు. పారిశ్రామికీ కరణకు భారీ జల ప్రాజెక్టులకు ప్రాణం పోసినది ఆయనే. ఇందిర అణుశక్తిని అందించారు. తరువాత ప్రధాని అయిన రాజీవ్‌గాంధీ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలన్న మహోన్నతమైన నినాదం ఇచ్చారు. దేశాన్ని సాంకేతికంగా ముందుకు నడిపించారు. పారిశ్రామిక విప్లవంలో భాగస్వామి కాలేకపోయిన భారతదేశం ఐటీ విప్లవం ద్వారా ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి మార్గం చూపినవారు రాజీవ్‌ ‌గాంధీయే. కానీ నెహ్రూ హయాంలోనే అవినీతికి బీజాలు వేసుకున్న కాంగ్రెస్‌, ‌రాజీవ్‌ ‌కాలం నాటికి పరాకాష్టకు చేరుకుంది. బొఫోర్స్ ‌కొనుగోళ్ల వ్యవహారం ఆ పార్టీని మళ్లీ ఓటమికి గురి చేసింది. నెహ్రూ కాలంలో భారత్‌ ‌చైనా చేతిలో ఓటమి చవి చూసింది. ఇందిర అత్యవసర పరిస్థితిని విధించి, కాంగ్రెస్‌ ‌భవితవ్యాన్ని అస్పష్టం చేశారు.

ఇంకొన్ని వాస్తవాలను కూడా గమనించవలసి ఉంటుంది. ఏ కాలంలో అయినా ఉత్థానపతనాలు జాతీయ కాంగ్రెస్‌లో సహజ పరిణామాలుగా కనిపిస్తాయి. విభేదాలు సహజ ఆభరణాలుగా భాసిస్తూ ఉంటాయి. కాంగ్రెస్‌ ఒక ప్రధాన రాజకీయ స్రవంతిగా భారతభూమి అంతటా ప్రవహించ గలిగిందంటే అందుకు కారణం దాని నేపథ్యమే. అలాగే చరిత్రను మరచిపోవడం, గతంలో వలెనే జాతీయవాదులను దూరంగా పెట్టడం ఇప్పటికీ కాంగ్రెస్‌లో ఒక సంస్కృతిగా పరిఢవిల్లుతూనే ఉంది. ప్రధానిగా ఇందిరను, మాజీ ప్రధానిగా రాజీవ్‌ను కాంగ్రెస్‌ ‌కోల్పోయిందని ఆ పార్టీ చెప్పుకుంటున్న ప్పటికీ అది వారి స్వయంకృతం.

కాంగ్రెస్‌ ఒక తప్పిదాల కుప్ప. ఎవరు స్వాతంత్య్రోద్యమం గురించి మాట్లాడినా వారికి హక్కు లేదని కాంగ్రెస్‌ ‌నాయకులు యుద్ధానికి రావడం దేశంలో మామూలైంది. అలాంటి వారు అసలు కాంగ్రెస్‌ ‌స్థాపన ఒక విదేశీయుడితో జరిగిందన్న సంగతి మరచిపోరాదు. అసలు బ్రిటిష్‌ ‌జాతీయులే దిక్కు అన్న విధానం తొలినాటి కాంగ్రెస్‌ది. ఇప్పుడు ఈ ధోరణిని ఏ పేరు పెట్టి పిలవాలి? ఆ లెక్కన సోనియాకూ, రాహుల్‌కూ, ప్రియాంకా వాద్రాకు స్వాతంత్య్రోద్యమంతో ఏమిటి సంబంధం? గట్టిగా చెప్పాలంటే, ఒక విదేశీయుడు కొందరు విదేశీయుల సలహాతో స్థాపించిన కాంగ్రెస్‌ ఇప్పుడు తిరిగి విదేశీ ముద్ర ఉన్న మహిళ చేతికీ, ఆమె కుమారుడి చేతికీ వచ్చింది. ఇది వాస్తవం. ఈ సంస్థలో వెలుగు తక్కువే. చీకటే ఎక్కువ.

——————–

తొలితరం కాంగ్రెస్‌లో కనిపించేది బ్రిటిష్‌ ‌విధేయతే!

