– క్రాంతి

ఉగ్రవాదులు ఎక్కడో ఉంటారు, మన దాకా ఎందుకు వస్తారు? అనుకుంటే పొరపాటు. మన చుట్టూ తిరుగుతూ అమాయకత్వం నటించే వారిలోనే వాళ్లు ఉండవచ్చు. చిన్న చిన్న పనులు చేసుకొని జీవించే సామాన్య వ్యక్తుల లాగే సౌమ్యంగా కనిపించవచ్చు. మన ఆలయాలు, మార్కెట్లు, జనం ఎక్కువగా తిరిగే వీధుల్లోనే తిరుగుతుంటారు. వారి చేతిలో ఉండే వస్తువులు కూడా సాధారణంగానే కనిపిస్తాయి. కానీ అవే మారణాయుధాలని ఆ క్షణంలో మాత్రం మనకు తెలియదు. జరగాల్సిన నష్టం జరిగిపోయాక, దర్యాప్తులో వెలుగు చూసే విషయాలు ముచ్చెమటలు పట్టిస్తాయి. స్లీపర్‌ ‌సెల్స్ అని ముద్దుగా పిలిచే వీళ్లకి తడిగుడ్డతో గొంతు కోస్తారన్న నానుడి కాస్త కూడా సరిపోదు. కోయంబత్తూరు, మంగళూరులలో ఇటీవల జరిగిన ఆ రెండు ఘటనలు యాదృచ్ఛికంగా జరిగినవి కాదు. ఆదిలోనే బెడిసి కొట్టిన భారీ ఉగ్ర కుట్రలు. అవే వాస్తవరూపం దాల్చి ఉంటే ప్రాణనష్టం భారీగా ఉండేది. సాదాసీదాగా కనిపించే ఈ వ్యక్తుల మూలాల డొంకలు మరెక్కడో తేలుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న ఇస్లామిక్‌ ‌జిహాదీ సంస్థలు తమ కుట్రలను అమలు చేసేందుకు ఎంత పెద్ద యంత్రాంగాన్ని నిర్మించుకుంటున్నాయో ఈ ఘటనలను చూస్తే తెలిసిపోతుంది. షరీఖ్‌ ‌మహ్మద్‌ అనే స్లీపర్‌ ‌సెల్‌ ‌జనం మధ్యే ఉంటూ ఎంత పెద్ద కుట్రలో పాత్రధారి అయ్యాడో చూడండి.

కర్ణాటకలోని ప్రముఖ నగరం మంగళూరులో నవంబర్‌ 19 ‌తేదీ సాయంత్రం రోడ్డు మీద ఓ ఆటో వెళుతోంది. కంకనాడి పోలీసు స్టేషన్‌ ‌పరిధిలోని నాగోరి ప్రాంతానికి రాగానే ఆ ఆటోలో హఠాత్తుగా ఒక వస్తువు పేలింది. వెనుక సీటులో కూర్చున్న ప్రయాణికుడితో పాటు ఆటో డ్రైవర్‌ ‌కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అక్కడి సీసీ కెమెరాలో నమోదైంది. అకస్మాత్తుగా రోడ్డుపై ఇలా ఆటోలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు వచ్చి చూస్తే ఆటోరిక్షాలో గ్యాస్‌ ‌బర్నర్‌ ‌భాగాలతో ధ్వంస మైన ప్రెషర్‌ ‌కుక్కర్‌, ‌దానికి అమర్చిన బ్యాటరీ సెట్‌ ‌కనిపించింది. అది టైమర్‌ ‌లేదా ఇగ్నిషన్‌ అయి ఉండొచ్చని భావించారు. పేలుడు జరిగినచోట నట్లు, బోల్టులు, ప్రింటెడ్‌ ‌సర్క్యూట్‌ ‌బోర్డులు, చిప్‌లు, సల్ఫ్యూరిక్‌ ‌యాసిడ్‌ ‌కనిపించడంతో ఇది సాధారణ ప్రమాదం కాదని, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని కర్ణాటక పోలీసులకు అర్థమైపోయింది. ఇది ఉగ్రవాద చర్యేనని కర్ణాటక డీజీపీ ప్రవీణ్‌ ‌సూద్‌ ‌ప్రకటించారు. వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థకు (ఎన్‌ఐఏ) ‌సమాచారం అందజేశారు. ఈ సంస్థే నేరుగా దర్యాప్తు మొదలు పెట్టింది.

అక్టోబర్‌ 23‌వ తేదీన కోయంబత్తూరు కొట్టేసంగమేశ్వర ఆలయం సమీపంలో మారుతీ 800లో సిలిండర్‌ ‌పేలుడుకు, నవంబర్‌ 19 ‌మంగళూరులో కుక్కర్‌ ‌పేలుడు ఘటనకు పోలికలు ఉన్నాయని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు, కర్ణాటక పోలీసులు గుర్తించారు. దీపావళి సందర్భంగా కోయంబత్తూరులో విధ్వం సానికి జరిగిన కుట్ర ముందుగానే విఫలం కావడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఆ ఘటనలో కుట్రదారుడు 25 ఏళ్ల జమేషా ముబిన్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా మంగళూరు ఆటో రిక్షా కుక్కర్‌ ‌పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో ఉన్న వ్యక్తిని షరీఖ్‌ ‌మహ్మద్‌గా గుర్తించారు. పేలుడు తీవ్రతకు షరీఖ్‌ ‌మొహం పాక్షికంగా దెబ్బతింది. ప్రస్తుతం అతడు మాట్లాడే స్థితిలో లేడని పోలీసులు తెలిపారు. ఫాదర్‌ ‌ముల్లా ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. గాయపడిన ఆటో డ్రైవరు పురుషోత్తమ పూజారి ఆరోగ్యం మెరుగవుతోంది. షరీఖ్‌ ఉ‌గ్రవాదని తెలియక ఆటో ఎక్కించుకున్నాడీయన. కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర పురుషోత్తమ పూజారిని పరామర్శించి ధైర్యం చెప్పారు.

మైసూరులో ఉండే షరీఖ్‌ ‌మంగళూరులో పేలుళ్లు జరిపేందుకు కుక్కర్‌ ‌బాంబుతో బస్సులో బయలుదేరాడు. బస్సు దిగిన తర్వాత పేలుడు ఎక్కడ జరపాలో పరిశీలించేందుకు ఆటోలో తిరుగుతున్న సమయంలో అది పేలిపోయింది. కుక్కర్‌లో పూర్తి స్థాయిలో పేలుడు పదార్థాలను ఉంచకపోవడంతో తీవ్రత కొంత పరిధికి మాత్రమే పరిమితమైంది. లేకుంటే ఇంకా ఎంతో మంది ప్రాణాలు పోయేవి.

కోయంబత్తూరులో జమేషా ముబిన్‌, ‌మంగ ళూరులో షరీఖ్‌ ‌మహ్మద్‌ ‌పేలుళ్లకు ఉపయోగించిన వస్తువులు పైకి సాధారణ వస్తువులుగా కనిపిస్తాయి. రెండు చోట్లా ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్‌ ‌డివైజ్‌ (ఐఈడీ) ఉపయోగించారు. ఇది సాధారణ ఘటన కాదని భారీ ఎత్తున జరిగిన కుట్ర అని మరింత స్పష్టత వచ్చేసింది.. ఇంతకీ గాయపడిన షరీఖ్‌ ‌మహ్మద్‌ ఎవరు అని ఆరా తీస్తే దిగ్భ్రాంతిని కలిగించే విషయాలు బయట పడ్డాయి..

షరీఖ్‌ ఉ‌గ్ర చరిత్ర

కుక్కర్‌ ‌బాంబు పేలుడు నిందితుడు షరిఖ్‌ ‌మహ్మద్‌కు ఇస్లామిక్‌ ‌స్టేట్‌, ‌పాపులర్‌ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియాతో పాటు, కొన్ని నిషేధిత తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని దర్యాప్తులో తేలింది.. ఇతని స్వస్థలం తీర్థహళ్లి సమీపంలోని సొప్పుగుడ్డె. షరీఖ్‌కు ఉర్దూతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషలు తెలుసు.

తాజా మంగళూరు పేలుడు ఘటనతో సంబంధం ఉండి పరారీలో ఉన్న మరో అనుమానిత తీవ్రవాది అబ్దుల్‌ ‌మతిన్‌. ఇతడు తమిళనాడులో హిందూ నాయకుడు సురేశ్‌ ‌హత్య కేసులో 12వ నిందితుడు. అబ్దుల్‌ ‌మతిన్‌కి షరీఖ్‌కు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. శివమొగ్గ జిల్లా తీర్థహళ్లిలో ఐసిస్‌, ‌సిమి సంఘాల్లో చురుకుగా ఉన్న కొందరు తీవ్రవాదులతో వీరు సమావేశమైనట్లు గుర్తించారు. షరీఖ్‌తో తరచూ ఫోన్‌లో మాట్లాడిన మహ్మద్‌ ‌రుహుల్లాను బెంగళూరులో పోలీసులు అరెస్టు చేశారు. మైసూరు జిల్లాలో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 19‌న శివమొగ్గలో తుంగ నది ఒడ్డున ఓ బాంబు పేలింది. షరీఖ్‌తో పాటే శివమొగ్గ జిల్లా సిద్ధేశ్వరనగర్‌కు చెందిన సయ్యద్‌ ‌యాసిన్‌, ‌మంగళూరుకు చెందిన మాజ్‌ ‌మునీర్‌లు బాంబులు తయారుచేసి తుంగ ఒడ్డున ప్రయోగించి చూశారు. యాసిన్‌, ‌మునీర్‌లను ఎన్‌ఐఏ అరెస్టు చేయగా షరీఖ్‌ ‌పరారై మైసూరులో తలదాచు కున్నాడు.

గత ఏడాది జులైలో షరీఖ్‌ ‌మంగళూరులోని గోడలపై విద్వేషాలను రెచ్చగొట్టేలా రాతలు రాసిన కేసులో అరెస్టయ్యాడు. దక్షిణ కన్నడ జిల్లా న్యాయ స్థానం అతనికి బెయిల్‌ ఇవ్వకపోవడంతో, ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా షరతులతో కూడిన బెయిల్‌ ‌మంజూరైంది. అప్పటి నుంచి కోర్టు ముందు విచారణకు హాజరు కాకుండా, బెంగళూరు, మైసూరు, తమిళనాడు, కేరళలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ జామీను షరతులను ఉల్లంఘించాడు. శివమొగ్గలో వీర్‌ ‌సావర్కర్‌ ‌పోస్టర్‌ను ప్రదర్శించిన వ్యక్తిని కత్తితో పొడిచిన కేసులో కూడా షరీఖ్‌ ‌నిందితుడు అని తెలుస్తోంది.

షరీఖ్‌ ‌మహ్మద్‌ ‌సెల్ఫీ వీడియోలను ఎన్‌ఐఏ ‌తనిఖీ చేస్తే అందులో మరిన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ఐసిస్‌ ‌తీవ్రవాదుల తరహాలో తాను కొన్ని వర్గాల ప్రజలపై ప్రతీకారాన్ని తీసుకుంటానని ఆ వీడియోల్లో వ్యాఖ్యలు చేశాడు. మత ప్రచారకుడు జాకిర్‌ ‌నాయక్‌ ‌తనకు ‘రియల్‌ ఇన్‌స్పిరేషన్‌’ అని ప్రకటించుకున్నాడు. 50కి పైగా జాకిర్‌ ‌నాయక్‌ ‌వీడియోలను తన మొబైల్‌లో డౌన్‌లోడ్‌ ‌చేసుకున్నాడు. దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తాయని, అతని అనుచరులు, స్లీపర్‌ ‌సెల్‌ ‌సభ్యుల వివరాలను గుర్తించేందుకు అవకాశం ఉందని సీనియరు పోలీసు అధికారులు చెబుతున్నారు. భారత్‌ను ఇస్లామిక్‌ ‌దేశంగా మార్చేందుకు జిహాద్‌ ‌చేయాలని సహచరులకు నూరి పోసేవాడు షరీఖ్‌. ‌నిషేధిత తీవ్రవాద సంస్థల ప్రతినిధులతో అతను తరచూ ఫోన్‌లో, వేర్వేరు యాప్‌ల సాయంతో మాట్లాడేవాడని తేలింది.

పేలుళ్ల కోసం ప్రత్యేక శిక్షణ

షరీఖ్‌ ‌బాంబులు పేల్చేందుకు మైసూరులో శిక్షణ పొందాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. మొబైల్‌ఫోన్‌ ‌ద్వారా పేలుళ్లకు సన్నాహాలు చేసుకున్నాడు. ఇందు కోసం ఫోన్లు రిపేర్‌ ‌చేసే దుకాణంలో పనికి కుదిరాడు. అక్కడే పరిచయమైన వారితో సిమ్‌ ‌కార్డులు కొనుగోలు చేయించి, వాటిని వివిధ మొబైల్స్‌లో ఉంచేవాడు. పేలుళ్లకు కావలసిన పరికరాలను మైసూరు లోక్‌నాయక్‌ ‌నగర్‌లో తాను ఉంటున్న గదిలో దాచి పెట్టుకున్నాడు. కుక్కర్‌ ‌బాంబు తరహాలో వివిధ రకాల వస్తువులలో పేలుడు పదార్థాలు ఉంచి పేల్చేందుకు ఇంట్లోనే ప్రయోగాన్ని చేపట్టాడు. ఆ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల మైసూరులోని ఒక మొబైల్‌ ‌రిపేర్‌ ‌చిన్నపాటి పేలుడు సంభవించింది. దానికీ, షరిఖ్‌కూ ఉన్న సంబంధం మీద దర్యాప్తు చేస్తున్నారు.

షరీఖ్‌కు సొంత వాహనం లేదు. ఎక్కడకు వెళ్లినా, క్యాబ్‌, ఆటో, బస్సు, రైళ్లలో వెళ్లేవాడు. ఓఎల్‌ఎక్స్ ‌వంటి వెబ్‌సైట్ల నుంచి పాత మిక్సీలు, గ్రైండర్లు కొనుగోలు చేసేవాడు. వాటిలో బాంబులు ఉంచి పేల్చేందుకు అనువుగా సిద్ధం చేసుకునేవాడని అనుమానిస్తున్నారు. మైసూరులో రెండు దుకాణాల నుంచి 100కుపైగా అగ్గిపెట్టెలు కొనుగోలు చేశాడు. ఎందుకని ప్రశ్నించగా, తాను ఇంజనీరునని, ప్రాజెక్టు పనికి అవసరమని చెప్పాడు. కోయంబత్తూరు తరహాలో కర్ణాటకలోని ఇషా ఫౌండేషన్‌ను లక్ష్యంగా చేసుకుని షరిఖ్‌ ‌పేలుళ్లకు ప్రయత్నించాడని వస్తున్న సమాచారంపై ఎన్‌ఐఏ ‌దర్యాప్తు చేస్తోంది.

అక్టోబర్‌ 23 ‌నాటి కోయంబత్తూరు కారు బాంబు పేలుడుతో కూడా షరీఖ్‌కు సంబంధం ఉండొచ్చని భావిస్తున్నారు. షరిక్‌ ‌కోయంబత్తూరుకు వెళ్లి వచ్చాడు. దేవాలయం వద్ద ఉన్న ఒక సత్రంలో తాను హిందువునని చెప్పి గదిని అద్దెకు తీసుకున్నాడు. మోస్ట్ ‌వాంటెడ్‌ ‌జాబితాలో ఉన్న అబ్దుల్‌ ‌మతీన్‌ ‌ద్వారా మహ్కద్‌ ‌తల్కన్‌ అతనికి పరిచయం అయ్యాడు. కోయంబత్తూరులో 1998లో జరిగిన పేలుడు నిందితుడు ఎస్‌.ఎ.‌బాషా బంధు వులు మహ్మద్‌ ‌తల్కన్‌ను నిందితుడు పలుసార్లు కలుసుకున్నాడు.

మంగళూరు కుట్ర వెనుక..

హిజాబ్‌ ‌వ్యతిరేక ఆందోళనలతో దేశం దృష్టిని ఆకర్షించిన మంగళూరు మీద ఇస్లామిక్‌ ‌సంస్థలు చాలా కాలం క్రితమే కన్నేశాయి. గతంలోనూ ఇక్కడ ఉగ్రవాద కదలికలు, ఘటనలు చోటుచేసుకున్నాయి. షరీఖ్‌ ‌మహ్మద్‌ ‌మంగళూరు వాసులను భయబ్రాంతు లను చేసేందుకు పెద్ద కుట్రే పన్నినట్లు తెలుస్తోంది. అక్కడి కద్రి మంజునాథేశ్వర ఆలయం, కుద్రోళి గోకర్ణనాథేశ్వర, మంగళాదేవి ఆలయం, పడిలు రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ బస్టాండ్‌లతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నిర్వహిస్తున్న ‘కేశవ స్మృతి సంవర్ధన సమితి’లలో పేలుళ్లకు ప్రణాళిక రూపొందించుకున్నాడని తేలింది. నవంబరు 19న కేశవ స్మృతి సంవర్ధన సమితి 10 వేల మంది విద్యార్థులతో బాలల ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది.

కార్తికమాసంలో ఆలయాల్లో నిర్వహించే లక్ష దీపోత్సవాల వేడుకల సమయంలో పేలుళ్లకు కుట్ర జరిగిందని ఎన్‌ఐఏ, ‌స్థానిక పోలీసులు గుర్తించారు. షరీఖ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభిం చింది. అనుమానిత తీవ్రవాదులు మహ్మద్‌ ‌మతీన్‌, ‌సౌదీ అరేబియాలో ఉన్నాడని భావిస్తున్న అరాఫత్‌ అలితో కలిసి షరిఖ్‌ ‌బాంబుల తయారీ, ఇతర తీవ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడని ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసుకున్నారు. పదికి పైగా ఎన్‌ఐఏ ‌బృందాలు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దర్యాప్తు ప్రారంభించాయి. షరీఖ్‌కు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న వారిని గుర్తించే ప్రయత్నా లను దర్యాప్తు దళం ముమ్మరం చేశారు

బొమ్మై పర్యటన రోజే పేలుడు

మంగళూరులో అదే రోజు మధ్యాహ్నం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మై పర్యటన పూర్తయింది. సాయంత్రం కుక్కర్‌ ‌బాంబు పేలింది. కుక్కర్‌ ‌బాంబుతో బస్సులో బయలుదేరి సాయంత్రం మంగళూరుకు చేరుకున్నాడు. అయితే అప్పటికే ముఖ్యమంత్రి మంగళూరు నుంచి వెళ్లిపోయారు. నిందితుడు ఆలస్యంగా మంగళూరు రావడంతో టార్గెట్‌ ‌తప్పిందని అనుమానించిన దర్యాప్తు సంస్థలు మరింత లోతుగా దర్యాప్తు జరిపాయి. లక్ష్యం ముఖ్యమంత్రి కాదని తేలింది. అయితే ఉగ్రవాదులు కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి గట్టి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో కుక్కర్‌ ‌బాంబు పేలుడుకు పథకం వేశారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆధార్‌తో హిందువుగా చెలామణి

ఉగ్రవాది షరీఖ్‌ ‌మహ్మద్‌ ‌నకిలీ ఆధార్‌ ‌కార్డులు తయారు చేసుకుని మారువేషంలో వినియోగించు కుంటూ వస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతని దగ్గర హుబ్లీకి చెందిన ప్రేమ్‌ ‌రాజ్‌ ‌హుతాగి పేరుతో ఆధార్‌ ‌కార్డు దొరికింది. రైల్వే ఉద్యోగి ప్రేమ్‌రాజ్‌ ‌జీవితంలో ఒక్కసారి కూడా పోలీస్‌ ‌స్టేషన్‌కు వెళ్లలేదు. పోలీసుల నుంచి ఫోన్‌ ‌కాల్‌ ‌రావడంతో ఉలిక్కి పడ్డాడు. చివరకు వారి దర్యాప్తులో ఈ పేలుడుకు సంబంధం లేదని తేలింది. ప్రేమ్‌రాజ్‌ ‌గత రెండేళ్లలో రెండుసార్లు ఆధార్‌ ‌కార్డ్ ‌పోగొట్టుకున్నాడు. ఆధార్‌ ‌వెబ్‌సైట్‌లో కంప్లైంట్‌ ‌చేసి కొత్త కార్డ్ ‌తీసుకున్నాడు. తన ఆధార్‌ ఇలా దుర్వినియోగం అవుతుందను కోలేదని అంటున్నారు ప్రేమ్‌రాజ్‌.

‌మైసూరులోని మోహన్‌ ‌కుమార్‌ ఇం‌ట్లో షరీఖ్‌ ఉం‌టున్నాడు. ప్రేమ్‌రాజ్‌ ఆధార్‌ ‌కార్డ్ ఉపయోగించే ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. షరీఖ్‌ ‌గతంలో అరెస్ట్ అయి బెయిల్‌ ‌పొందిన తర్వాత వేర్వేరు హిందూ పేర్లతో కన్యా కుమారి, కోచి, కోయింబత్తూర్‌, ‌మైసూరులో ఆశ్రయం తీసుకున్నాడని వెల్లడైనట్టు రాష్ట్ర హోమ్‌ ‌మంత్రి ఆరాగా జ్ఞానేంద్ర తెలిపారు.

షరీఖ్‌ ‌బళ్లారికి చెందిన ఓ హిందూ పేరుతో సిమ్‌ ‌కార్డు వాడుతున్నట్టు పోలీసులు కనుగొన్నారు. ప్రైవేట్‌ ‌స్కూల్‌ ‌టీచర్‌గా పనిచేసే సురేంద్రన్‌ అనే రూమ్‌ ‌మేట్‌ ఆధార్‌తో ఒక సిమ్‌ ‌కార్డుని తీసు కున్నాడు. సురేంద్రన్‌ని కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారించగా షరీఖ్‌ అనేవాడు తనతో పాటు రూమ్‌ ‌షేర్‌ ‌చేసుకున్నాడే తప్ప అతని గురించి తనకు పూర్తిగా తెలియదని వెల్లడించాడు.

కోయింబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో గల శివుడి చిత్రాన్ని షరీఖ్‌ ‌తన వాట్స్ అప్‌ ‌వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడు. తనపై అనుమానాలు రాకుండా హిందువుగా కనిపించేందుకు జాగ్రత్తలు తీసుకున్నాడు. మైసూర్‌లో ఉన్న సమయంలో ఉర్దూ వాసనలు లేకుండా కన్నడంలోనే మాట్లాడేవారని, తాను ముస్లిం అని బైట పడకుండా ఉండేందుకు అన్ని హిందూ పండుగలను ఎంతో ఉత్సాహంతో జరుపుకొనేవాడని దర్యాప్తులో వెల్లడైంది.

ఈ పేలుడు మా పనే

ఇప్పటి వరకూ ఎవరికీ అంతగా తెలియని ఇస్లామిక్‌ ‌రెసిస్టెన్స్ ‌కౌన్సిల్‌ (ఐఆర్‌సి) మంగళూరులో జరిగిన పేలుళ్లకు తమదే బాధ్యత అని ప్రకటించు కుంది. తమ ముజాహిద్‌ ‌సోదరుడు ముహమ్మద్‌ ‌షరీఖ్‌ ‌కద్రీ దక్షిణ కన్నడ జిల్లాలోని హిందూ మందిరంపై దాడి చేయాలనుకున్నాడని, ప్రీ మెచ్యూర్‌ ‌పేలుడు కారణంగా షరీఖ్‌ ‌పోలీసుల చేతికి చిక్కాడని తెలిపింది. మరో దాడికి సిద్ధంగా ఉండాలని ఆ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ‘మా సోదరుడు మహ్మద్‌ ‌షరిఖ్‌ను పట్టుకున్నామన్న సంతోషం మీకు కొంత సమయం మాత్రమే ఉంటుంది. ఇకపై తాము ఏదైనా లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాతే ప్రకటన విడుదల చేస్తామ’ని కరపత్రంలో ఉందని అధికారులు గుర్తించారు. ఆ సందేశం ఇప్పుడు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అయింది. తమ కార్యకలాపాలకు అడ్డు పడుతున్న ఏడీజీపి అలోక్‌ ‌కుమార్‌ను నియంత్రించాలంటూ, డార్క్‌వెబ్‌, ‌సిగ్నల్‌ ‌యాప్‌ ‌ద్వారా ఇస్లామిక్‌ ‌రెసిస్టెన్స్ ‌కౌన్సిల్‌ ‌కరపత్రాలను రూపొందించిందని ఎన్‌ఐఏ ‌గుర్తించింది. ‘ఎన్ని అడ్డంకులు ఎదురైనా మేము అనుకున్న లక్ష్యాలను పూర్తి చేస్తాం’ అంటూ ఆ కరపత్రంలో ఐఆర్‌సీ పేర్కొంది. ‘మేము చేస్తున్న యుద్ధాన్ని అడ్డుకునేవారిని నియంత్రించేందుకే ఈ బాట పట్టాం’ అని కరపత్రంలో పేర్కొన్నారు.

సాధారణంగా మన చుట్టు పక్కల జరుగుతున్న సంఘటనలు, వ్యక్తులపై పెద్దగా దృష్టి పెట్టం. ఇరుగు పొరుగులో ఎవరు ఉన్నారనే విషయాన్ని కూడా పట్టించుకోం. ఉగ్రవాదులు ఎక్కడో ఉంటారని అనుకోరాదు. వాళ్లతో వచ్చే దారుణ ప్రమాదాలు మన మధ్యే పొంచి ఉండవచ్చు. వారు జనావాసాల మధ్యే స్లీపర్‌ ‌సెల్స్‌గా పనిచేస్తారు. ఉగ్రవాద సంస్థలు వీరినే పావులుగా వాడుకొని కుట్రలను కొనసాగి స్తుంటాయి. దీనికి షరీఖ్‌ ‌మహ్మదే పెద్ద ఉదాహరణ. కేవలం దర్యాప్తు సంస్థలు కాకుండా పౌరులు కూడా  అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పోలీసుల దృష్టికి తేవడం ద్వారా సహకరించాలి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE