– క్రాంతి
డిసెంబర్ 19 గోవా స్వాతంత్య్ర దినోత్సవం
భారతదేశం బ్రిటిష్ పాలనలో రెండు శతాబ్దాల పాటు ఉంటే, పోర్చుగీసువారు నాలుగున్నర శతాబ్దాలు కొనసాగారు. ఆగస్ట్ 15, 1947న బ్రిటిష్ పాలన నుంచి భారత్ స్వాతంత్య్రం పొందినా, కొన్ని భాగాలు పోర్చుగీస్, ఫ్రెంచ్ పాలనలో మగ్గిపోయాయి. ఇందులో గోవా ఒకటి. గోవా ప్రజలు భారత స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో పోర్చుగీసు పాలనకు వ్యతిరేకంగా పోరాడారు. ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ కార్యకర్తలతో పాటు ఎందరో సత్యాగ్రహులు భాగస్వాములయ్యారు. డిసెంబర్ 19,1961న గోవా భారతదేశంలో విలీనమైంది.
భారతదేశంలో వలస పాలనకి, సాంస్కృతిక ముద్రను తుడిచివేయడానికి, మతమార్పిడులకి, సంపద కొల్లగొట్టడానికి మార్గం ఏర్పరచిన యూరోపియన్లలో మొదటివారు పోర్చుగీసువారు. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా 1498లో తాను కొత్తగా కనిపెట్టానని చెప్పుకున్న సముద్ర మార్గంలో కేరళలోని కాలికట్ (నేటి కోజికోడ్)లో అడుగుపెట్టాడు. అప్పటికే ఈ ప్రాంత పాలకులు సముద్రమార్గంలో దేశ విదేశాలతో సుగంధద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారు.
వాస్కోడిగామా రెండోసారి 1502లో 25 ఓడలు, వేలాదిమంది సైన్యం, పెద్ద ఫిరంగులతో వచ్చి కాలికట్ తీరం సమీపం నుంచి, ఆ రాజ్యంపై తుపాకులతో దాడి చేసాడు. రాజు జామోరిన్ పంపించిన దూత చెవులు, పెదవులు కోసి, కుక్క చెవులు అతికించి అవమానించి పంపించాడు. అలా భారతీయులపై పోర్చుగీస్ క్రూరత్వం ప్రారంభమైంది. అక్కడి నుంచి గోవాకు సాగింది.
పరశురామ క్షేత్రం గోవాపురి
పోర్చుగీసువారి రాకకు ముందు నుంచే గోవా వైభవ స్థితిలో ఉంది. శ్రీ మహావిష్ణువు అవతారమైన పరశురాముడు కన్యాకుమారి నుంచి సప్తకొంకణ వరకు గల భూమిని, సముద్రం నుంచి వెలికితీశాడని సహ్యాద్రిఖండం పురాణగాథ చెబుతోంది. గోవాను యాత్రికులు -‘స్వర్ణ గోవా’ అని అభివర్ణిం చారు. పశ్చిమ దేశాలకు, దినుసులు, సుగంధ ద్రవ్యాల ఎగుమతులకు గోవా ముఖ్య రేవు పట్టణం.
పోర్చుగీసు క్రూరత్వం, మత మార్పిడులు
పోర్చుగీసు పాలన మొదలైన తర్వాత గోవా ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి. గోవా విలువైన విదేశీ స్థావరమైనది. పోర్చుగీసు నుండి వచ్చినవారు ఇక్కడ స్థిరపడి, స్థానికులను పెళ్లి చేసుకున్నారు. ఇక్కడి ప్రజలంతా అప్పటి వరకూ హిందువులే. ఫ్రాన్సిస్ జేవియర్ (సెయింట్ జేవియర్) ఆధ్వర్యంలో మతమార్పిడిలు ప్రారంభమయ్యాయి. 1560-1812 మధ్య గోవా ఇంక్విజిషన్ క్రింద స్థానికులను బలవంతంగా క్రైస్తవంలోకి మార్చారు. 1534నాటికి 14 చర్చ్‌లు నిర్మించారు. గోవా క్రైస్తవమవుతుందని పోప్ ఐదో నికొస్‌కి, 1546లో బిషప్ ఆల్బుకర్క్ హామీ ఇచ్చాడు. 1549 నాటికి వందలాది దేవాలయాలను ధ్వంసం చేసి, వాటి సామగ్రిని, దేవాలయ ఆస్తులను అక్కడ కట్టిన చర్చ్‌లకు అప్పగించారు.
హిందూ వస్త్రధారణ, సంప్రదాయాలు, కళలు, శిల్పాలు, గ్రంథాలు, ఆహార నియమాలు అన్నీ నిషేధించారు. కొంకణి, సంస్కృతం, మరాఠి భాషల గ్రంథాలు తగలబెట్టేవారు. ఎవరు మతం మారుతారో వారికి కుటుంబ ఉమ్మడి ఆస్తి, భూములు లభిస్తాయని రాజు ఆజ్ఞ జారీ చేయడంతో, కొందరు దురాశతో మతం మారారు. అనాథ పిల్లలు, లేక తల్లిదండ్రుల్లో ఒకరు లేకపోయినా, వారిని క్రైస్తవులుగా మార్చాలని 1659లో పోర్చుగీస్ రాజు ఆదేశాలు జారీ చేసాడు. క్రైస్తవంలోకి స్వచ్ఛందంగా మారుతున్న హిందువులకు 15 ఏళ్లపాటు భూమి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. హిందువులు ప్రభుత్వ పదవిలో ఉండకుండా ఆంక్షలు విధించారు.
హిందువులను అణచివేయడానికి, శిక్షించడానికి పోర్చుగీస్ వారు-మత విచారణలు-శిక్షలు (×అనబఱఱ•ఱశీఅ)’ మొదలుపెట్టారు. హిందువులకు అత్యంత క్రూరమైన శిక్షలు వేసి, చిత్రహింసలకు గురిచేసి చంపేవారు-నాలుకలు కోసేయడం, మండుతున్న ఇనుప చువ్వలతో కళ్లు పొడవడం, శరీర భాగాలను కాల్చి చర్మం ఒలిచేయడం, సజీవ దహనం, పేగులు పొడిచి బయటకి లాగడం, మనిషి శరీరాన్ని కొయ్యకు మేకులతో కొట్టడంలాంటి శిక్షలుండేవి. ఇటువంటి శిక్షలకు గురైన వారి సంఖ్య 16,712. వాస్తవానికి ఇంతకన్నా ఎన్నో రెట్లు జరిగాయని అంచనా. మతం మారేందుకు ఇష్టపడని వేలాది మంది ఇరుగుపొరుగు ప్రాంతాలకు తరలిపోయారు. 1560 సమయంలో, కొంకణీలు దాదాపు 20 వేల కుటుంబాలు, కర్ణాటక, కేరళ తీరప్రాంతాలకు తరలి వెళ్లాయి.
1583లో కొందరు హిందువులు బలవంతపు మతమార్పిడులు, దేవాలయాల విధ్వంసానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఇది ప్రపంచంలో తెల్లదొరలకి వ్యతిరేకంగా జరిగిన తొలి తిరుగుబాటు. ఇదే కంకోలిమ్ తిరుగుబాటు. పోర్చుగీస్ ప్రభుత్వం దీన్ని క్రూరంగా అణచివేసింది. ఎంత క్రూరంగా హింసించి ఊచకోత కోసినా, గోవా హిందువులు ప్రతిఘటించి తమ ధర్మాన్ని, సంస్కృతిని కొంతవరకు నిలబెట్టుకున్నారు. ఈనాటికి కూడా కాథలిక్ చర్చ్, భారతదేశాన్ని, హిందువులని ఆ దురాగతాలకు క్షమాపణ కోరలేదు. ఏకే ప్రియోల్కర్ వ్రాసిన ‘ది గోవా ఇన్క్విసిషన్’, ఇతర పుస్తకాలలో ఈ వివరాలు ఉన్నాయి.