‘కాంగ్రెసు చరిత్ర అనగా భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రమన్నమాట’ అన్న వాక్యంతోనే భోగరాజు పట్టాభి సీతారామయ్య తన ‘కాంగ్రెసు చరిత్ర’ రచనను ఆరంభించారు. వాస్తవాలు పరిశీలిస్తే స్వరాజ్య సమర చరిత్ర ఆ వ్యాక్యాన్ని ప్రతిబింబించదు. కాంగ్రెస్‌ ‌తొలితరం నాయకత్వం లక్ష్యం బ్రిటిష్‌ ‌పాలనను అంతం చేయడం కాదు, కొనసాగేందుకు సహకరించడం. తాము బ్రిటిష్‌ ‌వారికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు కాబట్టే సంస్థ కొనసాగుతోంది అని గోఖలే అంతటివారు అంగీకరించారు. అలాగే ఇది ఆంగ్ల విద్యను అభ్యసించినవారి కోసం తలపెట్టిన సంస్థ. స్వరాజ్య సమరంలో భారత జాతీయ కాంగ్రెస్‌ అ‌గ్రస్థానంలో ఉందన్న వాస్తవాన్ని కాదనకుండానే, ఎన్నో సంస్థలు, ఎందరో వ్యక్తులు ఆ యజ్ఞంలో భాగస్వాములయ్యారనీ, సమిధలయ్యా రనీ చెప్పక తప్పదు. కానీ ఈ చారిత్రక సత్యం కాస్త మరుగున పడి, సాధారణ ప్రజానీకం కూడా భారతదేశానికి స్వాతంత్య్ర తెచ్చినది జాతీయ కాంగ్రెస్‌ అన్న అభిప్రాయంలో ఉండిపోతున్నారు. కాంగ్రెస్‌ ‌వాదుల త్యాగం గొప్పదే. మిగిలినవారి త్యాగమూ స్మరణీయమే.

నిజానికి కాంగ్రెస్‌ ఆరంభంలో బ్రిటిష్‌ ‌పాలన నుంచి భారతజాతి విముక్తిని కోరలేదన్నది ఒక చేదు నిజం. దీనిని స్థాపించిన అలెన్‌ ఆక్టేవియన్‌ ‌హ్యూమ్‌ ‌బ్రిటిష్‌ ‌జాతీయుడు. భారతదేశంలో ప్రజాభిప్రాయాన్ని మలచగల ప్రముఖులను తమకు అనుకూలంగా మలుచుకునే ఉద్దేశమే ఆ సంస్థ స్థాపనలో కనిపించి కనిపించని అజెండా. ఇది చాలామంది రచయితలు, చరిత్రకారులు అంగీకరించే వాస్తవం. ఆదిలో జాతీయ కాంగ్రెస్‌ ‌పాలనలో భారతీయులను భాగస్వాములను చేస్తే చాలుననే అనుకుంది. ఇక్కడ నుంచి శ్వేతజాతి నిష్క్రమించాలని కోరుకోలేదు. ‘మై ఇయర్స్ ఇన్‌ ఇం‌డియా’ పుస్తకంలో లార్డ్ ‌హార్డింజ్‌  ఇలా రాసుకున్నాడు, ‘ఒకవేళ ఇంగ్లిష్‌ ‌వారు భారతదేశాన్ని వీడిపోతే, వారు ఆడెన్‌ ‌చేరక ముందే భారతదేశం వారిని వెనక్కి పిలుస్తుంది’ అన్న నమ్మకమే నాటి కాంగ్రెస్‌ ‌ప్రముఖులలో ఉండేది. ఇది గోపాలకృష్ణ గోఖలేతో 1908లో హార్డింజ్‌ ‌జరిపిన సంభాషణ సమయంలో వచ్చిన మాటే.  మేమే కనుక దేశం వీడి వెళ్లిపోతే మీరు ఏమనుకుంటారు అని హార్డింజ్‌ అం‌టే, గోపాలకృష్ణయ్య ఆడెన్‌ ‌చేరకుండానే టెలిగ్రామ్‌ ఇచ్చి వెనక్కి రప్పించుకుంటాం అన్నారు.

 తమకు స్వయం సమృద్ధి దృష్టి, పాలనా సామర్థ్యం లేవనే ఆంగ్ల విద్యను అభ్యసించిన తొలితరం భారతీయులలో ఎక్కువ మంది నమ్మారు. వారే కాంగ్రెస్‌లో అగ్రనేతలు. ఆంగ్ల విద్యను అభ్యసించి, మేధావులుగా పేర్గాంచిన వారందరినీ ఒక వేదికపైకి తేవాలన్న ధ్యేయంతోనే హ్యూమ్‌ ‌కాంగ్రెస్‌ ‌స్థాపన యోచన చేశాడు. భారతీయులలోని దిగువ మధ్య తరగతి మీద అదుపు సాధించడానికి, బ్రిటిష్‌ ‌వారంటే లెక్క చేయని పొగరు ఉపన్యాసకుల బారి నుంచి వారిని కాపాడడానికి, వారి ఆగ్రహం బద్దలు కాకుండా చూడడానికి కాంగ్రెస్‌ను స్థాపించినట్టు ఆయన చెప్పుకున్నాడు. ‘ది ఇండియన్‌ ‌నేషనల్‌ ‌కాంగ్రెస్‌’ ‌పేరుతో బిపిన్‌చంద్ర రాసిన పుస్తకంలో, ‘భారతీయులకు సమాన హక్కులు ఇవ్వాలని హ్యూమ్‌ ‌కోరుకోలేదు. భారతీయులు ఆయుధాలు కలిగి ఉండడాన్ని నిషేధిస్తూ ఆంగ్లేయులు చేసిన తీర్మానాన్ని ఆయన సమర్థించాడు. సిపాయీల తిరుగుబాటుపై తనకున్న జ్ఞాపకాల దృష్ట్యా తాను భారతీయులకు ఆయుధాలు ఇవ్వరాదన్న తీర్మానాన్ని సమర్థించకుండా ఉండలేను’ అని హ్యూమ్‌  ‌ప్రకటించిన విషయాన్ని నమోదు చేశారు.

కాంగ్రెస్‌ ‌స్థాపకుడు హ్యూమ్‌ అని చరిత్రలో నమోదైనప్పటికీ, దీనికి అసలు కారకుడు వైస్రాయ్‌ ‌డఫ్రిన్‌. ‌కానీ కాంగ్రెస్‌ ‌స్థాపన తన ఆలోచనే అన్న వాస్తవాన్ని బహిర్గతం చేయకూడదని షరతు విధించాడు. అంటే ఇది ఒక బ్రిటిష్‌ అధికారిది కాదు, నేరుగా వైస్రాయ్‌ ‌స్వకపోల కల్పితమే. ఈ విషయాన్ని  కాంగ్రెస్‌ ‌నాలుగో సమావేశాలలో (1888) ఉమేశ్‌ ‌చంద్ర బెనర్జీ వెల్లడించారు. ‘బెంగాలీ బాబు వాళ్ల పాఠశాలల గురించి, కాలవల గురించి తనే మాట్లాడే అవకాశం ఇచ్చి బ్రిటిష్‌ ‌ప్రభుత్వం స్థాయిని తగ్గించకూడదు. అలాంటి విషయాలను గట్టిగా ప్రస్తావించవలసి వస్తే ఒక సేఫ్టీవాల్వు విధానంలో చెప్పనివ్వాలి అని 1880లో నాటి వైస్రాయ్‌ ‌కార్యదర్శి బారింగ్స్ ‌చెప్పాడు. తరువాత కాంగ్రెస్‌ ‌తొలి సభలో (బొంబాయి, 1885), అధ్యక్షుడు ఉమేశ్‌చంద్ర బెనర్జీ దేశంలో బ్రిటిష్‌ ‌పాలన ఉండాలని కాంగ్రెస్‌వాదులు కోరుకుంటున్నారని, తామందరి అంతిమ లక్ష్యం ఏమిటంటే, ప్రభుత్వ వ్యవహారాలలో, లేదా పాలనలో భారతీయులను భాగస్వాములను చేయడమేనని అన్నారు. ద్వితీయ వార్షిక సభలు 1886లో మద్రాస్‌లో జరిగాయి. ‘అసలు వివిధ ప్రాంతాలకు చెందిన భారతీయులంతా ఒకచోట చేరి ఒకే దేశం అన్న అంశం మీద గతంలో ఏనాడైనా మాట్లాడారా? అలాంటి అవకాశం వచ్చిందా? అది బ్రిటిష్‌ ‌పాలనలోనే సాధ్యమైంది’  అని దాదాభాయ్‌ ‌నౌరోజీ వ్యాఖ్యానించారు. 1887 నాటి మూడో సమావేశం ఇంకొక అడుగు ముందుకు వేసింది. ఈ సమావేశానికి కొందరు ఆంగ్లేయులు హాజరయ్యారు. ఆకాశంలో తారలు, సూర్యచంద్రులు ఉన్నంత కాలం తాము ఆంగ్లేయులకు విధేయులుగా ఉంటా మని ఆ సమావేశంలో నేతలు ప్రతిజ్ఞ చేశారు. 1888 నాటి కలకత్తా కాంగ్రెస్‌ ‌సభలకు అధ్యక్షత వహించిన సురేంద్రనాథ్‌ ‌బెనర్జీ, ‘బ్రిటిష్‌ ‌పాలకుల పట్ల తమ విధేయత భవిష్యత్తులో మరింత పరిఢవిల్లా’లని భగవంతుడి ప్రార్థించారు. ఉమేశ్‌చంద్ర బెనర్జీ వంటివారు బ్రిటిష్‌ ‌పాలన పట్ల తమ వినయ విధేయతలను దాచుకోలేదు. 1888లోనే తయారు చేసిన కాంగ్రెస్‌ ‌కార్యకలాపాల వార్షిక నివేదికలో ఆయన ఇలా రాశారు, ‘బ్రిటిష్‌ ‌పాలన ఈ దేశంలో సుస్థిరంగా ఉండాలి. ఈ సూత్రం మీదనే కాంగ్రెస్‌ ‌పనిచేస్తున్నది.’

అలహాబాద్‌లో నిర్వహించిన నాలుగో సమావేశాల నివేదికలో కాంగ్రెస్‌ ఇలా పేర్కొన్నది. ‘పార్లమెంటరీ విధానాన్ని కాని, ప్రాతినిధ్య ప్రభు త్వాన్ని గాని, భారతీయ వ్యవస్థలలో ప్రజాస్వామ్యాన్ని ప్రవేశ పెట్టాలని గాని కాంగ్రెస్‌ ‌కోరడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి ఉదాహరణలు ఇంకా ఎన్నో ఉన్నాయి.

అయితే జాతీయ కాంగ్రెస్‌లో చేరినవారంతా ఇలాగే బ్రిటిష్‌ ‌విధేయతనే చూపారని చెప్పడం సాధ్యం కాదు. బాలగంగాధర తిలక్‌ ‌కాంగ్రెస్‌ ‌సభ్యుడే. ఆయన స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నారు. కానీ ఆయనను కాంగ్రెస్‌ ‌నుంచి గెంటేశారు (సూరత్‌ ‌సమావేశం). తరువాత తీవ్ర జాతీయవాదం వైపు మొగ్గిన చాలామంది మొదట కాంగ్రెస్‌ ‌సమావేశాలలో కార్యకర్తలుగా పనిచేసిన సంగతిని కూడా విస్మరించలేం. అయినా 1905 నాటికి బెంగాల్‌ ‌విభజన వ్యతిరేకోద్యమం రావడంతో  బ్రిటిష్‌ ‌పాలన తప్ప అన్యధా శరణం నాస్తి అన్న తరం కాంగ్రెస్‌లో తాత్కాలికంగా మూగబోయింది. తరువాత గాంధీజీ ప్రవేశం కాంగ్రెస్‌ ‌మార్గాన్ని వేరొక దారికి మళ్లించింది. ఇక్కడ ఈ ప్రస్తానలు చేయడం అలనాటి నేతలను తక్కువ చేయడానికి కాదు. వారంతా వ్యక్తిగతంగా మహోన్నతులు. కానీ చరిత్ర అంతకంటే మహోన్నతమైనది.

About Author

By editor

Twitter
YOUTUBE