– ‌జమలాపురపు విఠల్‌రావు

ఆ సంవత్సరం గుజరాత్‌లో ఘోర భూకంపం సంభవించింది. అది జరిగిన కొన్ని నెలలకు ఢిల్లీలో పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న నరేంద్ర మోదీని బీజేపీ ఆయన స్వరాష్ట్రం గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా పంపించింది. ఆ తరువాత భారత రాజకీయాలలో ఆయన భూకంపం సృష్టించారు. దాని ప్రకంపనలు  ప్రపంచవ్యాప్తమయ్యాయంటే అతిశయోక్తి కాదు. మోదీ అభివృద్ధికి నమూనాగా, ప్రతీకగా మారారు. గుజరాత్‌ ‌మోడల్‌ ‌పేరుతో దేశంలో ఒక పంథా ఏర్పడింది. ఆయన అహమ్మదాబాద్‌ ‌నుంచి ప్రధాని హోదాలో ఢిల్లీ వెళ్లే వరకు సాగిన యాత్ర చరిత్రాత్మకం. ఆయన ఢిల్లీ వెళ్లినా రాష్ట్రం ఆయన పథాన్ని వీడలేదు. అందుకు ప్రబల నిదర్శనం వరసగా ఏడోసారి కూడా అధికారం ఇచ్చింది. ఆయన హిందూత్వవాది అనేది జగమెరిగిన సత్యం. కానీ దానికి కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమాన్ని జోడించారు. పురోగతికి మతకల్లోలాలు, అనిశ్చితికి ప్రబల శత్రువులని ఆయన నమ్మారు. వాటిని లేకుండా చూశారు. దీనికే మైనారిటీల అణచివేత అని విమర్శకులు పేరు పెట్టినా పట్టించుకోలేదు. పైగా మట్టిమీద ప్రేమను పెంచారు. సరికొత్త గుజరాత్‌ను నిర్మించారు. భౌగోళికంగా నవభారతాన్ని నిర్మించిన సర్దార్‌ ‌పటేల్‌ ‌విగ్రహాన్ని స్థాపించి తన గుజరాతీ వాదం ప్రాంతీయం కాదనీ, అది దేశం మొత్తం శ్రేయస్సును కోరుతుందని వెల్లడించగలిగారు. ఏ ప్రాంతం వృద్ధి చెందినా అది దేశానికే చెందుతుందని చాటారు.

ఆయన విమర్శలకు కుంగిపోరు. పొగడ్తలకు పొంగిపోరు. ఎన్ని ఆరోపణలు వచ్చినా వాటికి సమాధానం చెప్పే బాధ్యతను కాలానికి విడిచి పెడతారు. ఒకటి వాస్తవం. స్వతంత్ర భారత రాజకీయాలలో మోదీ ఎదుర్కొన్నంత ప్రతికూలత మరొక నేత ఎదుర్కొనలేదు. అదే సమయంలో ఆయన జాతి మొత్తానికి ఆమోదయోగ్యుడైన నాయకునిగా అవతరించడమూ తిరుగులేని సత్యం. మోదీ అంటే పురోగతి. మోదీ అంటే సాంస్కృతిక చిహ్నం. ఆధునిక ప్రపంచంలో నాయకత్వ సరళికి నమూనా.

అక్టోబర్‌ 1,2001‌న నరేంద్రమోదీ తొలిసారి గుజరాత్‌ ‌ముఖ్య మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆపై రాష్ట్రం ఆర్థికంగా చాలా వేగంగా పరుగులు పెట్టిందనేది తిరుగులేని వాస్తవం. మోదీ గుజరాత్‌ ‌పగ్గాలు చేపట్టకముందే రాష్ట్రం 35% వరకు అభివృద్ధి సాధించిందనేదీ వాస్తవమే. 1960-90 మధ్యకాలంలో పారిశ్రామికంగా గుజరాత్‌ ఒక సుస్థిర స్థానంలో నిలిచింది. ఫార్మా స్యూటికల్స్, ‌పెట్రోకెమి కల్స్, ఇం‌జినీరింగ్‌, ‌టెక్స్‌టైల్స్, ‌రసాయనాలు, డెయిరీ, సిమెంట్‌, ‌సిరామిక్స్, ‌రత్నాలు, ఆభరణాలు తదితర రంగాల్లో బాగా అభివృద్ధి సాధించింది. సరళీకృత ఆర్థిక విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత 1994-2002 మధ్యకాలంలో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి 14%ను అందుకుంది! ఎంతటి సమృద్ధ రాష్ట్రమైనా, సమర్థ నాయకత్వం లేకపోతే పురోభివృద్ధి మందగించడమే కాదు, తిరోగమనంలో పయనించే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పటి ముఖ్యమంత్రి కేశూభాయ్‌ ‌పటేల్‌ ఆరోగ్యం దెబ్బతినడంతో 2001లో గుజరాత్‌ ‌ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన నరేంద్రమోదీ రాష్ట్రానికి సమర్థ నాయకత్వం అందించారు. నిజానికి మొట్టమొదటిసారి గుజరాత్‌కు సారథ్యం వహించే సమయానికి నరేంద్రమోదీకి ఏవిధమైన పాలనానుభవం లేదు. తర్వాతి కాలంలో నిర్వహించిన అనేక సర్వేలు, దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా పేర్కొనడం ఆయనలోని నిబద్ధత, పాలనా దక్షతకు నిదర్శనం.

శ్రమయేవ జయతే

ఏ పారిశ్రామికవేత్త అయినా పెట్టుబడులు పెట్టడానికి ముందుగా దృష్టి పెట్టేది గుజరాత్‌పైనే. రాష్ట్రం నేడు పారిశ్రామిక హబ్‌గా రూపొందడమే అందుకు కారణం. అందుకు నరేంద్రమోదీ ఎంతో శ్రమించి తీసుకున్న చర్యలు రాష్ట్రాన్ని ఈ స్థాయికి తెచ్చాయని వేరే చెప్పాల్సిన అవసరంలేదు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ‌సామాజిక కార్యకర్తలు టాటా నానో ప్రాజెక్టును పశ్చిమ బెంగాల్‌ ‌నుంచి వెళ్లగొట్టినప్పుడు, ఆ ప్రాజెక్టుకు ఆహ్వానం పలికింది నరేంద్రమోదీ నేతృత్వంలోని గుజరాత్‌ ‌మాత్రమే. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు అవసరమైన అనుమతులు ఇతర విధివిధానాలను కేవలం మూడురోజుల్లోనే పూర్తి చేసిన ఘనత అప్పటి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానిది! ప్రైవేటు పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా నరేంద్ర మోదీ నిబంధనలను సరళీక రించడంతో ఎంటర్‌‌ప్రెన్యూర్లు, పారిశ్రామికవేత్తల దృష్టి ఒక్కసారిగా గుజరాత్‌ ‌వైపు మళ్లింది. మోదీ తమకు మంచి ప్రోత్సాకుడని, ఏవిధమైన అడ్డంకులు ఉండవన్న విశ్వాసం కలగడంతో, తమ వ్యాపార విస్తరణకు ఎటువంటి ఢోకా ఉండబోదన్న దృఢ నిర్ణయానికి వచ్చారు. గుజరాత్‌లో మోదీ అనుస రించిన పారిశ్రామిక పెట్టుబడుల అనుకూల విధానాలే వ్యాపార దిగ్గజాలు అనీల్‌ అం‌బానీ, సునీల్‌ ‌మిత్తల్‌లు, వైబ్రెంట్‌ ‌గుజరాత్‌ ‌సందర్భంగా 2014 ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ పేరును ముందుకు తీసుకొని రావడానికి ప్రధాన కారణం.

2002 నాటి గోధ్రా అల్లర్లు గుజరాత్‌ ‌ప్రాభవానికి ఏవిధమైన అడ్డంకి కాలేదు. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనకు క్లీన్‌ ‌చీట్‌ ఇవ్వడంతో ఈ అల్లర్లకు ప్రధాన కారకు డంటూ మోదీపై చేసిన ఆరోపణలన్నీ అబద్ధమన్న సంగతి స్పష్టమైంది. 2014కు ముందు ఐదేళ్ల కాలంలో పెట్టుబడుల మొత్తం, సంఖ్యాపరంగా పరిశీలిస్తే దేశంలోని మిగిలిన రాష్ట్రాలన్నింటి కంటే గుజరాత్‌ ‌మాత్రమే అగ్రస్థానంలో ఉన్నదని అసోసియేటెడ్‌ ‌ఛాంబర్స్ ఆఫ్‌ ‌కామర్స్ అం‌డ్‌ ఇం‌డస్ట్రీస్‌ ‌నిర్వహించిన ఒక సర్వేలో స్పష్టం చేసింది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్‌ ‌టేపిజం, బ్యూరోక్రసీ భారం తొలగిపోయి, గుజరాత్‌ ‌వ్యాపారు లకు ఆకర్షణ కేంద్రంగా మారిపోయింది. ముఖ్యంగా నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వహించిన ద్వైవార్షిక సదస్సులు ఇందుకు బాగా దోహదం చేశాయనే చెప్పాలి. గుజరాత్‌లో పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ సదస్సులను 2003, 2005, 2007, 2009ల్లో నిర్వహించి గుజరాత్‌ను పెట్టుబడుల లక్ష్యంగా మలచారు.2011లో వైబ్రెంట్‌ ‌గుజరాత్‌ ‌సదస్సుకు హాజరైన పెట్టుబడిదార్లపై అప్పటి యుపీఏ-2 ప్రభుత్వం ఆదాయపు పన్ను విచారణల పేరుతో భయపెట్టడానికి యత్నించినా 2013లో జరిగిన వైబ్రెంట్‌ ‌గుజరాత్‌ ‌సదస్సులో పాల్గొనే పెట్టుబడిదార్ల సంఖ్య పెరగడం గమనార్హం. ఇదే నరేంద్రమోదీ నేతృత్వంలో చివరి ద్వివార్షిక సమావేశం. ఈ సందర్భంగా గుజరాత్‌ను పారిశ్రా మిక కేంద్రంగా మలిచేందుకు మోదీ చేస్తున్న కృషిని ముఖేష్‌ అం‌బానీ, రతన్‌ ‌టాటాలు స్వయంగా ప్రశంసించారు లంచగొండితనం లేకుండా కఠిన చర్యలు, పరిశ్రమలకు వివాద రహిత భూముల కేటాయింపు, రెడ్‌ ‌టేపిజంను అరికట్టడం వంటి మోదీ అమలు చేసిన విధానాలు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా మరింత ముందుకు తీసుకెళ్లాయని పారిశ్రామికవేత్తల అభిప్రాయం. కెనడా, జపాన్‌ ‌దేశాలు 2013 వైబ్రెంట్‌ ‌గుజరాత్‌ ‌సదస్సులో పాల్గొనడం ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోదగ్గ అంశం. వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు భవిష్యత్తులో తమ పెట్టుబడులకు సంబంధించిన బ్లూప్రింట్‌లు రూపొందించు కోవడానికి ఈ సదస్సు ఎంతో దోహదం చేసింది. ఈ విజయాన్ని చూసిన, దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా పెట్టుబడులను ఆహ్వానించడానికి వైబ్రెంట్‌ ‌గుజరాత్‌ ‌మార్గాన్నే ఎంచుకోవడం గమనార్హం. మోదీలోని వ్యాపార దృక్పథం, కార్యనిర్వాహక సామర్థ్యం, దూరదృష్టి, గుజరాత్‌ను ముందంజలో నిలపడానికి ఎంతగానో దోహదం చేశాయి. ఓడిశాతో పోల్చినప్పుడు గుజరాత్‌లో ప్రకృతివనరులు పరిమితం. వనరులు అధికంగా ఉన్న ప్రాంతాపైనే విదేశీ పెట్టుబడిదార్ల దృష్టి ఉండటం సహజం. దీన్ని గమనించిన మోదీ, ఉన్న అతికొద్ది వనరులను పెట్టుబడులను ఆకర్షించడానికి మలచడంలో కృతకృత్యులు కావడం ఆయనలో దాగివున్న వ్యాపార దక్షతకు నిదర్శనం.

మోదీ అమలు పరచిన పథకాలు

సుజలాం సుఫలాం: నీటి పంపిణీకి సంబంధిం చిన సమగ్ర పథకం. రాష్ట్రంలో నీటి సంరక్షణ, జాగ్రత్తగా వినియోగించుకోవడానికి సంబంధిం చినది.

చిరంజీవి యోజన: శిశుమరణాల రేటును తగ్గించేందుకు ఉద్దేశించిన పథకం.

కృషిమహోత్సవ్‌: ‌వ్యవసాయ సంస్కరణలకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి.

పంచామృత యోజన: రాష్ట్ర సమగ్రాభివృద్ధికోసం చేపట్టిన ఐదు సూత్రాల కార్యక్రమం.

బేటీ బచావో: బాలికా భ్రూణహత్యలను నిరోధించేందుకు ఉద్దేశించిన పథకం ఇది. ముఖ్యంగా రాష్ట్రంలో ఆరోగ్యకరమైన లింగ నిష్పత్తి లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది.

కర్మయోగి అభియాన్‌: ‌ప్రభుత్వ ఉద్యోగులకు విస్తృత స్థాయిలో శిక్షణ ఇచ్చే కార్యక్రమం.

బాలభోగ్‌ ‌యోజన: ఇది మధ్యాహ్న భోజన పథకం వంటిదే. నిరుపేద కుటుంబాలకు చెందిన బాలబాలికలు బడులకు వెళ్లేందుకు ప్రోత్స హించేందుకు ఉద్దేశించినది.

మాతృవందన: ప్రత్యుత్పత్తి, శిశు ఆరోగ్య పథకం కింద వైద్య సదుపాయాలు కల్పించే పథకం.

కన్యా కేలవాణి యోజన: స్త్రీలలో అక్షరాస్యతను పెంపొందించేందుకు, విద్యా విషయంగా వారు మరింత ముందుకు వెళ్లేవిధంగా ప్రోత్సహించడానికి ఉద్దేశించిన పథకం.

జ్యోతిర్గామ్‌ ‌యోజన: గ్రామీణ విద్యుదీకరణకు సంబంధించిన పథకం.

సమస్యల స్వాగతం

మోదీ మొట్టమొదటిసారి 2001లో ముఖ్య మంత్రి పదవి చేపట్టిననాటికి రాష్ట్రం ప్రకృతి విపత్తు లతో సతమతమవుతోంది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు సర్వసాధారణమయ్యాయి. అన్నింటికీ మించి 2001, జనవరిలో భుజ్‌లో సంభవించిన భూకంపం కారణంగా నిరాశ్రయులైన వేలాది మంది అప్పటికి ఇంకా తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచు కుంటున్నారు. దీనికితోడు రాష్ట్రంలో నీటికరువు, మౌలిక సదుపాయాల లేమి, పెట్టుబడులు తగ్గిపోవడం… ఇవీ నాడు నెలకొన్న పరిస్థితులు. ఈ పరిస్థితులను గమనించిన మోదీ, ముందుగా పాలనా వ్యవస్థను ప్రక్షాళన చేశారు. ప్రజలకు పునరావాసం, విస్తృత ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పనకు ఉపక్రమించారు. అంతేకాదు గుజరాత్‌ ‌ప్రజల్లో సంప్రదాయికంగా ఉండే ఎంటర్‌‌ప్రెన్యూర్‌షిప్‌ను ప్రోత్సహించడం, వాణిజ్య వాతావరణాన్ని మళ్లీ కల్పించడం ఆయన ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నారు. రాష్ట్ర సర్వతోముఖాభి వృద్ధికి ఆయన ‘పంచామృతాల’ను ముందుకు తెచ్చారు. అవి వరుసగా 1. జలశక్తి: జలవనరుల పరిరక్షణ, 2. జ్ఞానశక్తి: నాణ్యమైన విద్య, 3. జనశక్తి: మానవ వనరుల అభివృద్ధి, 4. ఉర్జా శక్తి: ఇంధన వనరులకు ప్రాధాన్యం, 5. రక్షాశక్తి: రాష్ట్ర ప్రజల భద్రత.

కనిష్టస్థాయికి నిరుద్యోగ సమస్య

2009-10లో విడుదల చేసిన ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ‌నివేదిక, గుజరాత్‌లో నిరుద్యోగ సమస్య ఉన్నదనడం హాస్యాస్పదమని పేర్కొంది. 2012లో లేబర్‌ ‌బ్యూరో ఆఫ్‌ ఇం‌డియా నివేదిక ప్రకారం గుజరాత్‌లో నిరుద్యోగ సమస్య 1% మాత్రమే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇదే అత్యంత కనిష్ఠం. అదే జాతీయ స్థాయిలో నిరుద్యోగం 3.8% ఉన్నదని ఇదే నివేదిక వెల్లడిం చింది. రాష్ట్రంలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏను సమర్థ వంతంగా అమలు చేయడం గ్రామీణ ప్రాంతాల్లో అతి స్వల్ప నిరుద్యోగం నమోదు కావడానికి ప్రధాన కారణం. అంతేకాదు ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు అత్యధిక మహిళలకు ఉపాధి కల్పించిన రాష్ట్రం కూడా గుజరాత్‌ ‌మాత్రమే! ప్రణాళికా సంఘం సర్వే ప్రకారం గుజరాత్‌లో పేదరికం 2004- 05లో 31.46% నుంచి 2009-10 నాటికి 23%కు పడిపోయింది. ఇదే కాలంలో రాష్ట్రంలో గ్రామీణ పేదరికం 39.1% నుంచి 26.7%కు పడిపోయింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం గట్టి కృషి కారణంగానే ఇది సాధ్యమైందన్న సత్యాన్ని గుర్తించాలి. అంతేకాదు చిన్నపిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడం, విద్యాపరమైన మౌలిక సదుపాయాల విస్తరణకు మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టింది. బాలికా విద్యకు, మహిళల సాధికారత కోసం నరేంద్ర మోదీ మొట్టమొదటి ప్రాధాన్యమిచ్చారు. అంతేకాదు మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలవల్ల రాష్ట్రంలో లింగ నిష్పత్తిలో వ్యత్యాసం గణనీయంగా తగ్గింది. కాన్పుకు ముందు, కాన్పు తర్వాత తల్లులు, నవజాత శిశువుల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల, శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి.

గుజరాత్‌లో పారిశ్రామికాభివృద్ధి

దేశం మొత్తం మీద పారిశ్రామిక ఉత్పత్తుల్లో గుజరాత్‌ ‌వాటా 16 శాతం. దేశంలోనే ప్రముఖ పరిశ్రమలున్న రాష్ట్రంగా గుజరాత్‌ ‌పేరుపొందింది. 2001, అక్టోబర్‌లో మోదీ తొలిసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించిన తర్వాత, అంతకుముందుతో పోలిస్తే రాష్ట్రం ఆర్థికంగా చాలా వేగంగా పరుగులు పెట్టింది. ప్రణాళికా సంఘం గణాంకాల ప్రకారం 2001-10 మధ్యకాలంలో గుజరాత్‌ ‌స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) సగటున 16%. అదే 1980-90 మధ్యకాలంలో ఇది 5.1% ఉండగా, 1991-98 మధ్యకాలంలో ఇది 8.2%గా నమోదైంది. 2012లో దేశంలోనే అత్యంత తక్కువ నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచింది. విదేశీ పెట్టుబడులకు గుజరాత్‌ను ముఖద్వారంగా మార్చాలన్న లక్ష్యంతో మోదీ పనిచేశారు. ఆయన కృషి ఫలితంగా 2009-10లో రాష్ట్రంలో తయారీ, విద్యుత్‌, ‌నిర్మాణ, కమ్యూనికేషన్‌ ‌రంగాలు అద్భుతమైన పనితీరు ప్రదర్శించాయి. 2015-16లో గుజరాత్‌ ‌స్థూల రాష్ట్ర జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) 158.2 బిలియన్‌ ‌డాలర్లు. 2004-05 నుంచి 2015-16 మధ్యకాలంలో వార్షికంగా జీఎస్‌డీపీ వృద్ధి రేటు 11.56%. 2017 నాటికి గుజరాత్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తిలో వ్యవస్థాపక సామర్థ్యం 30,298.11 మెగావాట్లు. గుజరాత్‌ను భారత పెట్రోలియం రాజధానిగా పరిగణిస్తారు. 2015 డిసెంబర్‌ ‌నాటికి మనదేశంలో ముడిచమురు ఉత్పత్తిలో (భూమిపై) రెండోస్థానంలో ఉంది. 2016-17లో రాష్ట్రం 4.61 మిలియన్‌ ‌టన్నుల ముడి పెట్రోలియంను ఉత్పత్తి చేసింది. ప్రపంచంలో అతిపెద్ద శుద్ధి చేసిన వజ్రాల ఉత్పత్తి కేంద్రం గుజరాత్‌. ‌ప్రపంచంలో 72% శుద్ధి చేసిన వజ్రాలు ఇక్కడే ఉత్పత్తి అవుతాయి. డెనిమ్‌ (‌దృఢమైన కాటన్‌ ‌ఫ్యాబ్రిక్‌) ‌తయారీలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 45 పోర్టులు, 18 దేశీయ విమానాశ్రయాలు కలిగిన గుజరాత్‌కు 2000-2017 మధ్యకాలంలో వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 17.01 బిలియన్‌ ‌డాలర్లు. దేశం మొత్తంమీద ఎఫ్‌డీఐల్లో గుజరాత్‌ ‌వాటా 4.97%. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్‌ ‌టేపిజంను అరికట్టిన కారణంగా గుజరాత్‌లో ప్రముఖ ఆటోమోటివ్‌ ‌సంస్థలు తమ కేంద్రాలను నెలకొల్పాయి. వాటిల్లో సుజికీ మోటార్‌ ‌గుజరాత్‌ (అహమ్మదాబాద్‌ ‌సమీపంలోని హన్సాల్‌ ‌పూర్‌), ‌టాటా మోటార్స్, ‌ఫోర్డ్ ఇం‌డియా (సనంద్‌), ఎం.‌జి. మోటార్‌, ‌హీరో మోటో కార్పొరేషన్‌, ‌జె.సి.జి. (హలోల్‌), ‌హోండా మోటార్స్, ‌స్కూటర్స్ ఇం‌డియా (విఠల్‌పూర్‌) ‌ముఖ్యమైనవి. మోదీ సమర్థ నాయకత్వం, దార్శకనిత కారణంగా గుజరాత్‌ ‌తన సంపదను మరింత వృద్ధి చేసుకోగలిగింది.

