– అరుణ

ఈ యేడాది చివరి మాసంలో ఒక్కసారిగా చిన్న సినిమాలు వెల్లువెత్తడం మొదలైంది. డిసెంబర్‌ ‌మొదటి వారాంతంలో నాలుగు సినిమాలు విడుదలైతే, రెండో వారాంతంలో ఏకంగా 12 చిత్రాలు జనం ముందుకు వచ్చాయి. అయితే అందులో చెప్పుకోదగ్గ చిత్రాలను వేళ్ల మీద కూడా లెక్కపెట్టలేని పరిస్థితి. కాస్తంత చూడదగ్గ చిత్రాలంటే సత్యదేవ్‌ ‌నటించిన ‘గుర్తుందా శీతాకాలం’, బ్రహ్మానందం, స్వాతి రెడ్డి తండ్రీకూతుళ్లుగా నటించిన ‘పంచతంత్రం’ మాత్రమే!

చిత్రం ఏమంటే మొదటి నుండి కన్నడ రీమేక్స్ ‌తెలుగులో ఆడవనే ప్రచారం బాగా ఉంది. అయితే కన్నడ డబ్బింగ్‌ ‌సినిమాల గురించి కూడా అలాంటి ప్రచారమే ’కేజీఎఫ్‌’ ‌విడుదలకు ముందు ఉండేది. కానీ ఆ తర్వాత ఆ విమర్శకు ట్రేడ్‌ ‌వర్గాలు ఫుల్‌స్టాప్‌ ‌పెట్టేశాయి. ‘కేజీఎఫ్‌-2’‌తో పాటు మొన్న వచ్చిన ‘కాంతార’ కూడా ఘన విజయం సాధించడమే దానికి కారణం. తాజాగా వచ్చిన ‘గుర్తుందా శీతాకాలం’ మూవీ కన్నడ చిత్రం ‘లవ్‌ ‌మాక్‌టైల్‌’‌కు రీమేక్‌. ఈ ‌సినిమా కూడా గత కాలపు సెంటిమెంట్‌ను రిపీట్‌ ‌చేస్తూ, తెలుగువారిని నిరాశకు గురిచేసింది. ఓ పాత కథను తీసుకుని, ఎలాంటి ఆసక్తి లేకుండా తెరకెక్కించడంతో ‘గుర్తుందా శీతాకాలం’ గుర్తు ఉండని సినిమాల కేటగిరిలో చేరిపోయింది.

కథగా చెప్పుకోవాలంటే సరళమైందే. దేవ్‌ (‌సత్యదేవ్‌)‌కు దివ్య (మేఘా ఆకాశ్‌) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరూ ఒకే ఏరియాకు వెళ్లాల్సి రావడంతో కలిసి ప్రయాణం ప్రారంభిస్తారు. దారి మధ్యలో దేవ్‌ ‌తన జీవితంలో తారసపడిన అమ్మాయిల గురించి చెబుతాడు. స్కూల్‌ ‌డేస్‌లో ఏర్పడిన ఇన్‌ఫాచ్యుయేషన్‌ ‌గురించి, ఆ తర్వాత కాలేజీలో తాను ప్రేమించిన అమృత (కావ్యాశెట్టి) గురించి, ఆ పైన తన కొలిగ్‌ ‌నిధి (తమన్నా)ను పెళ్లి చేసుకున్న వైనం వివరిస్తాడు. అన్ని సెట్‌ అయ్యి అతని వైవాహిక జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో విధి వక్రీకరిస్తుంది. అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. దేవ్‌ ‌కథంతా విన్న తర్వాత అతన్ని దివ్య ఓదార్చడంతో సినిమా ముగుస్తుంది. కథ, కథనంలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఇందులోని ఏ పాత్రతోనూ అటాచ్‌మెంట్‌ ‌ఫీల్‌ ‌కారు. హీరో సత్యదేవ్‌కు ఇది కాస్తంత భిన్నమైన పాత్ర కావచ్చునేమో కానీ సినిమా చూసే వారికి కథపరంగా కాదు. దాంతో పెదవి విరుస్తారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి.. గత కొంతకాలంగా పనికట్టుకుని మనవాళ్లు హైస్కూల్‌ ‌ప్రేమలను ప్రేక్షకుల మీద బల వంతంగా రుద్దుతున్నారు. ప్రతి సినిమాలోనూ ఇలాంటి సన్నివేశాలు చూసి చూసి వెగటు పుడుతోంది. ఇందులోనూ ఆ వికారానికి చోటు కల్పించారు. ఇక కాలేజీ వయసు ప్రేమ సన్నివేశాల్లో హీరోయిన్‌లోనే కాదు హీరోలోనూ కన్‌ఫ్యూజన్‌ ‌కనిపిస్తుంది. అంతా సెట్‌ అయ్యి హాయిగా పెళ్లి చేసుకున్న తర్వాత కథ ఊహించని మలుపు తిరగడంతో ఒక్కసారిగా థియేటర్‌లోని ప్రేక్షకుడు డీలా పడతాడు. కావాలని హీరోని కష్టాల సుడి గుండంలోకి దర్శకుడు తోసేసిన భావన జనాలకు కలుగుతుంది.

కన్నడ ప్రేక్షకులు ఏం నచ్చి ‘లవ్‌ ‌మాక్‌టైల్‌’ ‌మూవీని సక్సెస్‌ ‌చేశారో తెలియదు. కానీ ఇందులో ఏదో విషయం ఉందని భావించిన కన్నడ దర్శకుడు నాగశేఖర్‌ ఈ ‌మూవీ రీమేక్‌ ‌హక్కులు తీసుకుని స్వీయ దర్శకత్వంలో మిత్రులతో కలిసి దీనిని ప్రొడ్యూస్‌ ‌చేశారు. అయితే అక్కడి మ్యాజిక్‌ ఇక్కడ రిపీట్‌ ‌కాలేదు. ఏదేమైనా, అనేక పర్యాయాలు విడుదల వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జనం ముందుకు రావడమే ఓ పెద్ద విజయంగా భావించాలి. ఈ మధ్య కాలంలో తన నటనతో సత్యదేవ్‌ ‌బాగానే మెప్పిస్తున్నాడు. విజయం మాట ఎలా ఉన్నా ఏ యేడాది ‘గాడ్సే, గాడ్‌ఫాదర్‌’, ‌హిందీ ‘రామ్‌సేతు’ చిత్రాలు అతనికి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

తమన్నా కూడా ఇందులో చక్కగా నటించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. కీరవాణి తనయుడు కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం, లక్ష్మీ భూపాల్‌ ‌రాసిన సంభాషణలు ఆకట్టుకుంటాయి. అయితే… సినిమా కథ, కథనం పేలవంగా ఉండటంతో జనం మెచ్చలేని పరిస్థితి.

ఇదే వారం వచ్చిన వాటిలో చెప్పుకోదగ్గ మరో సినిమా ‘పంచతంత్రం’. ఆల్‌ ఇం‌డియా రేడియోలో పనిచేసి పదవి విరమణ చేసిన వేదవ్యాస మూర్తి (బ్రహ్మానందం) ఈ తరం మెచ్చేలా కథలు రాసి, వాటిని పబ్లిష్‌ ‌చేయాలని చూస్తాడు. ఓ ప్రచురణ సంస్థ కోసం ఆయన కథలు చెప్పాలనుకుంటే కూతురు రోషిణి (స్వాతి రెడ్డి) నిరుత్సాహ పరుస్తుంది. అయినా తనదైన శైలిలో పంచభూతులను ఐదు కథలకు అన్వయించి, చెప్పి మెప్పిస్తాడు. ఈ ఐదు కథలతోనే సినిమా మొత్తం సాగిపోతుంది. ఓ రకంగా ఇది ఆంథాలజీ అనుకోవచ్చు. మొదటి రెండు కథలు యువతను మెప్పించేలా ఉంటే, మూడోది సైకలాజికల్‌ ‌డ్రామా. నాలుగో కథ మధ్యతరగతి మనుషుల మనస్తత్వాలను తెలిపేది. ఐదో కథ స్ఫూర్తిదాయకమైంది. దివ్యాంగురాలైన ఓ మహిళ తన కథలతో పిల్లల మనసుల్ని ఎలా జయించిందనేది ఈ కథ సారాంశం. ఇలా ఐదు భిన్నమైన కథలను ఎంచుకుని, ప్రేక్షకుల మెప్పుపొందే ప్రయత్నం దర్శకుడు హర్ష పులిపాక చేశాడు. బ్రహ్మానందం, స్వాతి రెడ్డి, ఆదర్శ్ ‌బాలకృష్ణ, నరేశ్‌ అగస్త్య, శ్రీవిద్య మహర్షి, సముతిర ఖని, దివ్య శ్రీపాద, రాహుల్‌ ‌విజయ్‌, ‌శివాత్మిక రాజశేఖర్‌, ‌దివ్యవాణి, వికాశ్‌ ‌ముప్పాల, ఉత్తేజ్‌ ‌తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. అయితే, ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్‌ ‌సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌ అయినప్పుడు చూస్తే బాగుంటాయి.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE