– అరుణ

నిన్న మొన్నటి వరకూ మనమంతా ‘ఆజాదీ కా అమృతోత్సవ్‌’ ‌కార్యక్రమాలను ఘనంగా జరుపుకున్నాం. అయితే దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా, వేలాది గిరిజన గ్రామాలలో కనీస వసతులు లేవు. దశాబ్దాలుగా ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీలు అడవి బిడ్డల బాగోగుల మీద దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణం. దీన్ని ఆసరాగా చేసుకుని తీవ్రవాదులు గిరిజనులను తమ వైపు తిప్పుకుని, జాతి వ్యతిరేక కార్యకలాపాలకూ పాల్పడుతున్నారు. ఇప్పుడిప్పుడే గిరిజనుల్లోనూ చైతన్యం వస్తోంది. ఒకరి కొమ్ము కాకుండా, ఎవరి పంచనా చేరకుండా ప్రజాస్వామ్య పంథాలో పోరాటం చేసి, తమ హక్కులను సాధించేందుకు కృషి చేస్తున్నారు. ‘అల్లరి’ నరేశ్‌ ‌నటించిన తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సైతం గిరిజనులు హక్కులను, వాటిని కాపాడుకోవడానికి వారు చేసిన పోరాటాన్ని తెలిపే చిత్రమే!

గతేడాది ‘నాంది’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ‘అల్లరి’ నరేశ్‌. ఆ ‌సినిమా ఇప్పుడు హిందీలోనూ రీమేక్‌ అవుతోంది. ‘నాంది’ తర్వాత నరేశ్‌ ‌తన ట్రాక్‌ ‌మార్చాడు. కామెడీ సినిమాలను కాస్తంత పక్కన పెట్టి, అర్థవంతమైన చిత్రాలు చేయడం మొదలెట్టాడు. అలా ప్రజల ముందుకు వచ్చిందే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ మూవీతో తమిళ దర్శకుడు ఎ. ఆర్‌. ‌మోహన్‌ ‌టాలీవుడ్‌ ఎం‌ట్రీ ఇచ్చాడు. జీ స్టూడియోస్‌తో కలిసి రాజేశ్‌ ‌దండు ఈ సినిమాను నిర్మించాడు.

కథ విషయానికి వస్తే.. శ్రీపాద శ్రీనివాస్‌ (‌నరేశ్‌) ‌తెలుగు టీచర్‌. ఎన్నికల డ్యూటీలో భాగంగా మారేడుమిల్లిలోని గిరిజన తండాలకు వెళతాడు. పాలకులు తమ కనీస అవసరాలను సైతం తీర్చడం లేదని అలిగిన గూడెం వాసులు, ఎన్నికలను బహిష్కరించాలని అనుకుంటారు. అయితే శ్రీనివాస్‌ ‌చొరవతో ఓటు వేయడానికి అంగీకరిస్తారు. కానీ ఎన్నికల తర్వాత కూడా వారి సమస్యలు తీరవని గ్రహించిన శ్రీనివాస్‌… ‌గూడెం వాసులతో కలిసి నాటకం ఆడతాడు. గిరిజనులు తనను, తన తోటి అధికారిని కిడ్నాప్‌ ‌చేసినట్టు ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తాడు. ఈవీఎంలు వీళ్ల దగ్గరే ఉండి పోవడంతో కౌంటింగ్‌ ఆగిపోయే పరిస్థితి వస్తుంది. శ్రీనివాస్‌ ‌బృందాన్ని విడిచిపెట్టాలంటే… తమ గూడెంలో బడి, వైద్యశాల, పట్టణానికి వెళ్లడానికి నదిపై వంతెన వేయాలని గిరిజనులు డిమాండ్‌ ‌చేస్తారు. మరి వీరి నాటకం ఫలించిందా? ప్రభుత్వం దిగి వచ్చి వీరి కోరికలు తీర్చిందా? ప్రభుత్వం తరఫున పని చేయాల్సిన శ్రీనివాస్‌ ఇలా గిరిజనులతో చేతులు కలపడం వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది? అనేది మిగతా కథ.