వ్యవసాయానికి పెద్దపీట

గుజరాత్‌ ‌గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకారం 2000-2012 మధ్యకాలంలో మూడువేల గ్రామీణ రోడ్ల ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. 2004-12 మధ్యకాలంలో రాష్ట్రంలో సగటున ప్రతి వ్యక్తికి విద్యుత్‌ ‌లభ్యత 41% పెరిగింది. రేటింగ్‌ ‌సంస్థ క్రిసిల్‌ ‌ప్రకారం ఇదే కాలంలో రాష్ట్రంలో తయారీరంగం బాగా అభివృద్ధి చెందింది. గుజరాత్‌ను మోడల్‌గా రూపుదిద్దేందుకు మోదీ ప్రభుత్వం ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. 1. వ్యవసాయం, పరిశ్రమల రంగాల్లో సమూల మార్పులు తేవడం, 2. ఆరోగ్యం, విద్యారంగాల్లో ప్రైవేట్‌ ‌సంస్థలకు భాగస్వామ్యం కల్పించడం, 3. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంత సదుపాయాల కల్పన, 4. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు చేరేలా పాలన వికేంద్రీకరణ. ముఖ్యంగా ప్రభుత్వం రోడ్లు, విద్యుత్‌, ‌ప్రతి ఒక్కరికీ తాగు నీటి సదుపాయం కల్పనపై కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ముఖ్యంగా పేర్కొనదగింది ‘జ్యోతిర్గామ్‌ ‌యోజన’. 2006లో గుజరాత్‌ ‌ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి అయిన ఖర్చు రూ.2వేల కోట్లు. దీని ప్రకారం రాష్ట్రంలోని 18వేల గ్రామాల్లోని రైతులకు రోజుకు ఎనిమిది గంటల విద్యుత్‌ ‌సదుపాయం, గృహాలకు 24×7 నిరంతరాయ విద్యుత్‌ ‌సరఫరా చేయడం లక్ష్యం. ఇది 97శాతం గ్రామాలకు అందుబాటులోకి వచ్చింది. సూక్ష్మ నీటిపారుదల పద్ధతులను ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్రంలో పెద్దఎత్తున చెక్‌డ్యామ్‌లు, పొలాల్లో కుంటల నిర్మాణం, కృషి మహోత్సవ్‌ (‌వ్యవసాయ ఉత్సవాలు) వంటివి చేపట్టారు. ఇదే సమయంలో పంటల వైవిధ్యం, పాడి పరిశ్రమపై దృష్టి పెట్టింది. నీటిపారుదల రంగంలో నవకల్పన లకు ప్రాధాన్యం ఇచ్చింది. ముఖ్యంగా చెక్‌ ‌డ్యామ్‌ల నిర్మాణం. దీని ఫలితంగా గుజరాత్‌లో వ్యవసాయం బాగా ఊపందుకొని 10.97% వృద్ధి నమోదు చేసింది. ఇందుకు వాలియా తహసిల్‌ ఒక ఉదాహరణ. రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతానికే పరిమితమైన దానిమ్మ పంటను ఈ ప్రాంత రైతులు కూడా ఇప్పుడు పండిస్తున్నారు. దానిమ్మ ఏటా మూడుసార్లు కాపునకు వస్తుంది. ఈ ప్రాంతంలో బొప్పాయి, అరటి, చెరకు, సపోటా పంటలను విస్తారంగా పండిస్తారు. ఇప్పుడు వీటికి దానిమ్మ సాగు కూడా తోడైంది. పత్తి, పశుసంపద, గోధుమ, పండ్లు, కూరగాయలు వంటివి వృద్ధికి ప్రధానమన్న అంశాన్ని ప్రభుత్వం గుర్తించింది. దీంతో ఇప్పుడు వీటి ఉత్పత్తి, విలువ అనేక రెట్లు పెరగడం గమనార్హం. మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల అప్పటి వరకు రాష్ట్రంలో రూ.9వేల కోట్లుగా ఉన్న వ్యవసాయ ఉత్పత్తి నాలుగింతలు పెరిగి రూ.34 వేల కోట్లకు చేరుకుంది. ఇదిలావుండగా ‘ఈ-గ్రామ్‌ ‌విశ్వగ్రామ్‌’ ‌ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని 18వేల గ్రామాలకు బ్రాడ్‌బ్యాండ్‌ ‌సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కన్యా కేవలాని పథకం కింద రాష్ట్రంలోని బాలికలందరికి విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కృషిచేసింది. వనబంధు కళ్యాణ్‌ (‌గిరిజన సంక్షేమం), సాగర్‌ఖేదు (తీరప్రాంతంలోని అమ్మకందార్ల అభివృద్ధి), గరీబ్‌ ‌సమృద్ధి (నిరుపేదల అభ్యున్నతి) వంటి పథకాలు గుజరాత్‌లో ప్రస్తుతం అమల్లో ఉన్నాయి.

వరించిన పురస్కారాలు

మౌలిక సదుపాయాల కల్పనలో మోదీ ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం కల్పించాలని నిశ్చ యించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన పోర్టులు, రైల్వేలు, రోడ్లు, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్స్, ‌గ్యాస్‌, ‌నీటి సరఫరా ప్రాజెక్టులు దేశవ్యాప్తంగా ప్రధాన చర్చాంశంగా మారాయి. జ్యోతిగ్రామ్‌, ఈవినింగ్‌ ‌కోర్టులు, నదుల అనుసంధానం, స్వాగత్‌ ఆన్‌లైన్‌ ‌కింద ప్రజల సమస్యల పరిష్కారం వంటివి మోదీ అమలుచేసిన ముఖ్యమైన వాటిల్లో కొన్ని. సమర్థ పాలనకు గుర్తుగా మోదీ ప్రభుత్వం దాదాపు 80 అవార్డులను గెలుచుకుంది. వీటిల్లో ఐక్యరాజ్య సమితి ‘ససకవ’ (UN Sasakawa award for disaster reduction) అవార్డు కూడా ఉండటం విశేషం. విపత్తును తగ్గించేందుకు తీసుకున్న చర్యలకు గుర్తింపుగా ఐక్యరాజ్య సమితి ఈ అవార్డును అందజేస్తుంది. దీంతో పాటు సమర్థ పాలనకు ఇచ్చే ‘కాపమ్‌ ‌గోల్డ్ అవార్డు’, భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రపంచ బ్యాంకు ‘‘గ్రీన్‌ అవార్డు’’, యునెస్కో ‘‘ఆసియా పసిఫిక్‌ అవార్డు’’, సింగపూర్‌కు చెందిన గ్లోబల్‌ ఇం‌టర్‌పోలీస్‌ ‌నుంచి అవార్డును మోదీ ప్రభుత్వం అందుకుంది.

మోదీ ప్రస్థానం

ఉత్తర గుజరాత్‌ ‌ప్రాంతంలోని వాద్‌నగర్‌లో జన్మించిన మోదీ అక్కడే సెకండరీ స్థాయి విద్య వరకు పూర్తిచేశారు. స్కూల్‌ ‌నుంచి వచ్చిన తర్వాత వాద్‌నగర్‌ ‌రైల్వే స్టేషన్‌లో క్యాంటిన్‌ ‌నడుపుతున్న తన తండ్రికి సహాయ పడేవారు. తన 8వ ఏట ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 18వ ఏట యశోదా బెన్‌ ‌చిమన్‌లాల్‌ ‌మోదీని వివాహం చేసుకున్నా, వైవాహిక బంధాన్ని వదులు కొని, ఇంటినుంచి బయటకు వచ్చి రెండేళ్ల పాటు ఉత్తరభారత్‌లో విస్తృతంగా పర్యటించారు. వివిధ ప్రార్థనా స్థలాలను సందర్శించారు. 1971లో గుజరాత్‌కు తిరిగి వచ్చిన తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌ ‌పూర్తిస్తాయి కార్యకర్తగా చేరారు. 1975లో ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిన నేతల్లో ఈయన కూడా ఒకరు. 1985లో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆయనకు బీజేపీ బాధ్యతలు నిర్వర్తించాలని నిర్దేశించింది. 1988 నుంచి నరేంద్ర మోదీ బీజేపీ గుజరాత్‌ ‌విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1995లో పార్టీ ఆయన్ను న్యూఢిల్లీలోని పార్టీ జాతీయ విభాగానికి కార్యదర్శిగా నియ మించింది. 1998లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొంది 2001 వరకు కొనసాగారు. గుజరాత్‌ ‌ముఖ్య మంత్రిగా పార్టీ ఆయన్ను ఎంపిక చేసింది. ఆయన జాతీయ యూనిట్‌ (‌ఢిల్లీ)లో పనిచేసినప్పుడు జమ్ము-కశ్మీర్‌, ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్‌ ‌ప్రదేశ్‌, ‌హరియాణా వంటి సున్నితమైన రాష్ట్రాల బీజేపీ యూనిట్ల వ్యవహారాలను పర్య వేక్షించారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీలో సమూల మార్పులు చేసి అభివృద్ధి చేయడంతో పార్టీలో మంచి పేరు సంపాదించారు. ఈ సమయంలోనే జాతీయ స్థాయి పార్టీ ప్రతినిధిగా వ్యవహరించడమే కాదు అవసరమైన పలు సందర్భాల్లో కీలక పాత్ర పోషించారు కూడా. పార్టీ నిర్దేశం మేరకు 2001లో గుజరాత్‌ ‌పగ్గాలు చేపట్టిన నరేంద్రమోదీ, 2014 వరకు అదే పదవిలో కొనసాగారు. తర్వాత దేశ ప్రధాని పీఠాన్ని అధిష్టించారు.

నరేంద్రమోదీ గుజరాత్‌కు ఏం చేశారు? అన్న ప్రశ్నకు ఒక్కటే సమాధానం. నేటి గుజరాత్‌ ‌విజయగాథ వెనుక ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి నరేంద్ర మోదీ మాత్రమే. మూడుసార్లు ఆయన గుజరాత్‌ ‌పీఠాన్ని అధిష్టించారు. ఇన్నిసార్లు ఆయన అఖండ మెజారిటీతో విజయం సాధించారంటే, గుజరాత్‌ ‌ప్రజల్లో ఆయన పట్ల తరగని విశ్వాసమే కారణమని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గుజరాత్‌ ‌పారిశ్రామికాభివృద్ధికి మాత్రమే కాదు, అన్నిరంగాల్లో రాష్ట్రాభివృద్ధికి కృషిచేశారు. ఇంత జరిగినా గుజరాత్‌ అభివృద్ధి వెనుక ‘‘అల్లావుద్దీన్‌ అద్భుత దీపం’’ ఉందంటూ వాదించేవారెవరైనా ఉంటే వారి మానాన వారిని వదిలేయడమే ఉత్తమం.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
YOUTUBE