భారత స్వాతంత్య్రంతో గోవాలో కుదుపు
ఆగస్ట్ 15,1947న భారత్ స్వాతంత్య్రం పొందింది. కానీ తమ అధీనంలోని ప్రాంతాలను విడిచి పెట్టేందుకు పోర్చుగీసువారు, ఫ్రెంచ్‌వారు ఒప్పుకోలేదు. 1932లో ఆంటోనియో డి ఒలివేరా సలాజర్ నియంతృత్వం క్రిందకు గోవా వచ్చిన తర్వాత, పరిస్థితులు మరింత దిగజారాయి. ప్రజలకు ప్రాథమిక హక్కులు కరవయ్యాయి. సభలు, సమావేశాలు, పత్రికా స్వాతంత్య్ర హక్కులను తొలగించడమే కాదు, శుభలేఖలను కూడా సెన్సార్ చేశారు. భారత స్వాతంత్య్రోద్యమ ప్రభావంతో పోర్చుగీసు పాలనకు చరమగీతం పాడి తాము కూడా భారతదేశంలో విలీనం కావాలని స్థానికులు భావించారు. ఇతర ప్రాంతాల ప్రజలు కూడా మద్దతు పలికారు. పాలకులు అప్రమత్తమై, అనేకమంది ఆందోళనకారులను, విప్లవకారులను అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు. 1946 నుంచి 1961 మధ్య కాలంలో గోవా విముక్తి కోసం వేలాది మంది భారతీయులు ప్రాణాలు అర్పించారు.
బ్రిటిష్‌వారి కన్నా దారుణం
డాక్టర్ రామ మనోహర్ లోహియా అనారోగ్య కారణంగా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలను కున్నారు. తన స్నేహితుడు డాక్టర్ జూలియో మెనెజెస్ ఆహ్వానం మేరకు గోవా వెళ్లారు. అక్కడకు వెళ్లాక లోహియాకు అర్థమైన విషయం ఏమిటింటే బ్రిటిష్ పాలనకన్నా పోర్చుగీసు పాలన చాలా ఘోరంగా, క్రూరంగా ఉంది. తన విశ్రాంతి సంగతి పక్కన పెట్టి గోవాలో పౌర హక్కుల కోసం ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. జూన్ 18, 1946న లోహియా 200 మందిని సమావేశపరిచి పోర్చుగీస్ పాలనకు, అణచివేతకు వ్యతిరేకంగా గొంతు విప్పారు. పోలీసులు ఆయన్ని నిర్బంధించి మార్మగోవా జైల్లో పెట్టారు. విషయం తెలుసుకున్న మహాత్మాగాంధీ తన ‘హరిజన్’ పత్రికలో పోర్చుగీస్ ప్రభుత్వ తీరును విమర్శించారు. లోహియాను జైల్లో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తర్వాత పోర్చుగీసు పోలీసులు లోహియాను గోవా సరిహద్దుల బయట విడిచి, గోవా రాకుండా ఐదేళ్ల నిషేధం విధించారు. ఈ ఘటన గోవా స్వాతంత్య్ర పోరాటంలో ఒక మలుపు. లోహియా మళ్లీ గోవా వెళ్లారు. ఆయన్ని రైల్వే స్టేషన్‌లోనే అరెస్ట్ చేసారు. పదిరోజులు జైల్లో ఉంచి, సరిహద్దుల్లో విడిచిపెట్టారు. డాక్టర్ లోహియా ప్రేరణతో 1954లో ‘గోవా విమోచన సహాయక సమితి’ ఏర్పడింది. ఈ సమితి సభ్యులు సత్యాగ్రహం, శాసనోల్లంఘన పాటిస్తూ ఉద్యమాన్ని నడిపించారు. ఆ విముక్తి పోరాటంలో గాంధీజీ, ఆచార్య నరేంద్ర దేవ్ స్థాపించిన ప్రజా సోషలిస్ట్ పార్టీ సభ్యులు మాత్రమే లోహియాకు మద్దతుగా నిలిచారు. గోవా వైపు దృష్టి సారిస్తే బ్రిటిష్‌వారితో చేస్తున్న ప్రధాన పోరాటం దెబ్బ తింటుందని నెహ్రూ భావించారు.
లోహియా ముంబయిలో నివసిస్తున్న గోవా ప్రజలను సంఘటితం చేసి, ఉద్యమానికి సన్నాహాలు చేసారు. కానీ గోమంతక్ ప్రజలు తమ పోరాటాన్ని తామే చెయ్యాలని గాంధీ భావించారు. తరువాత గోవా పోరాటం క్షీణించింది.
ఆజాద్ గోమంతక్ దళ్
గోవాను విముక్తి చేసేందుకు ఆజాద్ గోమంత్ దళ్ అనే విప్లవ పార్టీ ప్రారంభమైంది. విశ్వనాథ్ లవాండే, నారాయణ్ హరి నాయక్, దత్తాత్రేయ్ దేశ్‌పాండే, ప్రభాకర్ సినారి కలిసి ఈ పార్టీని స్థాపించారు. ఆజాద్ గోమంత్ దళ్ కార్యకర్తలను పోర్చుగీసు ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టింది. కొందరిని ఆఫ్రికా ఖండంలోని అంగోలా జైల్లో నిర్బంధించారు. విశ్వనాథ్ లవాండే, ప్రభాకర్ సినారి జైలునుంచీ తప్పించుకోగలిగారు. సుదీర్ఘ కాలం పాటూ వారు తమ విప్లవోద్యమాన్ని కొనసాగించారు. ఆజాద్ గోమంతక్ దళ్ గోవా విముక్తి పోరాటానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సహకారం కూడా తీసుకుంది. పుణేకు చెందిన మల్లయోధుడు నానా కాజ్రేకర్, బొంబాయికి చెందిన సంగీత దర్శకుడు, ప్రముఖ జాతీయవాది సుధీర్ ఫడ్కేతో పాటు మరి కొందరు యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ లిబరేషన్ అనే కూటమిని ఏర్పాటు చేశారు.
ఎందరో యోధుల పోరాటం
రామనోహర్ లోహియా శిష్యుడు మధులిమాయే గోవా పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు. జూలై 1955లో పెద్ద సత్యాగ్రహానికి నాయకత్వం వహించి గోవాలోకి ప్రవేశించారు. పోర్చుగీసు ప్రభుత్వం ఆయన్ని అరెస్టు చేసి రెండేళ్లపాటు పోర్చుగల్ జైలులో పెట్టింది. అక్కడ మధులిమాయే చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. కానీ పోరాటాన్ని వదిలిపెట్టలేదు.
గోవా విముక్తి ఉద్యమ నాయకుడు మోహన్ రానడే వీర సావర్కర్ బోధనలతో ప్రభావితుడై గోవా విముక్తి పోరాటంలోకి దిగారు. పోర్చుగీసు పోలీస్ అవుట్ పోస్టులపై దాడి చేశారు. దీంతో రానడేను అరెస్టు చేసి పోర్చుగల్‌లోని లిస్బన్ సమీపంలోని కాక్సియాస్ కోటలో బంధించారు. 1961లో గోవా విముక్తి పొందిన తర్వాత కూడా ఆయన జైలు జీవితాన్ని అనుభవించాడు. గోవా స్వాతంత్య్రం కోసం తొలి ప్రాణత్యాగం చేసిన యోధుడు బాలారాయ మపారి. ఆజాద్ గోమంతక్ దళ్ సభ్యుడు. గోవా, దాద్రా, నగర్ హవేలీలను విముక్తి చేయడానికి విప్లవకారులకు ఆయుధాలు కొనుగోలు చేయడానికి డబ్బును సేకరించడానికి ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్ పుణేలో సంగీత కచేరీ చేశారు.
స్వయంసేవకుల పాత్ర
1955లో గోవా రాజధాని పనాజీ సచివాలయం మీద తొలిసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వ్యక్తి ఒక స్వయంసేవక్. ఆయనే జగన్నాథ్ జోషి. గోవాలో అధ్యాపకునిగా పనిచేసిన జగన్నాథ్ జోషి 1961లో గోవా విముక్తమైన తరువాత కూడా 17 ఏళ్ల• లిస్బన్ జైలులో ఉన్నాడు. గోవాను భారత్‌లో విలీనం చేసే విషయంలో ప్రధాని నెహ్రూ ప్రభుత్వం వెనుకాడు తున్న సమయంలో అక్కడ సత్యాగ్రహ ఉద్యమం ప్రారంభించి, కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావడంలో ఈ రెండు సంస్థలు నిర్ణయాత్మక పాత్ర వహించాయి. ఇతర పార్టీల సత్యాగ్రహులకన్నా జనసంఘ్, ఆర్‌ఎస్‌ఎస్‌లకు చెందిన సత్యాగ్రహులు నాలుగు రెట్లు అధికం. ఆగస్టు 2, 1954న దాద్రా, నగార్ హవేలీలలోనికి వందమంది స్వయం సేవకులు జొరబడ్డారు. పుణే సంఘచాలక్ వినాయక రావు ఆప్టే నేతృత్వంలో ఈ దాడి జరిగింది. గొరిల్లా వ్యూహాన్ని రూపొందించి, సెల్వాసాలోని ప్రధాన పోలీసు కేంద్రకార్యాలయంపై దాడి చేసి, అక్కడి175 మంది సైనికులు బేషరతుగా లొంగిపోయేటట్లు చేశారు. త్రివర్ణ పతాకం ఎగరవేశారు. ఆ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించారు. ఈ పోరాటం గోవా విముక్తి దిశగా మరింత స్ఫూర్తిని నింపింది.
ప్రతిపక్షాలకు జనసంఘ్ లేఖలు
గోవా విముక్తికి పోలీస్ చర్య లేదా సత్యాగ్రహమే మార్గమని జనసంఘ్ స్పష్టం చేయగా, ఆ రెండింటికి నెహ్రూ సిద్ధంగా లేరు. జనసంఘ్ అధ్యక్షుడు ప్రేమనాథ్ డోగ్రా సత్యాగ్రహంలో పాల్గొనాలని కోరుతూ అన్ని పార్టీలకు పలు లేఖలు రాసారు. అయితే జనసంఘ్‌తో కలిసి పోరాడేందుకు చాలా పార్టీలు విముఖత వ్యక్తం చేశాయి. అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేయాలని జనసంఘ్ డిమాండ్ చేసింది. సత్యాగ్రహంలో అన్ని రాజకీయ పార్టీలు పాల్గొన్నా, కాంగ్రెస్ దూరంగానే ఉండిపోయింది. పైగా జులై 23,1955న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై గోవా ప్రజలు మాత్రమే ఉద్యమంలో పాల్గొనాలని, భారత దేశ ప్రజలు పాల్గొనరాదని తీర్మానం చేయడం ద్వారా, విముక్తి పోరాటానికి ద్రోహం చేసింది. కాంగ్రెస్ ధోరణిని ఎండగట్టిన జనసంఘ్ గోవా భారత్‌లో అంతర్భాగమే అని స్పష్టం చేసింది. దేశ స్వతంత్ర పోరాటంలో గోవా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని గుర్తు చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ గోవాలో పోలీస్ చర్యకు డిమాండ్ చేసినా కాంగ్రెస్ తీర్మానాన్ని బలపరిచింది. చివరకు ప్రజల మనోభావాలు గ్రహించిన నెహ్రూ ఆగష్టు 8, 1955 నుండి భారత్‌లో పోర్చుగీస్ రాయబార కార్యాలయం మూసేస్తున్నట్లు ప్రకటించారు.
నెహ్రూకు గురూజీ హితవు
గోవాలో పోలీస్ చర్య తీసుకొని, విముక్తం చేసేందుకు ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదని ఆర్‌ఎస్‌ఎస్ రెండో సర్ సంఘచాలక్ మాధవరావు సదాశివరావు గోళ్వల్కర్ (గురూజీ) నెహ్రూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్య అంతర్జాతీయంగా మన ప్రతిష్టను పెంచుతుందని, మనల్ని బెదిరిస్తున్న పొరుగు దేశాలకు పాఠాలు అందిస్తుందని హితవు చెప్పారు. ‘‘గోవా విముక్తి ఉద్యమానికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించడం ద్వారా విమోచన ఉద్యమానికి భారత ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. భారత పౌరులపై జరుగు తున్న ఈ అమానవీయ కాల్పులపై స్పందించి ఇప్పటి కైనా విదేశీ బానిసత్వం నుంచి మన మాతృభూమిలో విలీనం చేసే చర్యలు తీసుకోవాలి’’ అంటూ గురూజీ ఒక ప్రకటన విడుదల చేశారు.
సత్యాగ్రహులపై కాల్పులు
జూన్ 13, 1955న, కర్ణాటకకు చెందిన సీనియర్ అఖిల భారత జనసంఘ్ కార్యదర్శి జగన్నాథరావు జోషి గోవా ముక్తి విమోచన సమితి పేరుతో వేలాది మందితో గోవా సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. వీరంతా స్వయంసేవకులే. ఈ యాత్ర గోవా సరిహద్దుకు చేరుకోగానే, పోర్చుగీస్ పోలీసులు సత్యాగ్రహులపై లాఠీచార్జ్, కాల్పులు జరి పారు. జగన్నాథరావు జోషిని నిర్భంధించారు. జోషి ‘కర్ణాటక కేసరి’గా గుర్తింపు పేరొందారు. పోర్చుగీస్ పోలీసుల చిత్రహింసలతో జగన్నాథరావు జోషి, మహారాష్ట్ర జనసంఘ్ ఉపాధ్యక్షుడు అన్నా సాహెబ్ కావడిల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. జోషి నేతృత్వంలోని జనసంఘ్‌కు చెందిన ఇద్దరు సత్యాగ్ర హులు మరణించారు. వారిలో ఒకరు మధురకు చెందిన అమీర్‌చంద్ గుప్తా. దేశం నలుమూలల నుండి వెల్లువలా వస్తున్న సత్యాగ్రహులకు గోవా సరిహద్దు వెంబడి భోజన వసతి సమకూర్చే కార్యాన్ని స్వయంసేవకులు తమ భుజస్కంధాలపై వేసుకున్నారు.
సరస్వతి ఆప్టే ‘తాయి’ నేతృత్వంలోని రాష్ట్ర సేవిక సమితి కూడా ఉద్యమంలో పాల్గొంది. పూణేలో సత్యాగ్రహులకు ఆహారం మొదలైనవి ఏర్పాటు చేసింది. ఆగష్టు 15, 1955న, గోవాలో మోహ రించిన పోర్చుగీసు సైన్యం సత్యాగ్రహులపై కాల్పులు జరిపింది. దాదాపు 51 మందిని చంపింది. సత్యాగ్రహ బృందాలకు నాయకత్వం వహించిన స్వయంసేవకులలో మధ్యభారత్ బృందానికి నాయ కత్వం వహించిన ఉజ్జయినికి చెందిన రాజాభావు మహంకాళ్ ఒకరు. రాజాభావు గోవా సరిహద్దువైపు చేరేలోగానే సత్యాగ్రహుల మొదటి మూడు వరుసలపై కాల్పులు జరిగాయి. వారు గాయపడి నేలకూలారు. సాగర్‌కు చెందిన సాహసి సహోదరాదేవి గాయపడి క్రింద పడగానే రాజాభావు ఆమె చేతిలోని త్రివర్ణ పతాకాన్ని తానందుకుని ‘భారత్ మాతాకీ జై’ అని గర్జిస్తూ ముందుకు దూకారు. అంతలోనే దూసుకు వచ్చిన ఒక బుల్లెట్ వారి కంటిని చీల్చుకుపోగా వారు నేలకూలారు. స్పృహలో ఉన్న కొద్దిక్షణాల్లోనే పతాకాన్ని, గాయపడిన సత్యగ్రహులను జాగ్రత్తగా చూసుకోమని ఆదేశాలు ఇచ్చారు. 40 ఏళ్ల సుభద్ర బాయి ధైర్యం ఝాన్సీ రాణిని గుర్తు చేసింది. ఆమె ఒక సత్యాగ్రహి నుండి జెండాను తీసుకొని తన ఛాతీపై బుల్లెట్ తగిలినా లెక్క చేయకుండా ముందుకు సాగింది. ఢిల్లీలో జనసంఘ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో త్యాగధనులకు నివాళులు అర్పిస్తూ పోలీసు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
తెలుగు యువకుడు సూరి త్యాగం
కృష్ణాజిల్లా ఉయ్యూరుకి చెందిన సూరి సీతారాం అనే 18 ఏళ్ల యువ కిశోరం తన మిత్రులు 15 మందితో గోవా సత్యాగ్రహానికి బయలుదేరాడు. ఏ ఒక్కరూ తల్లితండ్రులకు సమాచారం ఇవ్వలేదు. రైలులో దేశభక్తి గీతాలు పాడుకుంటూ బయలు దేరారు. కానీ గోవా చేరకుండానే వీరిని దించేశారు. రైలు పట్టాల వెంటే నడుస్తూ ఆగస్ట్ 15కి గోవా దగ్గరకు చేరుకున్నారు. కాళ్లు పగిలి, అలసిపోయిన వీరు పోర్చుగీస్ సైన్యం కంటపడ్డారు. వెంటనే తుపాకులతో కాల్చడం మొదలు పెట్టారు. సూరి సీతారాం తన చాతిని చూపిస్తూ ముందుకు సాగాడు. కాల్పుల్లో గాయపడి నేలకొరిగాడు. అప్పటికే గోవాలో కనీసం 150 మంది పోర్చుగీస్ వాళ్ల చేతిలో హతమయ్యారు. కానీ పోర్చుగీస్ వారు కేవలం 20 మంది మాత్రమే చనిపోయారని చెప్పారు.
పోర్చుగీసు పోలీసులు సూరి సీతారాం బలిదానాన్ని బయటకు రాకుండా దాచేందుకు ఆయన శవాన్ని కిరోసిన్‌తో కాల్చివేశారు. ఇది చూసిన సీతారాం మిత్రులు తండ్రి సూరి శోభనా చలపతికి, గోవా స్వాతంత్య్ర విముక్తి సమితికి వెల్లడించారు. ఉయ్యూరులో సూరి జ్ఞాపకార్దం ట్రస్టు స్థాపించి ఆయన విగ్రహం ఆవిష్కరించారు. గోవా స్వాతంత్య్ర వీరుల మ్యూజియంలో, ఎర్రకోటలో కూడా సూరి చిత్రపటం ఉంది.
ఆపరేషన్ విజయ్‌తో విముక్తి
దాద్రా, నగర్ హవేలీ విముక్తి తర్వాత, గోవాను విడిపించేందుకు భారత ప్రభుత్వం సైన్యాన్ని ఉపయోగిస్తుందని అందరూ భావించారు. కానీ ప్రధాని నెహ్రూ అందుకు సిద్ధంగా లేరు. ఇందుకు కారణం పోర్చుగల్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో సభ్య దేశం. కొత్తగా స్వాతంత్య్రం పొందిన భారత్ నాటోతో ప్రత్యక్ష వివాదం కొని తెచ్చుకోవ డానికి సిద్ధంగా లేదు. మరోవైపు 1961లో ఢిల్లీలో జరిగిన ఆఫ్రో-ఆసియన్ సదస్సులో కొన్ని దేశాలు గోవాపై భారతదేశ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించాయి.
అయినప్పటికీ పోర్చుగీసువారు గోవాను విడిచిపెట్టడానికి సిద్దంగా లేరు. తర్వాత కాలంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. 1961 నవంబర్‌లో పోర్చుగీస్ సైన్యం గోవా మత్స్యకారులపై కాల్పులు జరిపింది. ఒకరు మరణించారు. దీంతో వాతావరణం పూర్తిగా మారింది. భారత రక్షణ మంత్రి వీకే కృష్ణమీనన్, నెహ్రూ కలిసి ఒక అత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. గోవాను పోర్చుగీసు పాలన నుంచి విముక్తం చేసేందుకు నిర్ణయించక తప్పలేదు. ఇదే ఆపరేషన్ విజయ్. దీని కోసం డిసెంబర్ 17న 30వేల మంది సైనికులను గోవా పంపించాలని నిర్ణయించారు. జనరల్ జె.ఎన్.చౌదరి నాయకత్వం వహించారు. వాయుసేన, నౌకాదళం కూడా ఇందులో పాల్గొన్నాయి. భారత సైన్యాన్ని అడ్డుకోవడానికి, పోర్చుగీసు సైనికులు వాస్కో దగ్గర ఉన్న వంతెనను పేల్చి వేసారు. అయితే, ఆ ఆపరేషన్ ప్రారంభించిన 36 గంటల్లోనే పోర్చుగీసు ప్రభుత్వం లొంగిపోయింది. పోర్చుగీస్ జనరల్ మాన్యుయేల్ ఆంటొనియో వసాలో ఎ సెల్వా లొంగుబాటు పత్రం మీద సంతకం పెట్టేసారు. ఈ యుద్ధంలో 22మంది భారతీయ జవానులు అమరులయ్యారు 31 మంది పోర్చుగీసు సైనికులు మరణించగా.. 4,668 మంది పోర్చుగీసు సైనికులను బందీలుగా పట్టుకున్నారు. భారతదేశంలో 451 ఏళ్ల పోర్చుగీసు పాలనకు డిసెంబర్ 19, 1961న తెర పడింది. కానీ 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. మే 30, 1987న గోవాను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరిచారు. అది దేశంలో 25వ రాష్ట్రం అయ్యింది. గోవాను స్వతంత్రంగా చూడాలనుకున్న లోహియా కల, జనసంఘ్ ఆశయం నెరవేరాయి. కానీ అంతిమంగా పోలీసు చర్యతోనే గోవా విముక్తి సాధ్యపడింది.
వ్యాసకర్త : సీనియర్ జర్నలిస్ట్