గిరిజనుల సమస్యలను ఏకరువు పెట్టడం, వారిని ఎడ్యుకేట్‌ ‌చేసి ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడం వరకూ సినిమా బాగానే సాగింది. అలానే కిడ్నాప్‌ ‌డ్రామా కూడా రక్తి కట్టింది. కానీ ఆ తర్వాత అధికారుల అత్యుత్సాహం, మిలటరీ దిగి గిరిజనులపై దాడి చేయడం, చివరకు కలెక్టర్‌ ‌సైతం ప్రతి నాయకుడి తరహాలో ప్రవర్తించడం.. ఇవన్నీ కాస్తంత అతిగా అనిపిస్తాయి. రాజకీయ నేతల దుష్ట పన్నాగాలు, దళారీల దోపిడీ వంటి వాటిని పెద్దగా హైలైట్‌ ‌చేయకుండా, మొత్తం తప్పును కలెక్టర్ల మీదకు దర్శకుడు వేసేశాడు. బహుశా రాజకీయపరమైన ఒత్తిడులు లేదా ఇతరత్రా సమస్యలు వస్తాయేమోనని భయపడి ఉండొచ్చు. దాంతో ఇది గిరిజనులు వర్సెస్‌ ‌గవర్నమెంట్‌ ఆఫీసర్స్ అన్నట్టుగా మారిపోయింది. ఈ సినిమాలో తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపే మాటలు, తెలుగుదనపు పాటలు చోటు చేసుకోవడం విశేషం. తెలుగు భాషను అభిమానించేవారికి ఇవి బాగా నచ్చుతాయి. అబ్బూరి రవి మాటలతో పాటు ఈ సినిమాలో ఓ పాట రాసి, దాన్ని తానే పాడారు. శ్రీచరణ్‌ ‌పాకాల నేపథ్య సంగీత ఆకట్టుకునేలా ఉంది. అలానే సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ విఎఫ్‌ఎక్స్ ‌పెద్దంత గొప్పగా లేదు. ఈ మధ్య కాలంలో అడవిని, అటవి సంపదను కాపాడేందుకు దైవాంశ కలిగిన జీవాలు పాటు పడుతున్నాయన్నట్టుగా చూపిస్తున్నారు. ఇందులోనూ ఓ వృషభరాజాన్ని, వీరభద్రుడిగా భావించి గిరిజనులు కొలవడం అనేది ఉంది. క్లయిమాక్స్‌లో ఆ వీరభద్రుడితో పోరాట దృశ్యాలనూ చిత్రీకరించారు. అయితే అవి అంత ఎఫెక్టివ్‌గా లేవు. గిరిజనుల నమ్మకాలను గౌరవిస్తూ, వారి అవసరాలను తీర్చుతూ వారిని అభివృద్ధి పథంలోకి తీసుకు రావాలి తప్పితే, ఓట్లు రాజకీయాలలో పావులుగా వాడు కోవాలంటే ఇక మీదట కుదరదు అని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం దర్శకుడు చేశాడు.

నటీనటుల విషయానికి వస్తే.. నరేశ్‌ ‌స్కూల్‌ ‌టీచర్‌గా చక్కగా సెట్‌ అయ్యాడు. అలానే అతని తోటి ఎన్నికల అధికారిగా ‘వెన్నెల’ కిశోర్‌ ‌నవ్వుల పువ్వులు పూయించాడు.

అడవి బిడ్డగా ఆనంది సహజ నటన ప్రదర్శిం చింది. ఇతర ప్రధాన పాత్రలను రఘుబాబు, శ్రీతేజ్‌, ‌కుమనన్‌, ‌సంపత్‌ ‌రాజ్‌, ‌ప్రవీణ్‌, ‌రవిప్రకాశ్‌, ‌నాగమహేశ్‌ ‌తదితరులు పోషించారు. ఓటు అనే ఆయుధం ఎంత బలమైనదో చెబుతూనే, దానికి కూడా క్లిష్ట సమయాల్లోనే విలువ అనే అంశాలను ఆసక్తికరంగా చూపించారు. అయితే నాటకీయత మరీ ఎక్కువైన కారణంగా ఇది జనాలను మెప్పించడం కష్టమే. సినిమాలో ఉన్న సందేశం దృష్ట్యా ఓటీటీలో వచ్చినప్పుడు ఓసారి చూడొచ్చు.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE