– నందిరాజు పద్మలతాజయరాం

‘‘అల్లునితోనే గిల్లుడన్నట్లు నేనెందుకురా? ‘పానకంలో పుడక లెక్క ఈడేందిరా బై’ అనుకోదారా సత్య? నేనాన్రా!’’ అప్పటికి అది వందోసారి సాయి, ప్రవీణ్‌తో అనడం.

ప్రవీణ్‌, ‌సాయి ఇద్దరూ రూమ్మేట్స్. ‌మంచిమిత్రులు. యూఎస్‌ ‌లో ఇద్దరూ ఒకేచోట ఎమ్మెస్‌ ‌చేశారు. ఆరేళ్ల నుంచీ ఉద్యోగాలు చేసే కంపెనీలు వేరే అయినా ఇద్దరూ కలిసే ఊళ్లు మారుతున్నారు. ఒకచోటే ఉంటున్నారు. ప్రస్తుతం టెక్సాస్‌లో ఉన్నారు. సాయిది ఖమ్మం. ప్రవీణ్‌ ‌వాళ్ళది ఎప్పుడో యాభయ్యేళ్ల క్రితం నూజివీడు నుంచి హైదరాబాద్‌ ‌వచ్చిన కుటుంబం. ప్రవీణ్‌ ‌కన్నా సాయి రెండేళ్లు చిన్న.

ప్రవీణ్‌కి కాబోయే భార్య సత్యప్రభ. హైదరాబాద్‌లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని. ఇద్దరికీ ఒకరికొకరు నచ్చడంతో, ఆలస్యం చేయకుండా అన్‌లైన్‌లోనే నిశ్చితార్థం చేసేశారు పెద్దవాళ్లు. మరో నెల రోజుల్లో పెళ్లి ముహూర్తం.

నూటొక్కటోసారి సాయి అభ్యర్థనను తిరస్కరించేసి ఇండియాకి బయల్దేరదీశాడు ప్రవీణ్‌.

‘‘అమ్మా చూడవానే? ప్రవీణ్‌ ‌గాడి ప్రీ వెడ్డింగ్‌ ‌షూట్‌ ‌వీడియో వచ్చింది. రారా..!’’ తల్లిని లాక్కొచ్చి కంప్యూటర్‌ ‌ముందు కూలేశాడు సాయి.

‘‘మీ బాపుని కూడా పిలువు!’’ అంటూనే ‘‘ఇగో..ప్రవీణ్‌ ‌వీడియో రారాదండీ?’’ భర్తని పిలిచింది స్వరూప.

‘‘నాతోని గాదులే! సెన్సార్‌ ‌చెయ్యని దృశ్యాలు మస్తుంటాయండ్ల! రేపు టౌన్‌ ‌హాల్ల ఉపన్యాసముంది నాకు’’ అంటూ దాశరథిగారి ‘మాయ జలతారు’ పుస్తకాన్ని తీసుకుని వరండాలోకి వెళ్ళిపోయాడు దేవేందర్‌.

‘‘ఈయనెప్పటికి మారడే! ఎట్లా బతుకుతున్నవే ఈ మొరటోనితోని? వచ్చెయ్‌ ‌పోదాం అమెరిక.’’ నవ్వుతూనే తండ్రిని విసుక్కుని స్నేహితుడి వీడియోలను డౌన్‌లోడ్‌ ‌చేశాడు సాయి.

 తనకి పెళ్లి పనులు ఉండడంతో ఎడిటింగ్‌ ‌బాధ్యతని సాయి మీద పెట్టాడు ప్రవీణ్‌. ‌నేపథ్య గీతాల ఎంపిక కూడా చేయాల్సి ఉంది.

ప్రీ-వెడ్డింగ్‌ ‌చిత్రీకరణ కోసం కాబోయే వధూవరులనిద్దరినీ జలపాతాల దగ్గరకి, కొండలు, గుట్టలు, పార్కులు రిసార్టస్…..ఇలా చాలా ప్రదేశాలకి తీసుకెళ్లాడు ఫోటోగ్రాఫర్‌. ‌వందల్లో ఉన్నాయి ఫోటోలు, వీడియోలు. వాటిలో ప్రవీణ్‌ ‌సత్యలిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నట్లు రకరకాలుగా పోజులిచ్చారు.

వరంగల్‌ ‌దగ్గరి బొగతా జలపాతంలో జంటగా తడిసి మురిపాలు పంచుకుంటూ, అమీన్‌పూర్‌ ‌లేక్‌లో సరిగంగ స్నానాలాడుతూ, గోల్కొండకోటలో దాగుడు మూతలాడుతూ, రామోజీ ఫిలిం సిటీలో డ్యూయట్‌ ‌పాడుతున్నట్లూ వీడియోలు, ఫోటోలు. చౌ మొహల్లా పాలస్‌ ‌లో ఇద్దరూ భగ్న ప్రేమికుల లాగా చెరో చోటా కూర్చుని విరహగీతాలు పాడుకుని, ఆ తర్వాత ఖరీదైన స్యూట్‌లో ఒకరిలో ఒకరు ఒదిగిపోతూన్నట్లు జీవించేశారు. ఆఖరుకి కుతుబ్‌ ‌షాహీ సమాధుల దగ్గర కూర్చుని ‘రేపెప్పుడైనా చావు వస్తే, ఇద్దరం కలిసే పోతాం’ అన్నట్లు బ్రహ్మాండంగా నటించేశారు ప్రవీణ్‌, ‌సత్య.

పొట్ట చక్కలయ్యేలా నవ్వుతూనే ఉన్నాడు సాయి మొదటినుంచీ ఆఖరు దాకా.

‘‘మై గాడ్‌! ‌ప్రవీణ్‌ ‌గాడికి ఆస్కార్‌ అవార్డిచ్చినా చాలదు కదమ్మా!’’ అంటూ ప్రక్కకి తిరిగి చూస్తే, ఆవిడ కన్పించలేదు.

 ‘‘ఏందమ్మా నడిమిట్ల చెక్కేసినవ్‌? ‌నేనొక్కడ్నే ఎట్లా సెలెక్ట్ ‌చేయలేస్తనే?’’ వంటింట్లోకొచ్చి తల్లితో కోపంగా అన్నాడు సాయి.

‘‘అది తల్లీకొడుకులు కూసుని, చూసేతట్లున్దారా? పెళ్లికి ముందే అన్ని ముచ్చట్లవసరమా? మీ పోరలు చదువు కుంటున్నరు గానీ సభ్యత మరుస్తున్నర్రా!’’ సకినాల పిండి కలుపుకుంటూ, కొడుకు వైపు తలెత్తి చూడడానికి కూడా సిగ్గు పడింది స్వరూపరాణి.

‘‘మీ జెనరేషన్‌ ఎప్పటికి ఎదగదా? వాళ్లు ఆలుమగలే గదనే! తప్పేముంది?’’

‘‘ఆలుమగలయిన్రారా? ఏమోలే తియ్యి! మమ్ములనిట్లనే బతుకనియ్యి!’’ అనేసింది తల్లి.

‘నాకేమీ అంత అసభ్యత కన్పించలేదే! అమ్మకెందుకట్లా అన్పిస్తోందబ్బా?’ ఆలోచనలో పడ్డాడు సాయి.

****

పూలమాలలతో పెళ్లి మండపం కళకళ లాడుతోంది. కళ్యాణ వేదిక ఇంకా సిద్ధం కాలేదు.

పెళ్లికొడుకు సాకేత్‌ ‌చేత అనేక ప్రాయశ్చిత్తాలు చేయించి, శుద్ధి మంత్రాలు చెప్పించాక, గోత్ర ప్రవరలు చదివారు పురోహితులవారు.

‘‘అయ్యా! స్నాతకం పూర్తయ్యింది. వధువు తలిదండ్రుల్ని, అన్నదమ్ముల్నీ పిలిస్తే , వరుడి కాశీ యాత్రా కార్యక్రమం మొదలవుతుంది. అమ్మా! ఏవీ పావుకోళ్లు, గొడుగు వగైరాలు?’’

వధువు స్వాతి వైపు వారు ఆయన అడిగినవి అందించసాగారు.

స్వాతి, సాయికి పెద్దమ్మ కూతురు, చెల్లెలు వరుసవుతుంది. ఆ అమ్మాయి పెళ్లికి, ప్రవీణ్‌ ‌పెళ్లి పుణ్యమా అని భారత్‌కి రావడం వలన హాజరవగలిగాడు సాయి. ప్రవీణ్‌ని, అతనికి కాబోయే భార్య సత్యప్రభని తన తరఫున పెళ్ళికి ఆహ్వానించి, తమతో పాటే ఖమ్మం తీసుకుని వచ్చాడు.

‘‘సాయీ? ఏంటి కాశీయా? నిజంగానే?’’ ఆశ్చర్యంగా అడిగింది సత్య.

‘‘లేదు ఇదొక అంశం పెళ్లిలో. ఇప్పుడు చూడు, మా సంతోషన్న బామ్మరిది హోదాలో పెళ్లికొడుకును సంజాయిస్తడు. ‘బావా..మా చెల్లి నీ కొరకే ఎదురు చూస్తున్నది. మంచిగా పెళ్లి చేసుకొని, పిల్లలను కని, ఆ తర్వాత ఇద్దరు కలిసి కాశీకి పోదురు’ అని

‘‘నైస్‌ ‌ముందు రక్తి, తర్వాతే భక్తన్నమాట’’ నవ్వాడు ప్రవీణ్‌.

‘‘‌కాదు బాబూ! భక్తి, రక్తి, ముక్తి అన్నింటికీ వివాహం అవసరం. పిల్లా, పిల్లవాడూ కలవడానికి కాదు, రెండు కుటుంబాలు కలవడానికి పెట్టిన సిస్టమాటిక్‌ ‌ప్రొసీజర్‌ ‌పెళ్లి’’ చెప్పారు పురోహితుడు.

అప్పటికి మధ్యాహ్నం ఒంటిగంటవుతోంది. ఆ కార్యక్రమం అయ్యాక అరిటాకుల్లో విందుభోజనం. స్వాతి, సాకేత్‌ ఇద్దరికీ అల్పాహారం తప్ప భోజనం పెట్టలేదాపూట.

సాయంత్రం ఆరవుతూండగా పెళ్లి సంరంభం మొదలయ్యింది. వేదిక మీద పచ్చని చిలకల పందిరి వేసారు.

పెళ్లికొడుకును వరపూజకి, పెళ్లికూతుర్ని గౌరీ పూజకి సిద్ధం కమ్మని ఆదేశించాడు పురోహితుడు.

‘‘ప్రవీణ్‌ ‌హల్దీ, మెహిందీ, సంగీత్‌ ఇవన్నీ ముందే అయిపోయాయా?’’ అమాయకంగా అడిగింది ప్రవీణ్‌ని సత్య.

‘‘ఇంకా నయం, బ్యాచిలర్స్ ‌పార్టీ ఎప్పుడు, బ్రైడల్‌ ‌షవర్‌ ఎప్పుడూ అని అడిగావు కాదు. సాయి వాళ్ళ నాన్న మనల్ని ఉతికారేసేవాడు వింటే’’ సత్య తలమీద మొట్టికాయ వేశాడు ప్రవీణ్‌.

‘‘ఇదీ ఇంటరెస్టింగానే ఉందిలే..!’’ అంది సత్య.

‘‘పెళ్లి క్రతువంతా చూడండి. రండి. ఇప్పుడు ఎదుర్కోలు కార్యక్రమం.’’ తీసుకెళ్లాడు సాయి.

వధూవరుల బంధువులు చెరో వైపు కూర్చున్నాక, ఇరుపక్షాల పురోహితులు మంగళ వచనం చేసి, శుభలేఖలు చదివారు. పానకం బిందెలు, సారె అందించిన వధువు తరఫువారు అందరినీ పెళ్లికి రమ్మని కుంకుమ, చందన, తాంబూలాల తో సగౌరవంగా ఆహ్వానించారు.

‘‘ఇదేంటి? పెళ్లి కొడుకున్నాడు, మీ చెల్లి లేదే ఇక్కడ?’’ అడిగింది సత్య.

‘‘జీలకర, బెల్లం పెట్టే సుముహూర్తం దాకా వధూవరులు ఒకర్నొకరు చూసుకోవడం, తాకడం పద్ధతి కాదు. కన్యాదానం అయ్యేవరకు వధువు వాళ్ల అమ్మానాన్నల ఆస్తి. ఇంతకు ముందు పంతులుగారు చెప్పినట్లు వివాహమంటే కుటుంబ వ్యవహారం.’’ సాయి తండ్రి దేవేందర్‌ అన్నాడు సత్యతో.

తల పంకించింది సత్య. మరో ఆశ్చర్యమేమిటంటే, ఫోటోగ్రాఫర్స్ ‌స్టిల్స్ ‌తీస్తామని అడగడం, కార్యక్రమంలో అడ్డుపడడం జరగడం లేదు.

‘‘సాయి వాళ్ల పెద్దనాన్న ఫోటోగ్రాఫర్స్‌కి ముందే చెప్పారట సత్యా,! ‘చూడండి, పెళ్లి జరిగేది ఫోటోల కోసం కాదు. జరుగుతున్నపుడు పిక్స్ ‌తీసుకోండి’ అని’’ చెప్పాడు ప్రవీణ్‌.

‌పెళ్లి అయేసరికి ఆలస్యమవుతుందని, హైదరాబాద్‌ ‌తిరిగెళ్లిపోదామన్నాడు ప్రవీణ్‌. ‌కానీ, సత్యకి వేడుక మొత్తం చూడాలన్న కోరిక. కాదనలేక పోయాడు ప్రవీణ్‌.

‌గోరింట పూచిన చేతుల నిండుగా గాజులు, మెళ్లో హారాలు, పారాణి పాదాలకు వెండి మువ్వల పట్టీలు , ముంగురులు ముసురుతున్న ఫాలభాగాన చక్కని కళ్యాణతిలకం…పెళ్లికళతో పెళ్లికుమార్తె స్వాతి సాక్షాత్తూ లక్ష్మీదేవిలా ఉంది.

ఆమెను పద్మం ఆకారంలో ఉన్న గంపలో కూర్చోబెట్టి గౌరీపూజ చేయిస్తున్నారు. అక్కడే తనూ కూర్చుని వధువు పూలజడ సర్దడంలో సహాయం చేస్తోంది సత్య. పూజ పూర్తయ్యాక , అక్కడికి వరుడి వైపు మగవారిని తీసుకువచ్చారు పురోహితులు. వరుని వంశాన్ని, గుణ గణాలని వర్ణించి ‘మదర్థం కన్యా వృణీధ్యం’ ( ఈ కన్యను నాకిచ్చి వివాహం చేయమని వారిని అర్థ్ధించండి) అంటూ వరుడు కబురు పంపడం, వధువు వంశానుక్రమాన్ని, ఆమె గుణగణాల్ని వధువు తండ్రి చేత చెప్పించడం అయ్యాక, పెళ్లి కూతుర్ని సువర్ణపుష్పాన్ని పూసజ్జలో ఉంచినంత పవిత్రంగా ఆమె మేనమామలు భుజాలపై తీసుకెళ్లి పెళ్లిపీటలపై కూర్చో బెట్టడం అద్భుతంగా అనిపించింది సత్యకి. ఆడపిల్లకి ఇంతటి గౌరవం ఇస్తుందా మన ధర్మం అనుకుని గర్వపడింది కూడా.

పెళ్లివేదికపైన అప్పటికే తెర పట్టుకుని ఉన్నారు కన్నెపిల్లలు. తల్లితండ్రుల నడుమ ఒద్దికగా కూర్చొని ఉంది వధువు స్వాతి. పలుచని తెర వెనుక ఉన్న తనను చూసేందుకు వృథా• ప్రయత్నం చేస్తున్న సాకేత్‌ని చూసి కొంటెగా నవ్వుతోంది స్వాతి.

‘‘లెక్క ప్రకారం, పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇంతదంకా ఒకర్నొకరు చూసుకోలేదన్నట్లు’’ నవ్వుతూ అన్నాడు సాయి.

ప్రవీణ్‌, ‌సత్యా కూడా చిరునవ్వు నవ్వి, చాలా ఆసక్తిగా చూడసాగారు.

‘ధర్మ ప్రజ్ఞా సంతతి వృధ్యర్థం స్త్రియ ముద్వాహే’ అంటూ ఈ కన్యను నేను ధర్మం కోసం, సంతానం కోసం వివాహం చేసుకుంటున్నాను అని వరుడి చేత అనిపించాక, వధూవరులు లక్ష్మీనారాయణుల స్వరూపం అంటూ మహాసంకల్పం చెప్పారు పురోహితులు. ఆ తర్వాత స్వాతి తండ్రి సాకేత్‌కి కాళ్లు కడిగాడు. బాజాభజంత్రీలు ఒక్కసారిగా మోగాయి. సుముహూర్తం దాటకుండా, ఒకరి తలపై మరొకరు జీలకర్ర,బెల్లం పెట్టుకున్నారు వధూవరులు. తెర తొలిగింది. కన్నులు కలిశాయి.

సత్య ప్రవీణ్‌ ‌చేతిని గట్టిగా పట్టుకుంది.‘‘ఇంకా వెళ్దామా అందరూ అక్షింతలు చల్లి భోజనాలకి వెళ్తున్నారు. మీ వాళ్లు ఎదురు చూస్తూ ఉంటారేమో, భోజనం చేసి వెళ్లిపోదాం.’’

‘‘ ప్రవీణ్‌ ‌ప్లీజ్‌. ‌చూడాలనుంది నాకు. అమ్మకి నేను ఫోన్‌ ‌చేసి చెప్తాను’’ కాదనలేక పోయాడు ప్రవీణ్‌.

‘‌కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామిచ్చామి ధర్మ కామార్థ సిద్ధయే’ ‘నీతో ధర్మార్థ్ధ కామాలకు నా ఈ సాధ్వి, శీలవతి, సౌందర్యవతి, బుద్ధ్ద్దిమతి అయిన ఈ నా కుమార్తె సిద్ధంగా ఉంది అంటూ అల్లుడికి కన్యాదానం చేయడం ‘నాతి చరామి’ అని వరుడు నీవు లేకుండా ఎక్కడా, ఏమీ చేయను సుమా అని హామీ ఇవ్వడం అపురూపంగా అన్పించింది ప్రవీణ్‌ ‌కి కూడా.

‘‘సో, తల్లిదండ్రులకు తమ కూతురి మీద హక్కు పూర్తిగా పోయినట్లేనా?’’ దిగులు ధ్వనించింది సత్య గొంతులో.

‘‘కాదు తల్లీ..! వధువు తండ్రి ‘న మమ’ అంటే ‘ఈమె ఇక మాది కాదు’ అనడు. ఇక నుంచీ నీది కూడా అని చెప్పి భర్తకు అప్పగిస్తాడు.’’ సాయి తండ్రి దేవేందర్‌ ‌సత్య అనుమానం తీర్చాడు.

‘‘పదరా ప్రవీణ్‌! ‌రా సత్యా! భోం చేసొద్దాం.’’ అంటూ వచ్చాడు సాయి.

చకచకా భోజనం చేసి మళ్లీ కళ్యాణవేదిక దగ్గరకు వచ్చారిద్దరూ. ‘యోక్త్ర బంధనం’ జరుగుతోందక్కడ.

‘‘ఇదేంటి అంకుల్‌?’’ ‌సత్య ప్రశ్నకి నవ్వాడు దేవేందర్‌.

‘‘ఇం‌తకు ముందు మీరు సంప్రదాయబద్ధంగా జరిగే పెళ్లిళ్లకు వెళ్ళనేలేదా ఎట్ల?’’

‘‘సరిగ్గా టైంకి వెళ్లడం, గిఫ్ట్ ఇచ్చి విందు భోంచేసి వెళ్లి పోవడం. అంతే జరిగేది.’’ చెప్పింది సత్య.

‘‘మా ఇళ్లల్లో, పెళ్లికి ఇంత హంగామా ఉండదు అంకుల్‌. ‌మొత్తం గంటలో ఫినిషయిపోతుంది.’’ చెప్పాడు ప్రవీణ్‌.

‘‘‌యోక్త్రం అంటే ‘దర్భలతో అల్లిన త్రాడు’ అని అర్థం. అబ్బాయి అమ్మాయి నడుముకు కట్టి ఆమెకు, మంచి సంతానం కొరకు , ప్రక్కన కూర్చుని యజ్ఞం చేయడం కొరకు అధికారం ఇస్తున్నడన్నట్లు’’ చెప్పాడు దేవేందర్‌.

‌మళ్లీ పెద్దఎత్తున బాజాలు మోగాయి. అందరి చేతుల్లోకి అక్షింతలు వచ్చాయి. సూత్రధారణ కార్యక్రమం మొదలవబోతోంది.

‘‘మాంగల్యం తంతునానేనా ‘నాకు తెలిసి మ్యారేజ్‌ అం‌టే ఇంతే! అఫ్‌ ‌కోర్స్ ‌తలంబ్రాలు. ఇవి తప్ప మిగిలిన ఏ కార్యక్రమాలు నేనింతవరకూ చూడలేదు.’’ మూడుముళ్ల దృశ్యాన్ని చూస్తూ సత్యతో అన్నాడు ప్రవీణ్‌.

‘‘‌పోనీలే! ఇప్పటికయినా చూసినారు. లేకుంటే, పెళ్లి పీటల మీదనే ఒకర్నొకరు ముద్దులు పెట్టుకొనుడు, కేక్‌ ‌కటింగ్‌, ‌షాంపేయిన్‌ ‌వంటియన్నీ ఆచారంలో భాగం అనుకునేవాళ్లు మీరు’’ ఆట పట్టించాడు సాయి.

‘‘బాబూ మాంగల్యధారణ అనేది నిజానికి వివాహక్రతువులో భాగమే కాదు తెలుసా! నల్లపూసలు కూడా ఏ మంత్రాల్లోనూ రాదు. ఫలానా అమ్మాయి వివాహిత అని తెలియడం కోసం మన వాళ్లు ఏర్పాటు చేసిన తెలివైన ఆడిషన్‌ ఇది.’’ పక్కగా కూర్చున్న తెలుగు పండితుడొకాయన కల్పించున్నాడు.

ఆశ్చర్యంగా చూసారు సత్య, ప్రవీణ్‌.

‌క్రమంగా తలంబ్రాలు, కొంగుముడి, సప్తపది అన్నింటినీ వీడియో తీయసాగింది సత్య.

‘‘ఎక్కడ ఏది మిస్సయితనో అన్నట్లు ఈ పిల్లలు అన్నం కూడా సరిగా తినలే! ఇదిగో.. స్వీట్‌, ఐ‌స్క్రీం తెచ్చిన. తినండి.’’ అంటూ తెచ్చిచ్చింది సాయి తల్లి స్వరూపరాణి. మొహమాట పడుతూనే తీసుకున్నారిద్దరూ.

‘‘ఇంక పోదామా? లేకపోతే వాళ్ళని గదిలోకి పంపి అప్పుడు వెళ్దామా?’’ ప్రవీణ్‌ ‌గుసగుసగా అన్న మాటలకి సిగ్గుపడింది సత్య.

ఇద్దరూ వేదిక మీదికి ఎక్కబోతూంటే పెద్దాయన వారించి వాళ్లచేత చెప్పులు విప్పించాడు.

‘‘ఏమనుకోవద్దమ్మా! పెళ్లి మండపం దేవతలను ఆవాహన చేసిన ఒక యజ్ఞశాల. చెప్పులతో అపవిత్రం చేయొచ్చా? ‘‘

‘‘ఓహ్‌ ‌సారీ!’’ అన్నారు ప్రవీణ్‌ ‌సత్య ఇద్దరూ.

‘‘మా పెళ్లి ఈ నెల పద్దెనిమిదిన. మీ ఆయన్ని తీసుకుని రాకపోతే ఊరుకోను.’’ వేదికనెక్కి తాము తెచ్చిన బంగారు ఉంగరం స్వాతికి తొడుగుతూ చెప్పింది సత్య. నవ్వుతూ తల ఊపారు స్వాతి సాకేత్‌.

‘‘ఆం‌టీ..అన్నీ అయినట్లేగా ?’’ అడిగింది సత్య సాయి తల్లిని.

‘‘అప్పుడేనా? ఇంకా స్థాలీపాకం అంటే ఇద్దరూ కలిసి వడ్లు దంచి అన్నం వండుడు, సన్నికల్లు త్రొక్కుడు అంటే శత్రువులను ఎదుర్కొనే ధైర్యం తెచ్చుకో తల్లీ అని ఆమెకు శక్తిని ధైర్యాన్ని ప్రసాదించుడు, నాకబలి.. దాన్నే నాగవల్లి అంటరు. సదస్యం అంటే పెళ్లికి వచ్చి దీవించిన పెద్దలకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకొనుడు, అరుంధతి నక్షత్రం చూపెట్టుడు, మొట్టమొదటి సారి ఇద్దరు కలిసి చేసే యజ్ఞం రా•జహోమం, ఆడబిడ్డకు బొమ్మనప్పగించుడు.. అదయినంక అప్పగింతలు. తెల్లారుతది.. ఇవన్నీ అయ్యే వరకు.’’ నవ్వింది స్వరూపరాణి.

‘‘డోంట్‌వర్రీ నీకేం లోటు లేకుండా, మొత్తం వీడియో నీకు పంపిస్తా సత్యా!’’ చెప్పాడు సాయి.

‘‘నిజానికి, తెలంగాణలో రాత్రి పూట పెళ్లిళ్లు ఉండవు. కానీ, ఖమ్మం అంటే ఆంధ్రా బోర్డర్‌ ‌కదా అందుకే సంప్రదాయాలు కలుస్తాయి.’’ సత్యకి బొట్టుపెట్టి బట్టలు పెడుతూ చెప్పింది స్వాతి తల్లి.

అందర్నీ తమ పెళ్ళికి రమ్మని ఆహ్వానించి వీడ్కోలు తీసుకున్నారు ప్రవీణ్‌, ‌సత్య.

‘‘ప్రవీణ్‌! ఒకటడగనా?’’

‘‘నువ్వడిగేదేంటో నేను చెప్పనా?’’

‘‘చెప్పు?’’

‘‘ప్రవీణ్‌.‌మన పెళ్లి కూడా ఇలాగే, సంప్రదాయబద్ధంగా జరగాలి. ఆడంబరాలు, ఆర్భాటాలు వద్దు అని. ప్రీ వెడ్డింగ్‌ ‌వీడియో పూర్తిగా మన పర్సనల్‌, ‌దాన్ని ప్రదర్శించొద్దు అని. అంతేనా?’’ తన భుజం మీద వాల్చిన సత్య తల నిమురుతూ అన్నాడు డ్రైవ్‌ ‌చేస్తున్న ప్రవీణ్‌.

‘‘అవును. ప్రతి మంత్రమూ అద్భుతం. ఎంత అర్థం ఉంది కదూ! సప్తపదిలో మంత్రానికి అర్థం విన్నావా? ‘ఓ ప్రియతమా! మనం కలిసి నడచిన ఈ ఏడు అడుగులూ ఆహారం కోసం, బలం కోసం, పుణ్యం కోసం, స్నేహం కోసం, సంతానం కోసం, సంపద కోసం, పెద్దల ఆశీస్సుల కోసం’ అని. పెళ్లంటే సెలబ్రేషన్‌ ‌కాదు. ఒక కమిట్మెంట్‌ అన్పిస్తోంది నాకు.

‘‘నాకూ అలాగే అనిపించింది. మా నాన్నకి , మీ నాన్నకి చెప్పి సాయి వాళ్ల బాపుతో మాట్లాడమని చెబ్దాం… సరేనా’’ సత్య చేతిలో తన చేయి వేసి హామీ ఇచ్చాడు ప్రవీణ్‌. ‌కారు మెత్తగా హై వే మీద సాగిపోయింది.

About Author

By editor

Twitter
YOUTUBE