– డాక్టర్ పార్థసారథి చిరువోలు, సీనియర్ జర్నలిస్ట్
‘అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం
ఇతి బ్రువాణ స్సతతం కాశీవాస ఫలం లభేత్’
వ్యాసభగవానుని ఈ శ్లోకం ప్రాచుర్యం పొందింది. కాశీఖండం, గరుడ పురాణా ల్లోనూ ఈ ప్రస్తావన ఉంది. ‘ఎవరయితే నేను కాశీకి వెళుతున్నాను, అక్కడే ఉంటాను అని నిత్యం స్మరిస్తూ ఉంటారో.. వారు కాశీవాసం చేసిన ఫలితం పొందుతారు’ అనేది దాని భావం.
‘కాశ్యాన్తు మరణాన్ని ముక్తి’.. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది. పునర్జన్మ కూడా ఉండదు. హిందువులకున్న ప్రగాఢమైన విశ్వాసాల్లో అదొకటి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటయిన విశ్వేశ్వరలింగం కాశీలో ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. అటువంటి మోక్షధామమైన కాశీలో ఓ విశిష్ట కార్యక్రమానికి కేంద్రం సంకల్పించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’.. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ‘కాశీ తమిళ సంగమం’ పేరిట నెల రోజుల వేడు కలకు శ్రీకారం చుట్టింది. నవంబరు 19వ తేదీ నుంచి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తమిళ కవులు, రచయితలు, పండితులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలతో వారణాసి నగరం కోలా హలంగా మారింది. వారి కోసం విడిది, స్థానికులతో ముచ్చటించటానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాశీలో వాణిజ్య, విహార, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన, సంగీత కచేరీలు, జానపద నృత్యాలతో పాటు నిపుణులతో చర్చలు, సమావేశాల వంటి వాటితో అతిథులను ఆహ్లాదపరుస్తారు. అలాగే హాండ్లూమ్స్, హాండిక్రాఫ్టస్, పుస్తకాలు, డాక్యుమెంటరీలు, వివిధ రకాల కళా ప్రదర్శనలు, చరిత్ర, పర్యాటక స్థలాల సమాచారం ఎగ్జిబిషన్ నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో భాగంగా భారతీయ పురాతన మేధోసంపదను ఆధు నిక జ్ఞానంతో మేళవించాలన్న సూచన నేపథ్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటైంది.
ఉత్తరాది-దక్షిణాది మధ్య చారిత్రక, నాగరిక సంబంధం వెల్లివిరియటానికి ‘కాశీ తమిళ సంగమం’ దోహదం చేస్తుందని, ఈ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తున్న కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. అలాగే కల్చరల్, టెక్స్‌టైల్స్, రైల్వేలు, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖలు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నాయి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ), ఐఐటీ మద్రాసు మేధోపరమైన భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయి. తమిళనాడులోని వివిధ ప్రాంతాల నుంచి 210 మందితో కూడిన బృందాన్ని ఎనిమిది రోజుల పాటు కాశీకి తీసుకు వచ్చారు. అలాగే మరో 12 బృందాలు, అంటే సుమారుగా 2500 మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. ప్రయాణ, వసతి ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ కార్యక్రమం ముగిసే సమయానికి వారణాసి, తమిళనాడుల మధ్య సాంస్కృతిక బంధం దృఢమవుతుందని, తమిళ ప్రజలు కాశీ గురించి, కాశీ వాస్తవ్యులు తమిళనాడు గురించి పరస్పరం అర్థం చేసుకోగలుగుతారని నిర్వాహకులు చెబుతున్నారు. అంతేగాక ప్రాచీనమైన తమిళ భాష అభివృద్ధికి కూడా ఈ చర్య దోహదం చేస్తుందని ప్రకటించారు.
ఎంతో పవిత్రం, ఎంతో ప్రత్యేకం
గంగ, యమునల సంగమం అంతటి పవిత్రత కాశీ తమిళ సంగమానికి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వారణాసిలో ఏర్పాటయిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన స్ఫూర్తి వంతమైన ప్రసంగం చేశారు. ‘ఏక్ భారత్ శ్రేష్ట భారత్’ స్ఫూర్తిని నిలబెట్టేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సంపద్వంతమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న భారతదేశం తన వారసత్వ సంపదను చూసి పొంగిపోవాలని నిర్దేశించారు. ఈ రెండు ప్రాంతాలకు ఉన్న విశిష్టతలను, సామీప్యాలను సోదాహరణంగా ఆయన వివరించిన తీరు సభికులను ఎంతగానో ఆకట్టుకుంది. ‘అతి ప్రాచీన భాషలయిన సంస్కృతం, తమిళాలకు ఈ రెండు ప్రాంతాలు కేంద్రాలు. కాశీలో బాబా విశ్వనాథ్ ఉంటే, తమిళనాడులో రామేశ్వర స్వామి ఆశీర్వచ నాలున్నాయి. అందుకే కాశీ, తమిళనాడులు శివమయం, శక్తిమయం. సంగీతం, సాహిత్యం, కళలు ఇలా ఎందులోనయినా కాశీ, తమిళనాడుల నడుమ పోలిక ఉంది’ అని వివరించారు. అత్యంత ప్రతిభావంతులయిన ఆచార్యుల పుట్టిళ్లుగా, పని ప్రదేశాలుగా ఈ రెండు ప్రాంతాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయని వ్యాఖ్యానించారు. ‘తమిళనాడులో జన్మించిన రాధాకృష్ణన్ బీహెచ్‌యూ వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. తమిళనాడు మూలాలున్న వేదపండితుడు రాజేశ్వరశాస్త్రి కాశీలో జీవించారు. అలాగే తమిళుడయిన పట్టాభిరామ్ శాస్త్రి హనుమాన్ ఘాట్లో నివాసం ఉన్నారు. హరిశ్చంద్ర ఘాట్ ఒడ్డుపైన తమిళ దేవాలయం కాశీ కామకోటేశ్వర పంచాయతన్ మందిర్ ఉంది. కేదార్‌ఘాట్‌పైన 200 ఏళ్ల ప్రాచీనమైన కుమార స్వామి మఠం, మార్కండేయ ఆశ్రమం ఉన్నాయి. తమిళనాడుకు చెందిన ఎంతో మంది కొన్ని తరాలుగా కేదార్‌ఘాట్, హనుమాన్‌ఘాట్‌లపై నివాసం ఉంటూ తమ వంతు అభివృద్ధికి పాటు పడుతున్నారు. విశిష్ట కవి పండితుడు సుబ్రహ్మణ్య భారతి ఎన్నో సంవత్సరాలు కాశీలోనే జీవించారు. అలాంటి ప్రతిభావంతుని కోసం బీహెచ్‌యూ ప్రత్యేకంగా ‘ఛెయిర్’ అంకితం చేసింది’ అంటూ కాశీ, తమిళనాడు మధ్య ఉన్న గాఢమైన అను బంధాన్ని ప్రధాని ప్రస్తావించారు.
‘భాషాపరమైన అవరోధాలను, మేధోపరమైన విభేదాలను పక్కనపెట్టి స్వామి కుమార గురుపర్ కాశీకి విచ్చేసి తన కర్మభూమిగా మార్చుకున్నారు. కేదారేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఆయన శిష్యులు కావేరి నది ఒడ్డున తంజావూరులో కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని నిర్మించారు. తమిళనాడు రాష్ట్ర గీతాన్ని రచించిన మనోన్మయ్యమ్ సుందర్ నార్‌కు కాశీలో ఉన్న గురువుతో ప్రత్యేకమైన బంధం ఉంది. ఉత్తరాదిని, దక్షిణాదిని కలిపేందుకు రాజాజీ రచించిన రామాయణ, మహాభారతాలు ప్రధాన భూమిక నిర్వహించాయి. దక్షిణాది మేధావులు. రామానుజాచార్య, శంకరాచార్య, రాజాజీ, సర్వేపల్లి రాధాకృష్ణన్‌లను అర్థం చేసుకోకపోతే భారతీయ తత్త్వశాస్త్రం అర్ధం కాదనేది నా అనుభవం’ అని మోదీ పేర్కొన్నారు. నిద్ర లేవగానే 12 జ్యోతిర్లింగా లను గుర్తుచేసుకునే సాంప్రదాయం ఉన్నట్టుగా, ప్రతి రోజూ దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక ఐకమత్యానికి కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు.
తమిళాన్ని విస్మరిస్తే దేశానికి అన్యాయం చేసినట్టే!
ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన తమిళ భాషను మనం పూర్తిగా గౌరవించటం లేదని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘ఈ భాషను పరిపుష్టం చేయటం, దాని వారసత్వాన్ని కాపాడటం అనేది మొత్తం 130 కోట్ల భారతీయులందరి బాధ్యత. మనం తమిళాన్ని విస్మరిస్తే దేశానికి అన్యాయం చేసినట్టు. దానికి లక్ష్మణ రేఖలు విధిస్తే నష్టం చేసినట్టు. భాషాపరమైన అవరోధాలను తొలగించి భావోద్వేగపరమైన ఐకమత్యాన్ని సాధించటం మనందరి బాధ్యత’ అని వివరించారు. సంగమం ద్వారా మాటలతో కాకుండా చేతల ద్వారా అద్భుతమైన ఆతిథ్యం అందించగల మని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు తమిళ నాడుతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నిర్వహిస్తామని, దేశంలోని ఇతర ప్రాంతాల యువకులు అక్కడికి వచ్చి అక్కడి సంస్కృతీ సాంప్రదాయాలను అర్థం చేసుకోగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంగమ కార్యక్ర మాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఈ విత్తనం మహా వృక్షం కావాలి అని ఆయన ఆకాంక్షించారు.
తమిళ సంప్రదాయమైన పంచెకట్టులో కార్యక్రమానికి హాజరై, మోదీ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సందర్భంగా ప్రధాని ‘తిరుక్కురాళ్’ పుస్తకాన్ని 13 భాషల అనువాదాలతో సహా ఆవిష్కరించారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, డాక్టర్ ఎల్.మురుగన్, భాజపా తమిళనాడు అధ్యక్షుడు కె.అన్నామలై, సంగీత దర్శకుడు ఇళయరాజా పాల్గొన్నారు.
ఆశయం సిద్ధించేనా?
వివిధ భాషలు, సంస్కృతులతో భిన్నత్వంతో కూడిన మన దేశంలో తమిళ ప్రజల వ్యవహార శైలి ప్రత్యేకం. ద్రవిడ రాజకీయాలు విశిష్టం. ఇక తమిళులకున్న స్వీయభాషాభిమానం, హిందీ పట్ల ద్వేషం బహిరంగ రహస్యమే. అక్కడ అన్నింటా తమిళం ప్రధానంగా ఉంటుంది. చదువు ప్రధానంగా అదే మాధ్యమంలో సాగుతుంది. కార్యాలయాల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు, నిత్యవ్యవహారాల్లోనూ తమిళానికే ప్రాధాన్యం. నామఫలకాలు, దుకాణాలు, కార్యాలయాలపైన బోర్డులు, రవాణా వాహనాలపైన వివరాలు అదే భాషలో ఉంటాయి. ప్రభుత్వ ప్రకటనలు కూడా ఆంగ్ల పత్రికల్లోనయినా సరే, పూర్తి పేజీ తమిళంలోనే వచ్చే సందర్భాలుంటాయి. అవతల వ్యక్తి పరాయి భాషవాడని తెలిసినా, కచ్చితంగా తమిళంలోనే మాట్లాడి తీరాలన్న చిత్రమైన పట్టుదలను అక్కడి వారు ప్రదర్శిస్తూంటారు.
మన దేశంలో కనీసం 600 భాషలు మాట్లాడే వారున్నారు. భిన్న భాషలు మాట్లాడే వారిని ఏకం చేయటం కోసమే కాకుండా, దేశమంతా ఒకే భాషలో పరిపాలన సులువుగా సాగటం కోసం జాతీయ భాష ఉండాలన్న ఆలోచన స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి ఉంది. ప్రాంతీయ భాషలను ప్రోత్సహించాలన్న ఆలోచనా జాతీయోద్యమ నాయకుల్లో ఉండేది. మన దేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు సంఖ్యాపరంగా కూడా ఎక్కువే అయినా, హిందీని అధికార భాషగా గుర్తించటానికి దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలు సిద్ధంగా లేవు. గతంలో అధికార భాష ప్రతిపాదన వచ్చి నప్పుడు తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్త మైంది. ఉద్యమం రక్తసిక్తమైంది. ఇటీవల మళ్లీ ఈ అంశం చర్చకు వచ్చినప్పుడు కూడా తమిళనాడు తీవ్రంగా స్పందించింది. ‘ఇండియాను హిందియాగా మార్చకండి’ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గట్టిగా నిరసన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ‘కాశీ తమిళ సంగమం’ ద్వారా ఏ మేరకు ఆశించిన ప్రయోజనం చేకూరుతుందనేది ఆసక్తికరమైన అంశం.
ద్రవిడ కుటుంబంలో ప్రధాన భాషలైన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషలు అత్యంత ప్రాచీన సాహిత్య సంపదను కలిగి ఉన్నాయి. ద్రవిడ భాషా కుటుంబం 4,500 సంవత్సరాల మనుగడలో ఉందని ‘రాయల్ సొసైటీ ఓపెన్ సైన్సు పత్రిక’ ఒక పరిశోధన పత్రాన్ని ప్రచురించింది. సంస్కృతం లాగానే తమిళ భాష కూడా పురాతనమైనది. తమిళ భాషా సంప్రదాయంలో ప్రాచీన కాలం నాటి శాసనాలు, సాహిత్యానికి, వర్తమాన తమిళ భాషకూ సామీప్యత ఎక్కువ. తమిళ భాషకు ప్రాధాన్యం ఇవ్వదలిస్తే, హిందీ వ్యవహారిక భాషగా ఉన్న కాశీలో కాకుండా తమిళనాడులో ఎక్కడయినా ఈ కార్యక్రమం నిర్వహిస్తే బావుండేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిని రాజకీయ కోణంలో కాకుండా సాంస్కృతిక కోణంలో, విస్తృత ప్రాతిపదికన చూడాలని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు కోరుతున్నారు. నాస్తికుడయిన పెరియార్ కూడా కాశీలో కొన్ని నెలలు గడిపారన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ‘కాశీ తమిళ సంగమం’లో పాల్గొనాలన్న ఆసక్తి ఉన్న వారు ఎవరైనా https://kashitamil.iitm.ac.in// లో నమోదు చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రభుత్వం ద్వారా అందే ప్రత్యేక వసతి సౌకర్యాలతో కాశీ ఆధ్యాత్మిక సౌరభాలను ఆస్వాదించవచ్చు.